స్వాతంత్ర దినోత్సవం. సంవత్సరం 2016.
దేశమంతా ప్రతిఏడు చేసుకొనే వేడుకలు. పిల్లలు, పెద్దలు, అన్ని వయస్సులవారు ఆప్తంగా పిలుచుకొనే ‘పంధ్రాగస్ట్’ పండగని సంతోషంతో సరదాగా గడుపుకోడానికి ఉత్సాహంతో ఎదిరిచూస్తున్నారు. జెండావందనం తయ్యారీలు ఎప్పటిలాగే జరుగుతున్నాయి.
ఉత్తర తెలంగాణలోని ఓ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో జెండా ఎగిరేయడానికి అంతా సిద్దంగా ఉంది. కొన్ని నిమిషాల్లో హెడ్మాస్టర్ తాడులాగడం, జాతీయపతాకం విచ్చుకోవడం, వీచే గాలికి అది రెపరెపలాడడమూ జరగబోతున్నాయి.
తొమ్మిదవ తరగతిలో ఉన్న ప్రతాప్ ముందువరసలో నిల్చోని ఉన్నాడు. స్పురద్రూపి. జాతీయపతాకం కొన్ని క్షణాల్లో ప్రసవించడానికి సిద్దంగా ఉన్న శిశువు ముద్దలా ఉంది.
మూడు రంగుల్లో ముడుచుకొని అస్పష్టమైన ఒక బట్ట బంతిలా…
ప్రతాప్ ఆ పతాకపు మొగ్గ వైపే తీక్షణంగా చూస్తున్నాడు. దానికి అతికివున్న తాడుని మరింత పరీక్షగా చూస్తున్నాడు.
క్షుణ్ణంగా గమనించాడు. నిర్దారణకి వచ్చాడు.
మెరుపు వేగంతో దూరంలో ఉన్న తన క్లాస్ టీచర్ దగ్గరికి చేరాడు.
క్లాస్ టీచర్ జెండా స్తంభంవైపు చూసి అదేవేగంతో హెడ్మాస్టర్ దగ్గరికి చేరి జాతీయపతాకాన్ని చూపుతూ గాబరాతో చెప్పాడు.
జరగబోయే పెద్దపొరపాటు తెలిసింది. జెండా స్తంభాన్ని వెంటనే దించి జాతీయపతాకాన్ని సవరించి స్తంభాన్ని పైకి లేపారు.
హెడ్మాస్టర్ ప్రతాప్ ని తన పక్కనే నిలబెట్టుకొని జెండా వందన కార్యక్రమాన్ని పూర్తిచేసాడు.
ఆ రోజటి హీరో ప్రతాప్.
సవరింపబడ్డ పతాకం గాలికి తీరికలేకుండా రెపరెపలాడుతోంది. శబ్దం అందరికీ చెవులనిండుగా వినబడుతుంది. మూడురంగులు ముచ్చటగా కనబడుతున్నాయి. నీలి రంగులో అశోక చక్రం కదలకుండానే ప్రగతివైపు కదులుతుంది.
సాయంత్రం ప్రతాప్ తన దగ్గరి స్నేహితుడు అజీజ్ తో సంతోషంగా గడిపాడు. ఇద్దరి స్నేహం చిన్నప్పటిది. ఒకరి ఇంట్లోకి మరొకరు స్వేచ్చగా తిరిగే బంధం వారిది. ఇల్లు దగ్గర్లో ఉండడంతో తల్లితండ్రులమధ్యకూడ అనురాగలు అప్యాయతలు అల్లుకొన్నాయి. అజీజ్ తల్లి బీడీలు చేస్తుంది. తండ్రి పండ్లు అమ్ముతూ ప్రతిఏటా మామిడి తోటలు గుత్తాకు తీసుకొని సంసారాన్ని నడుపుతున్నాడు.
* * *
“ఆరేయ్ ప్రతాప్, పొలానికి పోయి నీళ్ళ మట్టం చూసి మోటార్ బందుచేసి రాపో.” తండ్రి రాజలింగం.
“గట్లనే నాన.” బండి (ద్విచక్రవాహనం) తీసుకొని పరుగెత్తించిండు. పోతున్న కొడుకుని చూసుకొని రాజలింగం గర్వపడ్డాడు. బీడీలు చేస్తున్నభార్య భూమక్క వైపు మెచ్చుకోలుగా చూసాడు.
“పదిలం కొడుకా… మెల్లగా నడిపియ్యు.” వేగంగా పోతున్న ప్రతాప్ వైపు చూస్తూ అన్నది.
బండిచేసే శబ్దంలో తల్లి మాటలు ప్రతాప్ కి వినిపించనే లేదు.
‘ఊర్లే మనోన్ని బగ్గ మెచ్చుకొంటున్నరే. నీకు తెల్సిందావునే?”
“నాకెట్ల తెలుస్తది. నీ లెక్క బయట తిరుగుతన. ఏం జేసిండు మనోడు?” బీడీలని చుడుతూనే భర్తవైపు చూస్తూ ఉత్సాహంతో అడిగింది భూమక్క.
“పంధ్రాగస్టు నాడు బడొళ్ళు జెండాని వుల్టా గట్టిండ్రట. గది మనోడు జూసి టీచర్కు చెప్పిండట. పెద్ద గండం నుంచి బచాయించిండే మనోడు. హెడ్మాస్టర్ మస్తుగా మెచ్చుకొన్నడట.”
“అంతా నర్సింహుడి దయ. పొల్లడు మంచిగా సదుకొని గింత సర్కారీ నౌక్రి సంపాదించుకొంటే మన కష్టాలు తీర్తై… ఈసారి పంటలేం జేస్తయో…మన బతుకులేప్పుడు సుదుర్తాయో?…” బీడీకి దారాన్ని కడుతూ భూమక్క.
“మొదలు ఆడి సదువు కాని. గప్పుడు కలలు కను. ఇంటర్ అయినంక ఇంకా మూడేండ్లు సదుతె డిగ్రీ. గప్పటిదాకా నీ పూజలు నువ్వు జేసుకో… మంచిగా మొక్కు…”
ఇంట్లో ప్రతాప్ లేడని, ఇదే మంచి అవకాశామని భూమక్క తనకి అర్థంకాని ఓ విషయాన్ని భర్తని ఇప్పుడడిగితే మంచిదనుకొంది.
“మనోడు సైన్యంలకు వొతా అని ఊర్కే అంటడు. సుట్టుపక్కల ఊర్లళ్ళకెళ్లి పోరగాండ్లు బగ్గనే పొయిండ్రట. నేనుసుగ పోతా పోతా అని నాతోని అంటడు. నీతోనేమన్న అన్నడా గీమాట?” రాజలింగం వైపు చూసుకొంటూ అడిగింది.
“మనోడికి ఇంటర్ సదు కాంగనే ఏదన్న ఉద్యోగం సంపాదించి మన కష్టాలు తీర్చాలనుందే. నేను వ్యవసాయం చేసుడు, నువ్వు బీడీలు సుట్టుడు సూసి లోపలోపల్నే బగ్గ బాధపడ్తడే ఆడు. మనకు చెప్పడుకని వేరొల్లతోని ఎప్పుడు అంటడట.” రాజలింగం గొంతు జీరబోయింది.
భూమక్క భర్త వైపు చూసి కళ్ళల్లో నీళ్ళు తెచ్చుకుంది. పెళ్లై ఎనిమిదేళ్ళైనా దంపతులకు పిల్లలు కాలేదు. ఇక కారేమో అనుకొని ఇద్దరూ మదనపడేవారు. రోజులు గడిచినకొద్దీ భవిష్యత్తంతా అంధకారంగా కనబడేది. వయసు పెరిగినకొద్దీ పిల్లలులేని చింత మరీ ఎక్కువయ్యేది. చుట్టుపక్కలవారి, బంధువుల మాటలు మరింత బాధించేవి.
“ఎక్కడికన్నవోని కని గీ తుపాకులు పట్టుకొని యుద్దాల్జెసే ఉద్యోగం అద్దు. దగ్గర్లనే టీచరో, చప్రాసి పనో సూసుకొమ్మను. మనిద్దరం పోయేదాక కండ్లముందు ఉండే నౌక్రి దొరకాలని రోజు మొక్కుత.” సుట్టిన బీడీలని కట్టలు కడుతూ భూమక్క.
కొడుకు మీదున్న గాడప్రేమ రాజలింగంకు తెలుసు. ఆలస్యంగా పుట్టడంతో కొడుకుని అపురూపంగా చూసుకొంటూ భూమక్క ప్రేమతో పెంచింది. ఎదుగుతున్నకొద్దీ ప్రతాప్ తమ జీవితంలో రాకుంటే జీవితం ఎలా ఉండేదో ఊహించుకోలేక పొయ్యేది.
భూమక్క చిన్నప్పటినుంచి బీడీలు చేస్తుంది. వయస్సు దాటినా ఇప్పటికీ రోజు పదిహేను వందల బీడీలు చేస్తుంది. ఆకు కత్తిరించి, తంబాకు వేసి చక్కగా చుట్టి దారంతో కట్టేయడంలో మంచిపేరుంది. ఒక్క బీడీకూడా చాటన్ కాదు. కంపనీ వాళ్ళు కళ్లుమూసుకొని భూమక్క బీడీలని చేక్చెయ్యకుండానే తీసుకొంటారు.
భూమక్క ఇంటిని, మనుషుల్ని చక్కగా మలచుకొని తన పరిదిలో ఒక చీకు చింతలులేని సంసారాన్ని సృష్టించుకొంది.
* * *
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రమయ్యింది. చిట్టి పొట్టి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. రైతుబంధు డబ్బులు ఖాతాల్లోకి వస్తున్నాయి. బీడీ కార్మికుల వేతనాలు పెరిగాయి – వెయ్యి బీడీలకి ఐదు రూపాయలు పెంచారు! ఒక బీడీకి సగం పైసా!!
ప్రతాప్ అజీజ్ లు పదో తరగతి మంచి మార్కులతో పాసయ్యారు. ప్రతాప్ ఇంటర్లో చేరాడు. అజీజ్ కువైట్ లో ఉన్న అన్న సహాయంతో అక్కడికి వెళ్లిపోయాడు. పోయేముందు ఓ ఆరునెలలు ఎయిర్ కండిషన్ కోర్సు చేసి సర్టిఫికట్ సంపాదించాడు. ప్రతాప్ ఒంటరి వాడయ్యాడు. రెండుమూడు రోజులకోసారి వీడియో కాల్తో మాట్లాడుకొని స్నేహాన్ని కొనసాగిస్తున్నారు. ఇప్పుడు అజీజ్ సంపాదిస్తున్నాడు. పాకెట్ మనీ కోసం అపుడపుడు చిన్న మొత్తాల్లో ప్రతాప్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేసేవాడు. “వద్దురా… పంపకురా… ముందుముందు ఏవైనా పెద్ద అవసరాలుంటే నీ దగ్గర అప్పు తీసుకొంటరా…” అనే వాడు ప్రతాప్. “అప్పుడు చూసుకుందాంరా…మనం ఎంత కష్టపడ్డామో తెలుసుకదరా?… చిల్లర ఖర్చులకోసం వాడుకోరా…” అని ప్రతాప్ నోరు మూయించేవాడు.
“అరె పర్తాప్, అమ్మని డాక్టర్దగ్గరికి తీసుకెళ్లురా… అమ్మ బాగా దగ్గుతుందని మా అమ్మ చెప్పిందిరా… డబ్బులవసరమైతే చెప్పు…” అని చెప్పి వీడియో కాల్ని ఠక్కున కట్ చేసాడు.
ప్రతాప్ తీవ్ర ఆలోచనల్లో పడ్డాడు. తనకూ ఒక రాబడి అంటూ ఉంటే అమ్మానాన్నల కష్టాలు తగ్గిపోయేవి కదా అన్న విషయమే బాగా వేదించేది.
కొన్ని నెలలు గడిచాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు (2023) జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఫిబ్రవరి 2022లో మొదలయ్యింది. కొనసాగుతూనే ఉంది. పాలేస్తిన్-ఇజ్రాయిల్ దాడులు మొదలై సంవత్సరం కాబోతుంది. ఇండియాలో లోకసభ ఎన్నికలు ఏడు దశల్లో ఏప్రిల్ నుండి జూన్ 2024 వరకు జరిగాయి.
యువత పరిస్థితి అనిశ్చితంగా ఉంది. నాలుగు తోవల మధ్యలో నిల్చున్నారు. ఎటువైపు వెళ్ళాలో నిర్ణయం తీసుకోలేని అగమ్యగోచరమైన స్థితిలో సతమతమౌతున్నారు.
జాబ్ కాలెండర్లు గారడి ఆట గమ్మత్తుల్లగా వస్తున్నాయి. యువతలో ఆశల్ని రేపుతాయి. ఆచరణలో అరాచకాలు. అక్రమాలు. యువత నిరుత్సాహంతో నిర్జీవంగా రోజుల్ని, నెలల్ని, సంవత్సరాల్ని గడుపుతుంది. జాబ్ కాలెండర్ల నోటిఫికేషన్లు అర్థ ఖాళీలతో, పూర్తిఖాళీలతో పరేషాన్ల పుట్టలా పెరిగుతున్నాయి.
ప్రతాప్ ఓ రోజు ఉదయాన్నే లేచి బ్యాగు సర్దుకొన్నాడు. అజీజ్ చేయించుకొన్నప్పుడే ఎప్పటికైనా ఉపయోగపడుతుందికదా అని తాను కూడా చేయించిన పాస్పోర్ట్, ఇంకేవో కాగితాల్ని బధ్రంగా పెట్టుకొన్నాడు.
తల్లి తండ్రులని ఒక్కచోటికి పిలిచి కాళ్ళకి మొక్కాడు. దీవించమని అడిగాడు.
రాజలింగం భూమక్కలకి ఏమి అర్థం కావడంలేదు. తికమకతో ప్రతాప్ వైపు చూస్తున్నారు.
“నేను ఒక ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నా. రెండు మూడు నెలలు మీకు అందుబాటులో ఉండ. నేనే మీకు ఫోన్ చేస్తా. మీరు చెయ్యకుండ్రి. అంతా ఐనంక అన్ని ఇషయాలు మీకు చెబుతా… ఇప్పుడేం అడుగకుండ్రి. అనుకున్నట్టైతే మంచిగనే సంపాదించుకొని అస్త… సుఖంగా ఉందం. మీరు మంచిగుండుండ్రి.”
కండ్లల్లో నీళ్ళు నిండాయి. ప్రతాప్ బ్యాగ్ తీసుకొని భుజాన తగిలించుకొని, ఇద్దరిని దగ్గరికి తీసుకొని గట్టిగా హత్తుకొని బరువైన గుండెతో కదిలాడు.
రాజలింగం-భూమక్క ఏడ్వడం మొదలు పెట్టారు. కళ్ళలో నిండిన నీళ్ళలో వెళ్లిపోతున్న ప్రతాప్ మసకమసకగా కనబడుతున్నాడు.
రాజలింగం భార్యని దగ్గరికి తీసుకొని ఓదార్చాడు.
భూమక్క కూచోని ఏడుస్తూనే ఉంది. ఆమెకి దుఖం ఆగడమే లేదు.
సాయంత్రమయ్యింది. రాత్రయ్యింది. సూర్యోదయమయ్యింది. ప్రతాప్ లేకుండా ఆ ఇంట్లో ఒక రాత్రి భారంగా గడిచిపోయింది.
* * *
ప్రతాప్ ఉద్యోగం దొరికిందని ఎంతో సంతోషించాడు. ఇక తన కుటుంభ కష్టాలు తీరినట్టే అని సంబరపడిపోయాడు. ఏజెంట్ ద్వారా రష్యాలో ఉద్యోగాలు అని డిసెంబర్ 2023 ప్రాతంలో భారతదేశంలో విస్తృతంగా యూట్యూబుల, సామాజిక మాధ్యమాల ద్వారా, గుప్త ఏజెంట్లద్వార యువతని పెద్ద జీతాలంటూ ఆకర్షణ ఎరలు కనపడడం మొదలయ్యాయి.
ప్రతాప్ ఎంపికయ్యాడు. తన ప్రమేయమేమి లేకుండా రహస్యపు ప్రయాణాలద్వారా మొత్తానికి రష్యా-ఉక్రెయిన్ సరిహద్దుల్లోకి చేరుకొన్నాడు. తనకి వాహనాన్ని నడిపే శిక్షణ ఇచ్చి, యుద్దంలో చనిపోయినవారిని పాతిపెట్టటానికి కావలసిన కందకాలపని అని చెప్పి పెద్దమొత్తంలో జీతం అంకెల్ని కూడా తెలిపారు.
ఇంటి కఠిన పరిస్థితుల్లో ఉన్న ఆర్థిక సంక్షోభంనుండి బయటపడడానికి వేరే మార్గాలు లేక రణక్షేత్రాల్లో ప్రాణాలకి ముప్పుతెచ్చే ఉద్యోగాల్లో చేరిపోతున్నారు. ఎందరో యువత. నేపాళ్ నుండి. భారత్ నుండి… ఇతర దేశాలనుండి. ఇండియా నుండి యువత ఉక్రెయిన్ సరిహద్దులకి చేరుతుంది.
భిన్న సంస్కృతులతో ఉడుకురక్తాలతో యువకులు రష్యాలో దిగగానే అక్కడి ఏజెంట్ అందరినుండి పాస్పోర్ట్లని తీసుకొన్నాడు. కొందరు ఇవ్వడానికి నిరోధించినా, ఏజెంట్ బలవంతాన లాగేసుకొన్నాడు. పరమపదసోపాన ఆటలో పెద్దపాము లటుక్కున మింగేసింది.
పాస్పోర్ట్ లేని యువత. పత్రాలులేని వివిదదేశాల పౌరులు. ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా తరపున ఉగ్రరూపం చూపడానికి. గాంధీ పుట్టిన దేశంనుండి వెళ్ళి ఏ సంబంధంలేని దేశంలో అడుగుమోపి మరో తెలియని దేశంతో యుద్ధం చేయాలి.
ఒక రష్యా శిక్షకుడు అందరికీ ఆయుధశిక్షణ మొదలు పెట్టాడు. అందరూ ఆశ్చర్యంలో… రష్యా దేశపు సైనిక దుస్తుల్ని కట్టించి, ఎప్పుడు ముట్టుకోని, పట్టుకోని ఆయుధాలని చేతిలోపెట్టి ఉక్రెయిన్తో యుద్ధంలో పోరాడాలి అంటూ జబర్దస్తీగా నేర్పడం ఆరంభించారు.
“లేదు. మాకు ఈ శిక్షణ వద్దు. మాకు మా దేశాల్లో ఏజెంట్లు చెప్పిన పనుల్ని ఇప్పించండి. ఈ పని చేయలేం…” అని మొరాయించారు.
“వినండి. మీ దగ్గర పాస్పోర్టులు లేవు. మీరేమి చేయలేరు. పత్రాలు లేనందున జైల్లోకి వెళతారా లేదా రష్యా తరపున ఉక్రెయిన్ తో యుద్దం చేస్తారా?” అని రెండు కఠిన మార్గాల్ని ఏదో ఒకదాన్ని ఎన్నుకోండని దురుసుగా చెప్పాడు.”
అందరూ ఏడుపు మొఖం పెట్టారు. కొందరు ఏడ్చారు. ఒకరిద్దరు బాలన్సు తప్పి పడిపోయినంత పనిచేసారు.
నామమాత్రపు పదిరోజుల శిక్షణ పూర్తయ్యింది. రకరకాల ఆయుధాలతో పరిచయమయ్యింది. ఎలా వాడాలో తెలుసుకొన్నారు.
ప్రతాప్ అయోమయంలో పడ్డడు. ఎంత శిక్షణ ఇచ్చినా ముక్కు మొహం తెలియని దేశంపై యుద్ధం చేసి తప్పక గెలవాలి అనే మానసికస్థితి రావడం లేదు. ఇప్పటి పరిస్థితుల్లో రష్యా తరపున సైనికుడిగా ఉక్రెయిన్ పై శత్రుత్వపు భావనలు రావడంలేదు. పదిరోజుల్లో జాతీయ భావాన్ని ఎలా నిర్మించగలం? దేశాన్ని కాపాడుకోవాలన్న ఆశయంలేదు. ఎదుటి దేశం శతృత్వాన్ని జీవితంలో ఎప్పుడు అనుభవించలేదు…
జీతాలకోసం మాతృ దేశాన్ని వదిలి ఒక దేశానికి జీతం తీసుకొనే సైనికుడినై మరో దేశంపై బుల్లెట్లని, రాకెట్లని కురిపించడం…
ప్రతాప్ రాత్రంతా ఎడ్చాడు. మాతృదేశం గురుతుకొచ్చింది. జాతీయపతాకం పదేపదే గురుతుకొచ్చింది. దేశభక్తి నరనరాల్లో నిండిఉన్న ప్రతాప్ ఏ పోరాటపటిమతో పోట్లాడాలో సతమవుతున్నాడు.
రష్యా సైన్యం వారి యూనిఫార్మ్ దుస్తుల్ని అందరు వేసుకొంటున్నారు.
ప్రతాప్ కి నిద్రపట్టలేదు. యూనిఫార్ముని కిటికీనుండి బయటకి విసిరేయాలన్న కసి నిండుకొంది.
భారత దేశస్థుడై రష్యా దేశపు సైనిక యూనిఫార్మ్ దుస్తుల్ని వేసుకోవాలంటేనే మనసు అస్సలే ఒప్పుకోవడంలేదు. చిన్నప్పటినుండి భారత సైన్యంలో చేరాలని, ఆ యూనిఫార్మ్ నే వేసుకొని బస్సుదిగి నడుచుకొంటూ ఇంటికి వెళుతుంటే ఊరివారంతా తననే చూడాలని ఎన్ని కలలు కన్నాడు?
రెండుసార్లు పరుగులో వెనకపడడంతో ఆర్మీలో ఎంపిక కాలేదు. ఈసారి గట్టిగా ప్రయత్నించి సాధించాలనుకొన్నాడు. సాధన మొదలుపెట్టాడు. రోజు పొద్దున్నే పరుగెత్తడం బాగా అభ్యసిస్తున్నాడు.
ప్రతాప్ మనస్సులో తూఫాన్. ఉపశమనం కలిగించుకోడానికి అజీజ్ కి ఫోన్ చేసాడు.
“పెద్ద తప్పు చేసిన్రా. రష్యాకి రాకపోతేనే బాగుండేదిరా. ఏదో కందకాలు తవ్వే పని అని, రష్యా సాయినికులకి సహాయకులుగా అని మమ్మల్ని ఇక్కడికి తెచ్చి, ఇప్పుడేమో ఉక్రెయిన్ పై ఆయుధాలతో యుద్ధం చేయమని సరిహద్దుల్లోకి తీసుకచ్చిండ్రు… ఒక దేశంకోసం ఇంకో దేశంతో యుద్ధం ఎట్ల చేసుడురా?” మాటల్ని అంటుటూనే వెక్కి వెక్కి ఏడుస్తూ ప్రతాప్.
స్నేహితుడి ఏడుపు విని అజీజ్ కళ్ళల్లో నీరు. ప్రతాప్ ఏడుపు విన్నంతసేపు అజీజ్ కళ్లనుండి ధారలు. రుమాలు తీసి తుడుచుకొంటూనే ఉన్నాడు.
“అరె పర్తాప్. ఏడకురా…”
“ఇప్పుడు నేనేం జెయ్యాల్రా? ఇది యుద్ధం రా. సస్తనో బతికి తిరిగొస్తనో ఏం తెలదురా. వేరే దేశం సైన్యం దుస్తుల్లో నేను సావదలుచుకోలేదురా… నా శరీరం భారతదేశం కోసంరా… ఈ శరీరంపై ఇతరదేశం యూనిఫామ్ ని ఊహించుకోలేక పోతున్నరా… చిన్నప్పటినుండి నా ఈ శరీరంపై మనదేశపు సైనిక దుస్తుల్నే ఊహించుకొని పెరిగినరా. నీకు తెలుసు గదరా…”
“గవన్ని ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోకు. చిన్నప్పటినుంచి నువ్వు ధైర్యపు పనులు చేసినవని మీ నాన బడిలేసినప్పుడు నీ పేరుని పర్తాప్ (ప్రతాప్) అని రాయించిండు… ఇప్పటికి వాళ్ళు చెప్పిన పనుల్ని చెయ్యి. మన దేశపు సైన్యపు దుస్తులనుకొని వీరోచితంగా పోరాడు. ఏదో ఒక మార్గం రాక పోదు. ఏడ్వకురా…
“ఆరేయ్ అజీజ్. నాకు కాప్టెన్ విక్రమ్ బాత్ర కొటేషన్ పదే పదే గుర్తుకస్తున్నదిరా. నా జీవితంలో ఆ అవకాశం ఇక దొరకదురా… ఆయనేమన్నాడో యాదికున్నదారా నీకు? ‘గెలిస్తే మన జెండాని అక్కడ ఎగరేసివస్తా… చస్తే మన జెండాని చుట్టుకొని వస్తా… నేను తిరిగిరావడం మాత్రం తప్పనిసరి…’ నాకేమన్న అయితే మా అమ్మానాన్నల్ని అపుడపుడు అరుసుకుంటవు గదరా? బ్రతికస్తే ఎట్లనన్న మనదేశపు సైన్యంల చేర్తా… అదేరా నా జీవితాశయం. అల్లాని ప్రార్తించురా…”
“కోపమస్తున్నదిర నీ మీద. గిప్పుడు గవేం మాటల్రా? ధైర్యంగా ఉండు… నువ్వు వాపస్ అస్తవురా…’
* * *
దినమంతా ఉక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా సైనికుడిగా యుద్ధం చేసివచ్చాడు ప్రతాప్. శిక్షణని బాగా ఉపయోగిస్తున్నాడు. పోరాటపటిమని నింపుకొంటున్నాడు. భారత సైనికుడిగా పొంచిఉన్న రెండు శతృదేశాల్ని ముందర ఊహించికొంటూ నిష్టతో ఆయుధాలని రష్యా సైన్యంవారిచ్చిన నామమాత్రపు శిక్షణకి తన తెలివితేటల్ని జోడించి దండిగా కసిగా ఉపయోగిస్తున్నాడు. అటువైపునుండి వస్తున్న గుండు సామగ్రిని చాకచక్యంతో తప్పించుకొంటూ గాయపడకుండా పోరు కొనసాగిస్తున్న కొద్దిమంది సైనికుల్లో ప్రతాప్ ఒకడు.
ఆరోజటి యుద్ధం ఆగిపోయింది. ప్రతాప్ బాగా అలసిపోయి నిద్రలో ఉన్నాడు.
అజీజ్ నుండి ఫోన్.
స్నేహితుడినుండి ఫోన్ రావడంతో అలసట అంతా ఎగిరిపోయింది. బక్కెట్టు నీళ్ళు ఎవరో మొహంపై పోసినట్టుగా అయ్యింది. నిద్రా హుష్ కాకిలా ఎక్కడికో ఎగిరి పోయింది.
“అరె పర్తాప్… ఎట్లున్నవురా?…” ఉత్సాహమైనగొంతుతో అజీజ్.
“అజీజ్ భాయ్. ఇప్పటివరకు ఒక్క బుల్లెట్ తగలకుండా ఉన్నారా! వీళ్ళు చెప్పినట్టుగా రష్యా సరిహద్దులనుండి ఉక్రెయిన్ పై రోజు యుద్ధం చేస్తూనే ఉన్న. మన దేశానికి అతికేఉన్న రెండు దేశాలని తలచుకొంటూ ధైర్యంగా యుద్ధం చేస్తున్న. రష్యా ఆఫీసర్లు మెచ్చుకొంటున్నారు… వేరే మార్గం లేదురా అజీజ్…”
“గిట్లనే ఉండు. నీ పని నువ్వు చేసుకుంటా పో. మీ దేవుళ్ళు, మా అల్లా నీ వైపే ఉన్నారు. నీకేం కాదురా…”
“గట్లనే ఉంటున్నరా. రష్యా వారిచ్చిన సైన్యపు దుస్తుల్ని మన ఆర్మీ యూనిఫార్మ్ అనుకోని రోజూ పరకాయ ప్రవేశం చేస్తున్నరా. ఒక రోజు చైనాని, మరో రోజు పాకిస్తాన్ని తలచుకొంటూ యుద్ధం సాగిస్తున్న. వీరోచితంగా పోట్లాడుతున్న. గట్ల అనుకోకుంటే బ్రతకలేనురా… యుద్దం చెయ్యలేనురా…”
“గిప్పుడు ఫోన్ చేసినవెందిరా? ఇంటిదగ్గర అంతా మంచిదే గదా?” కాస్త ఊరట గొంతుతో ప్రతాప్.
“నీకోక మంచి న్యూస్ చెప్పడానికే ఫోన్ చేసిన. జూలై (2024) నెలలో భారత ప్రధానమంత్రి రష్యా పోయిండు. రష్యా అధ్యక్షుడితోటి నీలాటి అందరు ఇండియన్లని వెంటనే ఇడిపియ్యాలని మాట్లాడిండు. మీరంతా జల్దే బయటపడి ఇండియాకి వాపస్ అస్తరురా. గప్పటిదాకా ఎట్లనన్న పానం కాపాడుకో…” అజీజ్ కి ఆ రోజే తెలిసిన సమాచారాన్ని ప్రతాప్ చెవిలో వేసాడు.
“నిజంగానే మంచి వార్త రా. పెద్దోల్లు మాట్లాడితే పనులెట్లన్న జల్డిజల్ది అయితై. గిసుంటి వార్తలు సూడురా. వేరే దేశంవారు నా తీరుగనే ఉన్నరు. వాళ్ళ దేశంల సుగ దీని గురించి మాట్లాడుకుంటున్నారనుకుంటా. మనకు మోసం జరిగిందిరా. మనకు చెప్పిందొకటి. మనతోని జబర్దస్తీగా చేయించుకొంటున్నదొకటి…గెలిచానని గర్వంగా చెప్పుకొను. గెలిచిన చోట నా దేశపతకాన్ని ఎగరవేయలేను కదరా… చనిపోతే దేన్ని చుట్టుకోని నా శరీరం నా ఊరికి చేరుకొంటుందిర… అయ్యో దేవుడా… ఎలాటి గతి పట్టిందిరా నాకు… ” రోదించుకొంటూ ప్రతాప్.
“గిప్పుడు గవన్ని ఎందుకు. నువ్వు హుషారుగా ఉండు. మీరు జల్దే ప్రాణాలతో వాపసస్తరు. రెండు దేశాలనడుమ పెద్ద లేవల్ల మాటలు మొదలైనై…”
* * *
ఆగస్టు రెండవ వారం. 2024. పార్లమెంటు సమావేశాలు సాగుతున్నాయి. ప్రశ్నోత్తర సమయంలో భారత విదేశాంగ శాఖ మంత్రి జవాబులిస్తున్నాడు. రష్యా సైన్యంలో భారతీయులు 91 మంది ఉన్నారు. అందులో ఎనిమిది ఇప్పటికి మృతిచెందారు. 14 మంది మాతృదేశానికి తిరిగివచ్చారు. ఇక మిగిలిన 69 మందిని తీసుకోచ్చేందుకు భారత ప్రభుత్వం సన్నాహాలు మొదలుపెట్టింది అన్న వార్త వారివారి కుటుంభాల్లో ఉపశమనాన్ని తెచ్చింది.
ఎప్పుడు ఈ ప్రక్రియలు మొదలౌతాయి, ఎప్పుడు మన యువకులు క్షేమంగా తిరిగివస్తారో అని ప్రభావిత కుటుంభాలు తప్త హృదయాలతో ఎదిరిచూస్తున్నాయి.
రాజలింగం-భూమక్కలకి కాలక్రమంలో ప్రతాప్ సంగతి తెలిసింది. అజీజ్ ఒక్కడికే ప్రతాప్ వివరాలన్ని తెలుసు. ఆయనే వారితో మాట్లాడి ఓదార్చాడు.
రాజలింగానికి కొంచం అర్ధమయ్యింది. ఎన్నో పనులకి కార్మికులుగా పోయ్యిండ్రు కాని వలస కార్మికులు తమ దేశాన్ని కాపాడుకొనేందుకు సైన్యంల పనిచేయించుకోవడం ఎంతకూ అర్థం కావడంలేదు. ఇదెక్కడి తీరు అని ప్రశ్న ఆయన్ని తొలుస్తూనే ఉంది.
ఎంత ప్రయత్నించినా భూమక్కకి కొడుకు విషయం అర్థం చేయించలేక పోతున్నాడు.
భూమక్క వచ్చిన వారందరితో అడుగుతూనే ఉంది: “నా కొడుకు ఎక్కడికి వొయిండు? ఏం పని జేస్తున్నడు? ఎప్పుడస్తడు?…”
ఆమె చూపులు ఇంటి దర్వాజావైపే ఉంటున్నాయి. దినం. రాత్రీనూ.
ప్రతాప్ రాక కోసం!
*
Add comment