ఫంక్షన్ హాలులో విజ్జుగాడిని వెతుకుతున్నాను. ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళినవాడు ఎంతకీ రాలేదు. వాడి కోసం అటూ ఇటూ పరికించి చూస్తూ తిరుగుతున్నాను. ఇంతలో నవ్వొకటి లీలగా గాలిలో తేలుతూ నన్ను మృదువుగా తాకింది. అదే నవ్వు, నన్ను కట్టిపడేసి గిరికీలు కొట్టించిన నవ్వు, కుక్కపిల్లలా వెంట తిప్పుకున్న అదే నవ్వు. ఆ నవ్వు వినిపిస్తున్న వైపుకి కాళ్ళు నేను చెప్పకుండానే లాక్కుపోయాయి. కిటికీలోంచి కనిపిస్తున్న నవ్వుతున్న సుహాసిని రూపాన్ని చూస్తూ నేను చిత్తరువయ్యాను.
*
నన్ను అందరూ సూపర్ స్టార్ కృష్ణ అనేవారు కాలేజీ రోజుల్లో కాబట్టి కథలో నా పేరు కృష్ణ అనేసుకుందాం.
ఇక సుహాసిని పేరు గురించి చెప్పాలంటే ఎప్పుడూ చక్కగా నవ్వుతూ ఉంటుందని కాలేజీ మొత్తం ఆమెకు ఆ పేరు పెట్టేసారు. ఎవరైనా తిట్టినా నవ్వేది, పొగిడినా నవ్వేది. మేమందరం మిసమిసలాడే యవ్వనంతో మిడిసిపడే రోజులవి. అల్లరల్లరిగా రికామీగా తిరిగేస్తూ బ్రతుకు భయం రుచి ఏ మాత్రం తెలియని క్షణాలవి. నేను కృష్ణలాగా అందగాడిని కాబట్టి చాలా మంది ఆడపిల్లలు నా చుట్టూ బొంగరాల్లా తిరిగేవారు. కొంత మంది ఓరచూపులు చూసేవారు. నాతో డ్రీమ్ సాంగులు పాడుకునే వారేమో నాకు తెలీదు.
ఇంత మంది అమ్మాయిలు నా చుట్టూ తిరుగుతున్నా ఏమీ అనిపించలేదు కానీ కొన్నాళ్ళకు నేను సుహాసిని నవ్వుతో ప్రేమలో పడిపోయాను. ఆమె నవ్వుతుంటే బుగ్గలకు అందంగా సొట్టలు పడేవి. వాటిని చూస్తుంటే నేను ఆ సొట్టల్లో చిక్కుకుని ఏవో స్వర్గలోకాలలో విహరిస్తున్నట్టుండేది. ఎవరేనా చూస్తున్నారేమో, ఏమైనా అనుకుంటారేమో అని కూడా చూడకుండా నా చూపులు సుహాసిని వెన్నంటే తిరిగేవి. కాలేజీలో ఎవరి గొడవలో వాళ్ళుంటారు కాబట్టి నన్ను ఎవరూ గమనించలేదని నాకనిపించేది.
అలా ఆమె నవ్వుల నావలో తిరిగేస్తూ నునుపైన మెరిసే ఆమె బుగ్గలు చూస్తూ నా లోకంలో నేనుండేవాడిని.
రాజుగాడివి డేగచూపులు. ఇలాంటివి ఇట్టే పసిగట్టేస్తాడు.
“ఏరా, సుహాసినితో పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టున్నావు?” అని ఒక రోజు అమాంతం నిలదీసాడు.
“ అబ్బే అలాంటిదేమీ లేదులేరా” అని సిగ్గుపడుతూ నసిగాను.
“ఊరుకోరా నీ చూపులు గమనిస్తే మూలనున్న ముసలమ్మ కూడా ఇట్టే విషయం గ్రహించగలదు”
అన్నాడు కొంటెగా.
నేను తలొంచుకుని నాకే వినబడకుండా ఏదో గొణిగాను. వాడు ఊరుకుంటాడా, అసలే వాడి నోట్లో నువ్వు గింజ నానదు. వెళ్ళి విజ్జుగాడి చెవిలో ఈ విషయం ఊదినట్టున్నాడు. ఇక అక్కడ నుండి విజ్జుగాడు సుహాసినికి విషయం చెప్పేయమని నా చెవిలో జోరీగలా సొద పెట్టడం మొదలుపెట్టాడు. నేను అసలే కాస్త సిగ్గరిని. అటువంటిది సుహాసిని ముందు నోరు విప్పి మాట్లాడడమే, ఇంకేమైనా ఉందా!
అనుకోకుండా ఒక రోజు నాకు అలాంటి అవకాశం వచ్చింది. ఆ రోజు విపరీతమైన వాన. సరిగ్గా నేను కాలేజీకి రావడం రావడంతో మొదలైంది. ఎంతకీ తెరిపివ్వట్లేదు. క్లాసులో సగం మందికి పైగా హాజరవలేదు. అందరూ లేట్ లతీఫ్ లే కనుక ఈ కుండపోత వాన చూసి కాలేజీకి ఎగనామం పెట్టి హాయిగా ఇంట్లో బజ్జుని ఉంటారు. బస్సు ఎక్కడానికి అవకాశం లేదు ఎందుకంటే బస్టాప్ కి వెళ్ళేలోగా తడిసి ముద్దైపోతాం. కాలేజీ అయిపోయాక ఇల్లు ఎలా చేరాలా అని ఆలోచిస్తుంటే బయట ఒకే ఒక ఆటో ఉంది. హమ్మయ్య అనుకుంటూ సరిగ్గా ఆటో ఎక్కబోతుంటే వచ్చింది సుహాసిని పరుగు పరుగున సగం తడిసిన చీరలో.
“ దారిలో కాస్త నన్ను ఇంట్లో దింపేయవా?” అంది.
‘సుహాసిని పక్కన కూర్చుని ప్రయాణమా, అందులోనూ ఆటోలో మేమిద్దరమే’ అని మనసులో ఎగిరి గంతేసి రమ్మన్నట్టు తలూపాను.
తను వచ్చి నా పక్కన కూర్చుంది. ఆటో అబ్బాయి శ్రద్ధగా నడుపుతున్నాడు కానీ వాన వల్ల రోడ్డు సరిగ్గా కనబడట్లేదు. దానికి తోడు విపరీతమైన కుదుపులు. సుహాసిని ఎంత దూరం జరుగుతున్నా నా వైపు జారిపోతోంది. నా పరిస్థితి కూడా అలాగే ఉంది. తను కావాలని తగులుతున్నానని ఏమైనా అనుకుంటుందేమో అని నా బెంగ.
సగానికి పైగా ప్రయాణం చేసాక వర్షం కాస్త తెరిపిచ్చింది.
నేను ధైర్యం చిక్కబెట్టుకుని తను దిగే సమయానికి నా మనసులో మాట నెమ్మదిగా చెప్పేసాను. తను అదోలా నా వైపు చూసింది. కానీ ఏమీ సమాధానం చెప్పలేదు.
తన ఇల్లు రాగానే “ధాంక్స్ ఫర్ ద లిఫ్ట్” అని చెప్పి ఆటో దిగి వడివడిగా వెళ్ళిపోయింది. అలా ఎలా ఆమెకు చెప్పగలిగానా అని ఆ తరువాత నాకే ఆశ్చర్యమేసింది. కానీ విన్నాక తను ఏమీ అనకపోవడం వింతగా అనిపించింది. బహుశా నేనలా అంటానని ఊహించలేదేమో అని నాకు నేను చెప్పుకుని సమాధానపడ్డాను. తనకి ఇలా నా మనసులో మాట చెప్పేసినట్టు ఎవరితోనూ అనలేదు. సుహాసిని కనబడితే మొహమాటంతో తప్పుకుని తిరగడం మొదలుపెట్టాను. విజ్జుగాడు ఎప్పట్లాగే తెగ నస పెడుతున్నాడు.
ఒక రోజు నేను బస్టాప్ లో ఒంటరిగా ఉన్నాను. ఆ రోజు కూడా సన్నని తుంపర పడుతోంది. సుహాసిని బస్టాప్ లోకి వచ్చి నిలబడింది. నా గుండె దడదడా కొట్టుకోవడం నాకే తెలుస్తోంది.
తను నా దగ్గరగా వచ్చినట్టు తన పాదాలను చూస్తే తెలిసింది. ఎందుకంటే తనని చూడగానే నేను మొహమాటంతో తలదించుకున్నాను
“సారీ ఆ రోజు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయాను” అంది.
“పరవాలేదు” అన్నాను.
కాసేపు ఇద్దరం మౌనంగా ఉన్నాం.
“నేను….నేను మన పక్క సెక్షన్ రవిని ప్రేమిస్తున్నాను”అంది హఠాత్తుగా.
ఆ మాట చెవిలోంచి లోపలకు ఇంకగానే నా మెదడు మొద్దుబారిపోయింది.
“నువ్వు మంచివాడివి. అర్థం చేసుకుంటావని నా నమ్మకం. అందుకే నీకు ఈ విషయం చెప్పాలనిపించింది. నువ్వు ఆశలు పెంచుకోకుండా” అంటూ నా భుజం సున్నితంగా తట్టింది. ఎలా స్పందించాలో తెలియక నేను తల అటూ ఇటూ ఊపాను. ఈ విషయం కూడా నేను ఎవరితోనూ అనలేదు. కానీ అసంకల్పితంగా రవిని గమనించడం మొదలుపెట్టాను. బహుశా క్యూరియాసిటీ వల్లో లేక నాలోనే నేను గమనించకుండా ఎదుగుతున్న అసూయగాడి వల్లో. ఈ గమనించడంలో రవి అసలేమాత్రం మంచివాడు కాదని పెద్ద మాయగాడని కొద్ది రోజుల్లోనే నాకు తెలిసిపోయింది కానీ సుహాసినికి ఈ విషయం చెప్తే ఎలా అర్థం చేసుకుంటుందో తెలీదు.
ఈ విషయాలన్నీ ఎవరికైనా చెప్తే కాలేజీ అంతా విషయం గుప్పుమంటుంది. దాని వల్ల సుహాసినికి మేలు కన్నా కీడే ఎక్కువ జరుగుతుందని నాకు తెలుసు. నాకు ఏం చెయ్యాలో అర్థం కాలేదు. కొన్నాళ్ళకు తనే తెలుసుకుంటుందిలే అని ఊరుకున్నాను కానీ నాలో నేనే ఈ విషయం తలచుకుంటూ మధనపడడం మాత్రం మానలేదు. అలాగని సుహాసిని నాకే దక్కాలనే స్వార్ధం కూడా నాలో లేదు.
కానీ మనం అనుకున్నది అనుకున్నట్టు జరిగితే అది జీవితం ఎందుకవుతుంది. నేను అసలే మాత్రం ఊహించని సంఘటన జరిగింది. చెప్తే మీరు కూడా దిగ్భ్రాంతికి గురవుతారు.
ఒక రోజు కాలేజీ నుండి బయటకు వెడుతుండగా సుహాసిని నా పక్కనే నడుస్తూ
“నీతో ఒంటరిగా మాట్లాడాలి” అంది.
‘రవికి తనకు పడట్లేదంటుందా లేక రవి మంచివాడు కాదని తెలుసుకుందా లేక వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఈమె ప్రేమ విషయం తెలిసిపోయిందా?’ నా ఆలోచనలు పరి విధాలుగా పరుగెడుతున్నాయి.
ఈ మనసుంది చూసారా, అది మామూలు కోతి కాదు. కల్లు తాగిన కోతి. దాని వీపు మీద ఒక్కటిచ్చి నోరు మూయమని ఆమె దగ్గర నోరు విప్పాను. ఫలానా చోట కలుద్దామని చెప్పాను.
తను కలిసాక ఈసారి ఏ బాంబు పేలుస్తుందో అనుకుంటూ నిశ్శబ్దంగా ఉన్నాను.
“సారీ నిన్ను బాగా ఇబ్బంది పెడుతున్నాను. కానీ నీ కన్నా నమ్మకమైన వాళ్ళు మంచివాళ్ళు నాకెవరూ కనబడలేదు” అంది ఉపోద్ఘాతంగా.
“ఏమైంది” అన్నాను ఏమనాలో తెలీక. తను నాలో ఏం మంచితనం నమ్మకం చూసిందో, అయినా ఇలా కలవడానికి, ఇబ్బంది పెడుతున్నాను అనడానికి సంబంధమేమిటో నాకు ఏ మాత్రం అర్థం కాలేదు.
“నువ్వొక సహాయం చెయ్యాలి” అంది.
“సహాయమా, నేనా… ఏమిటది” అన్నాను ఆశ్చర్యంగా.
“నేను నేను… అబార్షన్ చేయించుకోవాలి, హెల్ప్ చేస్తావా?” అంది.
నా నెత్తిన పిడుగు పడింది. ఇది నేను ఏ రకంగానూ ఊహించని విషయం. వినగానే నా చేతులు వణికాయి.
ముఖానికి అప్పటికప్పుడు పట్టిన చెమటను రుమాలు తీసి తుడుచుకున్నాను.
“ఎవరికి చెప్పినా గోలవుతుంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు” అంది తల దించుకుని.
తన ముఖంలో ఎన్నడూ చూడని టెన్షన్ కనబడింది.
అలా తనని చూస్తే చాలా జాలేసింది, బాధగా కూడా అనిపించింది.
అయినా సుహాసిని నిప్పు. తను నిత్యం నవ్వుతూ ఉండేది కానీ తన చుట్టూ ఒక కనబడని ముళ్ళకంచెని ఏర్పాటు చేసుకుంది. ఎవరూ తన దగ్గర పిచ్చిగా ప్రవర్తించడం నేను చూడలేదు. కానీ ఈ నిప్పును కూడా రవిగాడు వశపరచుకున్నాడంటే వాడెంత ఘటికుడో నాకు బోధపడింది.
ఇందులో మరొక విషయం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ ప్రేమ అనే పదార్ధం ఉంది చూసారా, అది ఎంత బలవంతులకైనా కళ్ళకు గంతలు కట్టేస్తుంది. మాయలో పడేస్తుంది. సుహాసిని కూడా ఈ ప్రేమ చదరంగంలో ఒక పావు అయింది. ప్రేమ గురించి ఈ ప్రపంచం ఎంత తెలుసుకున్నా ఇంకా ఏదో మిగిలే ఉంటుంది. ఇప్పుడు ఇవన్నీ డిస్కస్ చెయ్యకూడదు కాదు కానీ ముందు నేను చెయ్యాల్సింది చెయ్యాలి.
కాలేజీకి రెండు మూడు రోజులు సెలవులు వచ్చాయి. సుహాసినిని పక్క ఊరు హాస్పిటల్ కి రప్పించి,
రెజిస్టర్ లో నేను ఆమె బిడ్డకు తండ్రిగా సంతకం పెట్టి గుట్టుచప్పుడు కాకుండా అబార్షన్ చేయించాను. అంత ధైర్యం నాలో ఉందని నాకే ఊహకు అందలేదు. ఇది సుహాసిని మీద నాకున్న ప్రేమా, ఆరాధనా? ఏమో నాకు తెలీదు. దాని వల్ల ముందు ముందు వచ్చే సమస్యలు కూడా నా మదిలోకి చొరబడలేదు.
సుహాసిని మౌనంగా చేతులు జోడించింది. తన కళ్ళలో అప్పుడు కూడా నీళ్ళు లేవు. పెదవులపై నవ్వుందో లేదో నేను గమనించలేదు. ఆ తరువాత కూడా కాలేజీలో మేము ఇదివరకట్లాగే మెలిగేవాళ్ళం. రవి చాలా రోజులుగా కాలేజీలో కనబడలేదు. బహుశా తను గర్భవతి అని తెలిసి ముఖం చాటేసేడేమో అనుకున్నాను. ఈ రహస్యం మాత్రం మూడో కంటికి తెలియకుండా మా ఇద్దరి మధ్యలోనే ఉండిపోయింది.
కొన్నాళ్ళకు ఏం జరిగిందో, ఎలా జరిగిందో తెలీదు కానీ రవితో సుహానికికి పెళ్ళైపోయిందన్న విషయం కాలేజీలో గుప్పుమంది. తను చాలా రోజులు కాలేజీకి రాలేదు.
‘రవిగాడు అలాంటి వాడని తెలిసినా తప్పనిసరి పరిస్థితులలో చేసుకుందేమో, వాడిని ఎలా ఒప్పించిందో’
కొన్నాళ్ళు ఇవే ఆలోచనలు నన్ను విసిగించేవి.
ఆ తరువాత పరీక్షల హడావిడిలో పడి చదువులో మునిగిపోయాను. సరిగ్గా ఆఖరి పరీక్ష రోజున నాన్నకు వంట్లో బాగా లేదని కబురు తెలియడంతో ఊరుకు వెళ్ళిపోయాను.
ఆ వెనువెంటనే ఉద్యోగం రావడం జాయిన్ అవడం జరిగిపోయింది. సొంత రాష్ట్రానికి దూరంగా పోస్టింగ్ రావడంతో అడ్జస్ట్ అవడానికి సమయం పట్టింది. సుహాసిని నా ఆలోచనలలోకి అప్పుడప్పుడు నడిచి వచ్చినా, తన గురించి ఎవరిని అడగాలో తెలీక మౌనంగా ఉండిపోయాను. రవిగాడు మారిపోయి తనని బాగా చూసుకుంటే చాలు అని మనసులో అనిపించేది.
నాకు ఇంట్లో సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. వాళ్ళు చూపించిన అమ్మాయి నాకు కూడా నచ్చడంతో తాళి కట్టాను. శ్రీదేవి చాలా నెమ్మదస్తురాలు, అర్థం చేసుకుని నడుచుకునే రకం కావడంతో మా ఇద్దరి దాంపత్యం చక్కగా సాగింది. ఏదో ఒక సందర్భంలో నేను సుహాసినిని ప్రేమించిన సంగతి కూడా తనకి చెప్పాను.
“ఓహో మీకు పెళ్ళికి మునుపు మంచి ప్రేమ కథ కూడా ఉందన్నమాట” అని నవ్వింది. కానీ అబార్షన్ చేయించిన విషయం మాత్రం తనకి చెప్పలేదు ఎందుకంటే ఊహలలో కూడా ఎవరూ సుహాసినిని చెడుగా ఊహించుకోవడం నాకు ఇష్టం లేదు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టాక ఆపరేషన్ చేయించుకున్నాను. నా బిజీలో నేనుండడంతో ఫ్రెండ్స్ ఎవరినీ కలవడానికి, పలకరించడానికి నాకు అవకాశం రాలేదు.
కొన్నాళ్ళకు నా ఫోన్ నంబర్ ఎలా పట్టాడో విజ్జుగాడు ఫోన్ చేసాడు. ఆ సమయంలో ఆఫీస్ లో ఉన్నాను.
“ఎవరండీ?” అన్నాను.
“ఒరేయ్ నేనురా కృష్ణా, ఏరా ఎంత బిజీగా ఉంటే మాత్రం పాత స్నేహితులని మర్చిపోతావా. పెళ్ళికి కూడా పిలిచావు కాదు” అన్నాడు చిరుకోపంగా.
“లేదు లేరా. అమ్మకి సీరియస్ గా ఉండడంతో హడావిడిగా పెళ్ళి చేసుకోవాల్సి వచ్చింది” అన్నాను.
ఒక రోజు నేను ఉండే ఊళ్ళో ఏదో పని పడడంతో వచ్చి నన్ను కలిసాడు విజ్జుగాడు.
“ఏమిట్రా సంగతులు? మన కాలేజ్ ఫ్రండ్స్ అందరూ ఎలా ఉన్నారు?” అడిగాను.
“అందరూ బావున్నార్రా. మన రాజుగాడు ఒంగోలులో సెటిల్ అయ్యాడు. వాడికి ఒక అబ్బాయి. ఆ మధ్య అటువైపు వెళ్ళినపుడు వాడిని కూడా కలిసాలే” అన్నాడు.
సుహాసిని గురించి అడగాలని ఉంది కానీ అడగలేక పోయాను. విజ్జుగాడు వెళ్ళిపోయాక అడిగి ఉండాల్సిందని నన్ను నేను తిట్టుకున్నాను.
ఉన్నట్టుండి రాజు ఫోన్ చేసాడు. బహుశా విజ్జు నంబర్ ఇచ్చుంటాడు.
“ఎలా ఉన్నావురా? ఏంటి విజ్జుగాడు నిన్ను కలిసాడుట కదా. వాడే నీ నంబర్ ఇచ్చాడు” అన్నాడు.
“బానే ఉన్నాను రా, సారీరా నా పెళ్ళికి ఎవరినీ పిలవలేకపోయాను” అన్నాను”
“నేను కూడా నిన్ను పిలవలేదు కదరా. దానికంత ఫీలవకు” అన్నాడు.
“మనందరం ఒకసారి ఎక్కడైనా కలుద్దాంరా” అన్నాను.
“అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. మన సుహాసిని లేదూ?” అన్నాడు.
చాలా కేజువల్ గా మాట్లాడుతున్న నేను ఒక్కసారిగా ఉలికిపడ్డాను.
“ఊ” అన్నాను బలహీనంగా. ఏం చెప్పబోతున్నాడా అని మనసు ఒక్క క్షణంలోనే పరి పరి విధాలుగా పోయింది.
“వాళ్ళాయన అదే రవిగాడు ఈ మధ్య పోయాడురా. తాగుడు ఎక్కువై చచ్చిపోయాడు అన్నారు కొందరు. కానీ వాడు ఉన్నన్నాళ్ళు సుహాసినికి నరకం చూపించాడుట. తనని కలవడానికి ఒకసారి మన క్లాస్ మేట్ వసంత వాళ్ళింటికి వెళ్ళిందిట. అక్కడ పరిస్థితి చూసి అర్థం చేసుకుందిట. కానీ సుహాసిని మాత్రం ఒక్క మాట కూడా రవి గురించి చెడుగా చెప్పలేదుట”
“అవునా” అన్నాను బాధగా. సుహాసిని పట్ల నా మనసు సానుభూతితో నిండిపోయింది.
“రవి పోయినపుడు మేమందరం వెళ్ళి చూసొచ్చాం. అప్పుడు ఆ చుట్టుపక్కల వాళ్ళ వల్ల సుహాసినిని వాడు ఎంత క్షోభ పెట్టాడో తెలిసింది. అన్నట్టు తను మాత్రం ఎప్పట్లాగే అదే చిరునవ్వుతో ఉంది. చాలా గట్టిదిరా తను. ఎంత గుండెధైర్యం ఉండాలిరా అంత బాధలో కూడా అలా నవ్వడానికి” అన్నాడు.
ఏమిటో కొందరి జీవితాలు అనిపించింది.
“పిల్లలా తనకి” అడిగాను.
“ఇద్దరు ఆడపిల్లలు తనకి. పిల్లల్ని చూడడానికి, సహయపడడానికి ఇటూ అటూ ఎవరూ రాకపోవడంతో ఇంట్లోనే ఎంబ్రాయిడరీ మిషన్లు పెట్టుకుందిట. కొందరు అమ్మాయిలని జీతానికి కుదుర్చుకుని ఆ వచ్చిన రాబడితో ఇల్లు గుట్టుగా గడుపుకుంటోందిట” అన్నాడు.
అప్పుడప్పుడు నేను రాజు విజ్జు ఫోన్ లో మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒకట్రెండుసార్లు కలిసాం కూడా.
చూస్తుండగానే ఇరవైయేళ్ళు గిర్రున తిరిగాయి.
సుహాసిని పిల్లల పెళ్ళిళ్ళు చేసిందనీ, ఫ్రెండ్స్ ఏదో కాస్త సాయం పట్టారనీ తెలిసింది. రాజుగాడు అడిగితే నేను కూడా కొంత పైకం పంపాను కానీ పెళ్ళిళ్ళకు వెళ్ళడం నాకు కుదరలేదు.
రాజు కొడుకు పెళ్ళికి వీలు చూసుకుని వెళ్ళాను. దాదాపు క్లాసులో అందరూ ఆ పెళ్ళికి వచ్చారు.
సుహాసిని చిరునవ్వును పెదవులకు అతికించుకుని కళ్ళతోనే పలకరించింది.
ఇద్దరం పెద్దగా ఏమీ మాట్లాడుకున్నది లేదు.
*
ఈ విజ్జుగాడు ఫంక్షన్ హాల్ లో ఎటు వైపు వెళ్ళాడో? గట్టిగా నవ్వుతున్న శబ్దానికి ఉలికిపడ్డాను.
ఆ గదిలో మా క్లాస్ మేట్స్ కొందరమ్మాయిలతో సుహాసిని ఏదో చెప్తూ పడీపడీ నవ్వుతోంది.
“నీ నవ్వు భలే బావుంటుందే. కాలేజీ రోజుల నుంచి చూస్తున్నా ఇప్పటికీ ఏమీ మారలేదే నువ్వు”
అంది ఎవరో అమ్మాయి.
నా హృదయం కూడా అచ్చంగా అదే చెప్పింది.
నేను ఆ పక్క నుండి గమనిస్తున్నట్టు వాళ్ళకి తెలీదు. వాళ్ళ లోకంలో వాళ్ళున్నారు.
నవ్వీ నవ్వీ కళ్ళలో నీళ్ళు రావడంతో తుడుచుకుంటూ
“ఇంతలా నవ్వితే, రేపటి రోజున ఏమవుతుందో అని భయంగా ఉందే. ఏం పరవాలేదు కదా” అంటోంది సుహాసిని.
వాళ్ళు ఏమన్నారో నేను వినలేదు. ఇంక తన జీవితంలో జరగడానికి ఏం మిగిలిందని, బ్రతుకులోని చేదు మొత్తం ఇప్పటికే రుచి చూసేసిందిగా!!
మరణం ఎప్పటికీ విషాదమే కానీ కొన్ని మరణాలు కొందరికి కొత్త తలుపులు తెరుస్తాయి.
సుహాసిని విషయంలో అదే జరిగిందనిపించింది వెన్నెల వెదజల్లుతున్న తన నవ్వు చూడగానే. ఇకపై తనని బాధపెట్టడానికి రవిగాడు లేడుగా. తను ఎప్పుడూ ఇలాగే నవ్వుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. సుహాసిని నవ్వు మాత్రం జీవితాంతం నన్ను వెంటాడుతూనే ఉంటుంది.
*
కొన్ని చిక్కుముడులు విప్పనేలేదు. నిజంగా రవి మోసం చేశాడా అయితే వాడ్నే ఎందుకు పెళ్లి చేసుకుంది. ప్రటాగనిస్ట్ ని వూరికే వాడుకుందా? అసంపూర్తిగా అనిపించింది.
కథ సరళంగా బాగుంది..
good
Thank you all for your valuable feedback