సేద తీర్చిన యాత్ర

చార్ ధామ్ సీజన్ మొదలయింది.భారతదేశంలోని ఇతర రాష్ట్రాలనుండి రాజధాని ఢిల్లీ వెళ్ళే అన్ని రైళ్ళలోనూ చార్ ధామ్ యాత్రికులే. ఏప్రియల్, మే నెలల వరకు గడ్డకట్టిన మంచుతో ఉండే హిమాలయాలు. జూన్, జులైల్లో హిమనీనదాలతో కనువిందు చేస్తాయి.
నేను హిమాలయాలకు వెళ్ళటం మొదటిసారి కాదు. మా అబ్బాయి గోపాల్ తో రెండువేల పదిహేడులో హెమ్ కుండ్ సాహెబ్, వ్యాలి ఆఫ్ ప్లవర్స్ కి వెళ్ళి వచ్చాను. అది నా మొదటి హిమాలయాభిముఖ అనుభవం. ముప్ఫయ్ రెండు కిలోమీటర్లు ట్రెక్ చేసి సెలయేళ్ళను తాకి, గ్లె్సియర్స్ మీద అడుగులు వేసిన అనుభవం.కనుచూపు మేర ఎటు చూసినా పూవులు, కంటికి అందే దూరంలో మంచుశిఖరాలు మొత్తంగా పూలలోయ ఒక అందమైన అద్భుతం.ఇక హెమ్ కుండ్ సాహెబ్. 15,000 అడుగుల ఎత్తులో చుట్టూ మంచు శిఖరాల మధ్య నీటి సరస్సు.గురుగోవింద సింగ్ తపస్సు చేసిన స్థలంగా ఇది సిక్కులకు పరమ పూజనీయ స్థలం. ప్రపంచంలో అతి ఎత్తయిన ప్రదేశంలో నిర్మించబడిన గురుద్వారాలలో ఇది మొదటిది.
మొదటిసారి హిమాలయాలకు వెళ్ళినప్పుడు నా లక్ష్యం అంతా పూలలోయపైనే అందువలన మేము కేటాయించుకున్న ఏడురోజులు అందుకే సరిపోయాయి. గోవింద్ ఘాట్ దాకా వెళ్ళి బదరీనాధుణ్ణి చూడకుండా వెను తిరిగాం.
ఆ తరువాత ఇప్పటి వరకూ చాలా ప్రయాణాలే చేసాను. ముఖ్యంగా అమెరికా రెండుసార్లు వెళ్ళివచ్చాను. అమెరికాలో ముఖ్యమైన నగరాలు, ప్రకృతిరమణీయ ప్రదేశాలూ అన్నీ తిరిగాను. అయినా హిమాలయాలు, మేము విడిది చేసిన జోషిమఠంలోని రిసార్ట్, గోవింద్ ఘాట్ నుండి గాంఘరియా వరకూ నడక దారి, ఎత్తయిన పర్వతాల ముందు నిలబడినప్పుడు నాలో కలిగిన భయం, భక్తి అన్నీ గుర్తుకువస్తూ ఉండేవి.
ఇదిగో మళ్ళీ ఇప్పుడిలా ఆ ఉన్నత శిఖరాల ముందు మోకరిల్లే అవకాశం దొరికింది, అది కూడా డాక్టర్ వాడ్రేవు వీరలక్ష్మీదేవి గారితో కలిసి ప్రయాణించటం.ప్రయాణ పరమార్ధం రెండింతలు అవుతుంది కదా అన్న ఉత్సాహంతో, కల్యాణి నీలారంభం గారు లేరు అన్న ఒక లోటుతో బెంగళూరు నుండి మా యాత్ర మొదలుపెట్టాం.
ముందుగా డెహరాడూన్ లో మామిడివనం చుట్టూ సెలయేరు,చెట్లు, చుట్టూ కొండలతో ఉన్న రిసార్టులో కేవలం సేదతీరటం అన్న ప్రాతిపదికతో అయిదు రోజులు ఉండాలని ఆలోచన చేసాం.అలసి సొలసిన మా మనసులకు ఆ పక్షుల కిలకిలా రావాల వైద్యం బాగా పనిచేసింది. అలా సోమరిగా చెట్లకింద గడుపుతూ, ఉయ్యాలలు ఊగుతూ, వేళకి తింటూ వేగంగా అర్ధంలేకుండా పరుగుపెట్టే జీవితాన్ని కాసేపైనా పట్టుకుని ఆపేసి ఏమిటి సంగతులు? అని నింపాదిగా అడిగాం.
చాలాసార్లు మౌనం, కొన్ని గొప్ప మాటలు పంచుకున్నాం. అలాంటి చోట్ల మనలాగా ఊపిరి పీల్చే ఓ తోడు గొప్ప అదృష్టం. నా అదృష్టం నాకెపుడూ పెద్దల సాంగత్యంలో లభిస్తుంది. పిట్టలు, మామిడిపిందెలు, మబ్బులు, వర్షం, పాటలు పైపై విషయాలు. సేదతీరిన మనసు అంతరంగ అద్భుతం.
ముసోరి దర్శనం ఒక కొత్తలోక సందర్శనం. మాల్ రోడ్ లో రిక్షా ప్రయాణం పాత హిందీ సినిమా పాటల్ని గుర్తుకు తెచ్చింది. కెంట్ జలపాతం మేము కలవబోతున్న మందాకినీ, అలకనంద, భగీరదీలని రుచి చూపించింది.ఎవరెస్ట్ హౌస్ పాయింట్ నుండి లోయల, పర్వతాల అందం చూసాం. ఇవి హిమాలయ పాదాలు మాత్రమే ఇంకా ముందుకు వెళతాం అన్న స్ఫురణ ఒక ఉత్సాహాన్ని, ఒక అదురుపాటును కలిగించింది. ఉన్నతమైన వాటి ముందు మరగుజ్జు భావన అనుకుంటా.
ఎవరెస్టు పాయింటులో సంప్రదాయ తె్నీరు అందించిన అందమైన ఉత్తరాఖండ్ కి చెందిన అందమైన ఆ తల్లీ కూతుళ్ళ వదనాలు చాలా రోజులే గుర్తుంటాయి. వారు చేసిపెట్టిన వెజిటబుల్ మ్యాగీ రుచి కూడా..
డెహరాడూన్ లోని మ్యూజియం,గుచ్చుపానీ కొన్ని చక్కటి జ్ఞాపకాలని ఇచ్చాయి.చాలా వాటికి ప్రధాన కేంద్రంగా ఉన్న డెహరాడూన్ బ్రిటీష్ కాలం నాటి భవనాలతో, సైన్యానికి సంబంధించిన కార్యాలయాలతో, పెద్ద పెద్ద ఆకుపచ్చని వృక్షాలతో హుందాగా ఉంది.
విజయవాడ నుండి ఢిల్లీ, ఢిల్లీ నుండి డెహరాడూన్ రైలు ప్రయాణం చేసి, డెహరాడూన్ లోని మేము బస చేసిన రిసార్టుకు వచ్చిన మా శ్రీవారు శ్రీనివాస మూర్తి గారు వచ్చిన తరువాత మా అసలు ప్రయాణం మొదలుపెట్టాల్సిన సమయం ఆసన్నమయింది.
మాకు డెహరాడూన్ , ముస్సోరి నగరాలను, మిగిలిన చూడవలసిన ప్రదేశాలను సౌకర్యవంతంగా తిప్పి చూపించిన కార్ ఓనర్ కం డ్రైవర్ హరీంద్ర రావత్ గారికి ధన్యవాదాలు తెలిపాం. అయిదురోజులు మాకు ఆతిధ్యం అందించిన ఆ ఆకుపచ్చని రిసార్టును వదిలి రావటం కొంచెం కష్టమే అయినా తప్పదు కదా అని బయలుదేరాము.
జోషిమఠం నుండి మాకోసం పంపబడిన టూరిజం వారి కారులో ఉదయం ఏడు గంటలకల్లా డెహరాడూన్ నుండి మొదలయ్యాము.ఎటువంటి బాధ్యతలూ, బరువులూ అంటించుకోని రికామీ జీవితాన్ని కలలుకనే నాలాంటి వారికి కొద్ది రోజులైనా ఇటువంటి ప్రయాణాలు ఆ కలను సాకారం చేస్తాయి.హిమాలయాలు చేతులు చాపి రారమ్మని పిలుస్తున్నట్లుగా అనిపించింది.
ఈ ప్రయాణాన్ని మరో భాగంలో ముగిద్దాం !
*

వసుధారాణి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు