హంతక విలువలు!

ప్రతి కుల హత్య వెనుక పరువు వుంటుంది.  ప్రతి పరువు వెనుక జెండర్ రాజకీయాలు, ఆస్తి రాజకీయాలు వుంటాయి.  

నిచ్చెనమెట్ల వ్యవస్థలో ప్రతి హింసాత్మక సంఘటన వెనుక సమాజం విశ్వసించే విలువలుంటాయి.  ఆ సమాజం అంగీకరించిన ప్రతి విలువ వెనుక ఒక సమూహానికి సంబంధించిన స్వార్ధపర ప్రయోజనం వుంటుంది.  అందుకే పీడితులే కాదు పీడకులు కూడా తమ దారుణాల్ని సమర్ధించుకోగలుగుతారు.  పీడకుల్లో కొంతమంది ఆయుధాలతో వ్యక్తుల్ని హత్య చేస్తే మరి కొందరు విలువల్నే ఆయుధాలుగా ఉపయోగించి కొన్ని సమూహాల ఉనికి మీద దాడి చేసి, వారి భవిష్యత్తుని హత్య చేయటానికి ప్రయత్నం చేస్తారు.  విలువలు కనిపించని ఆయుధాలు.

వివిధ ప్రజా సమూహాల్లో హెచ్చుతగ్గులు ఆమోదింప చేయాలంటే విలువల్ని నమ్మకాల రూపంలో అమలు చేయాల్సి వస్తుంది.  జీవించి వుండగానే కాదు జీవితానంతరం కూడా ఆ విలువలు భయపెట్టగలగాలి.  అప్పుడే వాటిని ప్రజల మెదళ్ళలో బలంగా నాటుకునేలా చేయటం సాధ్యమౌతుంది.  పున్నామనరకం నుండి తప్పించేవాడు పుత్రుడే అనేది ఇందుకో సరైన ఉదాహరణ.  కొడుకు తలకొరివి పెట్టకపోతే రౌరవాది నరకాల పాల పడతామనే ఆధ్యాత్మిక విలువ చిన్న భయం కాదు.  ఆ భయం కలిగించిన పురుషస్వామ్యపు విలువ చాలా పెద్దది.  అతి బలమైనది.  వంశాలు నిలబడటాలు, వంశాంకురాలు కూడా ఇలాంటి నమ్మకలతో కూడిన విలువలే.  ఫలితం ఏం జరిగింది?  స్త్రీ కంటే పురుషుడు ఎన్నో రెట్లు శక్తివంతుడైనాడు.  తల్లిదండ్రులకి ఆడపిల్ల అవాంఛనీయమై పోయింది.  గుండెల మీది కుంపటైపోయింది.  చిత్రంగా మగపిల్లాడిని కనిచ్చే భార్య స్థానంలో స్త్రీ మాత్రం ఆస్తి అయిపోయింది.  ఎందుకంటే సంతానవృద్ధి చేసే మానవయంత్రం కదా ఆమె.

మన సమాజం శ్లాఘించే దుర్మార్గ విలువల్లో కులం చాలా ముఖ్యమైనది.  ఏ మనిషైనా ఒకే రకంగా పుడతారు.  ఒకే రకమైన శారీరిక వ్యవస్థతో బతుకుతారు.  కానీ కొన్ని కులాల్లో పుట్టిన శరీరాలు గొప్పవై పోతాయి.  దోపిడీ నిరంతరాయంగా అమలవ్వాలంటే తిరుగుబాటు గురించిన ఊహ కూడా భయపెట్టాలి.  అలాంటిదే “బ్రహ్మ హత్యా పాతకం”.  ఉత్పత్తి ప్రక్రియకి దూరంగా వుండటం మేధస్సుగా కీర్తించబడి, శ్రమ చేసే వర్గాలచే మితిమీరిన అతిగా గౌరవించబడింది.  సమాజంలో ఒక వర్గం ఎక్కువగా గౌరవించబడిందంటే మరో వర్గం దాన్ని కోల్పోవలసిందే కదా.  ఆ కోల్పోవటం ఒక్క గౌరవ రూపంలోనే కాదు కనీస జీవన ప్రమాణాల్లో కూడా జరిగింది.  ఆస్తులు వుండటం, ఆస్తులు కూడపెట్టుకోగలగటం సమర్ధతకి, హోదాకి, గౌరవానికి సంకేతంగా ఏర్పడిపోయింది.  కనుకనే మనిషిని మనిషి తొక్కేసుకుంటూ “ఎదిగిపోవటం” ఒక ఆమోదనీయ విలువగా మిగిలింది. పుట్టుక కులానికి సంబంధించిన విలువని అంటగడితే, ఆస్తి సంపాదన వర్గానికి సంబంధించిన హోదాని కట్టబెట్టింది.  రెండూ సాటి మనుషుల్ని కించపరిచే దుర్మార్గ విలువలే.

సామాజిక సంబంధాల్లోని పితృస్వామ్యానికి సంబంధించిన ఆధిపత్య విలువలు ముందుగా కుటుంబంలోనే అధికంగా పొడసూపుతాయి.  గడపదాటి బైటకి ఆడపిల్లలు, స్త్రీలు ఎంతగా అణిగి వుండాలో, మగపిల్లలు, పురుషులు ఎంత బేఫికర్ గా వుండొచ్చో ముందుగా కుటుంబంలోనే శిక్షణ ఇవ్వబడుతుంది.  రక్షణ పేరుతో నాన్న, అన్నయ్య, తమ్ముడు, కొడుకుకి ఆడపిల్లని, స్త్రీని లోబరిచి వుంచటం అలవాటు చేయటం ద్వారా గడప బైట ఆమె కదలికల్ని పరిమితం చేయొచ్చు.  ఒక్కత్తీ సినిమాకెళ్ళటం, పార్కుకెళ్ళటం చివరాఖరికి బేకరీకెళ్ళటం కూడా బరితెగింపుతనం అని విలువల భంగం పేరుతోనో లేదా అభద్రతా బూచి పేరుతోనో ఆమె కదలికల్ని సులువుగా నియంత్రించొచ్చు.  ఐతే అసలు ఎందుకు నియంత్రించాలి?  ఇంట్లోకి వచ్చే ముందు కారుకి, బైకుకి, చివరికి సైకిలుకి తాళం వేసినట్లు ఒక మూవబుల్ ప్రాపర్టీగా ఆమెని తగ్గించి, అలా వ్యవహరించటమన్న మాట.  జాగ్రత్తలు చెప్పటం వేరు.  భయపెట్టి కట్టిపడేయటం వేరు.  ఆమె కాస్తంత స్వతంత్రంగా వ్యవహరిస్తే తమ ఆస్తి చేజారిపోవచ్చు.  అలా భయపెట్టడానికి పెట్టిన ముద్దు పేరు ‘పరువు”.   అసలు ఎందుకు భయపెట్టాలి లేదా భయపడాలి?

పైన చెప్పినట్లు స్త్రీని ఒక ఆస్తిగా మన విలువలు గుర్తిస్తాయి.  ఇల్లు, పొలం వంటి భౌతిక ఆస్తులు ఒక కుటుంబంలో ఒక తరం నుండి మరొక తరానికి అందుతూ పోవటమే వ్యక్తిగత ఆస్తి ప్రధాన లక్షణం.  అలా జరగక పోతే అది వ్యక్తిగత ఆస్తిగా అంతరించి పోతుంది.  ఆ ఆస్తి తరం నుండి తరానికి అందించాలంటే భర్తకే భార్య లాయల్ గా వుండాలి. ఆ రకంగా స్త్రీ శీలానికి వ్యక్తిగత ఆస్తికి విలువలు సమన్వయాన్ని ఏర్పాటు చేస్తాయి.  ఆ ప్రక్రియని సాధ్య పరచాలంటే స్త్రీని కట్టి పడేయక తప్పదు.  ఆ రకంగా స్త్రీ “శీలం” పరువుకి సంబంధించిన విలువ అవుతుంది.  ఆమె శరీరం పరువుకి సంకేతం అవుతుంది.  పాతివ్రత్య విలువల పరమార్ధం ఇదే.  ఆమె శరీరం మరొకరి బీజానికి క్షేత్రం కావటం భర్తకి సంబంధించిన ఆస్తి నష్టం, పరువు నష్టం కాగలదు.  అదే ఆడపిల్ల అయితే ఇంటి పేరు కంటిన్యూ అవకపోయినా తన కులం పరిధిలోనే పరువుకి స్థానం వెతుక్కుంటారు.  కొద్దిరోజుల క్రితం మిర్యాలగూడలో జరిగిన ప్రణయ్ హత్య ఈ అన్ని విలువల్ని బైటపెట్టింది.

****

బహుశః శాకాహారం కారణమేమో భారతీయ కులవ్యవస్థలో బ్రాహ్మణుల తరువాత స్థానం తమదేనని వైశ్యులు అనుకుంటుంటారు.  నిజానికి బ్రాహ్మణుల కంటే వైశ్యులే ఎక్కువగా కులం విషయంలో పట్టింపుగా వుంటారు.  ఒక్క స్వాతంత్ర్య పోరాటంలో తప్పితే వారెప్పుడూ ఏ సామాజిక, సంస్కరణ, , పౌర హక్కుల ఉద్యమాల్లో పెద్దగా పాల్గొన్నట్లు కనబడరు.   కానీ వ్యవస్థని యథాతథ స్థితిలో వుంచటానికి ప్రయత్నించే ఆరెసెస్, విశ్వహిందూ పరిషత్ లలో వారు క్రియాశీలకంగా వుంటారు. వైశ్యుల్లో మానవతా దృక్పథంతో చేసే చారిటీ యాక్టివిటీ కనబడుతుందేమో కానీ సామాజిక ఉద్యమాల పట్ల సానుకూలత కనిపించదు.  ఆధ్యాత్మిక రంగాన్ని బాగా పోషించే వైశ్యులు దేవాలయ కమిటీల్లో చురుగ్గా పాల్గొంటారు.  బూర్జువా రాజకీయ పార్టీ పదవుల్లో వుండటం సామాజిక ఉద్యమంలో పాల్గొనటం కాదు కదా.  నా దగ్గర ఇందుకు సంబంధించిన గణాంకాలేవీ లేవు కానీ స్వీయ పరిశీలనలో నాక్కనిపించిన వాస్తవం ఇది.   వైశ్యుల్లో కులాంతర వివాహాలు చాలా అరుదు.  మొత్తం మీద బ్రాహ్మణీయ పల్లకీకి అతి ముఖ్య బోయీలు వీరు.  ఎంత సరదాగా, స్నేహ పూర్వకంగా కనిపించినా, వ్యవహరించినా వారు ప్రధానంగా నమ్ముకునే, ఆచరించే విలువలన్నీ శుద్ధ బ్రాహ్మణీయమే.

అందుకు కారణం నిరంతరం ధనం, ఆస్తులతో కూడిన వ్యాపారంలో వారు నిమగ్నమై వుండటం కావొచ్చు.  పైన చెప్పుకున్నట్లు భౌతిక ఆస్తి అనేది తరం నుండి తరంకి అందించినప్పుడే వ్యక్తిగత ఆస్తి అవుతుంది.  అందుకోసం స్త్రీల పట్ల ఏ మాత్రం సడలింపు లేకుండా వుండటం జరిగింది.  కట్టుబాట్లు అధికంగా వుంటాయి.   వైశ్య యువతులు, స్త్రీలు మహిళా ఉద్యమాల్లో కానీ, హక్కుల ఉద్యమాల్లో కానీ కనబడతారా అనేది సందేహమే.  ఒకవేళ కనబడినా అది చాలా అరుదు.  ఇది కరుడు కట్టిన బ్రాహ్మణీయతకి సంకేతం. (ఏదేని ఒక కులం గురించి ప్రత్యేకించి తీర్పులివ్వటం, ఎద్దేవా చేయటానికి నేను వ్యతిరేకం కానీ ఆబ్జెక్టీవ్ విశ్లేషణకి ఎవరూ అతీతం కానవసరం లేదు.)

మారుతీరావు కూడా ఆ కరుడు కట్టినతనానికి ప్రతినిధే.  అన్యాయంగానో, అక్రమంగానో సంపాదించిన తన వందల కోట్ల ఆస్తి తనకి వారసురాలైన తన కుమార్తె ఒక తక్కువ కులం వ్యక్తిని పెళ్ళి చేసుకోవటం ద్వారా అతని సంతానానికి వెళుతుందనే ఊహని భరించలేక పోయాడు.  అది తన కుమార్తె సంతానంగా అతను భావించి వుండడు.  అందుకే ప్రణయ్ హత్యకి ప్రణాళికలు వేస్తూనే అమృత కడుపులోని పిండాన్ని చిదమటానికి ప్రయత్నించాడు.  పురుషుడి నుండి పురుషుడికే తరాలు బదిలీ అవుతాయనే పితృస్వామ్య దృక్పథం అతనిది.  మారుతీరావుకే కనుక ఒక కొడుకు వుండుంటే అతను ప్రణయ్ ని హత్య చేసే అఘాయిత్యానికి పూనుకొని వుండేవాడు కాడేమో.  ఎంకంటే ఆస్తి అతను నమ్మిన విలువలు నిర్దేశించినట్లే తన తరువాత తరానికి చేరుతుంది.  అతని పరువు వెనుక ఆస్తికి సంబంధించిన ఫ్రస్ట్రేషన్ వుంది.  తన వర్గమూ, కులమూ కాని వ్యక్తి కుటుంబంలోకి తన ఆస్తికి వారసురాలైన తన కూతురు వెళ్ళటాన్ని అతను భరించలేక పోయాడు.  ఆ రకంగా ప్రణయ్ హత్యోదంతంలో నిర్ద్వంద్వంగా కులము, వ్యక్తిగత ఆస్తి, జెండర్ కోణాలు వున్నాయి.

అన్ని పై కులాల నుండి మారుతీరావుకి లభించిన నైతిక మద్దతు నిజానికి భయం పుట్టిస్తుంది.  ఈ విషయంలో అగ్రకులాలన్నీ ఏకమై ఒక యుద్ధ కూటమిగా ఏర్పడినట్లు కనబడుతున్నది.  వీళ్ళందరూ మారుతీరావుని ఓనప్ చేసుకుంటున్న ముసుగు హంతకుల్లా కనిపిస్తున్నారు.  ప్రణయ్ హత్యని బాహాటంగా సమర్ధిస్తున్నారు.  సందట్లో సడేమియా అని రిజర్వేషన్ల గురించి కూడా మాట్లాడుతున్నారు.  “ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కావాలి.  పెళ్ళిళ్ళలో కుల సమానత్వం కావాలా?” అని వితండవాదం చేస్తున్నారు.  మన విలువలు వాస్తవాల్ని ఎంత తల్లకిందులుగా చూసేవాళ్ళుగా మనల్ని తయారు చేస్తుందంటే వీళ్ళకెవరికీ ప్రణయ్ అనే యువకుడు యవ్వనంలో వుండగా హత్యకి గురై తన ప్రాణాన్ని కోల్పోయాడని కానీ, అతని కుటుంబ సభ్యులకి తీరని విషాదమని, అతని తల్లిదండ్రులకి అతని మరణం కడుపుకోతని, తన ప్రేమ కోసం ఎంతో తెగించి ప్రణయ్ తో జీవితాన్ని పంచుకుందామన్న ఆశతో కడుపులో బిడ్డని మోస్తున్న అమృత దుఃఖం కానీ పట్టడం లేదు.

వీళ్ళందరికీ మారుతీ రావు హీరో అయిపోయాడు.  తమ కులపు ఆడపిల్లల జోలికి వస్తే ఖబడ్దార్ అనే హెచ్చరిక చేసిన వీరుడైపోయాడీ దుర్మార్గుడు.  అంతేకాదు తొమ్మిదో తరగతి పిల్లని ట్రాప్ చేసిన దుర్మార్గుడిలా ప్రాణాలు పోగొట్టుకున్న ప్రణయ్ కనబడుతున్నాడు.  ఆ సమయంలో అతనిదీ అదే వయసనే ఇంగితాన్ని వదిలిపెట్టేస్తున్నారు.  వాళ్ళిద్దరికీ పెళ్ళి కాకుండానే ఆ అమ్మాయికి “కడుపు” చేసాడట. ఎదిగిన ఇద్దరు ఇష్టపూర్వకంగా ఎంజాయ్ చేయటంగా కాకుండా ఒక పురుషుడు ఒక స్త్రీకి “కడుపు” చేయటంగా చూసారు.  పితృస్వామ్యం ఒక భయంకర జెండర్ విలువని ప్రతిపాదిస్తుందనటానికి ఇంతకన్నా తార్కాణమేం కావాలి?

మరో దుర్మార్గమైన ద్వంద్వ విలువ ఏమిటంటే ఆస్తులు సంపాదనలు వుంటే చాలు – అదే పెద్ద ప్రయోజకత్వం!  ప్రణయ్ కి కానీ, ప్రణయ్ కుటుంబానికి కానీ ఏ కోశానా నేర చరిత్ర లేదు.  మారుతీరావే రకరకాల దందాలు చేసాడు.  చట్ట వ్యతిరేక వ్యాపారాలు చేసాడు.  లాండ్ మాఫియాతో చేతులు కలిపాడు.  భూ ఆక్రమణలు చేసాడు.  చివరికి మాజీ ఉగ్రవాదులతో, ఐ.ఎస్.ఐ. ఏజెంట్లతో కూడా చేతులు కలిపాడు.  అన్నింటికంటే నీచంగా అతని సహ నిందితుడు అయిన తమ్ముడు బ్లూ ఫిలిం కేసులో వున్నాడు.  మారుతీరావుకి కూడా అందులో భాగస్వామ్యం వుండొచ్చేమో అన్న అనుమానాలున్నాయి.

పెళ్ళైన లేక పెళ్ళి కాబోతున్న ప్రేమికులు శృంగారం చేసుకుంటే అభ్యంతరాలు పెట్టి అమృతని పచ్చి బూతులు తిట్టినవారికి మారుతీరావు అక్రమాలు, బ్లూ ఫిలిం ఆరోపణలు, ఉగ్రవాదులతో చేతులు కలపటం పట్ల అభ్యంతరం లేదు.  అతని సమర్ధకులకు అదేమీ కనబడటం లేదు.  అతనో అగ్ర కులస్తుడు.  అంతే.  కానీ ప్రణయ్ బి.టెక్. కంప్లీట్ చేయకపోవటాన్ని, అతని బాక్లాగ్స్ ని మాత్రం ఎద్దేవా చేస్తున్నారు. ఈ సమాజం డబ్బు చుట్టూ, కులం చుట్టూ తిరుగుతుంటుందని, దీనికి నిజాయితీ కానీ, మానవీయత కానీ లేకుండా అఘోరిస్తుందని తేటతెల్లమవటం లేదూ?  అయినా స్త్రీని పురుషుడే పోషించాలా?  ఏం స్త్రీ సంపాదించకూడదా?  తనని తాను పోషించుకోకూడదా?  ఏం చదివిందనే ప్రశ్న అమృతకి ఎందుకు వేయరు ఎవరూ?  ఎందుకు వేయరంటే కరుడు కట్టిన జెండర్ దృక్పథమే కారణం.  పురుషుడు స్త్రీని పోషించాల.  “కడుపు” చేయాల.  స్త్రీ ఎప్పుడూ పరాధీన అన్నమాట.

ప్రతి కుల హత్య వెనుక పరువు వుంటుంది.  ప్రతి పరువు వెనుక జెండర్ రాజకీయాలు, ఆస్తి రాజకీయాలు వుంటాయి.

****

సామాజిక భావజాలాల్లో, మనుషుల స్వభావాల్లో, ప్రవర్తనల్లో ఏమాత్రం మార్పు తీసుకురాని స్వాతంత్రం  ఒక స్వాతంత్రమేనా?  స్వాతంత్రమంటే జెండాలు, పాలకులు మారటం మాత్రమే కాకుండా సమాజంలో అంతర్గతంగా మనిషిని మనిషి దోచుకొవటాన్ని సౌలభ్యం చేసే దుష్ట విలువల నుండి కూడా జాతి యావత్తూ స్వాతంత్రం పొందటం కాదూ?

*

అరణ్య కృష్ణ

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి వ్యాసం. విషయాలు నిజం

  • డబ్బు సంపాదన ఎలా జరుగు తుంది అన్నది సపక్కన పెట్టేస్తారు. వాడుకోటీశ్వరుడు అంటారు.
    వాడి కోట్ల వెనుక ఎన్ని హత్యలు, ఎన్ని దొమ్మీలు ఎంత సామాజిక చీటింగ్ ఉందొ ఎవడికి పట్టదు. తనను ప్రత్యక్ష దోపిడీకి గురి చేసినా కూడా వాన్ను కోటీశ్వరుడని కాల్లకు మొక్క టానికి సామాన్య డడు రడీ!

    • మీరు అన్నది నిజమే. కానీ దాన్ని మనుషుల సంకుచిత ధోరణి అని చేతులు దులుపుకోలేం. ప్రతి సామాజ్క విలువ వెనుక లాభనష్టాలకి సంబంధించిన విలువలున్నాయి.

  • డియర్ అరణ్య కృష్ణ గారు మీ కలం నుంచి మరో మంచి విశ్లేషనాత్మక వ్యాసం.ప్రణయ్ హత్య తర్వాత అనేకమంది అనేక రకాల కవితలు, వ్యాసాలు రాశారు. కానీ మీరు genesis of the parity between male n female genders అంటే సమస్య మూలాల్ని స్పృశించి చాలా exhaustive analysis చేశారు… కానీ DNA correction ఆయితే గాని సమస్య పరుష్కారం కాదేమో నని నా అభిప్రాయం…మంచి విశ్లేషనా వ్యాసం అందించిన మీకు శుభాకాంక్షలు🙏🙏🙏

    • ధన్యవాదాలు సార్! సామాజిక సంబంధాల డీ.ఎన్.ఏ. కరెక్షన్ జరగాలన్నది నిజమే.

  • కులం, వర్గం, జండర్ కోణాల విశ్లేషణ అద్భుతంగా చేశారు.

  • “సామాజిక భావజాలాల్లో, మనుషుల స్వభావాల్లో, ప్రవర్తనల్లో ఏమాత్రం మార్పు తీసుకురాని స్వాతంత్రం ఒక స్వాతంత్రమేనా? స్వాతంత్రమంటే జెండాలు, పాలకులు మారటం మాత్రమే కాకుండా సమాజంలో అంతర్గతంగా మనిషిని మనిషి దోచుకొవటాన్ని సౌలభ్యం చేసే దుష్ట విలువల నుండి కూడా జాతి యావత్తూ స్వాతంత్రం పొందటం కాదూ?” చాలా బాగా రాశారు. ఇలరాసే వారందరూ ఒక సమూహమయితే ఎంత బావుంటుందో!.

  • చాలా బాగా విశ్లేషిస్తూ రాసారు. అవసరమైన వ్యాసం.

  • నిజమే గారాబం పేరుతో ఇక్కడ జెండర్ వివక్షత పాము రూపం దాల్చింది అంత కష్టం అనుభవిస్తున్న అమృతకు రావాల్సిన సానుభూతిని అది మింగేసింది ఆస్థి సంబంధాలు తప్ప మానవసంబంధాలు లేని కసాయి పోకడలు నిర్దయగా పరువు రోడ్లపై నెత్తురు చిందిస్తున్నాయి చాలామందికి తప్పుగా తోస్తున్న అమృత ఆక్రోశపు మాటలకు కూడా వాళ్ళనాన్నే కారకుడవుతాడు అయినా పిల్లలు వ్యక్తిగత ఆస్తులు కాదు వారు జాతి సంపద ..ప్రేమకంటే ఈవిషయంలో పెత్తనమే కనబడుతోంది చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చిన అరణ్యకృష్ణ గారికి అభినందనలు …ఎవరో..రాబోయే ..ప్రపంచానికి …కొందరు..చిన్న..నీటి..చెమ్మలవుతారు …అరణ్యకృష్ణ…అంతే…

  • మనిషి బతకడానికి కులం — మతం — దేవుడు అవసరమా ??

    సర్ –మీరు యీ ఘటనకు — రంగులు పూసి సాహితీ పరంగా భాగానే రాశారు .

    9 తరగతి లో — ప్రేమ వ్యవహారం నడుపటం కరెక్ట్
    అంటారా — అమృత మైనర్ సర్
    అమృత — ఇంటర్వ్యూ లు చూడండి — క న్న తండ్రిని ఊరి తియమనడం — ప్రణయ విగ్రహ
    స్థాపన కావాలని కోరడం ఎంతవరకు న్యాయం సర్
    మారుతి రావు ఎలా సంపాదించాడు అన్నది మనకు అనవసరం — ఎవరు సర్ — నీతి గా — న్యాయంగా సంపాదిస్తున్నది — దేశం లో —చూపిస్తారా ???
    సుందరయ్య గారి లా –ఉన్న ధీ ఎవరు — ఎక్కడ యి దోపిడీ వ్యవస్థలో ????అమృత మాటలు వింటూ ఉంటె — యిప్పటికి ఆమె ఎదుగ లే దు —హత్యా చేపించడం — తప్పే — ఎవ్వరు కాదనరు —
    మిర్యాల గూడ జనం ఒపీనియన్ వినండి –రాయడం వన్ సైడ్ గా చూడకుండా
    36 ఏళ్ళ నుండి అమెరికా లో ఉంటున్నాను — యిక్కడ నేటికి రేస్ ఫీలింగ్ ఉంది సర్
    నా ఒపీనియన్ పోస్ట్ చేస్తారో — లేదో ??
    =============
    బుచ్చి రెడ్డి గంగుల

    • సార్! సరిగ్గా మీబోటి వారి కోసమే ఈ వ్యాసం రాసింది. తొమ్మిదో తరగతి ప్రేమ కరెక్టా, తప్పా అన్న మీమాంస సరైంది కాదు. ఆ వయసులో వచ్చే ప్రేమల్ని తల్లిదండ్రులు ఎలా డీల్ చేస్తారనేది ప్రశ్న. ఆ అబ్బాయి కూడా అదే వయసువాడన్న సంగతి మర్చేపోతున్నారు మీవంటి వారు. మీ ఇంట్లో టీవీ వుందా? మీ టూత్ పేస్ట్ లో ఉప్పు లేకున్నా పర్లేదు కానీ మీ ఇంట్లో టీవీ వుంచకండి సార్. ఎందుకంటే టీవీల్లో ఇంతకంటే ఘోరంగా ప్రోగ్రాంస్, సినిమాలు వస్తుంటాయి. వాటిని చూసి చప్పట్లు కొట్టే తల్లిదండ్రుల్ని లాగి చెంప మీద కొట్టండి మీకు నిజాయితీ వుంటే. అంతే కానీ పిల్లల్ని తప్పుబట్టకండి. పిల్లలు తప్పులు చేయకుండా చూడాలి కదా పెద్దలు. చెత్త వినోదాలకి చొంగ కార్చుకోవాలి. పిల్లలు బుద్ధిమంతుల్లా వుండాలి. హెల్ విత్ ద డబుల్ స్టాండార్డ్స్. మీరు కూడా ఎక్కడో అమెరికాలో వున్నారు. మిర్యాలగూడ సంగతి మీకంటే నాకు బాగు తెలుసు. దగ్గర్లో వున్నాను. ఐనా ఇది మిర్యాలగుడ పట్టణ అంతరంగిక వ్యవహారం కాదే. కాదు. కాకూడదు.

      • మీ లాంటి వాళ్ళ కోస మే రాశా — సర్ మీ మేధా సంపత్తు ను — నేటి వ్యవస్థ — టి ,వి సీరియల్స్ — వస్తున్న సినిమాల గురించి — నేటి విద్యా విధానం గురించి –అవనీతి — నాయకుల దోపిడీ గురించి రాయండి –పోరాడండి — మనకు స్వాతంత్రం వచ్చిందని మీరు అనుకుంటున్నారు — నా ఒపీనియన్ లో స్వాతంత్రం వచ్చింది — దొరల కు — అగ్రకులాలకు — నేటికి అదే కంపు — బేధాలు – -తేడాలు ??వారసత్వ రాజకీయ వ్యవస్థ ఉన్నంత కాలం — ఏ మార్పు చూడలేము — తాత కు సెక్స్ గురించి చెప్పినట్లు — ప్రేమ గురించి ఎపుడు పుడుతుందో చెప్పారు — సర్ –నాది ప్రేమ వివాహమే — కాలేజీ కి వచ్చిన తరవాత — నాట్ 9 వ తరగతి కాదు .
        ప్రణయ విగ్రహం –ప్రణయ చట్టం అంతా రాజకీయం సర్ — యిది రొండు ఫామిలీస్ మధ్య జరిగిన సమస్య — చంపండం నేరమే — తప్పే — జానారెడ్డి ఎన్ని ఫామిలీస్ ను పరామర్శించాడు సర్ ??కోటి రూపాయిలు ?? అంతా రాజకీయం కాదా –యిది జాతీయ సమస్య కాదు — ఎలాంటి ఘటనలు ఎన్నో చూశాం –అమృత లో mental maturity –కాలేదు –wait and see –look after 2 years ??
        అనుకోకుండా యీ వారమే మీ బుక్ నెత్తురోడుతున్న పదచిత్రం — చదువుతు న్నా —గుడ్ బుక్
        =================
        బుచ్చి రెడ్డి గంగుల

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు