చావుకబురు– ఒక్కొక్కడినీ ఒక్కొక్క తీరుగా స్పందింపజేస్తుంది. బహుశా కించిత్తు ఉద్వేగానికి కూడా లోను కాకుండా చావు కబురును వినడం అలవాటు చేసుకున్న వారిలో నేనొకణ్ని. పైగా చావు వార్తలు చెవిన పడ్డప్పుడు నేను స్పందించే తరీకా వేరే ఉంటుంది.
‘మనూరి రోడ్లోంచి హైవే ఎక్కే కాడ షేరాటోని లారీ గుద్దేసిందంట.. ఆటో మొత్తం పచ్చడైపోయిందంట’ అనే కబురు ఎవరైనా మోసుకువస్తే మీరైతే ఏం అంటారు?
‘అయ్యో ఎలా జరిగింది?’
‘మనూరోళ్లు ఎవురైనా ఉన్నారా?’
‘ఎవురికీ పేణం మీదికి రాలేదు గదా’
‘దెబ్బలు బాగా తగిల్నాయా?’
‘ముదనస్టపు అయివేల్తో మిడిమేలపు పోకడలేనమ్మా’ ..సరే ఇలా రాసుకుంటూ పోతే చేంతాడంత లిస్టు రాసుకోవచ్చు. నేనైతే మొదటగా అడిగే మాట..
‘ఎంతమంది?’
అది ఎంత పెద్ద యాక్సిడెంటన్నా అవనీ.. ఆటోలు బస్సులు పచ్చడైపోనీ పులుసైపోనీ రసమైపోనీ నాకు కావాల్సింది మాత్రం ఒక్కటే ‘ఎంతమంది పోయారు?’ ఇలాంటివి జరిగినప్పుడు పోలీసులు ముందు నాకే ఫోన్ చేస్తారు. నా తొలి ప్రశ్నకు వారి జవాబును బట్టి.. నా రెండో మాట ఉంటుంది.
‘గాయాలేనా? చావలేదా? సర్లే పేర్లూ డీటెయిల్సూ వాట్సప్ లో పెట్టు’
‘ఇద్దరా.. పేర్లూ ఊర్లూ వెంటనే పంపు. బ్రేకింగ్ కోసం పంపుతా’, ‘..’, ‘ఆ మాత్రానికి నేనేం వొస్తాగానీ.. ఫోటోలు నువ్వే తీసి పంపు’
‘పదిమందా.. సరే పెట్టేయ్ వస్తున్నా’ ..ఇలా రకరకాలుగా సాగుతుందన్నమాట.
ప్రమాదాల వలన కలిగే హఠాన్మరణాల కథ చెప్పాను కదా.. మరి ఆత్మహత్యల మాటేమిటి? ఆత్మహత్య ఏ కేటగిరీలో ఏ కారణంగా జరిగినా నాకు డీటెయిల్స్ కావాల్సిందే. ‘కేటగిరీ’ అని ఎందుకంటున్నానంటే.. ‘ఇంటర్మీడియట్ స్టూడెంటు’, ‘కడుపొచ్చిన బాలిక’, ‘కొడుకులు గెంటేసిన తల్లి’, ‘అప్పుల్లో మునిగిన రైతు’ ..ఈ కేటగిరీల జాబితా కూడా చాలా పెద్దదే. సూయిసైడ్ కబురు చెవిన పడంగానే.. అది ఏ కేటగిరీనో కనుక్కుంటూ మొట్టమొదటగా. నా గూగుల్ డాక్స్ పేజీలో కేటగిరీల వారీగా టేబుల్ మెయింటైన్ చేస్తుంటా? కొత్తగా వచ్చిన ‘సూయిసైడ్’ ఏ కేటగిరీలోకి వస్తుందో డేట్ తో సహా యాడ్ చేస్తా. నెలాఖరు రోజున ఆ టేబుల్ మొత్తం ఓపెన్ చేసి మధనం సాగిస్తా.. ఒక పెద్ద రివ్యూ సాగుతుంది నా బుర్రలో. చివరికి ‘ఈ నెలలో– పోయిన నెల కంటె కడుపొచ్చిన అమ్మాయిల ఆత్మహత్యలు ఎక్కువగా జరిగాయి. షేర్ ఆటోల్లో బడికి వెళ్లివస్తున్న బాలికలకు కడుపులు రాకుండా పోలీసులు ఏమీ చేయలేకపోతున్నారు’ అని ఒక స్టోరీ వండుతా! లేదా, ‘ఈ నెలలో ఇంటర్మీడియట్ పిల్లల సూయిసైడ్ లు తగ్గాయి. కాలేజీల్లో కౌన్సెలింగ్ లు జరగాలని నేను పోయిన నెలలో రాసిన వార్త వలన వీటి సంఖ్య తగ్గింది’ అని ఇంకో స్టోరీ వండుతా! ఇలా సాగుతూ ఉంటుందన్న మాట నా వ్యవహారం.
‘ఈ చావులూ, సూయిసైడ్ ల గోలంతా ఎందుకు చెబుతున్నాడ్రా నాయనా’ అని అనుకుంటున్నారు కదా. దయచేసి చిరాకుపడకండి. నా గూగుల్ డాక్స్ లో ఒక కొత్త కేటగిరీ యాడ్ చేయాల్సిన అవసరం ఉంది. ముందే చేయనా? సూయిసైడ్ జరిగిన తర్వాత చేయనా? ‘తరవాత చేయడం’ సాధ్యం కాదు కదా? ఎందుకంటే ఇది నా పర్సనల్ జీమెయిల్ అకౌంట్లో పెట్టుకున్న డాక్యుమెంట్ కదా?
అయినా ఒక్క సూయిసైడ్ కోసం ‘కొత్త కేటగిరీ’ అవసరమా? ఆ కోవలో మరొకటి మళ్లీ ఎప్పటికి జరుగుతుందో కదా!
అదే మీమాంస నడుస్తోంది నాలో పొద్దున్నించీ! ఇప్పుడు రాత్రి పదయ్యింది. రేపు పొద్దు పొడుస్తుంది కూడా.
సకల చరాచర జగత్తుకు సాక్షియైన వాడు, తన సహజమైన వేగంతో, ఎర్రగా పుట్టి తెల్లగా మారి వెలుగుతుంటాడు. వాడి రేపటి పుట్టుకకు, రేపటి నుంచి సాగే వాడి ప్రస్థానానికీ నేను సాక్షిగా ఉండదలచుకోలేదు.
* * *
వసంతక్క ఫోను చేసింది. ‘నీకో గరం మసాలా ఐటెం ఉంది’ అంది. ‘ఏంటక్కా వరకట్న వేధింపుల మీద ధర్నా ప్లాన్ చేస్తున్నావా’ అడిగాను. ‘అందులో మసాలా ఏముంది శీనూ.. ఇది అసలైన మసాలా.. సిటీ స్పెషల్ లో ఫస్ట పేజీ పెట్టుకోవచ్చు నువ్వు’ అంది. వసంతక్కకి నిజంగానే ఆ న్యూస్ సెన్స్ ఉంది. ఎలాంటి వార్తల్ని మేం ఏ పేజీల్లో పెడతామో, ఏవి కలర్లో వస్తాయో, ఏవి బ్లాక్ అండ్ వైట్ లో వస్తాయో ఆమెకు తెలుసు. ఆమె తనంతగా ఫస్ట్ పేజీ అంటున్నదంటే.. ఏదో విషయం ఉన్నట్టే! నేను ఆలోచనలో ఉండగానే.. ‘కేపీహెచ్బీ రెండో గల్లీలోకి అరగంటలో వచ్చేయ్.. బేకరీ దగ్గర కార్లో వెయిట్ చేస్తుంటాను. స్పాట్ కు వెళదాం’ అని చెప్పి పెట్టేసింది.
వసంతక్క ఇంకా మొబైల్ తీసుకోలేదు. లేకపోతే ఇంత జాగ్రత్తగా కారు ఎక్కడ వెయిట్ చేస్తుంటుందో గుర్తులు చెప్పే అవసరం లేదు. మొబైల్ వాడితే నిమిషానికి తొమ్మిది రూపాయలు బిల్లు. సెంటీమీటర్లను కొలిచి యిచ్చే డబ్బులకోసం వార్తలు రాసే నేను వాటిని చూడ్డమే గానీ, వాటి గురించి ఆలోచనే చేయలేదు. కార్పొరేటర్ కావాలనుకుంటున్న వసంతక్కే ధైర్యం చేయలేదంటే.. అలాంటివి మనకెందుకు?
వసంతక్క మా ఏరియాలో ఒక పార్టీకి మహిళా లీడర్. కార్పొరేటర్ కావాలనేది ఆమె కోరిక. అందుకు సరిపడా డబ్బుంది. కానీ ప్రజల్లో కొంచెం ఫాలోయింగ్ కూడా కావాలి. అందుకోసం నాలాంటి వాళ్లని తమ్ముళ్లలాగా చేరదీసి మంచీచెడ్డా చూసుకుంటూ ఉంటుంది. చిన్న చిన్న అవసరాలకి ఆదుకుంటుంది. ఆమె ధర్నాలు, నిరసనలు, వినతిపత్రం ఇవ్వడాలూ వంటివి చేసినప్పుడు మేం ఆమెకు మంచి ప్రచారం ఇస్తుంటాం. ఫోటోకూడా వేయండి సార్ అంటూ మా ఇన్చార్జిల్ని బతిబమాలుతాం. అదన్నమాట మా అండర్ స్టాండింగ్.
లోకల్ ఆఫీసులో కూర్చుని రాస్తున్న వార్తని ముగించేసి స్కూటర్లో వెళ్లాను. ఇద్దరం కార్లో ఓ చిన్న బస్తీలోకి వెళ్లాం. ఇరుకు బస్తీ అది. కొంచెం దూరంగానే కారు ఆపించి, నడవాల్సి వచ్చింది. ‘ఈ న్యూస్ నీకొక్కడికే చెప్పా.. మిగిలిన వాళ్లు అడిగే.. ఏదో ఆ సమయానికి నువ్వీ కాలనీలో అనుకోకుండా ఉన్నట్టు చెప్పాలి’ అని హెచ్చరించింది. ‘స్కోర్ అనే సంగతి మా వాళ్లకి చెప్తే యిరగదీస్తారు..’ నా కాన్ఫిడెన్సు చూపించా! నా పేపర్లో వస్తే చాలు అనుకునే పరిస్థితి గనుక నాకు మాత్రమే చెప్పిందిగానీ.. నామీద ప్రత్యేకమైన అభిమానం కాదని నాకు తెలుసు మరి!
చేరవలసిన ఇరుకు గల్లీలోకి మేం మలుపు తిరిగే సరికి అప్పటికే అక్కడ పెద్ద సీన్ క్రియేట్ అయిపోయి ఉంది. ఇద్దరు ఆడవాళ్లు మాకు ఎదురొచ్చి వసంతక్కను పలకరించారు. అక్కడ గొడవ గురించి ఆమెకు సమాచారం ఇచ్చింది వాళ్లేనన్నమాట. ప్రతి కాలనీల్లో, బస్తీల్లో ఇలాంటి ఇన్ఫార్మర్లని మెయింటైన్ చేస్తుంటుంది అక్క. వాళ్ల సమాచారాన్ని బట్టి తాను దూసుకెళ్లిపోయి.. ఉద్యమకారిణిలాగా పోరాడేస్తుంది.
ఇంతా కలిపి అక్కడ జరుగుతున్నది మొగుడూ పెళ్లాల గొడవ. వసంతక్క రంగంలోకి దిగిందంటే ఏదో ఉంటుందని అనుకున్న నేను భంగపడ్డాను. ఎటూ వచ్చాం కదా.. ఏదో కాస్త మసాలా అద్ది రాద్దాంలే అనుకున్నాను గానీ.. నా ఊహకు మించిన మసాలా అక్కడ క్రియేట్ అవుతుందని, ఆ చిన్న మొగుడూ పెళ్లాల గొడవని వసంతక్క బ్యానర్ వార్తగా మార్చేస్తుందని ఆ సమయంలో నేను ఊహించలేకపోయాను.
అప్పుడే స్ట్రీట్ లైట్లు వెలిగాయి. కానీ ఇంకా పూర్తిగా చీకటి పళ్లేదు.
చెప్పాను కదా.. మొగుడూ పెళ్లాల గొడవ అది. మొగుడు తాగి వచ్చి రచ్చ చేస్తున్నాడు. ‘కోడికూర వండమన్నాను కదా.. ఎందుకు వండలేదే..’ అంటూ పెళ్లాం జుట్టుపట్టుకుని వంగదీసి వీపుమీద గుద్దుతున్నాడు. ‘రూపాయైనా ఇంట్లో ఇవ్వకుండా, తాగేసి వస్తే.. ఎక్కడినుంచి తెచ్చి వండేది.. నన్ను తినేయ్ సరిపోతుంది..’ అంటూ శోకాలు పెడుతోంది పెండ్లాం. ఇదీ రచ్చ. ఈ రంగంలోకి వసంతక్క ప్రవేశించింది. ఆ పెళ్లాన్ని మొగుడి చేతుల్లోంచి విడిపించి, తను అక్కున చేర్చుకుని వాడిని తిట్టడం ప్రారంభించింది.
ఇలాంటివి మా ఇంటిచుట్టూ రోజూ లక్ష జరుగుతుంటాయి. వీటికోసమా వచ్చాను.. అని చిరాకేసింది. కానీ వసంతక్క నన్ను వెంట తీసుకువెళ్లిన పర్పస్ వేరు గనుక.. నేను కెమెరాతో.. ఆమె దెబ్బలు తింటున్న పెళ్లాన్ని కాపాడి, పొదువుకోవడం వంటి దృశ్యాలు ఫోటోలు తీస్తున్నాను. ఈలోగా ఆ రచ్చలో.. వాడు వసంతక్కని ఉద్దేశించి ఒక బూతు మాట తూలాడు… ‘‘మా మొగుడూ పెళ్లాల గొడవలో దూరడానికి నువ్వెవత్తివే లం..’’ అంటూ!
వసంతక్క రెచ్చిపోయింది. ఉన్నపళంగా కాలిచెప్పు చేతిలోకి తీసుకుని వాడిని దొరికిన చోటల్లా కొట్టింది. అసలే బాగా పూటుగా తాగిఉన్నాడు. ప్రతిఘటించే శక్తి లేదు. ప్రతిఘటిస్తున్నట్టుగా గాల్లోకి చేతులు మాత్రం ఆడిస్తున్నాడు. అక్కడితో ఆగలేదు వసంతక్క. గోలగోలగా ఏడుస్తున్న వాడి పెళ్లాం చేతికి తన చేతిలోని చెప్పు యిచ్చింది. తాను వాడి జుట్టుపట్టుకుని నిలేసి.. పెళ్లాంతో వాడి దవడలు వాయగొట్టించింది. చుట్టూ జనం గోలగోలగా అరుస్తున్నారు. ఆ పెళ్లాం కూడా ఏడుస్తూనే ఉంది. వసంతక్క వాడి జుత్తు తన పిడికిట్లోంచి విడిచి పెట్టిందో లేదో.. వాడు క్షణాల్లో అక్కడినుంచి పరారైపోయాడు.
నాకు మాత్రం కనుల పండుగైన దృశ్యం. కుక్క మనిషిని కరిస్తే కాదు, మనిషి కుక్కని కరిస్తే కదా వార్త. మొగుడు పెళ్లాన్ని కొడితే మజా ఏముంది.. పెళ్లాం మొగుడిని– చెప్పుతో– రోడ్డుమీద– నలుగురి ఎదుట– చితకబాదడం కదా వార్త! పైగా, చెంపకు చెప్పు పరంబగునప్పుడు.. అద్భుతమైన ఫోటోలు చిక్కాయి నా కెమెరాకు.
ఆ సీన్ ముగిసిపోయింది.
ఫోటో రీలు ఆఫీసుకు పంపించేసి.. వార్త చాలా డీటెయిల్డుగా రాసి పంపేశాను. ఇంత జరిగిన తర్వాత నేను అద్దవలసిన అవసరమేముంది.. అందులోనే బోలెడంత మసాలా ఉంది! మా డెస్కు ఇన్చార్జి నాకంటె మంచి మసాలా ప్రియుడు.. ఇలాంటి చాన్సు మిస్ చేసుకోడు. ‘కిరాతక భర్త దౌష్ట్యంపై చెప్పు తీసిన బస్తీ సబల’ అని హెడింగ్ పెట్టి.. జిల్లా ఎడిషన్ ఫస్ట్ పేజీలో బ్యానర్ వార్తలాగా పెట్టేశాడు. మొగుణ్ని పెళ్లాం చెప్పుతో కొడుతున్న అద్భుతమైన ఫోటోలతో. వాటికింది నేను రాసిన క్యాప్షన్ లతో! ఇలాంటి మహిళల్ని కాపాడడానికి తాను జీవితమంతా పోరాడతానని వసంతక్క చెబుతున్నట్టుగా చిన్న ఇంటర్వ్యూతో సహా! మరునాడు తెల్లార్తో పేపర్లో చూస్కోగానే.. ‘అద్దిరిపోయింది’ అనుకున్నాన్నేను.
వసంతక్క ఫోను చేసి ఎంత మురిసిపోయిందో చెప్పలేను. ఓసారి లంచ్ కు కలుద్దాం శీనూ అంది. డిన్నర్ టైమింగ్స్ నాకు కుదరవని, ఆమె లంచ్ కే పిలుస్తుంటుంది. ఇంత మైలేజీ ఇచ్చాను గనుక.. ఈసారి వసంతక్కతో లంచ్ మీటింగ్ లాభసాటిగానే ఉంటుందనీ నాకు తెలుసు. అలాగేనన్నాను. ఆరోజంతా అదే ఉత్సాహంలో ఉన్నాను. చాలా మంది ఫోన్లు చేశారు.. భలే పట్టుకున్నావ్ గురూ న్యూసు, భలే రాశావు.. అంటూ!
ఆ రాత్రి వార్తల ఫీడింగ్ అంతా అయిపోయింది. ఇక లేచి ఆఫీసు మూసేసి ఇంటికెళ్దాం అని ప్రిపేర్ అవుతున్నాను. వెళ్లేముందు స్టేషనుకు ఫోనుచేసి ఏమైనా విశేషాలున్నాయా అని అడగడం అలవాటు. అందుకోబోతుండగా.. ఫోనే మోగింది. అవతలి నుంచి ఎస్సై. ‘‘వందేళ్లు మీకు.. చెప్పండి ఏంటి విశేషాలు..’’ అన్నాను. ‘‘ఓ సూసైడ్ కేసుంది. ఒకడు విషం తాగి చచ్చిపోయాడు. వసంతమ్మ నిన్న వెళ్లి రచ్చ చేసింది కదా.. వాడే. నిన్న రాత్రి వసంతమ్మతో నువ్వు కూడా వెళ్లినట్టున్నావు కదా..’’ అన్నాడు. ‘‘అవును పేపర్లో చూసుంటారుగా.. ఫస్ట్ పేజీలో బ్లాస్ట్ చేశాం. వసంతమ్మ చెప్పుతో కొడుతూ ఉండగానే పారిపోయాడు. ఇప్పుడు చచ్చేపోయాడా’’ నవ్వుతూ అడిగాను. ‘‘ఆ అవును.. అప్పుడు పారిపోవడమే.. ఇప్పుడే ఇంటికి తిరిగొచ్చాడు. వాకిట్లోకి వచ్చి గడపమీద కూర్చుని చచ్చాడు. అప్పటికే ఎక్కడో చాలా విషం తాగేసే వచ్చాడు’’ చెప్పాడు ఎస్సై.
ఆత్మహత్యలు నాకు కొత్త కాదు. కానీ ఎందుకో ఒక్క క్షణం సైలెంట్ అయిపోయాను. తేరుకుని, ‘‘పోన్లే తగిన శాస్తే జరిగింది వెధవకి. ఆ పెళ్లామైనా సుఖపడుతుంది’’ అన్నాను.
‘‘అంత ఈజీగా తీసుకోకు బాసూ. ఆ పెళ్లాం ఇప్పుడు నానా శోకాలు పెడుతోంది. మొగుడూ పెళ్లాలం అన్నాక కొట్టుకోకుండా తిట్టుకోకుండా ఉంటామా.. యీళ్లొచ్చి నా మొగుడిని మింగేసినారమ్మా– అని ఏడుస్తోంది. వసంతమ్మ మీద కేసు కడుతున్నాం. నువ్వు కూడా సాక్షిగా రావాల్సి ఉంటుంది’’ చెప్పాడు ఎస్సై.
అవును కేసు తప్పకుండా అవుతుంది. వసంతక్క ప్రతిపక్షం నాయకురాలు. రూలింగ్ లో ఉన్నవాళ్లు ఈ చాన్స్ వదలుకోరు. పైగా ‘మహిళలకు రక్షణ ఇవ్వని ప్రభుత్వంలో ఇలాంటి అన్యాయాలు జరుగుతున్నా’యని రాత్రి.. మొగుణ్ని తరిమేశాక అక్కడ చిన్న లెక్చరు కూడా ఇచ్చింది.. అందరి ముందు!
‘‘దాన్దేముంది వస్తాన్లే’’ అన్నాను.
‘‘ఇంకో సంగతి చెప్పాలి– ఆ చచ్చిన వాడి జేబులో ఒక సూసైడ్ నోట్ ఉంది..’’
..అసలు బాంబు అప్పుడు పేల్చాడు ఎస్సై. వీడు ఎస్సై కావడానికి సైకాలజీని, సైకో థ్రిల్లర్ నవలల్నీ కూడా కలిపి చదువుకున్నాడేమో నాకు తెలియదు. సంగతి అంతా చెప్పి.. నేను పూర్తిగా రిలాక్స్ అయ్యాక అసలు బాంబు పేల్చాడు. వణికిపోయాన్నేను. జనవరి నెల రాత్రి పదిగంటల వేళ చలి! వింటోంటే నాకు నుదుటన చెమటలు పడుతున్నాయి!!
‘‘పేపర్లో ఫోటోల్తో సహా అంత పెద్దగా వేసినాక.. బతకడం వేస్టనిపిస్తోంది– అని రాశాడందులో’’ చెబుతున్నాడు ఎస్సై. ఆ బాంబుల మోతకి నా చెవులు పేలిపోతున్నాయి.
‘‘గురూ’’ అన్నాను అతికష్టమ్మీద. నా గొంతులో వణుకు నాకే తెలుస్తోంది. ‘‘చించి పారేయ్ గురూ.. ప్లీజ్’’ అనగలిగాను.
‘‘చించేశాన్లే. ఇలాంటివి మనకు ఇంకొకరు చెప్పాలా?’’ ఎస్సై గొంతులో కొంటెతనం ఉందా? ఏమో! కానీ మా ఇద్దరి మధ్య ఇలాంటి సర్దుబాట్లు చెప్పకుండానే చేసుకుపోయేంత అండర్ స్టాండింగ్ ఉంది.
‘‘థాంక్స్ గురూ..’’ అన్నాను తేరుకుని!
ఇంకోరకంగా చెప్పాలంటే ఈ కేసుల భయం అంతపెద్దదేం కాదు. ఈ ఎస్ఐ ఇక్కడ కలకాలం ఉండబోయేదీ లేదు. కేసులు పడినా.. అవి మనల్ని చేయగలిగేదీ ఏమీ ఉండదు. అంతగా కావలిస్తే మేనేజిమెంటు చూస్కుంటుంది.
కానీ.. నాకే, బాగా లోపల.. ఏదో ముల్లు కెలుకుతున్నట్టుగా ఉంది.
* * *
ఎన్ని అందమైన ఆత్మహత్యల వార్తలు రాసి ఉంటాను నేను. ఎన్ని చావుల వార్తలను అందమైన హెడింగులతో జనరంజకంగా అందించి ఉంటాను. లెక్కేలేదు!
ఓ ఏడాది పసిపాప ఆడుకుంటూ నీళ్ల డ్రమ్ములో పడిపోయి, ఇంట్లో గమనించకపోవడం వల్ల అలాగే చచ్చిపోతే.. ‘పీపాలో పాప’ అని హెడింగు పెడితే ఎంతో మంది శెభాష్ అన్నారు.
పెళ్లయిన నాలుగోరోజున వధువు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంటే.. పెళ్లినాడుకట్టుకున్న పసుపుచీరలో ఉండే ఫోటో కూడా సంపాదించి.. ‘చెల్లీ.. వెళ్లిపోయావా తల్లడిల్లి’ అని రాశాను.. నన్ను ఆకాశానికెత్తారు.
ప్రతి చావులో నాకు కవితాత్మకమైన అందం కనిపించేది. అలాంటి కవితాత్మక కోణం దొరికేవరకు నేను ఆ చావు గురించి శోధించేవాడిని. అంత శ్రద్ధ ఉన్నవాడిని కాబట్టే అంత గొప్పగా రాయగలిగాను. మీకో సంగతి చెప్పనా..?
నేను చావుల వార్తలు, మరీ స్పెషల్‌గా ఆ చావుల వెనుక ఉండే రహస్యాలతో కళ్లు చెమర్చేలా హ్యూమన్ ఇంటరెస్టింగ్ కథనాలు రాసేసిన తరువాత.. ఆ పాత్రలు ఆ రాత్రుల్లో నా కలల్లోకి వచ్చేవి. నాకు థాంక్స్ చెప్పేవి. ఏడ్చేవి. నాకు రుణపడి ఉంటాం అని చెప్పుకునేవి.
కానీ వీడేంటి? ఇంటిగడప మీద కూర్చుని విషం తాగి చచ్చిన వాడు, నా కల్లోకి కాదు కళ్లెదుటకి వచ్చేస్తున్నాడు! చాలా రోజుల నుంచీ! కళ్లు తెరచుకుని ఉన్నా కూడా కనిపిస్తున్నాడు నన్ను ప్రశ్నిస్తున్నాడు. నిలదీస్తున్నాడు. లెక్క సరిచేయాల్సిన అవసరం ఉందంటున్నాడు! లెక్క సరిచేయాల్సిందేనా? నేను కూడా ఒక వార్తగా మారితే తప్ప లెక్క సరిఅయ్యే అవకాశం లేదా?
రేపు– నన్ను– వార్తగా ఎవరు తీర్చిదిద్దుతారు?
ఇప్పుడు నాకున్న టెన్షనెల్లా ఒక్కటే!
వాళ్లకు, నా అంత అందంగా రాయడం వస్తుందో రాదో కదా?
‘అయిదు డబ్ల్యూలు ఒక హెచ్’ నియమం పాటిస్తారో లేదో కదా?
‘ఏమిటి’ అనేది రేపటికి అందరికీ తెలుస్తుంది. ‘ఎక్కడ’ కూడా ఆటోమేటిగ్గా తెలుస్తుంది. ‘ఎప్పుడు’ అనేది ఎగ్జాక్ట్‌గా కావాలంటే అటాప్సీ తర్వాత డాక్టరు చెబుతాడు. ‘ఎలా’ అనేది కూడా దాచగలగడం కష్టం.. బయటపడిపోతుంది. ‘ఎవరు’ అనేది.. శ్రీమాన్ నేనే!! ఇక మిగిలిందెల్లా– ‘ఎందుకు?’ మాత్రమే.
ఆ విషయం నేను చెప్పను. వారికి తెలియదు. ఆ పరిస్థితుల్లో ఏం జరుగుతుంది? నేనైతే ఏం చేసేవాడిని? వారైనా అదే చేస్తారు. నా చుట్టూ ఒక కథ అల్లుతారు. ఎలాంటి కథ?
విఫలమైనాననే నెపం నాపై పెట్టి, ఒక ప్రేమకథ అల్లుతారా?
అప్పుల బాధలు పెరిగిపోయాయని, ఒత్తిడి తాళలేకపోయానంటారా?
వ్యసనాలకు లోబడి, డ్రగ్స్ దొరక్క ఇలా చేశానంటారా?
అవినీతికి పాల్పడి.. నా బాగోతం బయటపడిపోయేప్పుడు.. ‘పరువుకోసం’ అనేస్తారా?
నామీద దుర్మార్గులు కక్ష కట్టి– కడతేర్చారని రాస్తారా? ఇదేదో వీరమరణం ముసుగు!
నిజం వాళ్లకు తెలియదు– నేను చెప్పను. వారు అల్లే కథలను చూసి నవ్వుకుంటాను. ఒంటరిగా కాదు. వాడితో కలిసి. జంటగా నవ్వుకుంటాము.
ఇవాళ్టిదాకా కళ్ల ఎదుట కనిపించినప్పుడెల్లా.. వాడి బ్యాక్ గ్రౌండ్ లో సీన్ మొత్తం కనిపిస్తూ ఉండేది నాకు. ప్రతిసారీ డిఫరెంట్‌గా!
ఒక నిర్జనమైన ప్రదేశం. ఒక్కోసారి దట్టమైన అడవి. ఒక్కోసారి పాడుపడిన బూత్ బంగ్లా. ఎదురుగా ఒక చీప్ లిక్కర్ సీసా, నీళ్ల ప్యాకెట్లు, ఇండ్రిను డబ్బా, ప్లాస్టిక్ గ్లాసు! వాటి పక్కగా పరచిపెట్టి ఉంటుంది.. నేను రాసిన అయిదు కాలాల వార్త ఉన్న పత్రిక! దానికేసి చూస్తుంటాడు. ‘తాగుబోతు మగమృగం.. చెప్పుదెబ్బల పలహారం’ అనే నా ముద్ర గల ఫోటో క్యాప్షన్ కనిపిస్తుంది. దానికేసి భావరహితంగా చూస్తూ.. ‘నువ్వే కదా’ అంటాడు. ‘అవును’ అంటాను కించిత్ గర్వంగా! ఆ క్యాప్షన్‌లోని అందంపట్ల ఉండే గర్వం అది! ప్లాస్టికు గ్లాసులోకి చీప్ లిక్కరు వంచి, పళ్లతో నీళ్ల ప్యాకెట్ చించి అందులోకి వంపుతూ.. వాడు మాట్లాడ్డం ప్రారంభిస్తాడు..!
‘ఇవాళ చెప్పుదెబ్బల పర్వం రాశావు నువ్వు. నా పెండ్లం నన్ను ఎన్నిసార్లు చీపురుతో కొట్టిందో నీకు తెలియదు. మా మధ్య ఎన్నో జరుగుతాయి.. అయినా, అది నా దిల్ కా టుకడా రా!’
అదేమిటి.. ఏకవచనం వాడుతోంటే ఏదో లేమ్యాన్ కదా అని ఊరుకున్నాను. ‘రా’ సంబోధనలోకి దిగేశాడు! నాకు మండుతుంది. వాడు పట్టించుకోడు.
‘ఒరేయ్.. నేను తాగేవాడిని.. ఒక్కోసారి నా పెళ్లాన్ని ఒక దెబ్బ కొట్టేవాణ్ని. ప్రతిసారీ అది నన్ను చీపురు విరిగేదాకా చితక్కొట్టేది. ఆ ఒక్కదెబ్బతో దానిని హింసించాలనీ కాదు. చీపురు తిరగేయడంలో నన్ను అవమానించాలనీ కాదు. నాది బలహీనత.. దానిది నన్ను బాగు చెయ్యాలనే ఆశ. నేనంటే దానికి లవ్వురా. అదంటే నాకు అంతకంటె జాస్తి. ఈ కొట్టుకోవడం అనేది– మాకు లవ్వుకూ లవ్వుకూ మధ్య అప్పుడప్పుడూ నడిచే గలీజు ఆట! ఆట తర్వాత మళ్లీ లవ్వే! పెళ్లయిన దగ్గరినుంచీ తాగినప్పుడు తప్ప ఎంత ప్రేమగా బతికేవాళ్లం రా మేం. నిజానికి మా మధ్య ఉండేది అదే. ఎందుకలా జరిగేదో తెలుసా?’ ఆగి, మొరటుగా మురికిగా ఉన్న తన వేళ్లు, ఆ క్షణంలో బిగుసుకుని ఆ ప్లాస్టికు గ్లాసు నలగకుండా, అందులోని ద్రవం తొణకకుండా జాగ్రత్తగా ఎత్తుకుని సగం ఖాళీ చేస్తాడు. వాడి లవ్వు గొడవ నాకెలా తెలుస్తుంది. నా సమాధానం కోసం చూడడం లేదన్నట్టుగా, ఘాటు చాలలేదన్నట్టుగా గ్లాసులోకి సీసాలోంచి కొంచెం వంపుకుంటూ మళ్లీ చెబుతాడు.
‘ఎందుకంటే.. ప్రతిసారీ ఆ గలీజు ఆట కొంప లోపలే జరిగేది. తలుపుకి ఎనకాల! వొరేయ్.. నువ్వూ అదీ కలిసి దాన్ని యీదిలోకి తెచ్చినారు. నువ్వు అంతటితో ఊరుకున్నావా.. మా బతుకుని యిట్టా పరిచిపెట్టి ప్రపంచానికి చూపించినావు..’
ఒక్కసారిగా రౌద్రంగా మారుతున్న స్వరంతో ఆ పత్రికని రెండు చేతులతో తెరచి నా కళ్ల మీదికి తెస్తాడు. ‘గుట్టుగా పోయే బతుకుల్ని రచ్చకీడ్చినావు కదరా లమ్డీకే..’ ఉరుముతున్నట్టుగా ఉంటాడు. క్షణంలో తగ్గుతాడు.
వాడి ఒక చేతిలో నా పత్రిక.. నేను ప్రపంచానికి పరచిచూపించిన అందం.. నలుగుతూ ఉంటుంది. రెండో చేత్తో ఖాళీ అయిన గ్లాసులోకి సీసాలోంచి సగం వొంపుకుంటాడు. నీళ్ల ప్యాకెట్ అక్కడే పడి ఉంటుంది. డబ్బా మూత తీసి మిగిలిన సగానికీ నింపుకుంటాడు. చీర్స్ చెబుతున్నట్టుగా నాకేసి గ్లాసు గాల్లోకి ఎత్తి.. ‘రేపట్నుంచి నా పిచ్చిముండ ఎలా బతకతాది రా’ అంటాడు. గ్లాసు నోటికి కరచుకుని గటగటగట తాగేస్తాడు. లేచి నిల్చుని వాటిని కాలితో తన్ని, అడుగులు వేస్తాడు.
వాడి చేతిలో నలుగుతున్న నా పత్రిక.
రెండో రోజు రాత్రి పోలీసులు స్పాట్ కు వెళ్లినప్పుడు, వాడి చేతిలో గమనించి.. లాగేసుకుని, నోట్ తో పాటు చించేసిన పత్రిక! వాడి వేలిముద్రలున్న ఆ పత్రికను కూడా ఎవిడెన్సు కింద పెట్టకుండా చించేశానని ఎస్సై చెప్పాడు నాతో– నవ్వుతూ!
నిజమే. నన్ను వణికించిన ఆత్మహత్య నోట్ కంటె గట్టి ఎవిడెన్స్ అవుతుంది ఇది, బయటకొస్తే!
కేసుల చింత లేదు గానీ.. ప్రతి రోజూ నన్ను మెలిపెడుతున్న వాడి ప్రశ్నలకు ఏం సమాధానం చెప్పను?
ఆత్మసాక్షి– జడ్జి పాత్ర పోషిస్తే కేసులు అవసరం లేదు. నా దగ్గర డిఫెన్సు వాదన కూడా లేదు! ఏమిటి తరణోపాయం?
వాడు నా ఎదుట నిల్చున్న ప్రతిసారీ బ్యాక్ గ్రౌండ్ లో ఇదే సీన్ నడుస్తుంది. ‘లెక్క సరి కావాలి కదా’ అంటాడు.
ఇవాళ్టిదాకా ఎంత మధనపెట్టాడు నన్ను. రేపు ప్రశంసాపూర్వకంగా చూస్తాడు.
కళ్లెదురుగా నిల్చుని, లెక్క సరిచేయాలని డిమాండ్ చేస్తున్న ‘వాడు’ రేపు నా సరసకు వచ్చేస్తాడు. నేనే వాడి సహచరుడిని అయిపోతాను. నేను వాడికి అనుగామిని.
*
Add comment