హమ్ సబ్ యాద్ రఖేంగే..

“కత్తికి సావు బాసింగమై ఊగులాడుతోoది బతుకు”

–పొన్నాల బాలయ్య

 

“రాజ్ బిహారీ”

“హా..సాబ్”

“దయావత్ ముండా”

“హా…సాబ్”

“శైలేష్ యాదవ్”

“హా…సాబ్”

పోలీస్ స్టేషన్ లో అంత హడావిడి ఎప్పుడూ లేదు..చెమట చిత్తడి.ఒక వైపు వాలంటీర్లు ఫారాలు నింపుతున్నారు.మరో వైపు పోలీసులు కేకలు పెడుతున్నారు.కొందరు పోలీసులు పేపర్లు,టోకెన్ల మద్యన ఆపసోపాలు పడుతున్నారు.

పోలీసు స్టేషన్ ముందు అంతూ పొంతూ లేని వలస కార్మికుల క్యూలు..అలసట తో చెమట తో అట్టగట్టుకు పోయిన కార్మికుల దేహాలు.పోలీసుల తిట్లు, దొబ్బులాటలు,ఉక్కపోతలు…యూరప్ లోని యుద్ధాలని తలపించే ఇంగ్లీష్ సినిమాల ఉంది.చూస్తుంటే ప్రభుత్వం ప్రజల మీద యుద్దమేదో ప్రకటించినట్టుగా ఉంది.

టోకెన్ లు ఇవ్వడానికి ఓ పోలీసును పిలిచి,కాన్ స్టేబుల్ రఘునందన్ కాస్త గాలి కోసం బయటికి వొచ్చాడు.అక్కడ క్యూ లో నిల్చున్న కార్మికుల వైపు చూసి బిత్తర పోయాడు.”బాప్ రే..బెంగుళూరు లో ఇంత మంది వలస కార్మికులు ఉన్నారా?ఎక్కడ నుంచి వచ్చారో..ఎక్కడికి పోతున్నారో…చీమల పుట్టల కెళ్ళి చీమలేల్లినట్టు దండుకు దండు కదిలిండ్రు.వీళ్ళను చూస్తుంటే తనకే పిచ్చేక్కేటట్టు ఉంది.”అనుకోని అక్కడ హోటల్ వాడికి టీ చెప్పి పనిలో నిమగ్నమైపోయాడు.

***

బెంగుళూరు లో వలస కార్మికులని వాళ్ళ ఊర్లకి పంపడానికి ప్రభుత్వం “సేవా సిందు”కార్యక్రమం మొదలు పెట్టింది.తమ తమ ఊర్లల్లకి పోవాలనుకునే వాళ్ళు ఫారం నింపి పోలీస్ స్టేషన్ లో ఇస్తే టోకెన్ లు ఇస్తారు.రాబోయే శ్రామిక రైళ్ళలో వాళ్ళు ఊర్లకి వెళ్ళే అవకాశం ఉంది.

అవతల క్యూ నత్తలాగా నడుస్తుంది.

“వీళ్ళు టోకెన్ లు ఇస్తున్నారా?లేక గప్పాలు కొడుతున్నారా”కోపంగా అన్నాడు లింగారాం.అతనికి టోకెన్ లు ఎప్పుడిస్తారా.ఎప్పుడు ఛత్తీస్ గడ్ కి పోదామా అన్నంత అతురత గా ఉంది.

“ఏమో బయ్య…రోజు టోకెన్ కోసం తిరిగి తిరిగి కాళ్ళు గుంజుతున్నాయి. ఇప్పటికి పది రోజులు దాటింది.ఎప్పుడిస్తారో ఏమో.”అన్నాడు మడ్కం రమేష్

“అసలే కరోనా కాలం..ఎప్పుడేం జరుగుతదో తెలియదు.వీళ్ళు టోకెన్ లు ఇచ్చే లోగ క్యులోనే చచ్చేటట్టున్నాము.”అందుకున్నాడు మరో కార్మికుడు కర్తం జోగా.

“రెండు నెలల నుంచి లాక్ డౌన్ తోటి పని బందు పెట్టిన్రు.చేతిల చిల్లిగవ్వ లేదు.సందు చూసుకొని కాటికాడి నక్కల్లాగా అందరు డబ్బులు గుంజుడు మొదలు పెట్టిన్రు” అన్నాడు మనీష్ కుంజం

“గదేందన్నా..గా ఇంటర్నెట్ కాడికి పోతే dtp చేయనీకే రెండొందలు ప్రింటౌట్ ఇయ్యనికే వంద రూపాయలు…రక్తాలు పీలుస్తున్నరు బద్మాష్ గాళ్ళు”అందుకున్నాడు శైలేష్ యాదవ్.

“ఇంటి కాడ నా బిడ్డ సావిత్రి సుస్తు అయిoదని మెసేజీలు వొస్తున్నాయి.మాటిమాటికి బిడ్డ కండ్లల్ల మెదులుతున్నది.వీళ్ళు పోనియరు.రైలు ఎప్పుడొస్తాదో తెలవదు.అమ్మ పెట్టదు.అడుక్క తిననీయదు.”నిట్టూర్చాడు లింగారాం

***

సాయంకాలం ఐంది.ఆ రోజుకి పాసులివ్వడం అయిపోయిందని మిగిలిన వాళ్ళంతా మరుసటి రోజు రావాలని చెప్పడం తో,కార్మికులంతా ఊసూరుమన్నారు. ఇక చేసేది లేక వెనుదిరిగారు.

కాల్లిడ్చుకుంటూ నడవడం మొదలు పెట్టారు.గమ్యం లేని నడక..నిలకడ లేని బతుకు.నీడ లేని బతుకు.రోజూ క్యూ లలో నిలబడడం,టోకెన్ దొరికితే సంతోషపడడం,దయామయులు ఇచ్చే తిండి తినడం పబ్లిక్ రూమ్ లలో అవసరాలు తీర్చుకోవడం ఎక్కడో ఒక చోట పడుకోవడం.ఇదీ వరస.లాక్ డౌన్ మొదలు పెట్టినప్పటి నుంచి వాళ్ళు పెకిలించిన చెట్లయ్యారు

***

ఎవరో ఇచ్చిన మీల్స్ ప్యాకెట్ తెరిచి తినడానికి కూర్చున్నాడు లింగారాం.అతనికి ఆ పొట్లంల తిండి చూసాక తాను పని చేసే ఫైవ్ స్టార్ హోటల్ జ్ఞాపకo వొచ్చింది.

గత ఎనిమిదేళ్ళుగా అక్కడే పనిచేస్తున్నా ఇప్పటికీ అతనికి అంతా ఆశ్చర్యoగానే ఉంటది.ఆ జిగేల్లు ఆ విలాసాలు ఆ అట్టహాసాలు ఎప్పుడు విoతనే.

అక్కడ ఎన్నెన్నో రుచికరమైన ఆహార పదార్థాలు మిగిలిపోతుంటాయి.“నీకేమోయ్…అన్ని రుచులు దొరుకుతాయి.”అంటూ ఆట పట్టిస్తుంటారు తన మిత్రులు.కాని అతనెన్నడు వాటి జోలికి పోడు.తనకు ఇష్టమైన రొట్టె పప్పు కూరగాయలతోనే నడిపిస్తుంటాడు.

ఆ హోటల్ లో వందకు పైగా వంటకాలు తయారు చేయడం ఎప్పటికి ఆశ్చర్యo గొలిపే విషయమే. బర్త్ డే పార్టీలు, పెండ్లిలు, కాన్ఫరెన్స్ లు , ఓ…ఒకటేమిటి ఇట్లాంటివి ఎన్నో జరుగుతుంటాయి అక్కడ.డబ్బు నీళ్ళలాగ ప్రవహిస్తుంటది.ఒక సింగల్ మీల్ కు అరవై ఐటంలు ఒడ్డిస్తారంటే సామాన్యులకి అది నమ్మరాని విషయం.ఒక సింగల్ మీల్ కి అయ్యే ఖర్చు లింగారాం కి వారానికి వొచ్చే సంపాదన తో సమానం.

ఇక్కడే లింగారాం గిన్నెలు తోమే స్థాయి నుండి వంట మనిషి(కుక్) స్థాయికి ఎదిగాడు.అతని జీతం ఇప్పుడు నెలకు పది వేలు.ఇంత ఘనమైన హోటల్ లాక్ డౌన్ పుణ్యమా అని డబ్బులు లేవని బయటికి గెంటేసింది.

***

లాక్ డౌన్ ప్రకటించాక గత ఏడు వారాలుగా గంగారాం రూమ్ లో సభ్యుల సంఖ్య మూడు నుంచి ఎనిమిది కి పెరిగింది.హోటల్ వాళ్ళ లాగ వాళ్ళని బయటికి పంపలేడు కదా.అందరు తన లాంటి అభాగ్యులే.ఉన్న కాడికి కలో,గంజో పంచుకుందాం అని డబ్బున్న కాడికి వండుకు తిన్నారు.డబ్బు ఐపోయాక వీధుల్లో పంచుతున్న అన్నం పొట్లాల మీద ఆధార పడడం మొదలు పెట్టారు.

***

పాత బడ్డ ఫంక్షన్ హాల్ లో లింగారాం ఓ మూలన పడుకొని ఆలోచించడం మొదలు పెట్టాడు.అతనికి ఛత్తీస్ ఘడ్ జ్ఞాపకం వొచ్చింది.అక్కడి పర్వతాలు అడవులు జలపాతాలు ,బూరందేవి దేవాలయం,ఇంద్రావతి నేషనల్ పార్క్ మనుసులో రీళ్ల లాగ తిరిగాయి.అన్నింటికన్నా ముఖ్యం…తన కుటుంబం గురించి తలచుకునే సరికల్లా కళ్ళు చెమర్చాయి.తన బిడ్డ సావిత్రి ఎట్లున్నదో ఏమో..సుస్తిగా ఉందని మందులు వేస్తున్నామని చెపుతున్నారు.కరోనా మూలాన బడులు ముసేసారట.అప్పటి నుంచి ఇంటి పట్టునే ఉంటూ “నాయన ఎప్పుడోస్తాడని” ఒకటే ఇదిగా వేదిస్తున్నదట.

తల్లికి మోకాళ్ళ నొప్పులు.కంటి చూపు ఆనదు.తానైతే డబ్బులు పంపిస్తున్నాడు కాని అవి ఏ మూలకు చాలడం లేదు.తాను బెంగుళూరు బయలుదేరుతున్నపుడు వొణుకుతున్న చేతులతో వొల్లంత నిమరడం తనను ఎప్పుడూ వెంటాడుతుంటది.

***

*“నా పయనమెందుకో అర్ధం కాని నీకు

ఆరంభం ఎక్కడో చెప్పిన బుర్రకేక్కుతుందా”

ఛత్తీస్ గడ్ లో సల్వాజూడుమ్ ఏర్పడ్డాక పోలీసుల అండ తో గుడాల మీద దాడులు విపరీతమైయ్యాయి.హత్యలు గృహ దహనాలు లూటీలు యధేచ్చగాసాగాయి. తర్వాతి కాలం లో సుప్రీం కోర్ట్ సల్వాజుడుం ని రద్దు చేసినా ప్రభుత్వం మరో పేరుతో(spo) గా కొనసాగించింది.

అడవి లోపల భూమి కింద గల ఖనిజాల మీద కార్పొరేట్ల కన్ను బడడం తో ఆదివాసి కాళ్ళ కింద భూమి బీటలు వారింది.రాజ్యo కంపెనీలు సల్వాజుడుం కలిసి పచ్చని ఆదివాసి బతుకుల్లో నిప్పులు పోసాయి.

ఆరోజు తనకోసం వొచ్చిన పోలీసులు జుడుం వాళ్ళు తను లేకపోయే సరికి తన తండ్రిని గొడ్డలితో దారుణంగా నరికి చంపారు.తన భార్య సోయం సంధూరిని తన బిడ్డ సావిత్రి ముందే సామూహికంగా అత్యాచారం చేసారు.చచ్చిపోయిందని భ్రమించి ఇంద్రావతి ఒడ్డున పడేసి వెళ్ళిపోయారు.

ఈ ఘటన మర్చిపోవడానికి సంధూరికి చాల కాలమే పట్టింది.ఇప్పటికి ఏ అర్థ రాత్రో ఆమె నిద్రలో దిగ్గున లేచి కుసుంటుంది.ఇంక ఆ రాత్రి నిద్ర పట్టదు.అత్యాచారం అనేది శరీరానికే కాదు అది మనసుకు సంబందించిది కూడా.అత్యాచారానికి సంబందించిన గాయాలు భౌతికంగా మానినా అది మనసుకి చేసిన గాయం జీవితాంతం వెంటాడుతది.

ఈ ఘటన జరిగినాoక లింగారాం తన మకాం జగ్దల్పూర్ కి మార్చాడు.అక్కడే కూలి నాలి చేస్కుంటూ బతక సాగాడు.తన చుట్టూ పక్కల వాళ్ళు వలస పోతుండడం తో తాను ఒక కాంట్రాక్టర్ సహాయం తో బెంగుళూరు చేరాడు.

***

గంపెడు ఆశలతో విశ్వనగరం లోకి అడుగు పెట్టాడు లింగారాం.ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయని, మనుషులు హెలికాప్టర్ల లో తిరుగుతారు అని, కావలసినంత పని దొరుకుతుందని కాంట్రాక్టర్ అరచేతిలో స్వర్గం చూయించి ఛత్తీస్ గడ్ నుంచి తీసుకు వొచ్చాడు.

వలస కార్మికులంటే యజమానుకులకి బాగా ఇష్టం.ఆ ఇష్టం ప్రేమ వల్ల వొచ్చింది కాదు.వాళ్ళు గొడ్డు చాకిరీ చేస్తారు.ఇచ్చింది తీసుకుంటారు.చిన్న చిన్న సంపాదనలకే సంతోష పడిపోతుంటారు.సమ్మె గట్టేది లేదు.సమరం చేసేది లేదు.

స్థానికులకి వలస కూలీలకు చాల తేడా ఉంటది.స్థానికులైతే చిన్న చిన్న సాకులు చూపి యజమానికి చుక్కలు చూపిస్తారు.వలస కూలీలు అట్లా కాదు ఎక్కడ దిక్కు లేని వాళ్ళు.ఇక్కడే ఉంటారు.చెప్పినట్టు వింటారు.తమ పండుగలని సాంప్రదాయలని తమ వాళ్ళ ఆరోగ్యాలని మరిచిపోయి తమ జీవితాలని బెంగుళూరు నగరానికి అర్పిస్తుoటారు.తమ కంటి కాంతులతో నగరాన్ని వెలిగిస్తుంటారు.

***

కర్ణాటక లోని వివిధ ప్రాంతాల నుండి,చుట్టు పక్కల రాష్ట్రాల నుండి వలస పక్షులు ఎగిరి వొస్తుంటాయి.తమ తమ పచ్చని చెట్ల మీద ఆహరం సరిపోక ఇక్కడ ఎదో దొరుకుతుందని ఈ జిలుగువెలుగుల మహా కుడ్యం మీద వాలతాయి.అది తన ఇనుప గొట్టాలతో వాటి రక్తాన్ని పీల్చి రోగ గ్రస్తమైన నీర్జీవమైన పక్షులని బయటికి విసిరేస్తుంది.అది తెలిసినా వలస పక్షులు మళ్ళీ మళ్ళీ వొస్తూనే ఉంటాయి.ఇదొక మహా చంక్రమణo(vicious circle).

***

ఈ వలస కూలీలు రెస్టారెంట్లలో క్లీనర్ లు గా వంట వాళ్ళు గా,మెట్రో లో నిర్మాణ కూలీలు గా ఫ్యాక్టరీ కూలీలు గా షానిటేషన్ వర్కర్లు గా తమ శ్రమను ధారపోస్తుంటారు.స్త్రీల పరిస్థితి పెద్ద తేడాగా ఏమి ఉండదు.వాళ్ళు ఇండ్లలో అపార్ట్ మెంట్ లలో పాచి పని చేయడానికి కుదురుకుంటారు.యజమాని పడేసిన సద్ది కూడును కూరగాయలను గిన్నెలో పెట్టుకొని దాని మీద కొంగు కప్పుకొని పక్షి పిల్లల కోసం ఆహారం తీసుకొనిపోయినట్టు వీళ్ళు తమ ఇండ్లకి సద్ది కూడు తీసుకోని పోతుంటారు.ఇంకాస్త మెరుగైన వాళ్ళు బ్యూటీ పార్లర్,సెలూన్ లలో ఫిట్నెస్ సెంటర్ లలో పనులు చేస్తుంటారు.

పొద్దున్న చూస్తే గుంపులు గుంపులు గా బస్సు ల కోసం బయలుదేరడం సాయంత్రానికి అలసిన ముఖాలు వేలాడేసుకొని కూరగాయల కోసమో సామాన్ల కోసమో పరుగులు తీయడం ఇక్కడ కనిపించే ఒక సాధారణ దృశ్యం.

***

ఎనిమిది సంవత్సరాలుగా బెంగుళూరులో పని చేస్తున్న లింగారాం కు ఒక ఐడెంటిటీ కార్డ్ మాత్రం ఇచ్చారు.దాని ద్వార ఆధార్ కార్డ్ ఇస్తారని,వోటు హక్కు కూడా వొస్తుందని చెబుతుంటారు.

కానీ అతనైతే ఎన్నడూ వోటు వేయలేదు.కేంద్రం ఊదరగోడుతున్న”సబ్ కా సాత్ సబ్ కా వికాస్”ఒక నామ మాత్రపు నినాదంగానే మిగిలిపోయింది.తమ వాళ్ళు వెనక్కి వెనక్కి నెట్టబడి పిడికెడు బతుక్కోసం లింగారాం బెంగుళూర్ కు పొట్ట చేత

పట్టుకు రావడం “వికాస్”గా చెప్పుకోవాలి.

“అరేయ్…వలస కూలీలకు హక్కులేంది రా…మనం గాలిలో యాలడుతున్న దీపాలన్న మాట”సినిమా చూసి వొస్తు కర్తం జోగా అన్నాడోసారి

“అదేం మాట..మనం మనుషులం కామా ఏందీ?మనం దేశ పౌరులం కామా ?” లింగారాం ఉక్రోషంగా అందుకున్నాడు.

కర్తం జోగా అతని వైపు పిచ్చి మాలోకం అన్నట్టుగా చూసాడు.

“అరేయ్…మనం మనుషులమే కాని,అది మన ఊర్ల..బెంగుళూర్ ల కాదు..అంతెందుకు మన ఊర్లల కూడ మనం మనుషులం కాము తెల్సా..అడివి మీద కార్పోరెట్ల కన్ను పడ్డంక మనల్ని బతక నిచ్చిన్రా..జంతువుల్లాగా వేటాడలేదూ..మన తావున మనల్ని ఉండనీయరు,వాళ్ళ తావున వొస్తే బతక నీయరు..ముందు నుయ్యి..వెనక గొయ్యి”ఓ పెద్ద తత్వవేత్తలా చెప్పుకొచ్చాడు కర్తం జోగా.అక్షరం ముక్క రాకపోయినా జీవితమే అన్ని నేర్పిస్తది.

“ఐతే ఇది మన దేశం కాదా?మనo దేశ పౌరులం కామ?”లింగారాంకు  కోపం తగ్గలేదు.

“అరేయ్ పిచ్చోడా..పేరుకే ఇది మన దేశం…మనo సొంత దేశం లో పరాయి వాళ్ళం.”అందుకున్నాడు మనీష్ కుంజం “ఈ గాలి, ఈ నీరు,ఈ ఆకాశం మనది కాదు.”అంటూ పిడికెడు మట్టి తీసుకోని విప్పి చూపి”చివరకు గీ మట్టి కూడా మనది కాదు.ఈ దేశం కూలీలని,వలస కూలీలని,ఆదివాసిలని ఎన్నడు తనలో కలుపుకోలేదు.అంతా use అండ్ through అన్నమాట.”మనిష్ కుంజం గొంతు గద్గదికం అయింది.

“కూలీ బతుకంటే కుక్క బతుకన్న మాట..అది కుక్కల కంటే అద్వానం..నీకు తెలుసా తమ ఇంటి బొచ్చు కుక్కలు చనిపోతే యజమానులు కుమిలి కుమిలి ఏడుస్తారు..ఆచారం ప్రకారం పూడుస్తారు.అదే ఓ వలస కూలీ సచ్చిoడనుకో..బాడీ ని ప్యాక్ చేసి ఇంటికి పంపించి చేతులు దులుపుకుంటారు..ధూత్ దీనమ్మ”ఈసడింపుగా అన్నాడు కర్తం జోగా

కాసేపు ఎవరు మాట్లాడలేదు.మౌనం ఉక్కపోతగా ఉంది.

“ఓ ప్రోవిడెంట్ ఫండ్ లేదు..ఓ బోనస్ లేదు..”అందుకున్నాడు శైలేష్ యాదవ్ “పని ఉంటె మనం..లేకుంటే శూన్యం..లాక్ డౌన్ పెట్టినప్పుడు ఎవడన్న ఆదుకున్నాడా..నాకన్ని బూతులోస్తాయి.చేతుల పైసలు లేవు..ఇంటికాడ కరోనా వచ్చిందని మెసేజ్ వొచ్చింది.”సర్..పరిస్థితి బాలేదు…అకౌంటు ల కొంచం డబ్బులేయండి సర్”అంటే ఆ కాంట్రాక్టర్ గాడు ఏమన్నడు”అరేయ్..బిజినెస్ బందు పెడితే డబ్బులు ఎట్లోస్తాయి రా…”తర్వాత మనల్ని గాలికి ఒదిలేసి స్విచ్ ఆఫ్ చేసుకోలేదూ” అన్నాడు శైలేష్ యాదవ్

“మీరు ఎన్నన్న చెప్పుండ్రి”అని మిత్రుల వైపు చూసాడు లింగా రాం”ఇగ ముందు ఈ పరిస్థితి రానియ్యకూడదు.కాని కాలo వొచ్చింది.తన్ని తరిమేసిండ్రు..మనం పదిమందిమి ఉన్నా మూసిన గుప్పిటి లాగ పట్టు మీద ఉండాలి.కష్టం వొచ్చిన సుఖం ఒచ్చిన ఒక తల్లి పిల్లల లాగ కలిసి పంచుకోవాలి..వాళ్ళ అవసరం మనకెoతుందో మన అవసరం వాళ్లకూ అంతే ఉంది.ఈ టైం తర్వాత మనం ఊర్లనే ఉంటమో..ఇంకేక్కడికన్నా పోతమో కాని మునుపటి బతుకు బతకగూడదు..ఇట్లాంటి దిక్కులేని సావు సావ గూడదు.”స్థిరంగానే అన్నా అతని మాటల్లో నిప్పు కణికలు పేలుతున్నాయి.

షెడ్ లు దగ్గరికి ఒచ్చే సరికి చర్చలు ఆగిపోయాయి.లోపల అలజడి మాత్రం రగులుతూనే ఉంది.

**“ఆకలితో పోరాడుతున్నజనం

గెలిస్తే బతుకు,ఓడితే చావు”

***

ఏది ఏమైనా లింగా రాం మొదట బెంగుళూరు వాసి గా ఉందామని కల గన్నాడు.ఇక్కడ కన్నడ సంస్కృతిలో తాను ఓ భాగం అయ్యాడు.

“కన్నడ కంఠీరవ”రాజ్ కుమార్ తన శ్రమ, నిజాయితి,మానవత్వం,విజయ సాధనం గురించి ఎలిగెత్తి పాడుతుంటే అదంతా నిజమేనని నమ్మేవాడు.

***

ఎవరైతే బెంగుళూరు ను నిర్మించారో వాళ్ళను బెంగుళూరు మర్చిపోయింది. వీళ్ళ నిరంతర శ్రమ మీద విశ్వ నగరo పైకి లేచింది వ్యాపారాన్ని పెంచుకుంది. సంపదలని కుప్ప పోసింది.తన వెలుగు జిలుగులని విర బూసింది.మరి వల కూలిలకి ఏమిచ్చింది.లాక్ డౌన్ మొదలైందో లేదో వాళ్ళ మొత్తం జీవితాన్ని చుట్ట చుట్టి పోలీసులకి అప్పచెప్పింది.వాళ్ళు కొట్టారు తిట్టారు.పశువుల కన్నా హీనంగా చూసారు.సొంత ఊరికి నడిచన్నా పోదాం అంటే పోలీసులు అడుగడుగునా అడ్డు తగిలారు.పారిపోతున్న దొంగలను వెంటాడినట్టు వెంటాడారు.ఇక్కడ పని దొరకదు వాళ్ళు పోనియరు.స్త్రీల పరిస్థితి చెప్పదీరదు.ఒకామె వీళ్ళ బాధలు పడలేక తన ముగ్గురు పిల్లలని బావిలో పడేసి తాను దూకేసింది.మరో వైపు ఇంటి నుంచి ఫోన్ ల మీద ఫోన్ లు…”అక్కడ తిండి లేకుండ బతకడం కంటే ఇక్కడే కలో గంజో తాగుదాం అని,చస్తే అందరమూ కలిసే చద్దాం” అని ఒకటే అర్తింపులు.

వాళ్ళు కోరింది అన్నం పోట్లాలే కాదు కాసింత గౌరవo మర్యాద,ప్రేమ గూడ.ఈ వెలుగు జిలుగుల మహా నగరం లో వలస కూలీలకి గౌరవ మర్యాదలా..ఓ రెండు నెలల లాక్ డౌన్ కే కష్ట జీవులు కాస్త కాందిశీకులు అయిపోయారు.వాళ్ళను గాలికి వొదిలేసింది ప్రభుత్వం.కువెంపు మహా కవి కలలు కన్న దేశం, అక్క మహా దేవి నడయాడిన రాజ్యం, కళలు సంస్కృతి సాoప్రదాయాలకు కాణాచి ఐన కన్నడ రాజ్యానికి వలస కూలీల ఆర్తనాదాలు రేఖా మాత్రంగానైన వినపడలేదు.

***

మొత్తం మీద పది రోజుల తర్వాత లింగా రాం కు టోకెన్ లు ఐతే దొరికాయి. ఫారిన్ పోవడానికి వీసా లు దొరికినంత సంబరపడిపోయారు.ఆ సంతోషం కూడా ఎక్కువ కాలం నిలువ లేదు.బిల్డర్లు ప్రభుత్వం కూడా బలుక్కొని కూలిలేవ్వరు వెనక్కి పోవలిసిన అవసరం లేదని ఆర్థిక రంగం కుదేలవుతుందని ఉన్న రైళ్ళను రద్దు చేసి పడేసారు.

వలస కూలీలు మాత్రo చావో రేవో తేల్చుకోవాలని సిద్ధమయ్యారు.తమ సొంత ఊర్లకి పోవాలనే బలమైన ఆకాంక్ష వాళ్ళని నిమ్మలంగ ఉండనియలేదు.ధర్నాలు నిరసనలు లాఠీ ఛార్జ్ లు..పత్రికలూ,టీవీలు వాళ్ళకి అండగా నిలిచాయి.సర్కార్ దిగి వొచ్చింది.

***

చౌరస్తా లో బస్సు ఆగింది.కూలిలందరూ బిలబిల మంటూ బస్సు ఎక్కారు. ఇంకా రావాల్సిన వాళ్ళు వొస్తూనే ఉన్నారు.డ్రైవర్ టీ తాగడానికి పోవడం తో అందరు మాటల్లో పడిపోయారు.మాటలేముంటాయి బాధలు పంచుకోవడం తప్ప.

“ఏమన్నా…మల్లోస్తారా…ఊర్లనే ఉంటారా?”ప్రశ్నార్థకంగా అడిగాడు రాజ్ బిహారి.నిజానికి ఆ సందేహం తననూ తొలుస్తూనే ఉంది.

“ధూత్…దీనమ్మ..మల్ల రావడమా?”అంటూ కిటికీ లో నుంచి నగరం వైపు చూసాడు శైలేష్ యాదవ్.“ఇక్కడి దిక్కు మొఖం కూడా పెట్టుకొని పండుకోము.ఎట్లనో ఒక లాగ అక్కడనె బతుకుతాము.చావో బతుకో ఉన్న చోటనే తెలుసుకుంటాము.అడివిల ఆకులుండవా?పల్లెల బతుకుoడదా?”తేల్చి చెప్పాడతను.

“మల్ల నీ సంగతేందన్న..”దయావత్ ముండా వైపు తిరిగి అడిగాడు రాజ్ బిహారి.

“ఏమోరా…నాకoతా గజిబిజి గా ఉంది.పోనైతే పోతున్నాం.అక్కడ మన కోసం ఏమి బంగారo దాచి పెట్టిలేదు.పోయ్యి మీదకి బియ్యం పోయ్యి కిందికి కట్టెలు మనం తెచ్చుకోవాల్సిoదే.ఏమైతదో ఎట్లుంటదో..నా భార్యను కూడా లాక్ డౌన్ పేరు చెప్పి పనిల కెళ్ళి తీసేషిండ్రట…ఒక పూట తిన్నట్టు..ఒక పూట ఎండినట్టు…సగం కాలిన ఈ కట్టే పేగులు ఎక్కడికి దారి చూపిస్తాయో.ఆకలైన పక్షి ఎన్నాళ్లని గూట్ల ఉంటది.బయటికి రావలసినదే గదా.తన పిల్లలకి ఇంత తిండి పెట్టల్సినదే గదా…ఎక్కడైనా కష్టం చేసేదే.డిల్లీ కొ, బొంబాయి కొ, కలకత్తా కొ యాడికైన రెక్కలని సాగదీసుడే కదా?చెప్పలేం బెంగుళూరు కు మల్లోచ్చినా రావొచ్చు.”సందిగ్దంగా అన్నాడు దయావత్ ముండా.

“ఏది ఏమైనా మునుపటి పరిస్థితి రానీయగుడదు.అదే మనుషులం అదే ఊర్లు అదే ముఖాలు కావొచ్చు.కాని ఆలోచన మారాలి.పద్ధతులు మారాలి.ఇప్పుడొచ్చిన గతి ఇంకెప్పుడు రాగూడదు.”అన్నాడు అన్నీ విన్న మడ్కం రమేష్.

“అవునన్నా…వానొస్తే కూలిపోనికే మనo పాడు వడ్డ గుడిసేలం కాదు.వరదోస్తే కొట్టుకుపోవడానికి మనం చెత్త చెదారం కాదు..మనం మనుషులం..మనకు ఒక బతుకుండాలి.అందుకోసమన్న మనం కలిసి ఉండాలి.ఒక వేలు చూపిస్తే ఎవ్వడు పట్టించుకోడు.ఐదేళ్ళు కలిస్తే పిడికిలెత్తితే మన వైపు చూస్తరు.”అందుకున్నాడు మడ్కం శ్రీను.

అంతా పెనుగులాట

మొక్క పెగలడానికి భూమి తో చేస్తున్న యుద్ధం.

***

కిటికీ పక్కన కూర్చున్న లింగారాం కు ఈ చర్చలేవి పట్టలేదు.మనసంతా ఖాళీగా ఉంది.బస్సు పెద్ద పెద్ద బిల్డింగ్ లు హోల్డింగ్ లు ఫ్లై ఓవర్ లు పార్క్ లు సినిమా హాల్లు దాటుకుంటూ పోతోoది.అవన్నీ అతనికి ఇవాళ ఖాళీగా, కళా విహీనంగా కనబడుతున్నాయి.అవతల విధాన సభ మీద “ప్రభుత్వం పని, దేవుని పని” అని రాసి ఉంది.దేవుని పని చేయడానికి అసలు ప్రభుత్వం అంటూ ఒకటుందా అనుకున్నాడతను.

అన్ని భౌతికంగా కనుమరుగు అవ్వడమే కాదు.తన జ్ఞాపకాల్లోంచి ఒక్కటొక్కటే జారి అడుగులేని అగాధం లో పడిపోతున్నాయి.

ఇక ఈ బెంగుళూరు తనది కాదు.

***

స్టేషన్ వచ్చేసింది.కార్మికులు బిలబిల మoటు స్టేషన్ కు చేరుకుంటున్నారు.వాళ్ళంతా బీహార్,రాజస్తాన్,ఛత్తీస్ గడ్,జార్ఖండ్ కి చెందిన భిన్న సంస్కృతుల వాళ్ళు.వాళ్ళందరూ కలిసిన రైల్వే స్టేషన్ నదీ సంగమo ల ఉంది.

ఎందుకో అనుమానం వొచ్చి సెల్ చూసుకున్నాడు.”సావిత్రి కి సీరియస్ గా ఉంది.వెంటనే రావాలి.”మెసేజ్ పెట్టారు.అట్లాంటి మెసేజ్ లు అప్పటికే చాల వొచ్చి ఉన్నాయి.ఆ మెసేజ్ లు చూసే వరకల్లా నవనాడులు కుంగిపోయాయి.చెట్లు,గోడలు పక్షులు అన్ని మాయమైపోయి కంటి ముందు ఒక శూన్యం ఆవరిoచింది.

ఇంటికి ఫోన్ చేస్తే ఎవరు ఎత్తలేదు.ఏవో ఏడుపులు వినబడుతున్నాయి.రెండు మూడు ఫోన్ లు చేసాక తల్లి ఫోన్ ఎత్తి ఏడుస్తూ ఎదో చెప్పింది.ఏమి అర్ధం కాలేదు కానీ ఎదో జరిగిoదనేది అర్ధం అయింది.

***

“ఒక దుఃఖ గీతాన్ని ఆలపిస్తున్న

బైరాగి లా ఉంది సాయంత్రం.”

లింగా రామ్ స్టేషన్ లో ఓ మూల బెంచి మీద కూర్చున్నాడు.తన స్నేహితులు వేరే ఎదో కంపార్ట్ మెంట్ ఎక్కినట్లున్నారు.అతనికి బోరు మని ఏడవాలని ఉంది.బతుకంతా ఒక గాయం నుంచి మరోక గాయానికి,ఒక చావు  నుoచి మరో చావుకు ప్రయాణమే కదా.బరోసా ను ఇచ్చే భుజమేది…

శ్రామిక రైలు వచ్చేసింది.

కూలీలందరూ అరుపులతో కేకలతో రైలు ఎక్కేసారు.ఒకర్ని ఒకరు పలకరించుకున్నారు.జోక్ లు వేసుకుంటున్నారు.తమ తమ ఆకలిని అలసటను అనేక ప్రయాసాలను నవ్వుల కింద అణిచివేసుకుంటున్నారు.

నెమ్మదిగా రైలు కదిలింది.ఒక్కరోక్కరు సీట్లల్లో సదుర్కొని మాటల్లో పడిపోయారు.కొందరు ఉత్సాహం తో ఇండ్లల్లకి ఫోన్ చేస్తున్నారు.

మెల్లగా రైలు వేగం పుంజుకున్నది.అందమైన సువిశాలమైన వీధులను చారిత్రాత్మక కట్టడాలను దాటుకుంటూ ముందుకు పోతోoది.ఎవరో పిలిచినట్టుగా లింగా రామ్ డోర్ దగ్గరికి వొచ్చి నిలబడ్డాడు.చల్ల గాలి రివ్వున మొఖానికి తాకింది.అది లోలోపల బడభాగ్నిని చల్లార్చగలదా.

రైలు బెంగుళూరు పొలిమేరలు దాటుతోoది.అల్లంత దూరాన,”అందమైన బెంగుళూరు కి స్వాగతం”అంటూ రాసిన అందమైన బోర్డు కనబడింది.లింగా రామ్ బోర్డు వైపు బెంగుళూరు వైపు దీర్ఘంగా చూసి ఊపిరి పీల్చుకొని ఒక్కసారిగా కాండ్రించి ఉమ్మేసాడు.

రైలు వేగం అందుకుంది.

 

(మధ్యలో కవిత్వ పంక్తులు -గట్టు రాధిక మోహన్, శేషు కొర్లపాటి, మహమూద్ లవి)

 

ఉదయమిత్ర

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బహుశా నేను చదివిన మొదటి కధ వలస కార్మికులు కరోన కోసం నిర్మూలం కోసం ఘనత వహించిన ప్రబుత్వం ముందు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రకటించిన లక్డౌన్ వల్ల పడిన బాధలు. ఉదయమిత్ర గారు మనస్సును కదిలించేలా రాశారు. ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా వలస కార్మికులు బాధపడుతూనే ఉంటారు.

    కదిలించే కధ.
    “ఆకలితో పోరాడుతున్నజనం

    గెలిస్తే బతుకు,ఓడితే చావు”

  • చాలా మంచి కథ అన్న. ముగింపు సరిపోయింది. కథల్లోకి రావాల్సిన కథ.
    ఈ కథ ద్వారా నా కవిత పంక్తులకి గౌరవం దక్కించినందుకు కృతజ్ఞతలు…

  • “ప్రభుత్వం ప్రజల మీద యుద్దం ప్రకటిస్తే” వలస కూలీలు “పెకిలించిన చెట్ల” య్యారట. ఎంత చక్కటి expression. “బతుకంతా ఒక గాయం నుండి మరొక గాయానికి, ఒక చావు నుండి మరొక చావుకు ప్రయాణమేకదా!” పేద బతుకుల సోది ని ఇంతకంటే philosophical గా ఎవరు చెప్పగలరు! వలస జీవి బతుకు లోకి పరకాయ ప్రవేశం చేసి వారి బాధను కథలో పలికాడు రచయిత ఉదయమిత్ర. 🙏🏽🙏🏽

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు