సూడో హిస్టరీ ఒక కుట్ర

కేరాఫ్ బావర్చీ కథలతో రచయితగా తెలుగు పాఠకులకు పరిచయం అయిన ఆర్టిస్ట్, కార్టూనిస్ట్ చరణ్ పరిమికి  తన కథలగురించీ, కథలు రాయటంలో తన దృక్పథం గురించీ చాలా నిక్కచ్చితమైన అభిప్రాయాలున్నాయి.   కొత్త తరానికి చెప్పాల్సిన విషయాలని వాళ్లకి అందే భాషలో, చెప్పాల్సిన తీరులో కథలు రాస్తున్న ఈ తరం రచయితగా తన కొత్త కథల పుస్తకం “బొంబాయి పొట్టేలు”  సందర్బంలో ఇవీ చరణ్ ఆలోచనలు కొన్ని:

కేరాఫ్ బావర్చీలో కథలన్నీ చిత్రకారుడి కోణంలోని ప్రపంచాన్ని చూపితే, ఈ కథలు అస్తిత్వవాద దృక్పథంతో సాగుతాయి. ఈ తేడా ఎలా వచ్చింది? పాఠకులు దీన్ని ఎలా రిసీవ్ తీసుకుంటారని మీ అభిప్రాయం.

# తేడా కొత్తగా ఏమీ రాలేదు. ముందు నుంచి ఉన్నదే. నా మొదటి కథ శుద్ధి కులవివక్ష మీద రాసిందే. ఎప్పటికప్పుడు నాకు ఎదురైన ప్రశ్నలు, తార్కిక  కోణాలన్నీ కథలుగా చేస్తూ వచ్చాను. అవన్నీ ఇప్పుడు తీసుకొస్తున్నా, అంతే. మొదటి పుస్తకం చూసిన వాళ్లకు ఇది కాస్త ఆశ్చర్యం కలిగించవచ్చు. అవి అదోరకం కథలు అన్నవాళ్ళు ఉన్నారు. మనసుకు హత్తుకున్న వాళ్లూ ఉన్నారు.

బొంబాయి పొట్టేలులో డిఫరెంట్ టైప్ ఆఫ్ జానర్స్ లో రాశాను. కాబట్టి మరింత వైవిధ్యం ఉంది. వాస్తవాలు చెప్పినప్పుడు కాస్త ఆశ్చర్యంగా అయినా సరే దగ్గరికి తీసుకుంటారు. పైగా ఈ మధ్యకాలంలో కొత్త పాఠకులు కూడా పెరుగుతున్నారు కాబట్టి రీచ్ కూడా బాగా ఉంటుంది అనుకుంటున్నా.

దళిత సాహిత్యంలో ఇప్పటికి అనేక కథా సంపుటాలు వచ్చాయి. వాటితో పోలిస్తే ‘బొంబాయి పొట్టేలు’ ఎలా భిన్నంగా ఉంటుంది?

# నేనైతే దీన్ని సమానత్వ సాహిత్యం అంటాను. ఈ సమాధానాన్ని ఇంకాస్త విస్తరించొచ్చు కానీ ఇప్పుడు కాదు. ఇక బొంబాయి పొట్టేలు కచ్చితంగా భిన్నమైనదే. ఇందులో కొన్ని న్యూజెన్ కథలు ఉన్నాయి. అంటే 21 వ  సెంచరీలో ప్రపంచం ఎంతో మారిన తర్వాత కులవివక్ష కూడా తన రూపురేఖలు మార్చుకుంది. అది ఎలా ఉంటుందో చూడొచ్చు. అలాగే కాలగర్భంలో కలిసిపోయిన సామాన్యుల చారిత్రక కథలు. అలాగే నాకు నచ్చిన మ్యాజిక్ రియలిజంలో కథలు రాశాను. అవన్నీ వేరే అనుభవాల్ని  ఇస్తాయి. ముఖ్యంగా ఏ వివక్షకైనా మూలం ఏంటి! దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? అనే తాత్విక కోణాలు, తర్కవాదంతో చర్చించాను. కాబట్టి ఇది భిన్నమైనదే.

‘అరణ్యకాండ’ అనే కథలో అస్తిత్వవాద అంశం లేదు. అదొక సస్పెన్స్ థ్రిల్లర్లా సాగుతుంది. ఆ కథను ఇందులో ఎలా చేర్చారు?

# ఏ వివక్షైనా, అణచివేత అయిన పుట్టేది నమ్మిన విశ్వాసాల గుండానే, ఆ కథలో దాన్నే చెప్పాను. అందులో శివకాశి పాత్రను ఆ ఊర్లో ఉన్న జనాలు అర్థం చేసుకోవడంలో ఎక్కడ పొరపాటు జరిగి ఉంటుంది. దానికి కారణం ఏమిటి? పైన చెప్పినట్టు అనేక డైమెన్షన్స్ లో మూలాలను అర్థం చేయించే ప్రయత్నం. కాకపోతే అది రాసిన పద్ధతి థ్రిల్లర్ లా ఉంటుంది.

ఎస్సీ వర్గీకరణ అంశం విస్తృత చర్చలో ఉన్న సమయంలో ‘కూడలి వైపు’ అనే కథలో ఒకే వర్గంలోని రెండు కులాల గురించి కథ రాశారు. ఆ కథ నేపథ్యం చెప్పండి.

# ఈ కథ రాసినప్పుడు ఈ ప్రశ్న వస్తుందేమో అని ఎదురు చూశాను. రాలేదు. కానీ మీ నుంచి రావడం సంతోషం. ఊర్లో నా క్లోజ్ ఫ్రెండ్ సుధీర్ అని, మరో కామన్ ఫ్రెండ్ కి ఇలా పెళ్లి చేశాడు. దాని వెనుక కారణాలు విశ్లేషించినప్పుడు నాకు దొరికిన సమాధానాలు ఈ కథ. దళితుల్లో కూడా కులపిచ్చ దండిగా ఉంది అన్నది ఒప్పుకొని తీరాలి. దాన్ని దాటకుండా మనం అస్తిత్వవాదము. అంబేద్కరిజం అని పిడికిల్లు బిగిస్తే లాభం లేదు.

దళిత జీవితాన్ని మీ కథల్లో ఏ మేరకు ఆవిష్కరించారని అనుకుంటున్నారు? ఇంకా రాయాల్సిన అంశాలున్నాయా?

# కొంతవరకే అని చెప్పగలను. ఎందుకంటే నా అనుభవాలు, నా చుట్టూ ఉన్న మారుతున్న దళిత జీవితాల్లో నుంచి పుట్టిన కథలు ఇవి. మా ఊర్లో మా నాన్నది మొదటి ఫోటో స్టూడియో. అందువల్లేమో సమాజంలో తగినంత గౌరవాన్ని పొందుతూ అందరితో మమేకం అయ్యే పరిస్థితి ఆయనకు ఉంది. కానీ విచిత్రంగా నాకు అలా జరగలేదు. ఆయన 90లలో వివక్ష చూడలేదు. కానీ నేను 2010లో వివక్ష చూశానంటే ఎంత ఆశ్చర్యం. చిన్నపుడు సమ్మర్లో మా కాలనీలో కొళాయి నీళ్ల కోసం పై కాలనీ వాళ్ళు వస్తారు. ఒకరోజు బిందె నిండిందని మా అమ్మ దాన్ని పక్కకు తీసినందుకు, ఆ నీళ్లన్నీ పారబోసి మళ్లీ పట్టుకున్నారట. నీళ్లు మన దగ్గరవి అయినా వివక్ష మనకే అన్నది గమ్మత్తుగా లేదు. చెప్పాలంటే కులపిచ్చ రాను రాను పెరుగుతుంది. కాబట్టి రాయాల్సిన కథలు చాలానే ఉన్నాయి.

‘మల్లదాసు’ కథను చారిత్రక నేపథ్యంతో రాశారు. అందులో వైదిక, బౌద్ధ మతాల మధ్య జరిగిన దాడుల గురించి రాశారు. ఈ కథ ఇప్పటి కాలానికి ఏ మేరకు అవసరం? మీ కథ వల్ల గొడవలు మరింత పెరిగే అవకాశం లేదా?

# ఇప్పుడు గొడవలు జరుగుతుంది నిజాలు తెలియడం వల్ల కాదు. ఉన్న నిజాలను కప్పిపుచడం కోసం. మా ఊరికి సరిగ్గా 28 కిలోమీటర్ల దూరంలో చందవరం బౌద్ధక్షేత్రం ఉంది. ఇంత గొప్పగా విలసిల్లినది ఎందుకు నాశనమైంది అని వెతికిన క్రమంలో నాకు దొరికిన ఆధారాలతో మల్లదాసు కథ రాశాను. అది చెప్పడానికి మనదైన సన్నివేశ కల్పన, ఇమేజేనేషన్ తప్పదు. ఈ కథ నాలో రెండేళ్ల పాటు నలిగింది. దీని కోసమే ఆ కొండకు వెళ్లి చూసి వచ్చాను.

ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ప్రతి మతానికి మరో మతంతో లడాయి ఉంది. కథలో మనం ఏమీ కల్పించడం లేదు. చరిత్రలో ఉన్నదే కాబట్టి చదివిన వాళ్ళు తెలుసుకుంటారు. మతం గొప్పలు చాటుకునే సంస్కృతి ఈ మధ్యకాలంలో పెరిగింది. అందుకోసం సోషల్ మీడియాలో కొందరు సూడో హిస్టరీని క్రియేట్ చేస్తున్నారు. వీళ్ళ ఉద్దేశం మిలీనియం జనరేషన్ కి చారిత్రక వాస్తవాలు తెలియకూడదనే. వాళ్లకు ఇలాంటి కథలు సాహిత్యం ద్వారా తెలియాలి. అప్పుడే తరవాతి తరంలో  ఆలోచన తీరు కాస్త రేషనల్ గా ఉంటుంది.

కథ రాయాలనుకున్నప్పుడు ఏ ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటారు? ముగింపు ముందే అనుకుంటారా? కథ రాస్తున్నప్పుడే ఆలోచిస్తారా?

# ఏదైనా కొత్తరకం సంఘర్షణ  నన్ను కదిలిస్తే  దాన్ని కథగా చేయాలి అనిపిస్తుంది. కొన్నిసార్లు మనలో తలెత్తే ప్రశ్నలకు సమాధానాలు వెతికే క్రమంలో కథ పుడుతుంది. కథనం విషయంలో ఆసక్తికరంగా చెబుతున్నానా లేదా అనేది మాత్రం చూసుకుంటాను. అలాగే ముగింపు ఆలోచించాకే మొదలుపెడతాను. ఒక్కోసారి కథ రాస్తూ వెళ్లాక ఎప్పుడో వస్తుంది. ముగింపు ముందే ఊహించి రాయడం నాకు కంఫర్ట్. గమ్యం తెలిసినప్పుడు ప్రయాణం నేరుగా అటే వెళుతుంది.

థాంక్యూ.

*

నరేష్కుమార్ సూఫీ

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు