గొంతు సవరించుకుంటూ వస్తున్న నాకు హటాత్తుగా ఆమె రూపం కళ్లముందు వచ్చి నిలిచింది. అక్కడ నుండి పూర్తిగా వెలుతురులేని చోట బహుశా చూసి ఉండవచ్చు, అయితే ఆమెని చూ సినట్లేనా!
ఆమె ఎందుకు పదే పదే నా జ్ఞాపకాల తలుపులను తడుతోంది?
నేను కవిని కాను, రచయితను అంతకన్నా కాను. ఒక మాములు చదువరిని.
ఎక్కడ ఎలా ఈమెకు కనిపించి ఉంటాను. నా లోపలి పొరలలో ఒక సందేహం వేలాడుతోంది. నేనామెను ఎక్కడా, ఎన్నడూ చూడలేదా? ఆ రోజున గోదారి ఒడ్డున చూసానా? అయితే మనసు లోపలి అరలోంచి, ‘నిజం చెప్పు, అయినా నీకు అసలు ఇంత కూడా జ్ఞాపకం లేకపొతే ఎలాగూ, ఆ రోజున అక్కడ అదే స్టేషన్ దగ్గర ఆ కీ నీడలో కదా చూసావు.’ అంతే వెంటనే మరో దృశ్యం- పెద్ద బజారులో …ఆ చీరల షాప్‌లోకి వెళుతూ… పక్కన నిలబడి ఉంది. ఆ వెంటనే మరో దృశ్యం- ఆ రోజు లాంచీల రేవులో చెట్టు దగ్గర నించుంది. లాంచీ ఎక్కబోతూ చూసాను ఆమెను.
ఇవన్నీ తనేనా? లేక తనలాంటి వారెవరయినా ఉన్నారా?
అసలు నువ్వు అక్కడెందుకు ఉన్నావని ఆమె అడిగేతే, కేకలేస్తే, లేకపోతె తిడితే, అయినా నా జవాబు ఒక్కటే! ఆమెని చూసాను. అహ చూసాను, అని చెబితే దానిమీద ఉండే ఆసక్తి పోతుంది.
అంతేకాదు, ఇప్పుడే చెప్పేస్తే కథ అర్దం అయిపోతుంది. కాబట్టి ఇప్పుడు చెప్పను. చివరి వరకు ఏమి జరగబోతోందో అని కుతూహులం మీకు చూపించాలి.
అందుకు నేను చెప్పే, కొన్ని సంఘటనల మీరే గుర్తించి తెలుసుకోవాలి.
*
ఇది జరిగి చాలారోజులయింది. ఆ బస్టాండ్‌లో నేను ఎక్కబోయే బస్సు వచ్చే ప్లాట్‌ఫారం అన్నిటి కన్నా చివరన విసిరేసినట్లుంది. అక్కడున్న కుర్చీలో కూర్చొన్నాను. ఒక్క సీట్‌కి అవతల మరో వ్యక్తి ఉన్నారు. ఇంకా కరోనా నియమాలు పాటిస్తున్నారు. చేతి బాగ్‌తోపాటు ఒక పుస్తకం కూడా ఉంది. చిరునవ్వులతో మొదలయి పలకరింపుల దాక వెళ్లింది. ఆ వ్యక్తి వెళ్లేది మరో ఊరుకి. ఆ వ్యక్తితో మాట్లాడుతున్నా నా కళ్లు మటుకు ఆ చేతిలో ఉన్న పుస్తకం మీదే ఉన్నాయి. అది చూసి ఆ వ్యక్తి, ‘మీరు చదువుతారా,’ అని అడిగాడు.వెంటనే నేను, ‘ఆ పుస్తకాన్ని చూడచ్చా,’ అన్నాను. ‘అలాగే తప్పకుండా.’ నాకు ఎందుకో అనిపించింది, ఇదే సమాధానం వస్తుందని. ఊహించినట్లే జరిగింది.
పుస్తకం ఆ చేతుల నుండి అందుకోవటం ఏమిటి ఆత్రంగా మొదట పేజీలు తిప్పాను. ఆ తరువాత చదవడం మొదలుపెట్టాను. ఎక్కడున్నానో తెలియనంతగా పరిసరాలు మర్చిపోయి చదువుతున్నాను.. అంత ఆసక్తిగా ఉంది.భలే అద్భుతంగ ఉంది కథ . ఎవరో మహా రచయిత తదేక దీక్ష తో మేధోమథనం చేసిన రచన. ఎంతో కష్టపడి ఉంటాడు. సమయం తెలియలేదు. నా బస్సు వచ్చిందని అనౌన్స్‌మెంట్ అయింది.
కానీ పుస్తకం చదవడం సగమే అయింది.
అయిష్టంగానే ఆ పుస్తకం ఆ వ్యక్తికి ఇచ్చేసాను. ఏదో అసంతృప్తి. పొగుట్టుకున్న భావన
నా లోపల్లోపల ఏదో తపన మొదలయ్యింది. ఆ… దాని ముఖచిత్రం, అదిచ్చిన ఆ వ్యక్తి మరీ మరీ గుర్తొస్తున్నారు. నా మనసు వెనక్కి ప్రయాణించాలని కోరింది. బస్సు ముందుకు కదిలింది, ఇది వాస్తవం అన్నట్లుగా.
*
ఋతువులు మారుతున్నాయి. ఆ రోజునుండీ ఇప్పటిదాక ఆ ఋషిలాంటి మనిషి కనిపించలేదు, ఆ పుస్తకాన్ని తిరిగి చూడనూలేదు. అయితే ఎలాగైనా ఆ పుస్తకం పూర్తిగా చదవాలన్న కోరిక రాజుకుంటూ ఇంతదాక వచ్చింది. ఇప్పటికీ నేను బస్సులోనే ప్రయాణం చేస్తూ ఉన్నాను. కిటికీ పక్కన కూర్చొని, మారుతున్న దృశ్యాలను చూస్తూ అక్కడే ఉండిపోయాను! ఆ రోజు కలిగిన తపన నుండి బయట పడలేకపోయాను. గంటల తరబడి వెతికాను. ప్రతి రోజూ వెతికాను. ఎక్కడికి వెళ్లినా రహస్యంగా అతనినే వెతికాను. వెతికిన చోటునే మరీ మరీ వెతికాను. వెతుకుతూ, వెతుకుతూ నేను అనేది మర్చిపోయాను… అయినా దొరకలేదు. ఆ పుస్తకం కోసం నా దాహం కుడా తీరలేదు. అసలు వెతకటమనేదే నా జీవితాదర్శంగా మారిపోయింది.
*
బద్ధకంగా ఉంది. చదువుతున్న పుస్తకం మీద ఆసక్తి పోయింది. ఎందుకో పుస్తకపు జ్ఞాపకాలు ముసిరాయి. లేచి బాల్కనీలోకి వచ్చాను. కాసేపు వీధిలో ఆడుకుంటున్న పిల్లలని చూస్తూ ఉండిపోయాను. ఎదురుగా రెండు చిన్న చిన్న డాబా ఇళ్లు జతగా ఉన్నాయి. ఇంతలో ఎవరో గట్టిగా అరిచినట్లయింది. నా ఆలోచనల దారం పుటుక్కున తెగిపోయింది.
, ‘ఒరే నరిసిగా ఎక్కడ చచ్చావురా,’ అని విన్పించింది. ఆ గొంతు వింటేనే ఇంత భయంకరంగా ఉంది, ఇక మనిషి ఎలా ఉంటుందో అని ఊహిస్తున్నాను. ఒక నడివయసు ఆమె బయటకు వచ్చింది. చూడటానికి అందంగానే ఉంది. కానీ ఆ చిన్న పిల్లవాడిని పట్టుకుని తిడుతూనే ఉంది. ఆ స్త్రీలో ఇంత కాఠిన్యమా! తట్టుకోలేకపోయాను. అదీ చిన్నపిల్లవాడి మీద.
ఆ తరువాత నా మనసంతా, ఇరుకుగా, ఉక్కగా అనిపించి లోపలి వచ్చేసాను.
*
రెండు రోజుల నుంచీ సన్నగా కురుస్తోన్న వాన ఆ రోజు మరీ ఉధృతమైంది.
బయటకు వెళ్లే వీలులేక ఇంట్లోనే ఉండిపోయాను. వేడి వేడి టీ తాగుతూ బాల్కనీలోకి వచ్చి నిలబడ్డాను.
ఎదురింటి మిద్దె పై నుంచి చినుకులు చేసే నాట్యం, ధారలుగా జారే వర్షపు నీరుని చూస్తూ నిలుచుండిపోయిన నాకు,
‘ఒరే నరిసిగా, లేవమేమిరా ఇంత పొద్దయింది. లే… లే… అబ్బ దరిద్రుడా మళ్లీ పక్కలో ఒంటేలు పోసేసావా? నీకు ఎన్నిసార్లు చెప్పానురా, పక్కలో పోయద్దని,’ అంటూ బెత్తంతో కొడుతుంటే, ‘వద్దమ్మా వద్దమ్మా… నన్ను కొట్టకు,’ అని హృదయవిదారకంగా ఏడుస్తున్నాడు.
అది చూసి, ‘ఛీ ఛీ ఈ కాలంలో కూడా ఇంకా వెట్టిచాకిరీ, అదీ పిల్లలని ఇంత హింస పెడుతూ. అయితే ఈ పరిస్థితిని బట్టి అర్ధమయిన విషయం- ఆ పిల్లవాడు ఇంట్లో పనివాడు అని నిర్ధారణ అయింది.
జాలిగా అటే చూస్తున్న నాకు ఆమె దీనంగా, అశాంతిగా కనిపించింది.
కళ్లు చికిలించి చూసాను, ఆమేనా… ఇన్ని రోజుల తరువాత కనిపించింది. నిజంగా ఆమెనే చూసానా?
ఆమె అవునోకాదో నిర్ధారణ చేసుకునే లోపల క్షణాలలో మాయమయింది.
ఆ రోజు మొదటిసారి కీ నీడలో చూసినప్పుడు వయసెంతో చెప్పలేను.
ఇప్పుడు ఎదురింటి వాళ్ల కాంపౌండు వాల్ దగ్గర ఉన్న మొక్కల పక్కన చూసాను. ఎదురిల్లే, పైగా మా ఇంటికి, ఆ ఇంటికీమధ్య చిన్న రోడ్డే కాబట్టి, ఆమె ముఖకవళికలు బాగానే కనిపిస్తున్నాయి. ఆ కళ్లలో నేను మాటలలో చెప్పలేని, అర్థం కాని ఆందోళనని చూసాను. ఏదో చెప్పాలనే ఆత్రం. అయితే ఆ బాష, లేదా రహస్యమా? అర్థం కాలేదు.
అసలు ఇప్పటికీ అర్ధం కానీ విషయం, ఆమెని నేను నిజంగా గమనించలేదా? లేకపోతే అలా నటిస్తున్నానా? ఇంతకీ నేను ఆమెకి ఎప్పుడు కనిపించి ఉంటాను? నా అంతరంగంలో ఓ మిలియన్ డాలర్ క్వశ్చన్? ఇందాక చెప్పినట్లుగా నేను ఇప్పుడే బయటపడను. ఎందుకంటే నేను ఆ రోజున పాత బ్రిడ్జి కింద ఉన్న పిల్లర్ దగ్గర చూసాను అని చెబితే, వెంటనే లింగాల రేవు దగ్గర లాంచీ ఎక్కుతూ చూశానని తెలిసిపోతుంది.
‘ఓయి పిచ్చివాడా! బహుశా నీకు గుర్తులేదేమో, నన్ను ఆ రోజున జిల్లా కోర్టు దగ్గర చూసావు కదా! ఆ తరువాత వై జంక్షన్ దగ్గర, ఆ చిన్న సందు, అదే మెరక వీధి దగ్గర చూసావు కదా,’ అని ఆమె అన్నట్లు…
ఇలా ఆమెని చూసిన దృశ్యాలు కళ్ల ముందు కదిలిపోతున్నాయి.
*
ఆలోచనలతో తల బద్దలయ్యేలా ఉంది. బయటకు వెళ్లి గాలి పీల్చుకోవాలి. వాన వెలిసింది. ‘అన్నట్లు ఈ ఎదురింటి గొడవలో పడి ఆ పుస్తకం విషయమే మీద నుంచి ధ్యాస మళ్లింది,’ అనుకుంటూ లైబ్రరీ వైపు వెళ్లాను.
లైబ్రరీ ఉండేది ఓ విశాల మైదానంలో. అక్కడ పెద్ద పెద్ద చెట్లతో ఒక చిన్నపాటి అరణ్యంలా ఉంది. భవనం, దాని పైకప్పు ఎత్తుగా శిఖరంలా ఉంది. లైబ్రరీలు సాధారణంగా ఖాళీగా నిశ్శబ్ధంగానే ఉంటాయి. బోలెడన్ని అలమారాలు. వాటిల్లో కొలువు తీరిన ఎందరో రచయితలు. ఒక అలమారకి మరొక అలమారకి మధ్యనున్న స్థలంలో ఓ ఇద్దరు మనుషులు పట్టేటంత వెడల్పుగా ఉంది. ప్రాచీన సాహిత్యం, పాశ్చాత్య సాహిత్యం, తెలుగు సాహిత్యం, కవిత్వం, కథ, నవల, వ్యాసాలు- ఇలా వరుసల్లో, ఉన్న పుస్తకాల అమరిక. లైబ్రరీలోనికి నడుస్తుంటే ఓ పెద్ద పజిల్‌లా ఉంది. లైబ్రరీలో కొన్ని పుస్తకాలు సంవత్సరాల తరబడి వెలుగుని చూసి ఎరుగవు. మనం నిశితంగా గమనిస్తే ప్రతి పుస్తకాల అరల చివరన చీకటి ఉంటుంది. ఇక్కడ మన అడుగుల శబ్ధం కుడా మనకు వినబడేంత నిశ్శబ్దం. నేను చదివిన ఆ అసంపూర్తి పుస్తకం కోసం వెతుకుతూనే ఉన్నాను. కానీ ఆ రోజు కూడా నిరాశే మిగిలింది. చేసేదిలేక లైబ్రరీ నుంచి బయట దారి పట్టాను.
*
రోజూలానే ఆ రోజు కూడా తెల్లవారింది. పొద్దున్నే సుప్రభాతం వినిపించసాగింది. ఏ దేవుళ్లవో అనుకునేరు సుమా! కానేకాదు, ఎదురింటావిడ వాళ్ల పనివాడిని తిట్టడం. ఈ మధ్య దానితోనే నాకు రోజు మొదలవుతోంది. అసలు ఆవిడ వాడిని కారణం లేకుండా కూడా తిడుతుంది. వాడు ఆ భయనికే కాబోలు పక్కలో ఒంటేలు పోసేసుకుంటాడు. దానితో ఆవిడ మరీ రెచ్చిపోతుంది. అదేమీ ఖర్మో, వాళ్లింట్లో పిల్లలు, ఆమె భర్త కూడా వాడిని తిడుతూనే ఉంటారు.
అక్కడికీ కాలనీవాళ్లు ఆ ఇంట్లో వాళ్లమీద పోలీసు రిపోర్ట్ ఇవ్వడం, భంగపడటం కూడా జరిగిందిట. ఇదంతా మా వార్తాహరి, అదే నాకు వంటపని, ఇంటిపని చేసే అమ్మాయి చెప్పింది.
పాపం వాడు ఆ కాంపొండ్ వాల్ పక్కనే ఉన్న మొక్కల మధ్యలో ఉన్న రాయి మీద కూర్చొని ఏడుస్తూ ఉంటాడు.
ఆ పసివాడిని హత్తుకుని ఓదార్చేది ఎవరూ? యెంత గాయపడి ఉంటుందో ఆ చిన్నారి మనసు.
*
రోజులు గడుస్తున్నాయి. నా రొటీనుతో పాటుగా ఆ పుస్తకం కోసం వెతుకులాట సాగుతోంది. చాలా లైబ్రరీలు తిరిగాను, చాల పుస్తకాల షాపులు తిరిగాను. కానీ నేను చదవలసిన ఆ పుస్తకం దొరకనేలేదు. ఇంతకీ ఆ పుస్తకం పేరు ‘సశేషం.’ ఇంకా మిగిలి ఉందని కదా అర్థం. అందుకే పుస్తకం నాకు లభ్యం కావటం లేదా? చూద్దాం…
ఈ రోజు కూడా ఓసారి మళ్లీ లైబ్రరీ అంతా గాలించి, ప్చ్… ఇవాళ కూడా దొరకలేదు అనుకుంటూ లైబ్రరీ బిల్డింగ్ నుంచి బయటకు వచ్చి ఒక్క చెట్టు కింద ఉన్న సిమెంట్ బెంచ్ మీద కూర్చొన్నాను. ఆ చల్లగాలికో లేక ఆ ప్రశాంత వాతావరణానికో తెలియదు కానీ కళ్లు మూతలుపడ్డాయి. ఆ మగతలో నా కళ్ల ముందు ఎన్నో రంగు రంగుల సీతాకోకచిలకలు ఎగురుతున్నాయి. వాటిని పట్టుకోవటానికి ప్రయత్నిస్తున్నాను. నేను ప్రయత్నం చేస్తున్నకొద్దీ అవి ఎగిరిపోతున్నాయి. పంతంతో నేను మళ్లీ మళ్లీ వాటి వెనుకాల పరుగెడుతున్నాను. అవి దొరకటం లేదు. నిరాశ, ఉక్రోషం వచ్చేసాయి.
ఇంతలో, ‘బాబు… బాబు,’ అంటూ ఎవరో పిలిచారు.
గబుకున్న కళ్లు తెరిచాను. ఒక్క క్షణం ఎక్కడున్నానో అర్థంకాలేదు. తెప్పరిల్లి చూసాను.
నా ముందు లైబ్రరీ సెక్యురిటీ గార్డ్ నించుని ఉన్నాడు.
‘ఏమిటి?’ అని అడిగాను.
‘మీకు ఈ పుస్తకం ఇమ్మని ఆయన చెప్పారు,’ అంటూ గేటు వైపు గబాగబా వెళ్లిపోతున్న అతన్ని చూపించాడు.
ఎవరబ్బా అనుకుంటూ పుస్తకం వైపు చూసాను. అదే పుస్తకం. ఆరోజు నేను బస్సులో చదివినది. పట్టలేని అనందంతో ఆ గార్డ్ చెయ్యి పట్టుకుని ఊపేసాను, ‘‘థాంక్ యూ థాంక్ యూ,’’ అంటూ.
‘అన్నట్లు అతను ఎక్కడ?’ అంటూ గేటు వైపు పరిగెత్తాను.
కానీ అతని జాడలేదు. చేతిలో ఉన్న పుస్తకం వైపు చూసాను. పాతబడిన పేజీలతో శిధిలావస్థలో ఉంది ఆ పుస్తకం అదే ‘సశేషం.’
*
పుస్తకం దొరికింది అన్న సంతోషంలో తొందరగా ఇంటికి చేరుకొన్నాను. ఉదయం నుంచి అలసిపోయి ఉండటంవల్ల తినగానే నిద్ర పట్టేసింది. ఒక గంట అయ్యాక అకస్మాత్తుగా తెలివి వచ్చింది.
ఎన్నాళ్ల నుంచో వెతుకుతున్న పుస్తకం దొరికితే, ఇంత మాములుగా ఎలా ఉన్నాను. పేజీలు తిప్పి ఆత్రుతగా చదవాలని ఎందుకు అనిపించలేదు అనుకుంటూనే, నాలో అప్పటి చదువరి లేడా? ఏమిటి ఈ విచిత్రం అనుకుంటూనే ఒక కప్పు చాయి చేసుకుని, దాన్ని ఒక చేత్తో, మరో చేత్తో పుస్తకం తీసుకుని బాల్కనీలోని స్వింగ్‌లో కూర్చుని ఒక్క సిప్ చేసి ఆతృతగా ఆ పుస్తకం తిరగేసాను. చివరి పేజీలు లేవు. అసంపూర్ణం.
ఇంతలో ఏదో కలకలం వినిపించింది. యథాలాపంగా ఎదురింటి వైపు చూసాను.
అన్నట్లు గుర్తొచ్చింది, అంతగా పట్టించుకోలేదుగానీ రెండు మూడు రోజులుగా ఎదురింటామె అరుపులు వినిపించటం లేదు. ప్రశాంతంగా ఉందని కూడా అనుకున్నాను.
తీరా ఇప్పుడు చూస్తే అక్కడంతా జనం. పైగా అంబులెన్సులు కూడా వచ్చాయి. అది చూసి అక్కడ నిలుచుని ఉన్న మా వార్తాహరిని పిలిచి అడిగాను, ‘ఏమయిందని.’
‘ఏమో సార్, వాళ్లు అంతా మంచిగానే ఉంటారు, ఏమొచ్చిందో ఏమో, ఆ పని కుర్రాడి విషయంలో ఇద్దరూ పెద్ద పోట్లాట పెట్టుకుని రోజంతా ఇద్దరూ అరుచుకుంటూనే ఉన్నారంట. వాళ్ల దగ్గరున్న ఏవో మాత్రలు మింగినారంట, డాక్టర్ చూసి చెప్పిండు, ప్రాణం పోయిందిట. అయితే వాళ్లింట్లో పనిచేసే పిల్లాడిని చచ్చేటట్లు కొట్టిందట. ఆయనేమో వాడినిబయటికి పోనీయకూడదు అంటూ, ఆమెని బాగా తిట్టిండట. దానితో ఇద్దరూ బాగా తగువు పడ్డారంట. ఆ తరువాత ఇట్లా జరిగింది. ఏందో ఏమో అన్ని ఇచిత్రాలే,’ అంటూ మళ్లీ అటువైపు వెళ్లింది.
చప్పున అటువైపు చూసాను. ఆ పిల్లాడిని ఒక పోలీసు పట్టుకుని వాడి చుట్టూ చెయ్యి వేసి తీసుకుని వెళుతున్నాడు.
అక్కడ మూగిన ఆ గుంపులో వెనకాల నిలుచున్న వ్యక్తి… ఆమెలా కనిపించింది. గబగబా కిందకు దిగాను. గేటు తీసుకుని జనాన్ని దాటుకుంటూ ముందుకు వెళ్లాను. అప్పటికే ఆమె వీధి చివరకు వెళ్లిపోయింది. అక్కడ నుంచి ఒక్కసారి వెనుతిరిగి నన్ను చూసింది. ఆ కళ్లలో ఏదో వేదన, వేడికోలు, అర్ధింపు- అన్ని కలగలిపిన చూపు. నిజమా, భ్రమా!
*
ఆల్ రైట్, మీరందరూ ఇక్కడ నన్ను మన్నించాలి. ఆమె చనిపోయిందని నాకు కథ మొదట్లోనే తెలుసు. అయితే చెప్పాను కదా, చివరివరకూ వేచి ఉండమని. ఇప్పుడు ఆమె గురించి
తెలియాలి కదా,
ఎప్పటిలాగ ఒకరోజు సాయంత్రం ఆ లింగాల రేవు దగ్గర ఉన్న రైలుకట్ట దగ్గరకు వెళ్లినప్పుడు, అక్కడ అంతా చీకటి, పైగా చిన్న రాంప్‌లా ఉంటుంది. ఇంకాస్త ముందుకు వెళితే స్టేషన్ చేరుకోవచ్చు.
ఆరుబయిట చేసే చీకటి శృంగారానికి ఖరీదు ఎలా, ఏ లెక్కన కడతారు?
స్టేషన్‌కి ఇంకా చివరలో, రైల్ వే పార్సిల్ ఆఫీస్, దాని పక్కన చిన్న దారి బయటకు వెళ్లడానికి ఉంది. అక్కడే సగం సగం కట్టిన గోడలతో ఒక చిన్న కట్టడం ఉంది.
అక్కడ నిలబడి ఉన్న ఆమె కాటుక పోగు చేసినట్లుగా నిశి చుట్టేసినట్లుగా ఉంది. పక్కనే ఒక పిల్లవాడు. వాడిని ప్రేమగా ముద్దాడుతూ కబుర్లు చెబుతోంది. మధ్య మధ్యలో పిల్లవాడు అడిగిన ప్రశ్నలకు జవాబులిస్తూ, ‘అలాగేలే నరసిమ్మా,’ అంటోంది. కొంచెంసేపు వాడు మాట్లాడి పడుకుండిపోయాడు.
అప్పుడే ఒకడు వచ్చి ఆమెను రమ్మన్నాడు. ఇద్దరూ కలిసి ఆ గోడల వెనకాలకి వెళ్లారు.
కొద్దిసేపటి తరువాత చీర సర్దుకుంటూ, జుట్టు ముడి వేసుకుంటూ అతని వెనకాలే మాట్లాడుతూ వస్తోంది. డబ్బులు తక్కువ ఇచ్చినట్టున్నాడు. ఇద్దరి మధ్యా వాదులాట. ఆమె ఆవేశంగా పిల్లాడిని చూపిస్తూ… అతన్ని పట్టుకుని ఏదో అంటోంది. వెంటనే అతను ఛీ… ఛీ… అంటూ అసహ్యంగా ఆమెని ఒక తోపు తోసాడు. అంతే అక్కడున్న సిమెంట్ గట్టుకి తల కొట్టుకుని పడిపోయింది.
కొంచెంసేపు చూసాడు. చలనం లేదు, దగ్గరగా వెళ్లి ముక్కు దగ్గర చెయ్యి పెట్టి చూసాడు. అంతే షాక్ తగిలినట్టు అయ్యాడు. ఇంతలో అతనికి ఒక ఫోన్ వచ్చింది. అవతల వ్యక్తి ఏమ్మన్నారో కానీ ఇతను చాలా నెమ్మదిగా అలాగే… అలాగే అంటున్నాడు. ఈ లోపల ఆ పక్కనే పడుకున్న పిల్లవాడు లేచి, ‘అమ్మా… అమ్మా’ అని అరుస్తున్నాడు. ఇంతలో జనం పోగవుతున్నారు. పోలీసులు వచ్చారు. జరగవలసిన తంతు జరుగుతోంది.
ఆ ఏడుస్తున్న పిల్లవాడిని ఎవరో చూసారు. ‘వీడు దాని కొడుకే అనుకుంటా,’ అని అన్నారు. ఇంకొకడు, ‘అవునవును,’ అని వంత పాడాడు.
ప్రత్యక్ష సాక్షిని అయిన నేను పోలీసులకి నిజం చెప్పేద్ద్దామని అనుకుంటుండగా పోలీసులతో అతను, ‘ఈ పిల్లవాడిని మా ఇంటికి తీసుకుని వెళ్తాను, మాతోపాటు ఉంటూ గుప్పెడన్నం తింటాడు,’ అనేసరికి, అక్కడున్న గొర్రె జనాలు అతని ఉదారతను చూసి పొంగిపోయి దేవుడిని చేసేసారు.
నేను పోలీసులకి నిజం చెప్పక పోవటానికి కారణం ఒక్కటే- వాడి నోటి ముందు కూడు తీసేయడం ఎందుకులే అని.
ఈ ఇంటికి వచ్చాక కానీ వాడి పరిస్థితి ఎంత దుర్భరంగా, దయనీయంగా ఉందో అర్థం కాలేదు.
అందుకే ఆమె అస్తమాను నా జ్ఞాపకపు తలుపులు తడుతోంది. నిజానికి నాకు ఆమెకు ఏ సంబంధం లేదు.
బట్… ఆరోజున జరిగిన దానికి నేనే సాక్షిని. అయినా నిజం చెప్పలేకపోయాను.
ఆమె చనిపోయేలా చేసినందుకు అతడ్ని, పిల్లాడి చేత వెట్టిచాకిరీ చేయించి కడుపు నిండా తిండి కూడ పెట్టని ఆమెని ఇలా ఈ విధంగా పగ తీర్చుకోవాలని అనుకుందా! కర్మా ఈస్ బిచ్ అంటే ఇదేనా!
*
కొన్నేళ్ల క్రితం నన్నంత ఆకర్షించిన పుస్తకం నా చేతిలోకి వచ్చిన ఆనందం కలగటం లేదు. పైగా పేజీలు తిరగేస్తున్న నాలో అసంతృప్తి రేపుతోంది.
ఎంతో ఆశించిన నాకు, ‘అయ్యో ఇదేమిటి ఇంత సాధారణంగా ఉంది,’ అనిపించింది.
అయితే ఒక విషయం ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె జీవితపు ఛాయలు ఈ కథలో ప్రస్పుటంగా ఉన్నాయి., అప్పటి ఆ రోజున ఆమె అనుభవించిన బాధ, వేదనతో సహా. ఇదెలా సాధ్యం?
అది నిజమయిన కథా, లేకపోతే కథ లాంటి నిజమా!
ముందే ముగింపు ఎలా ఊహించాడో ఈ రచయిత.
లేక నా ఊహలలో నుండి పుట్టుకొచ్చిన ఓ సశేషపు కథా ఇది!
కథ సగం చదివినప్పుడు పుస్తకం మళ్లీ దొరకలేదు.
పుస్తకం దొరికిన తరువాత మిగిలిన సగం కథ పూర్తిగా చదవాలనిపించలేదు
అయ్యో ఋషిలాంటి ఆ పెద్దాయన మళ్లీ కనిపించలేదు. అసలు ఎందుకు?
‘ఓహ్’ అంటే ఆమెకు నా గురించి తెలుసుననా? ఆ రోజు జరిగినదానికి నేను ప్రత్యక్ష సాక్షిని కనుక కథని ఇలా ముగించాలి అనుకున్నాడా? అసలు ఆయనే రచయితనా? అతని ఊహలే నిజమయ్యయా!
ఒక రచయిత అన్నట్లు అంతా రంగస్థలమా!
*
Add comment