కుక్కొకటి తోకూపుకుంటూ జాయిగా ఏదో డాన్సు చేస్తున్నట్టు నడుస్తోంది ప్లాట్ ఫామ్ మీద .
కొంచెం స్టేషన్ కి దూరంగా పెందుర్తి ఫ్లై ఓవర్ బ్రిడ్జి మీదనుంచి లారీలు దుమ్ము రేపుకుంటూ పోతున్నాయి.
సాయంత్రం కావడంతో స్టేషన్ చుట్టూరా అంతా చాలా అందంగా వుంది. అక్కడక్కడ బెంచీలు మొక్కలు వున్న చిన్న స్టేషన్ అది. చాలా అందంగా వుంది.
కాసేపట్లో పలాస నుంచి విశాఖ వెళ్లే పాసెంజర్ ఆగుతుంది.
ఆ తరువాతెప్పటికో కిరండోల్ నుంచి వొచ్చే బండి వస్తుంది.
మధ్యలో బళ్లేవీ లేవుకాబట్టి ప్లాట్ ఫామ్ దాదాపు ఖాళీ.
స్టేషన్ కి అవతల తుమ్మ చెట్లు వున్నాయి, కత్తిరిపిట్టొకటి తూనీగలు మధ్యలోంచి తిరుగుతోంది.
స్టేషన్ చివరివరకూ నడుచుకొచ్చిన రఘు, ఆ బెంచీ పై కూర్చొని
ఆమె కోసం చూస్తున్నాడు.
వెనక స్టేషన్ని ఆనుకొని వున్న ఇంట్లో నుంచి పాటలు వినపడుతున్నాయి.
మధ్యలో ఆడాళ్ళు పిల్లల్ని పిలుస్తున్న కేకలు.
‘ ఒరేయ్ గుంటా.. ఎక్కడరా ?’ అంటోంది తల్లి.
రఘు నవ్వుకొని..’ అవునూ తను ఎక్కడ ? ఇంకా రాలేదేమి ? ‘
స్టేషన్ ఈ చివర ఈ బెంచీ వుంది, బెంచీ పక్కనే బోగంవిల్లా మొక్క, తెల్ల పూలు పూసి కొన్ని కింద రాలిపడి వున్నాయి. వున్నాయి.
స్టేషన్ ఆ చివరనుంచి ఆమె వొచ్చింది వేగంగా.
ఒక నవ్వు నవ్వింది, లేటయిందా అన్నట్లు.
‘హా.. ఏం పర్లేదు’ అన్నట్టు అతను తన మోహంలో భావం పలికించాడు.
‘ ఏమాలోచించావు ?’ రఘు నేరుగా విషయంలోకి వెళ్ళిపోయాడు.
ఏం మాట్లాడకుండా..కాసేపు రైలు పట్టాల వంకా, ఆ చివర ఆగిపోయి వున్న గూడ్సు బండి వంకా చూస్తూ వుంది.
‘అంతా డాడీ ఇష్టం, అతను ఇంజనీరింగ్ చదివాడు, స్టీలుప్లాంటులో వుద్యోగం. నాఖర్చులు అవీ తెలుసుగా .. ఇలా అయితే బాగుంటుందని డాడీ .. ఇదే.. ఒకే చేసేట్టున్నారు ‘
ఆమెకు ఇష్టముందా ? లేదా ఇంట్లో వాళ్ళకోసం చేసుకుంటుందా ? లేదా ప్రలోభ పెడుతున్నారా ? అతనికి అర్ధం కాలేదు.
‘’నాక్కుడా అదే సబబు అనిపిస్తోంది ‘
ఆమె మాట రఘు కి చాచిపెట్టి కొట్టినట్లుగా అనిపించింది.
‘ నేను మన భవిష్యత్తు కోసం వివరంగా నీకు చెప్పిన ప్రొపోజల్ బాగుంది కదా.. అదే ..ఇద్దరం నచ్చిన ఉద్యోగాలు చేసుకోవొచ్చు..ఒకరు సామాజిక జీవితంలో వున్నా పర్లేదు, అందరిలా జీవితంలో గాడిద చాకిరీ మోయకుండా ఉండొచ్చు ‘
‘ నీ ప్రేమ చాలా కమర్షియల్గా వుంది.. రఘు , కేవలం ఒక వలయంలోంచి తప్పించుకోవడానికే నువ్వు ప్రొపోజ్ చేసేవేమో అనిపిస్తుంది. నీ ప్రొపోజల్ నన్ను గాయపరిచింది , ఎందుకు అనేది నేను చెప్పలేను ‘ అందామె.
‘ బహుశా ప్రేమ అనే ఒక్క అంశమే మాట్లాడి ఉంటే సరిపోయేదేమో ..సర్లే ‘ అన్నాడు.
‘ అవునా .. ? కేవలం ప్రేమ కోసం ప్రేమ ఉండదు అనుకుంటున్నాను .. ప్రేమలో వాస్తవంగా ఉండటం అవసరం, లేదంటే చాలా సమస్యలు వొస్తాయి ‘ కొంచెం చిరాకు కనపడింది అతని మొఖంలో.
‘పోనీ కులం.. విషయమా.. ఇద్దరికీ పెద్ద కులం తేడాలు లేవు కదా ?’
‘అంటే ..ఇన్నాళ్లు మనం విన్న క్లాసులు, సమాజం మార్పు ఇవ్వన్నీ మన ఆచరణకు అందనివి అంటావా ?’ అన్నాడు రఘు. మళ్ళీ అతనే మాట్లాడాడు.
ఆమె ఏమీ మాట్లాడకుండా వింటోందంతే.
‘ అలాగే అనిపిస్తోంది ‘ అంది కొద్దిసేపు మౌనం తరువాత.
‘ కేవలం.. కాలేజీ కెలుతున్నపుడు సామాజిక ఉద్యమాలలో తిరిగితే చాలులే అనుకుంటున్నారేమో మరి.. పెళ్లి అనేది వేరే డైనమిక్స్ తో ఉంటుందని అర్ధమవుతుంది ‘ అందామె.
చ్చ..నాలాంటి వాడికి ఇంతకంటే రిజెక్షన్ ఉండదేమో అనుకున్నాడు రఘు. ఆశ పెట్టుకోవడం అది అవకపోతే తీవ్రంగా నిరాశ చెందడం అతని బలహీనత.
‘నేను మన విషయం చాలా ప్రాక్టికల్ అనుకున్నాను. ఇలా తలకిందులవుతుందని అసలు ఊహించలేదు.
స్కూల్లో టీనేజి ఫ్లర్టింగ్ మీద కూడా నాకు చాలా అవగాహన వుంది, ఒక బ్రామ్మలమ్మాయి వెంటపడేవాణ్ణి. కానీ అది ఏ మాత్రం కుదరదనే అవగాహన ఆ వయసులో నే వుంది నాకు. ‘
‘ వూ .. గొప్ప ప్రాక్టికల్ మనిషిని అని నీకు నువ్వు గొప్పలు చెప్పుకుంటావ్ , అదే నాకు నీలో నచ్చదు. ‘
‘అవునా.. ఓహ్.. అయితే ఈ అలవాటు మానుకోవాల్సిందే ‘
‘ మానుకో కానీ.. నాకు ఇంక నీ అలవాటుతో నాకు పనిలేదు ‘
రఘు అవతల వున్న తుమ్మ చెట్లు బూడిద రంగులోకి మారిపోవడం చూస్తూ కాసేపు ఏమీ మాట్లాడకుండా వుండిపోయాడు.
ఇంక చీకటి కమ్ముకొచ్చేస్తుంది. ఆమె వెళ్ళిపోతుంది.
‘ మనమందరం ఒక పెళ్లి,పిల్లలు, చీటీలు, ఇల్లు కొనుక్కోవడం, ఫంక్షన్లు, పుణ్యక్షేత్రాల సందర్శన ఇలా ఒక వృత్తం లోనే బతుకుతాము, అది బ్రేక్ చేయడం చాలా కష్టం , కానీ మనకా అవకాశం ఉంటుందని అనుకున్నాను.’ అని మౌనంగా ఉండిపోయాడు.
‘మరి నువ్వే వృత్తంలో బ్రతకాలనుకుంటున్నావు ?’ అందామె.
‘ సంగీతం వినడం, చదువుకోవడం, నచ్చిన పని చేయాలనుకోవడం,పేరు తెచ్చుకోవడం, మంచి బట్టలు, తిండి, ఊర్లు చూడడం అనే వృత్తంలో ‘ అన్నాడు రఘు.
ఆమెకు తెలీదా ?తాను దేనికోసం తపిస్తుంటాడో… మళ్ళీ కొత్తగా చెప్పాలా ? అని అతని బాధ.
ఒప్పించడానికి ఇంతకంటే మాట్లాడడం అనవసరం అని అతను అనుకున్నాడు.
ఈలోగా హారన్ మోగిస్తూ పలాస పాసెంజరు వొచ్చింది, విజయనగరం నుంచి డూటీలు చేసుకొన్న వాళ్ళు, కాలేజీ స్టూడెంట్సు, తట్టలు పట్టుకొని భవన నిర్మాణ కార్మికులు దిగి నిముషంలో స్టేషన్ ఖాళీ చేసేసి వెళ్లిపోయారు.
రైలు స్టేషన్ దాటి వెళ్ళిపోయింది.
ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.
కాసేపట్లో ఆమె కూడా వెళ్ళిపోయింది. ఇంక మాట్లాడేదేమీ లేదన్నట్లు.
అలా ఆ చీకట్లో చాలా సేపు కూర్చున్నాడు, బెంచీ స్టేషన్ చివరగా ఉండడం వల్ల అక్కడ వెలుగు లేదు. వెనక ఇళ్లలో లైట్లు వేసారు.
ఫ్లై ఓవర్ మీద వాహనాలు భారంగా వెళుతున్నాయి.
అక్కడితో వాళ్ళ జీవితాలు సమాంతరంగా సాగి జీవితమనే ప్రయాణంలో మునిగిపోయాయి.
ఒక నెల తరువాత ఆమె తన కులమతన్ని పెళ్లి చేసుకొని.. కట్నాలు, గొడవలు,పూజలు, ఇమడలేక బాధపడి, తన గతం పై ఖాళీ వున్నపుడు గుప్పెడు ప్రేమ కవితలు రాసి, బతకని బిడ్డ బారెడులా, ఫలించని ప్రేమ గొప్పదనుకుంటుంటుంది.
రఘు కూడా వాళ్ళ బంధువులమ్మాయిని చేసుకొని ఒక్కోసారి ఒక వృత్తంలో జీవించడం మొదలు పెట్టాడు.
సమాజం, ఉద్యమాలు, ప్రేమ ఇలా అన్నింటిపై ఇప్పుడతని అభిప్రాయాలన్నీ చాలా మొరటుగా ఉంటాయి.
మొన్నెవరో కనిపించి ప్రేమ, ఆదర్శాలు, ఇజాలు అని మాట్లాడితే.
‘ ప్రేమా..బొక్కా..’ అని అన్నాడంట.
రఘు లాంటి అత్యంత సున్నితమైన మనిషి నుంచి అటువంటి మాటలు విన్న ఆ మిత్రుడి మరింక రఘుతో మాట్లాడకూడదని నిర్ణయించుకున్నాడట.
రఘు మాత్రం ఎప్పుడైనా ఒకసారి సాయంత్రం స్టేషన్ చివర బెంచీ మీద కూర్చొని ఏ కనపడని శక్తులు మనుషుల ప్రేమను, ఆశలను, ఆశయాలను నలిపేస్తున్నాయి?
ప్రేమ ఇప్పుడు కాలాన్ని బట్టి ఇంకా ఎన్ని వాణిజ్యరూపాలు తీసుకుంటుందో కదా అని తెగ ఆలోచిస్తూంటాడు.
ఇప్పుడు కూడా స్టేషన్ వెనక ఇంటిలోంచి పాటలు వినిపిస్తుంటాయి.
అరకు నుంచి కిరండోల్ వెళ్లే పాసెంజర్ పెందుర్తి స్టేషన్లో హారన్ కొట్టే క రఘు పాంటు కంటిన దుమ్ము దులుపుకొని. లేచి వెళ్ళిపోతుంటాడు.
*
Add comment