ఆ మధ్య ఒక ఫేస్ బుక్ స్నేహితురాలు ఏదో సందర్భంలో “అల్బేనియా మూలాలతో ఫ్రెంచ్ పౌరసత్వం కలిగిన ముస్లీం మహిళ”గా తనను తాను అభివర్ణించుకొన్నారు. అప్పుడు ఎవరో మిత్రులు “అదేమిటి మీరు నాస్తికులు కదా ముస్లీం ఎలా అయ్యారు?” అని ప్రశ్నించారు. అప్పుడామె తాను సాంస్కృతికంగా ముస్లీం అని చెప్పుకున్నారు. ఇది నన్ను అనేక కోణాల్లో చాలా ఆలోచింప చేసింది. ప్రతి మనిషి తప్పకుండా సాంస్కృతికంగా ఏదో ఒక మతపరమైన ఐడెంటిటీని కలిగి వుండాల్సిందేనా?
మతం దైవ విశ్వాసాలకి సంబంధించిందే అయినా మతం అంతకు మించి ఒక బలమైన సాంస్కృతికాంశం కూడా. ఒకే మతంలో జీవించే కొందరికి ఆ విశ్వాసాల పట్ల హేతువాద దృక్పథం కారణంగా ఆమోదం వుండనప్పటికీ తాను పుట్టి పెరిగిన వాతావరణంలోని గాలిని పీల్చినంత సహజంగా సంస్కృతి ప్రభావానికి లోనవ్వక తప్పదు. ఎందుకంటే ప్రతి సమాజం మతంతో అనుబంధమైన సంస్కృతిని అనివార్యంగా కలిగి వుంటుంది. సైద్ధాంతికంగా దైవాన్ని, మతాన్ని నమ్మని వారిపై కూడా సాంస్కృతికంగా మతపరమైన ప్రభావాన్ని వారి ప్రవర్తనల్లో గమనించాను. మరి విశ్వాసుల్ని, అవిశ్వాసుల్ని ఒకే కప్పు కింద కట్టి వుంచే ఆయా సమాజ సంస్కృతిలో భాగమైన కుటుంబ సంబంధాలు, మానవ సంబంధాల మీద మతం ప్రభావం ఎంత? మతం ప్రభావంలో బతుకుతూ తనకి మతం లేదనుకోవటం ఎంతవరకు సబబు? ఈ ఆలోచనలు కలిగినాయి నాకు. ఇవి మనం కొత్తగా చేయాల్సిన ఆలోచనలు. ఇక్కడ కింద మీ ముందుంచుతున్న ఆలోచనలు కేవలం చర్చకి పెడుతున్నాను. నా ఆలోచనలతో విభేదించే వారికి స్వాగతం.
****
వర్తమానంలో సాధారణంగా మతం మౌలికంగా విశ్వాసాలకి, దైవత్వంలోని అహేతుక తాత్వికతకి సంబంధించినది. అయితే చారిత్రికంగా మతం సమాజంలోని అనేక ఆధిపత్య సిద్ధాంతాలకి మూల బిందువు కూడా. మత మౌఢ్యాల మీద తిరుగుబాటుగా వచ్చిన బౌద్ధం, జైనం వంటి వాటిని ధర్మాలుగా భావించాలేమో. ఇవి మతానికి ప్రత్యామ్నాయంగా ఆవిర్భవించినప్పటికీ తాము కూడా మతం పరిధిలోకి వచ్చేసాయి. సాధారణ ప్రజల్లో దైవం పట్ల అంధ విశ్వాసాల కారణంగానో, ఆధ్యాత్మికత కారణంగానో లేదా అభద్రత కారణంగానో లేదా మరణానంతర జీవితం పట్ల మమకారం వల్లనో లేదా ఒక ప్రజా సమూహానికి అస్తిత్వ నిర్దిష్టత ఏర్పరిచే క్రమంలో ఏర్పడ్డ మతాన్ని సామాజిక ఆధిపత్య భావజాల పరిధిలోకి తీసుకు రాగలరు పాలకులు.
మత ప్రసక్తి లేని పురాతన రాజ్యాలేవీ లేవు. అందుకే మతంతో సంబంధం లేని సమాజమంటూ వుండదు. విప్లవం సంభవించిన రష్యా వంటి దేశాల్లో కూడా మతాన్ని, దైవారాధనని నిషేధించలేదు. మందిరాల్ని మూసేయలేదు. కేవలం బహిరంగ మత/ధార్మిక కార్యక్రమాలని మాత్రమే నిషేధించారు. (మందిరాల లోపలికి వెళ్ళే ప్రజలకి ఒక కౌన్సెలింగ్ కార్యక్రమం నిర్వహించేవారట. అంటే ఆయా సమాజాల్లో కూడా ప్రజల మనస్తత్వంపై, వారి ప్రవర్తనపై మతం ప్రభావం ఎంతో కొంత వున్నట్లేగా!) అయితే నా ఈ తర్కమనేది మతం పట్ల సానుకూల వైఖరి తీసుకోవటానికి కాదు. మతానికి సంబంధించిన అనివార్యతల్ని అర్ధం చేసుకోవటం ద్వారా దాని దుష్ప్రభావాన్ని మినిమైజ్ చేయొచ్చేమో అనే ఒక ఆలోచన.
ఇంక మన దేశంలో మతం విషయానికొస్తే ప్రధానమైనది హిందూ మతం. అసలు హిందూ మతం అనేది లేదు, అది ఒక ధార్మికమైన జీవన విధానమంటారు కానీ అది నాకు సత్యంగా అనిపించదు. హిందూ ధార్మిక జీవన విధానం అని చెప్పబడుతున్నది ఒక్కో చోట ఒక్కో రకంగా వుంటుంది. విభిన్న, విరుద్ధ ఆచారాలు, భిన్న సంస్కృతులు, క్రతువులు, విశ్వాసాలు ఒకే ధర్మం యొక్క లక్షణాలు కావు. పుట్టుక, చావు, వివాహం, గృహ ప్రవేశం, ముహుర్తాలు….ఇలా ప్రతి సందర్భంలోనూ ఒక్కో ప్రాంతంలో హిందూ మతానికి సంబంధించి భిన్న ఆచారాలు, క్రతువులు వున్నాయి. దేవుళ్ళ కథలకి సంబంధించి కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కో కథ వున్నప్పటికీ స్థూలంగా పూజించే దేవుళ్ళని బట్టి కొన్ని సార్వజనీన మంత్రాలు, పూజా విధానాల వల్ల హిందూ మతం అనుకుంటుంటాం. హిందూ మతం ఎప్పటికప్పుడు మారుతూ, విస్తరిస్తూ వచ్చింది. తన మీద తిరుగుబాటు చేసిన భావజాలాల్ని, మతాల్ని కూడా తనలో కలిపేసుకుంది. కనీసం ప్రజలు అవి కూడా హిందూ మత పాయలనే అనుకునేలా జరిగింది.
****
ఇస్లాం ఒక మతం అనుకుంటారు కానీ నిజానికి ఇస్లామే ఒక ధర్మం అని నాకు తోస్తుంది. ఇస్లాం లో జీవన విధానానికి, విశ్వాసాలకి సంబంధించి ప్రతిదీ నిర్దిష్టంగా వుంటుంది. సమాజం ఇలా నడవాలి. ప్రజలు ఇలా బతకాలి అని ప్రతిదీ ఏదో ఒక ధర్మబద్ధంగా చెప్పబడింది ఇస్లాంలో. ప్రజలు కూడా దాన్ని ధర్మంగానే భావిస్తారు. కుటుంబం, వివాహం, వ్యాపారం, మానవసంబంధాలు, దాతృత్వం, పన్నులు, సమాజానికి తిరిగి ఇచ్చే పద్ధతి, చివరికి బాంకింగ్ వ్యవస్థ కూడా నిర్వచించబడి వుంటుంది. దాన్నుండి డీవియేట్ అయ్యే స్వేఛ్ఛ లేదు విశ్వాసులకి. నాకు తెలిసి ఇస్లాం సంస్కరణలకి లొంగదు. సడలింపులకు అవకాశం లేదు. ఎవరూ మార్చలేరు. ఇస్లాం అవలంభకుల్లో ఘర్షణలున్నప్పటికీ అది కూడా విశ్వాసాల పునాది మీదనే వుంటుంది. ప్రపంచ వ్యాప్తంగా ముస్లీములు ఏ దేశంలో నివసిస్తున్నా ఆయా దేశాల పర్సనల్ లా కి లోబడి జీవించాల్సి రావొచ్చు కానీ ఇస్లాం షరియత్ మాత్రం అమలయ్యే ఏ దేశంలో అయినా ఇలా బతికి తీరాల్సిందే అని ఇస్లాం చెబుతుంది. కానీ హిందూ మతం అనేక మార్పు చేర్పులకి గురవుతూనే వుంది. తన మీద తిరుగుబాటుగా వచ్చిన ప్రత్యామ్నాయ మత ధోరణుల్ని తనలోనే ఇముడ్చుకొని అప్రతిహతంగా సాగిపోతున్నది. తిరుగుబాట్ల అణచివేతని సంస్కరణలనే కొత్త కోణంలో ప్రదర్శించింది. ఆ కారణాన నేను హిందూ ధర్మం అని కాక హిందూ మతం అనే అంటాను.
భారతదేశంలో కేవలం ఒక్క హిందూ మతంలోనే కులం లేకుండా పోలేదు. మన దేశంలో అన్ని ముఖ్య మతాల్లోనూ అనివార్యంగా కులం ప్రమేయం వుంది. శ్రమ విభజనలో భాగంగా కులం ఆవిర్భవించిందని చెప్పినప్పటికీ ఒక క్రమంలో కులం ఆధిపత్య భావజాలానికి సంబంధించినదిగానే మిగిలిపోయింది. భౌతిక, ఆర్ధిక దోపిడీని ఉద్దేశించిన ఇప్పటి కుల వ్యవస్థ మతాన్ని వాడుకున్నట్లనిపిస్తుంది. ఎంతగా వాడుకుందంటే కుల పునాదుల మీదనే హిందూ మతం ఏర్పడిందనేంతగా! అయితే మతాన్ని సంస్కరించగలమేమో కానీ కులాన్ని సంస్కరించలేమనుకుంటున్నా. అలాగే మతాన్ని నిర్మూలించలేం కానీ కులాన్ని నిర్మూలించొచ్చేమో అని అనుకుటున్నా. ఎందుకంటే సంస్కరణలకి గురయ్యేది నిర్మూలించబడదు. కొన్ని ఆచారాలు మారినంత మాత్రాన కులాలు సంస్కరణలకు గురైనట్లు కాదు. కులం అనేది మౌలికంగా ఆర్ధికంగా ఒక స్వార్ధ, సాంఘీకంగా ఒక వివక్షాపూరిత సంకుచిత భావన.
హిందూ మతంలో అనేక దురాచారాల్ని సంస్కరణోద్యమాల ద్వారా నిర్మూలించటం జరిగింది. కానీ కులాన్ని సంస్కరించలేం. అది నిర్మూలన కావలసిందే. కులానికి ఆధ్యాత్మికతకీ, దైవ విశ్వాసానికి పెద్ద లింకు లేదు. వీళ్ళిక్కడి నుండి, వాళ్ళక్కడి నుండి పుట్టారనే భావనని ఇప్పుడెవరూ పెద్దగా విశ్వసిస్తున్నట్లు లేదు. ఒకవేళ ఏవరైనా అలా అనుకున్నా పెద్దగా ఎవరూ పట్టించుకోవటం లేదు. కానీ కులం పట్టింపు మాత్రం బలంగా వుంది సమాజంలో. కుల దోపిడీ వెనుకనున్న ఆర్ధికాంశాన్ని పట్టించుకున్నా, పట్టించుకోకున్నా కులం అనేది ఒక సామాజిక గౌరవంగానే భావిస్తున్నారు కులాధిపత్యం వల్ల ప్రయోజనం పొందిన వారూ, ఆ గౌరవాన్ని నష్టపోయినందువల్ల దాన్ని ప్రతిఘటించే వారూ కూడా!
కులం ఆధారంగా సాంఘీక గౌరవాలుండ కూడని సమాజాన్ని కాంక్షించటమే సాంఘీకంగా శాస్త్రీయ దృక్పథం. ఆర్ధిక సంబంధాల్లో విప్లవాత్మక మార్పులు, కుల వ్యతిరేక చైతన్యం కుల నిర్మూలనకి తోడ్పడొచ్చు. 130 కోట్ల మంది జనాభాకి ఒక మతం లేకుండా చేసే విధంగా హిందూ మతాన్నే నిర్మూలిస్తామంటే అసలుకే మోసం రావొచ్చు. సాంఘీయులు ఇప్పుడు అదే త్రెట్ సృష్టించి లబ్ది పొందుతున్నారు. దానివల్ల అసలు ప్రయోజనం లేదు. హిందూ మతం పోతే కుల వ్యవస్థేమీ పోదు. పైగా సాంఘీకంగా, ఆర్ధికంగా ఉన్నతీకరణ చెందిన/చెందుతున్న బడుగు వర్గాల వారు హిందూ ఆచారాలకి, క్రతువులకి దగ్గరవుతున్నారు కూడా.
(ఇంకా వుంది)
మతాన్ని పట్టించుకోని వారూ, మనుస్మృతి తెలియని వారూ కుల వివక్ష చూపిస్తారు. వారికి మూలాల తెలియదు, కానీ వివక్ష తెలుసు. బహుశా మెజారిటీ వర్గం మతం ఆమోదం ఉన్నా లేకపోయినా ఈ వివక్షను కొనసాగిస్తారనిపిస్తుంది. అలాగని మతాన్ని, కులాన్ని విడతీసి చర్చించలేము కూడా.. మంచి చర్చ మొదలుపెట్టారు.
ధన్యవాదాలు వశిష్టగారూ! మను స్మృతి అనేది ఒకటుందని తెలియాల్సిన అవసరం లేదు దాని ప్రభావంలో బతకటానికి. ఎందుకంటే అదే జీవన సంస్కృతి అయింది కాబట్టి.
దొంగ తనం నేరమే కాక, వ్యక్తి త్వ హననం అని తెలిసిన తరువాత కూడా ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేయడమంటే అది తప్పు అని తెలిసినందువల్ల వచ్చిన లాభం ఏమి? సంస్కృతి ఎప్పుడూ భౌతిక పరిస్థితులకనుగుణంగా మారుతూ నే ఉంటుంది. ఈ మార్పు మతాలకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే మతం కూడా సంస్కృతిలో భాగం కాబట్టి. మత సంస్కరణోద్యమాలతో పాటు, సాంఘీక సంస్కరణ నోద్యమాలు ఎందుకొస్తాయి? భౌతిక పరిస్థితి మారినప్పుడు దానికనుగుణంగా లేని మత, సామాజిక సంస్కరణలు కూడా జరుతాయి. జీవితాన్ని హేతుబద్ధంగా ఆలోచించే వారు హేతువుకనుగుణంగా మారక పోతే అసలు ఆ ఆలోచన లు చెయ్యడం ఎందుకు? కులవ్యవస్థ సమాజంలో కొందరి పట్ల అమానుషంగా వ్యవహరించింది అంటే దానర్థం అది మారాలి, లేక అది పోవాలి అనేగదా అర్థం? ఉన్నది ఉన్నట్లే ఉండటానికి ఆలోచనలే అవసరం లేదుకదా? కులవ్యవస్థ కు మూలం హిందూ మత ఆచరణ కారణం అయిన ప్పుడు ఆ ఆచరణ పట్ల వ్యతిరేక త ఉంటే కదా? మీరన్నారు ” ముస్లిం మతంలో సంస్కరణ సాద్యం కాద” ని. హిందూ సమాజంలో బతికే వారికి కుల పాటింపు ఎలా సాద్యం అయింది. అది సంస్కరణ కాదా? అదే వర్తింపు క్రిస్టియానిటీ కూడా! ఎలా సాద్యమైంది? ఫాసిజం ఈనాడు జడలు విప్పుకుంది కనుక కులం, మతం తోడయినాయి. అది కాగితపు పులి దాని ఆటలు సాగనపుడు చతికల పడక తప్పదు. మీరు అనుకున్నట్లు
కులవ్యవస్థ బానిస విధానంలో భాగమే కానీ, వృత్తి పరంగా కాదు. బానిసలకు అప్పగించి న వృత్తలవి! ప్రజలు ఇంకా బానిసలు గానే ఉంటారా?