1
యుద్ధం అంటే అనేకం…
యుద్ధమంటే ఏకవచనం కాకపోవచ్చు.
కొన్ని లోపలి యుద్ధాలు..కొన్ని బయటి యుద్ధాలు..
అన్నీ కలగలిసి ప్రాణం తీయొచ్చు..లేదా..
ఒక్కొక్కటీ ఒక్కొక్కసారి చంపేయనూ వచ్చు.
ఊపిరి తీసుకోవడం..ఊపిరి తీసేయడం..
వేరువేరు యుద్ధాలు కావచ్చు..కాకపోనూ వచ్చు.
పసితనం..ముసలితనం..
ఒకేలాంటి యుద్ధం చేస్తుండొచ్చు.
రక్తపు మరకలో కాలిన ఎముకలో
ఒంటరవడం..యుద్ధం కావొచ్చు.
అమాయకత్వం.. భయంతో మాంసపు ముద్దలైనప్పుడు
యుద్ధం ప్రసవించి ఉండొచ్చు.
సమాధానాలు వెతుక్కోలేని సమాధులు కూడా
యుద్ధంలో మరణించి ఉండొచ్చు.
భూమ్మీద నీటితో పోటీ పడుతున్న
కన్నీటి శాతమే ఇప్పుడు యుద్ధం అయుండొచ్చు.
*
2
అలల తత్వమై
నీటి మీది రాతలేనా..
గడిచిన ప్రతి క్షణమూ చెరిగిపోయేదే..
వదులుకున్న ప్రతి క్షణమూ మాయమయ్యేదే.
అయినా..
నీటి మీద అలలుండగా రాతలెందుకు?
నిండుగా కావలించుకున్న ప్రవాహంలో..
మెరుపుల వెలుగుల్లో.. నిశి నీడల్లో..
ఎప్పటికప్పుడు జీవం పోసుకుంటూ..
అలల తత్వమై బతికేద్దామా..
అప్పుడప్పుడు ఆకాశంలోకెగిరి..
నక్షత్ర ధూళిలో కలిసిపోయి..
ఈ విశ్వానికి ప్రేమనిద్దామా..
జీవించడమే కదా జీవితమంటే..
*
శుభోదయం మేడమ్
మీ కవితలు చాలా చాలా బాగున్నాయి.
తెలుగు బాష పై పట్టు. మమకారం అభిమానం రోజురోజుకి తగ్గిస్తున్న. నేటి తరం ఇంగ్లీషు బాష వింతపోకడలకు దీటైన సమాధానమే.
నేటి జనరేషన్ కి. రేపటి యువతకు మన భాషకు మీరు ఇస్తున్న గౌరవానికి మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
మీ కవితా సారాంశాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే.
మెరుగైన సమాజం కోసం తనవంతు భాధ్యత లను మరచిన మొద్దు నిద్రలో ఉన్న ఎందరినో మేల్కొలిపే విధంగా ఉన్నాయి.