సిద్దలింగయ్య లాంటి కవిత్వం కావాలి

వరికోసం, ఎక్కడికి 1947 స్వాతంత్రం  వచ్చింది?

అది టాటా బిర్లా జేబుల్లోకి వచ్చింది

ప్రజలను కబళించే నోళ్లలోకి వచ్చింది

అది  కోటీశ్వరుల గదుల్లోకివచ్చింది

47 నాటి స్వేచ్ఛా, 47 స్వేచ్చా,

అది పేదల ఇళ్లకు రాలేదు

అది ఏ కాంతి కిరణమూ తేలేదు

అది  ఏ దుఃఖ సముద్రాన్నీ తగ్గించలేదు

అది సమానతల పుష్పాల్ని వికసించలేదు

 సిద్దలింగయ్యను చూసినప్పుడల్లా ఆయన 40 సంవత్సరాల క్రితం రాసిన ఈ కవిత గుర్తుకు వస్తుంది. దేశ రాజకీయాల గురించి రాయాలనుకున్నప్పుడల్లా నాకు సిద్దలింగయ్య గుర్తుకు వస్తాడు. పలు సాహిత్య సమావేశాల్లో ఆయనను నేను కలుసుకున్నాను. పెరిగిన గడ్డంతో మన కళ్లముందు నిలుచున్న ఆ వ్యక్తిని ఎప్పుడు చూసినా హత్తుకోవాలని పించేది. ఎందుకంటే సిద్దలింగయ్య దేశంలో కొన్ని దశాబ్దాల దళిత జీవనంలోని ఆక్రోశాలకు, ఆవేదనలకు ప్రతీక.

ఇటీవలే అఫ్సర్ తో సిద్దలింగయ్యకవిత్వంపై రాయాలనుకున్నానని చెప్పాను, సరే,సంధించు అన్నాడు. కోవిడ్ కు గురైన ఆయనను తలుచుకుని మూలిగిన మనసుతో మన మధ్య మహా పురుషుడిలా  సంచరించిన సిద్దలింగయ్య గురించి ఆలోచనలను అక్షరాలుగా మార్చాలనుకునే లోపే శుక్రవారం నాడు ఆయన మనను వీడి వెళ్లిపోయారు.

సిద్దలింగయ్య  ఒక అపూర్వమైన వ్యక్తి. రచయిత, కవి, జానపద గాయకుడు, విద్యావేత్త మాత్రమే కాదు, దళిత చైతన్యానికి ఒక ప్రతీకగా నిలిచిన వ్యక్తి. దళిత సంఘర్షణ సమితి వ్యవస్థాపకుడు. ‘కవిత్వం ఖడ్గం కావాలి.’ అన్న నినాదంలో 1970లలో సమాజంలో ఆర్థిక, సామాజిక అన్యాయానికి నిరసనగా కవిత్వాన్ని సంధించాలనే లక్ష్యంతో ఏర్పడ్డ  బందాయ ఉద్యమం అనే  ప్రగతిశీల సాహిత్యోద్యమ సారథుల్లో ఆయనొకరు. మాగది  అనే గ్రామంలోని దళితవాడలో పెరిగి, పొట్ట చేత బట్టుకుని బెంగళూరు వచ్చి నగర మురికివాడల్లో జీవనాన్ని గడిపిన కుటుంబ నేపథ్యం ఉన్న సిద్దలింగయ్య ఆకలి,అవమానాలు, కష్టాలు, కడగండ్లు తెలిసిన వ్యక్తి.  భూస్వామి పొలంలో ఎద్దు బదులు కాడి మెడపై వేసుకుని మరో కూలితో కలిసి తండ్రి పొలం దున్నుతుండగా చూసి వ్యక్తి, గ్రామంలో తల్లిదండ్రులు రైతు కూలీ పనిలు చేయడం, తల్లి కట్టెలు కొట్టడం, హాస్టల్ లో తల్లి ఊడుస్తుండగా విద్యార్థుల వ్యాఖ్యానాలు చూసి బాధపడ్డ వ్యక్తి సిద్దలింగయ్య. తానూ కూలీ చేస్తూ హాస్టళ్లలో చదువుతూ అంచెలంచెలుగా ఎదిగిన ఒక స్వేద చరిత్ర సిద్దలింగయ్యది. తండ్రి వడ్డీ వ్యాపారి అప్పులు చెల్లించలేక అతడి మనుషులతో చావు దెబ్బలు తినడం, ఆత్మహత్యా ప్రయత్నం చేయడం కూడా సిద్దలింగయ్య జీవితంలో ఒక మరపురాని ఘట్టం.

అలాంటి సిద్దలింగయ్య కు  మొత్తం కర్ణాటకలోనే గొప్ప అసాధారణ దళిత మేధావిగా గుర్తింపు పొంది సమాజం గౌరవించక తప్పని పరిస్థితి ఏర్పడింది..  రెండుసార్లు కర్ణాటక శాసనమండలి కి ఎన్నికైనా, కన్నడఅబివృద్ది అథారిటీ చైర్మన్ గా కేబినెట్ హోదా లభించినా, బెంగళూరు యూనివర్సిటీలో కన్నడ శాఖాధిపతి అయినా, కర్ణాటకలో అత్యంత ఉన్నత సాహితీ పురస్కారం పంప అవార్డు లాంటి ఎన్నో అవార్డులు పొందినా సిద్దలింగయ్య వ్యక్తిత్వం చెక్కు చెదరలేదు. అత్యంత సామాన్యుడిలా, సమాజం పట్ల ప్రేమనిండిన కళ్లతో, స్నేహం మూర్తీభవించిన నిగర్వి  సిద్దలింగయ్య కనపడినప్పుడల్లా ఈయనేనా నిప్పులు చెరిగిన వందలాది కవితలు, పాటలు, వ్యాసాలు  రాసింది? ఈయనేనా వేలాది దళిత విద్యార్థుల్లో,రచయితల్లో చైతన్యం నింపింది?  దళితుల ఓట్లు తమకులభిస్తాయన్న ఆశతో  బిజెపి నేతలు అమిత్ షా, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప,అనేకమంది కాంగ్రెస్ నేతలు చుట్టు తిరిగిన వ్యక్తి ఈయనేనా? నేతలను కలిసి వారితో ఫోటోలు దిగి ప్రచారం చేసుకునే రచయితల మధ్య తనను కలిసి ఫోటో దిగేందుకు రాజకీయ నాయకులే వెంపర్లాడే అద్భుతమైన ఆకర్షణను సిద్దలింగయ్య ఎలా కల్పించుకోగలిగారు?

అది సమాజంపై తిరగబడ్డ ఒక దళిత మహాకవి నిర్భీతికి, ఏ రాజకీయాలకూ లొంగని ఆత్మ విశ్వాసానికీ, తన అస్తిత్వం పట్ల తనకున్ననమ్మకానికీ, ఈ దేశంలో ప్రతి దళితుడికీ ఆదర్శంగా నిలిచిన ఆత్మగౌరవానికీ లభించిన పురస్కారం. ఈ  దేశంలో దళితుడు కనురెప్పలు ఎత్తితే సమాజం అతడి దారిలో నడిచేందుకు సిద్దపడుతుందన్నదానికి సంకేతం  సిద్దలింగయ్య

సిద్దలింగయ్య జీవితం ఒక ప్రతిఘటనా చరిత్ర, ఒక స్వేద చరిత్ర. కన్నడంలో ఆయన ఆత్మకథ ఊరు, కెరె (ఆంగ్లంలో ఎ వర్డ్ విత్ యూ, వరల్డ్ (ప్రపంచమా నీతో ఒక మాట) అన్న పేరుతో వెలువడింది)  చదివితే ఒక దళితుడి జీవితం ఎంత దుర్భరంగా సాగుతుందో, అతడి ఆర్థిక,సామాజిక,సాంస్కృతిక జీవనం లో అడుగడుగునా ఒక అవమానంతో పాటు ఒక తిరుగుబాటూ ఎలా భాగమైందో  మనకు అర్థమవుతుంది. అనేక లోతైన విషయాలను, ఎదుర్కొన్న దుర్మార్గాలను కూడా అత్యంత చమత్కారిక శైలిలో చెప్పిన మరో రచయిత లేరంటే అతిశయోక్తి కాదు. ఈ చమత్కారం, వ్యంగ్యం ఒకవైపు మనకు నవ్వు పుట్టిస్తూనే, గుండెలో సూటిగా గుచ్చుకుంటాయి. నైతికంగా మనను ఆలోచింపచేస్తాయి.  అద్భుత విషాదహాస్యం ఆయన రచనంతా వెల్లువెత్తుతుంది.

మాగది గ్రామంలో రోడ్డుకు ఒకవైపు అగ్రవర్ణాల ఇళ్లు. మరో వైపు వెలివాడ. ఆ వాడలో  చివరిగా ఉన్న సిద్దలింగయ్య ఊరు ఎలా ఉండేది? ‘మా ఇల్లు చాలా చిన్నది. అయిదుగురు కూర్చున్నా సరిపోదు. ఇక పడుకోవడం దేవుడెరుగు.’  అని చెప్పారు ఆయన.

సిద్దలింగయ్య ఎలాంటి బట్టలు వేసుకునేవారు? ‘అయినోరు(భూస్వామి) తన కొడుకు పడేసిన పాత చిరిగిన దుస్తులు నాకిచ్చేవారు. నేను ఆయన కొడుకు కంటే చిన్నవాడిని కనుక అవి నాకు చాలా వదులుగా ఉండేవి. అయినా వాటిని మడిచి వేసుకునేవాడిని, నా స్నేహితుల మధ్య విచిత్రంగా కనపడేవాడిని.. అని  రాసుకున్నారు ఆయన.

సిద్దలింగయ్య  తిండి ఎలా ఉండేది? ‘నేను, మా నాన్న, అమ్మ ఆ బ్రాహ్మణుడి ఇంటి ముందు నిలబడితే అతడు రాత్రి పూట మిగిలిన చిత్రాన్నం, పూరీ ఇచ్చేవాడు. అంత రుచికరమైన తిండి ఎన్నడూ చూడలేదు. ద్వారం ముందు నిలుచున్నానన్న ధ్యాస కన్నా వారు మిగిలిన అన్నం ఎప్పుడు పెడతారన్నదానిపైనే నా ఆలోచన.. మిగిలిపోయిన అన్నమూ, చారే మా బతుకుల్లో  తిండి సమస్య తీర్చింది’ అని వివరించారు ఆయన.

‘ఒక లెక్చెరర్ దాహం వేసినప్పుడల్లా తన అల్మారా తాళం చేతులిచ్చి మంచినీటి బాటిల్ తెమ్మనేవాడు. ఆయనొక సాంప్రదాయవాది. నన్ను మంచినీటికి పంపినప్పుడల్లా తరగతిలో చర్చ జరిగేది. ఆయన నన్ను లింగాయత్ అనుకునేవాడని నాకు తర్వాత అర్థమైంది. కాని ఆయనకు నా కులం తెలిసిన తర్వాత మంచినీళ్లు తెచ్చేపని నుంచి నాకు విముక్తి లబించింది..’ అని సిద్దలింగయ్య రాసుకున్నారు.

బెంగళూరులో తాను నివసించే మురికివాడ సమీపంలోని విశాలమైన శ్మశానంలోని సమాధుల మధ్య సిద్ద లింగయ్య తన జీవితం గడిపారు. ‘ఆ విశాల శ్మశానం నాకెంతో ఇష్టం. అక్కడ కవితా వాక్యాలు తామంతట అవే ఉద్భవిస్తాయి..’అని ఆయన రాసుకున్నారు.

సిద్దలింగయ్య కవిత్వంలో ఆగ్రహం, ద్వేషం ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అది వ్యవస్థలో దుర్మార్గాల పట్ల పెల్లుబుకిన ఆగ్రహ ప్రతిఫలనం. దొంగ లం..కొడుకులసలే మెసిలే అని శ్రీశ్రీ రాసిన వాక్యాల్లో  వినపడ్డ కసి సిద్దలింగయ్య కవితల్లో కూడా ధ్వనించక మానదు

ఈ లం..కొడుకుల

తోళ్లు సజీవంగా వలిచేయండి

దేవుడు ఒకటే అని వారంటారు

కాని ప్రతి వీధిలోనూ వారు ఒక గుడి కడతారు

మనమంతా దేవుడి పిల్లలమని వారంటారు

కాని మా మాలమాదిగల్ని చూసి పాముల్నిచూసినట్లుగా

ముడుచుకుపోతారు

వారి హోటళ్లకు, ఇళ్లకి, బావుల వద్దకు మమ్మల్నిరానివ్వరు

కాని మన మలాన్ని తినే కుక్కలతో

వారు గదులు పంచుకుంటారు..

 

 

 

మనం పండించింది వారు తింటారు

మన కనుబొమలపై చెమట హరిస్తారు

మననే వారు దూరం పెడతారు

మనమెంతమాత్రమూ అంటరాని వాళ్లం, మాదిగలం కాదు

వారు మనను హరిజనులని పిలిచి నవ్వుకుంటారు నా సోదరులారా,,

 

వారు మనకోసం సమావేశాలు పెడతారు

పేపర్లలో ప్రకటిస్తారు

మనతో ఆటలు ఆడుకుంటారు

లం…కొడుకులు

 అని ఆయన రాశారు.   ఆ లం..కొడుకుల వెన్నుముకల్ని విరగొట్టండి. అని మరో సందర్భంలో రాశారు.

 

ఉదారీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ (ఎల్పీజీ) ప్రజలకు శత్రువులని సిద్దలింగయ్య విశ్వసిస్తారు. వీటివల్ల దళితులకే ఎక్కువ నష్టం జరిగిందని అంటారు.ప్రైవేటీకరణ వల్ల దళితులకు ఉపాధి పోయిందని ఆయన అంటారు,

బంగారాన్ని త్రవ్వితీసేవారికి తిండి లేదు

బట్టలు నేసే వారివి నగ్నదేహాలు

అన్నారు.

 సమాజంలో చుట్టూ అవమానాలు ఎదుర్కొంటూ, ఆకలిని భరిస్తూ ఎదిగే దళిత యువకులపై అంబేద్కర్ , పెరియార్ చూపిన ప్రభావాలను చెప్పడం అంత సులభం కాదు. భారత దేశంలో దళితులు, అణగారిన వర్గాల జీవితాలపై మార్క్స్ కన్నా ఎక్కువ ప్రభావం అంబేద్కర్ చూపారనడం అతి శయోక్తి కాదు. సిద్దలింగయ్య జీవితంలో కూడా అంబేద్కర్ అంతే ప్రభావం చూపాడు. హాస్టల్ లో ఉండగా బసవన్న అనే విద్యార్థి ఆయనకు ‘అవతారపురుషుడు అంబేద్కర్’  అనే పుస్తకం ఇచ్చాడు. అది చదవడం పూర్తి కాగానే సిద్దలింగయ్య కవితలు రాయడం ప్రారంభించారు. అంబేద్కర్ పుస్తకాలు చదువుతూ, ప్రసంగాలు చేస్తూ తన చైతన్యంతో పేదరికాన్ని జయించాడు.ఇళ్లలో, ఫ్యాక్టరీలో పనిచేస్తూ, ఉపన్యాసాలు ఇస్తూ ఆయన తనకు కావల్సిన పుస్తకాలు కొన్నారు.1970లలో ఒక విద్యార్థి నాయకుడుగా ఎదిగారు. విద్యార్థిగా ఉండగానే ముఖ్యమంత్రి వీరేంద్రపాటిల్ ముందు అంబేద్కర్ గురించి అనర్గళంగా మాట్లాడి హాలును దద్దరిల్లజేశారు. కాలేజీ రోజుల్లో డి.ఆర్ నాగరాజ్, గజిగట్టి అనే రచయితల ప్రభావంతో  ‘హోలె మాదిగార హాడు’ (దళితులు, మాదిగల గీతాలు)అన్న కవితా సంపుటాన్ని వెలువరించాడు. దాని తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూడలేదు. హాస్టళ్లలో సౌకర్యాలు, భోజన వసతులు, స్కాలర్ ఫిష్ లపై ఆయన అనేక ఉద్యమాలు నిర్మించాడు. మురికివాడల పిల్లలకు రాత్రి స్కూళ్లు నిర్వహించాడు. ‘శూద్ర’ అన్న పత్రికలో తన కవితలు ప్రచురితమయ్యేవి. కన్నడ సాహిత్యంలో ఎంఏ ఫస్ట్ క్లాస్ సాధించిన సిద్దలింగయ్య కు స్వర్ణ పతకం కూడా లభించింది. చదువు వల్లే సాధికారిత లభిస్తుందని, అణిచివేతను, అసమానతలను ఎదుర్కోగలుగుతామని ఆయన నిశ్చితాభిప్రాయం.

నీవు నీ జీవితంతో

పోరాడే మార్గాన్ని చూపావు

బీటలు వారుతున్న భవంతిని చూడమని
నీవు మమ్మల్ని పిలిచావు

ఆత్మగౌరవ నాగలితో

నీవు బీడుభూమిని దున్నావు

నిద్రపోతున్న వారిని

నీవు మేల్కొలిపావు

 అని ఆయన అంబేద్కర్ పై కవితలు రాశారు. అంబేద్కర్ రాజ్యాంగాన్నిరచించిన ఏడు దశాబ్దాల తర్వాత కూడా ఎక్కడికి,ఎవరికోసం స్వాతంత్ర్యం వచ్చింది అన్న ప్రశ్న ఇంకా మిగిలిపోయిందని సిద్దలింగయ్య పలు సందర్భాల్లో  చెప్పారు. ‘స్వాతంత్ర్యం అంటే బానిసత్వం నుంచి విముక్తి. అదెక్కడ లభించింది? మనకు రాజకీయస్వాతంత్ర్యం వచ్చింది కాని సామాజిక ఆర్థిక బానిసత్వం నుంచి స్వేచ్చ లేకపోతే రాజకీయ స్వేచ్ఛ నిరర్థకం’ అని ఆయన చెప్పారు. ఆర్థిక సామాజిక అసమానతలు తగ్గకపోతే అణిచివేతకు గురైన ప్రజలు పార్లమెంట్ అనే సంస్థనే విధ్వంసం చేస్తారని అంబేద్కర్ రాజ్యాంగ అసెంబ్లీలో అన్నారని ఆయన గుర్తు చేశారు.

సిద్దలింగయ్య నిరీశ్వరవాది. సమాజంలో ప్రజలను భ్రమింపచేసేందుకే దేవాలయాలు వెలిశాయని ఆయన నమ్మారు.

దేవాలయాలు క్షుద్రపూజానిలయాలు

మతాధికారులు తాంత్రికులు

యాత్రాస్థలాలు రోగ స్థలాలు

యాత్రికులు అమాయకులు, మూర్ఖులు

 సాహిత్యం అంటే ప్రజలకు మౌలిక హక్కులగురించి తెలిపే ఉపకరణమే కాదు, సామాజిక అసమానతలను తెలిపే పరికరం కూడా, కులాల తేడాల్ని కొనసాగిస్తూ, కుల ఆధారిత అత్యాచారాల్ని చేసే అగ్రవర్ణాలకు వ్యతిరేకంగా నిరసన తెలపాలని ఆయన దళితుల్ని రెచ్చగొడతారు. సాహిత్యం అంటే తిరుగుబాటు మాత్రమే కాదు,చరిత్రను తిరగరాసే ప్రయత్నాలకు సాక్ష్యం,చరిత్ర దళిత కథానాయకులకు తగిన స్థానం కల్పించలేదు, దళితులకూ వారి భవిష్యత్ కోసం కలలు ఉంటాయి. వారూ తమ మార్గాలను నిర్మించాలనుకుంటారు

 లెక్కలేనన్ని స్వప్నాలతో

మెదళ్లు ధగ్దమవుతున్నాయి

నినాదాలు గర్జిస్తున్నాయి

ఉరుముతున్నాయి

దళిత జెండా క్రింద పాలన జరగాలని, రైతులు, కార్మికులు ఏకం కావాలని సిద్దలింగయ్య ఆశ్వాసిస్తారు

చీమల్లాగా కదులుతున్నారు

సింహాల్లాగ గర్జిస్తున్నారు

అసమానత అంతం కావాలి

ధనికుల మదం శాశ్వతంగా అణగాలి

 అని రాసిన సిద్దలింగయ్య

వారు నా ప్రజలు

వేలాది నదుల్లో కొట్టుకుపోయి

విప్లవ సముద్రాన్ని ఉప్పొంగిస్తారు..

 అని కూడా ఆకాంక్షిస్తారు.

తన జీవితమంతా ధిక్కార స్వరాన్ని వినిపించిన, అనాదిగా దళితులపై జరుగుతున్న అణిచివేతపై నిరసనను ప్రకటించిన, దళితులకు విముక్తి మార్గాన్ని స్పష్టంగా నిర్దేశించిన, కవిత్వంతో అగ్నివర్షం కురిపించిన సిద్దలింగయ్య కన్నడ కవి కాదు. జాతీయ కవి. ఆయన మరణానంతరం కూడా ప్రకంపనలు వినిపిస్తుంటాయి. ప్రతి రాష్ట్రంలోనూ దళితులకు దిశానిర్దేశం చేసే ఇలాంటి కవులు జన్మించాలి.

జీవితంలో అవకాశాలు లభిస్తున్న కొద్దీ, అధికారిక సోపానాలు ఆహ్వానిస్తున్న కొద్దీ సిద్దలింగయ్య గళంలో నిప్పులు కురియడం తగ్గిపోయాయని విమర్శలు రావడం సహజం. కాని చరిత్ర పుటల్లో  సిద్దలింగయ్య పాత్రను, ఆయన రేకెత్తిన దళిత చైతన్యాన్నీ, సమాజాన్ని తన కొన వ్రేలిపై తిప్పిన శక్తిసాధించిన ఆ సిద్ద పురుషుడినీ  విస్మరించలేం

*

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

3 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ప్రత్యక్షర సత్యం, ప్రత్యక్షరం దు:ఖం. సిద్దలింగయ్య వంటి అక్షర వీరుణ్ణి

    పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. కృతజ్ఞతాంజలి.

  • సాహసోపేత
    రచనలను
    అంగరంగ వైభవంగ తీర్చిదిద్ది
    గతిగమనాన్ని నిర్దెశించే సదుదేశముతో

    సారంగ

    ఇంటింటి పత్రికగా శేషతల్పశాయి గారి “రచన” సంకలనాలు
    తీపి గురుతులు.. రాగతి పండరి, గోపాలకృష్ణ, బాపు కార్టూన్లు, అనూహ్యమైన కథన కవన రచనలు అక్షర ప్రియులకు ఆనందోత్సాహాలు.

  • An excellent write-up about the great poet Siddalingappa. Despite all sufferings the dalit poet stood his ground in his achievement as a scholar. He will be a great master for many young dalit poets. Long live his spirit and achievement. Congratulations my friend . ❤

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు