సెక్యూరిటీ గార్డు కూడా పద్యాలు పాడాల్సిందే!

డిసెంబర్ 26,1988న విజయవాడ నగరం వంగవీటి మోహన రంగా హత్యతో అట్టుడుకిపోయింది. నగరంలో పదిరోజులపాటు కర్ఫ్యూ కొనసాగింది. అప్పటికి వార్తాపత్రికలు కాకుండా అందుబాటులో ఉన్న ప్రధాన మీడియా ఆకాశవాణే. నేనింకా చేరి సంవత్సరం కూడా పూర్తికాలేదు.విజయవాడ నగరపాలక సంస్థ, జిల్లా యంత్రాంగం అంతా కూడా రేడియో పై ఆధారపడిన సమయమది.

ఆ పదిరోజులపాటు మాకెవ్వరికీ నిద్రాహారాలు లేవు. ఉదయం ఆరింటికి వస్తే రాత్రివరకు ఆఫీస్ లోనే.ఏం తిన్నామో, ఎలా తిన్నామో కూడా గుర్తులేదు. ఆఫీస్ దగ్గర ఉండేవాళ్ళం.. మిత్రుడు, స్టాఫ్ ఆర్టిస్ట్ డి.వి.మోహనకృష్ణ మాతోపాటే ఉండేవాడు. పాల సరఫరా నుంచి, కర్ఫ్యూ రిలాక్సేషన్ వరకు, కూరగాయల అమ్మకం, పోలీసు కమీషనర్, మున్సిపల్ కమీషనర్ విజ్ఞప్తులు ఎన్నెన్నో విజయవాడ రేడియో కేంద్రం నిరంతరంగా ప్రసారం చేసి తలమానికంగా నిలిచింది.

ఆరోజుల్లో విజయవాడ స్టేషన్ స్టాఫ్ తో కళకళలాడుతుండేది.ప్రసారాలకు సంబంధించి అనౌన్సర్లు, డ్యూటీ ఆఫీసర్లు,కార్యక్రమ రూపకల్పనలో ప్రోగ్రాం ఆఫీసర్లు, ప్రొడ్యూసర్స్, ప్రొడక్షన్ అసిస్టెంట్లు, మ్యూజిక్ స్టాఫ్ ఆర్టిస్ట్లు ఇంజనీరింగ్ విభాగంలో టెక్నీషియన్స్, ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, అసిస్టెంట్ ఇంజనీర్లు..ఇలా ఉండేవారు.

అడ్మినిస్ట్రేషన్ లో క్లరికల్ స్టాఫ్, హెడ్ క్లర్క్, అక్కౌంటెంట్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఉండేవారు.. స్టేషన్ డెరైక్టర్, స్టేషన్ ఇంజనీర్ లు టాప్ బాస్ లు.అప్పటికీ, ఇప్పటికీ తేడా ఏమిటంటే  ఇప్పుడు స్టాఫ్ తగ్గిపోయారు. విజయవాడ రేడియో స్టేషన్ భక్తిరంజని కి ప్రసిద్ధి.బాలమురళి,రజని, మల్లిక్ ,శ్రీరంగం గోపాలరత్నం,ఎమ్మెఎస్ శ్రీరాం  రమణమూర్తి,పెమ్మరాజు సూర్యారావు వంటి దిగ్గజాలు పాడినవి, స్వరపరచినవి ప్రసిద్ది చెందాయి.మేము కొంతకాలం టేబుల్ టెన్నిస్ అడిగినప్పుడు, అప్పటికే పెద్దవారయిన పెమ్మరాజు సూర్యారావు మాతో కలిసిపోయి చిన్నపిల్లాడిలా ఆడుతుండేవారు.. మల్లిక్ గారు రికార్డింగ్ కి వచ్చి గ్యాప్ దొరికినప్పుడల్లా చుట్ట తాగుతుండేవారు.

ఇలా చుట్ట తాగేవారిలో పేరి కామేశ్వరరావు, మల్లాది సూరిబాబు లు కూడా ఉండేవారు.వారిరువురూ సీనియర్ అనౌన్సర్లు..ఆ రోజుల్లో ఇంకో గొప్ప విషయం ఏమిటంటే మా దగ్గరుండే సెక్యూరిటీ గార్డుల్లో కొంతమంది రంగస్థల పద్యాలు అద్భుతంగా పాడుతుండేవారు..వారిలో ప్రకాశం అనే గార్డ్ ఉండేవారు.నేను, మా కొలీగ్ పి.జి.కె.మూర్తి  అడిగి మరీ పాడించుకునేవాళ్ళం 

నేను చేరేనాటికి ప్రముఖ డ్రామా వాయిస్ లు నండూరి సుబ్బారావు,వి.బి.కనకదుర్గ ఇంకా రిటైర్ కాలేదు కానీ విశ్రాంతి జీవితం గడుపుతున్నట్టే ఉండేవారు.వారిద్దరు కలిసి అనేక నాటకాలలో నటించారు.ఇప్పటికీ అవన్నీ యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.నండూరి సుబ్బారావు గారి “గణపతి” ఎంతో పాపులర్..ఆయన పావుగంట నాటిక “పూటకూళ్ళ ఇల్లు” కూడా  అవన్నీ విని పెరిగినవాళ్ళం మేము.సంగీత విభాగంలో  అనేకమంది నిలయం విద్వాంసులు ఉండేవారు..వారినే స్టాఫ్ ఆర్టిస్ట్లు అనేవారు.వారిలో దండమూడి రామ్మోహనరావు గారు మృదంగం ఆర్టిస్ట్. బలిజేపల్లి రామకృష్ణ శాస్త్రి గారు తంబూర ఆర్టిస్ట్.ఆయన సీనియర్ మోస్ట్..నా చిన్ననాటి స్నేహితుడు డి.వి.మోహనకృష్ణ జూనియర్ మోస్ట్.. వయొలిన్ ఆర్టిస్ట్ ల్లో అంపోలు మురళీ కృష్ణ,ఎస్.జగన్ మోహన్ రావు, గౌరవాఝ్ఝల రామ్మోహనరావు ముఖ్యులు.క్రొవ్విడి సీతారాం,ఎమ్.ఎల్.ఎన్.రాజు ఇతర మృదంగ కళాకారులు.

క్లారినెట్ వాయిద్య కళాకారులుగా సుందరపల్లి సూర్యనారాయణ మూర్తి,గోవాడ సుబ్బారావు ఉండేవారు.తరువాతి కాలంలో ఇంకొంతమంది వచ్చారు. పదిహేనుమంది ఉండేవారని మిత్రుడు మోహనకృష్ణ చెప్పాడు.తరువాత మరికొంతమంది నిలయ విద్వాంసులుగా చేరారు..వారిలో ఎన్ .ఎస్.కల్యాణరామన్,మోదుమూడి సుధాకర్, మల్లాది శ్రీరాం కుమార్, సద్గురుచరణ్,వి.కృష్ణవేణి, దుర్గా భవానీ ముఖ్యులు. 

ఇదంతా ఎందుకు చెప్పాల్సిన వచ్చిందంటే ఆరోజుల్లో ఆకాశవాణి విజయవాడ కేంద్రం కళాకారుల నిలయంగా ఉండేది.హైదరాబాద్ నుంచి విజయవాడలో చేరి ఆ వాతావరణానికి అలవాటు పడటానికి నాకు కొంచెం సమయం పట్టింది.. హైదరాబాద్, ఇంటి మీద బెంగగా ఉండేది.

మేం మధ్యాహ్నం పూట టెలిగ్రాఫ్ ఆఫీస్ నుండి హైదరాబాద్ వెదర్ రిపోర్ట్ తీసుకునేవాళ్ళం.. హైదరాబాద్ నుంచి వెదర్ రిపోర్ట్ రాసుకోండి అంటే అవతలి వ్యక్తి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాడని అమాయకంగా అనుకునేవాడిని..అక్కడ వెదర్ ఎలా ఉందండీ అనేవాడిని. అవతల వ్యక్తికి ఏమర్థమయ్యేదో ఏమో.. బానే ఉందండీ అనేవాడు..ఆ వ్యక్తి హైదరాబాద్ నుంచి కాదు విజయవాడ నుంచే మాట్లాడుతున్నాడని తెలుసుకోవటానికి నాకు టైం పట్టింది.

విజయవాడ రేడియో స్టేషన్ లో టేప్ లైబ్రరీ చాలా గొప్పగా ఉండేది. అరుదైన రికార్డింగ్ లన్నీ అందులో ఆర్కైవ్స్ గా భద్రపరిచారు. నిజానికి ఆ కార్యక్రమాలన్నీ వింటే ఎవరైనా, ఎంతైనా నేర్చుకోవచ్చు.పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు నాకు, కొలీగ్ రాజారెడ్డి కి గురువులా ఉండేవారు.అలా పనికిరాని కబుర్లు చెప్పుకోకపోతే ఆ టేప్ లు వినండయ్యా అని మందలిస్తూ ఉండేవారు. వింటేనా..మేము మా ధోరణిలో ఉంటూ ఉండేవాళ్ళం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం కో ప్రత్యేక గుర్తింపు ఉంది.అదేమిటంటే ఆకాశవాణి వార్షిక పురస్కారాల పోటీ ప్రతి సంవత్సరం జరుగుతుంది.అందులో నాటకం, సంగీతం, డాక్యుమెంటరీ,ఇన్నొవేషన్, ఫ్యామిలీ వెల్ఫేర్, వ్యవసాయం విభాగాల్లో ఈ పురస్కారాలుండేవి.. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఈ పోటీల్లో పాల్గొనేవి.ఈ పురస్కారాలకు అన్ని భాషల నుంచి ఎంట్రీలొచ్చేవి. ప్రథమ, ద్వితీయ బహుమతులుండేవి..భాషతో సంబంధం లేదు.. విజయవాడ కేంద్రం కనీసం ఒక బహుమతి అన్నా గెలుచుకునేది..అందులో ఇంద్రగంటి శ్రీకాంత శర్మ,కలగ కృష్ణమోహన్ ఒక టీం..మరో టీం ఎస్.బి.శ్రీరామమూర్తి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ.. అప్పుడప్పుడు పన్నాల సుబ్రహ్మణ్య భట్టు గారు ఉండేవారు. ఈ వారసత్వం అందిపుచ్చుకున్న వారు తరువాతి కాలంలో  బి.జయప్రకాష్,ఈమని కృష్ణశాస్త్రి..

విజయవాడ రేడియో స్టేషన్ లో ఒక కుటుంబ వాతావరణం ఉండేది.. సాయంత్రం అవగానే ఆరింటికి డ్యూటీ రూం లాంజ్ లో అందరూ జోకులు పేలుస్తుండేవారు.వారిలో సుబ్రహ్మణ్యభట్టు గారు, కొప్పుల సుబ్బారావు గారు,పేరి కామేశ్వరరావు గారు, నండూరి సుబ్బారావు గారు, అడవి లింగరాజశర్మ, కోకా సంజీవరావు వంటి పెద్దలు ఉండేవారు.

సరిగ్గా ఆరుంపావుకు పెక్స్ కో ఆర్డినేషన్ ఎన్.ఎమ్.జి.రామకృష్ణ డ్యూటీ రూం కి వచ్చి మాకు ఢిల్లీ నుంచి ఇనస్ట్రక్షన్స్ ఏమేమున్నాయో చెక్ చేసేవారు.

అంతకు ముందే ఫార్మ్ రేడియో ఆఫీసర్ వై.హనుమంతరావుగారొచ్చి వ్యవసాయ కార్యక్రమాల రికార్డింగ్ లు, వివరాలు అన్నీ ఉన్నాయో లేవో చూసుకునేవారు..ఇదొక రొటీన్ ఇందులో మార్పు ఉండేది కాదు. రేడియో స్టేషన్ మిగిలిన ఆఫీసుల్లా ఉండేది కాదు.మేముండే డ్యూటీ రూం నెర్వ్ సెంటర్ లా ఉండేది.. ఎంతోమంది వచ్చి పోతుండేవారు..వారందరి మధ్యే మా చెవులు రేడియో కి అతుక్కుపోయి ఉండేవి.. ఏమాత్రం చిన్న డీవియేషన్ ఉన్నా నోట్ చేసుకోవాలి.. వెంటనే కరెక్టివ్ యాక్షన్ తీసుకోవాలి.. ముఖ్యంగా మధ్యాహ్నం ట్రాన్స్మిషన్ లో ఉంటే గంటలు, నిముషాల్లా దొర్లిపోయేవి. 

1989 జనవరి చివరి వారంలో నన్ను కొత్తగూడెం టూర్ మీద పంపించారు.అప్పుడే ఆంధ్రప్రదేశ్ లో మొదటి ఎఫ్ ఎమ్ రేడియో కేంద్రం సిద్ధమవుతోంది.. అక్కడున్న రెండునెలలు నాకు కళ్ళు తెరిపించాయి.

అదెలా అంటే – వచ్చే సంచిక దాకా ఆగండి! 

*

"రేడియో" రాంబాబు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు