అతి సాధారణమైన నేపధ్యం నుండి వచ్చినా, అసాధారణమైన కృషిచేసి నోబెలు పురస్కారంతో పాటు అనేక ప్రతిష్టాత్మకమైన పురస్కారాలందుకున్న టోనీ మారిసన్ మొన్న ఆగష్టు 5 వ తేదీన ప్రపంచ సాహిత్య చరిత్రలో భాగమైపోయింది.
ఒక రచయిత గొప్పదనం ఎక్కడ ఉంటుంది? (ఇక్కడ రచయిత అన్న మాటలో రచయిత్రి అనికూడా అర్థం. ఈ పదాన్ని లింగ వివక్షతో ఉపయోగించడం లేదని మనవి)
రచయితకి వచ్చిన సాహిత్య బహుమతులూ, బిరుదులలోనా? రచనలలోనా? తాత్త్విక దృక్పథంలోనా? ప్రతిఫలించిన జీవితంలోనా? లేక ప్రజలు రచయితనుండి తీసుకున్న ప్రేరణ, గుర్తుపెట్టుకునే తీరులోనా? ఈ ప్రశ్నలకి ఎవరికి నచ్చిన సమాధానాలు వాళ్ళకి ఉంటాయి. Toni Morrison మాటల్లో చెప్పాలంటే, “మనం చనిపోతాం. అది జీవితానికి అర్థం కావొచ్చు. కానీ. మనం రచనలుకూడా చేస్తాం. అవి మన జీవితాన్ని అంచనా కడతాయి.” (We die. That may be the meaning of life. But we also do language. That may be the measure of our lives.” )
ఒకప్పటి అమెరికను ప్రథమ మహిళ, తదనంతరం Secretary of State గా పనిచేసిన Hillary Clinton: “మీకు ఎప్పుడైనా ఒక పుస్తకం చదవాలనిపించి, ఆ కథావస్తువుతో అప్పటి వరకు పుస్తకం రాకపోతే, అది మీరే రాయాలి” అని చెప్పి, తన సలహాని తానే ఆచరించిన చూపిన ప్రపంచంలో మనం ఉండడం మన అదృష్టం.”
ప్రస్తుతం సెనేటరు, అధ్యక్షపదవికి పోటీదారు అయిన Elizabeth Warren: “టోనీ మారిసన్ రచనలు మనకు పోరాటాలు కొత్తగా ఎలా చెయ్యాలో, కొత్తగా నాయకత్వం ఎలా వహించి ముందుకు తీసుకుపోవాలో నేర్పుతూ, ఇతరులలోని మానవత్వాన్ని మనకు ఎప్పుడూ గుర్తుచేస్తుంటాయి.”
ఆఫ్రికను అమెరికనుల జీవితాన్ని చిత్రించిన విధానానికి ఆమెకు గుర్తింపు వచ్చినపుడు, ఒక ప్రముఖ తెల్లజాతి జర్నలిస్టు ఆమెని ఇంటర్వ్యూ చేస్తూ “మీ రెప్పుడు తెల్లవారి గురించి మీ రచనలలో విపులంగా రాస్తారు?” అని అడిగితే, దానికి ఆమె, “అదెంత వివక్షతో కూడిన ప్రశ్నో మీరు ఊహించగలరా? మీ రెప్పుడైనా ఏ తెల్లజాతి రచయితనైనా మీరు ఆఫ్రికను అమెరికనులగురించి ఎప్పుడు రాస్తారు? అని అడగగలరా?” అని ప్రశ్నించింది. (పైకి మనం ఎన్ని ముసుగులు తొడుక్కున్నా, మన అంతరాంతరాల్లో కరడుగట్టుకుపోయిన జాతి/కుల/మత వివక్ష మన మాటల్లో ఎప్పుడో ఒకప్పుడు స్పష్టంగా తొంగిచూస్తూనే ఉంటుంది.)
ప్రముఖ అమెరికను నటి Kerry Washington : “నీకు ఎగరాలని ఉంటే, నిన్ను ఎగరకుండా నిరోధిస్తున్న చెత్తని విసర్జించాలి (You wanna fly, you have got to give up the shit that weighs you down.” అన్న టోనీ మాటలు లేని ప్రపంచంలో నేను ఎదగడాన్ని ఊహించుకోలేను.
ఈ వివక్ష ఎప్పుడు పోతుందన్నదానికి టోనీ ఇచ్చిన చక్కని సమాధానం: “ఈ వివక్ష అది ఎంతమాత్రమూ లాభదాయకం కాదనీ, దానివల్ల ఏ మానసిక ప్రయోజనమూ చేకూరదనీ తెలిసినపుడు దానంతట అదే పోతుంది.
44వ అమెరికా అధ్యక్షుడు Barack Obama ఆమెకు నివాళి అర్పిస్తూ: “టోనీ మారిసన్ మన జాతి సంపద. ఆమె రచనలు అందంగానే కాదు, అర్ధవంతంగా ఉంటూ మన అంతరాత్మకి సవాలు విసురుతూ, చుట్టుప్రక్కవారిపై, మరింత సానుభూతి చూపించవలసిన ఆవశ్యకతను మేల్కొలుపుతాయి. ఆమె చక్కని కథకురాలు. ఆమె పుస్తకంలో ఎంత చిక్కగా చెబుతుందో, బయటకూడా అంత ఉత్కంఠభరితంగానూ కథనం చెయ్యగలదు,” ఆమె Song of Solomon నాకు ఎలా హుందాగా ప్రవర్తించాలో నేర్పింది. (2012 లో ఆదే పుస్తకానికి అత్యున్నత పౌర పురస్కారం The President’s Medal of Honor ఆయనే స్వయంగా ఆమెకి బహూకరించారు.) ఆమె వచ్చిన నేపధ్యం అంత గొప్పగా లేకపోవచ్చు గాని అక్కడినుండి వచ్చిన ఆమె మాటల్లో ఏదో మహిమ ఉంది. ఆమె మాటలు మరి ఏ ఇతర రచయితా ప్రయత్నించలేని ఒక విధమైన నైతికావేశాన్ని మనలో రేకెత్తిస్తాయి. ఆమె భాష సంగీతాత్మకంగా, నిర్దుష్టంగా, స్పష్టంగా, ప్రత్యేకంగా ఉంటుంది. ‘అర్థం ఎటు ఉంటే భాష అటు ఒరుగుతుం’ దని ఆమె అభిప్రాయం. మనం అందరం ఆమె రచన వెనుక ప్రయాణానికి నోచుకున్న అదృష్టవంతులం.”
Instagram లో Oprah Winfrey: “మొదట్లో ఒఠ్ఠి మాట ఉండేది. టోనీ మారిసన్ దాన్ని తీసుకుని ఒక పాటగా … ఒక సాలమన్ పాటగా (Song of Solomon) , శూలా (Sula)గా, Beloved గా, అనేక సాహిత్య రూపాలుగామలిచింది. ఆమె మన అంతరాత్మకి ప్రతీక. మనందరి తరఫున భవిష్యత్తుని చూడగలిగిన ద్రష్ట. సత్యశోధకురాలు. ఆమె మాటల అర్థాన్ని పూర్తిగా తెలిసుకున్న భాషామాంత్రికురాలు. ఆమె మనని తట్టిలేపి, మన లోతైన గాయాల్ని తడిమి చూపి అర్థంచేసుకునేలా ఉద్బోధిస్తుంది.”
*
అందులో నా తప్పేమీ లేదు. కాబట్టి మీరు నన్ను నిందించడం భావ్యంకాదు. నే నే తప్పూ చెయ్యలేదు. అది అసలు ఎలా జరిగిందోకూడా నాకు తెలీదు. వాళ్ళు నా కాళ్ళ మధ్యనుండి బిడ్డను తీసి గంట గడవకముందే నాకు అర్థం అయింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని. నిజంగా పెద్ద పొరపాటే జరిగింది. ఆ పిల్ల ఎంత నల్లగా ఉందంటే నాకే భయమేసింది. కాళరాత్రంత నలుపు. సూడానీస్ అంత నలుపు. నేను తెల్లగా ఉంటాను. నా జుత్తుకూడా, లేత పసుపురంగు అంటామే, అలా ఉంటుంది. లూలా తండ్రికూడా అంతే. మా కుటుంబంలో ఎవ్వరూ ఆ రంగు దరిదాపుల్లో లేరు. ‘తారు’ నలుపుకి దరిదాపుగా ఉంటుంది. కానీ ఆమె జుత్తు మాత్రం ఒంటి రంగులోలేదు. ఆస్ట్రేలియాలోని ఆదిమ జాతులలోలా కొంచెం వైవిధ్యంగా పొడవుగా ఉంటూనే కానీ వంకీలు తిరిగి ఉంటుంది. మీరు కొన్ని తరాలముందు లక్షణాలు మళ్ళీ బయటపడ్డాయేమోనని అనొచ్చు, కానీ, ఎన్ని తరాలు ముందు? నిజానికి మీరు మా అమ్మమ్మని చూసి ఉండాల్సింది; ఆమె నల్లజాతి స్త్రీ అంటే ఎవరూ నమ్మరు. తెల్లజాతి స్త్రీగా చలామణీ అయిపోయింది. ఆమె తెల్లజాతి యువకుడినే పెళ్ళాడింది. ఆమె పిల్లలతో తనవాళ్ళగురించి పల్లెత్తు మాట మాటాడితే ఒట్టు. మా అమ్మ దగ్గరనుండిగాని, మా మేనత్తల దగ్గరనుండిగాని ఉత్తరం వస్తే, వచ్చినది వచ్చినట్టుగా, చదవకుండా వెనక్కి తిప్పిపంపేది. చివరకి వాళ్ళకి అర్థం అయింది. ఆమెకి ఏ ఉత్తరాలూ రాయవద్దని పరోక్షంగా చెబుతున్నట్టు. దానితో ‘ఆమె మానాన్న ఆమెని ఉండనీ’మని ఉత్తరాలు రాయడం మానుకున్నారు. ఆ రోజుల్లో తెలుపూ-నలుపూ మిశ్రమంలో పుట్టినవారందరూ, వాళ్ల శరీరం రంగూ, జుత్తు రంగూ గాని తెల్లవారిగా చలామణీ అవడానికి అనుకూలంగా ఉంటే, అదే పని చేసే వారు. అసలు ఎంతమంది తెల్లగా కనిపిస్తున్నవారి నరాల్లో నీగ్రో రక్తం ప్రవహిస్తోందో మీరు ఊహించగలరా? అంచనా వెయ్యండి చూద్దాం. నేను విన్నది 20శాతం దాకా ఉండొచ్చని. అంతదాకా ఎందుకు, స్వయంగా మా అమ్మ, లీలా మే, తెల్ల దొరసానిగా చెలామణీ అయిపోగలదు. కానీ, తనకి అలా చెయ్యాలనిపించలేదు. అటువంటి నిర్ణయం తీసుకున్నందుకు తను ఎటువంటి మూల్యం చెల్లించవలసి వచ్చిందో ఆమే నాతో స్వయంగా చెప్పింది. మా అమ్మా నాన్నా పెళ్ళిచేసుకుందికి ప్రభుత్వ కచేరీకి వెళ్లినపుడు, అక్కడ నల్లవారికోసం ఉంచిన బైబిలుమీద చేయి ఉంచి ప్రమాణం చెయ్యవలసి వచ్చిందట. రెండవ బైబిలు తెల్ల వారి కోసం. బైబిలు! వేరు వేరుగా! మీరు ఊహించగలరా? మా అమ్మ ధనవంతులైన తెల్లవారి ఇళ్ళల్లో పనిచేసేది. ఆమె చేసిన ప్రతి వంటకమూ తిన్నారు వాళ్ళు. వాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు పట్టుబట్టి మరీ వీపు తోమించుకునే వారు. పాపం ఆమె ఇంకా ఎటువంటి పనులు చెయ్యవలసి వచ్చిందో భగవంతునికి ఎరుక. కానీ, వాళ్ళు ముట్టుకునే బైబిలు ముట్టుకుందికి మాత్రం పనికి రాదు!
మనుషుల్ని నేను తెల్లవాళ్ళనీ, నల్లవాళ్ళనీ వేరుచేసి మాటాడడం మీలో కొందరికి నచ్చకపోవచ్చు గానీ, శరీరం రంగు ఎంత లేతగా ఉంటే అంత మంచిది, క్లబ్బులోనూ, మనం ఉండే కాలనీలలో, చర్చిల్లో, యూనివర్సిటీ మహిళా విద్యార్థి సంఘాల్లో, ఆ మాటకొస్తే తెల్లవాళ్ళకోసం నడిపే పాఠశాలల్లోకూడా. అది లేకుండా, నేను నా ఆత్మగౌరవాన్ని కాపాడుకునే దెలా? మందులషాపుల్లో నామీద ఉమ్మేయకుండా ఉండాలంటే, బస్సు స్టాపుల్లో పక్కకి గెంటేయకుండా ఉండాలంటే, తెల్లవాళ్ళు రోడ్డుమీద హాయిగా కాలిబాటమీద నడవడానికి పక్కకాలువల్లోంచి నడవవలసి రావడం తప్పించుకోవాలంటే, తెల్లవాళ్ళకి ఉచితంగా ఇచ్చే కాగితంసంచీకి పచారీకొట్టులో ఒక నికెల్ ఎక్కువ ఇవ్వకుండా ఉండాలంటే, తెల్లతొక్క అవసరం. వాళ్ళు రకరకాల పేర్లుపెట్టి పిలవడం గురించి ఇక చెప్పనవసరం లేదు. నేను ఇవన్నిటిగురించే కాదు, ఇంకా చాలా చాలా వాటి గురించి విన్నాను. మా అమ్మ, తన చర్మంరంగు వల్లనే తను కొనుక్కునే టోపీలు మార్చి మార్చి చూసుకున్నా, పెద్ద పెద్ద డిపార్ట్ మెంట్ స్టోర్ లలో స్త్రీల అవసరాలకోసం కేటాయించిన గదులు వినియోగించుకున్నా అభ్యంతరాలు ఎదుర్కోలేదు. మా నాన్న కూడా స్టోర్ల వెనుక గదుల్లో కాకుండా, ముంగిటనే తన షూ లు సరిపడుతున్నాయో లేదో చూసుకోగలిగేవాడు. వాళ్ళు దాహంతో గొంతు పిడచగట్టుకుపోతున్నా, మా అమ్మా, నాన్నా ఎన్నెడూ “నల్లవాళ్లకి మాత్రమే” అని కేటాయించబడిన చోటుల్లో నీళ్ళు తాగేవారు కాదు.
ఈ మాట అనడం నాకు నచ్చదుగానీ, మొదటినుండీ ప్రసూతివార్డులో నా బిడ్డ లూలా ఏన్, నాకు గొప్ప ఇబ్బందులు తెచ్చిపెట్టింది. పుట్టినపుడు ఆమె చర్మం అందరి పిల్లల్లాగా, ఆఫ్రికన్ పిల్లలతో సహా, లేత రంగులోనే ఉండేది. కానీ చాలా త్వరగా త్వరగా రంగు మారిపోయింది. నా కళ్ళముందే తను నీలవర్ణంలోకి మారిపోయినపుడు నాకు నిజంగా పిచ్చెత్తిపోతుందేమోననిపించింది. క్షణంసేపే అయినప్పటికీ, నాకు నిజంగా పిచ్చెత్తిపోయిందికూడా: ఎందుకంటే, నేనప్పుడు దుప్పటీ ఆమె ముఖంమీద గట్టిగా నొక్కిపెట్టి ఊపిరాడకుండా ఉండడానికి ప్రయత్నం చేశాను. కానీ నే నాపని పూర్తిచెయ్యలేకపోయాను… ఆమె అంత ఘోరమైన రంగులో పుట్టి ఉండకూడదని ఎంతగా నే ననుకున్నప్పటికీ. నాకు ఆమెను దూరంగా ఏదైనా అనాథశరణాలయానికి ఇచ్చేద్దామన్న ఆలోచనకూడా వచ్చింది. కానీ, చర్చి వాకిట్లో పిల్లల్ని వదిలేసే తల్లుల్లో నేనూ ఒకతె నవడానికి మనస్కరించ లేదు. అది ఎంతవరకూ నిజమో తెలీదు గాని, నేను ఈ మధ్యనే విన్నాను: జర్మనీలో తెల్లగా వెన్నముద్దల్లా ఉండే దంపతులకి, బహుశా కవలలై ఉంటారు, ఇద్దరు పిల్లలు పుట్టారట. అందులో ఒకబిడ్డకు ఆ రంగు ఎలా వచ్చిందో తెలీదు, నల్లగా ఉంటుందట. నాకు తెలిసిందల్లా ఒక్కటే. లూనాకి పాలు త్రాపినప్పుడల్లా నల్లనిపిల్లకి పాలుత్రాపుతున్నట్టు అనిపించేది. నేను ఇంటికి చేరడమే ఆలస్యం, సీసాతో పాలుపట్టడం ప్రారంభించాను.
నా భర్త లూయీ పోర్టరుగా పనిచేసేవాడు. తను మొదటిసారి నన్ను చూడడానికి వచ్చినపుడు అతని కళ్ళలో నేను నేనేనా అన్న అనుమానమూ, బిడ్డను చూసినపుడు అదెక్కడో వేరే గ్రహం మీంచి ఊడిపడినట్టు చూస్తున్నా డనిపించింది. అతనెన్నడూ తిట్లూశాపనార్థాలూ పెట్టే మనిషికాదు. కానీ అతను ఎప్పుడైతే, “ఏమిటిది?” అని అన్నాడో, నాకు అర్థం అయింది. ఏదో ప్రమాదం ముంచుకొస్తుందని. మా ఇద్దరి మధ్యన తగువులకీ, వాదోపవాదాలకీ కారణం అదే. మా దాంపత్యం ముక్కలైంది. అప్పటివరకూ మూడేళ్ళపాటు ఎంతో హాయిగా ఉండేవాళ్లం. కానీ తను పుట్టిన తర్వాత అతను నన్ను నిందించడం ప్రారంభించాడు. లూలా ఏన్ ని పరాయిదానిగా, అంతకుమించి, శత్రువుగా చూడటం ప్రారంభించేడు. ఆమెను ఒక్కసారికూడా తాకి ఎరుగడు.
నేను మరోపురుషుడి వెంట తిరగలేదని అతన్ని నమ్మించడానికి ప్రయత్నం చెయ్యలేదు. ఎందుకంటే, ఎన్ని చెప్పినా అతను నేను అబద్ధం ఆడుతున్నాననే అనుకుంటాడు. మేము వాదించుకుని వాదించుకుని, చివరకి విసిగెత్తి నేనే అన్నాను: ఆ రంగు వస్తే గిస్తే మీ వంశంనుండే వచ్చుండాలి, మా ఇంటా వంటా ఇలాంటి రంగు లేదని. అదిగో, సరిగ్గా అప్పుడే మా ఇద్దరి మధ్యా ఉన్న బంధం పుటుక్కుమంది. తను దిగ్గునలేచి ఎక్కడికో వెళ్లిపోయాడు. నేను బతకడానికి అంతకంటే చవకలో అద్దెకి ఇల్లు వెతుక్కోవలసి వచ్చింది. నాకు చాతనయినంతలో మంచి ప్రయత్నమే చేశాను. అందుకే తెలివిగా, ఇంటికోసం వెతుకుతున్నప్పుడు లూలాని నాతో తీసుకుపోలేదు. నా పిల్లని చూడడానికి వయసులోఉన్న దగ్గరబంధువు దగ్గర వదిలేదాన్ని. తనని బయటకూడ అంతగా తిప్పడానికి తీసుకెళ్ళేదాన్ని కాదు. ఎందుకంటే ఎప్పుడైనా తనని పిల్లల తోపుడుబండిలో తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తే, ఏదో ముచ్చటగా పలకరిద్దామని ఎవరో ఒకరు తొంగిచూడక మానరు, తర్వాత గతుక్కుమని వెనకడుగు వెయ్యదమో చిరాగ్గా చూడడమో చెయ్యక మానరు. దాని వల్ల మనసు బాధపడుతుంది. మా ఇద్దరి చర్మాల రంగులూ తారుమారయి ఉంటే, నేనే పిల్లకి సేవచేస్తూ ఉండేదాన్ని. కానీ ఊర్లో మంచిజాగా అనుకున్నచోట అద్దెకు ఇల్లు దొరకడం అంత సులభం కాదు… అందులోనూ నల్లవాళ్లకి, వాళ్ళ శరీరం రంగు ఎంత లేతరంగులో ఉన్నప్పటికీ. లూలా ఏన్ పుట్టిన 90లలో అద్దెకు వచ్చేవారిపట్ల వివక్షచూపిస్తే శిక్షించడానికి చట్టం పకడ్బందీగానే ఉండేది. అయితే ఏం ప్రయోజనం, ఇంటి యజమానులు దాన్నిఖాతరుచేసేవారు కాదు. అద్దెకివ్వకుండా ఉండడానికి ఎన్ని సాకులు వెతకాలో అన్ని సాకులూ వెతికేవారు. అయితే నేను మా ఇంటి యజమాని ‘లీ’ విషయంలో అదృష్టవంతురాలినే; ముందు చెప్పినదానికంటే 7 డాలర్లు అద్దె పెంచినా, ఒక్క క్షణం అద్దె ఇవ్వడం ఆలస్యం అయితే సర్రున లేచినా.
అందుకని లూలాతో నన్ను “అమ్మా” అనో, “మమా” అనో పిలవకుండా, “స్వీటీ” అని పిలవమనేదాన్ని. అలా పిలవడం వల్ల ఏ ఇబ్బందీ ఉండదు. ఆ పిల్ల అంత నల్లగా ఉండడమూ, అంత దళసరి పెదాలతో “మమా” అని నన్ను పిలిస్తే చూసేవాళ్ళు బిత్తరపోతారు. దానికి తోడు ఆ పిల్ల కళ్ళు చాలా చిత్రంగా రంగులో ఉంటాయి, కాకినలుపులో నీలం కలిపినట్టు. ఆ కళ్లు మాంత్రికురాలాలి కళ్ళలా భయంకొలుపుతూ ఉంటాయి.
అలా, చాలాకాలం మే మిద్దరమే ఉండవలసి వచ్చింది. ఇక భర్త వదిలేసిన స్త్రీ పడే కష్టాలగురించి మీకు నేను చెప్పనక్కరలేదు. కొన్నాళ్ళకి లూయీ మమ్మల్నిద్దర్నీ అలా విడిచిపెట్టడం బాగులేదనుకున్నాడో ఏమో, కొన్ని నెలలు పోయేక నేను ఎక్కడికి మకాం మార్చేనో తెలుసుకుని తనంత తానే, నేను అడక్కపోయినా, కోర్టుకెక్కి గోలచెయ్యకపోయినా ప్రతి నెలా డబ్బులు పంపిస్తుండే వాడు. అతను నెల నెలా పంపే 50 డాలర్లతోనూ, నేను రాత్రిపూట ఆసుపత్రిలో చేసే ఉద్యోగంతోనూ నేనూ, లూనా ఏన్ ప్రభుత్వం ఇచ్చే “సంక్షేమం” డబ్బులుమీద ఎక్కువకాలం ఆధారపడడం తప్పింది. అదీ ఒకందుకు మంచిదే. నిజానికి వాళ్ళు దాన్ని ‘సంక్షేమం’ అనడానికి బదులు మా అమ్మ చిన్నపిల్లగా ఉన్నప్పుడు వాడే మాట, ‘సహాయం’ అని వాడి ఉంటే బాగుండేది. ఆ మాట ఎందుకు మెరుగంటున్నానంటే, మీరు మీ కాళ్ళమీద నిలబడేదాకా అది చేయి ఆనుకుందికి తాత్కాలికంగా అందిచ్చే ధనసహాయం కనుక. అదిగాక, ఆ ‘సంక్షేమం’ అందిచ్చే గుమాస్తాలు, ఉచ్చిష్టం కన్నా నీచులు. ఎలాగో నాకు పని దొరికి వాళ్ల అవసరం నాకు తప్పినప్పుడు, వాళ్ళు జీవితకాలంలో సంపాదించిన దానికంటె ఎక్కువ డబ్బులే సంపాదించేదాన్ని. వాళ్ళ కొంచెపు బుద్ధులు బహుశా వాళ్ళు అరకొరగా అందుకునే జీతాలవల్లే వచ్చి ఉంటుంది. అందుకనే మమ్మల్ని వాళ్ళు ముష్టివాళ్లలా చూసే వారు. ముఖ్యంగా వాళ్ళు లూలా ఏన్ ని చూసి, నన్ను చూసినపుడు వాళ్లని నేనేదో మోసం చేస్తున్నట్టు చూసేవారు. పరిస్థితులు మెరుగుపడ్డాయి గాని, నేను చాలా జాగ్రత్తగా ఉండవలసి వచ్చేది. ముఖ్యంగా లూలా ఏన్ పెంపకం విషయంలో. నేను చాలా కఠినంగా, నిష్కర్షగా ఉండవలసి వచ్చేది. లూనా ఏన్ కి ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, తలదించుకుని ఎలా మసలుకోవాలో, తనవల్ల తగవులు రాకుండా ఎలా ఉండాలో తెలుసుకోవలసిన అవసరం ఉంది. తనపేరు ఎన్ని సార్లు ఎలా మార్చుకుంటుందో నేను లక్ష్యపెట్టను. కానీ, తన చర్మంరంగు శిలువలా తను జీవితకాలం మోయాలి. అది నా తప్పు కాదు. కాదు. ముమ్మాటికీ కాదు.
అయితే ఒకటి మాత్రం నిజం. లూలా చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఆమెని నేనెలా చూసేదాన్నో గుర్తుకొచ్చినపుడు బాధ కలిగేది. కానీ మీరొక విషయం అర్థం చేసుకోవాలిక్కడ: తనని కంటికిరెప్పలా కాపాడవలసిన బాధ్యత నామీద ఉంది. తనకి ప్రపంచం గురించి బొత్తిగా తెలీదు. తను తప్పు చెయ్యక పోయినా, ఆ చర్మం రంగుతో, తను చాలా దురుసుగా, ఎదురులేనట్టు ప్రవర్తిస్తానంటే కుదరదు. అందులోనూ తను ఎదిరించి మాటాడినా, బళ్ళో తగవులు తెచ్చుకున్నా బాల నేరస్థుల జైలుకి పంపే అవకాశం ఉన్న ప్రపంచంలో; తనని ఉద్యోగానికి ఎంపిక చెయ్యడానికి చివరగానూ, తొలగించాలంటే ముందుగానూ ఆలోచించే ప్రపంచంలో. తనకి ఆ విషయాలు ఏవీ తెలియవు. తన శరీరంరంగు తెల్లవాళ్లని ఎంతగా భయపెడుతుందో, ఆమెని వాళ్ళు ఎంత అవహేళన చేస్తారో, లేదా, దాన్ని అవకాశంగా తీసుకుని మోసగిస్తారో ఆమెకు అవగాహన లేదు. నా కిప్పటికీ గుర్తే. నే నోసారి పాపం, ఒక అమ్మాయిని చూసేను. ఆమె లూనా అంత నల్లగాకూడా ఉండదు. నిండా పదేళ్ళు ఉంటాయో లేదో. కొంతమంది తెల్ల కుర్రాళ్ళు గుంపుగా వస్తూ, ఒకడు ఆ అమ్మాయి కాళ్లలో కాళ్ళు పెట్టి పడదోశాడు. ఆమె ఎలాగో కష్టపడి కష్టపడి లేవబోతుంటే మరొకడు తన పాదం ఆమె వీపుమీద గట్టిగా మోపి మళ్ళా బోర్లాపడదోశాడు. ఏదో ఘనకార్యం చేసినట్టు వాళ్ళు ఆమెని చూస్తూ పొట్టచెక్కలయ్యేలా నవ్వుకుంటున్నారు. ఆమె వెళ్ళి చాలాసేపయినా, వాళ్ళింకా తాము చేసిన పనికి గర్వంగా నవ్వుకుంటూనే ఉన్నారు. నేను బస్సులో వెళూతూ కిటికీలోంచి ఆమె పరిస్థితి గమనించేను గనుక గాని, నేనే గనక అక్కడ ఉండి ఉంటే, ఆ చెత్త వెధవల నుండి ఆమెని రక్షించి ఉండేదాన్ని. ఎలాగయితే నేం. నే చెప్పిన పాఠాలన్నీ ఆమెకి వంట బట్టాయి. ఇప్పుడామె నెమలిలా తిరుగుతుంటే నాకు ఎంతో గర్వంగా ఉంది.
మీరో విషయం గుర్తుపెట్టుకోవాలి. నే నేమంత దుర్మార్గపు తల్లిని కాను. నే నామె బాగోగులు చూడాలి కాబట్టి నా ఒకే ఒక్క బిడ్డ మనసు గాయపడేలా ఒకటి రెండు పనులు చేసుంటే చేసుండవచ్చు. అది నా బలహీనత. దాని కంతటికీ కారణం ఆమె వంటిరంగువల్ల వచ్చే ప్రమాదాలు మనసులో మసలడమే. మొదట్లో ఆమె శరీరంరంగు దాటి ఆమె ఎవరో, ఏమిటో చూడలేకపోయాను. ఆమెని ఆమెగా ప్రేమించలేక పోయాను. కానీ నాకు మనసులో ప్రేమలేకపోలేదు. నిజంగానే ఉంది. ఆమె కూడా ఈ సంగతి గ్రహించే ఉంటుంది. గ్రహించి ఉంటుందనే నే ననుకుంటున్నాను!
గత రెండు సార్లూ నేనామెని చూసినపుడు, చెప్పాలంటే, నేను తలత్రిప్పుకోలేకపోయినంత అందంగా కనిపించింది. ఆమెలో తెగువ, ఆత్మవిశ్వాసం స్పష్టంగా కనిపించేయి. ఆమె నన్ను చూడడానికి వచ్చిన ప్రతిసారీ ఆమె అంత నల్లగా ఉంటుందన్న విషయమే మరిచిపోయాను. కారణం, ఆమె తన రంగుని తెల్లని దుస్తుల్లో తనకి అనుకూలంగా మలుచుకుంది.
కానీ తను నాకు గట్టి బుద్ధే చెప్పింది. అసలు నేను ఆ విషయం ఎప్పుడో గ్రహించాల్సింది. మనం పిల్లలని ఎలా చూస్తామన్నదే ముఖ్యం. అది మాత్రం వాళ్ళు ఎప్పుడూ మరిచిపోరు. తనకు మొట్టమొదటి అవకాశం చిక్కడమే తడవు, నన్ను ఆ అద్దె కొంపలో ఒక్కర్తినీ విడిచిపెట్టి వెళ్లిపోయింది. నా నుండి ఎంత దూరం పారిపోగలదో అంత దూరం పారిపోయింది. జాగ్రత్తగా చదువుకుని కాలిఫోర్నియాలో మంచి ఉద్యోగం సంపాదించుకుంది. తను నాకు ఫోను చెయ్యదు. చూడడానికి రాదు. అప్పుడప్పుడు డబ్బులు మాత్రం పంపిస్తుంది. తనని చూసి ఎన్నాళ్ళయిందో నాకు గుర్తు లేదు.
నగరంలోని ఖరీదైన పెద్ద పెద్ద ఆసుపత్రులకంటే, నాకు ఈ Winston House ఆసుపత్రే నచ్చింది. ఇది చాలా చిన్నగా ఉన్నా, ఎంతో సౌకర్యంగా, తక్కువ ఖరీదులో, 24 గంటలూ నర్సులూ, వారానికి రెండు రోజులు డాక్టరూ అందుబాటులో ఉంటూ చాలా బాగుంది. నాకింకా 63 ఏళ్ళే. చచ్చే వయసు కాదు. కానీ, ఏదో బలమైన ఎముకల జబ్బుతో ఇక్కడకి వచ్చి చేరాను. కనుక మంచి వైద్య సహాయం చాలా అవసరం. రోగం వల్ల వచ్చిన నీరసమూ, నొప్పీ కంటే, ఏమీ తోచకపోవడం ఎక్కువ బాధిస్తోంది. అదృష్టం కొద్దీ నర్సులు చాలా చలాకీ అయిన వాళ్ళు. నేను త్వరలోనే అమ్మమ్మని కాబోతున్నానని చెప్పగానే, ఒకామె నా బుగ్గమీద ముద్దు పెట్టుకుంది. ఆమె నవ్వూ, ఆమె చేసినపొగడ్తా ఏ పట్టాభిషేకం జరుగబోతున్న వారికో అరుదుగా దొరికేవి. లూలా ఏన్ నుండి నాకు వచ్చిన నీలం రంగు చీటీ లో ఆమె వ్రాలు నర్సుకి చూపించాను. అంతే! తను తన పేరుతో కాకుండా “వధువు”అని సంతకం చేసిందనుకోండి, అది వేరే సంగతి. దాన్ని నేనంతగా పట్టించుకో లేదు. ఆమె రాసిన మాటలు చదువుతూంటే పట్టలేని ఆనందంతో తలతిరుగుతుందేమో నని పించింది. “నీకో సంతోషకరమైన విషయం చెప్పనా స్వీటీ? ఈ వార్త నీకు చెబుతుంటే నాకు ఎంతో ఆనందం కలుగుతోంది. నేను త్వరలోనే బిడ్డకి తల్లిని కాబోతున్నాను. నాకు పట్టలేని సంతోషంగా ఉంది. నీకు కూడా అలాగే ఉందని భావిస్తున్నాను.” నా మట్టుకు నాకు ఆ పట్టలేని ఆనందం బిడ్డకోసమే గాని, బిడ్డ తండ్రికోసం కాదనిపిస్తోంది. ఎందుకంటే బిడ్డ తండ్రి గురించి ఎక్కడా చెప్పలేదు. అతనుకూడా తనలాగే నల్లగా ఉంటాడా? అలా అయితే, నేను బెంగపడినట్టు తను బెంగపడనక్కరలేదు. నా చిన్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు చాలా మారిపోయాయి. ఇప్పుడు ఆ రంగువాళ్ళు ఎక్కడపడితే అక్కడ, టీవీల్లో, ఫేషను పత్రికల ముఖచిత్రాలమీదా, వ్యాపార ప్రకటనల్లో, చివరకి సినిమాల్లో నటీనటులుగా కూడా కనిపిస్తున్నారు.
కవరుమీద తన చిరునామా లేదు. అంటే, నే నెంత మంచి ఉద్దేశ్యంతో ఆమె సుఖంకోరి కట్టుదిట్టాల్లోపెట్టి తనని పెంచినా, తన దృష్టిలో నేనింకా చెడ్డతల్లినే నన్నమాట. నేను చనిపోయేదాకా నన్ను శిక్షిస్తుందన్నమాట. నాకు తెలుసు నన్ను తను అసహ్యించుకుంటోందని. మా ఇద్దరిమధ్యా ఉన్న ఒకే ఒక బంధమల్లా ఆమె నాకు పంపించే డబ్బే. నేను ఆ డబ్బులు పంపుతున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవలసిందే. లేకపోతే, ఆసుపత్రిలో వాళ్ళిచ్చేవి కాకుండా ఏది అధికంగా కావలసి వచ్చినా, తక్కిన రోగుల్లా, నేనూ ముష్టెత్తుకోవాలి. ఇప్పుడు నేను “సోలిటేర్” ఆడుకోదలిస్తే, నా కొత్త పేక నేను కొనుక్కోగలను. ఆరుబయట బల్లమీద బాగా ఆడి ఆడి మురికిపట్టిన పేకతో ఆడవలసిన పనిలేదు. ముఖానికి రాసుకునే క్రీం నాకు నచ్చినది నేను కొనుక్కోగలను. అయితే నన్ను నేను మభ్యపెట్టుకోను. ఈ డబ్బులు పంపించడమంతా, నా నుండి దూరంగా ఉండడానికీ, తన మనసులో ఎక్కడైనా నన్ను ఉపేక్షిస్తున్నానన్న భావన తలెత్తితే, దాన్ని శాంతపరచుకుందికీ.
నేను కృతఘ్నురాలిగా, చిటపటలాడే మనిషిగా కనిపిస్తే, దానికి కొంతవరకు నా మనసులోపలి పొరల్లో నన్ను దొలిచే అపరాధ భావనే కారణం. నేను చేసినవీ చెయ్యనివీ చిన్న చిన్న తప్పులే కారణం. తను మొదటిసారి రజస్వల అయినపుడు నేను ఎలా ప్రవర్తించానో నాకింకా గుర్తుంది. తను తడబడినపుడు, ఏదైనా వస్తువు క్రింద పడేసినపుడూ నే నెంతగా తనమీద అరిచేదాన్నో నాకు జ్ఞాపకమే. పుట్టినపుడు ఆమె నల్లని శరీరచ్ఛాయ నన్ను కలవరపెట్టడమూ నిజమే. అంతేకాకుండా, దాన్ని అసహ్యించుకున్నానన్న మాట కూడా వాస్తవమే. మొదట్లో నే నామెని… వద్దు, అటువంటి ఆలోచనల్ని నా జ్ఞాపకాల్లోంచి తుడిచిపెట్టాలి. వాటివల్ల ప్రయోజనం లేదు. ఉన్న పరిస్థితుల్లో, నాకు చాతనయినంత వరకు ఆమెకి మంచి చేశాననే చెప్పాలి. నా భర్త నన్నూ నా బిడ్డనీ విడిచిపెట్టి వెళ్లిపోయినపుడు, లూలా ఏన్ నాకో పెను భారం. నేను భరించలేనంత. అయినప్పటికీ దాన్ని భరించేను.
నిజమే! ఆమె పట్ల నేను కఠినంగా ప్రవర్తించేను. మీరుకూడా ఆ మాట అంటారని నాకు తెలుసు. తను పన్నెండు దాటి పదమూడులోకి అడుగుపెట్టే వేళ నేను ఆమెతో ఇంకా కఠినంగా ప్రవర్తించవలసి వచ్చేది. తను మాటకిమాట ఎదురు సమాధానం చెప్పడం ప్రారంభించేది, నేను ఏది వండినా తిననని మొండికేసేది. జుత్తు చక్కగ దువ్వి జడవేస్తే, బడికివెళ్ళి జుత్తు విరబోసుకునేది. ఆమె అలా చెడుదారిపట్టడం నేను చూస్తూ ఊరుకోలేను. వెంటనే అదుపులో పెట్టి, ఆమెను పదిమందీ ఎటువంటి మాటలంటారో హెచ్చరించాను. నే చెప్పిన పాఠాల్లో కొన్ని ఆమెకి వంటపట్టేయనడనికి దాఖలా ఆమే. ఇప్పుడు చూడండి ఆమె ఎలా ఉందో? మంచి భవిష్యత్తు ఉన్న ఉద్యోగం చేసుకుంటోంది. మీరంతకంటే బాగా చెయ్యగలరా?
ఇప్పుడామె గర్భవతి కూడా. లూనా ఏన్! మంచిపని జరిగింది. మాతృత్వం అంటే కూనిరాగాలు తీయడం, షికార్లు తిరగడం, డైపర్లు మార్చడం మాత్రమే అనుకుంటే, నువ్వు త్వరలోనే పెద్ద ఆశ్చర్యానికి లోనవబోతున్నావు! ఇంతా అంతా కాదు. ఊహించలేనంత. నువ్వూ, నీ అనామకపు స్నేహితుడో, భర్తో, ముఖపరిచయస్తుడో, ఎవరైతేనేం, బహు పరాక్! బిడ్డా! చ్చిచ్చిచ్చీ!
చివరగా ఒక్క మాట! నువ్వు తల్లివైన తర్వాత, ఇప్పటివరకూ ప్రపంచం గురించి అది ఎలా ఉంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా మారుతుంది అన్న విషయాల్లో నీకున్న అభిప్రాయాలన్నీ మారిపోతాయి.
దేముడు నీకు తోడుగా ఉండి అంతా మంచే జరగాలి!
*
English Original: Toni Morrison
Note:This is a public domain unauthorized translation for non-commercial purposes as our tribute to Toni Morrison
‘స్వీట్‌నెస్’ పేరుతో ది న్యూయార్కర్ – 9 ఫిబ్రవరి, 2015 సంచికలో ప్రచురించబడిన పై రచన నిజానికి సర్వస్వతంత్రమైన కథ కాదు. ఆ సంవత్సరంలో విడుదల కాబోతున్న ఆవిడ నవల God Help the Child లో ‘Sweetness’అనే శీర్షికతో ఉన్న మూడు అధ్యాయాలు అవి. Novel excerpts ని ఇలా కథలుగా చలామణి చేసే దుష్టసంప్రదాయాన్ని (కనీసం ఆ విషయాన్ని చెప్పకుండా) ఆ పత్రిక చాలా యేళ్లుగా నిష్టగా పాటించుకుంటూ వస్తోంది! 🙂
కృతజ్ఞతలు రమణమూర్తి గారూ. ఈ కథ Sweetness కి అనువాదమే. అయితే, మీరు చెప్పిన సంప్రదాయం సంగతి నాకు తెలీదు. ఆమె రచనలకోసం వెతుకుతూంటే ఈ కథ కనిపించింది. నాకు బాగా నచ్చింది.
అభివాదములతో
ప్రియమైన శ్రీ నౌడూరి మూర్తి గారూ!
ఉపనిషత్తులని సంస్కృతం నుండి పెర్షియనులోకి అనువాదం చేసిన దారా షుకోయ్ ( షాజహాన్ – ముంతాజ్ బేగంల తొలి మగబిడ్డ, మొగలాయీ రాజకుమారుడు ) గురించి ఎంత ఆర్తిగా రాసారో, ఆగష్టు 5 వ , 2019తేదీన ప్రపంచ సాహిత్య చరిత్రలో భాగమైపోయిన టోనీ మారిసన్ గురించి అంతే ఆర్తిగా రాసారు. ‘స్వీట్‌నెస్’ కి అనువాదమే రాసారో, టోనీ మారిసన్ కి ఓ ఆర్తితో కూడిన ఓ నివాళి సమర్పించారో … పాఠకులని ఓ మెలాంఖలి లో ముంచేసారు. ధన్యవాదాలు
శ్రీ రామయ్య గారూ.
మీ అభిమానపూర్వకమైన వ్యాఖ్యకి ధన్యవాదాలు.
అభివాదములతో
Nauduri Murthy garu,
From the stirring eulogy Toni Morrison ( an American author, editor, and professor who won the 1993 Nobel Prize in Literature ) wrote for James Baldwin ( American essayist, novelist, and playwright whose eloquence and passion on the subject of race in America made him an important voice, particularly in the late 1950s and early 1960s ) :
Jimmy, there is too much to think about you, and too much to feel. The difficulty is your life refuses summation – it always did – and invites contemplation instead.
I never heard a single command from you, yet the demands you made on me, the challenges you issued to me, were nevertheless unmistakable, even if unenforced: that I work and think at the top of my form, that I stand on moral ground but know that ground must be shored up by mercy,
You gave me a language to dwell in, a gift so perfect it seems my own invention. No one possessed or inhabited language for me the way you did.
You made American English honest – genuinely international. You exposed its secrets and reshaped it until it was truly modern dialogic, representative, humane. You stripped it of ease and false comfort and fake innocence and evasion and hypocrisy. And in place of deviousness was clarity. You replaced lumbering platitudes with an upright elegance.
For thousands and thousands of those who embraced your text got ennobled themselves, became unshrouded, civilized.
The second gift was your courage, which you let us share:
When that unassailable combination of mind and heart, of intellect and passion was on display it guided us through treacherous landscape as it did when you wrote these words – words every rebel, every dissident, revolutionary, every practicing artist from Capetown to Poland from Waycross to Dublin memorized:
”A person does not lightly elect to oppose his society. One would much rather be at home among one’s compatriots than be mocked and detested by them. And there is a level on which the mockery of the people, even their hatred, is moving, because it is so blind: It is terrible to watch people cling to their captivity and insist on their own destruction.”
Dear Ramayya garu,
From the little of her work I read and the more I read about her in tributes, I feel her words that… “your life refuses summation … and invites contemplation instead”… about James Baldwin.
Thank you once again for her lovely reference.
with best regards