సారంగ చానెల్ లో చూడండి. వినండి – ఎంతో విశిష్టమైన శ్రీనివాస్ బందా స్వరంలో-
దాసరి అమరేంద్ర “కొన్ని కలలు-ఒక స్వప్నం: స్కూటరు మీద దక్షిణ దేశయాత్ర”
ది గ్రేట్ ఇండియన్ యుటర్న్
కొల్లూరి సోమశంకర్
మనుషులకి ఆశలుంటాయి…. కోరికలుంటాయి… వాటిని నెరవేర్చుకోడానికి ప్రయత్నించిన వాళ్లందరూ విజయం సాధించలేరు. అవి నెరవేరకపోవడానికి పెద్దగా కారణాలేమీ ఉండకపోవచ్చు… ఒకటో రెండో కారణాలున్నా ఒక్కోసారి అవి సహేతుకంగా అనిపించకపోవచ్చు. బాధ్యతల బరువు ముందుకు సాగనివ్వకపోవచ్చు. చివరికి కొన్ని కలలు తీరకుండానే, జీవితం గడిచిపోతుంది. కొందరు మాత్రం బాధ్యతల బరువులు మోస్తూనే, తమ ఆశల మొలకలు వాడిపోకుండా జాగ్రత్త పడతారు. బరువులు మోస్తూనే తమ కలల్ని నెరవేర్చుకునే మార్గాలు వెతుక్కుంటారు. ఆ మార్గంలో నడిచి తమ కలలను నిజం చేసుకుంటారు. ఓ స్వప్నం సాకారమైతే కలిగే అనుభూతి వర్ణనాతీతం. ఆ వ్యక్తి యాత్రికుడైతే… అతను కనే కల ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఓ యాత్ర అయితే… ఆ కల సాకారమైతే ఇక చెప్పేదేముంది? యాత్రికుడు భావుకుడవుతాడు, తన్మయుడవుతాడు. తన ఆనందాన్ని జ్ఞాపకాలలో దాచుకుంటాడు… అవి ఫొటోలు కావచ్చు, సావెనీర్లు కావచ్చు… ఆయా ప్రాంతాల పోస్ట్ కార్డులు కావచ్చు… ఆ పరవశపు క్షణాల్ని నిలిపి ఉంచేందుకు ప్రయత్నిస్తాడు. ఆ యాత్రికుడు రచయిత అయితే తన కలలను, ఆశలను, అనుభవాలను, అనుభూతులను చదువరులతో పంచుకుంటాడు. సమహృదయులను అక్షరయాత్ర చేయిస్తాడు. దాసరి అమరేంద్ర చేసిందదే! నలభై ఏళ్లుగా వెంటాడిన ఓ కలని నెరవేర్చుకుని… సాకారమైన స్వప్నాన్ని అక్షరబద్దం చేసి పాఠకులకు అందించారు.
స్కూటర్ పై దక్షిణ భారతదేశ యాత్ర చేయాలన్న చిరకాలపు కోరికను 2015 జనవరిలో తీర్చుకున్న విధానాన్ని ‘కొన్ని కలలు ఒక స్వప్నం’ అనే యాత్రారచనలో వివరిస్తారు దాసరి అమరేంద్ర. ‘ప్రయాణాలంటే వింతలూ విశేషాలే కాదు. ప్రకృతి పరవశమూ మాత్రమే కాదు. మనుషులు… మనుషులు… మనలాంటి మనుషులు,’ అన్న ఎరుక అమరేంద్రది. ఆ రీతిలోనే సాగిన యాత్ర ఇది.
*
బెంగుళూరునుంచి తిరుపతి, కాణిపాకం, అరక్కోణం, కంచి మీదుగా చెన్నై, అక్కడ్నించి మహాబలిపురం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, వేలాంగిణి, నాగపట్నం, పూంపుహార్, కరైకల్, వేదారణ్యం, కలిమెరె, రామేశ్వరం, ధనుష్కోటి మీదుగా కన్యాకుమారి. అక్కడ్నించి ది ‘గ్రేట్ ఇండియన్ యుటర్న్’ తీసుకుని త్రివేండ్రం, క్విలన్, అలెప్పీ, కోచి, అలువ, త్రిస్సూర్, పాల్ఘాట్, సేలం, హోసూరు మీదుగా బెంగుళూరు. సుమారు మూడువేల కిలోమీటర్లు… ఒంటరి ప్రయాణం… యాక్టివా పై…!
నిజమే! ఆయన భౌతికంగా ఒంటరిగానే ప్రయాణించినా… మానసికంగా మనుషులతోనూ, ప్రకృతితోనూ కలసి ప్రయాణించారు. కొన్ని ప్రాంతాలలో ప్రకృతిని ఆస్వాదించారు. కొన్నిచోట్ల మనుషుల సహచర్యాన్ని పొంది ఆనందించారు. కొన్నిచోట్ల ఒకప్పుడు ప్రకృతి ఆడిన విలయతాండవం గుర్తు చేసుకుని బాధపడ్డారు. ఆనాటి విషాదం తెలియని ఈనాటి పాఠకులకోసం చెమ్మగిల్లిన హృదయంతో దాన్ని వివరించారు.
సాహితీమిత్రులు, పరిచయస్తులు, బంధువులు, ఒకనాటి సహోద్యోగులు… పూర్తిగా అపరిచితులు… ఆయా ప్రాంతాలలో అమరేంద్ర కలిసిన మనుషులు! తెలిసినవాళ్లనీ ఆప్తులనీ మళ్ళీ కలుసుకోవడం సంతోషదాయకమే… కలుసుకుంటే ఏమవుతుంది? ఒకరినొకరు మరింతగా తెలుసుకుంటాం. జీవన విధానాలను అర్థం చేసుకుంటాం. కుటుంబీకులైనా, బయటివాళ్లయినా వాళ్లని చూసి నలుగురితో ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో గ్రహిస్తాం. జీవితాన్ని వీలైనంత ఆనందంగా గడపగలిగే మార్గాలను కనుగొంటాం.
ఈ పదిరోజుల యాత్రలో… అమరేంద్ర పూర్తిగా మనుషుల కోసమే గడిపింది, రెండే రెండు రోజులు. అంత తక్కువ సమయంలో పైన చెప్పినదంతా సాధ్యమా అన్న అనుమానం కలగవచ్చు. కాని గ్రహించగలిగితే, అర్థం చేసుకోగలిగే కొందరితో ఒక పావుగంట సంభాషణ చాలు! ఒక అర్థవంతమైన వాక్యాన్ని తరువాత విశ్లేషించుకుంటే రెండు పేజీలకు సరిపోయేంత వివరణా రావచ్చు. సందేహం లేదు. కొందరు వ్యక్తులు అంతలా ప్రభావం చూపుతారు. సహోద్యోగి కోషిగారి అమ్మగారు, సహోద్యోగులు కుట్టీ, సుగదన్, దివాకరన్, దూరపు బంధువు ప్రొఫెసర్ కరుణాకర్… లాంటి వాళ్ల గురించి తెలుసుకోవడం మనకూ ఉత్తేజాన్నిస్తుంది.
అరక్కోణంలో భాష తెలియని బంధువులతో ‘మాట్లాడిన’ తీరు ఆకట్టుకుంది.
తిరుపతినుంచి అరక్కోణం వెళ్ళే దారిలో కనిపించిన అద్భుత శిలలు అమరేంద్రగారిని నిలువరిస్తాయి. సమూహంగా గుమిగూడి మాట్లాడుకొంటున్న మనుషుల్లా అనిపిస్తాయి. అందీ అందనీ కావేరీ సంగమం రచయితని ఊరించినట్టే మననీ ఊరిస్తుంది, నిట్టూర్చేలా చేస్తుంది.
*
‘ఎక్కడా కొత్తదనంగానీ బెరుకుగానీ కలగలేదు…’ అంటారు అమరేంద్ర ఒకచోట. కారణం… ‘ఇదంతా నా దేశం… నా భాష… నా మనుషులు అని మనసారా అనుకోవడమే,’ అని అంటారు. నిజమే. దక్షిణాది రాష్ట్రాలలో సంస్కృతి, ఆచార వ్యవహారాలు, ఆహారపుటలవాట్లు చాలావరకూ ఒకేలా ఉంటాయి. చాలా ఊర్ల పేర్లు సైతం చిరపరిచితమే… సంకోచించాల్సినదేదీ లేదు. కొద్దిగా శారీరక అలసట తప్ప మానసికంగాగానీ, భౌతికంగాగానీ అమరేంద్రను నిలువరించినదేదీ లేదు. అందుకుతోడు ఆ యాత్రలు చేసే మనిషికి ఆయా స్థలాలతోనూ, ప్రకృతితోనూ, మనుషులతోనూ మనసు పెట్టి ఊసులాడగలిగిన శక్తి ఉంటే, సంకోచం సంగతి అటుంచి జగమంతా తానే అన్న భావన అలవోకగా కలుగుతుంది. అమరేంద్ర విషయంలో అదే జరిగింది. ఇలాంటి ఒంటరి యాత్రలు విజయవంతం కావాలంటే సంకల్పబలం గట్టిగా ఉండాలి. అది ఒకటికి రెండింతలు ఉన్న మనిషి అమరేంద్ర. అందుకే అనుకున్న రీతిలో యాత్ర ముగించారు. అంతే అందంగా ఆ అనుభూతులను గ్రంథస్తమూ చేశారు.
ఈ పుస్తకం చదివే పాఠకులు కూడా రచయితతో పాటు ప్రయాణిస్తారు. అనుభూతులను స్వంతం చేసుకుంటారు.
దక్షిణ భారత విలక్షణ యాత్రకి స్వాగతం….
* * *
నాకింకా బాగా గుర్తు- నలభై సంవత్సరాల క్రితపు సంగతి…
ఓ అర్ధరాత్రి మా ఇంట్లోంచి బయటికొచ్చాను. కొత్తగా కొన్న బాబీ బైక్ స్టార్ట్ చేశాను. ఢిల్లీ వివేక్ విహార్ రోడ్ల మీదకు ఉరికించాను. వేగమందుకొని యమున దాటి రాజమార్గాల్లోకి ప్రవేశించాను. హఠాత్తుగా బైక్ గాల్లోకి ఎగిరింది. భవనాల మీదుగా సాగింది. దిగువున హుమాయూన్ టూంబ్ కనిపించింది. కుతుబ్ మినార్ అడ్డమొస్తే తప్పించాను. విమానాల పైలట్లు చేతులూపారు. ఢిల్లీ నగరం వజ్రవైఢూర్యాలతో ధగధగలాడింది. బైకు తాజ్ మహల్, హవామహల్, జైసల్మేర్ కోట, గోల్డెన్ టెంపుల్, మంచుకొండలు, గంగానది, లక్ష్మణ్ ఝూలాల మీదుగా ఎగిరి ఎగిరి వెలుగు రేకలు విచ్చుకుంటున్న సమయంలో ఇంటికి చేరింది. మెయిన్ డోర్ లోపల బోల్టు పెట్టి ఉంది. కాలింగ్ బెల్ నొక్కాను. లోపలివాళ్లు లేవలేదు. తలుపులు దబదబ బాదాను. ఆ శబ్దానికి నాకే మెలకువ వచ్చింది.. కల చెదిరింది.
మోటారుసైకిలు కొత్తగా కొని, దాని మీద సిమ్లా, ఆగ్రా, జైపూర్, అమృత్సర్, హరిద్వార్ తిరిగి రావాలని పగటి కలలు కంటూ మ్యాపులు ముందేసుకొని, వాటిల్ని అధ్యయనం చేసి చేసి రాత్రి నిద్రలోకి జారుకొన్న ఫలితమా లేప ప్రవరాఖ్యుని కల.
డెబ్భైలలోనే బాబీ బైక్ మీద ఒంటరిగానూ, మరో మిత్రుడితో కలిసి ఆగ్రా, జైపూర్, సిమ్లా, హరిద్వార్ వెళ్లి వచ్చిన మాట నిజం..
తొంభైలలో తోడల్లుడు ఉన్నిక్రిష్ణన్తో కలిసి రెండు మూడు రోజులపాటు బెంగుళూరు నుంచి కూర్గ్, ఊటీలాంటి ప్రదేశాలకు నాలుగయిదుసార్లు తిరిగాను. 1993లో మరో తోడల్లుడు ప్రసాద్, అతని ఎయిర్ ఫోర్స్ సహోద్యోగులు బాబు, బలరాంలతో పఠాన్ కోట్ నుంచి రోహతాంగ్ కనుమవరకూ ఓ నాలుగయిదు రోజులు స్కూటర్ల మీద ‘సాహస’ యాత్ర చేశాను.
రిటైరైన తర్వాత నా చివరి పోస్టింగు నగరం పూనాలో మరో నాలుగు నెలలు ఉండిపోయి ఆ చుట్టుపక్కల ప్రదేశాలను తడవకో రెండురోజులపాటు నా బజాజ్ కాలిబర్ బైకు మీద తిరిగి వచ్చాను.
అంతా కలిపితే ఓ పాతిక ముప్ఫై వేల కిలోమీటర్లు మోటార్ సైకిళ్ల మీద తిరిగి ఉంటాను.
అయినా కొన్ని కోరికలు మిగిలేపోయాయి.
ఒక బైక్ తీసుకొని ధనుష్కోటిదాకా వెళ్లాలని, పాంబన్ బ్రిడ్జి మీద సముద్రం దాటాలని, కన్యాకుమారి దగ్గర బాగా చీకటి పడేదాకా సముద్రంతో కబుర్లాడాలని, కావేరీనది సాగరసంగమ బిందువు చేరాలని, బయటివాళ్లకంతగా తెలియని కలిమెరె అగ్రం చూడాలని, కథల కంచికామాక్షి గుడి చూడాలని, అరక్కోణంలో మా కొత్త బంధువుల్ని పలకరించాలని, పాండిచ్చేరిలో ఈమధ్య ఫేస్ బుక్ లో తెలిసి వచ్చిన చెరుకూరి రామకృష్ణ కుటుంబంతో ఓ పూట గడపాలని, దక్షిణాది రాష్ట్రాల గ్రామసీమల్లో వందలాది మైళ్లు తిరుగాడాలని, తూర్పున ఉండే సముద్రం పశ్చిమానికి వచ్చేలా ది గ్రేట్ ఇండియన్ యు టర్న్ తీసుకోవాలనీ…
ఓ పదీ పదిహేనురోజుల పాటు ఓ నిర్దుష్టమైన ప్రణాళిక అంటూ పెట్టుకో కుండా రాజమార్గాలు వదిలిపెట్టి, సన్నదారులు పట్టుకొని, చిన్న పట్నాలు ఆతి చిన్న గ్రామాల మీదుగా, తెలియని ప్రదేశాలను చూస్తూ, తెలియని భాష వింటూ, తెలియని మనుషుల్ని కలుస్తూ- అలా అలా తిరిగి తిరిగి తిరిగి రావాలని….
ఎన్ని కలలు… ఎన్ని కోరికలు… మరి కోరికల పునాదుల మీద నేను నిర్మించుకున్న ఈ మహాస్వప్నసౌధం సాకారమయ్యేనా?!
ఓ రెండేళ్ల క్రితంవరకూ అవి పగటికలలుగానే మిగిలిపోతాయని అనిపించింది.
“తమకు గొప్ప గొప్ప టెన్నిస్ ఆటగాళ్లకూ, మన క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కరుకు వచ్చిన సమస్యే వచ్చింది. దీన్ని ‘టెన్నిస్ ఎల్బో’ అంటారు.” కులాసాగా చెప్పాడు మా ఫిజియోథెరపిస్టు- సరదా మనిషి.
“రోజుల తరబడి పూనా కొండల్లో నా కాలిబర్ క్లచ్ లాగీలాగడం వల్లనే నంటారా ఈ సమస్య?” సమాధానం తెలిసే అడిగాను.
“సందేహమా?” జయభేరి పాట బాణీలో ఆయన సమాధానం.
“ఎంతకాలం పడుతుంది సరవ్వడానికి? మళ్లా బైక్ నడపగలవా?” అనుమానం అనుమానంగా నా తదుపరి ప్రశ్న.
ఓ నవ్వు నవ్వారు. “సరిగ్గా ఈ ఎక్సర్సైజులవీ చేస్తే ఆరునెలలు. కనీసం మరో ఆరునెలల దాకా బైక్ లాంటి పదార్థాలు పనికిరావు. ఆ తర్వాతయినా వీలయినంత తక్కువగా…”
అయిపోయిందయిపోయింది. సప్నా మేరా టూటయా….
బుద్ధిమంతుడిలా బైకు సంగతి మర్చిపోయాను. బండి అమ్మేశాను. కొన్ని కలలు కలలుగానే మిగిలిపోతాయిలే అని నాకు నేను ఫిలాసఫీ పాఠాలు చెప్పు కున్నాను.
అలా దాదాపు ముప్పయ్ నెలలు గడిచిపోయాయి.
“అమరేంద్రా… నా కొత్త ఏక్టివా చూశావా? కొత్త అంటే కొత్తదేం కాదు. 2006 మోడలు. మంచి ధరకు వచ్చింది. కొనేశాను. బ్యూటీఫుల్ బండి,” రెండువేల పద్నాలుగు నవంబరులో బెంగుళూరు వెళ్లినపుడు సంబరంగా చెప్పుకొచ్చాడు, తోడల్లుడు ఉన్నికృష్ణన్.
అతనికి మోటారు వాహనాల ‘వ్యామోహం’ ఉంది. ఓ పాత అంబాసిడరు, మరో పాత మారుతీ జిప్సీ, ఓ బులెట్ బైకు- అతని వింటేజి సేకరణలోని ముఖ్య దినుసులు. అవి అతని ఆప్యాయతలను అందుకోడానికే తప్ప వాహనాలుగా వాడబడవు, పరిగణింపబడవు. వాడుక కోసం అతనికొకటీ, మా మరదలు- అతని భార్య అరుణకొకటీ రెగ్యులర్ కార్లున్నాయి.
చిన్నపుడు సెలవల్లో ఉన్నిని వాళ్లమ్మగారు పనికొచ్చే పని నేర్చుకుంటాడని సైకిలు షాపులో పెట్టారట. క్రమంగా అతనికి అన్నిరకాల బళ్ల మెకానిజమూ ఒంట బట్టింది. చదివింది, వుద్యోగం చేసేదీ మానవవనరుల – హెచ్ ఆర్ విభాగంలోనే అయినా, ఓ ఆటోమొబైల్ ఇంజనీరుకు ఉండేటంతటి సాంకేతిక పరిజ్ఞానమూ, ఓ నిపుణుడైన మెకానిక్కుకు ఉండేటంత రిపేరు ప్రావీణ్యమూ ఉన్నాయి ఉన్నీకి! “ఓ! బ్రహ్మాండం. గ్రేట్. గేర్‌లెస్ బండిగదూ… నాకో పదిరోజులిస్తావా? అలా కన్యాకుమారిదాకా వెళ్లి వస్తానూ?” సరదాని కలగలిపి అడిగాను. అతను ఓ పట్టాన తన బండి మీద పరాయివాళ్ల చెయ్యి పడనివ్వడు. మేమిద్దరం రోజుల తరబడి తిరిగిన రోజుల్లో కూడా బండి తనే నడిపేవాడు. నన్ను ముట్టుకోనిచ్చేవాడు కాదు. “దానికేం భాగ్యం, తీసుకో, ఎపుడొస్తావో చెప్పు, సర్వీసింగదీ చేయించి టిప్ టాప్ గా ఉంచుతాను.”
మూర్ఛపోయాను. వెంటనే తేరుకుని కేలండరు గుణించి, “డిసెంబరు 28న బెంగుళూరు వస్తాను. 29నగానీ 30న గానీ బండిమీద బయల్దేరతాను. మళ్లీ జనవరి పదీ పదకొండు ప్రాంతాల్లో బెంగుళూరు చేరతాను.”
….అన్నారు గదా…. ఇనుము వేడిగా ఉన్నపుడే మనకు అనువుగా మలచుకొనే ప్రయత్నం చెయ్యాలనీ…
డన్ అంటే డన్ అనుకొన్నాం.
అయినా అనుమానం. ఢిల్లీ వెళ్లాక కూడా ఆ ఉన్న నెలన్నర సమయంలో రెండు మూడుసార్లు ఫోను చేసి లోపాయికారీగా నిజంగా ఇస్తావా, నిజంగానే అని ఆడిగి అడగకుండా అడిగాను. నా అనుమానమూ, దాని నేపథ్యమూ తెలిసిన ఉన్ని “ఇస్తాను, ఇస్తాను..” అని నొక్కి వక్కాణించాడు.
“రమేశ్ గారూ… నేను… అమరేంద్రను. తెలుసు కదా, నా ప్రయాణంలో చివరి రోజిది. సాయంత్రానికి బెంగుళూరు చేరతాను. ఇప్పుడే కృష్ణగిరి దాటి, ఒక గంటలో హోసూరు చేరబోతున్నాను. ఎప్పట్నించో నాకున్న ఓ కోరిక హఠాత్తుగా బయటపడింది. హోసూరులో రచయితలు, సాహితీమిత్రులూ పుష్కలంగా వున్నారు కదా… వారితో ఓ గంట గడిపే వీలుంటుందా? ఇంత హడావుడిగా చెప్పడం సరికాదని తెలుసు. అయినా ఏదో ఆశ…’
“ఒక్క పది నిమిషాలు టైమివ్వండి, ప్రయత్నిస్తాను.” అన్నారు స.వెం. రమేశ్.
“నాకు తెలిసిన మనిషంటూ లేని దేశాల్లో, ప్రదేశాల్లో అలా అలా రోజుల తరబడి తిరగాలనే కోరిక ఎక్కడో లోలోపల ఉందనుకుంటాను. ఇప్పటికి తీరింది. గత ఐదారు రోజుల్లో కలిసిన మొట్టమొదటి తెలిసిన మనిషివి నువ్వు.” పాతిక ముప్ఫై ఏళ్లుగా నాతోపాటు భారత్ ఎలక్ట్రానిక్స్ కంపెనీలో కలిసి పనిచేసిన స్నేహితుణ్ణి ఓ జనవరి రాత్రి తొమ్మిదిన్నరకు ఎర్నాకుళం శివార్లలో కలిసినపుడు అన్నానా మాట.
“సర్… నేనిపుడు కన్యాకుమారి నుంచి కొచ్చి వెళ్లే దారిలో ఉన్నాను. మీ స్వగ్రామం కొట్టాయం ప్రాంతంలో వుందిగదూ… మీ అమ్మగార్ని ఆమె ఊరు వెళ్లి కలవాలన్నది నాకెప్పటిదో కోరిక. ఎలా వెళ్లాలో కొంచెం వివరాలు చెప్పగలరా- ప్లీజ్,” హఠాత్తుగా బుర్రలో ఆ ఆలోచన కలగగా రోడ్డు పక్కన బండి ఆపి మా మాజీ సీఎమ్, కుటుంబానికి ఆప్తుడూ అయిన డాక్టర్ కోషీకి ఫోన్ చేసి అడిగాను.
“ఈ సమయంలో అక్కడేం చేస్తున్నావూ? మా ఊరు వెళ్లాలంటే ముందు నువ్వు రూటు మార్చి కుడిచేతి వేపుకు మళ్లి కొట్టాయం దారిలో చెంగనూరు పట్నం చేరాలి. అక్కడ్నించి మా గ్రామం రబ్బరు తోటలూ ఆడవుల లోలోపల మరో ఇరవై కిలోమీటర్లు. ఒక్కడివే వెళ్లలేవు. మా బావమరిది చెంగనూరులో ఉంటాడు. అతను నిన్ను తీసుకువెళ్లగలడేమో కనుక్కొంటాను. ఎనీవే, థాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్ట్ ఇన్ మై విలేజ్ అండ్ అవర్ మదర్.”
“కుట్టీ సాబ్… ఎలా ఉన్నావ్… ఇప్పుడెక్కడున్నానో ఊహించగలవా? దివాకరన్ వాళ్ల ఇంట్లో. మీ ఇంటికి గంటే గదా ప్రయాణం… కాచుకో… మరో గంటలో మీ పాల్ఘాట్ ఇంట్లో ఉంటాను,” అవతలి పక్క డెబ్బయ్ ఎనిమిదేళ్ల కుట్టీ సంబరపడటం వినిపించేసింది.
‘కలగంటి, కలగంటి…’ అని అప్పటి అన్నమయ్య, ఇప్పటి సాలూరి సన్యాసిరావుగారూ ఏ సందర్భంలో అన్నారోగానీ- నా మహా సుదీర్ఘ స్వప్నం ‘డన్’ అనుకున్నపుడే మొదలయిపోయింది. సవివర ప్రణాళిక మనసులో రూపుదిద్దుకోసాగింది.
బెంగుళూరునుంచి తూరుపు దిశలో వున్న తిరుపతికి కథకుడు పలమనేరు బాలాజీని, కాణిపాకం బొజ్జగణపతిని పలకరిస్తూ వెళ్లాలని, తిరుపతిలో మధురాంతకం నరేంద్ర, ఆరెమ్ ఉమా, నవెం రమేశ్ లాంటి అక్షర మిత్రులతో ఓ సాయంత్రం గడపాలని, అక్కణ్నించి అరక్కోణం, కంచిల మీదుగా చెన్నపట్నం చేరుకోవాలనీ – ఇది ప్రథమ పాదం.
చెన్నపట్నంనుంచి బంగాళాఖాతపు తీరరేఖను అంటిపెట్టుకుని సాగిసాగి మహాబలిపురం, పుదుచ్చేరి, కడలూరు, చిదంబరం, వేలాంగణి, నాగపట్నం, పూంపుహార్, కరైకల్ మీదుగా వెళ్లి, వేదారణ్యం దగ్గర ఉన్న- సముద్రంలోకి స్ఫుటంగా చొచ్చుకు వచ్చినట్టు ఉండే కలిమెరే పాయింట్ ను ఓసారి తాకి చూడాలనీ, ఇంకా దిగువకు వెళ్లి రామేశ్వరం, ధనుష్కోడిలను చేరాలనీ, చివరికి భారతదేశపు దక్షిణాగ్రం కన్యాకుమారి దగ్గర తేలాలనీ- యాత్ర పూర్వార్థభాగపు ప్రణాళిక,
కన్యాకుమారి దగ్గర ఉత్తరాయణం ఆరంభించి సముద్రాన్ని అంటిపెట్టుకొని సాగి త్రివేండ్రం, క్విలన్, అలెప్పీల మీదుగా కొచ్చిన్ చేరాలనీ- అక్కడ్నించి కళ్లికోట, కాసర్కోడ్ల మీదుగా మంగుళూరు చేరి తూర్పు దిక్కుకు మళ్లీ ధర్మస్థళ, సక్లేష్పుర్, హసన్‌ల మీదుగా తిరిగి బెంగుళూరు చేరాలని ఆలోచన..
మొత్తం మూడువేల కిలోమీటర్లు పైచిలుకు. బండిని రోజుకు సగటున రెండు వందల ఏభై కిలోమీటర్లు మాత్రమే నడిపి ప్రయాణాన్ని పదీ పన్నెండు రోజులు సాగించాలని నా ప్లాను. రోజులో ఏడెనిమిది గంటలు బండి నడపడానికీ, మరో ఏడెనిమిది గంటలు ఆయా ప్రదేశాలు చూడటానికీ వినియోగించాలని ఆలోచన. ఒక్క తిరుపతి, మద్రాసుల్లో తప్ప- ఇంకేచోటా రాత్రి వసతి గురించిగానీ, ఏ రాత్రి ఎక్కడ ఉండాలో ఆ వివరం గురించిగానీ ఆలోచించగూడదన్నది నా సంకల్పం.
ఇదంతా చూసి నాకే కాస్తంత గుండె గాభరా కలిగిన మాట నిజం. లక్ష్మికి చెప్పాను నా ఆలోచన.
డయాబెటిస్… స్పాండిలైటిస్… ఆర్ధరైటిస్… టెన్నిస్ ఎల్బో… తిండీతిప్పలు… నీళ్లునిప్పులు… పాతబండిలో పదనిసలు… రిపేర్లు విషయంలో నా చేతగానితనం… అంతా అయిదు నిమిషాల్లో కళ్లముందు నిలిపింది లక్ష్మి, మరోసారి ఆలోచించమని హితవు చెప్పింది.
నిజమే… ఒంట్లో ఉండాల్సిన బలహీనతలు అన్నీ ఉన్నమాట నిజమే.
నడపడమే తప్ప మొరాయించిన బండిని బుజ్జగించి నడిపించడం నా సిలబస్ లో లేదు. అయినా తిండీ తిప్పలూ, పాలూ నీళ్లు- నన్ను గాభరా పెట్టలేవు.
డయాబెటిస్ నన్ను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా ఇరవై ఏళ్లనుంచీ చూసుకుంటున్నాను. అది ఈ పది రోజుల్లో ఏ సమస్యా సృష్టించదని నమ్మకం. కానీ లక్ష్మి అన్న మాటలు అక్షరాలా నిజం. నిజానికి అవి నాలో కూడా చెలరేగుతున్న సందేహాల తేనెటీగలు!
‘ఏక్టివాకు గేర్లుండవు. క్లచ్ లాగే పని ఉండదు. అంచేత టెన్నిస్ ఎల్బోకు చెందిన ఏ సమస్యా ఉండదు. బండి ఉన్నీది గదా. వెళ్లగలదని అతను నమ్మకంగా చెపుతున్నాడు. నాకేమో వెళ్లాలని ఉంది. అయినా మొదలెట్టాక అటు బండిగానీ, ఇటు నా శరీరంగానీ కదలమని మొండికేస్తే అక్కడికక్కడ యాత్ర కట్టిపెట్టి బండిని లారీలో వేసుకొని తీసుకువచ్చి బెంగుళూరులో పడేద్దామనే మహత్తర ‘ప్లాన్ బి’ వుంది. అంచేత నువ్వన్న అనుమానాలూ, దిగుళ్లు నాకు లేవు,” సర్దిచెప్పాను. సర్ది చెప్పుకున్నాను.
(మిగతా వచ్చే సంచికలో…)
Add comment