రిషి శ్రీనివాస్…..కొత్త తరం కథకుల్లో ఆధునిక ఇతివృత్తం, మోడరన్ వాక్యంతో కథలు రాస్తున్న కథకుడు. నేటి తరం యువత సంఘర్షణ, వ్యక్తిగత సంవేదనతో పాటూ సామాజిక స్పృహనూ కథల్లో చూపిస్తుంటాడు. ఓ పక్క విస్తృతంగా రాస్తూ…క్వాలిటీ తగ్గకుండా విషయాన్ని కన్వే చేయగలగడం అతని కలం బలం. ఆధునిక యువత అవసరాలకు ఆలోచనలకు తెలుగు కథలో చోటు ఉండడం లేదనీ ఆధునిక యువతని కథకులు పట్టించుకోవడం లేదనే ఆరోపణలకు రిషి కథలు సమాధానంగా నిలుస్తాయి. |
వాడికి ఆ సున్నితత్వం ఉంటుందా ?
ఏ సున్నితత్వం ?
అదే… ఆమె మెడ వెనుక పుట్టుమచ్చను చిటికిన వేలుతో నిమరగల సున్నితత్వం.
ఎవడికి ?
అదే… ఆమె మొగుడు వెధవకి.
ఏం పేరయ్యుంటుందో ?
ఖచ్చితంగా నా పేరంత స్టైలిష్ గా అయితే ఉండి ఉండదు. రిత్విక్. ముప్పై ఏళ్ళ క్రితమే పెట్టేరు నాకు ఆ పేరు. అంత మోడ్రన్ గా.
అమెరికాలో ఉన్నాడా ? చెంబుతో నీళ్ళెతుక్కోడానికే ఉన్న టైమంతా సరిపోతుంది. ఇంక రొమాన్సెక్కడ ?
అలా అనుకుని సమాధాన పడిపోవడమేనా ?
లేదా వాడికి ఆమెలో ఇంకేదైనా గొప్పగా కనబడి ఉంటుందా? మూడేళ్ళ ప్రేమలో నాకు కనబడనిది!
అసంభవం.
ఆమెను నా నిలువెల్లా పులుముకున్నాను. వాక్యం కరెక్టేనా ? ‘ఆమె’ అని ఉంటే కరెక్టే.
నాకు తెలియనిది ఆమెలో ఏదీ లేదు. నాకు దూరమైన ఈ రెండేళ్ళలో కొత్తగా ఏమైనా వచ్చి చేరి ఉంటే నేను చెప్పలేను.
విడి దారులు. ప్రేమికులు విడిపోవడానికి కారణాలేముంటాయి? ప్రేమరాహిత్యం తప్ప. అది ఎప్పుడు పుడుతుందో తెలియదు. ప్రేమ పుట్టినట్లే!
ఖసురుకున్నాం. అప్పుడు నాలోని సున్నితత్వం ఏమైందో !
ఏడ్చింది. వెళ్ళిపోయింది.
మనసుతోటి ఆడకు మామా… ఇరిగిపోతే అతకదు మళ్ళా… మానూ మాకును కానూ
మూగమనసులు కావవి. అరచి అరచి గొడవపడ్డ మనసులు. ఏడ్చి ఏడ్చి తమను తామే విరగ్గొట్టుకున్న మనసులు.
అమెరికా సమ్మంధం ట ! ఊ అంది. అందా ? ఉ ఊ అని అయితే అనలేదు. ఎగిరిపోయింది.
ఎగిరిపోతే ఎంత బాగుంటుందీ ? ఎగిరిపోతే బాగుంటుందా ?
ఏమో ! ఆమెను అడిగి చెప్పాలి.
నేనేం తక్కువా ? నేనూ చేసుకున్నాను పెళ్ళి. విశ్వవీణ ని.
ఆమె కన్నా అందగత్తె. ఆమె కన్నా తెలివైంది. ఆమె కన్నా డబ్బులున్నది. ఆమె కన్నా మంచిది. ఇలాంటి డిగ్రీలు ఎన్ని వున్నా. ఈమె ఆమె కాదే !
“మీరు సిగరెట్లు మానెయ్యండి.”
ఆమె వెళ్ళిపోయాక అలవాటయ్యింది.
“మీరు పోయెట్రీ భలే రాస్తారండి.”
ఆమె వెళ్ళిపోయాక అలవాటయ్యింది. ఈ మాట ఆమె తో అనిపించుకోలేకపోయాను. ప్చ్.
మీరు అనకు పేరు పెట్టి పిలువు. రిత్విక్.
“ఏం ? మీరూ నేనూ సమానమా ?”
కాదు. సర్వకాల సర్వావస్థలయందు భార్య భర్త కన్నా ఎక్కువ.
నన్ను భరిస్తున్నందుకు వీణ కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ ఆయుక్షీణం అంటుంది.
అందుకే అప్పుడప్పుడు పాదాల మీద నా పెదవులు ఆనించి కాలి చూపుడు వేలు (?) చుట్టుకున్న మెట్టెల మీదుగా గోటి వరకూ పోనిస్తాను. అది రసం. అన్నంలో కలుపుకునే రసం కాదు. రస సిద్ధి లోని రసమూ కాదు. శృంగార రసం లోని రసం. అప్పుడు ఆయువు క్షీణించదు. ఇనుమడిస్తుంది.
రతిలో నాకు ఆమె గుర్తొస్తుంది. వీణకు ఎవరు గుర్తొస్తారో తెలియదు. ఛి ఛి. ఏవిటా మాటలు ? వీణ ఎవర్ని ఊహించుకుంటుందో తెలియదు.
మొదటి సారి హెల్మెట్ పెట్టుకోవడం నాకు చేతకానప్పుడు ఆమె నవ్విన నవ్వు..
ఎంత మరువ యత్నించిననూ మరపునకు రాక, హృదయ శల్యాయమానములైన నీ పరిహసారావములే నా కర్ణ పుటలను పయ్యలు సేయుచున్నవే. అహో !
ఆమె గురించి వీణతో చెప్పేను. కట్టె కొట్టె తెచ్చె.
ఎన్ని ప్రశ్నలో !
తెలుసులే ఇలాంటిదేదో ఉండి ఉంటుందని. ఎన్నాళ్ళు ?
నా కన్నా బాగుంటుందా ?
ఎలా పరిచయం ?
ఎందుకు విడిపోయారు ?
నొప్పింపక తానొవ్వక తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ.
ఎంత ఏమరపాటు !
ఉన్నపళంగా ఏదో అనేస్తాను.
ఒక పాత సినిమా చూస్తున్నప్పుడు., హేయ్.. ఈ సినిమాకి మనం వెళ్ళినప్పుడు వర్షం పడింది గుర్తుందా అన్నట్ట్లు.
ఈ సినిమా మన పెళ్ళికాక ముందెప్పుడో రిలీజయ్యింది. నేను మా ఫ్రెండ్స్ తో చూసాను. లాంటి సమాధానాలేవో వినబడేవి.
అవును నిజమే కదా. అప్పుడు కపుల్ టికెట్లో సోఫాలో నా పక్కన కూర్చున్నది ఆమె. వీక్ డే మార్నింగ్ షో కి తీసే వాడిని. రిక్లైనర్ స్విచ్ నొక్కితే నా ముఖం ఆమె గుండెల దాకా వచ్చి ఆగేది.
అప్పుడప్పుడు ఏ స్ట్రాబెర్రీ ఐస్ క్రేమో తెచ్చినప్పుడు.. వీణ తినను అన్నప్పుడు.. అదేంటి నీకు ఇష్టం కదా అని నోరు జారినప్పుడు. నాకా ? నేనెప్పుడు చెప్పాను ? అని నిలదీసినప్పుడు. గతుక్కుమన్నప్పుడు. నాలిక కరుచుకున్నప్పుడు.
నాలిక కరవడం. స్మూక్. చంపేస్తానొరేయ్ మొగుడు వెధవా అందాకా వెళ్ళావంటే.
ఆమె ఇంత అందంగా ఉంటుందా. జ్వరమొస్తే జబ్బు కోడిలా అయిపోతుంది.
నేనే టేబ్లెట్లు గుర్తు చెయ్యాలి. లేదా వేసుకోదు.
నేనే కొబ్బరి నీళ్ళు ఇవ్వాలి. లేదా తాగదు.
కానీ నిస్సిగ్గు గా చెప్తున్నా. ఆమెకు జ్వరం రావాలని మళ్ళీ మళ్ళీ కోరుకునే వాడ్ని. ఆ వెచ్చ అంత బాగుండేది .
బైక్ మీద నన్ను హత్తుకుని ఆమె కూర్చున్నప్పుడు శిలా ఫలకం లాంటి నా వీపు ప్రతిస్పందించలేక ఎంత పెనుగులాడేదో. పోర్టబుల్ గా గుండెని ముందుకి వెనక్కి జరుపుకునే వీలుంటే బాగుండుననిపించిన క్షణాలవి.
ఒక ఉంగరం ఇచ్చాను. విసిరేసి ఉంటుందా ?
కొన్ని బట్టలు కొన్నాను. చింపేసి ఉంటుందా ?
అరిచాను అప్పుడప్పుడు. ఎందుకు ? పోయేకాలం. మగాడ్ని కదా. అప్పుడప్పుడూ అలా అరవాలి.
చిన్నగా కళ్ళెమ్మట నీరు. పెద్దగా అలిగేది కాదు. కాసేపట్లో మళ్ళీ అతుక్కునేది.
ఆ ధీమానే కొంప ముంచింది.
వాళ్ళ హాస్టల్ దగ్గర దోమలెక్కువేమో. దింపడానికి వెళ్ళిన ప్రతిసారీ బైక్ దిగాక గంట బాతాఖానీ. అంత సేపూ షర్ట్ పైకి మడతపెట్టడం వల్ల అనాచ్చాదమైన నా మణికట్టూ, మోచెయ్యీ, మండ మీద దోమలు వాలకుండా తన చేత్తో విసిరేది అసంకల్పితంగా. విసురుతూ మాట్లాడేది. గులాబీ రేకు లాంటి ప్రేమ. ఎందుకు పట్టుకోలేకపోయాను సున్నితంగా ?
వాళ్ళింట్లో మా గురించి చెప్తే., కేన్సరొచ్చి కొద్దిరోజుల్లో పోతారని డాక్టర్ చెప్పినప్పుడు కూడా ఎవరూ అలా రియాక్ట్ అవ్వరేమో ! ఏంట్రా అబ్బాయ్ అంటే కులం.
ఆమె ఏడ్చింది కదా. కళ్ళు ఎర్రెర్రగా మందారాలు.
ఇప్పుడు ఆమె కళ్ళు బాగానే ఉన్నాయే. వేరే వాడితో పెళ్ళి అన్న ఊహే అంత బాధాకరంగా ఉంటే.. మరి కాపురం ?
అంత బాధ ఉండదేమో. ఆ విషయం నాక్కూడా పెళ్ళయ్యాక అర్ధమైంది.
ఆమె కూడా నాలాగే ఎప్పుడో విడుదలైన పాట విని నన్ను గుర్తుతెచ్చుకుంటుందా ?
నాలాగే తన తోడుతో నోరు జారి కవర్ చెయ్యలేక కరుచుకుంటుందా ?
నా పుట్టిన రోజు ఫోన్ రాదే ! డేట్ మర్చిపోయిందా ? మరి తన పుట్టిన రోజు నాకు గుర్తుంది కదా !
నా జ్ఞాపక శక్తి అంత గట్టిదా ? పోనీ నేనైనా ఫోన్ చేసానా ? అమెరికా నంబరు ఉందా ?
ఒకప్పుడు ఆమె వాడిన నంబరు ఎవరో వాడుతున్నారు. వాట్సాప్ లో చూసాను. ఆ నంబర్ వాడే అర్హత ఆ అయోగ్యుడికి ఉందా ?
ఎక్కడో మ్రోగింది కళ్యాణ రాగం. ఒంటి గా ఉండలేకపోయాను. అలాగని ఏడవలేదు. కంటి నిండా వద్దన్నా నీరు. నోరు మూగబోయింది. మూలగలేదు. మ్యూట్లో కన్నీరు కారుతున్నప్పుడు అది ఏడుపెందుకు అవుతుంది ?
అయినా మగాడు ఏడవకూడదు. ఏడ్చే మగాడ్ని నమ్మకూడదు. ఛీ ఆడదాని కోసం ఏడవడం ఏంట్రా ? ఎవరో అన్నారు.
ఆడదాని కోసం కాకపోతే నీకోసం మీ తాత కోసం ఏడవాలేంట్రా ?
అసలు ఆడదాని కోసం కారలేనప్పుడు కంట్లో నీరెందుకు దండగ ?
తలగడ పిసుక్కోవడం, గోడకి పంచులివ్వడం, తలుపులు కాళ్ళతో తన్నడం, సిగరెట్టు దగ్గరి చుట్టంలా అక్కున చేర్చుకోవడం, గడ్డం నేనున్నానంటూ బుగ్గల్ని నిమరడం, పుస్తకాలు దగ్గరకి రావడం, నవ్వు అవతలకి పోవడం, ఏది పడితే అది రాయడం, రాసినదే కవిత్వమని జనాలు చప్పట్లు చరచడం. ఏవిటో పిచ్చ!
ఇవేవీ తనకు తెలియవే ! ఎక్కడో ఎప్పుడో ఏ కిరాణా కట్టిన పొట్లంలోనో నా పేరు కనబడితే చదువుతుందా ? నేనే అనుకుంటుందా ? వీడికంత లేదులే అని విసిరేస్తుందా?
మా ఫొటోలు ఆ మొగుడు వెధవకి పంపిస్తానని భయపడుతుందా? నేనంత వెధవనా?
అసలు నా దగ్గరైనా ఉన్నాయా ? ఆమె లేఖలు. బహుమానాలు. చిత్రరాజములు.
ఎంత గొప్ప గొంతు ! కనబడే గొంతు కాదు. వినబడే గొంతు.
పాడిందంటేనా ! అరిసెల పాకం. కానీ వాళ్ళ నాన్నున్నాడు చూడూ, ఎందుకమ్మా ఈ పాటలు చదువుకోక? అనేవాడట. ఎంత చదువుకుంటే మాత్రం అంత గొప్పగా పాడ్డం పట్టుబడదని అర్ధంకాని దక్షుడు. మేక బుర్ర ట్యాప్ ఫిట్టింగు సంత. నన్ను అవమానించకున్నా నా జుట్టుకే అంత ఫెర్టిలిటీ ఉంటే వెయ్యి వీరభద్రులను పుట్టించి వేన వేల శిరచ్చేధనాలు విధించుతుండె.
తీపి దోసె ఇష్టంగా తినేది. కళ్ళు పేల కళ్ళు. కానీ గొప్పగా లాక్కునేవి. పైకి కనిపించకుండా కవర్ చెయ్యగలిగేటంత పొట్ట. వేళ్ళు పొట్టిగా చిన్న గోర్లతో ఉండేవి. అందుకే పొడుగ్గా తీరుగా ఉన్న నా వేళ్ళూ,గోర్లూ ఇష్టం తనకి.
తిండి తక్కువే. మాటలు ఎక్కువ. నవ్వులు ఇంకా ఎక్కువ. ఆ నవ్వులు ఇంకా అక్కడే ఉన్నాయా ?
ఈ ఊరిలో ఎక్కడ తిరిగినా ఎప్పుడో ఒకప్పుడు ఆమెతో ఆ ప్రదేశంలో ఉన్న జ్ఞాపకం ఒకటి, కనిపించకుండా టెంకి జెల్ల కొడుతుంది. మేము ఒకప్పుడు ఆగిన పానీపూరీ బండి దగ్గరే ఇంకో జంట ఎవరో తింటున్నారు. వీళ్ళైనా కలిసుంటే బాగుణ్ణు.
వేరే ఊరు వెళ్ళిపోయాను. నాలోనే ఉన్న ఆమెను వదిలించుకోవడానికి ఎంత దూరం పరిగెత్తినా ఏం లాభం ?
ఆనక పెళ్ళి. పిల్లలు. నేపీసు. హేపీసు. ఆమె లేని జీవితం కూడా హేపీగా ఉండగలదని అర్ధం అయ్యింది.
కానీ ఈ హేపీ నేననుకున్న హేపీ కాదు. ఇది ఇంకో రకం.
ఇది నా కథ. నీ కథ కూడా ఇలానే ఉందా ? ఉన్నా నువ్వు క్లెయిం చెయ్యడానికి వీళ్ళేదు. ఇది నా సొంత కధ. నేను రాసిన కధ. ఏ పత్రిక పరిశీలనలోనూ లేదు.
కలం పేరు ఏం పెట్టాలి. ఆమె నన్ను రిత్తు అని పిలిచేది. అదే పేరు.
రిత్తు. రచయిత రిత్తు.
***
రచయిత రిత్తు ఈ కథ రాసి కొరియర్ చేసాక తన భార్య వీణతో కార్లో వెళ్తుండడం నిఖిత్ కంట బడింది.
నిఖిత్ తన ఇంటికి వెళ్ళిపోయాడు. పేపరూ పెన్నూ పట్టుకున్నాడు. ఆమె గురించి రాసాడు. ఈ సారి ఆమె అంటే వీణ.
టైటిల్ మాత్రం అదే. “సొంత కథ”.
కొత్తగా రాయాలని వుంటుంది ఎప్పుడూ!
రిషీ….హాయ్. ఎలా ఉన్నావు..?
బాగున్నాను చందు.
అసలు కథ రాయాలని ఎపుడనిపిస్తోంది బాస్.?
అప్పటివరకు ఎవరూ రాయనిదో చదవనిదో తారసపడినపుడు/తట్టినప్పుడో వేరొకరు రాసే కంటే ముందుగా మనమే రాసేద్దామన్న చిన్న ఆదుర్దా. బస్ రాగానే కిటికీ నుంచి కర్చీఫ్ విసిరి సీట్ రిసర్వ్ చేసుకునే తొందర లాంటిదేదో పుడుతుంది. రాస్తాను. కొన్ని బాగా కుదిరాయి. కొన్ని పాడయ్యాయి.
మొదటి కథ ఏది. ఎపుడు రాశావు?
2014 అచ్చైన “రెక్కలు” నా మొదటి కథ. గొప్ప కథ కాదు. అలా అని చెత్త కథ కూడా కాదు. పరవాలేదనిపించిన కథ. పాస్ మార్కులేయించుకుంది కానీ నాకు పెద్దగా తృప్తినివ్వని కథ.
అంటే కథ కొంచెం డిఫరెంట్ గా రావడానికి …ఎలాంటి ఎఫర్ట్ పెడతావు. ?
ఏదైనా కధా వస్తువు డిఫరెంట్ గా రాయగలను అనిపించినప్పుడే రాయడానికి పూనుకుంటాను. కొత్తగా రాయలేని పక్షంలో ఎంత గొప్ప సబ్జెక్ట్ అయినా రాయలేను. “నీ కథ దరిద్రంగా ఉంది అని ఎవరైనా అన్నా ఫీల్ అవ్వను గానీ రొటీన్ గా ఉంది అంటే మాత్రం చాలా బాధపడతాను. అలా అని అన్నీ వెరైటీగా చించేసాను అనడానికి లేదు. రెండో మూడో రొటీన్ కథలు లేకపోలేవు.
పోయెట్రీ కూడా రాస్తుంటావు కదా…?
చాలా తక్కువ. కథలనే కవితాత్మకంగా చెప్పాలని ప్రయత్నిస్తుంటాను.
నీ కథల్లో అడగని ప్రశ్న….కథ డిఫరెంట్ గా ఉంటుంది. దాని నేపథ్యం ఏమిటీ…?
రైల్వే భూసేకరణలో తన భూమిని పోగొట్టుకుని రైల్వే నుంచి రావలసిన కాంపెన్సేషన్ కోసం కోర్టుకెళ్తే …జరిగిన జాప్యానికి రైలు స్వాధీనం చేసుకోమని రైతుకిచ్చిన కోర్ట్ తీర్పు నన్ను ఆకర్షించింది. ఆ తరువాత ఏమైందో తెలుసుకోవాలని ప్రయత్నించాను. తెలియలేదు. ఒక వేళ నిజంగా ఒక మనిషి తనకు అనుకూలంగా వచ్చిన తీర్పుని అనుసరించి రైలు స్వాధీనం చేసుకుంటే ఎలా ఉంటుంది ? అతని వాదన ఎలా ఉంటుంది అని ఆలోచించి రాసాను. రైలు సంఘటన కనుక రైళ్ళో అన్ని ప్రాంతాల వారూ ఉండే అవకాశం ఉంటుందన్న పాయింట్ ని ఎడ్వాంటేజ్ గా తీసుకుని తెలుగు వారు మాట్లాడే అన్ని యాసల్ని కథలో వాడడం సంతోషాన్నిచ్చింది.
నచ్చిన కథలు, రచయితలు…? ఎందుకని..?
నచ్చిన కథలు చాలా ఉన్నాయి. రచయితల్లో రావిశాస్త్రి గారి శైలి నాకు ఎక్కువ నచ్చుతుంది. శాస్త్రి గారి కథలు విభిన్నంగా ఉంటాయి.
ఏం చదివావు. ఏం చేస్తుంటావు..?
బీ.టెక్. చదివాను. ఇన్ ఫోసిస్ లో టీం లీడ్ గా పని చేస్తున్నాను.
ఇపుడేం రాస్తున్నావు…?
ఒక నవల రాద్దామని ఉంది. రాసే శక్తి ఉందో లేదో తెలియదు.
అక్షరాల వెంట పరుగుపెట్టించేత రీడబిలిటీ , మంచి వాక్యం, చెప్పిన విధానం , ఎంచుకున్న వస్తువు… చాలా బావుంది రిషీ . మంచి కథను రాసినందుకు నీకు థాంక్స్..
Thank you Karunanna
రిషి పరిచయం కంటే ముందు పరిచయమైన తన కథ పేరు ‘డాలీ’. చదివి రెండేళ్ళ పైనే అయినా,ఇంకామనసు వీడని కథ. కాలంతో పాటూ ఒకప్పుడు మనకు మాత్రమే సొంత మనుకున్నవి ఏమీ కాని ఒకప్పటి బంధాలుగా మిగిలిపోతాయి. జ్ఞాపకాల దొంతరలో దాగిపోయి గుర్తొచ్చినప్పుడల్లా సలుపుతాయి. ప్రతి మనిషికీ ప్రతి బంధమూ ప్రత్యేకం. ఆర్నెల్లకో బ్రేకప్ చెప్పేసుకుని కొత్తప్రేమల కోసమో, గౌరవించే మరో స్నేహం కోసమో రెడీ అయిపోయినా పంచుకున్న ప్రేమను మరువలేక పడే సంఘర్షణ ‘సొంతకథ’… అందరి కథ.
ఆపకుండా చదివించింది…నవ్వించింది.
చాలా నచ్చింది రిషీ!! మంచి కథను, కథకుడినీ పరిచయం చేసిన చందు తులసి కి ధన్యవాదాలు!!
రిషి కథల గురించి బాగా చెప్పారండీ. స్పందనకు ధన్యవాదాలు
Thank you Jhansi Garu
గుండ్రటి చిన్నరాయిని తీసుకొని నిశ్చలంగాఉన్న లోతైన సరస్సు ఉపరితలాన్ని తాకేలా విసిరితే అది కప్పగంతులు వేస్తూ చాలా దూరం వెళ్ళిపోతుంది. రిషి కథనంకూడా అలాగే – ఎక్కడ తాకాలో అక్కడే తాకుతూ – దూరంగా, లోతుగా – సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతూ, త్వరితంగా ముందుకి సాగిపోతూ. చిన్నపాటి అలలను సృష్టిస్తూ, ఆలోచనా తరంగాలను ప్రసరిస్తూ. మరిచామనుకున్నజ్ఞాపకాలను నిమురుతూ. గమ్యం, గమనం రెండింటినీ సంధిస్తూ.
Thank you very much Sudhakar Garu
కథ, కథనం చాలా బావున్నాయి.. మీరు చెప్పింది నిజం.. ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇలాంటి ఓ కథ తప్పనిసరిగా ఉంటుంది.
Thank you Shanti గారు
కథ చదివేలా వుంది – పరిచయం కథని చదవాలి అనిపించేలా వుంది. కథ రాసిన రిషి శ్రీనివాస్‌గారికి, పరిచయం చేసిన చందు తులసి గారికి అభినందనలు.
థాంక్యూ మేడం
Thank you very much Lalita గారు
సొంతకథ.. so aptly titled.The story sounds like it came straight from the heart. And I’m sure that so many people will identify themselves in this story. Congratulations to Rishi and big thanks to Chandu Tulasi. Nice that I happened to read this ☺☺
థ్యాంక్యూ !
Hi Rishi!!
అనుకొకుండా మీ కథని చదివే అవకాశం దక్కింది. ఎంతో బావుంది సొంత కథ, మీ కథ అని తెలిసేడట్టు. మీ పరిచయం లో మీరు అన్నట్టు, మీ కథల్లో ఆ వైవిధ్యం ఉంది.
థ్యాంక్యూ మేడం
రిషి కథ బాగుంది. ముఖ్యంగా ఆ racy prose. నేపీస్, హేపీస్ లాంటి విన్యాసాలు. అయితే నేననుకోవడం ఆ O Henry type ఎండింగ్ లేకపోయినా బాగుండేదని. అది అదనపు అలంకారం అనిపించింది.
Thank you Paresh Garu.
Story chala baga raasaru Rishi gaaru… very heart toughing and hilarious too… 🙂
Thank you very much madam !
అపకుండా చదివించింది. స్మూచ్. చి న
Thank you Anil Garu