సిద్ధాంత గోష్టి

“ఈ తికమక సిద్ధాంతాలతో బుర్ర పాడుచేసుకోక ధర్మం గురించి ఆలోచిస్తూ రాజ్యపాలన సాగించు.”

గవానుడు కోసాంబి నగరానికి వస్తున్నాడనే వార్త రాజుకి మొదట చెప్పినవాడు మంత్రి. అప్పటికే భగవానుడి గురించి విని వుండడం వల్ల ఏదో చేయాలనే తపన. కొన్నాళ్ళు ఆలోచించి భగవానుడు ఉండడానికో భవంతి, పరిచర్యలకి కొంతమంది పరిచారికులూ భోజనం వగైరా ఏర్పాటు చేసాడు రాజు. ఆనందుడితో పాటు వచ్చిన భగనానుణ్ణి చూడగానే రాజుకి సంతోషం, ఆయనచ్చే ప్రసంగాలు వింటూంటే అదొకరకమైన అలౌకికానందం. అన్నింటికన్నా రాజుకి ఆశ్చర్యం కలిగించిన విషయం బుద్ధుడు ఒకప్పటి శాక్యవంశపు రాజు. మహాబోధి కోసం అన్నింటినీ తృణప్రాయంగా వదులుకుని రాజ్యాన్ని కట్టుబట్టలతో విడిచేయడం. అన్నింటికీ మించి ఆయన వదనంలో కనిపించే నిత్య సంతోషం.

బుద్ధుణ్ణి దర్శించిన రాజు పరిస్థితిలో మార్పు బయటకి కనబడుతూనే ఉంది మంత్రులకీ కూడా ఉండే పండితులకీ, సభలో ఉండే మిగతావారికీ. తన వంశస్థులని సన్యాసులుగా మార్చినట్టే బుద్ధుడు కూడా కోసాంబి రాజుని సన్యాసిగా మారుస్తాడేమోనని వాళ్ళ చింత. ఈ రాజు గానీ సన్యసించి పోతే తమ ఉద్యోగాలకీ ఆదాయనికి ఎసరు రావచ్చు. ఈ బుద్ధుడు ఈ సమయంలో ఇక్కడ ఎలా దాపురించాడో, అసలెందుకు ఇలా ఆయన ప్రతీవారినీ ధర్మం, సంఘం అంటూ ఊదరగొడతాడో అర్ధం కాదు. వీళ్ల సంతోషానికి అడ్డుగా ఉన్న బుద్ధుడంటే కంటగింపుకి మరోకారణం రాజుకి బుద్ధుడు తప్ప మిగతావారంటే నిర్లక్ష్యం. ఎంత వద్దనుకున్నా అది బయటకి కనిపిస్తూనే ఉంది. ఇంక ఊరుకుంటే లాభంలేదు కనక ఏదో ఒకటి చేయాల్సిందే. లేకపోతే ఆదాయ ఉద్యోగాలు పోయి, రాజుతో పాటూ ఈ బుద్ధుడి దగ్గిరే సన్యాసం తీసుకుని చేతిలో చిప్పతో భిక్షకి బయల్దేరాల్సిందే.

రాజనీతి శాస్త్రంలో నిష్ణాతుడనే మంత్రితోపాటూ కూర్చుని పండితులనబడే నలుగురూ చర్చించారు ఏమి చేయాలో, తమకు తెల్సిన ఏ సిద్దాంతంతో రాజుని దారిలోకి తేవచ్చో. అందరు చెప్పినది విన్నాక మంత్రి అన్నాడు, “ఎంతటి అసత్యమైనా సరే పదే పదే చెప్తూంటే వినే శ్రోతలకి అది నిజమే అనే అనుమానం కలిగించవచ్చని రాజనీతి శాస్త్రం చెప్తోంది. అందువల్ల మనం బుద్ధుడి గురించి లేనిపోని విషయాలు కల్పించి రాజు చెవినిల్లు కట్టుకుని చెప్పడం మొదలు పెట్టాలి.”

పండితులనబడే ఎవరికీ ఈ విషయం ఎలా అమల్లో పెట్టాలో తెలియనపుడు మహామంత్రే చెప్పాడు ఉపాయం. ఓ పండితుడు, బుద్ధుడు శతృరాజుచే పంపబడిన గూఢచారి అని రాజు చెవిలో అదేపనిగా ఊదడం. రెండో పండితుడు క్షాత్ర ధర్మం గురించి రాజుకి పురి ఎక్కించి, ఈ బుద్ధుడు క్షాత్ర ధర్మానికి విరుద్ధంగా రాజుని మార్చడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడం, మరో పండితుడు రాజుకి సన్యాసం ఇప్పించి మొత్తం రాజ్యాన్ని కూలగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడని చెప్పడం. ఇలా సభలో తలొకరికీ ఏమి చేయాలో చెప్పి మంత్రి పధకం ప్రకారం రాజుని బుద్ధుడికి దూరం చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాడు.

విన్నదే విని రాజుకి మెల్లిగా బుద్ధుడంటే నిజంగానే శతృ గూఢచారేమో అన్న శంక మొదలైంది. దీనికి తోడు అంత:పురంలోంచి, రాణీవాసంలోంచి బుద్ధుడి దగ్గిరకి వెళ్లవద్దనే సూచనలు వస్తూనే ఉన్నాయి కనక రాజు బుద్ధుడి దగ్గిరకి వెళ్లడం తగ్గించాడు. రాజులో జరిగే ఈ వికారం భగవానుడికి తెలుస్తూనే ఉంది. రాజే ఇలా ఉన్నప్పుడు, పరిచారికులకి కూడా బుద్ధుడంటే నిర్లక్ష్యం మొదలైంది. బుద్ధుడు ఇది చూసి మొదట్లో నవ్వుకున్నా కొన్నాళ్ళు గమనించాక కోసాంబిలో ఉండడం అనవసరం కనక ఆనందుడితో చెప్పాడు, “ఇంక ఇది ఉండదగిన చోటు కాదు, మనం ఇక్కడనుంచి వెళ్దాల్సిన సమయం వచ్చింది. కొన్నేళ్ళకి మరోసారి వచ్చి ఈ పండితుల గురించి చూద్దాం.”

భగవానుడి నోట్లోంచి ఏమాటా వృధాగా రాదు కనక ఇద్దరూ బయల్దేరారు కోసాంబి విడవడానికి. ఎందుకో ఆ రోజు గుమ్మంలోనే రాజు ఎదురయ్యాడు. రాజు మారుతున్నాడు కానీ బుద్ధుడంటే పూర్తిగా విముఖుడు కాదు కనక అడిగాడు, “మీరు హఠాత్తుగా వెళ్ళిపోతున్నట్టున్నారు, ఏమిటి కారణం? మిమ్మల్ని ఎవరైనా అగౌరవంగా చూసారా? అలా అయితే… ”

ఆనందుడు ఏదో అనబోయేంతలో బుద్దుడు చెప్పాడు సమాధానం, “అదేం లేదు. చిత్త కౌటిల్యం ఒకసారి మనిషిలో ప్రవేశించాక ధర్మశ్రవణం మనసులోకి ఎక్కదు అందువల్ల మనసులో ఒకటుంచుకుని మరో విధంగా మాట్లాడేవారు ధర్మ ప్రసంగాలకి అనర్హులని భావించి వెళ్ళిపోతున్నాం.”

రాజుకి ములుకుల్లా తగిలాయి ఈ మాటలు. తిరగబడుతున్నట్టూ అన్నాడు “ఆ విషయం మీకు ఎలా తెల్సింది? నా మీదా, నా రాజ్యం మీదా నిందారోపణ ఎలా చేస్తున్నారు. నేనింతకాలం మీకు అతిధ్యం ఇచ్చినా మీకు కృతజ్ఞత లేకపోవడం చూస్తూంటే మీరు నిజంగా నా అతిధ్యానికి అర్హులా అనిపిస్తోంది.”

భగవానుడు నవ్వుతూ అన్నాడు, “నీకు అటువంటి అనుమానం రావడం సహజమే కానీ అటువైపు ఉన్న నీ పెంపుడు శునకాన్ని చూడు. నన్ను చూడగానే ఎంత గట్టిగా అరుస్తోందో? ఒకప్పుడు అది నన్ను చూసి తోక ఊపుకుంటూ వచ్చేది. ఎప్పుడైతే తన యజమాని మారడం మొదలుపెట్టాడో అప్పుడే అది కూడా మారడం మొదలుపెట్టింది. నీలో మార్పుకి దాని ప్రవర్తనే ప్రత్యక్ష సాక్షి. కలిసి మెలిసి ఉండకపోవడం, అతిగా కలిసిపోవడం వల్ల కూడా మైత్రి చెడుతుంది. స్నేహం లోపించిన చోట ఉండడం వ్యర్ధం. చెడుతున్న స్నేహాన్ని ఏదో విధంగా కొనసాగించడం మరీ కష్టం. మన మధ్య ఇప్పటికీ కొద్దిపాటి స్నేహం మిగిలి ఉంది. అది కూడా పాడయ్యేలోపులే ఇక్కడనుంచి వెళ్ళడానికి సిద్ధపడ్డాం. మేమిలా వెళ్ళిపోవడం మా పట్ల నీకు ఇంకా మిగిలిన స్నేహభావం నిలుపుకోవడానికే కానీ నీవంటే ఏమీ శత్రుత్వం లేదు. ఓ చిన్న అవమానం జరగ్గానే నువ్వు ఇన్నాళ్ళూ చేసిన ఉపకారం మర్చిపోయేంత నికృష్టులం కాదు. కాల ప్రవాహంలో మనం మళ్ళీ మరో సారి తప్పకుండా కలుస్తాం, ఎవరు ఏమేమి ఏమరు మాటలు చెప్పినా ఈ విషయంలో ఎటువంటి శంకలకూ తావు ఇవ్వవద్దు.”

***

భగవానుడు వెళ్ళాక రాజు పూర్తిగా కార్యకలాపాల్లో పడ్డాడు. మంత్రికీ, పండితులకీ, సభలో వారికీ సంతోషం బుద్ధుడి గొడవ వదిలినందుకు. రాజుకి మాత్రం మనసులో తొలుస్తూనే ఉంది. తానేదో తప్పు చేశాడు, అదేమిటో తెలిసీ తెలియకుండా ఉంది. అటు భగవానుడి వైపు మనసు లాగుతోంది. అయితే ఇటు మంత్రీ, సభలో విద్వాంసులూ చెప్పేది తీసిపారేయడానికి లేదు. ఏమో నిజంగానే బుద్ధుడు గూఢచారి అయిండవచ్చు. లేదా తాను కనక బుద్ధుడు చెప్పినది విని సన్యసిస్తే ఈ రాజ్యం ఏమై ఉండేదో?

పదేళ్ళు గడిచాయి. బుధ్దుడు దేశంలో తిరుగుతూనే ఉన్నాడు. వెళ్ళిన చోటల్లా అక్కడున్న అసంఖ్యాకులు ఆయనకి శిష్యులుగా మారుతూనే ఉన్నారనేది అందరికీ తెలుస్తూనే ఉంది. భగవానుడు మరోసారి కోసాంబి నగరానికి దగ్గిరలోకి వచ్చినట్టూ వార్తలు అందుతున్నాయి. కోసాంబి రాజుకి ఇప్పుడు బుద్ధుణ్ణి పిలవాలంటే అదో రకమైన శంక. తాను రమ్మంటే రాకపోవచ్చు. ఆయన వెళ్ళిపోతూంటే తాను చేతులు కట్టుకుని చూస్తూండడం తప్పేనేమో. అయినా ఇప్పుడదంతా అనవసరం. ఎప్పుడో బుద్ధుడిమీద చూపించిన అలక్ష్యాన్ని ఇప్పుడు పూర్తిగా రాజ్య కార్యక్రమాల్లో పీకలోతు తలమునకలై ఉన్న తాను మళ్ళీ మళ్ళీ తవ్వి కొని తెచ్చుకోవడం దేనికీ?

మంత్రీ, పండితులూ యధాసక్తి రాజుకి తమ తమ సిద్ధాంతాలన్నీ తలకెక్కిస్తూనే ఉన్నారు. ఓ రోజు పండిత గోష్టిలో కోసాంబి రాజుకి తలంటు పోయడం మొదలుపెట్టారు పండితులు. అహేతుకవాదాన్ని అవలంబించే పండితుడు మొదలుపెట్టాడు, “కలువ పువ్వులాంటి పుష్పాలకి నాళం, పత్రాలు, రంగూ, వాసనా, మృదుత్వం  అనే లక్షణాలకి కారణం కనబడుతున్నదా? పక్షులు పాడే పాటకీ వాటి రంగులకీ రెక్కలలో ఉన్న వేగానికీ హేతువేమిటి? చివరకి మనకి వర్షాలు రాకపోవడానికీ, కలిగే కాటకాలకీ హేతువు కనబడుతోందా? హేతువు అనేది ఉంటే అదేమిటో తెలియాలి కదా? అందువల్ల ఈ సృష్టి అంతా అహేతు సిద్ధం.”

రెండో పండితుడు రాజుకు మరింత గందరగోళం కల్పించడానికా అన్నట్టూ చెప్పాడు వెంఠనే, “ఆ పండితుడి వాదన తప్పు. ఏ హేతువూ లేకుండా ఏదీ అకస్మికంగానో మరో విధంగానే కలుగుతుందని చెప్పడం తప్పు. అన్నింటికీ కారణమైన ఈశ్వరుడనేవాడు ఒకడున్నాడు. ఆయన తన ఇష్టానుసారం ఈ విశ్వాన్ని సృష్టిస్తూ లయం చేస్తూ ఉంటాడని చెప్పక తప్పదు.”

మూడో పండితుడికి ఉత్సాహం తన్నుకొచ్చినట్టుంది, చెప్పడం మొదలుపెట్టాడు, “ఈ విశ్వంలో ప్రతీ విషయం కూడా కర్మ మహాత్యమే. ఎంతో జ్ఞానం ఉన్నవారూ విద్యాధికులూ, తెలివైనవారూ, సుఖాలన్నింటినీ తమకు సృష్టించుకోగలవారూ కూడా దు:ఖాలనుంచి తప్పించుకోలేకపోవడం కనబడుతున్నదే కదా? ఈ ప్రత్యక్ష్య నిదర్శనాలని వదిలేసి మిగతావాటికేసి చూడడం, వితర్కించడం అనవసరం. ఈ విశ్వం అంతా కర్మ మయం, అన్నింటికీ కారణం పూర్వకృత కర్మ మాత్రమే.”

ఇవన్నీ వింటున్న నాలుగో పండితుడు లేచి చెప్పాడు, “రాజా ఈ సిద్ధాంతాలన్నీ పనికిరానివి. నేను చెప్పే ఉచ్ఛేదవాదం చిత్తగించండి. రకరకాల చెట్లూ చేమలూ ఉన్నాయి. అనేకానేక జంతువులూ మనుషులు మీరూ మేము కూడా ఉన్నాం. ఏ కర్మ వల్ల మనందరం ఇలా ఏర్పడ్డాం? ఈ కర్మ సిద్ధాంతం పండితుడూ, ఆ అహేతు సిద్ధాంతం పండితుడూ ఏ కారణం వల్ల నేనిలా ఉన్నానో మీరలా ఉన్నారో వివరించగలరా?  ఏదైనా వస్తువు ఉంటే అది ఇలా ఉంది అని తప్ప అది ఇలా ఉండడానిక్కారణం ఏమిటి, నశించాక ఏమౌతుంది అనేదాని గురించి తల బద్దలు కొట్టుకోవడం అత్యంత విచారకరం. ఈ పండితుల వాదనవల్ల ఎవరికీ ఎటువంటి ఉపయోగమూ లేదు.”

వాదలనన్నీ వింటున్న రాజుకెందుకో ఒక్కసారి బుద్ధుడితో జరిగిన ధర్మ ప్రసంగాలు గుర్తొచ్చాయి. ఏనాడూ బుద్ధుడు ఈ విధంగా పరస్పర విరుద్ధమైన భావాలు చెప్పినట్టు లేదు. ఆయన చెప్పేవన్నీ అతి సులభంగా ఆచరించడానికి వీలుగా వుండడం అందరికీ తెలిసినట్టు చెప్పడం ఆయనకే చెల్లు. సభ చాలించాడు ఆ రోజుకి రాజు. ఆ సాయంత్రం ఉద్యానవనంలో నడుస్తూంటే మరో సారి భగవానుణ్ణి చూడాలనిపించింది. అయితే పిలవడానికి అహం అడ్డం కనక ఏమిచేయాలో తెలియలేదు.

***

ఓ రోజు పొద్దుటే భగవానుడు చెప్పాడు ఆనందుడితో, “క్రితంసారి కోసాంబి నుంచి వచ్చేటప్పుడు మరోసారి వచ్చి కలుస్తాం అని చెప్పాము కదా ఆ రాజుతో? ఓ సారి వెళ్ళే సమయం ఆసన్నమైంది. అయితే ఈ సారి వెళ్ళేది అక్కడ ఉండడానికి కాదు; కలిసి వెంఠనే వెనక్కి వచ్చేయ వచ్చు.”

“విశేషం ఏమైనా ఉందా భగవాన్? ఎప్పుడు బయలుదేరాలనుకుంటున్నారు?”

“దృష్టి పరామర్శ వల్ల అధోగతి చెందడం అత్యంత సులభం అది రాజుకి సంప్రాప్తం అవకుండా చూడ్డానికే మనం బయల్దేరేది. రేపే బయల్దేరుదాం.”

మర్నాడు బయలదేరడానికి ముందు ఆనందుడు భగవానుడి వంటిమీద వింత అంగవస్త్రం లాంటిది ఉండడం గమనించాడు.  అది భగవానుడికి అసలు ఎలా లభించిందో, రాజ్యాన్ని వదులుకున్న సర్వసంగ పరిత్యాగీ, జీవకుడంతటి వాడు ఇచ్చిన రత్న కంబళం కూడా తృణప్రాయంగా ముక్కలు చేసి పారేసిన భగవానుడు ఇప్పుడీ వింత వస్త్రం కప్పుకోవడం ఏమిటో అర్ధంకాలేదు. ఈ మెరిసే వస్త్రం కప్పుకున్న భగవానుణ్ణి కుతూహలంగా చూస్తూంటే చిరునవ్వుతో చెప్పాడు, “ఈ అలంకారం రాజుని కలిసి మాట్లాడేంత వరకే.”

ఆనందుడు నవ్వుతూ భగవానుణ్ణి అనుసరించాడు కోసాంబి నగరానికి కాలు సాగిస్తూ.

***

మెరిసే వానర చర్మం కప్పుకుని సభలోకి వచ్చే బుద్ధుణ్ణి ఆశ్చర్యపోతూ చూస్తూ రాజు భగవానుణ్ణీ ఆనందుణ్ణీ ఆహ్వానించాడు. హఠాత్తుగా వచ్చిన బుద్ధుణ్ణి చూసి రాజు ఏమి మాట్లాడాలో తెలియక సతమౌతున్నాడనేది తెలుస్తూనే ఉంది. మంత్రీ పండితులకీ మరోసారి తలనెప్పి పట్టినట్టూ వాళ్ల మొహాలు చెప్తూనే ఉన్నాయి. కాసేపటికి తేరుకుని అడిగాడు రాజు, “మీరు చాలాకాలం తర్వాత మా రాజ్యానికి రావడం చాలా సంతోషం. అయితే ఈ మెరిసే వానర చర్మం మీకు ఎక్కడ లభించింది? కుతూహలం కొద్దీ అడుగుతున్నాను తప్ప మరేమీ లేదు.”

అందరూ వింటూండగా చెప్పాడు భగవానుడు, “నాకు దీన్ని ఎవరూ ఇవ్వలేదు, ఇది ఎక్కడా లభించలేదు. నేను దీన్ని స్వంతంగా సంపాయించాను. రోజూ నేను నేలమీద కూర్చుని ధ్యానం చేసుకుంటున్నప్పుడు సుఖంగా ఉండడం లేదు. ఏమి చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు ఓ పెద్ద వానరం మా దగ్గిరలోకి వచ్చింది. వెంఠనే దాన్ని చంపి దాని చర్మాన్ని ఇలా తయారు చేసాను – రుద్ది, కడిగి మెరుగు పెడుతున్నాను రోజూ.”

సన్యసించి అసలెవరికీ కీడు కలలో కూడా తలపెట్టడని తెలిసిన బుద్ధుడు ఇలా వానరన్ని చంపాడని చెప్పేసరికి రాజుకి ఎంతో వ్యధా, లజ్జా కలిగి నోటమ్మట మాటేలేదు. భగవానుడు చెప్పినది విని ఆనందుడు నవ్వు దాచుకోలేకపోతున్నాడనేది పైకి తెలుస్తూనే ఉంది. జరిగే విశేషం మరింత బాగుంటుందని తెలుస్తూనే ఉంది కనక ఎవరేమంటారా అనేది సభలో చుట్టూ చూడ్డం మొదలుపెట్టాడు.

మంత్రి వర్యులకీ సిద్ధాంత పండితులకీ మొదటినుండీ బుద్ధుడంటే పడనేపడదు కనక వెంఠనే వాళ్ళు తమ నోటికి పని కల్పించారు, “ఆహా, ఎంతో తపస్సు చేసి క్రుంగి నీరసించిపోయిన మన స్వామివారికి ఎంతటి తపోబలం? పెద్ద వానరాన్ని హతమార్చగలిగారు. దాని మాంసం కూడా భక్షించారేమో? అయినా ఇటువంటి స్వాములకీ సన్యాసులకీ ఉండే ధర్మ నిరతి, ఇతర ప్రాణులపట్ల అనురాగం ఇదే కదా? అహింసా పరమో ధర్మ: అంటూ ఈయన భోధించే ధర్మం చెప్పేది ఇదే కాబోలు. పెద్ద వానరాన్ని చంపినా ఆయన మొహంలో ఎంతటి తేజస్సు?అహింసా, సత్యవచనం, తపోబలం అంటే ఇదే”

రాజు తన సభలో పండితులు చెప్పేది వింటున్నా భగవానుడు ఇటువంటి పని చేసినందుకు ఏమనాలో తెలియదు కనక మాట్లాడడం లేదు. భగవానుడు పండితులు అన్నది పట్టించుకోనట్టూ చెప్పాడు,

స్వవాదఘ్నేన వచసా య: పరాన్ విజుగుప్సతే

స ఖల్వాత్మ వధేనేవ పరస్యాకీర్తిమిఛ్ఛతి

తాము ప్రతిపాదించే స్వంత సిద్ధాంతానికి దెబ్బ తగుల్తుందనే విషయం గమనించకుండా అవతలి వాళ్ల చర్యలని ఏవగించుకునే వారు ఇతరులని అపకీర్తి పాలు చేయడం కోసం తమని తామే చంపుకునేవారితో సమానం. “అంతా అహేతుకం” అన్న ఈ పండితుణ్ణి చూడండి. దేనికీ హేతువు లేదని కదా ఆయన చెప్పేది? అటువంటి సిద్ధాంతం చేసిన ఈయనకి నన్ను విమర్శించే హక్కు ఎక్కడిది? వానరం మృతికి హేతువేదీ లేదు. నేనెలా కారణం అవుతాను దాని మృతికి? “ఈశ్వరుడే అన్నింటికీ కారణం” అన్న పండితుడి సంగతి చూస్తే ఈయనకి కూడా నన్ను తప్పు పట్టే అధికారం లేదు. వానరం మృతికి ఈశ్వరుడే కారణం అయితే ఈయన ఈశ్వరుడు చేసిన పనికి నన్ను ఎందుకు తప్పు పట్టాలి? అయితే దయామయుడైన ఈశ్వరుడు ఇలా వానరం చావుకి కారణం కాదు అన్నాడంటే, ఆయన ప్రతిపాదించిన ఈశ్వరవాదానికి నీళ్లధార వదిలినట్టే కదా? కర్మ సిద్ధాంత పండితుడికి కూడా నన్ను విమర్శించే హక్కు ఉండరాదు. వానరం దాని పూర్వజన్మ కర్మ వల్ల హతమైంది. దానికి నేనెలా కారణమౌతాను? వానరం చావుకి నాకు పాపం అంటగట్టడానికి లేదు. ఈ నాలుగో పండితుడి ప్రకారం వస్తువులని ఉన్నట్టు ఉన్నట్టూ తీసుకోవాలి తప్ప పూర్వాపరాలు అంటగట్టరాదు. అంటే “వానరం హతమైంది” అనగానే ఇంక దానిమీద మరో మాట మట్లాడరాదు. నేను చేసిన పని అక్కడే సమాప్తమైంది కదా, మరో మాట ఎలా ఉద్భవిస్తుంది? మరోమాట ఏదైనా మాట్లాడి విచారణ చేస్తే తన సిద్ధాంతానికి తిలోదకాలు ఇచ్చినట్టే కదా? ఇప్పుడు చెప్పండి, ఈ పండితుల సిద్ధాంతాలు ఎంతవరకూ  నిజం? వీటినెలా ఋజువు చేయాలనుకుంటున్నారు?”

మాడిపోయిన మొహాలతో ఉన్న మంత్రీ, సిద్ధాంతులనీ, నోర్లు వెళ్లబెట్టి చూస్తున్న సభనీ ఉద్దేశించి చెప్పాడు భగవానుడు, “నేను కప్పుకున్న ఈ అంగవస్త్రం మీకు క్షణకాలం అలా వానర చర్మంగా కనిపించింది తప్ప నిజానికిదో పైబట్ట మాత్రమే. వానరం, చంపడం అనేది లేనేలేదు. ఉత్తమ సిద్ధాంత బలం ఉన్నవాడూ, దయాళువూ, హేతువూ అహేతువూ అనేవి పుర్తిగా తెల్సినవాడు, ధర్మాధర్మాలు తెల్సినవాడూ ప్రాణివధ ఎలా చేయగలడు? ఇటువంటి అవకతవక సిద్ధాంతాల వింటున్న ఈ రాజుని సరైన దారిలో పెట్టడానికే నేను కోసాంబి కి వచ్చాను, మరోసారి వస్తానని ముందు చెప్పినట్టూ.” మాట్లాడేది ఆపి రాజుకేసి చూస్తూ చెప్పాడు భగవానుడు, “ఈ తికమక సిద్ధాంతాలతో బుర్ర పాడుచేసుకోక ధర్మం గురించి ఆలోచిస్తూ రాజ్యపాలన సాగించు.”

పైన కప్పుకున్న అంగ వస్త్రం అందరికీ కనిపించేలా దులిపి భుజం మీద వేసుకుని చిరునవ్వుతో బయటకి నడుస్తున్న భగవానుణ్ణి బిగ్గరగా నవ్వుతూ అనుసరించాడు ఆనందుడు.

*

ఆర్ శర్మ దంతుర్తి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు