స్త్రీల యాత్రాచరిత్రలు ప్రత్యేకమే!

ఒక ప్రయోగాత్మకమైన ఆలోచన రావడం, దాన్ని అక్షరాలా ఆచరణలో పెట్టడం అంత తేలిక కాదు. కత్తి మీద సామే! రాసే నేర్పు వుంటే చాలదు, రాయించే ఓర్పూ, సహృదయతా, ఇతరుల రచనని మెచ్చుకునే సుగుణమూ వుండాలి. ఇవన్నీ కలిసి- స్వర్ణ కిలారి! స్వర్ణ ఎడిట్ చేసి, ప్రచురిచిన “ఇంతియానం” స్త్రీల సాహిత్యంలో మైలురాయిగా నిలిచిపోతుంది. ఈ కృషి గురించి స్వర్ణ మాటల్లోనే విందాం!

ఇంతియానం వెనుక కథ ఏమిటి?

ఉత్తర థాయ్ లాండ్ యాత్ర ముగించుకుని వచ్చాక, ‘ The Shooting Star’ అనే సోలో ట్రావెల్ చేసిన శివ్యానాథ్ అనే అమ్మాయి గురించి చదువుతున్నాను. 23 యేళ్ళ ఆ అమ్మాయి మంచి ఉద్యోగం, ఇల్లు, కుటుంబం అంతా వదులుకుని సంచార జీవనం వైపు అడుగులు వేసింది. ఇది చదువుతున్నపుడు సడన్ గా వచ్చింది ఈ ఆలోచన, తెలంగాణ, ఆంధ్రా రాష్ట్రాల్లో మనకు తెలిసిన స్త్రీల యాత్రా విశేషాలను సేకరించి సంకలనంగా ఎందుకు వేయకూడదు అని. ఈ ఆలోచనని వెంకట్, మహీలతో చెప్పినపుడు వాళ్ళు వెంటనే మీరు చేయండి, పబ్లిష్ చేద్దాం అన్నారు. ఈ విషయంలో పబ్లిషర్ వందనా బండారుకి నా కృతజ్ఞతలు.

రచయితలను ఎలా ఎన్నుకొన్నారు?

ఇదివరకే వివిధ పత్రికల్లో, సోషల్ మీడియాలో యాత్రానుభవం రాసిన వాళ్ళను తొలుత ఎంచుకున్నాను. వారి ద్వారా మరికొందరు స్త్రీ యాత్రికులు పరిచయం అయ్యారు.

స్త్రీల యాత్రల్లో ఏం విశేషం ఉంటుంది అనుకున్నారు?

స్త్రీ యాత్ర చేయడమే విశేషంలా అనిపిస్తుంది. ఇదంతా ఏళ్ళతరబడి ఉన్న కండిషనింగ్ కదా. గడప దాటి బయటకు వెళ్ళడమే గగనం అనుకునే స్త్రీ ఒక యాత్ర చేయడం అబ్బురమే. కానీ, స్త్రీ చేసే యాత్ర, ఆమె దృష్టి, ఆలోచనలు, భావోద్వేగాలు ప్రత్యేకం. ఇవన్నీ మీరు ‘ఇంతియానం ‘ లో చదువుతారు.

ఒక యాత్రికురాలు, రచయితగా మీ అనుభవం?

ఈ ప్రశ్నకు సమాధానం రెండు వాక్యాల్లో చెప్పడం కష్టం. ప్రయాణం అనుకున్నప్పటి నుండి, తిరిగి ఇంటికి చేరుకునేదాకా ట్రాన్స్ లో ఉన్నట్లు ఉంటుంది. ఎక్కడికి వెళుతున్నాం, ఏం చూస్తాం, ఏమి తెలుసుకుంటాం, ఏమేమి చేస్తాం అనుకుంటూ చాలా ఎక్సయిటింగ్ గా ఉంటుంది. అక్కడ చూసిన విశేషాలన్నీ కెమెరా రీల్ లాగా బుర్రలో తిరుగుతూనే ఉంటాయి. ఇంటికి రాగానే వెంటనే అన్నీ పేపర్ మీద పెట్టాలనిపిస్తుంది. చిన్నదో, పెద్దదో ఖచ్చితంగా డాక్యుమెంట్ చేస్తాను.

పుస్తకం ప్రచురణలో ఎదురైన అనుభవాలు?

చాలా సాఫీగా సాగిపోయింది. నేను ఎన్నిసార్లు మార్పులు, చేర్పులు చేసినా ఆన్వీక్షికి టీమ్ ఎటువంటి ఇబ్బందీ లేకుండా, ఎంతో ఓపికగా, సృజనాత్మకంగా మంచి ఔట్ పుట్ వచ్చేలా కృషి చేశారు.

45 మంది అంటే చాలా పెద్ద సంఖ్య కదా ఎన్నుకోవడం, ఫాలోఅప్ చేసుకోవడం కష్టం అవలేదా?

అసలు ఆలోచన వచ్చినపుడు 20, 25 మంది అనుకున్నా. కానీ అనూహ్య స్పందన వచ్చింది. 45 మందిని ఎన్నుకోవడం అసలు కష్టంగా అనిపించలేదు. కొందరు పెద్దవాళ్ళని రెండోసారి అడగడానికి (ఫాలో అప్) కాస్త మొహమాటపడ్డాను. కానీ వాళ్ళ నుండి చిన్న సమస్య కూడా ఎదురవలేదు. ఏది, ఎప్పుడు, ఎలా అడిగినా కాస్త వ్యవధి తీసుకుని కొందరు, వెంటనే కొందరు ఇచ్చేవారు. ఓవరాల్ గా నాకెటువంటి సమస్యా కలగలేదు.

యాత్రా రచనకు…రచయితలు ఏమైనా నిర్దుష్టత పాటించారా?

ఈ విషయంలో రచయిత్రుల స్వేచ్ఛకి సంపాదకురాలిగా అడ్డం పడకూడదని గట్టిగా అనుకున్నాను. అందుకే ఎలాంటి నియమాలు, నిబంధనలు, బంధనాలు పెట్టలేదు. అంత విభిన్నమైన ప్రాంతాలు, వైవిధ్యమైన కథనాలు రావడానికి ఈ స్వేచ్ఛ కూడా ఒక కారణం కావచ్చు,

*

మనోజ్ఞ ఆలమూరు

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • “స్త్రీలు యాత్ర చేయడమే విశేషం” – ఈ మాటకు మరో పదేళ్లలో కాలదోషం పట్టితీరుతుంది.

    థాంక్యూ మనోజ్ఞా..కంగ్రాట్స్ స్వర్ణగారూ

  • సరికొత్తప్రయోగం. పుస్తకం సంకలనం చేసినవారికి , ప్రచురిమ్చినవారికి , అతి క్లుప్తంగా ఇంటర్వ్యు చేసి చదివించేలా చేసిన మీకు అభినందనలు.

  • ఒక సరికొత్తప్రయోగం. పుస్తకం సంకలనం చేసిన సంకలనకర్తకు , ప్రచురించిన వారికీ, అతి క్లుప్తంగా ఇంటర్వ్యు చేసిన మీకు అభినందనలు.

  • స్త్రీ యాత్ర చేయడమే విశేషం , ఆర్ద్రమైన ఈ ఒక్క మాటచాలు ,ఎంత ఆరాటంతో ఈ కూర్పు చేశారో , రాగ సాధిక వచ్చేసింది , ఇంతియానం కోసం ఎదురుచూపు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు