తమిళ మూలం – నిజత్తై తేడి; రచన – సుజాత (రంగరాజన్)
అనువాదం: గౌరీ కృపానందన్
సేకరణ: “తమిళ అనువాద కథలు” – గౌరీ కృపానందన్ అనువదించిన కథా సంకలనంనుంచి. ప్రచురణ: అన్వీక్షికి ప్రచురణలు
*
వాళ్ళిద్దరికీ, అంటే సరోజకీ కృష్ణమూర్తికీ పెళ్లై తొమ్మిది సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒక ఆదివారం పొద్దున్న పదకొండుగంటలకి కృష్ణమూర్తి, సరోజ హాల్లో ఎదురెదురు సోఫాల్లో కూర్చుని వున్నారు. అలవాటైపోయిన మౌనం. కృష్ణమూర్తి పేపర్ తిరగేస్తుంటే సరోజ కుక్కర్ విజిల్ కోసం ఎదురుచూస్తూ పత్రికలో సీరియల్ చదువుతోంది.
బయట చెక్కగేటును ఎవరో తెరుస్తున్న శబ్దం వినిపించింది. కిటికీనుంచి బయటకి చూశాడు. సుమారు ముప్ఫై ఏళ్ళు ఉన్న ఒకతను చేతిలో ఒక పళ్ళెంతో కాళ్ళకి చెప్పులు లేకుండా తోట మధ్యనుంచి నడిచి లోపలి వచ్చాడు.
“ఎవరూ?”
కృష్ణమూర్తి అడిగిన ప్రశ్నకి ఉలిక్కిపడ్డ అతను, “ఊరుకు కొత్తగా వచ్చామండీ. పని కోసం వెతుక్కుంటున్నాం. ఉన్నట్టుండి నా భార్య ఈ రోజు పొద్దున్న చనిపోయింది. శవం సావిట్లో పడి ఉంది. దహన కార్యాలకి కూడా డబ్బులు లేవండీ. మీ లాంటి పెద్ద మనుషులు సాయం చేయాలి బాబుగారూ.”
అతని చేతిలో ఉన్న పళ్ళెంలో కొన్ని రూపాయల నోట్లు, చిల్లర డబ్బులు ఉన్నాయి. ఎందుకో తెలియదు కానీ కాసిన్ని పూలు కూడా ఉన్నాయి. అగరుబత్తి ఒకటి సన్నగా వెలుగుతోంది.
పత్రికలోని కథను ఆపేసి సరోజ కూడా వాకిట్లోకి తొంగి చూసింది.
అతని ముఖంలో మూడు రోజుల గడ్డం. కళ్ళలో పుట్టెడు శోకం. “ఏమైందట?” అడిగింది.
అతను మళ్ళీ, “ఊరుకు కొత్తగా వచ్చామండీ. పని కోసం వచ్చాం” అని ప్రారంభించి అంతా చెప్పుకొచ్చాడు.
భార్య మరణం అనేది ఎదుటి వాళ్ళని ఒక్కసారిగా కదిలించే విషయం. వెంటనే లోపలికి వెళ్లి డబ్బు తీసుకొచ్చి ఇవ్వచ్చు కదా. కృష్ణమూర్తి అలా చెయ్యలేదు. చెయ్యడు కూడా. ప్రతి విషయాన్నీ క్షుణ్ణంగా అడిగి మరీ తెలుసుకుంటాడు. సరోజకి భర్త గురించి పూర్తిగా తెలుసు.
“ఇల్లెక్కడ?” కృష్ణమూర్తి అడిగాడు.
“పక్కనేనండీ. బృందావన్ కాలనీకి అవతల. తెల్సిన వాళ్లింటికి వస్తే ఇలా జరిగిపోయింది.”
“అడ్రెస్ చెప్పు.”
“సినిమా థియేటర్ పక్క వీధి.”
“అది సరే. పూర్తి అడ్రెస్ చెప్పు.”
“పోనివ్వండి పాపం! కాస్తో కూస్తో ఇచ్చి పంపించెయ్యండి.” సరోజ గొణిగింది.
“నువ్వూరుకో.” భార్యను కసిరాడు.
“మేము ఈ బెంగళూరుకి వచ్చి మూడు రోజులే అయ్యిందండీ. పొద్దున్నే చనిపోయింది.”
“అది సరేనయ్యా. అడ్రెస్ సరిగ్గా చెప్పు.”
అతను కాస్త ఆలోచించి, “మూడో క్రాస్” అన్నాడు.
“మూడో క్రాసంటే? హెచ్. ఏం. టీ లే అవుటా? సుందర్ నగరా? బృందావన్ కాలనీలోనా?”
“అతనితో ఎందుకండీ వాదన?”
“నువ్వు నోర్మూసుకొని ఉంటావా లేదా? ఇదిగో… సిన్మా థియేటర్ పేరేంటి? అదైనా చెప్పు.”
“ఏంటి సార్ అలా అడుగుతున్నారు? ఉన్నదే ఒక సిన్మా థియేటర్ కదా. మీకు పేరు తెలియదా?”
“నాకు తెలుసు. నువ్వు చెప్పు.”
అతను మళ్ళీ పాత పాట మొదలుపెట్టాడు.
“అది సరే. అడ్రెస్ అడిగితే చెప్పనంటున్నావే?”
“ఏంటి సార్? పెళ్ళాం చనిపోయిన దుఃఖంలో ఉన్నాను. ఏదో పోలీసు వాళ్ళు అడుగుతున్నట్లు ప్రశ్నలు వేస్తున్నారు? డబ్బులు ఇస్తే ఇవ్వండి. లేదా ఇవ్వనని చెప్పండి. ఏ దిక్కూ ముక్కూ లేకుండా నా భార్య శవం అక్కడ పడి ఉంది. నేను వెళ్ళాలి.”
“అడ్రెస్ సరిగ్గా చెప్పు. ఇస్తాను.”
“చెప్పాను కదండీ.”
“పూర్తి అడ్రెస్ చెప్పు.”
“అయ్యో దేవుడా!” అన్నాడు అతను. “వదిలెయ్యండి సార్… ఏంటి సార్ మీరు.”
సరోజ ఎదురు చూసింది. ‘ఏం మనిషివయ్యా నువ్వు? బొత్తిగా మానవత్వం లేదు నీకు’ అని తిడతాడేమోనని. అతను అలా చెయ్యకుండా ఉన్నట్లుంది భోరుమన్నాడు. చేతిలో ఉన్న పళ్ళాన్ని మరో చేతికి మార్చుకుంటూ మౌనంగా రోదించాడు. ఒక్క నిమిషం తర్వాత కళ్ళు తుడుచుకుంటూ, “వస్తాను సార్” అని వెనుతిరిగాడు. వెళ్ళే ముందు చెక్కగేటు గొళ్ళెం పెట్టి మరీ వెళ్ళాడు.
అతను ఇలా చేస్తాడని కృష్ణమూర్తి అనుకోలేదు.
“అతన్ని పిలవండి.” అంది సరోజ.
“ఎందుకూ? అంతా వట్టి వేషం… నటన.”
“ప్లీజ్… పిలవండి అతన్ని. పిలిచి ఏదైనా ఇచ్చి పంపండి.”
కృష్ణమూర్తి నవ్వాడు. బయటకి వెళ్లి చూశాడు.
కొంచెం దూరంలో అతను కనబడ్డాడు. ఇంకా ఏడుస్తున్నట్లున్నాడు. చొక్కాతో ముఖం తుడుచుకుంటూ నడుస్తూ వెళ్తున్నాడు. సందు మలుపులో తిరిగి కనబడకుండా పోయాడు.
“సరోజా! అతను చెప్పేది నిజమే అయితే అడ్రెస్ అడిగినప్పుడు సరిగ్గా చెప్పేవాడు కదా. ఎందుకు తటపటాయించాలి? అడ్రెస్ సరిగ్గా చెప్పి వుంటే పాతికో పరకో ఇచ్చేవాణ్ని కదా?”
“ఊరుకు కొత్తగా వచ్చామని చెప్తూనే ఉన్నాడుగా. కరెక్ట్ అడ్రెస్ తెలియక చెప్పలేక పోయాడేమో?”
“నీకు తెలీదు సరోజా! ఇదంతా ఒక నాటకం. అతణ్ణి చూస్తే భార్య చచ్చిపోయిన మనిషిలాగా కనిపించాడా? దొంగకోళ్ళు పట్టే వాడిలాగా ఆ చూపులూ వాడూనూ.”
“నాకేమో అలా అన్పించలేదు. మరి అలా ఏడ్చాడే?”
“అది కూడా నాటకంలో ఒక భాగమే.”
“ఏదైనా ఇచ్చి పంపించాల్సింది పాపం.”
“మరీ తెలివితక్కువదానిలా మాట్లాడకు. లోకంలో ఎన్ని మోసాలు జరుగుతున్నాయో తెలుసా. ఇంట్లోనే పడి ఉండేదానివి. లోకంలో జరిగే భాగోతాల గురించి నీకేం తెలుసు?”
“అతని ముఖం చూస్తే అబద్ధం చెప్తున్న వాడిలాగా అనిపించలేదు.”
“నీకు అంత తెలివి ఎక్కడుంది?”
“సరే. నాకు తెలివి లేదనే అనుకుందాం. అతను అబద్ధం చెప్పేవాడే కానీయండి. ఒకటో రెండో ఇచ్చి పంపిస్తే మన ఆస్తేం తరిగిపోదు కదా? వృధాగా మనం ఎన్నో ఖర్చులు చేస్తున్నాం.”
“అది వేరే విషయం. ఇంటికి వచ్చి జనాన్ని వెధవలను చేసేవాడికి మనం సహాయం చేయాలా అన్నదే ప్రశ్న. అతను నేరుగా వచ్చి ‘సార్! నేను చాలా బీదవాడిని. పూట తిండికి కూడా గతిలేదు’ అని యోగ్యంగా అడిగి ఉంటే రెండు రూపాయలేం ఖర్మ, అయిదు రూపాయలు కూడా ఇచ్చేవాడిని. అలా కాకుండా భార్య చనిపోయిందని అబద్ధం చెప్పాడు. చావు అనగానే ఏదీ అడగకుండా డబ్బులు ఇచ్చేస్తామని ఇలా ఒక కథను జోడించి ఎంత మోసం చెయ్యబోయాడో చూశావా? దీన్ని మనం ఎలా ప్రోత్సహించడం? నువ్వే చెప్పు.”
సరోజకి ఎన్నో చెప్పాలని అనిపించింది. అతను చెప్పిందాంట్లో పిసరంత కూడా అబద్ధం లేదని, నిజంగానే అతనికి ఏర్పడిన శోకంలో కొత్తగా శరణాగతి చేరిన ఇంటి చిరునామా తెలుపడంలో తికమక పడి ఉండవచ్చునని, భర్త చేసిన పని తనకి కొంచెం కూడా నచ్చలేదని.
చెప్తే గొడవ అవుతుంది. మాటా మాటా పెరుగుతుంది. భర్తకి కోపం వచ్చి భోజనం చెయ్యకుండా బయటకి వెళ్లి పోవడం ఖాయం.
వంటింట్లో కుక్కర్ విజిల్ వినబడింది. సరోజ లోపలికి వెళ్ళింది.
కృష్ణమూర్తి మళ్ళీ పేపర్ని చేతిలోకి తీసుకున్నాడు. కానీ అతని ధ్యాస అక్షరాల మీద నిలబడలేదు. తాను చేసింది సరైనదేనని సరోజ ఎందుకు అర్థం చేసుకోలేకపోతోంది? ముఖం తిప్పుకొని వెళ్లిపోవడంలోనే తన వ్యతిరేకతను చూపించిందే. తనకేం తెలుసునని?
“ఇదిగో వింటున్నావా? ఇలాగే ఒకసారి తిరుపతికి వెళ్తున్నామని ఒకావిడ పసుపు రంగు చీర కట్టుకొని వచ్చి ఐదు రూపాయలు పుచ్చుకొని వెళ్ళింది కదా? ఆ తర్వాత ఏమైంది? ఆమెని సినిమా థియేటర్ దగ్గర క్యూలో చూడలేదూ?” ఇక్కడ్నించే పెద్ద గొంతుతో అన్నాడు.
“అవును.”
“ఇంకోసారి అనాథ పిల్లలకి స్కూలు నడుపుతున్నామని అచ్చేసిన నోటీసు, రసీదు పుస్తకాలతో సహా ఒకతను వచ్చాడు గుర్తుందా? ఏమైంది?”
“ఏమైంది?” లోపల్నించి సరోజ గొంతు వినబడింది.
“ఆ పేరు మీద ఏ వీధీ ఈ ఊళ్ళో లేదని నిరూపించానా లేదా?”
“అవును. జ్ఞాపకం ఉంది.”
“ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా మనం నమ్మకూడదు. పది రూపాయలకోసం కన్నతల్లి చనిపోయిందని అబద్ధం చెప్పే రోజులు ఇవి. ఈ లోకంలో ఎన్ని రకాల మోసాలు ఉన్నాయో నీకేం తెలుసు?”
సరోజనుంచి ఏ జవాబూ రాలేదు.
“సరోజా!”
నిశ్శబ్దం!
కృష్ణమూర్తి పేపర్ని మడతపెట్టి వంటింటి వైపు వెళ్ళాడు. సరోజ వంటింట్లో మౌనంగా ఏడుస్తోంది.
కృష్ణమూర్తి ఉలిక్కి పడ్డాడు. “ఇప్పుడేమయ్యింది? ఎందుకేడుస్తున్నావు?”
గబగబా కళ్ళు తుడుచుకుంది సరోజ.
“ఎందుకు ఈ ఏడుపు?” గద్దించాడు.
“ఏమీ లేదు.”
“అబద్ధం చెప్పకు. నేను అతణ్ణి పంపించేసాననే కదా?”
“లేదు లేదు.” వెక్కిళ్ల మధ్య సరోజ అంది.
“ఎందుకో అతణ్ణి చూస్తే అబద్ధం చెప్పే మనిషిలా అనిపించలేదు. ఎక్కడినుంచి వచ్చాడో పాపం. అతని దుఃఖాన్ని నాకూ కాస్త ఇచ్చి వెళ్లి పోయినట్లనిపించింది.”
“అంతా అబద్ధమని ఎన్నిసార్లు చెప్పాలి?
“మీకెలా తెలుసు?” తనకే తెలియకుండా గొంతు పెంచింది.
కోపంగా చూశాడు కృష్ణమూర్తి. “ఎలా తెలుసు అని అడుగుతున్నావా? లోకంతో నాకు ఉన్న అనుభవం. సరోజా! నువ్వు ప్రతీదాన్నీ ఎమోషనల్ గా చూస్తావు. అదే నువ్వు చేసే తప్పు. నేను ప్రాక్టికల్ గా చూస్తాను.”
“సరే. మీరు చెప్పిందే నిజం. ఇకమీద నేను ఏడవను. కానీ…”
“చెప్పు. మనసులో ఏమనుకుంటున్నావో చెప్పెయ్యి.”
“మీరు అన్నట్లు చాలామంది అబద్ధాలు చెప్తున్నారు. మోసాలు చేస్తున్నారు. పొరబాటున ఇతను చెప్పింది నిజమే అయి ఉంటే, పుట్టెడు శోకంలో ఉన్న మనిషిని వాకిట్లో నిలబెట్టి డబ్బులు ఇవ్వకుండా గెంటేసామే? అతను నిజమే చెప్పాడో అబద్ధం చెప్పాడో మనకెందుకు? ఎలాగైనా పోనీ. ఒక రెండు రూపాయలైనా ఇచ్చి ఉంటే యింత…”
“మళ్ళీ మళ్ళీ అదే పాట పాడతావేం? రెండు రూపాయలు నాకు ముఖ్యం కాదు సరోజా. సిద్ధాంతం! అదీ నాకు ముఖ్యం.”
“సరే.” క్లుప్తంగా అంది సరోజ. కృష్ణమూర్తి ఒక్క నిమిషం భార్య వైపు చూసాడు.
“ఆల్ రైట్! నీ మనసులో ఇంకా ఏదో సంశయం ఉన్నట్లుంది. ఓ పని చేస్తాను. అతను ఏమని చెప్పాడు? థియేటర్ పక్కన మూడో క్రాస్ అని కదా. పక్కనే ఉంది థియేటర్. మూడో క్రాసుకి వెళ్లి చూసి వద్దాం. అతను అక్కడే ఉన్నాడా అని. పద… అప్పుడుగానీ నీ మనసు కుదుట పడదు. కారులో వెళ్లి చూసి తిరిగి వద్దాం.”
“వద్దులెండి. మీరు చెప్పిన తర్వాత నాకూ అలాగే అనిపిస్తోంది. నేనే ఏదో పిచ్చిదానిలా ఏడుస్తూ కూర్చొన్నాను.”
“నువ్వు మనస్ఫూర్తిగా చెప్పడం లేదు. నేను చెప్పిందే నిజం అని అర్థం చేసుకోలేక పోతున్నావు.”
“నేను రాను. నాకు ఇంట్లో చాలా పని ఉంది.”
“నువ్వు రాకున్నా కూడా నేనొక్కడినే వెళ్లి చూసి వస్తాను.”
“ఈ వితండవాదం ఎందుకు? మర్చిపోండి.”
“లేదు. ఈ విషయంలో ఎవరు గెలుస్తారో చూడాలి.”
“మీరు చెప్పిందే సరి. ఒప్పుకున్నానుగా.”
“ఇంకా నీకు నమ్మకం కలగడం లేదు. రుజువు కావాలి నీకు. అంతే కదూ. నేను వెళ్లి చూసి వస్తాను.”
“ఎందుకీ పంతం? మీరు ఇప్పుడు అక్కడికి వెళ్లి అతను చెప్పింది నిజమేనని తెలిస్తే ఏం చేస్తారు?”
“ఓటమిని ఒప్పుకుని పాతిక, కాదు కాదు, యాభై రూపాయలు ఇచ్చి వస్తాను, సరేనా. కానీ అలా జరగదు. నేను జీవితంలో ఎన్నో చూశాను సరోజా.”
“అంత ఖచ్చితంగా తెలిసిన తర్వాత వెళ్ళడం ఎందుకు?”
“నీ కోసమే సరోజా. నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడ్చావు చూడూ. అది తప్పు అని నిరూపించడం కోసం.”
“నాకు ఇదంతా నవ్వులాటగా ఉంది.”
“ఆఖర్న ఎవరు నవ్వుతారో అదీ చూద్దాం.”
కృష్ణమూర్తి పెద్ద గేటు తీసి ఉంచి కారుని వేగంగా డ్రైవ్ చేసాడు. థియేటర్ ఒక మైలు దూరంలోనే ఉంది. ఖచ్చితంగా చూసి రావాలి. మూడో క్రాస్ అనే కదా చెప్పాడు. నన్నేమనుకుంటున్నాడు? దయాదాక్షిణ్యం లేని కసాయి మనిషి అనా? సరోజకేం తెలుసు? ఏదీ అడక్కుండా డబ్బులు దోసిట్లో పోయడానికి నేనేమైనా వెర్రి వెంగళప్పనా? సరోజ వట్టి ఏడుపుగొట్టు మనిషి. ఇలాగే ఇంతకు ముందు ఒకసారి…
సినిమా థియేటర్ పక్కనే మూడో క్రాస్. అందులోకి కారు తిప్పక ముందే ఆ చిన్న సందు కనబడింది. వీధి మధ్యలో ఒక మట్టి కుండ. అందులో నిప్పు ఉన్నట్లు పొగ పైకి లేచి వస్తోంది. ఆకుపచ్చని వెదురుబొంగులు, ఎవరికోసమో ఎదురు చూస్తున్నాయి. ఒక మూల తల మీద చేతులు పెట్టుకొని అతను కూలబడి ఉన్నాడు. కృష్ణమూర్తి ఒక్క క్షణం తటపటాయించాడు. కారుని రివర్స్ చేసి వేగంగా నడిపాడు, తన ఇంటి వైపు.
“ఏమైంది?” తనకేమీ పట్టనట్లు సరోజ అడిగింది.
“నేను చెప్పిందే నిజమయ్యింది. అతను చెప్పిన మూడో క్రాస్ అంతా తిరిగి చూసి వచ్చాను. ఎక్కడా ఏమీ జరగలేదు.” కృష్ణమూర్తి అన్నాడు.
“అలాగా. ఎంత పెద్ద అబద్ధం!” అంది సరోజ.
*
ముగింపు వాక్యం ఎంత గొప్పగా, ఎంత నర్మగర్భంగా ఉందో కదా.. మంచి కథ. ఈ సంకలనం లోని కథలన్నీ చదివి ఆనందించదగినవే. గౌరి గారికి, శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు.
Thank you Uma Maheshwar gaaru!