ఒకనాటి కరీంనగర్, నేటి పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖనికి చెందిన యువ రచయిత అరుణాంక్ లత. విప్లవ నేపథ్యం ఉన్న కుటుంబం నుండి, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన నేపథ్యం అతని రచనల్లో స్పష్టంగా కనపడుతుంది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న కాలంలోని అనుభవాల స్ఫూర్తితో కథలు రాస్తున్నాడు . ఉద్యమకాలంలో తిరిగిన పల్లెలు. పల్లెల్లో చూసిన మనుషులు. వారి స్థితి గతులను తన కథల్లో చూపించే ప్రయత్నం చేస్తున్నాడు. ‘మన జీవితాలను మనమే రాసుకుంటూ, చరిత్రను, వర్తమాన్ని రికార్డు చెయ్యాలి’ అన్న కళ్యాణరావు వాక్యాలు స్ఫూర్తిగా కథలు రాస్తున్న అరుణాంక్ లత కథ “సార్ మీరేంటి..?”….ఈ పక్షం సారంగ రేపటి కథ.
సార్ మీరేంటి..?
నిచ్చెన మెట్ల కుల వ్యవస్థలో అట్టడుగున నిలబడ్డ వారి జీవితం ముళ్ళ పొదల మీద నడక. ఆ నడకను రాయాలి. అదే కథ అవుతుంది. నాలుగు అక్షరాలు నేర్చిన వాడు ఎవరైనా వారి బతుకును రాయాల్సిందే. రాతొచ్చి రాయకపోవడం నేరం. అది దళితుడు చేస్తే క్షమించరాని నేరం. ఆ నేరం అంటరాని జనులకు చేసే ద్రోహం. ఆ నేరానికి పాల్పడలేని నేను నా అనుభవాన్ని రాస్తున్న. అయితే ఈ అనుభవం నా ఒక్కనిది అనుకొను. అది సమూహంది. మాదిగది. మాలది. చిందుది. డక్కలిది. బైండ్లది. నేటికీ మనిషిగా గుర్తింపబడని అంటరాని వెలివాడది. నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అట్టడుగు మానవులది. ఆఖరి మనుషులది.
***
“అన్నా…”
పిలుపులాంటి చెల్లెలి అరుపుతో ఆ రోజు తెల్లారింది.
‘ఏంటి? పొద్దున్నే ఈ టార్చర్. నువ్ కాలేజ్ పోవాలి కదా! పో.’
“నేను పోతున్నా కానీ నువ్వు ఇవ్వాలైన రూమ్ చూడడానికి వెళ్ళు. రోజు మీటింగ్ ఉంది, అటు పోయేది ఉంది. ఇటు పోయేది ఉంది అని చెప్తున్నావ్. ఇవ్వాళ సిద్దార్థ అన్న కూడా వస్తా అన్నాడు.’’ అంటూ తాను కాలేజ్ కి పోయింది.
అక్కడ మొదలైంది మళ్ళీ రూమ్ కోసం వేట. సిద్ధార్థకి కాల్ చేసి రమ్మనగానే బండి తీసుకొని వచ్చాడు. ఇల్లు ఎక్కడైనా కిరాయికి దొరుకుతుంది. కానీ మనకేమో ….యూనివర్సిటీకి నడుచుకుంటూ వస్తే రెండు మూడు సిగరెట్ల దూరంలో ఉండాలి. కాలాన్ని అంకెల్లో చెప్పుకుంటే పది-పదిహేను నిమిషాల దూరంలో ఉండాలి. అందుకే వేట ప్రాంతాన్ని డీడీ కాలనీ, నల్లకుంట, విద్యానగర్ గా నిర్ణయించుకున్నాం. అవి అయితేనే నాకు, చెల్లికి కామన్ పాయింట్స్ గా ఉంటాయ్. మొత్తానికి ఓ పది రోజుల దొబ్బుల తరువాత రూమ్ వేటకి బయల్దేరాం. మేముంటున్న ఇంటి వెనకాల గల్లీలోనే ఓ ఇంటికి టు-లెట్ బోర్డ్ కనబడింది. రాజా ‘బండి ఆపు ఇదేదో వర్క్ అవుట్ అయ్యేలా ఉంది .’ అన్నాను. సిద్దార్థ బండి ఆపితే దిగి ఆ ఇంటికి పోయాం. ఆ ఇంటావిడ బయటనే ఉంది.
“ఏం కావాలి బాబు” అని అడిగింది.
‘టు-లెట్ బోర్డ్ చూసి ఆగినం ఆంటీ, ఇల్లు కోసం చూస్తున్నాం.’ అని చెప్పిన
“ఎవరెవరు ఉంటారు? ఏం చేస్తారు?” అని అడిగింది.
‘నేను చెల్లి ఉంటాం, ఇద్దరం పీజీ చేస్తున్నాం’ అని చెప్పిన.
“మేము ఫ్యామిలీస్ కు మాత్రమే ఇద్దాము అనుకుంటున్నాం. సారీ బాబు” అని లోపలికి వెళ్లిపోయింది.
‘చెల్లి, నేను అంటే ఫ్యామిలీ కాదా? రాజా’ అని అమాయకంగా సిద్దార్థని అడిగా. మనోడు ఓ నవ్వు నవ్వి “అంటే అర్జెంట్ గా పెళ్లి చేసుకోవాలి కావచ్చు.” అని అన్నాడు. ‘ఇప్పుడు ఈమె ఇంట్లో ఉండడం కోసం పెళ్లి చేసుకోవాల్నా? హాట్’ అని …ఛలో తరువాత గల్లీ వెతుకుదాం అని బయల్దేరాం.
కొద్దిగా ముంగటికిపోతే విద్యా నగర్ రైల్వే స్టేషన్ వెనుకాల టిఆర్‌టి క్వార్టర్స్ ఉన్నాయ్. అక్కడ ఓ ఇంటికీ టు-లెట్ బోర్డు ఉంటే పోయాం. పైకి పోతే ఓ ముసలావిడ. ఇల్లు చూపెట్టి మా సమాధానం వినకుండానే టెర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్పడం స్టార్ట్ చేసింది.
“రాత్రి పదికల్లా ఇంటికి రావాలి. రోజూ మెట్లు ఊడ్చి, కడగాలి. ఇంటికి దోస్తుల్లు ఎవరు రావద్దు.” ఇట్లా సాగిపోయాయి.
‘సరే అమ్మా, చెప్తా’ అని ఇద్దరం బైటపడ్డాం.
బయటకి రాగానే ‘మరి ఇంతా సంసారికుల్లాగా ఉండడం మనతోటి కాదులే’ నవ్వుకున్నాం.
‘ఇటు వర్క్ అవుట్ అయ్యేలా లేదు గానీ డీడీ కాలనీ లో చూద్దాం పద. హాస్టల్ కి దగ్గర ఉంటుంది.’ అటువైపు పోయాం.
అక్కడా అంతే ‘ఓన్లీ ఫర్ ఫ్యామిలీస్, లేదా ఓన్లీ వెజిటేరియన్స్’. అనే బోర్డులు. ఆ ఓన్లీ వెజిటేరియన్స్ బోర్డు చూసినప్పుడల్లా ‘ఈ మనుషులు బతుకంతా బి12 విటమెన్ టాబ్లెట్లు మింగుతూ బతకాల్సిందే.’ అని నవ్వుకునే వాళ్ళం. లేదా ఈ ‘వెజ్ ముచ్చట అంతా ఇంట్ల వరకే, బయటకి వస్తే మనకన్నా ఎక్కువే తింటారు’ అని సెటైర్ వేసే వాళ్ళం.
ఇల్లు వెతుకులాటలో ఉండే రొటీన్ డైలాగ్స్ విని విని ఆ రోజుకి వేటను ముగించాం.
ఎప్పటిలాగే ఉదయపు అరుపులాంటి పిలుపుతో మేల్కొని మరుసటి రోజు మళ్ళీ వెతుకులాట. సిద్దార్థ ఏదో పని ఉందని పోతే శ్రావణ్ ఆ రోజుకి తోడుకి వచ్చాడు. ఓ నాలుగైదు ఇల్లు చూసినా ఏదీ నచ్చలేదు. ఒకటి థర్డ్ ఫ్లోర్ వితౌట్ లిఫ్ట్. ఇంకో దానికి మంచి నీళ్ళు రెండు ఫ్లోర్స్ మోసుకుని పోవాలి. ఇంకోటి ఓనర్ ఎక్స్ రే చూపులు. మరోటి వాటర్ ప్రాబ్లం.
ఓ గల్లీలో టు-లెట్ బోర్డ్ చూసి శ్రావణ్ రాజా ఇదేదో వర్కవుట్ అయ్యేలా ఉంది. అంటే బండి ఆపి పోయాం. ఓ నలుగురు పొరగాళ్ళు కూసోనీ ముచ్చట పెడుతున్నారు.
‘టు-లెట్ బోర్డ్ చూసి వచ్చాం, ఇది సింగిల్ బెడ్రూం ఫ్లాటా, డబులా?’ అని అడిగాను.
దానికి ఆ పోరడు “ఆర్ యు వెజిటేరియన్ ఆర్ నాన్ వెజిటేరియన్?” అని అడిగాడు.
‘వుయ్ ఆర్ నాన్ వెజిటేరియన్స్’ అని చెప్పగానే…
“మేము వెజిటేరియన్స్ కి మాత్రమే ఇల్లు ఇద్దాం అనుకుంటున్నం.”అన్నాడు.
బయటకు వచ్చాక చూస్తే టు-లెట్ బోర్డ్ కింద చిన్న అక్షరాల్లో ‘ఓన్లీ ఫర్ వెజిటేరియన్స్’ అని రాసి ఉంది.
బండి ఎక్కిన తరువాత శ్రావణ్ వెనక నుండి “బీఫ్ టేరియన్స్ అని చెప్పాల్సింది రాజా. కొడుక్కి దూల తీరేది.” అన్నాడు.
నవ్వుకొని, బాగా తిరిగి తిరిగి ఆకలి వేస్తుంది. బీఫ్ బిర్యానీ తిందాం అని ముఖ్రమ్ పోయాం.
సాయంత్రం ఏదో పనిమీద ఆర్టీసీ క్రాస్ రోడ్ పోతూ మధ్యలో ఉన్న పద్మశాలి కాలనీలో ఇల్లు చూద్దాం అని ఆగినమ్. అక్కడ ఓ ఇంటికి టు-లెట్ బోర్డ్ కనబడితే కాల్ చేశాం.
ఏం చేస్తారు అని అడిగి,“ఇల్లు ఖాళీగానే ఉంది సార్. ఇంతక ముందు ఉన్న వాళ్ళు ఖాళీ చేశాక ఇల్లు కడగలేదు.” అన్నాడు.
‘పర్లేదు లేండి, మేము క్లీన్ చేసుకుంటాం’ అన్నాను.
“సరే సార్ రేపు సాయంత్రం ఆధార్ కార్డ్ ఫోటో కాపీ, ఒక నెల అడ్వాన్స్ తీసుకొని రండి, మా సార్ తో మాట్లాడిస్తా.” అన్నాడు.
‘యెయ్ ఇల్లు దొరికింది. ఇంకా తిరుగుడు తప్పింది అసలే యెల్లుండి ఇప్పుడు ఉంటున్న ఇల్లు ఖాళీ చెయ్యాలి. సామాను సర్దాలి’ అనుకుంటూ ఇంటికి పోయాం.
ఇంటికి పోగానే చెల్లికి చెప్తే “సరే సామాను సర్దాలి. కాస్త బయట తిరుగుళ్లు ఆపి నువ్వు కూడా ఏమైన హెల్ప్ చెయ్” అన్నది.
‘హా సరే సరే’ అని బయటకు పోతుంటే, ఓనర్ వచ్చి “యెల్లుండి ఖాళీ చేస్తున్నారు కదా? వచ్చేవాళ్ళు అదే రోజు సాయంత్రం దిగుతున్నారు. ముహూర్తం బాగుందంటా” అని చెప్పింది.
‘హా చేస్తున్నాం ఆంటీ, ఇల్లు చూసిన రేపు అడ్వాన్స్ ఇవ్వాలి’ అని చెప్పి బయటకు పోయాము.
పొద్దునే లేచి కొన్ని పనులు ఉంటే చేసుకొని మధ్యాహ్నం కాల్ చేశాను.
“సార్ మా సార్ ఊర్లో లేడు. రేపు పొద్దున్న రండి” అన్నాడు.
‘అన్నా ఇప్పుడున్న ఇల్లు యెల్లుండి ఖాళీ చేయాలి’ చెప్పిన.
“రేపు పొద్దున వచ్చి మాట్లాడి, సాయంత్రం షిఫ్ట్ అయి పోండి” అని అన్నాడు.‘సరే లే అన్నా’ అని ఫోన్ పెట్టేశా.
అతడు చెప్పిన టైంకి, చెప్పిన అడ్రస్ కి పోయాను. అదో బట్టల దుకాణం. అక్కడ ఓనర్ ని కలిస్తే, “పైన మా సూపర్ వైజర్ ఉంటాడు. వెళ్ళి కలవండి అన్నాడు.” పైకి పోయి అతడ్ని కలిస్తే ‘హా సార్ నేనే మీతో ఫోన్లో మాట్లాడింది. మా సార్ తో మాట్లాడినా ఆయన సరే అన్నాడు. సాయంత్రం ఆధార్ కార్డ్ జిరాక్స్, డబ్బులు తీసుకొని రండి”అన్నాడు.
వెళ్తుంటే “సార్ ఓ చిన్నమాట. అది మీరు ఏమి అనుకోకపోతే ఓ విషయం అడగాలి.”
‘అడుగు అన్నా, అంతా ఇబ్బంది ఎందుకు’
“అదే సార్ మీరేంటి?, అంటే మా సార్ కనుక్కో అన్నాడు.”
‘నేను మాదిగను’అని చెప్పిన.
“సరే సార్ ఏం అనుకోకండి. మా సార్ అడుగుమంటే అడిగిన. మీరు సాయంత్రం వచ్చేముందు ఓ సారి కాల్ చేసి రండి.” అన్నాడు.
‘సరే అన్నా’ అని వెళ్లిపోయామ్.
“ఏంది రాజా వీడు కాస్ట్ అడిగిండు ఇల్లు ఇస్తాడా? ఇవ్వడా? ఇవ్వాళ సాయంత్రం ఖాళీ చేయాలి కదా”అన్నాడు సిద్ధార్థ.
‘ఏమో చూద్దాం.” అని ముందుకు నడిచామ్. కిందకి దిగక ఓనర్ చూసి పిలిచాడు. కాసేపు మాట్లాడి మేము యూనివర్సిటీ అనగానే “నేను తెలంగాణోన్నే బాబు” అన్నాడు.
సాయంత్రం కాల్ చేస్తే సూపర్ వైజర్ ఫోన్ బిజీ వచ్చింది. “పక్కనే కదా పోయొద్దాం” పద అన్నాడు శ్రావణ్. అప్పటికే సామాన్లు సర్దడం అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఓనర్ ని కలిస్తే “సూపర్ వైజర్ ని కలవండి బాబు” అన్నాడు. పైకి పోగానే సూపర్ వైజర్ చూసి “సార్ వచ్చిండ్లా. మీకే ఫోన్ చేద్దాం అని చూస్తున్నా.” అన్నడు.
‘ఫోన్ చేసిన అన్నా, నీ ఫోన్ బిజీ వచ్చింది. పక్కనే కదా వచ్చేసాం.” అని చెప్పిన.
“సార్ అది, మా సార్ ఎస్సీ, ఎస్టీలకు ఇల్లు ఇవ్వద్దు అన్నాడు సార్. ఇదే విషయం మీకు ఫోన్ చేసి చేప్దాం అనుకున్న, అంతలోపట్నే మీరే వచ్చిండ్లు. ఏం అనుకోకుండ్లీ సార్” అన్నాడు.
‘సరే లే’ అన్నా కిందకి వచ్చేశాం.
“మళ్ళోసారి ఓనర్ ని ఆడుగుదాం. సాయంత్రం ఇల్లు ఖాళీ చేయాలి. ఇంకో ఇల్లు ఇప్పటికప్పుడు కష్టం కదా” అని శ్రావణ్ అంటే ఓనర్ దగ్గరికి పోయాం.
పోగానే మమ్మల్ని చూసి “బాబు ఇంట్లోకి మా చుట్టాలు వస్తున్నారు. ఇల్లు ఇవ్వడం కుదరదు బాబు” అని చెప్పాడు. ‘సరే అంకుల్’ అని నడుచుకుంటూ బయటకి వచ్చాం.
‘దొంగ నా కొడుకు వాణ్ని కొడుదాం బాబు. యూనివర్సిటీ నుండి మనోళ్లని పిలిపిద్దాం. షాప్ పచ్చలు పచ్చల్ గావలే” అని ఆవేశంగా అన్నాడు శ్రావణ్.
‘ఎంతమందిని అని కొట్టుకుంటూ పోతామ్? వీన్ని ఒకన్ని కొడుతాం. కొట్టినా వాడు ఇల్లు ఇవ్వడు. కులం అంత దుర్మార్గమైనది. ఇల్లును పడావు ఉంచుతది గానీ. కులం గానీ వానికి ఇవ్వడు. కిందోనికి అసలే ఇవ్వదు. వ్యవస్థ మారాలనే సంఘాల్లో పనిచేస్తున్న వాళ్ళం. మారేదాక ఇది తప్పదు.’
“ఈ నా కొడుకులకు ఇల్లు ఉన్నాయనే, వాళ్ళ వాళ్ళకే ఇస్తా అంటారు.” అన్నాడు శ్రావణ్.
‘సంపద వాళ్ళకే సొంతం అయినప్పుడు, ఇల్లు వాళ్ళవే అయి ఉంటాయి. చైనాలో లాగా ఇల్లు కట్టుకున్న నలభై ఏండ్లకు దాన్ని జాతీయం చేయ్యాలి. లేదా కమ్యూన్లను నెలకొల్పి ప్రభుత్వాలే ఇల్లు అందరికీ ఇవ్వాలి. ఈ రెండు పనులు అగ్రకుల భూస్వామ్య ప్రభుత్వాలు చెయ్యవు. మళ్ళీ మార్క్సో, అంబేద్కరో వచ్చి ఆ పనులు చేయరు గనుక మనమే చెయ్యాలి. Caste is a State of mind’ అన్నాడు అంబేద్కర్.
I think we have to blowup this minds’ అని అక్కడి నుండి బయట పడ్డాం.
ఇప్పటికిప్పడు ఇల్లు చూడటం అయ్యే పని కాదని సతీశ్ కి కాల్ చేసి విషయం చెబితే “చెల్లెవాళ్ళ దగ్గర ఉండమను చెప్పు నేను కాల్ చేసి చెప్తా” అన్నాడు.
‘మన సతీశ్ వాళ్ళ చెల్లెళ్ల దగ్గర చెల్లెను, స్రవంతిని ఉండమందాం. నాకు ఎట్లా యూనివర్సిటీ ఉంది. లగేజ్ ఏదో ఓ రూమ్ లో పెట్టొచ్చులే’అని బండి మీద పోయాం.
ఆ రోజు బండి మీద వస్తు కొన్ని పదాలు అనుకున్నా. అలా అనుకున్న పదాలను ఇప్పుడు రాస్తున్న. కొన్ని కథలు జీవితాల్లో ఉండకపోవచ్చు. కానీ కొన్ని జీవితాలు కథలు అవుతాయి. కథా వస్తువులు అవుతాయి. కొన్ని సంఘటనలు జీవితాల్ని మలుపు తిప్పుతాయి. ఆ మలుపును అల్లినా, రాసినా కవితో, పాటో, కథో, నవలో అవుతుంది. అది యే రూపమైన కావచ్చు. కాలంతో సంఘటన సంభాషిస్తుంది. ఇప్పడిదాకా మీరు చదివింది కథ కాదు. జీవితం. జీవితంలో ఓ అనుభవం. ఈ అనుభవం కేవలం నా ఒక్కనిదే అనుకొను. ఇటువంటి అనుభవం ఎదురైనవాళ్ళు వందలు, వేలల్లో కాదు లక్షలు, కోట్లల్లో ఉంటారు.
*
దడుల్ని కూల్చే సాహిత్యం కావాలి
-మొదటి కథ ఎప్పుడు రాశారు?
మొదటి కథ 2017లో రాసిన. దాని ఎండింగ్ నచ్చక. మారుద్దామని ప్రచురణకు పంపలేదు. ప్రచురించబడిన మొదటి కథ ‘అల సెంద్రవంక’. విరసం వెబ్ సైట్ లో ప్రచురించబడింది. ‘అల సెంద్రవంక’లో ‘అల’ను రాశాను. మా యిద్దరి ‘కల’ను ఇంకా రాయాల్సి ఉంది. దాన్ని రాయడం మొదలెడితే అది నవల అవుతుంది. సినాప్సిస్ రాసుకున్నా. అది కార్యరూపం దాల్చడానికి ఇంకో సంవత్సరం పట్టొచ్చు.
-కథంటే మీ దృష్టిలో ఏమిటి? కథ వల్ల కేవలం రచయిత అభిప్రాయం ప్రకటనేనా? ఏదైనా ప్రయోజనం ఉంటుందని భావిస్తున్నారా.
కథంటే ఆయా కాలాల్లో జరిగిన సంఘటల్ని నమోదు చేసేది. చరిత్రను పరిచయం చేసేది. చరిత్రలోని జీవితాల్ని పరిచయం చేసేది. జీవితాల్లోని సంఘర్షణల్ని పరిచయం చేసేది. కథ ఎప్పుడూ కేవలం రచయిత అభిప్రాయంగానే ఉండదు. రచయిత చుట్టూతా జరిగిన వాస్తవాల్ని కథలు ప్రతిబింబిస్తాయి. అయితే కొన్నిసార్లు రచయిత తాను కలగంటున్న ఉటోపియాను కథలోకి తీసుకువస్తాడు. కొన్నిసార్లు భవిష్యత్తును ఊహిస్తాడు. జార్జ్ ఆర్వెల్ తన రచన 1984లో ‘మనుషులు స్క్రీన్ కి బానిసలవడం గురించి రాస్తాడు.’ ఇప్పుడు చూస్తున్నాం. ఎరిక్ ఫ్రామ్ ‘లిసన్ లిటిల్ మాన్’లో “స్వేచ్ఛను కోరుకునే ప్రజలకి స్వేచ్ఛ అంటే ఎంతో తెలియకపోతే హిట్లర్ లాంటి నియంతలని ఎన్నుకుంటారు” అంటాడు. ఇప్పుడు అటువంటి హిట్లర్ పాలనను మనం అనుభవిస్తున్నాం.
కథకి ప్రయోజనం ఉండకుండా ఉండదు. సామాజిక, రాజకీయ ప్రయోజనాలు కథల్లో ఎప్పుడూ ఉంటాయ్. అవి కాకపోతే నవ్వుకోవడానికి. అయితే అది యే ప్రయోజనాన్ని ఉద్దేశించి రాసింది అనేది కొన్నిసార్లు రచయిత మీద ఆధారపడి ఉంటుంది. ఆ ప్రయోజనం ఇప్పుడు ‘సాహిత్య అకాడమీ’నో, ఇంకోటో కూడా కావచ్చు.
మీకు నచ్చిన కథా రచయిత, కథలు? వాళ్ళే ఎందుకని?
ఇష్టమైన కథా రచయితలు అంటూ ఎవరు లేరు. కానీ అల్లం రాజన్న కథలు బాగా నచ్చుతాయి. రాజన్నది ‘అతడు’ నచ్చుతుంది. మా ప్రాంతపు పోరాట చరిత్ర రికార్డు చేసిన కథా అని కావచ్చు. ఇటీవల మహి బెజవాడ రాసిన ‘నారింజ రంగు సిరా మరకలు’ బాగా నచ్చింది. కుప్పిలి పద్మ రాసే కథల్లో ఉండే లాలిత్యం నచ్చుతుంది. గంగోలు అమృత రాసిన ‘అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ’ కథ తెలుగు కథ మూలాలని తవ్వి తీసిన కథ. అది అంతగా ప్రాచుర్యం పొందకపోవడం విషాదం. ఆమె తన రచనను ఆపడం మరీ విషాదం.
యువతరం సాహిత్యానికి దూరమవుతోంది. ఆ వర్గం పాఠకులకు దగ్గర కావాలంటే ఏం చేయాలి?
యువతరం సాహిత్యానికి దూరం అవుతుందా? సాహిత్యం యువతరానికి దూరమవుతుందా?ఇది ఎప్పుడు వెంటాడే ప్రశ్న. యువతరం చదువుతున్నారు. ఇటీవల ఆంగ్లంలో వస్తున్న కవిత్వాన్ని, చేతన్ భగత్ లాంటి వాళ్ళు రాసిన టైంపాస్ నవలలను చదువుతున్నారు. వాళ్ళదాకా ఎందుకు నాకు గుర్తున్నమేరకు అలిశెట్టి కవిత్వం. పి. చంద్ రాసిన ‘శేషగిరి’ నవల, మాక్సిం గోర్కీ ‘అమ్మ’ నేను చదివిన మొదటి సాహిత్యం. తరువాత కాలంలో యండమూరి రాసిన ఫిక్షన్ అంతా చదివాను. 2010లో యూనివర్సిటీకి వచ్చాక మళ్ళీ నా మూలాలను వెతుక్కుంటూ పోయాను. మళ్ళీ ప్రజా సాహిత్యం చదవడం మొదలుపెట్టాను. నామటుకు మన చుట్టూ ఉండే వాతావరణమే మనల్ని చదువరుల్ని చేస్తుంది. అనుకుంటా. మా ఇంట్లో పుస్తకాలు ఉండేవి. క్లాస్ రూమ్ సిలబస్ కన్నా నాకు అవే ఎందుకో బాగా నచ్చేవి. ఇప్పుడా వాతావరణం ఉందా? నేటి యువతకు తగినట్లు రాస్తున్నమా? అనేది మనమే వేసుకోవాల్సిన ప్రశ్న. నా వయసు నాన్ పోలిటికల్ మిత్రులకు (వాళ్ళు అట్లా అనుకుంటారు కానీ అపోలిటికల్ అంటూ ఏది ఉండదు.) నేను రాసిన ప్రేమ కవితలు,solitude, ప్రేమ కథలు ఇష్టపడతారు. అందులో మనం రాజకీయ జీవులం కనుక రాజకీయాలు, సమాజం రాస్తే ఇది అవసరమా? ఇది లేకపోతే బాగుండేది అంటారు. రాజకీయ జీవులు అంతే. ఎవరికి వారు దడి కట్టుకొని ఉన్నారు. ఇప్పుడు ఆ దడుల్ని కూల్చేపని సాహిత్యం చెయ్యాలి. కానీ సాహిత్య సమాజము దాని చుట్టూతా అదే ఒక దడి కట్టుకొని ఉన్నది. అవార్డుల చుట్టూతా తిరుగుతా ఉన్నది. అవార్డుల పరిధిని దాటి వచ్చినప్పుడు అది అన్నీ వయసుల వారికి దగ్గరవుతుంది. అలిశెట్టి, చెరబండరాజు,గద్దర్,అల్లం రాజయ్య, కళ్యాణరావు, గోరేటి, కేశవరెడ్డి వీళ్ళు ఏ అవార్డుల కోసం రాశారు? వాళ్ళ సాహిత్యం ఎందుకని ప్రజల నాల్కల మీద ఉంది?
మీ నేపథ్యం?
ఒకనాటి కరీంనగర్, నేటి పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని. ఇంటర్ వరకు చదువు అక్కడే. ఇంటిగ్రేటెడ్ లా చెయ్యడానికి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చాను. ఇక్కడే ఎల్ఎల్ఎం కూడా అయింది. ఇప్పుడు పిహెచ్.డి కోసం ఎదురుచూస్తూన్నా. సాహిత్య వాతావరణం ఇంట్లో ఉంది. ఇంట్లో పుస్తకాలు ఉండేవి చదవడం అక్కడనుండి అలవాటు అయింది. నాన్న విప్లవ నేపథ్యం నుండి వచ్చినప్పటికి ఇంట్లో రామాయణ, మహాభారతాలు కూడా ఉండేవి. సాహిత్యం పట్ల ఒక దృక్పథాన్ని ఏర్పరచుకుంది మాత్రం యూనివర్సిటీకి వచ్చాకే. రాయడానికి ప్రేరణనిచ్చింది తెలంగాణ ఉద్యమం. ఉద్యమకాలంలో తిరిగిన పల్లెలు. పల్లెల్లో చూసిన మనుషులు. వారి స్థితి గతులు. కవిత్వంలో శివసాగర్, అందుబాటులో ఉన్నమేరకే చదివిన పాబ్లో నెరుడా,‘మన జీవితలను మనమే రాసుకుంటూ, చరిత్రను, వర్తమానాన్ని రికార్డు చెయ్యాలి’ అని ఎప్పుడు చెప్పే కళ్యాణ రావు. మొదటి ఇద్దరి సాహిత్యంతో పరిచయం. కళ్యాణరావుతో వ్యక్తిగత పరిచయం లేకపోతే ఇలా రాసేవాడిని కాదేమో. ‘విప్లవం అంటే బాంబులు పిస్తోల్లే కాదు’ అని చెప్పిన భగత్ సింగ్,‘నిజమైన విప్లవకారుడు గొప్ప ప్రేమ భావనతో నడిపించబడతారు’ అని చెప్పిన చే గెవెరా నాకు ప్రేరణ.
*
అరుణా చక్కటి ప్రయత్నం. కాక పోతే కోకు కథలా డ్రై గా ఉంది. నువ్వు తనూ చెల్లెని ఎక్కడో దింపేసి గది ఖాళీ చేసి ఏ చెట్టు కిందో రాత్రి వెన్నెల్లో కలలు నజుకొంటూ బతుకునల్లుకున్న దృశ్యం తో ముగిస్తే….
అట్లా ఉండేది అంటావ్… వచ్చే కథ డ్రై గా కాకుండా పచ్చిగా రాసేందుకు ట్రై చేస్తా లే.