సూర్యుడి నీడలు

చాటింగ్ లిస్టులో అప్పటి వరకు ఎక్కడో చివరున్న వ్యక్తి వైకుంఠపాళీ నిచ్చెనెక్కినట్టు ఒక్క మెసేజ్ తో పైకొచ్చాడు. గొంతులోకి వెచ్చగా పాలు మిరియాలే కాదు చెవుల్లోకి రామ్ మిర్యాల కూడా ఘాటుగా తాకుతున్న ఫీలింగ్ ని ఆస్వాదిస్తుంటే, టింగ్ మని నోటిఫికేషన్ డిస్టర్బ్ చేసేసింది. పేరేదైనా చివరికి మేనేజర్ అని ఉండడంతో, ఆదివారం పూటా ఒంట్లో బాలేని టైంలో ఏంటని ‘కాలింగ్ యూ’ అని మెసేజ్ ని నోటిఫికేషన్లోనే చదివేసింది. చిరాకుతో వెంటనే ఫోన్ ని ఫ్లైట్ మోడ్ లో పెడ్తమనుకునేలోపే, కాల్ వచ్చేసింది. వీడియో కాల్ కాదు కాబట్టి ముఖం పై విరక్తి అలాగే ఉంచి,

“హలో భాస్కర్,” గొంతు బాగున్నా బాలేదన్నట్టు సవరిస్తూ.

“హే మేఘనా, మార్నింగ్. ఏం లేదు, నిన్నటి ఇంటర్వ్యూ స్టేటస్ ఏంటా అని?” కాస్త ఆత్రుతంగా అడిగాడు.

“సారీ భాస్కర్. మీరేమో ఎక్స్ పీరియెన్స్ ఉంది అన్నారు, వాళ్ళు ఫ్రెషర్ లెవెల్ ప్రశ్నలు అడిగిన సరైన సమాధానాలు ఇవ్వలేదని ‘ఎక్స్ పీరియెన్స్డ్ ఫ్రెషర్’ గా ముద్రేసి రిజెక్ట్ చేసారు,” అందామె నార్మల్ అవుతూ.

“ఓ అవునా, సరేలే…” అని చివరి వాక్యం వాల్యూం ఎక్కువగా ఉన్నా కూడా చిన్నగా, అతను  చిన్నబోయినట్టుగా వినబడింది.
వెంటనే “ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు. టెక్నికల్ రౌండ్ అయిపోయింది. హెచ్.ఆర్ మిగిలి ఉంది. ఎలాగో ఆ రౌండ్లో ఏముండదుగా! నువ్వే తీస్కుంటావ్ కాబట్టి ఎలాగో పాసైపోతాడులే. ఈ రోజే తీస్కొని, ఆ ఆఫర్ లెటరేదో తొందరగా పంపివ్వు. డీటెయిల్స్ ఫార్వర్డ్ చేశాను. నా బోనస్ మాత్రం మర్చిపోకు. బై,”  అని ఆమేదో చెప్పేలోపే పెట్టేసాడు.

‘ఏంటితను, బ్లూటిక్స్ చూడకుండానే ఫోన్ చేస్తాడు, నేనేం రెస్పాన్స్ ఇవ్వకుండానే కాల్ కట్ చేసాడు. పోనీలే పాపం కడ్తున్న ఈఎంఐలకు జీతం సరిపొవట్లేదని రిఫరల్  బోనస్ల మీద పడ్డాడని పంపిన వాళ్ళను పరిగణిస్తే, హెచ్ ఆర్ రౌండ్ లైట్ అంటాడా? రిఫర్ చేసినంత మాత్రానా కళ్ళు మూసుకొని తీస్కుంటామా’, మనసులో అనుకుంది.

“ఏంటే ఆఫీస్ కుందేలా, కొంపదీసి మీ నాన్నలాగా నీక్కూడా ఈరోజు పని పడిందా,” తెలుగు సినిమా తల్లి పాత్రలాగే వంటింట్లోంచి వచ్చి అడిగింది రమా.

“అవును మమ్మీ. ఆఫీస్ కి కాకుండా ఇంటి నుండే, సాయంత్రం ఇంటర్వ్యూ తీసుకోవాలి,”

“తీస్కో, కాని మధ్యాహ్నం మాత్రం ఇంటర్వ్యూ ఇవ్వు,”

అర్ధం కానట్టు ముఖం పెట్టగానే “మొన్న ఫోటోలు చూసిన సంబంధం వాళ్ళు నిన్ను డైరెక్ట్ గా చూస్తాం అంటున్నారే,” రమా మెల్లిగా చెప్పుకొచ్చింది.

“మొన్ననే కదా ఫొటోస్ పంపింది. అప్పుడే వచ్చి చూసేంత తొందరేంటో, సర్లే ఇంతకీ మధ్యాహ్నం వస్తున్నారంటే వాళ్ళ తిండి ఇక్కడేనా?” అడిగింది మేఘన.

“అంటే, రావడం పోవడం ఎందుకని, వీడియో కాల్ లో చూస్తారట,” అసలు విషయం చెప్పుకొచ్చింది రమా.

“వీడియో కాల్?! అంటే…మొఖం మాత్రమే చూస్తాడా..”

“మరి ఇంకేం చూస్తారే,” అని తల్లి తిట్టపోతుంటే,
“నా ఉద్దేశం కూడా అది కాదులే. అయినా అనవసరంగ లెక్క పెంచుతున్నావ్ మమ్మీ. అంత తొందరేముందని. ఇప్పుడు నేను కూడా సంపాదిస్తున్నానుగా, మీకు బరువు అవ్వకుండా?”

“ఈ డైలాగులే వద్దనేది. ఫోటోలు పంపక ముందే చెప్పాలి ఇవన్నీ. అనుకున్నప్పుడు అన్ని కుదరవు. అయినా నీకు నచ్చనిది మేమేం చేయట్లేదుగా. మొన్నటికి మొన్న పన్నెండు లక్షల కాగ్నిజెంట్ వాడిని చూపిస్తే, బాగానే మాట్లాడాడు కానీ వద్దు అన్నావు,”
“అవును అన్నాను, జనరల్ గా ఫార్మాలిటీ విషయాలు బాగానే మాట్లడినా కూడా, ప్రేమ విషయంలో వీక్ గా ఉన్నాడు. ‘ఎవర్నైనా లవ్ చేసారా’ అని పర్సనల్ గా అడిగితే, ‘అదేమైనా ఉడెమీ(ట్రైనింగ్) లో కోర్సా ? నేర్చుకుంటే ఉపయేగపడే సర్టిఫికేటా? కాదుకదా’, అని అన్నాడు,”

“సర్లే. అది పక్కకు పెట్టు, మరీ పదిహేను లక్షల ప్యాకేజున్న జెమిని టీవీ వాడి సంగతేంటి?”

“అది జెమిని టీవి కాదు. కేప్ జెమిని. అక్కడ కూడా సేమ్ క్వశ్చన్ అడిగా, లవ్ అనేది వేరెబుల్ పే లాంటిదని, చెప్పుకోడానికి ప్యాకేజీ బాగానే ఉన్నా ఇస్తారన్న గారంటీ లేదన్నాడు.

సో, నాకు ప్యాకేజీ, వాళ్లు చేసే కంపెనీ కంటే ముందుగా మాట్లాడే విధానం, ఇచ్చే గౌరవంతో వాడితో బతకగలను అనే ధైర్యం ముఖ్యం,”

“సరేలే. అవన్నీ నువ్వే తేల్చుకో గానీ ఇప్పుడు చూడబోయే అబ్బాయికి ఇరవై లక్షల ప్యాకేజీ. నా నాలుక తిరగని ఎమ్మెన్సీ పేరేదో ఉంది.నువ్వు చూసిన ఫోటోల్లో బాగున్నాడు పైగా బాగా ‘ఉన్నోడు’ కూడా. అయినా ఈ సారీ అలాంటి దిక్కుమాలిన ప్రశ్నలు అడక్కుండా సంబంధం మిస్ చేస్కోకు. ఏం అడిగినా నువ్వు మాట్లాడు. ఎంత అడుగుతారో మేము మాట్లాడుతాం. నచ్చకపోతే వాళ్ల ముందే నో అంటే మాత్రం చంపుతా, ఏదైనా కూడా తర్వాత చెప్తాను అని వచ్చి నాకు చెప్పు ఓకేనా?” అంది రమా.

సరే చూద్దాం అన్నట్టు తలూపింది మేఘన.

“ముందు వెళ్లి స్నానం చెయ్యి. ప్రతి పెళ్లిచూపులకి వేసే డ్రెస్సే వేస్తే చంపుతా,” ఆన్లైన్లో పెళ్లి చూపులు కదా అని ఏమి హడావిడి లేకుండా అంది రమా.

ఆఫీస్ లో సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇచ్చే జీతాలు గురుంచి ఓసారి తల్లితో చెప్పినప్పటి నుండి ఆ సంబంధాలే చూడడం ఇంట్లో వాళ్ళ ఇంట్రెస్ట్, నిజానికి ఆమెకి కూడా. ఎవరు ఫర్ఫెక్ట్ కాదని తెల్సినా కూడా కాస్తో కూస్తో సెట్ అయ్యేవాడి కోసం చూడడంలోనే ఆమె తపనంతా. ఎంత కాదన్నా ప్రతి సారీ పెళ్లి చూపులనగానే కాస్తో కూస్తో టెన్షన్, దానికి తోడుగా కలిగే భయాందోళన, సిగ్గుతో కూడిన చిన్న సంతోషంతో మిక్స్డ్ ఫీలింగ్లో ఉంది ఆమెకి. జ్వరం జారింది, కానీ చల్లటి నీళ్లతో తల స్నానం చేస్తున్నా కూడా బుర్ర మాత్రం వెడెక్కిపోయి కూర్చుంది, ‘ఎలాంటి వాడ’నే ఆలోచనల్తో. గబగబ రెఢీ అయ్యి బయటకి రాగానే.

“ఆ అవతారం ఏంటే ?”

“వీడియో కాలే కదమ్మా, కింద షార్ట్ వెస్కొని, మీద మంచిది వేస్కున్నా. బాలేదంటే చెప్పు, యింకా టైం ఉందిగా మార్చుకుంటాలే. ఈ లోపు ఒకసారి వచ్చే బాబు గారి డీటేల్స్ మళ్ళీ చూపించూ, సోషల్ మీడియా లో సెర్చ్ చేసి సగం తెల్సుకోవాలి,” అని ఫోన్ లాక్కొని బయో చూసింది.

“వాడి ఫేస్ లాగే ఉంది ఫేస్బుక్ ప్రొఫైల్, అడ్డమైన చెత్తంతా షేర్ చేసాడు. ఇన్స్టాలో జీరో పోస్ట్స్, కనీసం డీపీ కూడా లేదు, పైగా ప్రైవేట్ అకౌంట్. అలాంటప్పుడు ఎందుకు క్రియేట్ చేస్కున్నట్టు, బోరింగ్ పర్సనే,” ట్విట్టర్లో టిండర్లో కూడా చూడసాగింది. తెలిసిపోతుందని లింకిడిన్ లో చూడకుండా, ఫోన్ నెంబర్ ఉంటే బాగుండు వాట్సప్ లో, చివరికి గూగుల్ పే ఫోన్ పే లో కూడా డీపీ బయో చూడకుండా అయ్యిందని ఫీలైంది.

“మీ జనరేషన్ కున్న అదృష్టం, దరిద్రం ఇవన్నీ,” ఫోన్ లాక్కొని వెంటనే కప్బోర్డ్ లోంచి మంచి డ్రెస్స్ తీసిచ్చింది రమా.

ముహుర్తాలు చూస్కోని మరీ వీడియో కాల్ మొదలెట్టారు. స్ర్కీన్ల మీద ఇరు కుటుంబాలు నవ్వుతూ పలకరించుకున్నారు. మేఘన స్ర్కీన్ ముందుకు రాగానే,

“హాయ్…ఆనంద్ హియర్ ,” పరిచయం చేస్కున్నాడు.

“హలో…మేఘన,”

అలా వాళ్ళు మాట్లాడుకోవడం మొదలెట్టగానే ప్రైవెసీ ఇద్దామని ఇరువురి పేరెంట్స్ స్ర్కీన్ లో కనబడకుండా పక్కకి జరుగుతూ లేచి వెళ్లిపోయారు.

స్క్రీన్ షాట్ తీస్కొని, తర్వాత తాపీగా చుస్కోవచ్చు అనే థాట్ రాలేదేమొ, తదేకంగా కొన్ని సెకండ్లు ఆమె అందాన్ని చూస్తూనే ఉన్నాడతను. నచ్చింది అని తెలిపే అతని స్మైల్ ఓ మైల్ దాటేసొచ్చింది.

ఎక్కువ టైం తీసుకోవాలో వద్దో ఆమె ఇచ్చే సమాధానం బట్టే ఉంటుందని ముందే అడిగేసాడు,

“ఒక స్ట్రెయిట్ క్వశన్, మీకు నచ్చే ఇక్కడ ఇలా కూర్చోడానికి ఒప్పుకున్నారా? లేక ఎవరైనా బలవంతం చేస్తే కూర్చున్నారా ?” ఆనంద్.

“ఎవరి ఫోర్స్ లేదులేండి. నాకు నచ్చకపోతే ఇంతవరకు మాత్రం వచ్చేది కాదు” మేఘన.

ఆ మాటకు అతని ఫేస్ మీద బ్రైట్నెస్ 200 పెర్సెంట్ అయింది.

ఇద్దరు ఒకరినొకరు తెల్సుకోవడం మొదలెట్టారు. ఇంట్రెస్ట్స్, హాబీస్, పాస్ట్ లవ్ స్టోరీస్ లాంటివి ఇద్దరికి పెద్దగా లేకపోయే సరికి, అయుదు నిమిషాల్లో తేల్చేసుకున్నారు. అక్కడి వరకు అంతా బానే అన్పించింది ఆమెకు.

కాసేపటికి, ఆమె ప్రొఫైల్ అంతకు ముందే చూసినా కూడా “హెచ్ ఆర్ గా చేస్తున్నట్టు తెలుసు, కానీ ఏ కంపెనీ,” కన్ఫర్మేషన్ కోసం అడిగాడు.

ఆమె సమాధానంకి “అదేం కంపనీ. సర్లే, నైస్. విమెన్ వర్క్ చేయడానికి నేను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూనే ఉంటాను,” కాస్త బిల్డప్ ఇచ్చి, అసలు పాయింట్ కి వచ్చాడు “జీతం ఎంత?” అని.

ఉన్న అనుభవం కి వచ్చే జీతం గురించి చెప్పేసింది.

“అంత చిన్న కంపెనీ లో అంత తక్కువ జీతానికి ఎందుకు చేస్తున్నారు? పెళ్లి అయ్యాక వేరే దాంట్లోకి మారుతారా లేక ఉన్నదాంట్లో ఏమైనా బాండ్స్ సైన్ చేశారా ?”

‘మమ్మీ అన్నట్టు ఇది నిజంగానే ఇంటర్వ్యూ నే’ అనుకొని “కంపెనీ చిన్నదైనా, పెద్దదైన  ప్రాజెక్ట్ లో వర్క్ చేసేది మహాయితే ముప్పై నుండి యాభై మందితోనే కదా, మరి కంపెనీ లో మిగితా ఎంత మంది ఉంటె ఎందుకు? ఎంత పెద్దదైతే ఎందుకు? వేరే కంపెనీలో కి వెళ్లొచ్చు, అప్పుడు జీతం కూడా పేరుగొచ్చు కానీ అంత ఎక్స్పీరియెన్స్, నాలెడ్జ్ కావాలి గా. నాకు ఇంకాస్త టైం పడ్తుంది. అయినా మీరు వర్క్ చేసిన మొట్టమొదట కంపెనీలో మీ జీతం ఎంత? ఇప్పుడెంత?” ఆమె అనగానే
“ఇప్పుడెందుకు లేండి,” అని పక్కకు తోసేసి “నాలెడ్జ్ అంటే హెచ్.ఆర్లకు ఏముంటదనీ? ఐ మీన్ అంత డీప్ గా ఏముండదుగా ,” తడబడిన కూడా అనేసాడు.

ఆమెకు కాస్త ఒళ్లు మండినట్టై “మీ టెక్నికల్ వాళ్లకుండేది మీకుంటే, మాకుండే స్కిల్స్ మాకుంటాయిగా,” కాస్త గొంతు పెంచి అనగానే పక్క రూం నుండి గరిటను కింద పడేసిన చప్పుడుకి ఆమె సైలెంట్ అయ్యింది.

“మీరింతకు ముందు పంచుకున్న హాబీస్ లో సింగింగ్, డాన్సింగ్, స్టాండప్ కామెడీ లాంటివి లేవు. మరి మీరు హెచ్.ఆర్ ఎలా అయ్యారు?” అడిగాడు.

‘నీ బాధేంట్రా’ మనసులో అనుకోని “అవన్నీ పర్సనల్ ఇంట్రెస్ట్ లెండి. ఇంటరాక్టివ్ ప్రోగ్రామ్స్ హెచ్.ఆర్ లు ఎక్కువగా చేయిస్తుంటారు కాబట్టీ మిగితా వాళ్లను ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయించడానికి రకరకాలుగా ట్రై చేస్తాం. దాంట్లో ఇవి కూడా ఉంటాయి. కానీ నిజానికి మేము చేసే పనిలో భాగం మాత్రం కాదు,” తేల్చేసింది.

“మీ పనిలో భాగం కాదు అంటుంటే ఎందుకో నవ్వొస్తుంది. మీకు పనేమీ ఉంటుంది అసలు. హహ్హా. ఇంటర్వ్యూలు, ఇండక్షన్లు తప్పా. ఇప్పుడంటే సైట్ లో లాగిన్, లీవ్స్ ఉన్నాయ్ కానీ, మా పాత కంపెనీలో హెచ్ ఆర్ అనే వాళ్లే లేరు. సిస్టమ్ అడ్మిన్ గా ఉండే అబ్బాయే అన్నిటికీ ఉండేవాడు. అసలు అబ్బాయిలు ఇలాంటి జాబులు చేయడం నాకైతే నచ్చనే నచ్చదు. అయినా మీరు కూడా ఏదైన సాఫ్ట్వేర్ కోర్స్ నేర్చేసుకోండి, మంచి ఫ్యూచర్ ఉంటది,” అని అతని మాటలకి ఆమె ఫ్యూచర్ ఎలా ఉంటదో మాత్రం బాగా అర్ధం అవుతుంది.

‘వర్కింగ్ విమెనంటే రెస్పెక్ట్ అన్నాడు, జీతం తక్కువ అనగానే ప్రొఫెషన్నే చులకనగా చూస్తున్నాడు, అబ్బాయిలు హెచ్ ఆర్లుగా ఉంటే నచ్చదా! బయటంటే పట్టుకొని తంతరు’ లోపలనేసుకుంది.

“హెచ్.ఆర్ జాబులు కూడా రెండు కంపెనీల్లో ఉద్యోగం చేయవచ్చు తెలుసా?  వర్క్ ఫ్రమ్ హోమ్ లో నేను చేసా. ఉన్న కంపెనీకి తెలీకుండా ఇంకో దాంట్లో కూడా వర్క్ చేసా, మూన్ లైటింగ్…డబుల్ ఇన్కమ్” అతను చిన్నగా అనగానే, ఆమె ఆశ్చర్యంలోను కోపంగా చూడగానే కాస్త సైలెంటై,

‘మరి సంసారం?’ ఆమె మనసులో అనుకుంది.

“నిజానికి నేను టెక్నికల్ జాబ్ ఉన్న అమ్మాయిని చేస్కుందామనుకున్నా, కానీ వచ్చిన సంబంధాల్లో పోలిస్తే మీరు బానే ఉన్నారు. నాకు ఓకే. ఇంతకీ నేను మీకు నచ్చానా? పర్లేదు చెప్పండి, కొంపదీసి మీ హెచ్.ఆర్ స్టైల్లో ‘విల్ గెట్ బ్యాక్ టు యు’ అని అంటారా ఏంటీ ,” అంటూ ముసిముసిగా నవ్వాడు.

ఆమెకు ఇంకా ఒళ్లు మండింది.

నాలుగు తిట్టి మరీ  ‘నో’ చెప్దామని “హలో…,” సీరియస్ టోన్లో ఆమె అనగానే పక్కరూమ్ నుండి గరిట చప్పుడుకి మళ్లీ నార్మల్ అవ్వల్సి వచ్చింది.

“చెప్పండి, సైలెంట్ అయిపోయారు” ఆనంద్

‘వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు అనవసరంగా కరెంటు పోతది, ఇలాంటి టైములో పోతే ఎంత బాగుండని’ అని మనసులో అనుకుంటూ అప్పుడే ఎలా డిసైడ్ అనుతామని లోలోపల మథన పడి,”కాస్త టైం కావాలి” అంది.

“నేను ఎక్కువ టైం వేస్ట్ చేస్కోదల్చుకోలేదు. వేయిట్ చేసాకా నో అంటే కుదురదు. ఇప్పుడే చెప్పేసేయండి.,” అతను.
ఈ గ్యాప్లో ఆమె చేయి మెల్లిగా స్రీన్లో కనబడకుండా కదిలిస్తుంది.

“మిమ్నల్నే, చెప్పండి?” మళ్లీ అడిగాడు.

తల అడ్డంగా ఊపబోతూ వైఫై స్విచ్ మెల్లిగా ఆఫ్ చేసింది.

‘క్లన్క్’ మని ఆమె కాల్ కట్ అయి స్క్రీన్ బ్లాంక్ అయిందతనికి.

ఒక్కసారిగా గట్టిగా గాలి పీల్చుకొని, చేతుల్తో తల ఒత్తుకుంటూ ఆలోచన్లో పడిందామె. “వాడేదో ప్రొఫెషన్ని అన్నాడనీ నో అంటున్నానా, లేదు కరక్టే. టెక్నికల్ కోర్సులు నా వల్ల కాదు. నిజానికి రీసన్ అది కూడా కాదు. ఎక్కడో కొంచం కూడా కనెక్ట్ అవ్వలేదు. నచ్చలేదు. ఆ మాటలు, చేష్టలు, చూపులు ఏవి నచ్చలేదు,” గాలి వదిలినట్టు మైండ్లోంచి అతన్నీ వదిలేసే లోపే, పక్క రూం నుండి గరిటతో రమా వచ్చింది. స్ర్కీన్ సేవర్ పైనున్న ఫోటో కనబడకుండా మేఘనా ఒక్కసారిగా లాప్టాప్ మూసేసింది.

“ఎందుకే అంత తొందరా. కరెంట్ పోయింది అనుకున్నారు కాబట్టి సరిపోయింది. ఇంకాసేపు మాట్లాడితే ఏమైయ్యేది?” కోపంగానే.
“అయిపోయిందని తెలుసి, వాళ్ళకి ఫోన్ చేసి అప్పుడే ఫీడ్ బ్యాక్ అడిగావా? అప్పట్నుంచి గోడ పక్కకుండి ముచ్చటంతా వింటూ నోరు నొక్కేసావు. అయినా చెప్పిన కదా. సాయంత్రం ఇంటర్వ్యూ తీసుకోవాలని, టైమైతుంది జరుగు,” అంతే కోపంగా మేఘన లాప్టాప్ పట్టుకొని వేరే రూంలోకి వెళ్లిపోయింది. ఇల్లంతా ఒకలాంటి సైలెన్స్.

గట్టిగా శ్వాస తీస్కొని, లాప్టాప్ తెరిచింది. స్క్రీన్ సేవర్  మీదున్న సెల్ఫీపైనే మళ్ళీ చూపంతా.

అందంగా నిండుగా నవ్వుతున్న సెల్ఫీ. ఆ ఫోటో లో పక్కకు అతను, అందుకే ఆ నవ్వు అంత నిండుగా ఉంది. కేవలం అతనితో సెల్ఫీ దిగి పెట్టుకుంటే డౌట్ వస్తదని పక్కకు నిల్చున్న మిగితా కొలీగ్స్ ను కూడా రమ్మని కలిపి దిగిన ఫన్ ఫ్రైడే మెమొరీ. అతను రామ్, సంవత్సరం గా తెలిసి తెలియనట్టుండే మనిషి. ఎప్పుడూ ఎక్కువగా మాట్లాడుకోలేదు. దూరం నుండి చూస్తూ ఇష్టం పెంచుకుంది. ప్రపోజ్ చేసి పెళ్లి చేసుకునే ఆలోచన మాత్రం ఇప్పటి వరకు ఎందుకో రాలేదు.

చేయాల్సిన పని గుర్తొచ్చి, మేనేజర్ భాస్కర్ రిఫర్ చేసిన క్యాండిడేట్ కి ఇంటర్వ్యు కాల్ చేసింది.

“ఆ…అలో”

“హాయ్ దిసీస్ మేఘన, హెచ్ ఆర్. కాలింగ్ ఫ్రమ్ సాఫ్ట్ టెక్ ట్రీ. కుడ్ యూ ప్లీజ్ ఆన్ యువర్ కెమెరా” అందామె.
రెండు బర్రెలు, నాలుగు మేకల మధ్య రొచ్చురొచ్చున్న చోట మొబైల్ నుండే వీడియో ఆన్ చేసి ‘ఆ…సెప్పండి’ అన్నాడు షర్ట్ లేకుండా బనియన్ మీదే జూమ్ కాల్లో కి వచ్చి.

మేఘన దడుసుకుంది. “హలో. రవి అంటే మీరేనా?! ఈ టైంకి హెచ్ ఆర్ రౌండ్ తీసుకుంటామని ముందే చెప్పాం కదా. మరి మంచి బ్యాక్ గ్రౌండ్ లో ఉండాలని తెలీదా,” కాస్త అయోమయంగా అనేసింది.

“అదేంటి. రిపర్ సేసిన అన్న అయ్యేమ్ సెప్పలా. ఎచ్చ్చారు పోన్ చేసుద్ది, ఎత్తు చాలు అన్నాడే. ఏమి సేయాల్సింది ఉండదు, పోను ఎత్తుతే ఆపర్ లెటర్ ఇచ్చేతారు అన్నాడే మాయన్న. తొందర ఆ ఆపర్ లెటర్ పంపండి మేడము,” అని అతను కూడా భాస్కర్ లాగే ఆమె చెప్పేది వినకుండానే పెట్టేసాడు.

మేఘన తల పట్టుకుంది.

సరిగ్గా నిమిషానికే భాస్కర్ కాల్ చేసాడు “మేఘనా. రవి ఓకే కదా, ఆఫర్ లెటర్లో ఎంత ప్యాకేజీ పెడ్తున్నావ్?” అని.

మేనేజర్ కదాని ఒళ్ళు చిర్రెక్కిన కూడా నార్మల్ అవుతూ “కష్టం భాస్కర్. అసలు టెక్నికల్ ఏమి చెప్పి పాస్ చేపించారో తెలీట్లేదు. ఆల్రెడీ గూగుల్ చేస్తే అతను పని చేసిన పాత కంపెనీస్ ఫేక్ అని అర్ధం అవుతుంది. సారీ,” చివరి పదాలు వినకుండానే కాల్ కట్ చేసేసాడు. ఫోన్ విసిరేయాలనంత కోపం వచ్చింది.

వెనక నుండి రమా నవ్వాపుకుంటూ వచ్చింది “ఏంటే, ఫేక్ వెధవలకు ఇంటర్వ్యూ తీస్కోడానికేనా అంతలా అరిచావ్,”

“మమ్మీ ప్లీజ్. మూడ్ ఏమి బాలేదు”

“ఎప్పుడు బాగుందనే. ఉద్యోగంలో జాయిన్ అయినప్పట్నుండి ఎప్పుడు బాలేదు. నా మాటిని ఈ సంబంధమో లేక ఆ జెమినీ టీవోడినో పెళ్లి చేసుకో. మంచి జాబ్, ప్యాకేజీ. ,” అంటూ మొదలెట్టగానే

“మళ్ళీ స్టార్ట్ చెయ్యకు మమ్మీ ప్లీజ్”

“ఇంకెన్ని రోజులే. కనీసం వేరే కంపెనీ అయినా చూస్కో. వచ్చే సంబంధాల్లో ఒక్కోక్కోడు కడ్తున్న ఇన్కమ్ టాక్స్ అంతలేదు నీ ఇన్కమ్. ముందే ఈ మధ్య జాబ్ ఉన్న అమ్మాయి సంబంధం సరిపోదట, వాళ్ళ జీతం కూడా బానే ఉండాలనుకుంటున్నారు అబ్బాయిలు,” రమా కాస్త అరిచినా కూడా కాసేపటికే చిన్నబోయింది.

“ఎవరైనా ఎన్ని సంబంధాలని పట్టుకొస్తారే. తర్వాత బాధ పడడం కంటే వచ్చిన సంబంధంలు మంచివే కాబట్టి ఏదోటి ఖాయం చేస్కోని సుఖ పడకుండా, దేనికీ చాదస్థాలు,” రమా మాటకి మేఘన మాట్లాడకుండా కూర్చుంది. ఇద్దరి మధ్యున్న సైలెన్స్ ఇల్లంత పాకింది.

కాసేపటికి తల్లి చిన్నబోయి కూర్చోవడం ఎందుకో నచ్చకా దగ్గరికి వెళ్లింది మేఘన.

“నాకు అర్థమైందిలే. నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయ్యావ్ అని. మూసుకొని చేస్కో అనకుండా, వాడి ప్యాకేజీ లో నీది పావు కేజీ లాంటి డైలాగులు ఎందుకు. బానే ఉన్నాడు. కానీ నా జీతం తక్కువని, నా  ప్రొఫెషన్ని చులకనగా చూస్తున్నాడు, అదే నాకు నచ్చలేదు.”
“ఆ. పెద్ద కలెక్టర్ ఉద్యోగం మరి. కొన్నిటికీ తగ్గీ సర్దుకోవాల్నే. నేను చేస్కోలేదా మీ నాన్నని. ఈ మధ్య రోజూ ఆ బక్క పల్సగ ఉండే డైరెక్టర్ సినిమాలు ఎక్కువగా చూసి ఇలా తయారయ్యావ్ కదా. మంచి సంబంధం, వదులుకోకురా,” అంటూ రమా అరుస్తూనే నెమ్మదిగా మేఘనకి నచ్చచెప్పడం మొదలెట్టింది.

సండే రోజు కూడా పనుందని వెళ్లిన భర్త, సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాకా రమా కి తోడై మేఘన చేత ‘ఓకే’ అనేలా నచ్చజెప్పారు ఇద్దరు.

విషయం తెల్సి, త్వరలో డైరెక్ట్ గా కలిసి తర్వాత ఎంగేజ్మెంట్ పెట్టుకునే ఆలోచనల్లో ఇరు కుటుంబాలు ఉన్నాయి. ఆనంద్ ఆ రోజు రాత్రి నుండే ఆమెకు కాల్స్ మెసేజ్లు మొదలెట్టాడు, మెఘన ఏ మాత్రం పెద్దగా ఇంట్రెస్ట్ చూపించక ఏదో రిప్లై పడేసి ‘గుడ్ నైట్’ అని పెట్టేసింది.

*** *** ***

తెల్లారితే మళ్లీ ఆఫీస్ అని బెంగగా ఆదివారం రోజే తెగ తాగేసి పడిపోయి…పొద్దున్నే లేట్ అయ్యిందని నొక్కినా ఆగని లిఫ్ట్ ముందు నిల్చోకుండా మెట్ల మీద పరిగెడ్తున్న బూట్ల చప్పుడుతో, ఆఫీస్ బిల్డింగ్ ఉలిక్కి పడ్డట్టు లేచింది. ఆ సోమవారం పరుగులో ఆమె కూడా ఒకతి. లోపలికి వెళ్ళాక కొలీగ్స్ తో తను ఒక సంబంధంకి ఎస్ చెప్పిందనే బ్యాడ్ న్యూస్ గా చెప్పేలోపే “రామ్…రిసిగ్నేషన్ పెట్టాడు,” న్యూస్ ఆమెకి చేరింది. ఆ రోజు దిగులు ఇంకెక్కువైంది. ఒక ఎంప్లాయ్ వెళ్ళిపోతే వాళ్లకు క్లోసింగ్ డాకుమెంట్స్ ఇచ్చే దాకా, మళ్ళీ ఆ స్థానాన్ని వేరే వాళ్ళతో నింపే దాకా ప్రెషర్ ఉంటది. కానీ హెచ్ ఆర్ గా ఆమెకి అదేం పెద్ద పని కాదు అన్నట్టు అనిపించి పర్సనల్ గా రామ్ మీదున్న ఇష్టం తో ఒక బాధ మాత్రం పెరిగింది.

మేనేజర్ మాటే వినలేదు ఇక హెచ్.ఆర్ మాట ఏమింటాడని తెలిసినా కూడా ఆ వంకతోనైనా మాట్లాడొచ్చు అని కెఫెటేరియాలో రామ్ తో ‘మాట్లాడాలి’ అని మీట్ పెట్టుకుంది.

రామ్ రాగానే ఒక్కసారిగా అతన్ని కొన్ని సెకండ్లు చూపుల్తో బంధించి కాఫీ సిప్ సురుకు నాలుకకి అంటగానే నార్మలై,
“హలో అండి హెచ్ ఆర్ గారు, మార్నింగ్ ,” హుషారుగానే రామ్.

“మార్నింగ్ రామ్. ఏంటిండీ పొద్దుపొద్దున్నే మాకీ షాక్లు. సింగిల్ హ్యాండ్తో మొత్తం ప్రాజెక్ట్ చేయగలిగే నీలాంటి వారిని ఆఫీస్లోంచి వెళ్లిపోకుండా చేయాల్సిన ప్రయత్నాలు ఎలాగో చేసే ఉంటారు. అయినా వెళ్ళిపోతున్నావ్ అంటే ఎదో పెద్దది వచ్చే ఉంటది” కాఫీలోని కఫైన్ కంటే అతని చూపే ఓ బూస్టింగ్లా వచ్చిన ఎనర్జీతో అందామె.

“ఏముందిలే మేఘనా, లైట్. నువ్వన్నట్టు వేరేవి కూడా వచ్చాయి. కానీ దాంట్లో కూడా జాయిన్ అవ్వను. అలానీ ఉన్నదాంట్లో నుండి కూడా వెళ్లక తప్పదు.,”.

“అయ్యో నేనేం మరి ఇబ్బంది పెట్టె హెచ్.ఆర్ ల అడగట్లేదు. జనరల్ గా అడిగాను, నేనెవరితో అననులే,”.

“అలా ఏమి లేదు మేఘన. ఇలా జాబ్ చేయడమే ఇష్టం లేదు. ప్రాజెక్ట్ మీద కరెక్ట్ గా శ్రద్ధ పెట్టి నేనే మొత్తం చేయగలను. ఇంతకు ముందు చేసినట్టుగానే మొత్తం ఫ్రీలాన్సర్ గా మారిపోదాం అనుకుంటున్నా. అందుకే వేరే కంపెనీ ఆఫర్స్ కూడా పక్కకు పెట్టేస్తున్నా,” అన్నాడు అసలు విషయం చెప్తూ.

“ఫ్రీలాన్సింగా! జాబ్ చేయడం నచ్చక పోవడానికి కారణం?” మేఘన.

“నచ్చకపోవడమని కాదు, నాకే ఆ మెంటాలిటీ లేదు. ఈ జాబ్లకి నేను సెట్ అవ్వను. ఇన్ని రోజులంటే ఇంట్లో పెళ్లి ప్రెషర్ ఉండేది. ఎంత సంపాదించిన ఫ్రీలాన్సర్ కి పిల్లను ఎవరు ఇస్తారు చెప్పు?! అందుకే కొద్దీ రోజులు ఇక్కడ వర్క్ చేసాను” అన్నాడు.
మేఘన గుండె ఒక్కసారిగా చేతుల్లోంచి జారినపడిన కప్పుసాసర్లా ముక్కలై, అది కండ్లల్లో గుచ్చుకున్నట్టుగా నీళ్లు వచ్చినా, ఆపుకుంది.

“అంటే ఇప్పుడు నీకు పెళ్లి అవ్వబోతుంది అనమాట, చేస్కోబోయే అమ్మాయికి ఫ్రీలాన్సింగ్ గురించి చెప్పేసి ఇక్కడ పేపర్స్ పెట్టేసావ్ కదా” అందామె లోపల ఇబ్బందిగా ఉన్నా కూడా.

“భలే కథలు అల్లుకుంటూ పోతావ్ నువ్వు. మా తాతయ్య చనిపోయాడు, అందుకు ఒక ఇయర్ వరకు ఎలాగో పెళ్లి చేయరు, అందుకని ఇంకో సంవత్సరం వరకు ఇక్కడే పని చేయడం నావల్ల కాదు,” చిన్నగా నవ్వాడు.

ఆ మాటలు ఒక్కసారిగా ఊపిరందని ఆమెకు ఆక్సిజన్ సిలిండర్లా అన్పించాయి. నిండుగ నవ్వింది. ఇటు గంట గంటకి జొమాటో నోటిఫికేషన్ల మెసేజ్ చేస్తున్న ఆనంద్ ని, ట్యాప్ చేయని కస్టమర్ల పట్టించుకోకుండా, రామ్ తోనే మాట్లడుతుంది.

“ఇఫ్ యూ డోంట్ మైండ్, ఫ్రీలాన్సింగ్లో వచ్చే సంపాదన సరిపోతదా?” అడిగింది.

“అయ్యో మేఘన. గట్టి ప్రాజెక్ట్ తగలాలే గానీ, హై లెవల్ వాళ్లకి మీరిచ్చే జీతం కంటే ఎన్నో రేట్లు ఎక్కువగా వస్తది తెలుసా. కానీ రిస్క్ అని ఎక్కువ ధైర్యం చేయరు అంతే”

“హ్మ్. మీకేంటండీ, టెక్నికల్ నాలెడ్జ్ బాగా ఉంది కాబట్టి ఎలాగైనా నెగ్గుకొస్తారు. మీకు పిల్లనివ్వడానికి ముందుకు రాకపోవడమేంటీ అసలు?”

“మీరన్నంత సులువుగా లేదు బయట. సాఫ్ట్ వేర్ ఇంజనీర్లంటే ప్యా’కేజీ’లో కొలుస్తారందరు. మాకేమో నాలెడ్జ్ కోసం బ్యాంక్ బ్యాలెన్స్ తక్కువే ఉన్నా బ్యాంకింగ్ ప్రాజెక్ట్ లో ఉన్నామని సంతోషపడ్తున్నాం, హెల్త్ కేర్ ప్రాజెక్ట్ లోని ఇష్యూస్ మీద పెట్టినంత శ్రద్ధ హెల్త్ ఇష్యూస్ మీద పెట్టకుండ పని చేస్తున్నాం. అంతెందుకు ఈ కంపెనీలో గేమింగ్ ప్రాజెక్ట్ లో పడేసి ఫీలింగ్స్ తో ఆడుకున్నాడు క్లయింటోడు. ఇప్పుడు ఫ్రీలాన్సింగ్లో కూడా అంతే, కానీ ఈ జాబ్ మెంటాలిటీ నాకే ఎక్కదు. కాస్త రిస్క్ తీస్కున్నా, హై ఫ్లెక్సిబుల్ గా ఉండొచ్చు. పర్సనల్ గా అమ్మాయిని ఎలాగూ బానే చూస్కుంటా అనే నమ్మకం నాకుంది, కానీ ఈ విషయాలు కూడా అర్థం చేస్కునే అమ్మాయి దొరికితే చాలు,” చెప్పుకొచ్చాడు.

ఆమె కాస్త నిమ్మలమై వింటూనే ఉంది. అతనది గమనించి,
“మీరేమి అనుకోనంటే ఒకటి అడగాలండి?” రామ్

అమె కాస్త టెన్షన్ గా “యా. ప్లీజ్,”

“ఏమిలేదండి. హెచ్.ఆర్ లు లేకుంటే ఆఫిస్ కి కళ ఉండదు. నేను టెక్నికల్ గా బానే ఉన్నా, మిగితా విషయాలు పెద్దగా ఏమి తెలీదు. నిన్న మీరెవరినో ఇంటర్వ్యూ తీసుకున్నారంటా, అతను ఇంటెనుక పెరట్లో బట్టలు లేకుండా వీడియో ఆన్ చేసాడనీ అతని గురించి మిగితా వాళ్లు మాట్లాడుకుంటూ నవ్వుతున్నారు. నిజానికి నేను కూడా అలాంటి బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చిన వాడినే. ఇంగ్లీష్ మరీ ఇరగదీయడం రాదు, కానీ కాస్తోకూస్తో మేనేజ్ చేయగలను. అది కూడా సిటీకి వచ్చాకా, ఆఫీస్ లో మీలాంటి వాళ్లు మాట్లడడం దూరం నుండి చూసి ఇంగ్లీషే కాదు ఇంక చాలా నేర్చుకున్నాను. యూ ఆర్ ఏ క్లౌట్ టు మీ,” అతను చెప్తుంటే గమ్మత్తుగా వింటుంది.

“నేను ఫ్రీలాన్సింగ్ చేయడం స్టార్ట్ చేసాక పాత చింత తొక్కు మొఖంతో తడబడే ఇంగ్లీష్కి ఏమౌతదో గానీ మీ లాంటి బర్గర్ బుగ్గలోలు లొడలొడ మాట్లాడితే క్లయింట్లు కూడా ఇట్టే యాక్సెప్ట్ చేస్తారు. అప్పుడప్పుడు హెల్ప్ కావాల్సి వస్తే చేస్తారా?” అడిగాడు.
ఆమెకు అతని మాటలు ముద్దొచ్చాయి.

“ష్యూర్. దాంట్లో ఏముంది, నాతో కొద్ది రోజులుంటే మీరే ఇంగ్లిష్ లో ‘ఇచ్చి పడేస్తరు’ ,” అందామె.
ఆనంద్ ఈ సారీ జొమాటో నోటిఫికేషన్ల కాకుండా క్రెడిట్ కార్డ్ బిల్ కట్టని బ్యాంక్ ఏజెంట్లా నిమిష నిమిషానికి మెసేజ్లు చేసినా పట్టించుకునే స్టేజిలో ఆమె లేదు.

దాదాపు సాయంత్రం దాకా పని పక్కకుపెట్టి మరీ మాట్లాడుకున్నారు ఇద్దరు. ఆమెకి ఈ రోజు అతనితో అంతలా మాట్లాడడం ఏదో స్పెషల్ గా అన్పిస్తుంది.

ఆఫిస్ అయిపోగానే, అంత ట్రాఫిక్ దాటుకుంటూ కూడా ఆమె చిరాకుతో కాకుండా హుషారుగా ఇంటికి రావడం రమాకి ఆశ్చర్యాన్ని, పైగా ఆనంద్ ప్రేమలో పడిన మాయగా అన్పించింది. అదే విషయం అడిగితే “అంత సీన్ లేదు వాడికి. అయినా మమ్మీ, నిన్న ఇరవై లక్షలోడు వచ్చాడనీ మొన్నటి పదిహేను లక్షలోడిని లైట్ తీస్కోవడం, రేపు ముప్పై లక్షలోడస్తే ఇరవైని విడ్చిపెట్టడమేనా? ఇదేమైనా ప్యాకేజ్ డిస్కషనా, హోల్డింగ్ ఆఫర్ తో జాయిన్ అవ్వాలా వద్దా అని మార్చడానికి,” అందామె.

“ఏంటే, మేమేం చూసిన నీ మంచికే గానీ మాకేమైన ఇస్తరేంటి ఆ జీతాలు. నీకు నచ్చకనే కదా ఒక్కో సంబంధం పోయి చివరికి ఆనంద్…” రమా ఇంకేదో చెప్పబోతుంటే

“అయినా ఈ జాబ్ లు కాదు గానీ ఫ్రీలాన్సింగ్ వాళ్లని చేస్కుంటే ఎలా ఉంటుంది?”

“ఫ్రీలాన్సింగా. అంటే ఫ్రీగా పని చేసే వాళ్లా? అయినా ఓకే అనుకొని ఎంగేజ్మెంట్ కూడా పెట్టుకునే ఆలోచనల్లో ఉన్నప్పుడు మళ్లీ ఇవన్నేంటే,” సీరియస్ గానే అంది రమా. అలా అనేంత వరకు తనకి ఏం జరుగుతుందో ఒక స్పృహలోకి వచ్చింది మేఘన.

డిన్నర్ చేసాకా “ఆనంద్ కాల్స్ కి మెసేజ్లకి రిప్లై ఇవ్వట్లేదంటా. ఏం మాయ రోగం,” అని ఇంట్లో వాళ్లు అడిగితే, ఏ చప్పుడు లేకుండా వెళ్లి మంచంపై వాలింది.

అటు రామ్ గుర్తుకొస్తున్నా అతనికి మెసేజ్ చేయలంటే ఎందుకో ఆగుతుంది. ఇటు ఆనంద్ పెట్టిన మెసేజ్లకి రిప్లై కాదు కదా అసలు చూడాలా వద్దా అని అలోచిస్తుంది. మొత్తానికి ఎవరికి పెట్టకుండా ఆన్లైన్లో ఉంటూ ఊగిసలాడింది.

రామ్ వాళ్ల తాత లాగా, తన తాత వాళ్లో లేక ఆనంద్ వాళ్ల తాతో చనిపోతే బాగుండు లాంటి థాట్స్ తో ఆమె నిద్రలోకి జారింది.

తెల్లారింది.

హాల్లోకి రాగానే, రమా వాళ్ళ ఆయనతో తల పట్టుకొని మాట్లాడుతుంది.

“ఏమైంది మమ్మీ?”

“నీ దరిద్రం ఇలా ఏడ్చిందేంటే ? ముందు ఆనంద్ కంటా తొందరగా ఫోన్ చెయ్యి, బంగారం అనుకున్న సంబంధం పోయేలా ఉంది,” అంది రమా

“అబ్బా, మమ్మీ ప్లీజ్. నేను రెస్పాండ్ అవుతలే గానీ, నిజంగా ఆనంద్ ని నేను పెళ్లి చేస్కునే ఉద్దేశం నాకు లేదు. అతను నాకు సెట్ అవ్వడు. ఈ విషయం అనంద్ కి నేనే చెప్తాను. మీకు ఎలాంటి మాట రాకుండా చూస్కుంటా” పెరెంట్స్ తో డైరెక్ట్ గా అనేసి ఆనంద్ కి కాల్ చేసింది, అసలు విషయం తెలీక.

రమా ఆమె మాటకి కాస్త రిలాక్స్ అయ్యింది.

“హాయ్ ఆనంద్…

అవతల వైపు కాస్త గొడవగొడవగా కొన్ని గొంతులు. “హలో మేఘనా. నీకో విషయం చెప్పాలనీ ఎన్ని సార్లు కాల్ చేసాను తెల్సా, లిఫ్ట్ చేయవేంటి,” అదరాబదరాగా ఆనంద్,

“సారీ. బట్ రిలాక్స్. నేను ఓ విషయం చెప్పాలి,” అని మేఘన మాట పూర్తిగా వినకుండానే అతనేదో చెప్పబోతుంటే,
“ఆ దరిద్రపు మొఖాన్ని ఒప్పుకున్నప్పటి నుండే ఇదంతా. ఏం ఐరన్ లెగ్గే మున్…” అంటున్న ఆనంద్ తల్లి మాటలు మేఘనకి వినొచ్చాయి.

ఆమెకు ఒక్కసారిగా అర్థం కాలేదు.

ఆనంద్ ఆ మాటలు విన్పించకుండా బయటికెచ్చి మాట్లాడాడు “మేఘనా, నా జాబ్ పోయింది. యూ ఎస్ లో రిసిషన్ (ఆర్థిక మాంద్యం) రావడంతో ప్రాజెక్ట్ క్లోజ్ చేసి ఉద్యోగం నుండి పీకేసారు.! నాక్కొంచెం టైమివ్వు. ఇంకా మంచి ప్యాకేజి ఉన్న ఆఫర్ తెచ్చుకుంటాను. రిసిషన్ తో జాబ్ పోయిందని పెళ్లి డిసిషన్ మార్చుకునే క్యారెక్టర్ నీది కాదని నాకు తెల్సు,” అని అతని మాటలు అర్థమైనా వెనక నుండి ఇంకా వినబడుతున్న ఆనంద్ తల్లి మాటలే మేఘన గుండెని చివుక్కుమనేలా చేసాయి.

అలాంటి టైంలోనే ఆమెకి ఎలా తట్టిందో తెలీదు గానీ రామ్ రిసిగ్నేషన్ గుర్తొచ్చి “ఆనంద్ నీ రెజ్యూమ్ నాకు పంపివ్వు. మా దాంట్లో రిఫర్ చేపించి ఇప్పిస్తాను, ఉన్న దాని కంటే ఎక్కువ ప్యాకేజికే.” అంది.

“మీది మరి పెద్ద కంపెనీ కాదు కదా. మరీ ఇవ్..వ..గ,” అతను పూర్తి చేసేలోపే,
“నిన్ను పీకేసింది పెద్ద కంపెనీనే కదా…” అనగానే చప్పుడు చేయకుండా పంపించాడు.

“హలో భాస్కర్. హాయి. ఒక హెల్ప్ చేయాలండి. మీకు బోనస్ తొందరగా వచ్చేలా చూస్తాను, రామ్ రిసైన్ చేసిన పొసిషన్ కి ఒక వ్యక్తిని రిఫర్ చేసి, టెక్నికల్ ఇంటర్వ్యు తీస్కుంటారా?” అని ఆనంద్ రెజ్యూమ్ ని ఫార్వర్డ్ చేసింది. మేనేజర్ భాస్కర్ ఓకే అన్నాడు.

కాసేపటికి “హాయ్ మైఘనా. ఇప్పుడే ఒకతని టెక్నికల్ అయిపోయింది. గుడ్ స్కోర్. నా పొజిషన్లోకి ఇతను బానే సెట్ అవుతాడు. నీకు ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇక హెచ్.ఆర్ రౌండ్ నీ చేతుల్లోనే,” అంటూ రామ్ కాల్ చేసాడు.

ఇప్పుడు ఒక ఇంటర్వ్యూ క్యాండిడేట్ గా మేఘనతో కాల్లో ఉన్నాడు ఆనంద్. ఫార్మాలిటీ క్వశ్చన్స్ కి బానే ఆన్సర్ చేసాడనీ, అతను అడిగిన ప్యాకేజీకి సరే చెప్పి ఆఫర్ లెటర్ కొద్ది సేపటికే ఇప్పించి “కంగ్రాట్స్,” చెప్పింది. చాలా ఆనందంగా థ్యాంక్స్ చెప్తూ “కంగ్రాట్స్ టు యూ ఈవెన్. ఈ ప్యాకేజ్ నాకు మాత్రమే కాదు ‘మనకి’,” అన్నాడు.

“సారీ ఆనంద్. ఆ విషయం దగ్గరికే వస్తున్నా. ఇప్పుడు నీ చేతులో ముందుకంటే మంచి ప్యాకేజీ ఉన్నా, నేను చెప్పలనుకునేది మాత్రం ‘నో’. మనిద్దరికి సెట్ అవ్వదు. మీ ఇంట్లో ఆ విషయం చెప్పి ఎంగెజ్మెంట్ గురించి ఆలోచించద్దని చెప్పు. ముఖ్యంగా మీ మమ్మీకి ఈ ఆఫర్ లెటర్ ఇచ్చి మరీ రిజెక్ట్ చేసిందని చెప్పు. రిసీషన్ రాక ముందే నేనీ డిసిషన్ తీస్కున్నాను. రిసిషన్ అనేది నాలాంటి వాళ్ల వల్ల రాదు అని క్లియర్ గా చెప్పు,” అందామె.

“వాట్ హ్యాపెండ్ మేఘన? ఆర్ యూ సీరియస్. మా మమ్మీ మాటలకేనా లేక వేరేదైన రీసన్ ఉందా?” అడిగాడు
“అవును, నీకు టెక్నికల్ రౌండ్ తీస్కున్నడే, రామ్, అతనే రీసన్. భలే కలిసొచ్చింది. నా జాబ్ పరంగా అతని ప్లేస్లో నిన్ను, పర్సనల్ గా నీ ప్లేస్లో అతను వచ్చి కూర్చున్నారు.” అంటూ చిన్నగా నవ్వేసింది. ఆనంద్ కి అర్థం కాలేదు. ఈ సారీ వైఫై కాకుండా బై చెప్పి కాల్ కట్ చేసేసింది.

అంత అయిపోయాక, పక్కకే ఉండి గమనించిన తండ్రి మేఘన తలపై చెయ్యేసి “శభాష్ బేటా. ప్రౌడ్ ఆఫ్ యూ,” అన్నాడు.
“ఇంతకి రామ్ ఎవరు?” అడగ్గానే , లాప్ టాప్ తిప్పి స్రీన్ సేవర్లో చూపించింది.

“ఓ మీ కంపెనీ ఎంప్లాయేనా,” రమా

“ఇక ముందు నుండి అయితే కాదు. ఇప్పుడు అతను ఒక ఫ్రీలాన్సర్” చెప్పింది మేఘన.

*

చిత్రం: చరణ్ పరిమి

మన్ ప్రీతం

18 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాఫ్ట్వేర్ జీవితాలు, మనుషులను కాచి వడపోశారనిపించింది.. కథ ఫ్లో బావుంది

  • ఆసాంతం చదివించగల్గిన కథానిక. ముగింపు ముచ్చటగా..

  • సాఫ్ట్వేర్ లైఫ్ కళ్ళకు కట్టావు తమ్మీ

  • ఫస్ట్ లైన్ నుండి లాస్ట్ లైన్ వరకు కథ చాలా బాగా రాసారు. కానీ కథకి టైటిల్ కి సంబంధమెంటో అర్థం కాలేదు ?
    మీ కథల్లో నాకు బాగా నచ్చేది మరీ ఎక్కవ క్యారెక్టర్లు లేకుండానే చిన్న వాటిలో ఆ ఫీల్డ్ ని/డిపార్ట్ మంట్ ని మొత్తాన్ని చూపించడం. బహుశా కథంటే ప్రపంచాన్ని చిన్న కిటికిల్లోంచి చూడడమంటే ఇదేనేమొ. హెచ్చార్, టెకీ జీవితాలను చూపిస్తూ, ఎక్కువ స్ట్రెస్ చేయలేదు కానీ అందులో ఇప్పుడు జరుగుతున్న వేడివేడి చర్చ మూన్ లైటింగ్ ని టచ్ చేయడం బాగుంది. క్లైమాక్స్ ఒక్క కొత్త ఆలోచనకి దారి తీసింది.

    • సాఫ్ట్ వేర్ ప్రపంచం, ఐటీ ప్రపంచం అని అంటుంటారు చాలా మంది. నిజానికి అది ఒక కనపడని సూర్యుడు. ఉదయించినప్పుడు (boom లో) , అస్తమించినప్పుడు (recession లో) ప్రభావితం అయ్యే జీవితాలే ఇక్కడ నీడలు. ఆ ఫీల్డ్ లో ఉన్న ఒకమ్మాయి ఆ జిమ్మిక్కులకు లొంగకుండ తనకి ఇష్టమైందే చేస్కుంటూ వెళ్లిందా లేదా అనేదే కథ. టైటిల్ దానికి అనుగుణంగా పెట్టాను.

  • కాస్త చిన్నగా రాయొచ్చు అన్పించింది. కానీ ఎక్కడ బోర్ కొట్టనివ్వని నరేషన్. మంచి ముగింపుతో రాసిన కథ. అసలు కథ ఏమి లేకపోయిన కూడా నరేషన్ తో చదివించగల కెపాసిటీ మీకుంది. సాధారణ జనాలకి అసలివి కష్టలేనా అని కూడా అన్పించొచ్చు. ఒక మహిళ ఐటి ఎంప్లాయి మనోభావాలు బాగా చిత్రించారు.

  • చిక్కటి మాటలతో చక్కటి కథ. ఇది కేవలం సాఫ్ట్ వేర్ వాళ్లకే వర్తించదు అని నా ఫీలింగ్. Congratulations

  • Very well written. Good to read regarding the life’s of HR’s and software people in telugu literarture. Expecting such many more updated writings.
    – N.Jyothi

  • Worth spending time for such a good story. I enjoyed reading whole thing and liked Climax, Mother character n manager character . Loved reading this.

  • Chaala baagundi, story chadvutunnantha sepu oka imaginary voices and persons ni uuhinchukunentha chakkaga each and every lines potunnai. Chinna chinna actions ni baaga inject chesaru..vaati valla realisticga story saagindi. Good work👌

  • Good narration and congrats on choosing to link a contemporary issue with a time-less issue. Reading experience would have been better if someone took care of the typos.

  • The lifestyle and mentality of the IT people are shown very well. Each character has it’s own value and no unnecessary diversions. Touching many booming issues across the IT, the story created a good mark with a easy going extraordinary narration.

  • What an experience! SURYUDI NEEDALU made me to be in a trance more than a day and kept reading it again and again. Such an easy flow, intresting narration didn’t even made me to turn my head on any other thing. The climax made me to feel bit cinematic elevation scene but that proved the power of a HR and that girl.

  • యువ కథకుడికి అభినంధనలు .మంచి రచన శైలి.పాఠకుణ్ణి చదివించింది.సాఫ్ట్వేర్ జీవితాల అభద్రతను కళ్ళకు కట్టినట్లు చూపించావు ఇంకా మంచి కథలు రాస్తావని ఆశిస్తున్నాను

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు