సృజనాత్మక సంభాషణల వేదిక ఛాయ ఫెస్టివల్‌

25 అక్టోబర్‌ 2025, డా. బిఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ

తెలుగు నేలపై సరికొత్త సాహితీ ఉత్సవానికి శ్రీకారం చుట్టింది  ఛాయ రిసోర్స్‌ సెంటర్. సామాజిక జీవితానికి దర్పణంలాంటి సాహితీ సృజనను వేడుకగా మలుస్తూ “ఛాయ సాహిత్సోత్సవం” నిర్వహిస్తోంది.  సమకాలీన సాహిత్యంపై లోతైన చర్చలకు ఛాయ లిటరేచర్‌ ఫెస్టివల్‌ చిరునామాగా నిలవనుంది.

అక్టోబర్ 25న హైదరాబాద్‌లోని డా. బి.ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో జరిగే ఈ సాహిత్యోత్సవానికి సీనియర్‌ జర్నలిస్ట్‌, పత్రికా సంపాదకుడు కె. శ్రీనివాస్‌ ఫెస్టివల్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తారు. కవి యాకూబ్‌, ప్రముఖ రచయిత్రి కుప్పిలి పద్మ, ప్రొఫెసర్‌ స్వరూప రాణి మార్గదర్శకులుగా వ్యవహరిస్తున్నారు.

ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 4వ శనివారం ఛాయ లిటరేచర్‌ ఫెస్టివల్‌ నిర్వహించనున్నాం. వచ్చే మూడు సంవత్సరాల పాటు ఛాయ సాహిత్సోత్సవం యూనివర్సిటీలోనే జరుగనుంది.

CLF 2025 – రచయితలు, కవులు, అనువాదకులు, ప్రచురణకర్తలు, సినీ అభిమానులు, సాహిత్య ప్రియులను ఒకే వేదికపైకి చేర్చుతుంది. సృజనాత్మక వినిమయానికి ఒక సజీవ వేదికగా సీఎల్‌ఎఫ్‌ నిలుస్తుంది.  రచయితలు, పాఠకుల మధ్య వారధిగా నిలిచే లక్ష్యంతో ప్రారంభమైన సీఎల్ఎఫ్‌ తెలుగు సాహిత్యంలోని వైవిద్యాన్ని ఎత్తిపడుతుంది.

CLF 2025లో మొత్తం 16 సెషన్స్‌లో 50 మంది వక్తలు పాల్గొంటారు. తెలుగు, ఇంగ్లీష్‌తో పాటు దక్షణాది భాషలైన దక్కనీ(ఉర్దూ), తమిళ, కన్నడ, మలయాళ సాహితీ ప్రముఖులు ఈ ఫెస్టివల్‌లో పాల్గొంటారు.  తెలుగు, ఇంగ్లీష్‌ సెషన్స్‌తో పాటు పుస్తకావిష్కరణలు, రచయితలతో సంభాషణలకూ ప్రత్యేక వేదికలుంటాయి. ప్రచురణకర్తల బుక్‌ స్టాల్స్‌, ఫ్లీ మార్కెట్‌ ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

“ది సౌత్‌ స్పీక్స్‌ : డైలాగ్స్‌ ఆఫ్‌ ఐడెంటిటీ అండ్‌ స్టోరీ టెల్లింగ్‌“ థీమ్‌తో నిర్వహిస్తున్న ప్రారంభ సమావేశంలో ఫెస్టివల్‌ డైరెక్టర్‌ కె. శ్రీనివాస్‌తో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సాహితీ ప్రముఖులు అల్లం రాజయ్య, పెరుమాళ్‌ మురుగన్‌, వసుధేంద్ర, షీలా టోమీ పాల్గొంటారు.

కె. శ్రీనివాస్

డా. కె. శ్రీనివాస్ సీనియర్ పాత్రికేయుడు, పత్రికా సంపాదకుడు, సామాజిక వ్యాఖ్యాత, కాలమిస్ట్,  విమర్శకుడు. అస్తిత్వ ఉద్యమ గొంతుకగా తెలుగు పాఠకుడికి సుపరిచితమైన కలం ఆయనది. ప్రజల హక్కులు, ప్రజాస్వామిక ఆకాంక్షలు కాలరాయబడుతున్న కాలాన అట్టడుగు సమూహాల పక్షాన నిలబడిన అక్షరం ఆయన.   కొత్త వంతెన, సంభాషణ, బుల్‌డోజర్‌ సందర్భాలు పుస్తకాలను ప్రచురించారు. ప్రజల పక్షాన నిలిచిన పాత్రికేయుడిగా పలు పురస్కారాలను అందుకున్నారు.

అల్లం రాజయ్య

సాహిత్యం సమాజ హితాన్ని కోరాలని నమ్మే ప్రజా రచయిత అల్లం రాజయ్య. తెలంగాణ ప్రజా పోరాటాలను సాహిత్యంలో తర్జుమా చేసిన రాజయ్య దాదాపు పది నవలలూ, వందలాది కథలూ, కవితలూ, పాటలూ, వ్యాసాలు, నాటకాలు రాశారు. ఆయన రచనల్లో శ్రామిక ప్రజల జీవితం కనిపిస్తుంది. కొమరం భీం, అతడు, కొలిమి అంటుకున్నది, వసంత గీతం, అగ్నికణం, ఊరు లాంటి నవలు అట్టడుగు జీవితాల నిత్య సంఘర్షణకు అద్దం పడతాయి.

పెరుమాళ్‌ మురుగన్‌

తమిళనాడుకు చెందిన మురుగన్‌ ప్రభుత్వ కళాశాలలో తమిళ భాషా అధ్యాపకుడిగా పనిచేశారు. భారతీయ సామాజిక జీవనానికి అద్దంపట్టే పలు  నవలలు,  కథా సంపుటాలు మురుగన్‌ రచించారు. ఆయన రచించిన పలు పుస్తకాలు ఇంగ్లీష్‌తో పాటు వేరు వేరు భారతీయ భాషల్లోకి అనువాదం అయ్యాయి. ‘One Part Woman’ పేరుతో ఆంగ్లంలోకి అనువాదమైన మధోరుభగన్‌ నవల దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.  సీజన్స్ ఆఫ్ ది పామ్‌ నవల 2005లో ప్రతిష్టాత్మకమైన కిరియామా అవార్డుకు ఎంపికయ్యింది. తాను రచించిన కథలకు తమిళనాడు ప్రభుత్వం నుండి కూడా అవార్డులు అందుకున్నాడు.

వసుధేంద్ర

ప్రముఖ కన్నడ రచయిత. ఆయన పలు రచనలు తెలుగులోకి కూడా అనువాదమయ్యాయి. “మోహనస్వామి” నవలలో స్వలింగ సంపర్కుల జీవితాలను చర్చించారు వసుధేంద్ర. “తేజో తుంగభద్ర”లో 15వ శతాబ్దంలో పోర్చుగల్, విజయనగర సామ్రాజ్యం మధ్య సంబంధాలను అక్షరీకరించారు.  ఆయన రచనలకు కర్ణాటక సాహిత్య అకాడమీ అవార్డు, యు ఆర్ అనంతమూర్తి అవార్డు వంటి అనేక పురస్కారాలు లభించాయి.

షీల టోమీ

ప్రముఖ మలయాళ రచయిత్రి షీలాటోమీ. పలు నవలలు, కథా సంకలనాలను ప్రచురించారు. తన తొలి నవల “వల్లీ”కి 2021లో చెరుకాడ్ అవార్డు లభించింది. వల్లీ ఆంగ్ల అనువాదానికి అమెరికన్ లిటరరీ ట్రాన్స్‌లేటర్స్ అసోసియేషన్ అవార్డు (2022), JCB ప్రైజ్ ఫర్ లిటరేచర్ (2022) అవార్డు లభించాయి. ఆమె పాలస్తీనియన్ పోరాటాలపై రాసిన నవల ‘డోంట్ ఆస్క్ ది రివర్ హర్ నేమ్’ పేరుతో ఇంగ్లీష్‌లోకి అనువాదమైంది.

వీరితో పాటు… రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పలువురు ప్రముఖ రచయితలు, సినీ ప్రముఖులు, ప్రచురణ కర్తలు ఈ లిటరేచరల్‌ ఫెస్టివల్‌లో వక్తలుగా పాల్గొంటారు. సినిమా & సాహిత్యం, కార్పొరేట్ & సాహిత్యం, మీడియా & సాహిత్యం, అనువాదం, బాల సాహిత్యంపై నిర్వహించే ప్రత్యేక సెషన్‌లు పాఠకులు, విద్యార్థులు, సినీ అభిమానులకు కొత్త ఉత్తేజాన్నిస్తాయి. సీఎల్‌ఎఫ్‌ 2025 ముగింపు సమావేశంలో ప్రజావాగ్గేయకారుడు గోరేటి వెంకన్న ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

గోరేటి వెంకన్న కవి, ప్రజా వాగ్గేయకారుడు. పల్లె పాటల ప్రవాహం. తెలంగాణ ప్రజా జీవన సంస్కృతిని పాటతో ఎలుగెత్తి చాటిన సృజనకారుడు. జానపదాలకు సమకాలీన ఇతివృత్తాలను జోడించి పాటను ప్రజలపరం చేశాడు.  వల్లంకి తాళం, రేల పూతలు, ఒక నాదం ఆడుతుంది కవితా సంకలనాలను ప్రచురించారు. పలు సినిమాలకు పాటలు రాశారు.  2006లో కళా రత్న (హంస అవార్డు), 2016లో కాళోజీ నారాయణరావు అవార్డు, 2021లో వల్లంకి తాళం సంకలనానికి సాహిత్య అకాడమీ అవార్డు, ప్రతిష్టాత్మక కబీర్ సమ్మాన్ అవార్డు లభించాయి. ప్రస్తుతం, ఆయన శాసన మండలి (MLC) సభ్యుడిగా కొనసాగుతున్నారు.

మానవ సంబంధాలు, భావోద్వేగాలు,  సామాజిక మార్పులన్నీ సాహిత్యంలో ప్రతిబింభిస్తుంటాయి. అలాంటి సమకాలీన సాహిత్యంపై లోతైన చర్చకు వేదికగా ఛాయ లిటరేషర్‌ ఫెస్టివల్‌ నిలవనుంది. తెలుగు భాష కేంద్రంగా నిర్వహిస్తున్న ఈ సాహిత్యోత్సవంలో అందరూ భాగం కండి. మధురజ్ఞాపకాలను సొంతం చేసుకోండి.

ఛాయ రిసోర్స్‌ సెంటర్‌

'ఛాయ'

వర్తమాన సాహిత్యరంగంలో "ఛాయ" కొత్త అభిరుచికి చిరునామా. "ఛాయ"కి ఆ వెలుగు అందించిన కార్యశీలి మోహన్ బాబు. ప్రచురణ రంగంలో కూడా ఛాయ తనదైన మార్గాన్ని ఏర్పర్చుకుంటుంది.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు