హమ్మయ్య, నా పని అయిపోయింది.

వంగూరి జీవిత కాలమ్ -53

మ్మయ్య, ఎప్పుడో ఇక్ష్వాకుల కాలం లో…అనగా….1969 జూన్ లో రిసెర్చ్ స్కాలర్ గా మొదలు పెట్టిన ఈ డాక్టరేట్ అనే వెట్టి చాకిరీ పూర్తి అవడానికి సరిగ్గా నాలుగేళ్ళు ..అనగా సుమారు జూన్, 1974 నాటికి పూర్తి అయింది…అంటే నేను థీసిస్ పూర్తి చేసి సబ్మిట్ చెయ్యడానికి అనమాట. కానీ  ఇల్లు అలకగానే పండుగ కాదు. అలా అలకడానికి ముందు పశువుల శాల లోకి వెళ్లి ముడి సరుకు సేకరించుకుని, కళ్ళాపి  సిద్ధం చేసుకున్నాకే కదా ఇల్లు అలకేది. ఇంచుమించు అలాంటిదే నా డాక్టరేట్ పట్టా ఆఖరి రోజులు అని నాకు ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది.

అసలు నా పరిశోధనకి ఏ అంశం ఎంపిక చేసుకోవాలీ అనే అంశం మీద పరిశోధన చేసి ఒక నిర్దుష్టమైన నిర్ణయానికి రావడానికే సుమారు రెండేళ్ళు పట్టింది. 1972 లో ఆ నిర్ణయం అయి, ఏమీ పట్టించుకోని మా గురువుగారికి అది అర్ధం అయేలా చెప్పి ఒప్పించాను. మా గురువు గారిని “ఏమీ పట్టించుకోని” అనే అంత మాట అనడానికి ఇక్కడ ఒక తమాషా ఉదాహరణ చెప్తాను. నేను రిసెర్చ్ కి తగిన అంశం వెతుక్కుంటున్న 1969 లో ఇంగ్లండ్ లో బ్రిటిష్ హైడ్రాలిక్స్ రిసెర్చ్ అసోసియేషన్ వాళ్ళ కాన్ఫరెన్స్ కి మనం ఒక రిసెర్చ్ పేపర్  పంపిచాలి అని నాకు ఆ బాధ్యత అప్పగించారు.. నేను అర్జంటుగా అంతకు ముందు ఎవరో సగం చేసి మానేసిన ఒక ప్రాజెక్ట్ ని పూర్తి చేసి, కష్టపడి   నిబంధనలకి సరి పోయేలా వాళ్ళు పంపించిన స్పెషల్ కాగితాల మీద నా ఎక్స్ పెరిమెంటల్ డేటానీ, ఈక్వేషన్స్ నీ, గ్రాప్జ్స్ నీ  జాగ్రత్తగా టైపింగ్ చేయించాను. మా గురువు గారు మురిసిపోయి, తన పేరు ముందుగానూ, తర్వాత నా పేరూ వేసి ఇంగ్లండ్ పంపించారు. ఇది అమెరికాతో సహా అందరు ప్రొఫెసర్లూ చేసేదే!. ఆ పేపర్ ని సమీక్ష చేసిన ఒకానొక దొర గారు “ఈ పరిశోధన చాలా ‘రూడిమెంటరీ’ గా ఉన్నప్పటికీ ప్రచురిస్తాం” అని సమాధానం వ్రాశారు. ‘రూడిమెంటరీ’ అంటే ‘మౌలికమైన’ అనే అర్ధం చెప్పుకుని ఆయన మురిసిపోతూ ఉంటే నేను దాని అర్ధం “కొరతలతో కూడిన” , లేదా “కనీస ప్రమాణాలు లేని” అని అర్ధం చెప్పగానే…”ఏమయితేనేం, వాళ్ళ జర్నల్ లో వేసుకున్నారు కదా” అని భుజాలు తడుముకున్నారు. నిజానికి ఆ బి.హెచ్.ఆర్.ఎ వాళ్ళు చెప్పినట్టు  అప్పటి నా పరిశోధనా పత్రం చాలా పేలవమైనది అని నాక్కూడా తెలిసినా లండన్ వాళ్ళ జర్నల్ లో మొదటి సారి నా పేరు పడడం గొప్పగా భావించి నేను కూడా కొన్నాళ్ళు ప్రగల్భాలు పలికాను.  ఆ తర్వాత అమెరికా వచ్చే దాకా మూడేళ్ళ లో పాతిక పైగా సాంకేతిక పత్రాలు భారత దేశమే కాక ఇంగ్లండ్, జపాన్, అమెరికా దేశాల జర్నల్స్ లో కూడా ప్రచురించాను అనుకోండి. అది వేరే సంగతి. అమెరికా వచ్చాక పత్ర సమర్పణ అంతా తెలుగో తెలుగే!

ఇక 1972 లో  నా పరిశోధనా అంశాన్ని స్పష్టంగా నిర్ణయించుకున్నాక  దానికి కావలసిన యంత్ర, తంత్రాలని సమకూర్చుకుని, నేను డిజైన్ చేసిన పరిశోధనా పరికరాలని సిద్దం చేసుకోడానికి సుమారు ఆరు నెలలు పట్టింది. దాని తాలూకు ఫోటో ఒకటీ, డ్రాయింగ్ ఒకటీ ఇక్కడ పొందు పరుస్తున్నాను. మొత్తానికి నేను  అనేక  అర్ధరాత్రుళ్ళు పని చేసి,  శివరామ్ , కాశీపతి గారు, బి.వై. మూర్తీ, ఇతర మిత్రుల నిస్వార్ధ సహాయంతో సుమారు ఏడాదిన్నర పాటు అన్ని పరిశోధనలూ, పూర్తి చేసి, నాకు తోచిన పద్దతిలో సిద్దాంత గ్రంధం..అనగా డాక్ట్రరల్ థీసిస్ చేతివ్రాత ప్రతి  వ్రాసి మా గురువు గారికి ఇచ్చాను. నేను చేసిన పొరపాటు ముందు దేవుడికి దణ్ణం పెట్టుకోక పోవడం. ఎంచేతంతే అది ఆయన ఒక వారం రోజుల్లో చదివి “నీ మొహం లా ఉంది” అని బెంగాలీ ఇంగ్లీషులో నా మొహాన్న కొట్టారు. అప్పటికీ, ఇప్పటికీ నాకు అన్ని గేలన్ల చెమట ఎప్పుడూ  పట్ట లేదు…ఆఖరికి పెళ్లి కుదిరినప్పుడు కూడా! హ. హ, హా.

నా నాలుగేళ్ల శ్రమ అంతా బూడిద పాలు అయిపోయిందేమో అనేదే నా భయానికి కారణం. “ఛస్తే మరో నాలుగేళ్ళు ఈ గాడిద చాకిరీ చెయ్యను” అని నేను తెలుగు  ఇంగ్లీషు లో ఆయనకీ చెప్పగానే “పాలిపోయిన నా మొహం చూసి మా గురువు గారు, నా భుజం తట్టి, మళ్ళీ బెంగాళీ అంగ్రేజీలో “రాత్రి భోజనానికి రా, నువ్వు రాసిన ఆ సరుకు పట్రా” అన్నారు అదోలా నవ్వుతూ. నేను ఒక్కడినీ వెళ్తే  కొడతాడేమో అని మరి కాస్త భయం వేసి శివరాం నో, మూర్తినో ఇప్పుడు గుర్తు లేదు కానీ, ఎందుకైనా మంచిది అని మా గుర్విణి నీనా గారికి ఆ రోజుల్లో ఎంతో ఖరీదైన నాలుగు కాశ్మీర్ ఏపిల్ పళ్ళు కొని ఇద్దరం ఆయన ఇంటికి వెళ్ళాం. బెంగాలీ ‘భుజన్’ ..అంటే భోజనం అనమాట….అయ్యాక ఒక గంటలో ఆయనకి ఎంత అనుభవం ఉందో, నాకు లేదో అర్ధం అయిపోయింది.  ఆ గంట లోనూ ఆయన నా థీసిస్ లో ఉన్న డేటా అంతటినీ పూర్తిగా అద్భుతమైన క్రమ పద్దతిలో, చాప్టర్ల వారీగా తారుమారు చేసి అదే సమాచారాన్ని ఒక డాక్టరేట్ కి కావలసిన పద్దతిలో మార్చి పారేసి ఆ విధంగా మళ్ళీ వ్రాయమన్నారు. చెప్పొద్దూ, అది చూసి నిర్ఘాంత పోయి, మహానంద పడ్డాను. మహాకవి శ్రీశ్రీ గారి “సీసా లేబుల్ మార్చేస్తే బ్రాందీ విస్కీ అగునా” అంటే “అగును” అనే సమాధానం వచ్చింది…..అప్పుడు కాదు, ఇప్పుడూ…..అంతే..నేను శరవేగంతో పని చేసి, నా ఎక్స్ పెరిమెంటల్ దేటాకి కావలసిన మౌలిక సిద్ధాంత ప్రాతిపదికలని క్లిష్టమైన ఈక్వేషన్స్ పొందుపరిచి నా థీసిస్ తయారు చేసి ఈ సారి చాలా ధైర్యంగా మళ్ళీ మా గురువు గారికి  ఇచ్చాను. దాంతో మళ్ళీ వాళ్ళింట్లో “భుజన్’ కి మరో అవకాశం వచ్చింది. ఈ సారి ఏపిల్ పళ్లూ లేవు,, కూడా శివరాముడూ లేడు, మూర్తీ లేడు తోడుగా. అంత ప్రగాఢమైన నమ్మకం, ధైర్యం తో వెళ్ళాను అనమాట.. ఈ సారి ఆయన మొత్తం థీసిస్ అంతా తిరగేసి “బావుంది. ఆ ఆఖరి ఈక్వేషన్ కి కార్-రాజు ఈక్వేషన్ అని పేరు పెట్టి, ఆ పేరిట కొన్ని పేరాలు రాసి. డిపార్ట్ మెంట్ కి ఒకటి, వైవావోసి లో ఇండియా ఎక్జామినర్ కీ, చైర్మన్ గా ఉండే మన ఐఐటి ప్రొఫెసర్ కి ఒకటీ, లైబ్రరీకి ఒకటీ, ఫారిన్ ఎక్జామినర్ కి ఒకటీ, నీకు కావాలంటే నీకు కూడా  ఒక కాపీ మొత్తం ఏడు, ఎనిమిది కాపీలు  టైపింగ్, బైండింగ్ చేయించు. ఆ పని మీద ఉండు” అని ఓ కిళ్ళీ నా చేతిలో పెట్టి తలుపు వేసేశారు మా ‘గండర గండడు” గారు.

హమ్మయ్య అనుకుని కేంపస్ లో థీసిస్ టైపింగ్ చేసే అసమాన ప్రతిభావంతులలో ఒకరూ, మా డిపార్ట్ మెంట్ లోనే మరొక విభాగం అయిన ఇంటర్నల్ కంబస్చన్ ఇంజన్స్ లో పని చేస్తున్న జి.వి.వి.ఎస్ మూర్తి గారికి ఆ టైపింగ్ పని అప్పజెప్పాను. ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే…పి.హెచ్.డి థీసిస్ లు ఒక కాపీ కొట్టేసి, దానికి  సైలోస్తైల్ద్ కాపీలు తీస్తే ఒప్పుకోరుట. అన్నీ టైపింగ్ లోనే ఉండాలిట. దానికి వచ్చిన సమస్య ఏమిటంటే…ఆ రోజుల్లో టైప్ చేసే మొదటి కాగితం వెనకాల కార్బన్ పేపర్లు పెట్టి, ఘాట్టిగా టైప్ కొడితే మహా అయితే నాలుగు కాపీలు చదవడానికి వీలుగా వస్తాయి. ఎనిమిది కాపీలు కావాలంటే చచ్చినట్టు రెండు సార్లు కొట్ట్టవలసినదే. కేంపస్ లో కాస్త దూరాన లేక్ సైడ్ క్వార్ట్రర్స్ లో ఉన్న మూర్తి గారి ఇంటికి, ఆయన పగలు ఉద్యోగం అయ్యాక  వెళ్ళి వచ్చాక సాయంత్రం 7 గంటలకి, ఎవరిదో సైకిల్ అరువు తీసుకుని, ఆ కొండల మీద తొక్కీ, తొక్క లేక   ఆయన ఇంటికి వెళ్ళి రోజుకి పదేసి పేజీల చొప్పున మొత్తం 170 పేజీల థీసిస్ మొదటి నాలుగు కాపీలు టైప్ కొట్టించి, వాటిని కట్టలు కట్టి, ఇప్పుడే బైండింగ్ చేయిస్తే కొంప ములుగుతుందేమో అని ఒక కట్ట మా గురువు గారికి ఇచ్చాను. రెండు రోజుల తర్వాత పొద్దున్న నా ఆఫీసుకి వచ్చి “రాత్రి ఇంటికి రా. మాట్లాడాలి” అన్నారు ఆయన. మళ్ళీ నా గుండె గుభేలు మంది.

రాత్రి ఆయన ఇంటికి వెళ్ళగానే, అప్పటికే ‘భుజన్ చేసేసి, బెంగాళీ కిళ్ళీ వేసేసుకున్న ఆయన “అంతా బాగానే ఉంది కానీ….నీ థీసిస్ లో ఎక్కడో లోటు కనపడుతోంది. నువ్వు ఎక్కడా కంప్యూటర్ జోలికి వెళ్ళినట్టు లేదు. నీ థీసిస్ కి ఫారిన్ ఎక్జామినర్ గా జపాన్ లో ప్రొఫెసర్ వటానబే కి పంపిస్తాం. ఈ రోజుల్లో ఎక్స్ పెరిమెంటల్ డేటా కి కంప్యూటర్ ప్రొగ్రామింగ్ చేసిన విశ్లేషణ లేక పోతే మళ్ళీ ఇది కూడా “రూడిమెంటరీ” అనే అవకాశం ఉంది. ఏమంటావ్?” అని బంతి నా మీదకే విసిరేశాడు మా గండర గండడు. ఈ వటానబే గొప్ప పరిశోధకుడు అని ఆయన రిసెర్చ్ పేపర్లు చాలానే చూసిన నాకు తెలుసు కానీ, ఆయనే నాకు విదేశాల ఎక్జమినర్ అవుతాడు అని కలలో కూడా అనుకోకపోవడం అప్పుడు నాకు అనాలోచితంగా వచ్చిన మొదటి కన్నీటి బొట్టుకి కారణం. అప్పటి దాకా నేను ఏదో మాటవరసకి రష్యన్ భాషలో కోబాల్, మెషీన్ లాంగ్వేజ్ లాంటివి నేర్చుకుని మా ఐఐటి లో ఒక పెద్ద గదిలో ఉన్న “మిన్ స్క్” అనే ఏకైక వాక్యూమ్ ట్యూను ల కంప్యూటర్ లో కాస్త ఆడుకున్నాను కానీ అవి నాకు బొత్తిగా వంటబట్ట లేదు. ఇప్పుడెలాగరా బగమంతుడా అనేది రెండో కన్నీటి బొట్టుకి కారణం.

హమ్మయ్య…నా పని అయిపోయింది అనుకున్న నాకు నిజంగానే నా పని అయిపోయింది అని అర్ధం అయింది.

…ఈ వ్యాసం ఇప్పటికే చాలా పెద్దది అయిపోయింది కాబట్టి…..అలా నెత్తి మీద పడిన సమస్య ని నాలుగు నెలలలో ఎలా పరిష్కరించుకున్నానో…వచ్చే సారి…..సారంగ లో.

*

వంగూరి చిట్టెన్ రాజు

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • అమ్మో….భయపెట్టిర్రుగా వట్టెమయ్యా…..
    నాకైతే మా…స్త్ భయమైతుంది….
    నా Ph.D నడుస్తుంది…..
    ఎట్లా😢
    ఏం జెయ్యమంటరు????

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు