స్నేహం
– దేవిప్రియ
ఇది
కాయకాదు
పండయితే రాలిపోడానికి.
ఇది
నూలుదారమూ కాదు
తెంపితే పుటుక్కున తెగిపోడానికి;
ఇది
సూర్యుడు కూడా కాదు
సాయంకాలమైతే అస్తమించడానికి ;
స్నేహం
పండిన కొద్దీ
బతుకుచెట్టు కొమ్మని
మరింత గట్టిగా అతుక్కుంటుంది,
పెన వేసిన కొద్దీ
మరింత బలంగా ఉక్కుతీగలా అల్లుకుంటుంది,
కాలం గడిచిన కొద్దీ స్నేహం
ప్రజ్వలిస్తూ పోతుంది !
*
చిరిగి ఛిద్రమైన
చాప మీద కూర్చుని నేను
మహాస్నేహ దర్శనం కోసం తపస్సు చేస్తాను ;
ఇరుకు గదిలో
మురికి బట్టల ముసుగు కప్పుకుని
మునిలా నిలబడివున్న సైకిలు మీద
నువ్వు స్వారీ అయి పోయినట్టు –
వాకిట్లో చిన్ని
పాదాల కోసం యెదురు తెన్నులు చూస్తున్న
నర్సరీ నల్లబూట్లు వేసుకుని నువ్వు
నడిచి పోతున్నట్టు
దృశ్యాలు దర్శన మిస్తాయి –
*
గోడల మీద
ఫోటోఫ్రేము లేకపోతేనేం
నా గుండెగోడల నిండా
వేలాడుతున్నాయి నీ చిత్రపటాలు-
ఫోటోలు
ఒంటిపేజీ చరిత్రగ్రంధాలు !
మాటలేని మహాకావ్యాలు !
గాలి దుమార మొస్తే నేను
కలవర పడేది మొదట
ఈ చరిత్రగురించే, ఈ కావ్యాల గురించే !
చిమ్మ చీకటిలో కూడా
కమ్మగా వెలుగుతూ కనిపిస్తాయి నాకు
నీ ముఖరేఖా చిత్రాలు
*
స్నేహం
మంచుముద్ద కాదు
పొద్దు ముదిరిన కొద్దీ
కరిగి కన్నీరై పారడానికి –
అది
సైకిలు టైరూ కాదు తిరిగిన కొద్దీ అరిగి ఆవిరైపోవడానికి –
సిమెంటు ముళ్ళ మీద
నడిచి నడిచి మనకాళ్ళు
కాల చక్రాలయ్యాయి !
మహానగర నగాలు యెక్కి యెక్కి
మన కాళ్ళు కొండచిలువలయ్యాయి –
అసంగత సంగీత ఘోషలు వినివిని
మన చెవులు సముద్రాలయ్యాయి –
రేషనుక్యూల అనంత దూరాల్ని కొలిచి కొలిచి
మన కళ్ళు రేబవళ్ళయ్యాయి ;
ఈ
వీధులు కలల్ని నడిపిస్తున్నాయి
నిశీధులు మనల్ని కబళిస్తున్నాయి –
*
పచ్చని పాతచీర మీద మాసిన మరకలా
మూసీనది మురికిలోకి కుంగిపోతోంది –
చాదర్ ఘాట్ వంతెన
వాహనాల్ని కక్కలేకా మింగలేకా
గుడ్లు మిటకరిస్తోంది –
దిక్కులు నాలుగూ
దిక్కులేని ఊరకుక్కపిల్లల్లా ఏడుస్తున్నాయి !
*
మహానదులు
కొయ్యదుంగల్ని మోసంచేస్తాయి !
సముద్రపు రొయ్యలు
నూలువలల్ని మీసాలతో కత్తిరిస్తాయి –
సొర చేపలు
నిరాయుధ జాలర్ల కుత్తుకలుత్తరిస్తాయి –
మరపడవల
మారణ హోమంలో
చెక్కపడవ ముక్కలవుతుంది !
కాగితంపడవని
కాలువ నీళ్ళుకూడా కసితోనే ముంచుతాయి !
దిక్కుతోచని పిల్లవాడిలా
లైటుహౌసు నిస్సహాయంగా నిలబడి చూస్తుంది!
*
స్నేహం
కాగితంపడవ కాదు
అది
సర్వ సన్నద్ధమైన ఆయుధనౌక ;
కలిసి నడిస్తే
కాలం తలదించుకుంటుంది –
బాధలో
భాషలు యేకమైతే
జన వేదనలో
జాతులు ఒకటైతే
శిరః కంపనలు భూప్రకంపనలవుతాయి –
నువ్వూ నేనూ
చేతులు కలిపితే చరిత్ర మారుతుంది –
ఆర్ద్రత
అనంత సంఘర్షణ అవుతుంది
దేశాలు జైళ్ళవుతాయి
కళ్ళు రైఫిళ్ళవుతాయి,
నేను
చేతిలో సూర్యుడితో
నీ ముందు ప్రత్యక్ష మవుతాను,
నీ సంవేదనా కావ్యంలో
ప్రత్యక్షరమూ నేనే అవుతాను
అలసటలో తలదాచుకోడానికి
అరణ్యాన్నవుతాను,
అంతిమ పోరాటంలో
ఆయుధాన్నవుతాను –
*
ఆల్బమ్ లో
అన్నీ నీ ముఖాలే కనిపిస్తున్నాయి
ప్రతి శబ్దంలో నీ మాటలే వినిపిస్తున్నాయి,
అలమరా కర్టెన్ వెనుక
అలవోకగా కనిపిస్తున్న నీడ నీదే –
ఈ
అతిశీతల నిశీధ నిశ్శబ్దం నువ్వే –
నువ్వు
నిద్రించే సముద్రానివైతే
నేను
నీ చుట్టూ పహరా తిరిగే
వెన్నెలవిలయపవనాన్ని !
*
స్నేహం
నిశ్చలన ఛాయాచిత్ర సంపుటం కాదు,
అది
జీవన సమగ్ర సంచలన చలన చిత్రం!
( దేవిప్రియ కవిత్వ సంపుటి ” తుఫానుతుమ్మెద ” నుంచి )
* * *
” స్నేహం” వస్తువుగా వచ్చిన మంచి వచనకవితలు తెలుగులో తక్కువనే చెప్పాలి. పైగా స్నేహం వెలుగునీడలు రెంటినీ స్పృశిస్తూ ఇంత నిడివితో వచ్చిన కవితలు ఇంకా తక్కువ. స్నేహం – యూనివర్సల్ సబ్జెక్టు కదా!
ఈ కవిత ఒక ధారగా సాగకపోయినా; కవి, ఈ కవితను భాగాలు భాగాలుగా రచించినా, మొత్తంగా స్నేహతత్వాన్ని గురించి సూటిగానూ, ప్రతీకాత్మకంగానూ మాట్లాడిన కవితగా ఇది గుర్తుంచుకోదగినది, ఎన్నదగినది.
మొత్తం తొమ్మిది భాగాల కవిత ఇది. మొదటిభాగంలో- చెప్పిన విషయంతో పాటు, వ్యక్తీకరణలోనూ ఒక ప్రత్యేకత ఉండడాన్ని గమనించవచ్చు. క్రమాలంకారాన్ని తీసుకున్నారు కవి. స్నేహం పక్వమయ్యే ఫలం. అయితే పక్వమయి రాలిపొయ్యే ఫలం కాదు.
“పండిన కొద్దీ బతుకు చెట్టుకొమ్మను మరింత గట్టిగా అతుక్కుంటుంది” అంటున్నారు కవి. స్నేహం నూలుదారం కాదు, అయినా స్నేహానికి దారపు గుణం వుంది. ” పెనవేసిన కొద్దీ మరింత బలంగా ఉక్కుతీగలా అల్లుకుంటుంది “. స్నేహం సూర్యుడు కాదు గానీ, ” కాలం గడిచిన కొద్దీ స్నేహం ప్రజ్వలిస్తూ పోతుంది”. అసలు సిసలైన స్నేహాల గురించి అంటున్నమాటలివి.
స్నేహాలకు, ఫోటోలకు ఉన్న సంబంధాన్ని గుర్తుచేశారు కవి, ఈ కవిత మూడోభాగంలో. ఫోటోలు చూస్తూ చూస్తూ గతంలోకి వెళ్ళిపోయిన అనుభవాలు, ఫోటోలు చూస్తూ చూస్తూ కావ్యానుభూతికి లోనైన సందర్భాలూ మనందరి జీవితాల్లోనూ వున్నవే కదా!
ఐదవభాగంలోని కవితావాక్యాలకు వాచ్యార్థాలు కుదరవు. ” చాదర్ ఘాట్ వంతెన/ వాహనాల్ని కక్కలేకా మింగలేకా/ గుడ్లు మిటకరిస్తోంది! ” అనే వాక్యంలో గుడ్లు మిటకరించేది మనుషులు. ఇక్కడ వంతెనకు ప్రాణిధర్మాన్ని ఆరోపించారు కవి. ” కక్కలేక మింగలేక” ఒక సంకటస్థితిని తెలిపే వ్యక్తీకరణ. అయినవారి స్నేహాలు ” మీదకెక్కినపుడు” అనివార్యంగా భరించవలసివచ్చే పరిస్థితిని ఈ వాక్యం సూచిస్తోంది.
ఆరవభాగంలోని వాక్యాలు కూడా ప్రతీకాత్మకమైనవే.
” మోసం చేయడం “, ” కత్తిరించడం”, ” కుత్తుకలుత్తరించడం”, మనుషులు చేసే పనులే కదా! ఇక్కడ, స్నేహాల పేరుతో జరుగుతున్న అమానుష కృత్యాలను ధ్వనిస్తున్నారు కవి. “మరపడవల మారణహోమంలో/ చెక్కపడవ ముక్కలవుతుంది” అనే వాక్యం, ఇద్దరు బలవంతుల మధ్యకు బలహీనుడైన మిత్రుడు ప్రవేశించి దెబ్బతినిపోవడాన్ని సూచిస్తోంది. స్నేహాల పేరిట అన్యాయాలు, ద్రోహాలు జరుగుతున్నా నిస్సహాయంగా మిన్నకుండిపోయేవారికి సింబల్ గా “లైట్ హౌస్” ను కవి గ్రహించారని మనకు సులభంగానే తెలుస్తున్నది.
ఏడవ భాగంలో స్నేహితుడు ” సర్వసన్నద్ధమైన ఆయుధనౌక” గా వుండాలని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న బాధితులు, పీడితులు స్నేహభావంతో కలిసినడిస్తే, ఉద్యమిస్తే ” చరిత్ర ” మారుతుందని, పరిస్థితులు మెరుగవుతాయని చెబుతున్నారు. ఎదుటివారి కష్టంలో భాగం పంచుకోవడం స్నేహధర్మంగా భావిస్తూ, అవసరమైతే అది ఆయుధంగాకూడా మారాలంటున్నారు.
ముగింపు భాగాల్లో చేసిన వ్యక్తీకరణలు మరింత ఆలోచనాత్మకంగా వున్నాయి. ఇక్కడ ” సముద్రాన్ని” విప్లవకారులకు ప్రతీకగా స్వీకరించారు కవి.
మనిషి జీవితంలో ఎందరితోనో స్నేహాలు. వాటన్నిటిని ఒకచోట చేరిస్తే అది ఒక “ఛాయాచిత్ర సంపుటం” అవుతుంది. అయితే అది నిశ్చలమైన సంపుటం కాదు, చలనశీలమైనది అంటున్నారు. ఒక మనిషి తన జీవితంలోని స్నేహాలన్నింటినీ తలపోస్తే, అది ” సంచలన చలనచిత్రంగా” మారుతుందన్న కవిమాటల్లో వాస్తవం వుంది.
*
Add comment