“నిన్నొకటి అడుగుతాను. నీకిష్టం లేకపోతే లైట్ తీస్కోవాలి. ఓకేనా?” సందేహిస్తూ అడిగాను.
“నాకు యిష్టం లేదు అని నేను అబద్ధం ఆడాల్సింది ఏదైనా అడిగి, నేను కాదన్నాక కూడా కాళ్లావేళ్లా పడి వొప్పించెయ్ రా బాబూ. ఒంటరిగా యీ పాడు దేహాన్ని యీడ్చుకురావడం నావల్ల అయ్యేట్టు లేదు” అంది మాన్య.
“నేను అడగబోయేది అలాంటి మేటర్ కాదే” అన్నాను
“అలాంటిది కానిది అసలు మేటరెలా అవుతుందోయ్” కోపంగా అడిగింది.
“కామెడీ చేసింది చాలు. నేను చెప్పబోయేది నిజంగా సీరియస్ మేటర్” అన్నాను.
“సీరియస్ వరకూ వోకే. మేటర్ అంటే మాత్రం నేనొప్పుకోను” మళ్లీ అడ్డం పడింది.
“నేను అడగబోయేది కరెక్ట్ కాదు అని నీకనిపిస్తే మొహమాటం లేకుండా చెప్పేయొచ్చు”
“ఇందులో కరెక్ట్ కాదు అనిపించకపోడానికి ఏముంది. అలాగే కానిద్దాం” అంది.
“నేను చెప్పకముందే అది కరెక్టో కాదో ఎలా తెలిసింది నీకు?”
“మేటర్ అలాంటిది కాదు అని నువ్వన్నాక వినే మూడు వుత్సాహం మొత్తం పోయినయ్ నాకు. ఏదో వొకటి తగలెట్టండి సార్. సరే అనేసి నా దారిన నేను పోతా” అంది.
“మాగజీన్ కి కథ పంపాలి. రేపు బుధవారమే డెడ్ లైన్. ఐడియాలేం రావట్లేదు.” తర్వాత విషయం చెప్పడానికి ధైర్యం చాల్లేదు నాకు.
“ఇప్పుడేమంటావ్? జో కోయీ దేఖే మేరా జల్వా హోజాయే ఖుర్బాన్ అంటూ వొక వెచ్చని నృత్యంతో నిన్ను వుత్సాహపరచాలి. అంతే కదా. కథేం కర్మ. ఏకంగా నవలే రాసి పారేద్దువు. పేపరూ పెన్నూ తెచ్చుకో. అవునూ, అసలే మంగళవారం, ఐటమ్ సాంగ్స్ వర్కవుట్ అవుతాయంటావా” అంది సీరియస్ గా.
నన్ను చెప్పనిచ్చే మూడ్ లో లేదు. ఇక వుపోద్ఘాతాలతో లాభం లేదని నాకు అర్థమైంది. “మన స్టోరీనే కథగా రాద్దామనుకుంటున్నానే, నీకు అబ్జెక్షన్ లేకపోతే.”
నా మాట పూర్తి కాకముందే తన ముఖం ముభావంగా మారిపోయింది.
“నేనందుకే ముందే చెప్పాను. నీకు యిష్టం లేకపోతే నువ్వు ఫీలవ్వకూడదు అని. నేను నిన్నిలా అడిగానన్న విషయం మర్చిపో. ఇంకెప్పుడూ..”
“నా సంగతి వదిలెయ్ రా. మనిద్దరికే సొంతమైన అనుభూతుల్ని అందరి ముందూ పరిచేయడం నీకు వోకే అన్నమాట” సీరియస్ గా అంది.
“నో నో.. జస్ట్ యిన్స్సిరేషన్ కోసం. అది కూడా మన పరిచయం వరకే. ప్లీజ్. ఇక దీన్ని వదిలెయ్.”
“ఏంటి వదిలేసేది. ఇవాళ పరిచయం గురించి రాస్తావ్. రేపొద్దున యిలాంటి పరిస్థితే మళ్లీ వస్తే మన పడగ్గది సంగతులు కూడా రాసేయడానికి రెడీ అవుతావుగా..”
“పడగ్గది సంగతులా. ఎవరైనా వింటే మనిద్దరి మధ్యా వ్యవహారం ఎంత దూరం వెళ్లిందో అనుకుంటారు. మహా అయితే నాలుగు ముద్దులు, రెండు హగ్గులు.”
“కదా. నేనూ అదే చెప్తున్నా. బోడి లవ్వు, బొక్కలో స్టోరీ. ఇంతోటి దానికి నువ్వు దాన్ని గ్రంథస్తం చేయడం, ప్రపంచం దృష్టికి తీసుకురావడం. ఒక అచ్చటాముచ్చటా వేడీవెచ్చా తోడూనీడా పాడీపంటా ఏమున్నాయనీ మన కథలో” అంది. సరసం మధ్యలో యీ పాడిపంటలు ఎక్కణ్నించీ వచ్చాయో నాకు తెలీలేదు.
“అంటే నీకు అభ్యంతరం లేదనుకోవచ్చా” సందేహిస్తూ అడిగాను.
“కావాల్సినంత మషాలా కలిపి విచ్చలవిడిగా రాస్కో పోరా. ఉన్నదున్నట్టు రాసి తీరాల్సిందే అనే చాదస్తం నీకుంటే చెప్పు, క్లయిమాక్స్ కొంచెం స్పైసీగా ప్లాన్ చేద్దాం. ఏమంటావ్” కళ్లెగరేస్తూ అడిగింది.
***
మాన్య అందరిలాంటి అమ్మాయి కాదు. ప్రేమలో పడిన ప్రతివాడూ తన లవర్ గురించి యిలాగూ అనుకుంటాడని నాకు తెలుసు. కానీ తను నిజంగానే డిఫరెంట్.
ఆరు నెలల క్రితం నేను రాసిన వర్ష అనే కథ ఒక ప్రముఖ తెలుగు దినపత్రిక సండే బుక్ లో పబ్లిష్ అయ్యింది. ఆ కథ చదివి నాకు కాల్ చేసింది మాన్య.
“ఈ కథ ద్వారా ఏం చెప్పాలనుకున్నారు మీరు” అడిగింది పరిచయాలయ్యాక. తన వాయిస్ చాలా బావుంది. మనిషి ఎలా వుంటుందో తెలీకపోయినా ప్రేమలో పడిపోయేంత అందంగా.
“ఒక మనిషితో జీవితాంతం గడపాలి అనిపించేంత యిష్టం వుండడం ప్రేమ. కానీ, ఆ మనిషి మన జీవితంలో నుండీ వెళ్లిపోవాలి అనుకున్నప్పుడు, అలా వెళ్లిపోవడానికి అభ్యంతర పెట్టకపోవడం అసలైన ప్రేమ. వెళ్లిపోతున్నందుకు తను గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం లేనంత స్పేస్ యివ్వడం ప్రేమ. అదే నేను చెప్పాలనుకుంది” అన్నాను.
“నాకూ అదే అనిపించింది. నేను సరిగ్గానే అర్థం చేసుకున్నానా లేదా అనే సందేహంతో మీకు కాల్ చేశాను” అంది.
“అవునా, థేంక్యూ” అన్నాను. తన గురించిన వివరాలు ఏమైనా అడుగుదామా అనిపించింది. కానీ, కథ గురించి మాట్లాడ్డానికి కాల్ చేస్తే అడ్వాంటేజీ తీసుకున్నట్టు వుంటుందేమో అని సందేహించాను.
కాసేపాగి తనే అంది, “మీతో కాస్త మాట్లాడాలి. కలవడం వీలు పడుతుందా?”
ఆరోజు సాయంత్రం ఆరున్నరకి ట్యాంక్ బండ్ దగ్గర కలుద్దాం అని ఫిక్సయ్యాం. మామూలుగా అయితే ఐదింటికల్లా నా ఆఫీస్ అయిపోతుంది. కానీ మధ్యాహ్నం అనుకోకుండా వొక క్లయింట్ ని కలవడానికి బయటకి వెళ్లాల్సొచ్చింది. అక్కడ మొబైల్ సిగ్నల్ వుండదని ఐడియా వుంది నాకు. ఎందుకైనా మంచిదని మాన్యకి మెసేజ్ పెట్టాను. ఈరోజు కలవడం వీలు కాదు. ఇంకోసారి ప్లాన్ చేస్కుందాం అని. నా పని కంప్లీట్ అయ్యి, అక్కణ్నించీ బయటపడేసరికి ఏడు దాటింది. కవరేజ్ ఏరియాలోకి రాగానే వరసగా నోటిఫికేషన్లు. తను ఏం రిప్లై యిచ్చిందా అని వాట్సప్ వోపెన్ చేసి చూశాను. అసలు నేను పెట్టిన మెసేజ్ తనకి డెలివర్ కానే లేదు. అంటే తనింకా అక్కడే వెయిట్ చేస్తూ వుండుండాలి. వెంటనే కాల్ చేశాను.
“మీకు మధ్యాహ్నమే మెసేజ్ పెట్టాను. బ్యాడ్ లక్ అది డెలివర్ కాలేదు. ఆఫీస్ పని మీద బయటికెళ్లి యిప్పుడే వెనక్కి వస్తున్నా. సారీ..” తన రెస్పాన్స్ పట్టించుకోకుండా చెప్పుకుపోయాను.
“ఏం పర్లేదు. ఇప్పుడు రావడం వీలవుతుందా?” అడిగింది.
“పావుగంటలో వుంటాను. ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నారు?”
“రాత్ ఆయీ హై. బహుత్ రాతోం కే బాద్ ఆయీ హై. దేర్ సే, దూర్ సే ఆయీ హై. మగర్ ఆయీ హై” అంది. తనేం అంటోందో నాకు అర్థం కాలేదని నా మౌనమే చెపుతోంది.
“మఖ్దూం సాబ్ స్టాట్యూతో ఫ్లర్టింగ్ చేస్తున్నాను స్వామీ. త్వరగా వచ్చి ఆయన్ని కాపాడండి” అంది నవ్వుతూ. తను ఆమాత్రం చనువు తీసుకోవడం కూడా నాకు థ్రిల్లింగానే వుంది. చాన్నాళ్ల తర్వాత, అంత ట్రాఫిక్లో కూడా నా బైక్ స్పీడో మీటర్ ముల్లు వందని ముద్దాడింది.
“నేనూహించిన దానికన్నా హ్యాండ్ సమ్ గా వున్నారు మీరు” అంది మాన్య నన్ను చూడగానే. నాకూ అదే మాట చెప్పాలనిపించింది. “నేను కూడా మీరూహించిన దాని కన్నా అందంగా వున్నా కదా” అంది తనే. అవునన్నట్టు తలాడించి వూరుకున్నాను.
“చాలా లేటయ్యింది. అలసిపోయి వుండుంటారు కాబట్టీ స్ట్రెయిట్ గా పాయింట్ లోకి వస్తా. లవర్ కి కావాల్సినంత స్పేస్ యివ్వడం గురించి మీరు చెప్పింది కరెక్ట్ కాదని నా అభిప్రాయం. ఇంటర్ నుండీ యిప్పటివరకూ, దాదాపు పదేళ్లలో రఫ్ గా వొక డజనుసార్లు లవ్ లో పడ్డాను నేను. నా సొంత అనుభవాలతో పాటు, నా ఫ్రెండ్స్, పరిచయస్తుల్ని కూడా కలుపుకుంటే కనీసం వంద ప్రేమకథలు చూసుంటాను నేను. స్పేస్ కావాలి అని ఎవరికైనా అనిపించిందంటే వాళ్లు బ్రేకప్ కి రెడీ అయిపోయారని అర్థం. ఆ విషయం బయటకి చెప్పడానికి ధైర్యం లేదంతే. పెళ్లి చేసుకోవాలనిపించేంత ప్రేమ వున్నప్పుడు, ప్రేమించడం మొదలెట్టీ మొదలెట్టకముందే స్పేస్ కావాల్సొస్తుందా? నీమీద నాకు యింట్రెస్టు పోయింది. ఇంకొకళ్ల మీద ఆల్రెడీ క్రష్ మొదలైంది అని వోపెన్ గా చెప్పేంత యింటెగ్రిటీ లేనివాళ్లే స్పేస్, శాటిలైట్ అని కబుర్లు చెప్తారు” గుక్క తిప్పుకోకుండా మాట్లాడుతోంది.
“అన్నీ నేనే మాట్లాడుతున్నాను. మీరేం చెప్పడం లేదు” అంది మధ్యలో కాస్త బ్రేక్ యిచ్చి.
“స్పేస్ యివ్వడమే ప్రేమ అని కానీ, స్పేస్ కావాలనుకోవడం ప్రేమ లేకపోవడం అని కానీ, దేన్నీ జనరలైజ్ చేయడం నాకు యిష్టం లేదు. సందర్భాన్ని బట్టి మీరు చెప్పింది కూడా నిజమే అయ్యుండొచ్చు. బట్ కమింగ్ ఫ్రమ్ ఎ వుమన్, ఐ కన్ఫెస్ ఇది కొత్త యాంగిల్ నాకు” అన్నాను.
“మరి కథలో అంత కన్విక్షన్ ఎందుకు కనబరిచినట్టో” అంది ఆటపట్టిస్తున్నట్టు.
“ఆ కన్విక్షన్ నాది కాదు, పాత్రది. ఆ కథకి అలా రాయడం అవసరం అని ఆ క్షణానికి అనిపించింది” అన్నాను.
“నిజం చెప్పండి. మీరు చెప్పింది చాలా బావుందని నేను పొగిడి వుంటే, స్పేస్ యివ్వడమే ప్రేమ అనే స్టేట్మెంట్ ని వోన్ చేస్కోని వుండేవాళ్లు కదా మీరు” రెట్టించింది.
“చెప్పలేను. కానీ ఏం మాట్లాడితే మిమ్మల్ని ఎక్కువసేపు యిక్కడ వుంచగలనో అది మాట్లాడివుండేవాణ్ని బహుశా” అన్నాను. ఆ మాత్రం లిబర్టీ తీసుకోవడం తప్పు కాదనే ధైర్యం వచ్చింది నాకు.
“ఏయ్, కాంప్లిమెంట్ కదా. సో స్వీట్ ఆఫ్ యూ. కనీసం మీతో యీ వొక్కమాట కూడా అనిపించకుండా యింటికెళ్లిపోతే.. నా మీద నాకు బోలెడు డౌట్లు వచ్చుండేవి. పర్లేదు వెయిట్ చేసినందుకు బాగానే గిట్టుబాటయ్యింది” అంటూ నవ్వింది.
అది మొదలు. తర్వాత దాదాపు ప్రతిరోజూ కలుసుకుంటూనే వున్నాం. మీరు నుండీ నువ్వులోకి, గ్రాడ్యువల్ గా ఒరేయ్, ఏమే లోకి మారింది మా పరిచయం. మరీ తప్పదనుకున్నప్పుడు యిష్టం అనే మాట వాడుతుంది కానీ మా రిలేషన్ ని లవ్ అని పిలవడం మాన్యకి నచ్చేది కాదు. అదే అన్నాను తనతో వొకసారి.
“ఏమో మరి. ప్రేమ అనే ట్యాగ్ తగిలించుకునేవరకూ వొక వుబలాటం. ఊపిరాడ్డం లేదని అందులో నుండీ బయటపడేవరకూ యింకో ఆరాటం. ఈ డ్రామాలు మన వల్ల కాదు” అని జవాబిచ్చింది.
“నీకేవో బిటర్ ఎక్స్పీరియెన్సెస్ వున్నాయని ప్రేమకి యివ్వాల్సినంత క్రెడిట్ యివ్వకపోవడం చాలా అన్ ఫెయిర్” అన్నాను. కాదని తనేమీ ఆర్గ్యూ చేయలేదు. అలా సైలెంట్ గా వుండిపోవడం తన అలవాటు. తన ప్రవర్తన గురించి కానీ, అభిప్రాయాల గురించి కానీ నేనేదైనా కామెంట్ చేస్తే, డిఫెండ్ చేసుకోవాలని తొందరపడదు. మళ్లీ ఎప్పుడో ఆ టాపిక్ తీసుకొచ్చి తన వొపీనియన్ చెపుతుంది.
మాన్యతో వున్న యింటిమసీని బట్టి నాకు తనతో ఎప్పుడో ఫిజికల్ రిలేషన్ ఏర్పడి వుండాలి. పెళ్లికి ముందు అలాంటివి తప్పు అనే పట్టింపులు నాకు లేవు. కానీ, తనతో పరిచయాన్ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళితే అది మా మధ్య కంఫర్ట్ ని దెబ్బతీస్తుందనే ఫీలింగ్ నాలో బలంగా వుంది. నేనెప్పుడూ ఎవరినీ మాన్యని యిష్టపడినంతగా యిష్టపడలేదు. ఇంకా సూటిగా చెప్పాలంటే తనని తప్ప ఎవరినీ లవ్ చేయలేదు. అయినా ఏదో యిబ్బంది నన్ను ఆపేస్తూ వచ్చింది. ఈ వొక్క విషయం తప్ప ప్రపంచంలో మేము టచ్ చేయకుండా వదలిన సబ్జక్టంటూ లేదు.
నాకున్న అనుభవాల్ని బట్టి.. తనని వదులుకోవాల్సి రావడం అనే ఆలోచన ముందు, తనతో ఫిజికల్ గా డిస్టెన్స్ మెయింటెయిన్ చేయాల్సిరావడం అన్నది చిన్న సమస్యగానే కనబడుతోంది నాకు. అలాగే తనకి కూడా ప్రేమ పట్ల నమ్మకం పోయేలా చేసిన సంఘటనలేవో వుండి వుండొచ్చు.
***
“కావాల్సినంత మషాలా కలిపి విచ్చలవిడిగా రాస్కో పోరా. ఉన్నదున్నట్టు రాసి తీరాల్సిందే అనే చాదస్తం నీకుంటే చెప్పు, క్లయిమాక్స్ కొంచెం స్పైసీగా ప్లాన్ చేద్దాం. ఏమంటావ్” కళ్లెగరేస్తూ అడిగింది.
“స్పైసీగా అంటే..” అర్థం కానట్టు అన్నాను.
“బైక్ తియ్యి. దారిలో చెపుతా” అంది.
తనేదో చెపుతుందనో, చెప్పాలనో నేను అనుకోలేదు. డ్రైవ్ చేస్తున్నా నా ధ్యాసంతా నేను రాయబోయే కథ మీదే వుంది. ఈరోజు జరిగిన సంభాషణ కూడా కథలో రాస్తే ఎలా వుంటుంది? దానికి ముగింపు ఎలా యివ్వాలి? కథలో కూడా మేమిద్దరం యిలా బైక్ మీద వెళుతూ వుంటాం. తన సడెన్ గా “విల్ యూ మ్యారీ మీ” అని అడుగుతుంది. ఆ తర్వాత?
నా ఆలోచనలకి వున్నట్టుండి బ్రేక్ పడింది. మాన్య నాకు దగ్గరగా జరిగి, చేతులతో నన్ను గట్టిగా చుట్టేసి నా వీపుపై తల ఆనించి చెప్పడం మొదలెట్టింది.
“ఐ నో అయాం యిన్ లవ్ విత్ యూ. ఇప్పుడేదో కొత్తగా జరిగిందని కాదు. ఇట్ హాజ్ ఆల్వేస్ బీన్ దేర్. వినడానికి నవ్వులాటగా వుంటుందేమో కానీ, నిన్ను కలవడానికి ముందే నాకు తెలుసు నువ్వు నన్నెప్పటికీ వదలిపోవని. ఇప్పటివరకూ యిచ్చుకున్న స్పేస్ చాలు. పెళ్లి చేసుకోవడం ద్వారానా, చేసుకోకుండానేనా అనేది నాకు అనవసరం. కానీ కొంచెం స్పేస్ కూడా అవసరం లేనంత దగ్గరగా వుండాలి నీకు. ఒకవేళ ఏ కారణం వల్లయినా మనం విడిపోవాల్సివచ్చినా నీతో కలిసి స్పెండ్ చేసిన టైమ్ ఎప్పటికీ చెరిష్ చేసుకునేట్టుగా. ఇన్ ఫాక్ట్ యీరోజు నేనే డిస్కస్ చేద్దాం అనుకున్నా. అంతలోకి నువ్వు నీ కథ విషయం చెప్పావ్. ఇట్ ఫెల్ట్ లైక్ ఎ సైన్. క్లయిమాక్స్ మాత్రం ఫిక్షిషస్ గా వదిలేయడం దేనికి. లెట్స్ లివ్ యిట్ ఫస్ట్”
ఇప్పుడు నేను చేయాల్సిన పనులు రెండున్నాయి. ఒకటి, రాయడానికి యింకో రెండురోజులు కావాలని ఎడిటర్ ని అడిగి, కొత్త కథ ఆలోచించడం. రెండు, అచ్చటాముచ్చటా వేడీవెచ్చా తోడూనీడాతో పాటు పాడిపంటలు యాడికెల్లొస్తయ్యో కనిపెట్టడానికి యీ రాత్రిని అంకితం చేయడం.
*
Add comment