సమయం లేదు. రెండు రోజులే గడువుంది. మే నెలలో ఐల సైదాచారి సంస్మరణ సభ. ఈ రెండు రోజుల్లో కవి మిత్రులు ఐల సైదాచారిని స్మరించాలి. కాలమనే ఊర బాయిలోంచి జ్ఞాపకాల నీటిని తోడుకోవాలి.
సైదాచారి ముందుగా రక్త మాంసాలున్న మనిషి.
ఆ తర్వాతే కవి, తాత్వికుడు.
తాత్వికుడు కాని కవి కవే కాదు.
అతని కవిత్వం కవిత్వమూ కాదు.
జీవితమనే కుబుసం విడుస్తున్న కాల సర్పాన్ని తన కవిత్వంలో బంధించే ప్రయత్నం చేశాడు సైదాచారి.
ఐల సైదాచారి మంచి స్నేహశీలి. అప్పటికింకా సైదాచారికి పెళ్లి కాలేదు.
పదును పెట్టిన కత్తిలా నవనవోన్మేషంగా, నూతనోత్సాహంతో జవజవలాడుతూ ఉండేవాడు.
బతుకు వేటలో తనను తాను వెతుక్కుంటూ 1990 ల్లో అనంతపురం వచ్చాడు.
అనంతపురంలో మంచి సాహితీ వాతావరణం ఉండేది.
చెట్టు కింద లిటరరీ మీట్, సెంట్రల్ లైబ్రరీ లో లిటరరీ మీట్, ఆరాం, స్వాగత్ హోటళ్లలో లిటరరీ మీట్లు.
కవిత్వం, కథ, సాహిత్యం మీద చర్చోప చర్చలు సాగేవి. అప్పుడే సైదాచారితో పరిచయం.
సాహితీ మిత్రులు కె. ఎం. రాయుడు, చిలుకూరి దేవపుత్ర, స్వామి, రఘుబాబు, బోస్, సింగమనేని నారాయణ తదితరులు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. సైదాచారి అగ్రికల్చర్ రెప్ గా ఎదో కంపెనీ లో పని చేస్తూ జిల్లా అంతటా బైకు మీద తిరుగుతూ ఉండేవాడు. చెదిరిన జుత్తుతో, అలసిన మొహంతో, హెల్మెట్ ధరించి బైకు మీద వస్తూ ఉండేవాడు. ఓ రోజు కదిరి నుంచి, ఒక రోజు గుంతకల్లు నుంచి వస్తున్నాను అనేవాడు. జిల్లా అంతటా తిరిగే వాడు. అసలే అనంతపురం జిల్లా, పొడి వాతావరణం. అతి తక్కువ వర్షపాతం. కరువులు పరిపాటి. ఆకాలంలోనే మొట్ట మొదటి కథా సంపుటి “వాలిన మబ్బులు”, లిటరరీ మీట్ ప్రచురణ పొందింది. సైదాచారి గంభీరంగా చిరుదరహాసంతో అందరిని ఆకట్టుకొనేవాడు. చర్చల్లో ఉత్సాహంగా పాల్గొనేవాడు.
అది అక్టోబర్ 1995 .
ఐల సైదాచారి స్ఫురద్రూపి. మంచి అందగాడు. మంచి భావుకుడు. అంతకు మించి ప్రేమికుడు. తెల్లని మేని ఛాయతో మిసమిసలాడుతూ అందరిని ప్రేమతో అల్లుకుపోయేవాడు. అటువంటి సైదాచారిని ఎవరైనా ప్రేమిస్తారు. అందరిలాగే సైదాచారిని కొప్పరం శివ జ్యోతి ప్రేమించింది. వన్ ఫైన్ మార్నింగ్ అయిన వారినందరిని కాదనుకొని శివ జ్యోతి అనంతపురం వచ్చేసింది.
1995 అక్టోబర్ మాసంలో. అప్పుడు రిజిస్ట్రార్ ఆఫీసు రాంనగర్ లో ఉండేది. స్నేహితులు కె.ఎం. రాయుడు, చిలుకూరి దేవపుత్ర, నేను మరి కొంతమంది స్నేహితులు కలిసి వీరి వివాహం అనంతపురం రిజిస్ట్రార్ ఆఫీస్ లో చేశాము.
పెళ్లి అయిన తర్వాత సైదాచారి హైదరాబాదుకు చేరుకున్నాడు. అయినా హైదరాబాదులో తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. రామ్ నగర్ లో ఉన్న రమణ జీవి కార్యాలయం మా అందరికి కూడలి. ఎన్నో సుదీర్ఘ రాత్రులు చర్చల్లో కరిగిపోయాయో చెప్పలేం. 1990 -2000 ల మధ్య తెలుగు కవిత్వం చిక్కన అయింది, పదునెక్కింది, రాటు తేలింది, నజ్ఞoగా ఆవిష్కరించబడింది. నా మొదటి సంపుటి “అవేద” కావ్యం రమణ జీవి ముఖ చిత్రంతో అందంగా 1999 లో వచ్చింది. 2000 ల సంవత్సరంలో ఐల సదాచారి “ఆమె నా బొమ్మ”, రమణ జీవి ముఖ చిత్రం తోనే రూపు దిద్దుకొనింది.
1980 ల కు పూర్వమే తెలుగు కవిత్వం పాశ్చాత్య కళా ఉద్యమాల ప్రభావానికి లోనైంది. ప్రధానంగా రియలిజం, సర్రియలిజం, ఇమేజిజం, క్యూబిజం, సింబాలిజం తదితర కవితా ఉద్యమాల ప్రభావం తెలుగు కవుల కవిత్వాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. శిష్ట్లా , శ్రీశ్రీ, శ్రీ రంగం నారాయణ బాబుల మీద అధివాస్తవిక (సర్రియలిజం) ప్రభావం శ్రీ శ్రీ ఖడ్గ సృష్టి, శ్రీ రంగం నారాయణ బాబు రుధిర జ్యోతి కావ్యాల్లో చూడచ్చు. పట్టాభి కావ్యం ఫిడేలు రాగాల డజన్ కావ్యంలో డాడాయిజం, ప్రభావం కనిపిస్తుంది. వేగుంట మోహన ప్రసాద్ అజంతా, ఇస్మాయిల్ కవిత్వాల్లో ఇమేజిజం ప్రభావాన్ని చూడవచ్చు. ఆరుద్ర రచన ‘త్వమేవాహం’ కావ్యంలో సింబాలిజం ప్రభావం ఉంది. వీటన్నిటి ప్రభావం 1980 ల అనంతరం వచ్చిన కవులందరి పైన కనిపిస్తుంది. సైదాచారి కూడా ఇందుకు మినహాయింపు కాదు.
“ఆమె నా బొమ్మ” – కవితా సంపుటిలో వచ్చిన కవితలు అప్పటికే ప్రముఖ పత్రికల్లో అచ్చయినవే! ప్రధానంగా ఆంధ్ర జ్యోతి దిన పత్రిక ‘వివిధ’ లో ప్రచురణ పొందినవి. సైదాచారి కవిత అచ్చయిందంటే సాహితీ మిత్రులలో అదొక చర్చనీయాంశం. సైదాచారి కవిత్వంలో ఒక నూతన వరవడి. వస్తువులో, రూపంలో, శైలిలో, భాషలో, భావంలో అప్పటివరకు ఏ కవులూ ప్రయోగించని వైవిధ్యం ద్యోతకమయ్యేది.
అప్పట్లో చాలా మంది దళిత బహుజన యువకులు మంచి భోజనం దొరుకుతుందని ప్రభుత్వ వసతి గృహాల్లో చేరి తమ భవిష్యత్తును పరీక్షించుకొనేవారు. ఇంటర్మీడియట్ తర్వాత ఎదో తెలియని వెలితి, ఆవేదన, జీవితం పట్ల కసి, ఎదో సాధించాలన్న తపన సైదాచారిని నిలవనిచ్చేది కాదు. ఆ అన్వేషణే సైదాచారిని హైదరాబాదుకు చేర్చింది. రాజేంద్ర నగర్ లోని అప్పటి ఆచార్య న్ . జి. రంగ యూనివర్సిటీలో బి.ఎస్ సీ లో చేరేలా చేసింది.
చేరింతర్వాత అక్కడి ఆహ్లాదకరమైన వాతావరణం, మంచి హాస్టల్ వసతి, మంచి భోజనం ఇవేవి తృప్తినివ్వలేదు. హైదరాబాదు సిటీ లో అనేకమంది కవులూ సాహితీ మిత్రులతో తరచుగా కలిసేవాడు. సాహిత్యం తో పాటు సంగీతం కూడా సైదాచారి జీవితంతో పెనవేసుకుంది. వయోలిన్ ను నేర్చుకునేలా చేసింది. వయోలిన్ వాయిద్యంలో కుడా మంచి పట్టును సాధించాడు సైదాచారి. హిందూస్థానీ సంగీతం అంటే చాలా మక్కువ. కర్ణాటక సంగీతంలోనూ ప్రవేశం ఉంది. అందుకే సంగీతం మీద చాలా ప్రేమతో తన బిడ్డుకు “ఆలాపన” అని పేరు పెట్టుకున్నాడు సైదాచారి.
సైదాచారి జీవితంలో ఇంద్రధనస్సులనే కాదు, ఎండమావులని చూసాడు. జీవితంలోని ప్రేమనే కాదు, విద్వేషాన్ని చూసాడు. ఈ లోకం తన పుట్టుకతోనే విసిరిన విచ్చుకత్తుల్ని, అవి చేసిన గాయాల్ని చూసాడు. పైకి ప్రశాంత సంధ్రంలా కనిపించినా సముద్ర గర్భంలో అగ్ని పర్వతంలా అంతర్గతంగా రగులుతూ ఉండేవాడు. “ఆమె నా బొమ్మ” కావ్యానికి ఇంట్రో లాంటి ఈ పాదాల్ని చూడండి
“ఇది సుదీర్ఘ సుషుప్తి కాదు
సుఖ వాంఛా స్వప్న వీచిక కాదు” అన్నాడు.
లోకం గురించి రాస్తూ బహుశా “నువ్వు నోటి దగ్గర మెతుకునే కాదు. కాళ్ళ మీద నిద్రనూ కాజేయగలవు” అంటూ ప్రశాంతమయిన నిద్రను కూడా దూరం చేసే ఈ సమాజ భీభత్సాన్ని తలచుకొని ఇలా అంటాడు.
“అందుకే నేను నిద్రపోతే –
సముద్రంలో సూర్యుడిలా నిద్రపోతాను
మబ్బు వెనుక చంద్రుడిలా నిద్రపోతాను
అడవి గర్భంలా నిద్రపోతాను
అగ్ని పర్వతంలా నిద్రపోతాను”
అంటూ పాఠకుడిలో ఒక విస్ఫోటనం కలిగిస్తాడు. అందుకే సైదాచారి కవిత్వం కవిత్వమా? నిర్నిద్ర రక్త కాసారమా? సైదాచారి కవిత్వం అనిపిస్తుంది.
బి.సి కులాల్లో పుట్టిన వాళ్లకు పేదరికం కొత్త కాదు. పేదరికం, దాన్ని వెన్నంటి ఒంటరి తనం, మనిషిని ఒక అభద్రతా భావానికి గురి చేస్తుంది. బాల్యం నుంచే తన చుట్టూ ఎందరున్నా తనకెవరూ లేరనిపిస్తుంది. అందుకే సైదాచారి ‘నా కెవరూలేరు’ అన్న కవితలో ‘తల్లి నెడబాసిన పిల్ల కోడిని
కుంతి జాడ తెలియని కర్ణుడిని
నేనొక విచలిత శిశువును’ అంటూ సాగిపోతుంది కవిత.
కవిత్వం మొత్తం చిప్పిల్లుతున్న గాయాలతో “కనలిన దేహాన్ని చల్లని కౌగిట్లో తడిపేదెవరు? అని తనలో తాను కదిలిపోతూ ‘ కాపాడేది ఎవరీ కన్నీటి వూభిలోంచి?’ అని ప్రశ్నించి పాఠకుణ్ణి విచలితున్ని చేస్తాడు. జీవితమంటే ‘కళ్ళు చెదిరే కాంతిలో గుడ్డివాడి తడుములాట
దయినందిన ఆత్మహత్యల కరకు రాళ్ల గుట్టలు
జ్ఞానాన్ని మేసిన జ్ఞాపకాలు’ అని చెప్పిన కవిత్వానికి వ్యాఖ్యానాలు అవసరమా? అర్థం చేస్కునే సంస్కారం, అనుభవం, సహృదయత ఉండాలేగానీ, సహృదయత కొరవడిన పాఠకుడికి ఈ కవిత్వం అందనంత దూరంలోనే ఉంటింది.
బహుజనులు అనేక వృత్తులతో అనాదిగా ఈ దేశంలో బతుకుతున్నారు. తరతరాలుగా అదే వృత్తి, అదే పని గానుగెద్దు జీవితం. కుల వృత్తితో బాగుపడిన వాడిని చూడగలమా? తాతలు, తండ్రులు, ముత్తాతలు కుల వృత్తిలోనే వారి జీవితాల్ని కొవ్వొత్తుల్లా కరిగించి ఈ దేశానికీ సంపదని, వెలుగుల్ని ప్రసరించారు. ఇదే విషయాన్నీ సైదాచారి తనదయిన శైలిలో కవిత్వీకరించాడు. ‘సరిహద్దు బొంద’ ను చదవండి. తనకు జీవితాన్ని ప్రసాదించిన తల్లిని తలచుకొని
‘దుఃఖం ఉమ్మనీరై ఊరిందా
రొమ్ముల్లో కన్నీరు పొంగిందా
ముందు కష్టాల్ని కనీ
నన్ను గన్నావా తల్లీ!’
అని తల్లడిల్లి పోతాడు. ఎంత ఎదిగినా తన తల్లికి ఏ విధంగానూ సహాయం చేయలేని అసహాయతను గుర్తించి అంగలారుస్తాడు.
“తాత చెక్కిన ధ్వజ స్తంభాలు, నాయిన మలచిన ఇత్తడి గంగాళాలూ,
తిండి పెట్టలేకపోయిన అజ్ఞాత కళా ఖండాలు
బుక్కెడు బువ్వెక్కువ తిన్నందుకు నాయిన డొక్కలో తన్నిండా!”
అని ప్రశ్నించాడు. ఇది అందరి ఇళ్లల్లో జరిగే విషాదమే. అయినా దాన్ని కవిత్వంలో వడిసిపట్టుకోవడం సైదాచారికే చెల్లింది. తన బాల్యం నుంచి తన తల్లి ఎదుర్కొన్న కష్టాల్ని ఒక్కొక్క ఉల్లి పొర వలిచినట్టు వలిచి మన కళ్ళల్లో నీళ్లు తెప్పిస్తాడు ఈ కవితలో. సైదాచారి కవిత్వమంతటా ఉమ్మనీటి అలికిడి, అంతటా కమ్ముకున్న అమ్మ వాసనా, బొడ్డు పేగు తెగిన శిశివు రోదన అసంకల్పితంగా ఎదురయ్యే స్త్రీ మూర్తీ, ఆ స్త్రీ మూర్తి పరిశ్వంగంలో తనను తాను విముక్తం చేసుకొనే తీవ్ర ప్రయత్నం కనిపిస్తుంది. కనిపించి కవిత్వాన్ని ఇట్లా కూడా రాయవచ్చా? అని పాఠకుడ్ని ఆశ్చర్యపరుస్తుంది.
వైవాహిక జీవితంలో ఎదురయ్యే సమస్యల్ని ‘పాచికలు’ అన్న కవితలో అద్భుతంగా రాస్తూ ‘కలిసే ఉంటున్నాం పెళ్లితో విడిపోయాక’ అంటాడు. ‘అమాయకంగా ప్రేమించుకోబోయి చిత్రంగా మోసగించుకున్నాం’ ఇట్లా చెప్పటంలో కవికి ఉన్న నిజాయితీని ఏమని అర్థం చేసుకుంటాం? వైవాహిక జీవితాల్లోని తీపి, చేదు గుర్తుల్ని liberated woman న్ని స్వప్నిస్తూ వివాహితుడయిన కవి, జ్ఞాపకాల్లోంచి కనురెప్పల మీది క్షణాలు లాంటి కవితలు ఆయా సరిహద్దుల్ని చెరిపేసే ప్రయత్నమేమో అనిపిస్తుంది.
అడుగడుగునా అనుభవాలే! పాదపాదాన కవిత్వమే! దేన్నని ఉదహరిస్తాం. విశృంకల కవిత ఎత్తుగడ ఎంత అద్భుతంగా ఉందో చూడండి.
“భూమి లోకి పుష్పిద్దాం ఆకాశంలో వేళ్ళు జొనిపి” ఇది సైదాచారి ముద్ర. సైదాచారిదే అయిన సైదాచారి కాస్మిక్ భాష!
తెలంగాణ యాస, బాస, మట్టి వాసన గుప్పుమంటుంది.
“అమ్మని నేను కంటున్నానో – అమ్మ నన్ను కనిందో
ముప్పయేండ్ల గర్భవతుడ్ని చాలా వాటికి”.
ప్రియురాలిని, భార్యని, తల్లిని, ఓ స్త్రీ మూర్తి బాహ్య సౌందర్యాన్ని కాక అంతర్గత ఆత్మ సౌందర్యంతో మమేకమైన కవి సైదాచారి. అంతటితో ఆగిపోలేదు.
‘నీలం మాయ’ లో కొట్టుకుపోలేదు. తనని తాను మరింత విస్తృతం చేసుకున్నాడు. సైదాచారి 2009 లో వెలువరించిన రెండో కవితా సంపుటం ‘నీలం మాయ’.
తనను తానూ ఎంత విస్తృతం చేసుకున్నాడో ‘స్త్రీలు’ అన్న కవితలో చూడచ్చు. స్త్రీ మూర్తులు వారి వ్యక్తిత్వాలతో పురుష పుంగవుల జీవితాలను ఎట్లా వెలిగిస్తారో, మన కళ్ళముందు మిరుమిట్లు కల్పిస్తాడు.
‘స్త్రీలు – కారుణ్య స్త్రీలు
పుట్టేస్తూ దుఃఖాన్ని పుట్టుకతో తెచ్చుకున్న స్త్రీలు
కన్నీటి స్త్రీలు..” అంటూ స్త్రీ మూర్తి విశ్వరూప సాక్షాత్కారాన్ని తన కవిత్వమంతటా దర్శింపచేస్తాడు.
ఎదో అంతు తెలియని వేదన. తన చిన్నతనం, అమ్మ చుట్టూ ఆమె పయిట పట్టుకు వేల్లాడిన నాటి ముచ్చట్లు, అనుబంధాలు, రక్త బంధాలు, సైకిలు తొక్కుడు నేర్పిన మస్తాన్, జహింగీర్ దర్గా, ఆడ ఫకీర్ జాన్బీ పెద్దమ్మ, గళ్ళ లుంగీ గడ్డపు సాయిబూ ఎవరు వీళ్లంతా? నా సంరక్షక రక్త బంధాలు. . .
ఇదో ఎంతకూ తెగని నోస్టాల్జియా.. నేను నీ దట్టిలూడిన పీరుని, నమాజుల్లేని కూలిన మసీదుని, నా ఫకీరు తండ్రీ! ముదావరు!. ఇదంతా ఒక అఖండ సృజనలో కొన్ని క్షణాలు.. స్వర మూర్చనలో భీంసేన్ జోషి.. వాక్యాంతంలో జారిపోతున్న కవిసమయాలు. . . సైదాచారి కవిత్వాలు.
కవుల, వాగ్గేయకారుల దుఃఖాల మీంచి తనదాకా..
ఒక సంచారి తల్లి కోరిక మన్నించీ మన్నించలేక..
“మనం భూమి లేని వాళ్ళం
వృత్తి సంచరులం, సంచార వృత్తులం
ఇల్లంతా మూట గట్టి నెత్తిన బెట్టుకొని నడుస్తున్న నాయిన వెనక
ఏ వూరు ఇంత తిండి పెడితే
అదే సొంతూరు అనుకున్నవి”
అటువంటి సంచార తల్లిని విడిచి బతుకు వేటలో నగరానికొచ్చి, నగరానికొచ్చిన కొడుకుతో –
“నువ్వెప్పుడు కలిసినా ఒకటే అంటావు “కొడకా ఇంత భూమి కొనుక్కో
ఒక ఇల్లు కట్టుకో” అని అడిగే ఆ సంచార తల్లికి ఏం సమాధానం చెప్తాడు. నిజానికి ఇద్దరి స్థితి ఒకటే.
కవి అయిన వాడు నిరంతర సంచారే! అందుకే అడ్రస్ ఉన్నందుకే దుఃఖిస్తున్నాను తల్లీ – నాకు సంచార జీవితమే కావాలి,
నీ సంసార జీవితమొద్దు.
ఇప్పుడిక్కడుంటాను –
రేపెక్కడుంటానో?
అనంతమైన ఆకాశం కింద…ప్రయాణం. ఈ ప్రయాణం అనంతంగా సాగుతూనే ఉంటుంది – ఎందుకు?
సొంతూరు లేక, ప్రాంతం లేక, దేశం లేక
ఒక్కడ్నే ఇంత మెతుక్కోసం
అక్షరం కోసం, ఆనందం కోసం
సంచారినయి, లోక సంచారినై. .
తమదయిన చిరునామా లేదు. స్థిరత్వం లేదు. పైన చెప్పిన అన్నిటికోసం నిరంతరం ఆరాటమే, రాజీ లేని పోరాటం.
అందుకే చివరాఖరున
“జీవితాన్ని చూస్తున్నాను తల్లీ!
అనుభవం కోసం బతుకుతున్నాను
తల్లివయినా నువ్వు స్త్రీవి
నీ స్థావర, నా జంగమాత్మక ప్రపంచాలు వేరు –
ఇట్లా ఉటంకిస్తూ పొతే సైదాచారి కవిత్వాన్నంతా ఉటంకించాలి.
ఇక్కడ సాధ్యం కాదు. కనుక చివరగా సైదాచారి చెప్పినట్టు గానే, ఈ కర్మ భోగి –
“ఒక్కొక్క అక్షరానికి కొంత మాంసము, కొంత రక్తము దగ్ధమవనీ,
మృత్యువై రగులుతున్న కణాలన్నీ పదాలై, వాక్యాలై మెరవనీ”
ఇప్పుడు సైదాచారి మనమధ్య లేకపోవచ్చు, అతని కవిత్వముంది. అతని జ్ఞాపకాలున్నాయి. అతను పంచిన ప్రేమ ఉంది. అది ఎప్పటికీ పచ్చిపచ్చిగా పచ్చగానే ఉంటుంది. సైదాచారి కలిసినప్పుడు సరదాగా అంటుండేవాడు. ప్రేమ్ చంద్ మనం సరస్వతిని ప్రేమించినంతగా లక్ష్మీ దేవిని ఆరాధించలేదు, నువ్వు అంతే, నేనూ అంతే! నెరవేర్చాల్సిన బాధ్యతలు ఇంకా మిగిలే ఉన్నాయ్. నా బిడ్డ ఆలాపనను డాక్టర్ను చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి. నువ్వు నీ బిడ్డ అపర్ణను డాక్టర్ను చెయ్యాలి, పెళ్లి చెయ్యాలి. ఇప్పట్నుంచైనా లక్ష్మిని ప్రేమిద్దాం!
ఎవరికీ చెప్పకుండా అర్ధాంతరంగా ఈ ద్వేష ప్రపంచాన్ని ప్రేమిస్తూ ఇంక సెలవంటూ వెళ్ళిపోయాడు సైదాచారి అనంత లోకాలకు. బరువు బాధ్యతలన్నీ శివ జ్యోతి గారి మీద మోపుతూ.. ఎప్పుడైనా అందరు వెళ్లిపోవాల్సిన వాళ్ళమే.. కాస్త వెనకా ముందూ.. అల్బిదా!
*
సైదాచారి గారి కవిత్వ లోతులనూ, ఆయన జీవిత విశేషాలనూ తనదైన శైలిలో ఆవిష్కరించిన ప్రముఖ కవి, సామాజిక కార్యకర్త, అధ్యాపకులు, దళిత-బహుజన ధిక్కార పతాక డా. జూపల్లి ప్రేమ్ చంద్ సర్ గారికి నమస్కారములు.
Dhanyavaadaalu Guttaa Harie
కొంత మాంంసం కొంత రక్తం ఇగిరింది. పిండేసిన హృదయంతో సైదాచారి కవిత్వానికి గులామును మీ సమీక్ష కు సలాము.
చాలా మంచి పరిచయం. సైదా దీ అతని కవిత్వానిదీ👌.
వ్యక్తిగతంతో, వ్యక్తిత్వంతో అవినాభావంగా పెనవేసుకున్న అపురూప శిల్ప వైచిత్రి సైదాచారి కవిత్వ సృజన. తానుగా జీవించని, అనుభవించని, అనుభూతి చెందని ఒక అక్షరమో, పదమో, వాక్యమో తన కవిత్వంలో చొరబడలేదు, ఇమడనూ లేదు. ఆ నిలువెత్తు సమ్మిళిత స్వరూపాన్ని సజీవంగా ఆవిష్కరించిన ప్రేమ్ చంద్ గారూ. అభినందనలు. అభివాదాలు.