చల్లటి గాలి వీస్తోంది. మబ్బుల్లోంచి వెన్నెల ఆహ్లాదంగా బయటకు వస్తోంది. వాతావరణం బాగుందని చెప్పులు విడిచి పచ్చటి గడ్డిపై నడుస్తుంటే తడి చల్లగా తగిలింది, చూస్తే పాదాలకు పారాణి రాసినట్లు నెత్తురు ప్రవహిస్తోంది. ఎప్పటి నుంచి ప్రవహిస్తుందో తెలియదు.
భయపడి ఇంట్లోకి ప్రవేశించాను. గుమ్మం ముందు గోడపై ఎవరో ఎర్రటి అరచేతి ముద్రలు వేశారు. అప్పుడే వేసినట్లు గోడపై అరచేతి ముద్రలనుంచి నెత్తురు కారుతోంది.
ఇంట్లో పాదాలు ఎర్రటి ముద్రల్ని వదులుతున్నాయి. స్నానం చేద్దామంటే నల్లా నుంచీ బొట్లుబొట్లుగా నెత్తురు కారుతోంది.
పుస్తకాల పుటలు తిప్పుతుంటే వ్రేళ్లకు ఎర్రటి రంగేదో అంటుకుంటోంది.
పెన్నులో కూడా ఎవరో ఎర్రటి ఇంకు నింపినట్లున్నారు. అక్షరాలు నెత్తుటితో అలుక్కుపోయినట్లున్నాయి
అద్దంలో చూసుకుంటే పళ్ల సందులోంచి నెత్తురు ఉబుకుతోంది. నాలుక ఎర్రగా ఉన్నది. నేనేమీ పాన్ వేసుకోలేదు కదా..
బహుశా పచ్చ కామెర్ల వ్యాధి బదులు నాకు ఎర్ర కామెర్ల వ్యాధి వచ్చిందేమో.. అనుకున్నా. డాక్టర్ వద్దకు వెళ్లాను. ఆయన నవ్వుతుంటే ఆయన పళ్ల నుంచి కూడా నెత్తురు కారుతోంది. ఇది మామూలేనని ఎర్రటి క్యాప్సూల్స్ ఏవో రాసిచ్చాడు.
రోడ్డుపక్కన హాలులో ఎవరెవరో ఏమేమో మాట్లాడుతున్నారు. ఏమి చెప్తున్నారో విందామని లోపలికి వెళ్లాను. వేదికపై ఉన్నవారి నోళ్లకు కోరలు ఉండడం గమనించాను. ఎవరో కవిత చదవడం మొదలుపెట్టాడు. అదేదో నెత్తుటి భాషలో ఉన్నది. అతడి నోటి నుంచి ఎర్రటి తుంపర్లు రాలుతున్నాయి. ఎవర్నో నిర్మూలించమనో, మెడనరకమనో అందంగా చెబుతున్నాడు.
సభలో కరతాళ ధ్వనులు వినిపిస్తున్నాయి. అందరిచేతుల్లోంచీ ఎర్రటి పుప్పొడి రాలుతోంది. వారి నోళ్లకూ కోరలు మొలిచినట్లున్నాయి.
రోడ్లపై నరమాంస భక్షకులు నడుస్తున్నట్లున్నారు. వాహనాలు మనుషులపై పోతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. రోడ్డంతా చితికిన దేహాల నెత్తుటితో శోభిల్లుతోంది.
ఆకాశం కూడా ఎర్రగా ఉన్నది. పక్షులు తీతువుల్లా అరుస్తున్నాయి. గ్రద్దలు పెంపుడు పక్షులుగా మారినట్లున్నాయి. ప్రతి ఇంటిమీదా బూడిదరంగు పావురాల్లా గ్రద్దలు ఎగురుతున్నాయి.
దేవాలయాల్లో ప్రతి దేవుడి విగ్రహమూ ఆయుధాలు పట్టుకుంది. పూజార్లు రక్తాభిషేకాలు చేస్తున్నారు. కాళీ మాత చేతిలో తెగిపడిన తల చిరునవ్వు నవ్వుతోంది. బిచ్చగాళ్లు పుర్రెలను భిక్షాపాత్రలుగా పట్టుకున్నారు.
మసీదుల్లోంచి బయటకు వస్తున్న వాళ్ల ముఖాలు నిర్వికారంగా ఉన్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో ఏవో ఆయుధాలున్నాయి. అవి నెత్తురోడుతున్నాయి.
ఎవరి ముఖంలోనూ శాంతి లేదు. అంతా ఆగ్రహంతో కనలిపోతున్నారు. ఉన్నట్లుండి ఒకరిపై ఒకరు విరుచుకుని చంపుకుంటున్నారు. ఎవరి దేవుడి పేరును వారు నినాదం గా మార్చుకుని అరుస్తూ పక్కవాడి తల నరుకుతున్నారు.
టీవీల్లో అందమైన యాంకర్లు ఉన్మాదంతో అరుస్తున్నారు. పొరుగుదేశం పై దాడి చేసి ఇళ్లనూ, ఆస్పత్రులనూ బాంబులతో కూల్చి వేసి వందలాది మందిని హతమార్చామని. మన దేశం గెలిచింది. పక్క దేశం లో మనుషుల్ని చంపిపారేశామని. శవాల మధ్య పిల్లలు ఏడుస్తుంటే యాంకర్ల పెదాలపై చిరునవ్వు వికృతంగా మెరుస్తోంది.వారు పాదాలతో శవతాండవం చేస్తూ మారణ కాండను సస్పెన్స్ థ్రిల్లర్ లా వివరిస్తున్నారు .
న్యూస్ పేపర్ల నిండా నేలరాలిన మనుషుల శవాలు కనపడుతున్నాయి. కొన్ని శవాల పక్కన ఆయుధాలున్నాయి. ఆ పేపర్లు చదువుతున్న వారి ముఖాలపై మృత్యోత్సాహం కనపడుతోంది
నాయకుడు అరుస్తున్నాడు. ప్రతీకారం తీర్చుకున్నామని చెబుతున్నాడు. ఆయన ఉపన్యాసం వింటూ జనం ఆవేశంతో ఊగిపోతున్నారు. ఆకాశంలోయుద్ద విమానాలు తిరుగుతూనే ఉన్నాయి.
వీధులే కాదు, అడవులూ, చెట్లూ, ఆకాశమూ, నదులూ, సముద్రమూ రక్తసిక్తమయ్యాయి.
భగవద్గీత ఆధునిక సిద్దాంతంగా మారిందేమో చంపేందుకు, చావడానికి అంతా సిద్దమైనట్లున్నారు ఎవరు మనమో, ఎవరు పరాయివారో తెలియకుండా చంపుకుంటున్నారు. తల్లి గర్భంలోంచి బయటపడ్డ నెత్తుటి శిశువుకు కూడా కోరలు మొలిచాయి. డార్విన్ థియరీ కాబోలు..
బుద్దుడూ లేడు, గాంధీ లేడు అహింస కాలం చెల్లిన సిద్దాంతం
హింసే నేడు నవ్య సంప్రదాయ వాదం.
చంపండి, చావండి, కుప్పకూల్చండి, ధ్వంసం చేయండి. నరకండి, కాల్చి చంపండి.. ఇదే ఆధునిక కవిత్వం..ఉన్మాదమే జీవితం.
*
Add comment