సీమ చరిత్రలోతుల్లోకి లాక్కు వెళ్ళే కథలు!

అస్తిత్వ ఉద్యమాల పరివ్యాప్తి రాయలసీమలో భిన్నమైనదిగా భావించాలి.

దొక ముప్పై యేళ్ళ వయస్సుగల రాయలసీమ కుర్రవాడి కథల సంపుటి. వయసూ, ప్రాంతం చెప్పడం వెనుక నాకొక ప్రత్యేక కారణం ఉంది. తాము పుట్టి పెరిగిన ప్రాంతాల పట్ల, అక్కడి సంస్కృతి పట్ల కవులకీ, రచయితలకీ ఎనలేని బాంధవ్యం ఉంటుంది. యువతరానికైతే ఆ అది మరీ ఎక్కువ. ఆ ప్రాంతాలేమన్నా అసమానతలకి, నిర్లక్ష్యానికీ గురవుతున్నప్పుడు  ఈ ‘కావల్సినతనం’ గుండెల్లో మరింత ఉధృతంగా చెలరేగుతుంటుంది. ప్రాకృతిక వనరుల పట్ల, రాజ్యాంగబద్ద అవకాశాల వినియోగం ఇవన్నీ ఒక రాజకీయ స్పృహకి దారి తీస్తాయి. తద్వారా ఆ భావోద్వేగాలు ప్రకటితమవుతున్నప్పుడు, దాన్లోని ఒక పెనుగులాట; విన్నా, చదివినా తప్పక కదిలించి తీరుతుంది. ఒక ఇంటి వసారాలో కలసి పెరిగే పెంపుడు జంతువు కావొచ్చు, వర్షపు రాత్రి కాన్పయిన నిరుపేద తల్లి చుట్టుకునేందుకు ఒక చిరిగిన పాత చీర కోసం తిరిగిన పిల్లాడు కావొచ్చు, చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక నల్ల కోడి  మాంసం ముక్క తిందామనుకున్న సామాన్యుడు కావొచ్చు. దేని కోసమైనా సరే, ఆ సందర్భాన్ని ఎదుర్కొన్న వాణ్ణి ఒక సంఘర్షణ రెండు కాళ్ళ మీద నిలబడనీయదు. శీలం సురేంద్ర లాంటి కుర్రవాడి కథల్లో పాత్రలు మనల్ని అలాంటి అసహనానికి గురి చేస్తాయి. సంపుటి పేరు ‘పార్వేట’. మొత్తం పన్నెండు కథలు. అన్నీ రాయలసీమ జీవనాస్తిత్వాన్ని చిత్రిక పట్టిన అద్భుత దృశ్యాలు.

సురేంద్ర ఇంజినీరింగ్ చదివాడు. సినీ పరిశ్రమలో పనిచేస్తున్నాడు. అతి కథా వస్తువులు, పోలికలు, భాష, కథ నడిపే తీరు అన్నింటిలోనూ రచయిత పరిణితి తెలుస్తుంది. ముప్పై ఏళ్ళకింత కరుణ ఎక్కణ్ణుంచి వచ్చింది. ఇంత విశాల నేత్రం ఎలా తెరుచుకుంది. ఇంత మెరుగైన ఆలోచనలెలా కలిగాయి ? రచయిత పరిధి, దృష్టి, భావజాల సునిశితత్వం మనల్ని విస్మయానికి గురిచేస్తాయి. అంత తాజాగా ఉంటాయీ కథలు. అంత లోతుగా ఉంటాయిందులోని సంభాషణలు.

ఒక దళిత కుర్రాడు తన తండ్రికి నల్లకోడి మాంసం కూర తెద్దామనే ప్రయత్నంలో వెంట ఉన్న పెంపుడు కుక్క సూరిగాడు తుపాకి గుండుకి బలైపోతుంది. ‘సూరిగాడంటే మనిషి కాదు’ అంటాడు రచయిత. అంటే దాన్ని అంతకంటే ఎక్కువ ప్రేమిస్తానని చెప్పి మనని చాలా ఏడిపిస్తాడు (సూరిగాడూ నల్లకోడి). పశుపక్ష్యాదులతో మానవ సంబంధాల గురించి ఈ కథలు చాలా మాట్లాడతాయి. స్త్రీలపై అత్యాచారాలు చేసే సామిరెడ్డి దౌష్ట్యం మీద కాలుకున్న చెప్పు విసిరేసినా, అతన్నో దున్నపోతుగా చూపెట్టినా (దేవమ్మ), ‘విజయకుమారి’ ‘నల్ల మోడాలు కప్పిన ఆకాశం’ కథలు ప్రేమ నేపథ్యంగా దళిత యువతీయువకుల్లో ఆత్మగౌరవ చర్చను లేవనెత్తినా సురేంద్ర కథనంలో ఒక ప్రత్యేకత ఉంది.

అది భాషదా, పాత్రలదా, కథాంశానిదా ? దేనిదని తర్కిస్తే మన మీద కలిగే ఆ ప్రభావానికి ప్రాంతమే ముఖ్య కారణమనిపిస్తుంది. సురేంద్ర ‘మీరు చదివే ఈ కథలన్నీ మీ జీవితాల్లో ఎదురైన సంఘటనలే. ప్రాంతం, యాస పేర్లు మాత్రమే నావి’ అంటాడు గానీ ఇవి అన్యాయానికి గురైన రాయలసీమ చరిత్రలోకి, అక్కడి మనుషుల అనంత దు:ఖంలోకి, జీవన తాత్పర్యాలలోకి మనల్ని లాక్కెళతాయి. కథా పార్శ్వం సురేంద్ర ప్రతిభకు మూల కారణం. అనేక అసమానతల్ని అనుభవిస్తున్నా, అందులో మాటల్లో చెప్పలేని వైరుధ్యాల్ని చాలా నేర్పుగా చూపెడతాడు సురేంద్ర. బాధతో పరిగెత్తే తోక కోసిన గొర్రె (పార్వేట) రాయలసీమలో సాంఘికంగా ధ్వంసమైన సామాన్యుడి సర్వకాల సర్వావస్థకు నిదర్శనం. ఇది ఇతర ప్రాంతాలతో పోల్చదగ్గది కానేకాదు. ఇంత దు:ఖమూ, వేదన వేరేచోట ఉండదు. అస్తిత్వ ఉద్యమాల పరివ్యాప్తి రాయలసీమలో భిన్నమైనదిగా భావించాలి. ‘పెద్దపులి పంజా మేకపిల్ల మింద పడ్డట్టు గోపాల్ మీంద పడింది’ అంటాడొకచోట (పార్వేట) సురేంద్ర. పుస్తకం కవర్ మీద మేకపిల్లని చూసినప్పుడల్లా కర్నూలు జిల్లా యాసలో ఆ మేకే ఈ కథల్ని వినిపిస్తోందా అన్న భావన తప్పక కలుగుతుంది.

ప్రముఖ కథకులు జి వెంకట కృష్ణ ఇతనిది పాత కర్నూలు జిల్లా తూర్పు ప్రాంతపు యాస అంటాడు. రాయలసీమలో ఇన్ని యాసలున్నాయా అనిపించడం తప్పు కాదు. మేఘనాధ్ రెడ్డి (కలంకూరిగుట్ట కథలు), ఝాన్సీ పాపుదేశి (దేవుడమ్మ), ఇంకా మారుతీ పౌరోహితం, శ్రీనివాస మూర్తి, మొదలగువారి అనేక మంది రాయలసీమ కథకుల్లో ఒక్కొక్కరిదీ ఒక్కో భాష. సీమలో ఉన్న అనేక యాసలకి కారణమేమిటో తెలుసుకోవాలన్న ఆసక్తి కలగుతుంది. ఈ కథకుల్లో ఎవరి యాస ఎంతవరకూ సరైనదీ అనిపించినా అది పాఠకుడికి ఎటువంటి అడ్డంకీ కాదు. విజయకుమారి కథ ఒక్కటే రాయలసీమ యాసలో రాయలేదు. సోకాల్డ్ రెండున్నర జిల్లాల భాషలోనే నడుస్తుంది. కనుకనే ‘స్వభావ’ రిత్యా కొంత వేరుగా అనిపిస్తుంది. రచయిత భాష వల్ల సన్నివేశం రక్తి కడుతుంది. పాత్రలు మన మధ్యకి నడచి వస్తాయి. శైలి విషయంలో వెంకట కృష్ణ రచయితలోని పిల్లవాడి దృష్టి కోణాన్ని, సర్వసాక్షి కథనాన్నీ, ఆత్మ కథనాత్మకతని చక్కగా వివరిస్తాడు. పార్వేట కథ, అంశమూ, ఆవరణ దృష్ట్యా కృష్ణ ‘దేవరగట్టుని’ గుర్తుకు తెస్తుంది. శైలీ విన్యాసంలో పతంజలి శాస్త్రి గారి ‘నలుపెరుపు’చదువుతున్నట్టు గుండెవేగాన్ని  పెంచుతుంది.

స్థానికత ఈ కథల విమర్శకి దోహదకారి కనుక, ఈ సంపుటి అంతర్గత బలమూ, ఉపయోగమూ దానిచుట్టూరే ఉంటాయి. రాయలసీమ సామాజిక స్థితిగతుల్ని చూపెట్టడంలో ఈ కథలు విజయవంతం అవుతాయి. ఈ కథల్లోని సౌందర్యం సామాన్యుడిది. ఏ ఆర్భాటమూ లేని సామాన్య రచయితది. అతని అభివ్యక్తిలో ఉన్న స్వేచ్చ సామాన్యుడు కోరుకున్న విముక్తి. దేవమ్మ కొడుకు లింగమయ్య కోరుకున్న విముక్తి, నిజం బయటకి రాకపోదా అని బాయికాడే కూచ్చోని సూచ్చ కుమిలిపోయిన పెద్దిరెడ్డి పెళ్ళాం కోరుకున్న విముక్తి. ఇంకా ఈ పుస్తకంలో మాయన్నగాడు, లాక్కోడు, మాసిన మబ్బులు కథలు బలమైన కథలు. కోటర్, కొత్త బట్టలు కథల గురించి ఏమీ చెప్పను. అవి చదవడమే ప్రజాస్వామిక చైతన్యం. ఇవి పాఠకులుగా మనమేం కావాలనుకుంటున్నామో అదే కమ్మని చెబుతాయి. సురేంద్రకు అనేక ప్రేమలు.

పార్వేట  (కథలు) రచన : శీలం సురేంద్ర, పేజీలు: 135, వెల : రూ. 175, ప్రతులకు: ఆన్వీక్షికి ప్రచురణలు, 9705972222 

శ్రీరామ్ పుప్పాల

ఈ తరం కుర్రాళ్ళలో శ్రీరాం కవిత్వాన్నీ, విమర్శనీ సమానంగా గుండెలకు హత్తుకున్నవాడు. అద్వంద్వం (2018) అనే కవితా సంపుటితో పాటు, బీమాకోరేగావ్ కేసు నేపథ్యంగా 1818 (2022) అనే దీర్ఘ కవితని ప్రచురించాడు. తనదైన సునిశిత దృష్టితో వందేళ్ళ వచన కవితా వికాసాన్ని 'కవితా ఓ కవితా' శీర్షికన అనేక వ్యాసాలుగా రాస్తున్నాడు. ఆ వ్యాస సంకలనం త్వరలో రావలసి ఉంది.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • మంచి పరిచయం సార్!
    నాకున్న అనుభవం మేరకు భాష, యాస ఒక ముప్పై కిలోమీటర్లకు మారుతా ఉంటాది. ఉదాహరణకు ఎమ్మిగనూరులో స్నానం చేసెందుకు “నీళ్లు పోసుకొని వస్తా ” అంటారు. 28 KM దూరంలో ఉన్న మాధవరం అనే కర్ణాటాక సరిహద్దు గ్రామంలో “ మై కడుక్కొని వొస్తా” అంటారు. ఒక రాయలసీమలోనే కాదు బహుశా అన్ని ప్రాంతాల్లో ఈ వైవిద్యం ఉంటుంది. ఆయా ప్రాంత రచయితలు దానిని తమ రచనల్లోకి తీసుకరావడం లేదని అనుకొంటున్నా. మా అందరితరుపునా మీకు ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు