సినిమా పాటకు చెంగావి చీర

ఆరుద్ర శతజయంతి సందర్భంగా ఆరుద్ర సాహిత్యంలోని అనేక కోణాల గురించి క్లుప్తమైన విశ్లేషణలకు మా ఆహ్వానం. editor@saarangabooks.com

 “లోకం‌లోని వెలుగూ నీడా లోతులు చెప్పాలి   రేపటి రూపును లోపలి కళ్ళకు నేడే చూపాలి

  రాసిన పాటకు ప్రాణం పోసి పేరును తేవాలి   మంచి పేరును తేవాలి…”  

పైన ఉదాహరించిన చరణం ఆరుద్ర సినిమా పాటల చరిత్రలో చరమాంకం వరకూ చర్వితచర్వణమైనదనే ‘మాట’ లో అతిశయోక్తి లేదు.  “తూర్పు వెళ్ళే రైలు” చిత్రం కోసం ఆయన రాసిన ‘వేగుచుక్క పొడిచిందీ” పాట లోని చివరి చరణం అది.  ఆ చిత్రంలో కథానాయకుడు కవి మన ఆరుద్ర లాగే.  కవిగా పరిశోధకుడిగా పేరొందిన ఆరుద్ర చేపట్టని సాహితీప్రక్రియ లేదు.  కథ, నవల, నాటకం, రేడియోరూపకం, గేయాలు, పద్యాలు, పరిశోధనా వ్యాసాలు, సాహితీ విమర్శ —

ఒకటేమిటి..  అలాగే సంగీతం, నృత్యం, చదరంగం, ఇంద్రజాలం, సినిమా మొదలైన వివిధ కళల్లో ఆరితేరినవాడు ఆయన.  ఒక్క మాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ణాశాలి.  మద్రాసు ఫిలింసొసైటీలో చురుకైన సభ్యుడిగా ఆయన ఎన్నో విన్నూత్న కార్యక్రమాలకి చేయూతనిచ్చాడు. చలనచిత్రకళని  పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసిన వ్యక్తి ఆరుద్ర అని నేడు చాలామందికి తెలియకపోవచ్చు.  ఎన్నో చలనచిత్రోత్సవాలను వీక్షించి, పరీక్షించి, సమీక్షించిన వాడాయన.  అప్పట్లో మనకున్న సినిమా విమర్శకుల్లో అగ్రగణ్యుడు ఆయన అన్నది నిర్వివాదాంశం. 

‘సినిమా’ తో సంబంధ బాంధవ్యాలు ఆయనకు పుణే ఫిల్మ్ స్కూల్లో గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ హోదాని సంపాదించి పెట్టాయి.  అలాగే అడయార్ ఫిల్మ్ స్కూల్లో ‘విజిటింగ్ ఫాకల్టీ’ గా  వ్యవహరించే గౌరవాన్ని పొందాడు ఆరుద్ర.   నాట్యశాస్త్రంపై పలు విశ్వవిద్యాలయాల్లో  ప్రసంగాలు చేసినా, “ఇంటింటి పజ్యాలు” రాసినా, “కూనలమ్మ పదాలు” పాడినా, ‘క్లార్కు సూర్యారావు’ ను  విశ్లేషించినా, “సినీవాలి” “త్వమేవాహం” వంటి కావ్యాలు రచించినా, “గుడిలో సెక్స్”పై పుస్తకం వెలువరించినా, “రాముడికి సీతేమవుతుంద”ని ప్రశ్నించినా మన కళ్ళముందు ప్రత్యక్షమయ్యేది ఆరుద్ర లోని పండితుడు, కవి, పరిశోధకుడు, చరిత్రకారుడు, హేతువాది, సామ్యవాది, శ్రామిక పక్షపాతి ….అన్నిటినీ మించిన మంచి మనీషి.  ఇక “సమగ్రాంధ్ర సాహిత్యం” పద్నాలుగు సంపుటాలు పదునాలుగు భువనభాండాల వలె  కనిపించడానికి కారణం ఆయనలో దాగున్న అలుపూ సొలుపూ యెరుగని పరిశోధకుడు.  పరిశోధన విషయం లో ఆయన అవిశ్రాంత యోధుడు, నిరంతర పథికుడు.  అందుకే వి.ఎ.కె. అన్నారు … “ఆంధ్ర సాహిత్య వారధిని ఆంధ్రులు దాటగలిగేలా వారధి కట్టినవాడు ఆరుద్ర” అని.  పరిశోధనే ప్రాణంగా,  సాహిత్య సేవే  ఊపిరిగా సాగింది ఆయన జీవితం. 

అలాగే ‘పాటల పాలవెల్లి’ దేవులపల్లికి హృదయాంజలి వంటి అక్షరాంజలిని శ్రద్ధాంజలిగా ఘటించినా; అకాల మరణం పొందిన అద్భుతమైన నటి  స్మితాపాటిల్ ప్రజ్నాపాటవాలను సంయమనంతో కీర్తించినా ఆయన శైలి విలక్షణం.  శ్యాం బెనెగల్ “అనుగ్రహం” చిత్రానికి మాటలు పాటలు సమకూర్చడంతో పాటు, ఆ చిత్ర వాతావరణానికి తగ్గట్టుగా ఉత్తరాంధ్ర ప్రాంతపు ఆచార వ్యవహారాలని, ఆహార్యాన్ని, తెలుగు మాండలికాన్ని తెరకనువదించడంలో దర్శకుడు విజయం సాధించాడంటే  అది ఆరుద్ర చలవేనని చెప్పుకోకతప్పదు.  కొంకణ తీరపు నేపధ్యంగా మరాఠీ రచయిత ఖానోల్కర్ రాసిన “కొండూర”ను తూర్పు తీరం లోని ఉత్తరాంధ్రకు తగ్గట్టుగా మలచడమంటే  ఏమీ ఆషామాషీ వ్యవహారం కాదు.  ఈ సందర్భం లోనే  స్మితాపాటిల్ లోని పరిశోధనా తృష్ణ నీ,  జిజ్నాసనూ పరిశీలించి శ్లాఘించారు ఆరుద్ర.

  1940ల చివర్లో సినిమారంగం లో  డబ్బింగ్ రచయితగా, తరువాత దర్శకత్వ శాఖలో సహాయకుడిగా ప్రవేశించిన ఆరుద్ర అతిత్వరలోనే రాజ్ కపూర్  దృష్టిని ఆకర్షించాడు.  “ఆవారా” చిత్రవిజయం తరువాత హిందీ తెలుగు భాషల్లో ద్విభాషా చిత్రంగా  “ఆహ్” నిర్మించ తలపెట్టిన రాజ్ తెలుగు వెర్షన్ కి మాటల పాటల రచయితగా ఆరుద్రను ఎంచుకున్నాడు.  అలా తెలుగులో తయారయ్యింది “ప్రేమలేఖలు”.  ఉద్యోగరీత్యా ఉత్తర భారతంలో దాదాపు అర్ధ దశాబ్దం గడిపిన ఆరుద్రకు ఆ పని నల్లేరు మీద నడకలా సాగింది. 

హిందీలో ఉన్న “ఛోటీ సీ యే జింద్ గాని  రే  హాయ్ రే హాయ్ గమ్ కీ నిశానీ హై తేరీ….చార్ దిన్ కీ జవానీ హై తేరీ”  అన్న భావాన్ని ఆరుద్ర ఎలా ఆంధ్రీకరించాడో చూడండి.  “పాడు జీవితమూ యవ్వనం మూడు నాళ్ళా  ముచ్చటలోయి.. “  అలాగే “రాజా కీ ఆయేగీ  బారాత్” పాటని ఉత్తరాంధ్ర నుడికారంతో “పందిట్లో పెళ్ళవుతున్నాదీ .. కను విందౌతున్నాదీ” అంటూ తెనిగిస్తాడు ఆరుద్ర.  అలా తెలుగు సినిమా పాటల్లో ముఖ్యంగా సాంఘిక చిత్రాల్లో ఒక ప్రాంతపు నుడికారాన్ని వాడడం బహుశా అదే మొదలు కావచ్చు.  ఇదే పద్ధతిలో వాడియా వారి “భలే గూఢచారి” ద్విభాషా (హిందీ / తెలుగు) చిత్రం తెలుగు వెర్షన్ కి 1960ల చివర్లో మాటలూ, పాటలూ రాసారు ఆరుద్ర.  అలా ద్విభాషా చిత్రాలకూ, డబ్బింగ్ చిత్రాలకూ మాటలు పాటలు రాయడం ఆయనకి వెన్నతో పెట్టిన విద్య.  1970ల చివర్లో బాలచందర్ తమిళ-కన్నడ ద్విభాషా చిత్రం “తప్పుతాలంగళ్” / “తప్పిద తాళ” తెలుగు వెర్షన్ “ఇదో చరిత్ర” లో  ‘ఇదో చరిత్ర సుమా, ఇది సజీవ పాత్ర సుమా.. ఈ చరిత్ర హీనులకూ ఓ చరిత్ర కలదు సుమా’  అంటూ భావ తీవ్రతతో మాటలూ పాటలూ రాశాడు ఆరుద్ర. 

అయితే ఇవన్నీ ఒక ఎత్తు.  సినిమా పాటల రచయితగా తెలుగు రాష్ట్రాలలోని ఆబాలగోపాలపు  సమిష్టి చైతన్యంలో ఆయనకున్న అద్వితీయ స్థానం మరొక ఎత్తు.  దాదాపు నూటయాభై చిత్రాలకు మాటలు రాసిన ఆరుద్ర ఎన్నో సినిమాలకు స్క్రీన్ ప్లే  సమకూర్చాడు.  ఇక సినిమా పాటలయితే సుమారు నాలుగువేలకు దగ్గరగా రాసాడాయన.  సినీగేయ రచయితగా ఆరుద్ర ప్రతిభకి పునాదులు అనేకం.   మొట్టమొదట సహజంగా అబ్బిన లయబద్ధమైన సాహితీ సృజన.  అందుకే ఆయన “అంత్యప్రాసల మధురముద్ర ఆరుద్ర” గా పేరొందాడు.  మరో ముఖ్యమైన పునాది ఆయన బహుభాషా ప్రావీణ్యం.  సంస్కృత, ఆంగ్లాంధ్రాలతో పాటు హిందీ, తమిళ భాషలలో ఆరిందా కావడానికి కారణాలు క్లుప్తంగా చెప్పుకోవాలంటే ఉత్తరభారతం లో ఉద్యోగం సహజంగా ఆయనలోని భాషాశాస్త్రోత్సాహాన్ని ఇనుమడింపచేసింది.  ఆ తరువాత చెన్నపట్నం చేరుకోవడంతో ద్రావిడభాషా సాంప్రదాయాలు నేరుగా వంటబట్టాయి ఆయనకి.  దీనితో పాటు సినిమాల్లో వివిధ శాఖల్లో గడించిన అనుభవానికి తోడైన ఆయన పుస్తకపఠనం.  అయితే వీటన్నిటినీ మించి సరళమైన తెలుగులో, సామాన్యుడి భాషలో జీవిత సత్యాలనేకాక, జనజీవితం లోని పలు పార్శ్వాలను, చిన్న చిన్న సరదాలను తన పాటల్లో పలికించడం.  చాలా సున్నితమైన మనోభావాలను పరికించి పిదప సునిశితంగా పరిశీలించి వాటి తత్వసారాన్నీ, జీవనవేదాన్నీ విన్నూత్న తాత్విక కోణాల్లో దర్శించడం వగైరాలు.  అందుకే ఆయన సరదా పాటలు హుషారుగా రాసినా జీవితసత్యాలను, జీవన వేదాంత ప్రసారాన్ని సూటిగా శ్రోతల హృదయాలను తాకేలా కూడా చెప్పగలిగాడు.  వినోదం విషయసారం కలగలిపి సామాన్యులకు విద్యాబోధన చేయడం లో సంగీతానికి ఉండే ప్రాధాన్యతని “ప్రైవేట్ మాస్టారు” సినిమాలోని ఈ పాట ద్వారా బోధపరుస్తాడు ఆరుద్ర లోని పరిశోధకుడు.  పాటలో

ప్రథమార్థాన్ని ఒకసారి పరికిద్దాం… 

“పాడుకో పాడుకో పాడుతూ చదువుకో..

ఆదిలో మన విద్య లయబద్ధమే 

వేదాలు నాలుగూ సంగీతమే….”  

ఆరుద్ర రాసిన సినిమా పాటల్ని స్థూలంగా ఓ పది భాగాలుగా వర్గీకరిస్తూ మచ్చుకి కొన్ని పాటల్ని గుర్తు చేసుకుంటూ పదుగురితో పంచుకోవడం ఈ వ్యాస ముఖ్యోద్దేశాలలో ఒకటి.  సుమారు అయిదు దశాబ్దాల సినీజీవితంలో ఆయన రాసిన ఎన్నో రకాల పాటల్ని ఇలా స్థూలంగా క్లుప్తంగా వర్గీకరిస్తూ సంక్షిప్తంగా పేర్కొనడం ఈ వ్యాసపరిమితుల వలన తప్పనిసరి. 

భక్తి రస ప్రధానమైన పాటల్లో రాముడి మీద ఆయన రాసిన పాటలు చాలా చక్కనివి చిక్కనివి.  “రాముడికి సీత ఏమవుతుంది” వంటి వివాదాస్పదమైన పుస్తకాన్ని రచించి ఎందరో సనాతనవాదుల కోపానికి గురైన ఆయన తన భక్తి రస రచనాపాటవంతో వారినే మెప్పించగలగడం విశేషం.  మచ్చుకో మూడు ఉదాహరణలు.  “అందాల రాముడు ఇందీవరశ్యాముడు ఇనకులాద్రిసోముడు ఎందువలన దేముడు” (ఉయ్యాల జంపాల); “శ్రీరామనామాలు శతకోటి…” (మీనా);  “శ్రీరామ జయరామ సీతారామ కారుణ్యధామా కమనీయ నామా..”(ముత్యాల ముగ్గు)..  ఇందులో “మీనా” చిత్రానికి రాసిన “శ్రీరామ నామాలు శతకోటి” పాటపై తమిళ సినీకవి కణ్ణదాసన్ ప్రభావం ఉందని ఆరుద్రే స్వయంగా చెప్పారు.  

“ఆనంద నిలయం”  చిత్రం కోసం ఆయన రాసిన “పదిమందిలో పాట పాడినా అది అంకితమెవరో ఒకరికే”  అనే పాట ప్రణయగీతాలాపనలో “మధుర భక్తి” భావనలు ప్రస్ఫుటంగా తెలుస్తాయి.  “ఆకాశ వీధిలో  తారలెన్ని ఉన్నా …. అందాల చందమామ అసలు ఒక్కటే..”  అంటూ ముగిసే ఈ గీతంలో ‘మధురభక్తి’  ఛాయలతో వలపును సన్నివేశానుగుణంగా రక్తి కట్టిస్తాడు ఆయన.  చివరగా అయినా తప్పనిసరిగా తలచుకోవలసిన పాట “గోరంత దీపం” చిత్రం కోసం ఆరుద్ర రాసిన రసరమ్యరాజం “రాయినైనా కాకపోతిని రామపాదము సోకగా.. బోయనైనా కాకపోతిని భక్తిరాజ్యము నేలగా”.  ‘మహిని అల్ప జీవులే ఈ మహిమలన్నీ పొందగా మనిషినై జన్మించినానే మత్సరమ్ములు రేపగా మదమత్సరమ్ములు రేపగా” అంటూ ఆ చిత్ర కథానాయిక పాత్ర మనోస్థితిని ప్రతిబింబిస్తాడు ఈ పాటలో ఆరుద్ర.  

“సెంటిమెంట్” తో గుండెలను పిండే పాటలు రాయడంలో కూడా ఆయన ప్రత్యేకత కనిపిస్తుంది.  దర్శకుడిగా కె.బి.తిలక్ మొదటి చిత్రం “ముద్దుబిడ్డ” కోసం రాసిన “చూడాలని ఉంది  అమ్మా చూడాలని ఉంది” పాట తెలుగునాట ఎంత పాపులరో వేరే చెప్పనవసరం లేదు.  ఇక అప్పటి నుంచీ “ఆరుద్ర/తిలక్/పెండ్యాల టీమ్  ‘సాటిలేని మేటి హిట్ పాటల టీముగా వినుతికెక్కింది.  తిలక్ తీసిన మరో చిత్రం “ఎం.ఎల్.ఎ.”లో మొదటిసారిగా ప్లేబాక్ గాయని ఎస్.జానకి పాడిన  “నీ ఆసా అడియాశా .. చెయిజారే మణిపూసా..  బతుకంతా అమవాస .. లంబాడోళ్ళ రాందాసా” పాట కరుణరసాన్నీ సామాజిక చైతన్యపు ఆవశ్యకతనీ శ్రోతల  సామూహిక చైతన్యంలో కలకాలం నిలిచేలా చేసింది.  అలాగే ఆరకమైన పాటలకు ఓ కొత్త వరవడినీ ప్రవేశపెట్టింది.  ఇక “పిల్లలూ దేవుడూ చల్లని వారే కల్ల కపట మెరుగనీ కరుణామయులే” (లేతమనసులు); “నీలో నాలో ఒకటే రక్తం.. నీదీ నాదీ ఒకటే ప్రాణం” (చిన్నారిపాపలు) వంటి చైల్ద్ సెంటిమెంటుని రంగరించిన పాటలు తెలుగువారి నోటిపై సదా నిలుస్తాయి. 

ప్రకృతినీ ప్రేమనీ జత చేస్తూ ఆరుద్ర సృష్టించిన వలపు గీతాలు తెలుగు ప్రాంతాల్లో ప్రేమజంటలు సతతం జపించే తారకమంత్రాలే కాక చెవులున్న ప్రతివారికీ చవులూరించేవి.  ఉదాహరణకు “బావామరదళ్ళు” చిత్రంలోని “నీలి మేఘాలలో గాలి కెరటాలలో” ; “ముత్యాలముగ్గు” చిత్రంలోని “ఏదో ఏదో అన్నది ఈ మసక వెలుతురు గూటిపడవలో విన్నది కొత్త పెళ్ళికూతురు” లాంటి రసగుళికలు చాలు.  “ఉయ్యాల జంపాల” లో “కొండ గాలి తిరిగింది గుండె ఊసులాడింది గోదావరి తరగ లాగ కోరిక చెలరేగింది” పాట ‘వాక్యం రసాత్మకం కావ్యం’ అన్న నానుడికి సరైన నిర్వచనంగా నిలుస్తుంది.  ‘పట్టపగలు సిరివెన్నెల భరతనాట్యమాడింది’ వంటి అధివాస్తవిక పదప్రయోగాలతోను; ‘పడుచుదనం అందానికి తాంబూలమిచ్చింది’ వంటి కవిసమయాలతోనూ; ‘నాగమల్లి పూలతో నల్లని జడ నవ్వింది’ లాంటి పదచిత్రాలతోనూ ఆద్యంతం హృద్యంగా సాగే ఈ పాట “ప్రాప్తమున్న తీరానికి పడవ సాగిపోయింది” అనే వేదాంత ధోరణితో ముగుస్తుంది.  రాజ్యలక్ష్మి వారి “వీరాభిమన్యు” చిత్రానికి ఆరుద్ర రాసిన రెండు యుగళ గీతాలు నాటి తెలుగునాట యువతీయువకుల గుండెల్లో గుబులు రేకెత్తించాయంటే అతిశయోక్తి కానేరదు. 

“అదిగో నవలోకం వెలసే మనకోసం” అంటూ ఏనాటి యువతకైనా ఆదర్శప్రాయమైనటువంటి ఊహాలోకాన్ని తన మూడో కంటితో సృష్టించాడు మన ‘ఆరో రుద్రుడు’.  అలాగే “రంభా ఊర్వశి తలదన్నె రమణీలలామ ఎవరీమె” అంటూ రసవత్తరంగా ప్రశ్నిస్తాడాయన.  ఆరుద్ర విరచించిన అనేకానేక ప్రణయగీతాలలో చివరగా “చుట్టూ చెంగావి చీర కట్టాలే చిలకమ్మ” (తూర్పు వెళ్ళే రైలు)  గురించి ప్రస్తావించకపోతే ఆయనకు ఒకింత అన్యాయం చేసినట్లేనని అస్మదీయుల అభిప్రాయం.  “బొట్టూ కాటుక పెట్టి నేకట్టే పాటను చుట్టి” అంటూ ‘కవి’ అయిన ఆ చిత్ర కథానాయకుడి పాత్రలోకి పరకాయప్రవేశం చేస్తాడు ఆరుద్ర.  

తెలుగువారి చక్కని చిక్కని సంస్కృతీ సంప్రదాయాలను స్మరిస్తూ స్పర్శిస్తూ జాను తెలుగులో పాటలు రాసాడు ఆరుద్ర.  ముత్యాలముగ్గు చిత్రం లోని ‘ముత్యమంతా పసుపు ముఖమంత చాయ ముత్తైదు కుంకుమా బతుకంత చాయ’ పాటలో ‘ఆరనైదో తనము ఏ చేతనుండు .. అరుగులలికేవారి అరచేతనుండు’ …”తీరైన సంపదా ఎవరింటనుండు.. దినదినము ముగ్గున్న లోగిళ్ళనుండూ” అంటూ మన గ్రామీణ సంస్కృతీ సారాన్ని అవలోకిస్తాడు.  అలాగే “స్నేహం” చిత్రం లో “పువ్వూ పువ్వూ ఏమి పువ్వు” పాటలో “పేదరాశి పెద్దమ్మ కుంకమెండబోస్తే సాయంత్రం ఆకాశం ఎర్రా ఎర్రనా” అంటూ బామ్మలు అమ్మమ్మలు  బాల”బుడుగు”లకు, ‘సీగాన పెసూనాంబ’లకు చెప్పే కథలను ఉటంకిస్తాడు.  తెలుగువారి జీవితం లో  పెళ్ళికి ఉన్న ప్రాముఖ్యం లాగే పెళ్ళితంతులకు వారి జానపద సంస్కృతీ సంప్రదాయాల్లో ఉండే ప్రాముఖ్యతనీ వాటి ప్రాధాన్యతనీ సన్నివేశానికి తగ్గట్లు సందర్భశుద్ధికి ఒదిగిపోయేలా తన పాటల్లో పొదిగాడాయన.  సాక్ష్యం కావాలంటే “సాక్షి” సినిమాలో ఆయన రాసిన “అమ్మకడుపు చల్లగా అత్త కడుపు చల్లగా” వినాల్సిందే.  “చల్లనీ ఐరేనికి మొక్కడాలూ”; “సన్నికల్లు మీద కాలు తొక్కడాలూ” మొదలైన తెలుగు జానపద జన జీవనశైలిలో నిక్షిప్తమైన వివాహక్రతువును వివరిస్తాడు.  “పెళ్ళిపుస్తకం” సినిమా థీమ్ సాంగ్ లో కూడా ‘శ్రీరస్తూ శుభమస్తూ ….శ్రీకారం చుట్టుకుంది పెళ్ళిపుస్తకం” అంటూ పెళ్ళితంతును కమనీయంగా వర్ణిస్తాడు. 

ఈ సంస్కృతీ సంప్రదాయాల్ని హుషారు పాటల్లో కూడా అంతర్లీనంగా అల్లుతాడు ఆరుద్ర.  “లక్ష్మీ నివాసం” చిత్రం కోసం రాసిన “సోడా సోడా ఆంధ్రా సోడా గోలీ సోడా జిల్ జిల్ సోడా..సోడాతాగు తెలుగోడా చల్లని సోడా  దీనీ మహిమా చెప్పలేడు దేవుడు కూడా”; “దేవాంతకుడు” చిత్రం లోని “గో గో గో గో  గొంగూర  …జె జె జె జె  జైఆంధ్ర”  పాటలు ఈ కోవకే చెందుతాయి.  ఇక “టీజింగ్ సాంగ్స్” లో  “గుంతలకిడి గుంతలకిడి  గుంతలకిడిగుమ్మ” (నేనంటే నేనే) పాటలో “రంగ్చిరలిస్తానే రవలకమ్మ లెడతానే” అంటూనూ;   “హవ్వారే హవ్వా హైలేసో సో సో “ (బుద్ధిమంతుడు)  పాటలో “పచ్చి మిరపకాయ లాంటి పడుచు పిల్లరో” అంటూనూ తెలుగు జానపద సంస్కృతి ప్రతీకలను పదబంధం చేస్తాడు.  

దేశభక్తిని ప్రేరేపించేవీ, చారిత్రాత్మకమైనవీ అయిన ఎన్నో పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి.  “అల్లూరి సీతారామరాజు” లో  “రగిలిందీ విప్లవాగ్ని ఈ రోజు  ఆ అగ్ని పేరె అల్లూరి సీతారామరాజు: అనే టైటిల్ సాంగ్ లోని  “కన్నెగంటి హనుమంతు వెన్నులోని బాకు కత్తి గట్టి సాగమంది కడ విజయం వరకు”  – స్వాతంత్ఱ్య సముపార్జనకై సాగిన మన జాతీయోద్యమంలో  అసువులు బాసిన తెలుగు వీరుల అమరచరితకు అద్దం పడితే ;  “వందేమాతరమంటూ నినదించిన బంగాళం,స్వరాజ్యమ్మె జన్మహక్కు అని చాటిన మహరాష్ట్రం;  హింసకు ప్రతిహింస అన్న వీరభూమి పాంచాలం;  అన్నిటికీ నెలవాయెను ఆంధ్రవీర హృదయం రామరాజు హృదయం”  అంటూ అల్లూరి సీతారామరాజుపై  జాతీయోద్యమ కాలపు మనదేశంలో మిగతా ప్రాంతాలలోని అమరవీరుల ఆదర్శాలు ఎలాంటి ప్రభావం చూపాయో వివరిస్తాడు. 

అలాగే “ఆంధ్ర కేసరి” చిత్రానికై కూర్చిన”వేదం లా  ఘోషించే గోదావరి”  పాటలో మన చారిత్రకనగరమైన రాజమహేన్ద్రవరం గొప్పతనాన్ని లయబద్ధమైన పదచిత్రాలతో కళ్ళకు కట్టేలా చేస్తాడు.  ఇదే పాటలో సంస్కరణవాది అయిన కందుకూరి వీరేశలింగాన్ని ప్రస్తుతిస్తూ, ప్రస్తావిస్తూ,  “కొట్టుకుని పోయే కోటిలింగాలు; వీరేశలింగమొకడు మిగిలెను కడకు” అంటాడు ఆరుద్ర.  “పవిత్రబంధం” చిత్రంలో “గాంధి పుట్టిన దేశమా ఇది నెహ్రు కోరిన సంఘమా ఇది  సామ్యవాదం రామరాజ్యం  సంభవించే కాలమా ఇది”  అంటూ అవినీతి పంకిలమైన స్వార్థపూరితసమాజాన్ని 1970లకు పూర్వమే విమర్శించాడు.  ఇదే పాటలోని “ఉప్పొంగే నదుల జీవజలాలు ఉప్పు సముద్రం పాలు  –  యువకుల శక్తికి భవితవ్యానికి ఇక్కడ తిలోదకాలు”  అంటూ యువశక్తి ఎలా వ్యర్థమవుతోన్దో మనకళ్ళముందు పైన పేర్కొన్న పదచిత్రాలతోఅద్భుతంగా ఆవిష్కరిస్తాడు.  మామూలు సినిమా పాటల్లో కూడా సందర్భానుసారంగా సామాజిక స్పృహనూ, సాంఘిక నిబద్ధతనూ నిబిడీకృతం చేయగలిగాడాయన.  మనదేశ సాంస్కృతిక పరంపర, వారసత్వాలను ఒక పిల్లవాడి దృష్టి / ఒక బాల “గైడు” బుద్ధి  ద్వారా వీక్షిస్తూ వివరిస్తాడు “బాలరాజు కథ” చిత్రం లోని  “మహాబలిపురం మహాబలిపురం” పాటలో.  ఇదే పాటలో “కట్టించాడు ఈ ఊరు  పల్లవరాజు ఆ కథ చెప్పగ వచ్చాడు బాలరాజు” అంటూ పిల్లవాడి మాటల్లో పలికిస్తాడు ఆస్థల ‘పురాణా’న్ని.   

ధర్మసందేహాల్నీ, వాదసంవాదాల్నీ, జీవిత సత్యాలను, తత్వసారాలను తేట తేట తెలుగులో పాటలుగా పలికించగల గొప్ప కవి ఆరుద్ర. మచ్చుకు కొన్ని ముచ్చటైన ఉదాహరణలు.  “బాలరాజు కథ” లో  బాలరాజు అనే పిల్లవాడు ఒక స్వామీజీని కలిసి తన చిన్న బుర్రని దొలిచిన ధర్మసందేహాల్ని తీర్చమంటాడు.  ఆ సందర్భంలో సన్నివేశానుగుణంగా చిచ్చరపిడుగులాంటి ఆ కుర్రవాడి ప్రశ్నలను, వాటికి స్వామీజీ సమాధానాలను మన కవి ఎలా పదబద్ధం చేసాడో చూద్దాం.. 

“:అడిగానని అనుకోవద్దు,  “చెప్పకుండ దాటెయ్యద్దు; ఏమిటీ రహస్యం స్వామీ ఏమిటీ విచిత్రం” అంటూ మొదలయ్యే ఈ పాటలో మనుషులు ఒక రాయిని తన్నడం,  మరో రాయితో తయారయిన దేవుడి బొమ్మను కొలవడం అనే విషయాన్ని బాలరాజు ప్రశ్నించినపుడు  –  “అది వీధిలోన పడి ఉన్నందుకు; ఇది గుడిలో బొమ్మై కూర్చున్నందుకు”  అంటూ ఆ స్వామీజీ చేత సమాధానమిప్పిస్తాడు ఆరుద్ర లోని హేతువాది.  వాదసంవాదాల విషయంలో “అఖండుడు”  

చిత్రానికి ఆరుద్ర రాసిన యుగళగీతం “అడగనా మాననా అబ్బాయి” ఒక చక్కని ఉదాహరణ.  చాలా తేలికైన మాటల్లో జీవితనిత్యసత్యాలను “సాక్షి” చిత్రానికై రాసిన “పదిమందికోసం నిలబడ్డ నీకు … ఫలితం ఏమిటీ యమపాశం” పాటతో పలికించిన ఆరుద్రే  “అనుగ్రహం” చిత్రం కోసం రాసిన  “ఇది వరమా శాపమా” అనే పాట సంక్లిష్టతతో నిండి ఉండడం యాదృచ్ఛికమేమీ కాదు.  “అనుగ్రహం” చిత్రం లోని సన్నివేశాల సంక్లిష్టతా, దర్శకుడి భావవ్యక్తీకరణలోని మార్మికతా ఒక గీతరచయితగా ఆరుద్ర బాధ్యతను అలా నిర్దేశించాయి.  

పాటల్లో అంత్యప్రాసలు ఆరుద్ర మధుర ముద్రలు.  “ఇంటిగౌరవం” సినిమా కోసం ఆయన చేసిన అంత్యప్రాసావిన్యాసాలు సరళమే కాదు, ఆపాతమధురమూనూ……  

“చింతపువ్వు ఎరుపు చిలక ముక్కు ఎరుపు;  చేయి చేయి కలుపు లేత వలపు తెలుపు ; 

 మల్లెమొగ్గ తెలుపు మంచిమనసు తెలుపు; చేయి చేయి కలుపు నిండు వలపు నిలుపు;  “   

అలాగే “బంగారు పిచుక”  సినిమా లోని  “పని లో పని  తరగని” అన్న పాట.    

నాకు తోచినవే మరో రెండు చక్కని పల్లవులు .. ఆరుద్ర సినీగీతాల అమ్ముల పొది  లోనివి…  

“అందుకో కిల కిల జిలిబిలి నగవుల నూరేళ్ళు…..  

 ఉండిపో తలచిన వలచిన తరగని సుఖముల వెయ్యేళ్ళు”  (పసిడి మనసులు)  

“నవ్వు వచ్చిందంటే కిల కిల ఏడుపొచ్చిందంటే వల వల   

 గోదారి పాడింది గల గల  దానిమీద నీరెండ మిల మిల మిల “    ( స్నేహం ) 

పైన పేర్కొన్న పల్లవులు అంతర్లయాన్వితాలు.  

జానపద శైలిలో చాలా పాటలు రాసిన ఆరుద్ర “కొల్లేటి కాపురం”  చిత్రానికై సృజించిన “ఆరిజెల్లా బేరిమోతా” లాంటి పాటలో సామాజిక న్యాయాన్నీ దాని ఆవశ్యకతనూ, వర్గ వైరుధ్యాల్ని, వైషమ్యాలనీ పల్లెకారుల పదాల్లో పలికించిన  తీరు ప్రశంసనీయం.  ఈ పాటలోని కొన్ని పదాలు చూద్దాం.   

“ఆరిజెల్లా బేరిమోతా  నత్తగుల్లా నాచుపీతా  

సూడబోతె మట్టగిడస  పట్టబోతె బొమ్మిడాయి 

సిన్న సిన్న పురుగుల్ని మెల్లి మెల్లిగా తింటు సిన్న సేప బతుకుతాది బాబు 

దాన్ని పెద్ద సేప మింగుతాది బాబూ

ఆ పెద్ద సేప నోటికేమొ సిన్న పురుగు నెఱసూపి  

గడుసోడు  గాలమేసి ఒడుపుగాను పడతాడు 

మోసగాళ్ళ బతుకుమీన  బుడమేరు పొంగకుంటె  

మచ్చావతారుడొచ్చి  మంచి బుద్ది సెప్తాడు.”  

మత్స్యకారుడైన ఓ చురుకైన పల్లె కుర్రాడి మాటల్లో  ఎంతో తేలిగ్గా జీవనవేదాన్ని పలికించిన ఈ కవి  మన  ‘సు’కవి.    

ఎన్నో రకాల పాటల్ని కట్టిన ఆరుద్ర క్లబ్ సాంగ్స్ లో కూడా ఓ కొత్త పంథాను ప్రవేశపెట్టాడు.  

“….ముమ్ము…ముమ్ము….ముద్దంటే చేదా  ఇపుడా ఉద్దేశం లేదా “  అంటూ తెలుగు సినిమా ప్రేక్షకులని ‘జగపతి’  వారి  “అదృష్టవంతుడు” చిత్రం ద్వారా “కల్చర్ షాక్” కి  గురి చేసాడు. 

ఈ పాట అప్పట్లో చాలా వివాదాన్ని రేకెత్తించింది.  అయితే 1960ల ద్వితీయార్ధం లోనూ, 1970ల లోనూ  ఎన్నో క్రైమ్, సోషియో క్రైమ్ చిత్రాలకు క్లబ్ సాంగ్స్ ను  పుంఖానుపుంఖాలుగా రాసాడాయన. 

రాయడమే కాకుండా వాటికి ఓ విధమైన విశేష స్థాయిని కూడా కలుగచేసాడు.  వీటి ద్వారా కొండొకచో మన ఆధునిక నగరాల్లోని సామాజిక జీవనం లోనుంచి పుట్టుకొచ్చిన సాంస్కృతిక రీతులకు  

హుషారుగా అద్దం పట్టాడు కూడా.  అలాగే ఆధునిక నగర జీవన వేగాన్నీ, వేగంగా మారుతున్న సామాజిక నేపథ్యాన్న, సాంస్కృతిక విలువల్నీ, కొత్త కొత్త సంప్రదాయాల్నీ తన పాటల ద్వారా ప్రతిఫలింప చేయడంలో సఫలీకృతుడయ్యాడాయన.  రెండు పాటలని ఈ సందర్భంలో పేర్కొనడం అసందర్భం కాదని నా అభిప్రాయం.  అవి ….   

“లౌలౌ లౌమీ నెఱజాణా 

నౌ నౌ కిస్ మీ చినదానా 

సుఖములు సొగసులు అందించే ఖజానా..”   (జరిగిన కథ) 

“వేస్కో కోకో కోలా  తీస్కో రమ్ము సారా 

వేస్తే మజా    గుటకేస్తే నిషా  

కలిపికొట్టు మొనగాడా  ….  (రౌడీలకు రౌడీలు)  

ఇలా  “కాదేదీ సినిమా పాటకనర్హం”  అనిపించేలా ఉండే  క్లబ్ సాంగ్స్ కి  కూడా ఓ కొత్త వాడినీ, వేడినీ అందించాడు ఆరుద్ర.  

“ఇచ్చుటలో ఉన్న హాయీ  వేరెచ్చటనూ లేనే లేదన్న”   వేదాంతాన్ని  తేలికైన పదాల్లో తేల్చిచెప్పిన  ఆరుద్ర నిజంగా మహాకవి.  ”  ద  ఎటర్నల్  గివర్  “.   

    నీరాజనం శీర్షిక  ….   ఆదివారం ఆంధ్ర జ్యోతి   14 జూన్ 1998

                                                                                                    

సోమంచి జయసూర్య

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు