కవిత్వానికెప్పుడూ వస్తువుతో పాటుగా వ్యక్తీకరణా ముఖ్యమే అని ఏ కవైనా విమర్శకుడైనా చెపుతాడు (అలా చెప్పని కవి కవిత్వాన్ని ఓ కంట కనిపెడుతూ ఉండండి). రాన్రానూ కవిత్వభాష పాతబడి పాఠకులకు విసుగు తెప్పించేలా, పునరుక్తులతో అరిగిపోయిన పదబంధాలతో పులిమిన వాక్యాలతో వచ్చిన, నూత్నత్వం ఏ మాత్రమూ లేని అదే వస్తువును ఎక్కువగా సమకాలీన కవిత్వంలో చూస్తున్నాం.
కవితలో shock valueని శ్రీశ్రీ తరువాత దిగంబరకవులు తొలుత సాధించారు. తరువాత శిష్ట్లా, మో, ఎం.ఎస్. నాయుడు వంటివారూ వారివారి భిన్న వ్యక్తీకరణ దారుల్లో అదే విలువను సాధించారు. ఆనక దాన్ని సాధించిన కవి కె. రామచంద్రా రెడ్డి (రా.రెడ్డి). ముప్ఫై ఏళ్ళ నుండే కవిత్వం రాస్తున్న రా.రెడ్డి ఇటీవలే ముప్ఫై లోపు selected కవితలతో “మాటపేటల బిడ్డకుట్లు” అనే సంపుటి తెచ్చాడు.
దిగంబర కవుల దిక్‌లు స్వేచ్ఛగా భాషాశృంఖలాల్ని expletivesతో తెంచుకొని వస్తువుకు ఆశించిన గభీరతను అందివ్వగా, ప్రాఁదెనుఁగు పదబంధాలూ ఇంకా జనుల రసనాగ్రాన నర్తిస్తున్న పల్లెపదాలూ రా.రెడ్డి contentకు నూత్నత్వాన్నిచ్చాయి. సుకవికి పాఠకులపై చిన్న అధికారముందని నేను నమ్ముతున్నాను. నిఘంటువును చూడాల్సిన అవసరం పడితే చీకాకూ విసుగూ లేకుండా ఓపిగ్గా పదాల అర్థాలు వెతుక్కోమనడం. కవి భావుకతకూ వ్యక్తీకరణకూ ఎక్కువ విలువనిస్తాన్నేను, అందుకే కవికి ఈ అధికారం కట్టబెడుతున్నాను.
“మాటపేటల బిడ్డకుట్లు” ఇంటి పెరట్లో ఏ మొక్క పాతడానికో తవ్వుతుండగా బయల్పడిన నగిషీలెన్నో చెక్కిన గాజుపెట్టె వంటిది. దాన్నలా చూస్తూ అందులో ఏముందో అనే కుతూహలం ఒక పక్క నెడుతుండగా మరోపక్క దాన్ని ముట్టుకుంటే ఏమౌతుందో అనే సంశయం ముందు తలెత్తుతుంది. ఈ సంపుటిలో పదాలటువంటివి కనుక, ఈ పోలిక తెచ్చాను. అసలీ సంపుటికి కవి పెట్టిన పేరుతోనే మొదలౌతుంది మామూలు పాఠకుడికి నిఘంటువు అవసరం. బిడ్డకుట్లు అంటే పురిటి నొప్పులు – ప్రసవవేదన.
పేజీలు తిప్పగా ఎదురయ్యేవన్నీ (నడిపవలు వగలవల, నెనరెసరు, తుడపం, చిట్లం) ఇలాటివే. ఒకట్రెండు సంస్కృతసమాసాలు లేకపోలేదు. కవి ఇంత వేదన పడి రాసినప్పుడు, పాఠకులు కాస్త ఓపిక చేసుకోవాలి. ద్రాక్షకదళీనారికేళపాకాలకు అలవాటు పడిన తెలుగు పాఠకులు ఈ సంపుటిలోని పాకమేదో కానీ దీన్ని ఆదరిస్తారని చెప్పవచ్చు. దీన్ని ఒక ప్రాఁదెనుఁగు కబ్బాన్ని చదివినట్టుగా చదివితే సరిపోదు, ప్రాఁదెనుఁగు రూపానికి సంబంధించిన విషయంలో ఒక భాగం. కవి ఊహలూ భావనలూ పదచిత్రాలూ అసలు వస్తువూ అత్యాధునికమైనవి.
ఈ సంపుటి వెనుకమాటలో కవి సిద్ధార్థ ఇలా అంటాడు, “ఆధునికానంతర తెలుగు కవిత్వ రూపచిత్రం మీద main stream అస్తిత్వవాద సామాజిక కవిత్వాలకు భిన్నంగా వస్తున్న అచ్చమైన language poetry ఇది. వినిర్మాణ కాల్పనిక సూత్రాలలో వొదిగిపోతూనే తిరగబడుతూ వస్తున్న కవిత్వం. Rural, town గ్రామీణత నిలకడగా ఉండి మాట్లాడుతుంది ఇందులో.” కవి సిద్ధార్థ అన్నమాట ఈ సంపుటికి గీటురాయిపెట్టి విలువ కొలిచిన మాట.
బాగా ఉక్క పోస్తున్నా ఎండ వేడికి మాడు మాడుతున్నా ఎండాకాలానికీ ఒక ఆకర్షణుంది. “నలుపలకల పెనుసున్నా” లాటి ఎండ బంగారంలా కాస్తున్నప్పుడు ఊళ్ళో ఉదయం మొదలుకొని సంజెవేళదాకా కనిపించే స్థావరజంగమాదులను కెమేరాలో బంధిస్తే ఎలా ఉంటుంది, ఆ ఫోటోలకు పాత తెలుగు ధ్వనులతో captionsఇస్తూ? అలా వెయ్యి దృశ్యాల ఎండవానతో మొదలౌతుందీ కవితా సంపుటి.
“నునుపు విచ్చుకుంటూ పంటబోరు నీటిసొట్ట” ఇందులో ఒక typical పదచిత్రం. కవిని పాత తెలుగూ, మన పల్లెటూళ్ళ పలుకుబళ్ళూ ఆకర్షించినట్టే గ్రీష్మర్తువూ ఆకర్షించింది. గోదావరి జిల్లా వ్యావహారికం తెలిసిన వారికి ఈ కవి ప్రయోగించిన కొన్ని పదాలు ఎంతో familiarగా అనిపించి ప్రాణం లేచొచ్చినా, తతిమ్మావారికివి అందకుండా పోవు. కవితలన్నీ మొత్తంగా అర్థం కావడానికి అందరికీ నిఘంటువు కావల్సిందే. కొన్ని మాటలు నిఘంటువుల్లోనూ లేవు. కవి ఉన్న పదాలతో తనకు అనువైన విధంగా స్వేచ్ఛగా కొత్త మాటలూ, (“ఆశగము” అంటే, ఆశే ఆలంబనగా సాగేది, “అహాయి” అంటే హాయి కానిది) కొల్లలుగా నూత్నపదబంధాలూ సృజించాడు. రా.రెడ్డి కవితల్లో దృశ్యాచిత్రాలన్నీ పులకరింతల్ని రేపేవే, పాఠకులు వడపోసుకునేందుకు అనువుగా అందిచ్చిన ముడి అనుభూతులు.
“ఎవరి గోతుల్లో వాళ్ళం
అమూర్తైక పురాప్రతిమై
ఒకే లిప్తలో
నిర్లిప్తంగా కొన్ని యుగాల్ని
ధ్యానిద్దామా?
ఆ…!”
వంటి చిత్రభావన పాఠకులకు ఒక తపఃపీఠాన్నిస్తుంది. నగరంలో తపస్సుకై. ఇంకా, “తొడల పునాది గూట్లో మొలిచే దుబ్బుల్లో చిక్కుకున్న గిలిగింత” తగిలేదాకా పాఠకుడు ఇంకా ఇంకా అని చూస్తాడు. ఇదంతా strikingly original and delightfully innovative సృజన. “ఒక సుస్ఖలిత స్వప్నం భగ్నం చేసిన అత్యాధునికపుటడుగు దారెటు”? అని కవి వెతుకుతున్నప్పుడు పాఠకుడు ఏదో మార్మికఛాయాదేహళి దాటి అడుగిడి కవి లాగే తన బాట తాను వెతుక్కుంటాడు.
ఈ సంపుటిలోని కవితలలో వాక్యాలు ఉదాహరిస్తూ ఇంకాస్త రాయొచ్చు గానీ, అది మొదలెడితే అంత త్వరగా పూర్తయ్యేది కాదు. అయినా అది అంత ముఖ్యమూ కాదు. చివరిగా పాఠకుల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరెప్పుడైనా ఓ ఏభై అరవై చిన్నచిన్న పేజీల్లో సర్దుక్కూచున్న ఆధునిక (అంటే సమకాలీన) కవితాసంపుటిని చదువుతూ అర్రె ఇదేమిటీ అచ్చతెనుగు కబ్బం అని అనుకున్నారా? చదువుతూ చదువుతూ ఏ నిఘంటువును చూసే అవసరం పడడం వల్లనో space లేని పదబంధాలు ఇమ్మడి ముమ్మడిగా ఉండడం మూలానో మనసు కదిలి తలపు చెదిరి ఏ అనుభూతి తిరగబెట్టడం వల్లనో మీ చదివే వేగం మందగించిందా?
చదువుతూ చదువుతూ కవి చేసిన నవ్యార్థసృష్టిని అవగతం చేసుకుంటూండగా కావ్యంలో music వల్ల చెవులు హోరెత్తాయా? కవి కవితను రాస్తూ రాస్తూ ఓ కత్తెర పట్టుకొని syntaxను కత్తిరించి చెక్కాడేమో అని అనుమానించారా? నా లాగ ఒక పెన్సిల్ పట్టుకొని select వాక్యాలను underline చేద్దామనుకొని, రెండో సారి చదువుతున్నప్పుడు పేజీ అంతా మసక మసకగా కనిపిస్తుందని underline చెయ్యడం మానుకున్నారా? అంతా చదివిన తరువాత ముందు ఈ కబ్బం కొత్తగా ఉందని అనిపించి మొదటి పేజీ మళ్ళీ ఇంకో కొత్తదనం కోసం చదివారా?
పై ప్రశ్నల్లో ఏ ఒక్కదానికైనా మీ సమాధానం yes అయినట్లైతే, మీకొక మంచి కావ్యపఠనానుభూతి ఉన్నట్టే, అప్పుడీ పుస్తకం అనుభూతి పరంగా చూస్తే పునరపి. అర్థం పరంగా చూస్తే పునరపి కాదు, తొలిరేయిలా ఉత్సాహభరితం. పై ప్రశ్నల్లో చాలావాటికి మీ సమాధానం yes అయితే, you will love this work! మీ సమాధానం కనుక no అయినట్లైతే, మీ కోసం ఒక కొత్త ప్రపంచం ఈ పుస్తకంలో దాక్కొని ఉంది.
ఒక దర్జీ కొత్త దుస్తులు కుట్టిచ్చినట్టుగా, ఏ కొలతలూ తీసుకోకుండానే ఇది కుట్టి నన్ను నాకు ఇచ్చాడు రా.రెడ్డి. One size fits all, anybody? ఇదే ఆ సంపుటి. “అవసరం లేని కేవల ప్రదర్శనకే పనికివచ్చే మేధావితనంతో చులకనైపోయి అర్థాలకోసం వెతకడం మాని పాఠక లక్షణాలతో శుద్ధి చేసుకుంటే చాలు” అన్న సిద్ధార్థ మాటలు కూడా సబబైనవే. అదే ఈ సంపుటి.
*
Add comment