అక్కడ గడియారం మీద కోకిలమ్మవాలింది.
చెట్టు ఉంది పరిశ్రమ ఉంది సైరన్ కూడా
కోకిలమ్మతో శృతి చేసుకోవాల్సి ఉంది
చెమట చుక్కలో మొలిచిన ఓ చెట్టు
తల్లిలా విస్తరించిన చెట్టు
తల్లులకు తల్లి అయ్యింది
చెమట చుక్క నుంచి పుట్టిన చెట్టు
దిక్కులేని పక్షులకు ఆశ్రయం అయ్యింది
పక్షుల రెక్కల కష్టానికి, కొత్తఆకాశం ఇచ్చే
వనమయ్యింది జీవనమయ్యింది
చెట్ల మధ్యలో చెట్లు, చెట్ల చుట్టూ చెట్లు
ప్రతి చెట్టూ ఓ మనిషే
మట్టికీ మనిషికీ కూడా చెట్టే కవచం, చెట్టే కంచుకోట
యంత్రుడి మొడలో హరిత హారం మీద ఎగిరే కొంగలు
యంత్రానికీ మనిషికీ కూడూ గూడూ చెట్టే
ఆలోచనల చెట్టు మనిషి, కండరాల శ్రమశక్తి మనిషి
ప్రతిచెట్టూ, ఇంటా బయటా చాకిరి చేసే ఓ స్త్రీ మూర్తి
భూమి సూర్యుడి చుట్టూ తిరిగితే
సూర్యుడు చెట్టు చుట్టూ తిరుగుతాడు
చెట్టు పెరటిలోనూ, పొలంలోనూ
పనిచేసే స్త్రీల చుట్టూ తిరుగుతుంది.
చెట్టూ స్త్రీశక్తీ కలిసి మానవాళికి
ఊఊఊలలలలలా ఉయ్యాల జంపాల
ఇంటిపనిలో ఆమెనుండి వెలువడే సూర్యతరంగాలు
పక్షులతో పశువులతో ఆమె చెలిమి చంద్ర కిరణాలు
పిల్లల్ని పోషిస్తు ఆమె పాడే లాలిపాటలు వెన్నెల విహంగాలు
అన్నీ ఆమె నుండి ప్రసరించే అదృశ్య తరంగాలు
అమెతో సహా ప్రసరించే జీవన దృశ్యాలు
చెట్టులో కలిసిపోతాయి
పువ్వుల్లో కలసిపోతాయి.
ఆమె శక్తి ఫలమై రెక్కల విత్తనమై
విస్తరిసుంది సప్తసముద్రాల ఆవలికి
ఎనిమిది ఖండాల్లో ఆమె విత్తనాల నుంచి
విష్ఫోటిస్తూ వస్తారు మనుషులూ పశుపక్ష్యాదులూ
పారలూ కొడవళ్లూ అరకలూ ఎద్దులతో సహా
అదే ఆ స్త్రీ శక్తి విసిరే విత్తనాల నుంచే
చెట్లూ వాటిమీద ఎగిరే పక్షులూ
ఆపైన ఆకాశం పుట్టుకొస్తాయి
అంతెందుకు, అదే స్త్రీ శక్తి వర్షాన్నీ
అంతరిక్షాన్నీ కూడా పుట్టిస్తుంది
చెట్టునీ పుట్టనీ కాసింత వర్షాన్ని
నాలుగు మబ్బుల్నీ నాలుగు విత్తనాల్నీ
కాస్త చీకటినీ కొంత సూర్యరశ్మినీ
తన ప్రేమలోంచి బయటికి శ్వాసించి
ఆమె సృష్టిని శాసించగలదు
ఆమె కొత్త స్రృష్టినీ కొత్త విశ్వాన్నీ తన పొత్తిళ్లలో పెంచగలదు
చెట్టు ఉంది పుట్ట ఉంది గుట్ట ఉంది
యంత్ర వృక్షాలు తడుస్తాయి మనుషుల శ్రమలో
యంత్ర వృక్షాలే నీడనిస్తాయి
కుటుంబానికి నీడనిచ్చే స్త్రీ మూర్తులకు తామూ గొడుగై
ఊళ్లలో మట్టి ఏమాయాజాలంలో
ధ్వంసమై పరాయిదైపోయిందో
మట్టి బతులు విఛ్చిన్నమై వీధిన పడినప్పుడు
దళారీ ఒకడు ఆడమనిషి మాంసాన్ని
కనిపించని నాలుగో సింహం సహా
మూడు సింహాలకీ తినిపిస్తుంటాడు
కుటుంబ వ్యవస్థ పెంచి పోషించే
హింసని పళ్లబిగువున భరించే తరుణంలో
కాస్త చేయూత, కాస్త బాసట, కాస్తఊరట
యింత్ర వృక్షం నీడన కొద్దిగా భరోసా
చెట్టు ఉంది గుట్ట ఉంది
అమ్మలకు అమ్మ చెంగాళమ్మ ఉంది
పక్షుల సంగీతాలూ పడవల మృదంగాలూ
యెదలోని శాంతిని మీటే వీణాగానాలూ
సరస్సులనీ పరిసరాలనీ దృశ్యకావ్యాలుగా మార్చే
విహంగ జీవన విన్యాసాలూ మనిషికిచ్చిన వరాలు
ప్రకృతి పరిశ్రమా చెట్టపట్టాలు వేసుకుని సాగిపోతే
అది గొప్ప జీవన గానం
అది జన జీవన సాగరంపై చల్లని చంద్రోదయం
ఆ చంద్రోదయంలోనే మనిషి కల, కళా, శాస్త్రం
అంతరిక్షాల్లో సైతం వికసిస్తాయి అనంతాలకి విస్తరిస్తాయి
ప్రకృతి పరిశ్రమా మనిషీ కలసి జీవిస్తే అది సిరుల సహజీవనం
గతితప్పితే కరోనాల సునామీల మహావిధ్వంసం
ప్రకృతితో చెలగాటాలడితే వైపరీత్యాలు
ప్రకృతితో చెలిమి చేస్తే వరాల వర్షాలు
రాజ్యమో , కుటుంబమో , సమాజమో, యంత్రమో
అమాన వీయమై, అసమాన తలాలు సృష్టించి
స్త్రీ శక్తినీ ప్రకృతినీ వికృతంగా వాడుకునే
ఏ సామాజిక వ్యవస్థలైనా కూలిపోక తప్పదు
మహోగ్రమైన పకృతి బీభత్సంలా మహావిధ్వంసం తప్పదు
శతాబ్దాల ఆధిక్య వ్యవస్థల విధ్వంసం తప్పదు
శ్రమైక సహజీవన సౌందర్యాన్ని సృష్టించక తప్పదు
శ్రామిక స్త్రీల మోటు చేతులే చరిత్రని తిరగ రాయక తప్పదు.
(పులికాట్ సరస్సులో ఇరక్కం దీవి, శ్రీసిటీలను సందర్శించిన సందర్భంగా)
అద్బుతమండీ 👏👏
వసీరా గారి సైరన్ తో శృతి ప్రకృతి మహిళల ప్రాధాన్యతను చక్కగా ఆవిష్కరించారు. మరో చెట్టు కవి అనిపించారు. అభినందనలు.
వసీరాకి అభినందనలు!
ప్రకృతిని సంరక్షించాలనే బాధ్యత గురించి చక్కగా వివరించారు. నాలుగో సింహం కేవలం ఆ ఒక్క విషయంలో నే కాదు అన్ని రంగాలలోనూ మిగిలిన మూడు సింహాలకు మేత వేస్తూనే ఉన్నాడు.
చాలా బాగుంది, ప్రకృతి,పరిశ్రమ, మనిషి కలసి జీవిస్తే చాలా బాగుందని చక్కగా చెప్పారు
చాలా బావుంది వసీరా. నిజమే ప్రకృతిని వికృతిని చేసే ఏ సందర్భం సురక్షితం గా ఉన్న దాఖలు లేవు.
అభినందనలు
చాలా బాగుంది.స్త్రీశక్తినీ, ప్రకృతిని వికృతంగా వాడుకునే ఏ సామాజిక వ్యవస్థైనా విధ్వంసం కావాల్సిందే.అది అర్థమైతే అదేచాలు.
“రాజ్యమో,కుటుంబమో , సమాజమో, యంత్రమో
అమాన వీయమై, అసమానతలాలు సృష్టించి
స్త్రీ శక్తినీ ప్రకృతినీ వికృతంగా వాడుకునే
ఏ సామాజిక వ్యవస్థలైనా కూలిపోక తప్పదు”
చాలా బాగుంది కవిత వసీరా గారు
కవి తను చూసిన ప్రతి దృశ్యాన్ని కవితగా మలిచిన తీరు నన్ను చకితుడిని చేసింది. వసీరాకి ఇంత స్ఫూర్తినిచ్చిన ఆ ప్రయాణంలో నేను కూడా పాలుపంచుకోవడం వల్ల ఈ కవిత నాకు మరింత సన్నిహితంగా కూడా అనిపించింది. వసీరాకి అభినందనలు..
కవి తను చూసిన ప్రతి దృశ్యాన్ని కవితగా మలిచిన తీరు నన్ను చకితుడిని చేసింది. వసీరాకి ఇంత స్ఫూర్తినిచ్చిన ఆ ప్రయాణంలో నేను కూడా పాలుపంచుకోవడం వల్ల ఈ కవిత నాకు మరింత సన్నిహితంగా అనిపించింది. వసీరాకి అభినందనలు..
అద్భుతం…. అంతే!