అప్పటికి నేను ఆరవతరగతి చదువుతున్నాను. ఓరోజు సాయంత్రం హైస్కూలునుంచి తిన్నగా ఇంటికి వస్తున్నాను. మా యింటికొచ్చే దారిలోనే మావూరి కూరగాయల బజారు ఉంది.
బజారులో మా అమ్మ కూరగాయలు కొట్టు దగ్గర కనపడింది. అమ్మ కనపడే సరికి మనసులో ఎక్కడలేని సంతోషము పొంగుకొచ్చింది. నడక వేగం పెరిగింది. గబగబా వెళ్ళి అమ్మని చేరుకొని పక్కన నిలబడి చీరకొంగు పట్టుకున్నాను.
అమ్మ వొంగోని చిక్కుడుకాయలు ఎంచుతూ బేరమాడుతోంది. నేను చీరపట్టుకొనే సరికి తలతిప్పి నన్ను చూసింది.
“కుష్ణా! నువ్వేనా!” అని అనేసి కూరగాయలు అమ్ముతున్న ఆమెతో బేరమాడి పావలా చిక్కుడు కాయలు కొన్నాది. ఆ చిక్కుడుకాయలు ఒక చెత్తోనే పట్టుకొని ఇంటికి వెళి పోదామని బయలు దేరింది.
“కూరలు బొత్తిగా కొన్నేము, గొప్ప పిరుంగున్నాయి. పావలా సిక్కుడు కాయలు పిడికిటికి రాలేదు. ఇలాగా రేట్లు పెరిగిపోతే ఏటికొంటాము! ఏటి తింటాము!” విచారిస్తూ తనలో తనే మాట్లాడుకుంటూ బయటకు అనేసింది.
అంతలో
“ సిన్నా! బాగున్నావే!?” అన్నపిలుపు వినపడి అక్కడే నిలబడి వెనక్కి తిరిగి చూసింది. నేనూ అటువైపు చూసాను. ఎవరో పెద్దావిడే మా అమ్మకంటే పెద్దదానిలాగే వుంది.సన్నగా వున్నా పొడుగ్గా వుంది.
ఆయమ్మ కూడా కూర కొనుక్కొని వెళిపోతూ మా వైపుగా వచ్చింది. మా దగ్గరిగా వచ్చాక అంది.
“సిన్నా! శాన్నాలకు కనపడ్డావే, ఎలాగున్నావు!? ఈ డెవులే మీ పిక్కురోడా!?” అడిగింది. నా వైపు చెయ్యి చూపుతూ, ఆమె మరో చేతిలో అరటి కాయలున్నాయి.
“అవునప్పా, మా సిన్నోడే” అని నా తలమీద చెయ్యేసి తల నిమిరింది మా అమ్మ.
ఆహా! అని తలూపి తిరిగి అంది.
“ఏటే! ఒకూర్లున్నామని అనుకోడమే గానీ ఒకలి కొకలము కనపడ్డమే లేదు. ఏటిసేస్తాము మీరిక్కడ మామక్కడ. మా పొలాలన్నీ అటుకాసేనమ్మీ,సెనము తీరదు”,
అన్ని మాటలూ ఆయమ్మే మాట్లాడేస్తోంది. ఆ మాటలు కూడా గందిక గందికగా గాభరా గాభరాగా వున్నాయి. ఆయమ్మ మాటతీరే అంతట. తరవాత మా అమ్మచెప్పింది.
“ఎవసాయం పనులుంతే తీరదునే, యిప్పుడిది కార్తీక మాసము గదా! ఉడుపులు, గాబుతీత లు, అన్నీ అయిపోయాయి గదా! ఇలాటప్పుడైనా రావచ్చును గదా మా ఈదికాసి! పోనీ అప్పుడప్పుడైనా రావా! మీ అమ్మని సూడ్డానికైనా” అన్నాది మా అమ్మ కొంచెం నిష్ఠూరం గానే.
“ఏటమ్మీ! ఓ పక్క వంట…ఓపక్క పశువులే…మరోపక్క పొలానికెల్లకపోతే వల్లగాదు. వరిపొలం పనుల్లేవనుకో, సెరుకు మళ్లున్నాయి కదా! సూసుకోని రావాలంతాడు నా మొగుడు. వొంటిదాన్నయిపోన్ను గడియ తీరదనుకో.” ఆమె తన బాధ చెప్పుకు పోతోంది.
“ఎందప్పా!మీరు ఏర్లయిపోనారేటి!?” సందేహంగా అడిగింది మాఅమ్మ
“అయిపోనామమ్మా!.. ఇప్పుడా ఆరు మాసాలైపోతంది..మా మరిది మేము ఏర్లయిపోయి” అంది.
వీళ్లిద్దరూ అలా మాట్లాడుకుంటుంటే నాకు యిబ్బందిగావుంది. వాళ్ల మాటలు ఎంతకీ తెగడములేదు. ఆయమ్మ ఎవులో నాకు తెలీదు. ఇలాగుండగా
అంతలో మరో ముసలమ్మ ఆదారిని వస్తూ వీళ్లిద్దరిని చూసి పక్కన నిలబడింది.
ఇద్దరూ అటు చూసేరు. ఆ ముసలమ్మ తన మెడ ముందుకు చాపి కళ్ళు చికిలిస్తూ మా అమ్మ ముఖాన్ని చూసి అడిగింది.
“అవునమ్మీ ! నువ్వు సమ్మింగోలి సిన్నవే గదూ!? గోపన్న కూతురువు !” అడిగింది. మా అమ్మనుద్దేశించి. ఇదొవులు మరడ అప్పమ్మేనా! గుల్ల సీతమ్మ కూతురు గదూ !..అంది ఆయమ్మనుద్దేశించి.
“అవును అయ్యమ్మా! ..” అంది మా అమ్మ సమాధానంగా.
“ సిన్నా బాగున్నా! మీ పెద్దయ్యకు పిల్లలులేక నిన్నేగదూ పెంచుకున్నాడు.” తిరిగి అడిగింది.
“అన్నట్టు వూర్లోనే, మీ మేనత్త సీతమ్మ కొడుకు కిష్టమ్మకే గదూ, నిన్నిచ్చారూ!”
అవున్నే… నాకెందుకు తెల్దు…కొత్తొలస యిస్తే మీ మామ సచ్చిపోయాక మీ మేనత్త పిల్లల్లి తీసుకొని కన్నోరింటికి వచ్చేసింది. నానెరుగుదును. అప్పుడుకి మీ ఆయనాలు చిన్న పిల్లలు గదూ!.
“అది సరే,ఇప్పుడు మీకు బూదేవత ఏపాటుందమ్మీ?”
“ఒక ఎకరమేనా!.. మెట్టూ!?”
“ఏటీ ! మెట్టూ పల్లమూ కలిసే ఎకరాయేనా!..”
పోన్నే, మీ ఇద్దరు ఆలుమగలు రెక్కలు గట్టిగుంతే అదేశాన, నీ పిల్లలే నీకు ధనం .”
“అన్నట్టు, నీకెందరమ్మ పిల్లలూ”
“ముగ్గురు మొగపిల్లలూ ఒక ఆడపిల్లూన్నా! పోన్నే,సక్క రంగున్నారు కదా! ఆరోగ్గెంగా వుంతే ఆలు సాల్లు ”
“సల్లగుండండి.”
“మా దేటుందమ్మా.. మీ పెద్దల పేరంటాల దయ. ఆపైన అంతా బగమంతుడి దయ.” అంది చేతులు పైకెత్తి, ఆకాశము వంక చూపుతూ. ఆ ముఖములో అన్ని రకాల హావ భావాలు కనిపిస్తున్నాయి.
ముసలమ్మ ఒకదాని తరువాత ఒకటి ఆపకుండా ప్రశ్నలన్నీ అడిగుతోంది.మా అమ్మ అలాగే ఓపిగ్గా సమాధానాలు చెపుతోంది. నాకు ముళ్లు మీద నిలబడ్డట్టయిపోతోంది. వేగము ఇంటికి వెళ్లాలంటే ఒకలి తరువాత ఒకలు ఒదలడము లేదు.
నాకు చాలా విసుగ్గావుంది. వీళ్ల మాటలు ఎప్పుడు తెగుతాయా! అని చూస్తున్నాను. ఇక అయిపోతాయిలే అనిపించేది, అంతలోనే మాటలు మరొక్కాసి తిరిగేవి. ఎప్పటికీ తెగేవికాదు.
మరికాసేపటికి మొదటి ఆమె “సిన్నా! తరవాత మాట్లాడుదుమునే, నా నొత్తాను పొద్దుపోతంది” అనుకుంటూ వెళిపోయింది.
ముసలమ్మ ఒకక్షణం మాటలు ఆపి తిరిగి అందుకుంది.
“ఈ పిల్లడెవులమ్మా.. మీ పిక్కురోడా!?
“అవున్రా! తాత నీపేరేటిరా!?” అడిగింది నన్ను చూసి
“రాంకిష్ణా..బాగుంది. బరికెల్తనవా!?”
“ఎన్ని సదువుతున్నావు.!?”
“ఆరే! అబ్బా!…పెద్ద సదువే” అంది
మావూల్లో అప్పటికే రెండు ఎలిమెంటరీ స్కూళ్లూ,ఒక హైస్కూలు కూడా వుంది. మావూరికి యాభయ్యో దశాబ్దానికే విద్యుత్ సౌకర్యముండేదిట. గ్రామంలో వీధి దీపాలుండేవి. పెద్ద రైతులు, ఉద్యోగాలు చేసే ఉద్యోగుల ఇళ్లకు మాత్రం కరెంటు వేయించుకున్నారు.
సాలూరు-సంకిలి బస్సు మావూరు వచ్చేది. ఆ సౌకర్యముకూడా ఉండేది. వెరసి చుట్టు ప్రక్కల గ్రామాలలో లేని చాలా సౌకర్యాలు మావూరిలో వుండేవి. స్కూళ్లే కాక ఆసుపత్రి(ప్రాధమిక ఆరోగ్య కేంద్రం)పశువుల ఆసుపత్రి,కూడా వుండేవి.చాలామంది ఉద్యోగులు ఉండేవారు
కూరగాయల బజారే కాక చేపలు మాంసము కూడా దొరికేవి. ఆరోజుల్లోనే రోజుకి ఒక గొర్రెను కోస్తే ఆలస్యమయిన వారికి కూర దొరికేది కాదు.అనేవారు.
చాలా మంది టీచర్లుగా ఉద్యోగాలు చేసేవారు, యిద్దరు ఇంజినీర్లు, మరో ముగ్గురు డాక్టర్లుగా చదువుతున్న వాళ్లు వుండే వాళ్ళు.
“పోణ్ణె, బాగ సదువుకో, నాయనా ” అని అంది
“అమ్మీ! సిన్నా! ఎల్లమ్మా..ఎల్లు..శాంచేపయిపోయింది” అనేసి తను ముందుకు కదిలింది.
ఆయమ్మ వెళిపోయాక, మా అమ్మ అడుగు కదిపింది.
“హమ్మయ్య!” అనుకున్నాను నేను.
“ఎవులమ్మా ఆలు!?” అని అడిగేను మా అమ్మని.
”బంగారమ్మ అయ్యమ్మని, కాపీది (కాపు వీధి) నీకు తెల్దునే,ఆలు ముందు మనీదికాసే ఉండేవాళ్లు. ఆ వీధిలో ఇల్లు కొనుక్కోని అటుకాసెలిపోనారు” అంది.
“తొలావిడెవులూ!?” అడిగేను
“గుల్ల సీతమ్మ కూతురు…”
ఎవులో..నాకు తెలియదులే అన్నట్టు చూశాను
“ఒసే, మనింటి దగ్గర గుల్ల జోగినాయుడు తాతాలు లేరా ఆల అప్పసెల్లెలు అప్పమ్మ.ఈ యమ్మను ఊర్లోనే,పండాల వీధి దగ్గర మరడోలికిచ్చారు. అందుకే అందరూ మరడ అప్పమ్మ అంటారు.”
“అంతసేపు మాట్లాడాలేటైతే.!” అన్నాను విసుగ్గా
“పెద్దోలు మాట్లాడుతుంటే ఎలాగెలిపోతాము! తప్పు కదా!” అంది.
మా అమ్మ ఇప్పుడేకాదు. ఎప్పుడూ అంతే. తనకన్నా వయసులో పెద్దవాళ్లను చూస్తే ఎక్కడలేని గౌరవం. చాలా వినయంగా వుంటాది. ముసలివాళ్లు లాంటి వాళ్లు ఎవలు మాట్లాడినా అలాగే వుండిపోతాది.
ఒక్కోసారి వాళ్ల మాటలు ఎప్పటికీ తెగేవికావు. నాకు విసుగొచ్చీది.
“పదమ్మా యింటికెలిపోదాం” అని చెయ్యి పట్టుకు లాగే వాన్ని. మా అమ్మ వొచ్చేది కాదు. వాళ్లు వెళ్లేక అనేది.
“తప్పు నాయనా! పెద్దల మాటలినాలి.పెద్దలమాట సద్దన్నము మూట అన్నారు. మజ్జలో అలా అల్లరి సెయ్యగూడదు” అని కోప్పడేది. తరవాత మరోమాట కూడా అనేది.
“పెద్దలు ఏమాట సెప్పినా అనుబవమ్మీద సెప్తారు. అది ఇన్నోడు దన్యుడవుతాడు.సెప్పగా యిన్నోడు (విననోడు) సెడతాడు”
“ఎందుకనీ!?”
“ఎందుకంటే అనుబవమే గ్యానం”
*****
చాలా సహజసిద్ధమైపన శైలిలో సాగిన చక్కటి కథ
శ్యామలగారూ,మీ స్పందనకు ధన్యవాదాలు
మీ కథ కనుల ముందే జరుగుతున్నట్టు ఉంది. చక్కటి అనుభవాలు చెప్తున్నారు.