ఎర్రగడ్డకు పంపించడం అనేది జోకుగా వాడుతున్న సమాజంలో మానసిక అనారోగ్యాలకు వైద్యులను సంప్రదించడం సాధారణమైన విషయం కాదు. అది సామాజిక నిషిద్ధాక్షరి. టాబూ. అది వ్యక్తిలోనూ వారి చుట్టూ ఉన్న సమూహంలోనూ ఆ ఎరుకే కలుగకుండా చేస్తున్నది. దాని సింబల్స్ బాహాటంగా బయటపడి వారికో వారి చుట్టుపక్కల ఉన్న వారికో మరీ ఇబ్బంది కరంగా మారినప్పుడు మాత్రమే సంప్రతించే విషయంగా మారింది. డిప్రెషన్, యాంక్సైటీ వంటివి మానసిక అనారోగ్య చిహ్నాలని వాటికి డాక్టర్లను సంప్రతించవచ్చని చాలామందికి తెలీదు. తెలిసినవారు కూడా వెళ్లడానికి ఒకటికి వందసార్లు ఆలోచిస్తారు. వెళ్లినా ఎవ్వరికీ తెలీకుండా జాగ్రత్తపడి మరీ వెడతారు. ఆరోగ్య సమస్యలు అందరికీ చెప్పాలని కాదు. దాని వెనుక పనిచేసే సామాజిక ఒత్తిడి గురించి. ఒక విషయం టాబూగా మారింది అంటేనే దానికి సంబంధించిన సరైన సమాచారం, జ్ఞానం, చైతన్యం వాప్తికి అడ్డంకులు ఏర్పడ్డాయని అర్థం.
ఏదైనా ఒత్తిడికో ఒంటరితనానికో పరిష్కారంగా సోషల్ మీడియాను ఆశ్రయించేవారు ఆ పరిష్కారానికి అంటుకుని సమస్యలు కూడా ఉంటాయని గుర్తించడం అవసరం. ప్రపంచంలో అంతకుముందు లేనన్ని అవకాశాలు, లేనన్ని ప్రమాదాలు సోషల్ మీడియా వల్ల ముందుకొచ్చాయి. ముఖ్యంగా తమ కృషికి కనీస గుర్తింపు లేక బాధపడేవారికి, కలబోసుకోవడానికి తోడులేక మధనపడేవారికి సమయం ఎలా గడపాలో తెలీక కొట్టుమిట్టాడేవారికి ఇదొక మంచి వాహకం. బతుకు దెరువుకోసం 8 గంటలు ఎవరికో సమయాన్ని వెచ్చించాల్సిన అవసరం లేని వారికి, హోం మేకర్స్కి, వృద్ధులకు ఇది అందివచ్చిన వాహిక. మిగతా వారుండరని కాదు. వారికి ఎక్కువ ఉపయోగం అని మాత్రమే.
కాకపోతే ప్రపంచం పురోగతిలో భాగంగా డబ్బు అనే సరుకుని సృష్టించుకున్నట్టుగానే సోషల్ మీడియా ప్రపంచం గుర్తింపును మారకపు సరుకుగా మార్చుకున్నది. పది, యాభై, వంద రూపాయల డినామినేషన్స్ లాగానే ఇక్కడ కూడా లైక్స్ కామెంట్స్ అండ్ షేర్స్ లాంటి డినామినేషన్స్ ఉన్నాయి. భౌతిక ప్రపంచం డబ్బు అని తాను సృష్టించుకున్న సరుకుకు తానే బానిసై కొట్టుకుంటున్నట్టు సోషల్ మీడియా ప్రపంచం తాను సృష్టించిన గుర్తింపు చుట్టూ తిరుగుతూ బొంగరమైపోతుంది. కమోడిటీ పెటిషిజమ్ అంటే వస్తు వ్యామోహం లాగే ఐడెంటిటీ ఫెటిషిజమ్ కూడా నియంత్రణ కష్టమైన అడిక్షన్. స్ర్టెస్, యాంక్సైటీ నుంచి డిప్రెషన్ దాకా తీసికెళ్లగలదు సందర్భాన్ని బట్టి. కమోడిటీ ఫెటిషిజమ్ నీకు అవసరమైన అవసరాలనే కాదు, అవసరం లేని అవసరాలనుకూడా నిరంతరం సృష్టిస్తూ ఉంటుంది. ప్రతీదీ నీకు అవసరమైనట్టే ఉంటుంది, దాని కోసం పరిగెడుతున్నట్టే ఉంటుంది. అది తీరాక దానికంటే పెద్దది అవసరమనిపించి మళ్లీ పరుగుపెట్టేట్టు ఉంటుంది. అలాగే గుర్తింపు వ్యామోహం కూడా. అంతూ పొంతూ ఉండదు. సోషల్ మీడియాలో గుర్తింపు భాషలోనో ఎమోటికాన్స్ లోనో ఇవ్వాలి. కానీ భాష అయినా ఎమోటికాన్స్ అయినా పరిమితి గలవి. ఫినిట్. కానీ గుర్తింపు యావ అనే ఫెటిషిజమ్ ఇన్ ఫినిట్. సూపర్ లేటివ్స్ అయిపోయాక భాషలో తన్నుకు లాడాలి. నీ కవిత/కథ/బొమ్మ అద్భుతం అయిపోయాక నెక్స్ట్ ఏంటి? పరమాద్భుతం, మహాద్భుతం. ఆ తర్వాత?! భాష తొందరగా అయిపోయిచస్తుంది కదా! భాషకున్న పరిమితి లేదా లోటు తీర్చడానికే ఎమోటికాన్స్ ఎప్పటికప్పుడు కొత్తవి ప్రవేశపెడతున్నారు. అయినప్పటికీ అవి వేరే అవసరాలను తీర్చవచ్చునేమో కానీ ఈ యావను తీర్చలేవు. అది నిరంతర యాంక్సైటీ కలిగిస్తుంది. శెట్టిగారు రాత్రి పూట గల్లాపెట్టె లెక్కపెట్టుకున్నట్టుగా లైకులు షేర్లు కామెంట్లు లెక్కపెట్టుకునే వారు అందులోనే తమ పనికి- పనితనానికి విలువను వెతుక్కునే వారు నిరంతరం స్ర్టెస్ బారిన పడొచ్చు. డిప్రెషన్ దాకా వెళ్లొచ్చు. పది మందితో మాట్లాడుతున్నాను అనుకుంటూ సముద్రంలో ఉన్న అనుభూతి పొందుతున్నా అనుకుంటావు కానీ కళ్లునొప్పెట్టి నిద్రపోయే సమయానికి మళ్లీ ఒంటరితనమే వెంటాడొచ్చు. తడితగలకుండా నీటిలో మునిగి ఉన్న ఫీలింగ్ ఇచ్చే సింథటిక్ వ్యవహారం ఇందులో ఉండగలదు. అలవికానంతమందితో సంభాషణలో ఉంటూ లెక్కపెట్టలేనంత మందితో అమ్మా అక్కా అని పిలిపించుకునే వారిని సైతం ఒంటరి చేసి నిస్సహాయను చేయగలదు.
ఇంకో రకంగా చెప్పుకుంటే సోషల్ మీడియా కొందరికి వ్యాపారం. కొందరికి కాలక్షేపపు వ్యవహారం. కొందరికి విజ్ణానం, ఇంకొందరికి వినోదం. ఎక్కువ మందికి వ్యసనం. నీ భౌతిక మానసిక స్థితిని బట్టి ఇవి ఒకదాంట్లోంచి మరొదాంట్లోకి ప్రయాణం చేయగలవు. వ్యాపారం సంగతేమో కానీ ఇతర పాయలు చివరి సముద్రంలోకి ప్రయాణించగలవు.
నిజజీవితంలో చాకిరీకి రకరకాల పనులకు రకరకాల నైపుణ్యాలకు గుర్తింపు నోచని స్ర్తీలు ఈ వాహికల్లో ఎక్కువ యాక్టివ్ గా ఉండే అవకాశం ఉంది. గణాంకాల ప్రకారం ఫేస్బుక్లో ఉండే తెలుగువారిలో మహిళలు పదమూడు శాతమే. కానీ సగం ఉన్నట్టు అనిపిస్తారు. అంటే ఉన్నవాళ్లలో యాక్టివ్ గా ఉండేవారి సంఖ్య మహిళల్లో చాలా ఎక్కువ. ఇంటెన్స్. దీనికి సంబంధించి స్టడీస్ కూడా ఉన్నాయి. గుర్తింపుకు నోచక మగ్గిపోతున్నసమూహం కాబట్టి వారు సోషల్ మీడియానుంచి కూసింత ఎక్కువే ఆశించొచ్చు. అంచనాకు వాస్తవానికి మధ్య ఉండే అగాధం సమస్యలకు దారితీస్తుందని కొత్తగా చెప్పుకోనక్కర్లేదు. వారికే కాదు, ఎవరికైనా. ఈ మాయా ప్రపంచంలో పంచతంత్రంలో ఉండే అన్ని జంతువులూ సంచరిస్తుంటాయి. దేన్ని ఎలా గుర్తిస్తావు అనే సామర్థ్యం మీద చాలా విషయాలు ఆధారపడి ఉంటాయి.
వ్యాసాలు, పాటలు, సినిమాలు, ప్రదేశాలు, ఇలా ఏవైనా అవసరమైనవి పంచుకోవచ్చు. భావాలు, భావావేశాలు. ఇవి కూడా మానసిక స్థితిని బట్టి అవసరాన్ని బట్టి ఒకదొంట్లోంచి మరొకదాంట్లోకి ప్రయాణించవచ్చు. నువ్వు చేసిన వంట, డాబా మీద నువ్వు వేసిన పంట రాత్రి నువ్వు తొక్కిన పెంట గోడమీద పిడకల్లాగా కొట్టుకోవచ్చు. అవి తక్కువైనవేమీ కావు. అనుభవాలు కదా! వీటన్నింటిని పంచుకునే వారు దొరకొచ్చు. పరిచయం, స్నేహం, ప్రేమ, కామం తదితర అంశాలకు పార్ట్ నర్స్ దొరకొచ్చు. సోషలైజింగ్ కి మంచి విషయాలు అని నీవు అనుకుంటున్నవాటిని నీ లాంటివారితో పంచుకోవడానికి తప్పనిసరిగా ఉపయోగపడొచ్చు. గోడనీది కాబట్టి నీ భావాలకు కళాపొసనకు సమ్మతి గ్రాండ్ గా పొందొచ్చు. ఎకో చాంబర్ ఎఫెక్ట్ పొందొచ్చు. జాతర లాంటిది. ఏదైనా! ఏమైనా!
ఇవేవీ కొత్త విషయాలు కావు. మామూలు భౌతిక ప్రపంచంలో కూడా ఇవ్వన్నీ ఉండొచ్చు. కానీ అక్కడ తగినంత వ్యవధీ పరిశీలనా ఉంటానికి ఆస్కారముంది. పంచేద్రియాలతో పరిశీలించగల అవకాశం ఎంతో కొంత ఉంటుంది. కానీ సోషల్ మీడియా టైం అండ్ స్పేస్ భిన్నమైనవి. ‘‘నమస్తే, మీరేం చేస్తారు’’ అనే కరస్పర్శకు ‘‘హే వాట్స్ అప్ అనే టైప్డ్’’ వాక్యాలకు తేడా ఉంటది. యూ కెన్ బ్యూటిఫై. యూ కెన్ కమోఫ్లేజ్. యూ కెన్ మార్ఫ్. యూ కెన్ స్టాక్. చివరకు ‘పరకాయ ప్రవేశం’ కూడా సాధ్యమే. ఏది ఎందుకోసమో గుర్తించగలిగే అవకాశం తక్కువ. సర్పరజ్జు భ్రాంతికి అవకాశం ఎక్కువ. ఎదుటివ్యక్తి మాత్రమే కాదు. నీకు నువ్వు కూడా. ఎందుకంటే మన నిత్యజీవితంలో కొన్ని విషయాల మీద ఉన్న టాబూల వల్ల మనుషులు తమ లోలోపలి భావాలను, ఆశలను అంచనాలను ‘మంచిగా’ ప్యాక్ చేసి మాత్రమే బయటకు పంపిస్తూ ఉంటారు. బ్యూటీఫై అనేది ఫొటోలకే కాదు, భావాలకు కూడా. కొంతకాలం తర్వాత మన అబద్దాన్ని మనమే నమ్మే పరిస్థితి వస్తుంది. అదొక చిత్రమైన స్థితి. హృదయం వర్సెస్ మెదడు అని రెంటిమధ్య ఘర్షణ అని చెపుతారు. వాస్తవానికి నీ ఇమాజినరీ సెల్ఫ్కి రియల్ సెల్ఫ్ కి తేడా అది. మనుషులు ఎక్కువగా ఇమాజినరీ సెల్ఫ్నే పెంచిపోషిస్తూ ఉంటారు.
సాధారణంగా కొత్త సౌలభ్యం వచ్చినపుడు పాత నైపుణ్యం పోయే ప్రమాదం ఉంటది. కాలిక్యులేటర్ అనే బొమ్మ మన చేతుల్లోకి రాకముందు అనేకానేక కూడికలు తీసివేతలు సులభంగా చేసేవాళ్లము. చింతపండు, బియ్యం, నూనె, పప్పులు, సబ్బులూ అన్నీ కలిపి నోటిమీదో వేళ్లమీదో శెట్టిగారితో పాటు మనమూ లెక్కవేయగలిగే వాళ్లము. ఇవాళ షాపులో కుర్రాడు అరవై రూపాయల బియ్యం ఐదుకిలోలు తీసుకుంటే కూడా క్యాలిక్యులేటర్ తో కుస్తీపడుతుంటాడు. మన దైనందిన అనుభవాల్లో చాలా చూస్తాం. అంటే కాలిక్యులేటర్ అనే పరికరం మనకు అంతకుముందు ఉన్న ఒక నైఫుణ్యం పోయేలా చేసింది. మానవసంబంధాల విషయంలో కూడా సోషల్ మీడియా అలాంటి నైపుణ్యం పొగొట్టగలదు. మనుషులను అభిప్రాయాలను కొలవడంలో నీకున్న పారంపర్య జ్ణానాన్ని లైకులు, కామెంట్ల ప్రపంచం తగ్గించగలదు. కొన్ని వెసులుబాట్లు సైడ్ ఎఫెక్ట్ తో కలిపే వస్తాయి. ప్రయోజనమెంత- సైడ్ ఎఫెక్ట్ ఎంత అనేది మనిషి ఎరుక మీదే ఆధారపడి ఉంటుంది.
సోషల్ మీడియా అయినా మరోటయినా సాధనం మాత్రమే. ఎలా ఉపయోగించుకుంటావు అనేది నీ మీదే ఆధారపడి ఉంటుంది. కాకపోతే చిప్స్ లాగా దీనికి కూడా మనల్ని అడిక్ట్ చేసే లక్షణముంది. వెరీ పవర్ ఫుల్ టూల్. ముసుగులతో సంచరించగల అవకాశం వల్ల మనం ఎవరితో మాట్లాడుతున్నామో తెలీకపోయే ప్రమాదముంది. అముఖంగా మాట్లాడడం వల్ల భాష తప్ప భావాన్ని దాని సారాంశంలో సంగ్రహించలేము. పలానా మాట అంటున్నపుడు మనిషి ఏ ముఖంతో ఏ స్వరంతో అన్నారో తెలిస్తే కానీ చాలా విషయాలు అర్థం కావు. హావభావాల నుంచే ఎక్కువ తెలుసుకుంటాం. వెర్బల్ కంటే మనిషి నాన్ వెర్బల్ లోనే ఎక్కువ కమ్యూనికేట్ చేసుకుంటారు. మన సంభాషణల్లో కేవలం ఏడు శాతమే పదాలనుంచి గ్రహిస్తామని 93 శాతం నాన్ వెర్బల్ అని పరిశోధనా సారాంశం. ఆ 93లో 55 శాతం బాడీ లాంగ్వేజ్ అని 38 శాతం స్వరంలో ఉండే తేడాలని చెపుతారు. 7-38-55 అనేది పాపులర్ సూత్రీకరణ. ఈ శాతాలమీద కొంచెం అటూ ఇటూ భేదాభిప్రాయాలుండొచ్చేమో కానీ వెర్బల్ కంటే నాన్ వెర్బల్ మీదే ఎక్కువ ఆధారపడతామనేది అందరూ అంగీకరించే సత్యం. నాన్ వెర్బల్ కమ్యూనికేషన్ లో ఒకరి నుంచి ఒకరికి ప్రసారమయ్యే అంశాలు ఈ సోషల్ మీడియాలో మిస్సవుతాయి. కమ్యూనికేషన్ అసంపూర్ణం అవుతుంది. అసంపూర్ణమైన కమ్యూనికేషన్ అపార్థాలకు ప్రమాదాలకు దారితీయొచ్చు. దీనికి మయసభ లాంటి లక్షణమున్నది. ప్రైవసీగా కనిపించేది ప్రైవసీ కాకపోవచ్చు. తామరతూడు అనిపించింది వాస్తవానికి తుమ్మ కంప కావచ్చు. చేసే పలకరింపు, వచ్చే గుర్తింపు వ్యూహం కావచ్చు. సంభాషణలు సందర్భాలను దాటి ప్రయాణించవచ్చు. మేలుకునే సరికి ఊబిలోకి దిగబడి ఆనక చేసేదేమీ లేక డిప్రెషన్ లాంటి మానసిక రోగాల పాల పడాల్సి రావచ్చు. చుట్టూ మనుషులే అనిపించిన చోట సడన్ గా అలవి కాని ఒంటరితనం ఆవహించొచ్చు. ప్రమాదకరమైన పరిణామాలకు సైతం దారితీయొచ్చు. సోషల్ మీడియాలో దేన్నైనా ఫేస్ వాల్యూతో తీసుకోవడానికి లేదనే ఎరుక అవసరం. మంచీ చెడూ అనే వాల్యూ జడ్జిమెంట్ కంటే స్పష్టత ముఖ్యం. దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒంటరితనానికో రకరకాల ఒత్తిడులకో ఇది పరిష్కారం అయినా కాకపోయినా కనీసం సమస్యగా మారకుండా చూసుకోవాలంటే కూసింత లోచూపు అవసరం.
*
మీరెందుకో పాతతరం వాదన వినిపించారు. నాకు ఫేస్బుక్ 5 నెలలనుచి మాత్రమే తెలుసు. ఇన్నాళ్లు ఇంత కామెడీ ఎందుకు మిస్ అయ్యానో చాల బాధగా ఉంది. మహాత్ములని అనుకున్నవాళ్ళు ఎంత కామెడీని పంచుతున్నారొకదా అని ఆనందంగా ఉంది. మీ రాతలు నాకేమీ నచ్చలేదు.
గమనిక: నా పోస్టులకు మినిమం 3 రెస్పాన్స్ . మాక్సిమం 18 రెస్పాన్స్ . ఈ విషయం నాకు తెలుసు. నాకు మీ హెచ్చరిక పనిచేయదు.
బాగా రాసారు రామ్మోహన్ గారు… మీరు చెప్పిన విషయాలు నేను వాస్తవంలో చూసాను… అందరూ కాకపోయినా కొందరు మాత్రం సోషల్ మీడియా కు ఎడిక్ట్ అయ్యి కష్టాలు కొనితెచ్చుకోవడం నేను చూసాను… మీ ఈ హెచ్చరిక కొందరిలో అయినా మార్పు తీసుకొస్తే బాగుంటుంది…..
I had a facebook account. Went to the page today after about five or so years. Found some friend requests and clicked on them. There was a longer list and I kept clicking on names in it. It was then that I realized that I sent friend requests to a large number of people, some I know and some I don’t. I am sure I annoyed some with requests and angered others by defriending them – all accidentally. Well, I just deleted my account. I don’t need it.
‘ దైనందిన జీవితంలో మనం ఎదుర్కొంటున్న ఒంటరితనానికో రకరకాల ఒత్తిడులకో ఇది పరిష్కారం అయినా కాకపోయినా కనీసం సమస్యగా మారకుండా చూసుకోవాలంటే కూసింత లోచూపు అవసరం.’
——-
మొత్తం వ్యాసం ఒక ఎత్తు..చివరి ముగింపు ఒక ఎత్తు. రాగ ద్వేషాలకు, వెకిలితనానికి, ఇంకా పేర్కొనేందుకు అందని అసంఖ్యాక అంశాలకు వేదిక గా మారి మన ప్రైవసీని భంగపరచనంతవరకు ఫరవాలేదు..ముక్కూ మొఖం తెలియదు. సమాచారం అసంపూర్ణం..ఫ్రెండ్షిప్ కోరిక.
ఏదన్నా బాగుందని మెసేజ్ పెడితే..మీ వాల్ మీద పోస్ట్ చేయమని మనవి..
ఏమిటీ లైక్స్.. నిజంగా గ్రహిస్తే ఒక్క వాక్యం రాయొచ్చు..
ఎవరు ఏ ముఖంతో మాటాడుతున్నారో తెలియదు..
సహజంగా ఒక్కొక్కరికి ఒక రకమైన చెలామణి ఉంటుంది..దాన్ని ఈ మాధ్యమం పెంచదు, తగ్గించదు. విపణిలో ధర మామూలే..ప్రదర్శన మరికొంతమందికి అందుబాటులో ఉంటుంది. ప్రదర్శన బౌద్ధిక స్థాయిని పెంచుతుందా ! పెంచదని నా విశ్వాసం.
రామ్మోహన్ గారూ ! మీ విశ్లేషణ చాలా అంశాలను, ఆదినుండి, ఇప్పటివరకూ ఉన్నవాటిని ఫోకస్ చేసింది..అభినందనలు.
Chaalaa baagundi Ramoo! Case studeelu levu gaanee Ph.D. ki saripadaa study undi.
-U.Surya Chandra Rao (Vi-raagi)