1
దృక్పథాన్ని బట్టే దృశ్యం
చూసేది ఆరా తొమ్మిదా అనేది
చూసే చూపును బట్టే ఉంటుంది.
దృక్పథాన్ని బట్టే దృశ్యం
అర్థం మారుతుంటుంది.
నాణేనికి రెండు పార్శ్వాలుంటాయి.
ఓ వైపు బొమ్మ మరో వైపు బొరుసు
ఉంటాయన్న ఎరుక ఉండాలి.
ఓ వైపు నుండే చూస్తూ
బొమ్మో లేక బొరుసు మాత్రమే
ఉందనటం అజ్ఞానం.
కొన్ని అనుభవాలు కళ్ళలో
దృష్టి దోషాన్ని సృష్టిస్తాయి.
అప్పటి నుండి
జరిగే ప్రతి సంఘటనను
ఆ దోషంతోటే చూస్తుంటాం.
వాటికి లోపాల రంగు పులుముతుంటాం.
దోషాన్ని సరిచేసి నిగ్గు తేల్చాలంటే
దృక్పథాన్ని మార్చే
జ్ఞాన చక్షువులు కావాలి.
బుద్ధికి
ఘటనను ఘటనగానే చూపే
కళ్ళజోడు తగిలించాలి.
2
అంతర్జాల యో(యు)గం
దూరంగా ఉండి బతుకు బండి లాగుతున్న
బంధుమిత్రులను దండలోని దారంలా
ఒక్క చోటుకు చేర్చింది.
అరచేతిలో అంజనం వేసి చూపినట్టు
ఖండాంతరాల్లో ఉన్నవాళ్ళను కూడా
కళ్ళెదుటున్నట్టు చూపిస్తూ
కనికట్టు చేస్తుంది.
తెగిపోయిన బంధాలను మళ్ళీ ముడివేస్తూ
అందరికీ ఆత్మబంధువే అయింది “అంతర్జాలం”.
ఒకప్పుడు ఇంద్రజాలం మహేంద్రజాలం
అనుకున్నవన్నీ ఇపుడు అంతర్జాల మహిమతో
అరచేతిలో ఇమిడిపోతున్నాయి.
కుశల సందేశాల పిట్ట మీట నొక్కగానే
రెప్పపాటు కాలంలో
బంధుమిత్రుల సందేశపు పెట్టెలో వాలిపోతుంది.
ఏం సమాచారం కావాలో చెబితే
చిటికెలో తెర మీదుంచుతుంది.
ఉన్న చోటు నుండి కాలు కదపకుండానే
అంగట్లోని వస్తువులన్నీ
ముంగిట్లో కొలువు తీరుతాయి.
బిల్లులు పన్నులు అన్నీ
ఆన్లైన్ లోనే కట్టేయ్యొచ్చు
వార్తలు మొదలు వినోదం వరకు
అన్నీ అంతర్జాలంలో చూసేయ్యొచ్చు.
సకల సేవలను గుప్పెట్లోకి తెచ్చిన
అంతర్జాలం మనిషికి ఒక యోగమే
యుక్తితో వాడుకుంటే అదొక భోగమే
కానీ తన జాలంలో చిక్కుకుంటే
మనిషికి తీరని ఖేదమే!!
*








బావున్నాయి