సూర్యుణ్ణి అక్కడే చూడాలి!

కొందరు రైతులు ఆకాశాన్ని తదేకంగా చూస్తూ కొంతసేపు గడిపి వర్షం ఎప్పుడు వస్తుందో చెప్పగలుగుతారు.

రాజప్రాసాదాన్ని చూసి బయటకివచ్చి, రాజవీధి గుండా నడుస్తున్నాను. తేమ గాలిని హృదయం ఎప్పుడూ గుర్తుపడుతుంది. అది జీవంతో నిండి ఉంటుంది. సముద్రం కావచ్చు, నది కావచ్చు, సరస్సు కావచ్చు అది సమీపంలో ఉందని ప్రకృతి ప్రేమికులకు సహజంగానే తెలుస్తుంది. అలాగే నాకూ తెలిసింది, చావో పరయా నది సమీపంలోనే ఉందని.

“రేవు ఎక్కడ ఉంది?” ఒక థాయి యువకుడిని అడిగాను.

అప్పటికే అతడు తాగి ఉల్లాసంగా ఉన్నాడు. ఒకటి రెండు పదాలు ఇంగ్లీష్ మాట్లాడగలుగుతున్నాడు. అతడు నాకు రేపుకి ఎలా చేరాలో దారి చెప్పి “మీది ఏ దేశం అని అడిగాడు?”.

భారతదేశం అని చెప్పగానే నాకు సాష్టాంగ నమస్కారం చేసి “ఐ లవ్ ఇండియా” అన్నాడు. భళే సరదా మనిషి. అతడి మాటలు వింటూ కొంతసేపు గడిపాను. తాయ్ జాతీయులు ఎంతో ప్రేమాస్పదంగా ప్రవర్తిస్తారు. సహాయం చెయ్యడానికి ఎప్పుడూ స్వచ్ఛందంగా ముందుకు వస్తారు. భారతదేశంలోలా చిరాకుపడే టాక్సీ డ్రైవర్లు అక్కడ కనిపించరు.

రేపుకి చేరుకున్నాను. సూర్యాస్తమయ సమయం అది. అప్పటికే సాయంకాలపు నీడ చావో పరయా నదిని ఆక్రమించింది. నదికి అవతలివైపు సూర్య దేవాలయం కడపటి సూర్యకాంతిలో గొప్ప శోభతో ధగధగాయమానంగా వెలిగిపోతోంది. గతంలో ఏ దేవాలయం సూర్య కాంతికి అలా వెలగడాన్ని నేను చూడలేదు. దానికి కారణం తరువాత తెలిసింది, ఆ దేవాలయ పగోడాలు రంగురంగుల పింగాణీ ముక్కలతోనూ, మారిషియా మారిటియానా నత్తగుల్లలతోనూ తాపడం చేసిన గొప్ప సంక్లిష్టమైన కళాకృతులతో కప్పబడి ఉంటాయని.

నేను ఉన్న రేవు పాతకాలపు పద్ధతిలో చెక్కలతో కట్టింది.

నది దాటడానికి ఫెర్రీ టిక్కెట్ తీసుకోవడానికి ప్రయత్నించాను. దేవాలయం 6 గంటలకే మూసివేస్తారని అక్కడి వారు చెప్పడంతో, నిరాశగా రేవులో కూర్చుని సూర్య దేవాలయాన్ని (సూర్యోదయ దేవాలయం లేదా వాట్ అరుణ్ అని కూడా అంటారు) చూస్తూ గడిపాను. ఇంతలో దేవాలయం పై శక్తివంతమైన ఫేసేడ్ లైట్లు వేసారు. నల్లని చావో పరయా నదీజలాల మీదుగా కృత్రిమ కాంతిలో వెలిగే సూర్య దేవాలయాన్ని చూడడం సైతం మరపురాని అనుభూతిని ఇచ్చింది.

ఆలస్యమయిందని నిరాశ పడడంలో ఏం అర్థముంది?. మనం జీవితంలో చాలా సంతోషాల్నిఏ విషయమైనా అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదనే నిరాశలో గుర్తించకుండా కోల్పోతాము. కాని జీవితానికి దాని స్వంత గమనం ఉంటుంది. దానిని మనం అంగీకరించాల్సి ఉంటుంది. హెర్మన్ హెస్ సిద్ధార్థ నవలలో అదే చెప్పాడు. కథానాయకుడు సిద్ధార్థ తాను వచ్చిన వాణిజ్య కార్యం నెరవేరకపోయినా నిరాశ పడకుండా, వచ్చినందుకు అక్కడి వారితో అదనంగా 3 రోజులు స్నేహంగా, పండుగలా గడిపి వస్తాడు. అందుకు యజమాని అతడిని మందలిస్తాడనుకోండి. అయినా సిద్ధార్థ అతనికి అర్థవంతమైన వివరణ ఇస్తాడు.

ఆ విధంగా ఆలస్యం అవ్వడం వల్ల గొప్ప దృశ్యాన్ని చూడగలిగాను. మరుసటి రోజు మరలా వచ్చాను. సూర్య దేవాలయాన్ని చూడకుండా ఆ దేశాన్ని విడిచి రావడానికి నాకు మనస్కరించలేదు.

వాట్ అరుణ్ ఎంతో అరుదైన దేవాలయం. కేవలం ఈ ఒక్క దేవాలయాన్ని చూడడానికైనా తాయ్ లాండ్ రావాలి. దాని నిర్మాణ శైలి అసాధారణం. ఈ దేవాలయాన్నివాట్ అరుణ్ అని ఎందుకు అంటారంటే, సూర్యోదయ కిరణ ప్రవాహంగా వ్యక్త రూపంలోకి వచ్చే హిందూ దేవుడైన అరుణుడి దేవాలయం కాబట్టి.

వాట్ అరుణ్ మూలాలు అయుత్తయ రాజ్యం (1351–1767 AD) కాలంలో ఉన్నాయి. ఈ దేవాలయం బాంగ్ మకోక్ గ్రామంలో ఉండడం వలన మొదట వాట్ మకోక్ అని పిలువబడేది. అయుత్తయ రాజ్య పతనం తర్వాత, తక్షిన్ ప్రభువు థోన్బురి నగరాన్ని కొత్త రాజధానిగా స్థాపించి, ఈ దేవాలయాన్ని వాట్ చాంగ్ గా పేరు మార్చారు. తక్షిన్ ప్రభువు ఈ దేవాలయాన్ని సంపూర్ణంగా పునరుద్ధరించడానికి ప్రతిజ్ఞ చేసినట్లుగా చరిత్రకారులు నమ్ముతారు.

ఇక రట్టనకోసిన్ కాలంలో రామ II, రామ III రాజుల పాలనలో దేవాలయం గణనీయమైన పునరుద్ధరణను, ఎంతో విస్తరణను పొందింది. ప్రధాన పగోడా 1851లో పూర్తయింది. దేవాలయానికే ఇది ఎంతో ప్రత్యేకం. దీని ఎత్తు సుమారు 82 మీటర్లు (269 అడుగులు). ఇది తాయ్ లాండ్ లోని అత్యంత ఎత్తైన దేవాలయం అయినప్పటికీ, ఆసియాలోనే అత్యంత ఎత్తైన దేవాలయం కాదు. ఆసియాలో మరింత ఎత్తైన దేవాలయాలు ఉన్నాయి, ఉదాహరణకు మయన్మార్‌లోని శ్వేదగోన్ పగోడా, ఇది సుమారు 99 మీటర్లు (325 అడుగులు) ఎత్తు ఉంటుంది.

తరువాతి కాలంలో వాట్ అరుణ్ దేవాలయం అనేక పునరుద్ధరణలను పొందింది. వీటిలో అత్యంత ముఖ్యమైంది 2013 నుండి 2017 వరకు జరిగింది. ఈ పునరుద్ధరణ దేవాలయం యొక్క అసలు రూపాన్ని సిమెంట్ ఉపయోగించకుండా సున్నం, ప్లాస్టర్ వంటి సాంప్రదాయ పదార్థాలను ఉపయోగించి చేసారు.

వాట్ అరుణ్ కి  అపారమైన మత సాంస్కృతిక ప్రాముఖ్యత ఉంది. 1752లో వాట్ ఫ్రా కైవ్‌కు తరలించక ముందు థాయిలాండ్‌లోని అత్యంత పవిత్రమైన మత చిహ్నమయిన ఎమరాల్డ్ బుద్ధుడి విగ్రహం ఈ దేవాలయంలోనే ఉండేది. ఈ ఆలయ రూపకల్పన హిందూ పురాణాలలోని మేరు పర్వతం నుండి, శివుని త్రిశూలం నుండి ప్రేరణ పొంది చేసారని చరిత్ర చెబుతోంది.

సూర్యోదయ దేవాలయం అన్ని భౌతిక, అథిభౌతిక, ఆధ్యాత్మిక తలాలకు కేంద్రం.

P.S: ఈ దేవాలయాన్ని సందర్శించాలని అనుకునేవారు సూర్యోదయానికి ముందే చావో పరయా నదీ తీరానికి చేరుకోవడం మంచిది.

శ్రీరామ్

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు