సూర్యాస్తమయం కూడా వర్షంలాగే
పైనుండి ధారగా కురుస్తుందనీ
పొడిపొడిగా రాలే మసక చీకటి రేణువుల్లోకి
మిగిలిన కాస్త పగటినీ పీల్చుకోడానికే వస్తుందనీ
ఓ గతకాలపు అమాయకత్వం
ఆ naiveté రంగు వెలిసిపోయాక
అనంత కాలపు సంధ్య మధ్యలో
ఈ బలవంతపు epiphany
సాయంత్రం పైనుండి మాత్రమే కురవదు
నిన్నటి వర్షపు మురికినీళ్ళ చుట్టూ
మెల్లగా చేరుతున్న నాచు లో కూడా
సాయంత్రం పుడుతుంది, పూస్తుంది.
నిశ్శబ్దంగా జన్మిస్తున్న నల్లటి రాత్రిని
ఆకులతో జాగ్రత్తగా అందుకుంటున్న చెట్ల కొమ్మలు
ఆ నల్లటి చెట్లపై ఏపుగా పండిన ఏకాంతం
బరువెక్కి
ఒక్కసారే భూమి వేగం తగ్గించాక
సాయంత్రం పైనుండి మాత్రమే కురవదు
ఆణువణువులోంచీ ఊరుతుంది
హృదయంలోంచి చిన్న చిన్న ముళ్ళుగా పొడుచుకొస్తుంది.
చివరి రోజుల్లో లోతుకు పోయిన నాన్న కళ్ళల్లో
ఇదే పొడవాటి అనంత సాయంత్రం
బెంగను రేపే దూరపు చీకటి జాడ
“I don’t have feelings for you anymore”
అని ఆమెతో అన్నప్పుడూ
ఏమీ తోచని ఒక వేసవి మధ్యాహ్నం
అటూ ఇటూ దొర్లుతుంటే
ఉన్నపళంగా జీవితం చల్లబడ్డ చలనం
ఒంటికి గుచ్చుకున్నప్పుడూ
ఆ తర్వాత వీధిలో ఎవరి ముఖం చూసినా
అదే cosmic recurrence, repitition కనబడి
మనసులోని monotony బరువు పెరిగిపోయి ఊపిరాడనప్పుడూ
ఈ సూర్యాస్తమయపు దిగులే కదా
చుట్టూ అలుముకుంది?
Matter-of-factness కి ప్రతీకలా
పగలంతా నిర్లిప్తంగా నిలబడే ఆ పెద్ద ప్రహారీ గోడ
వెలుగు పొలుసులు నేల రాలగానే
దురబేధ్యమైన అడ్డుగోడ గా అనిపిస్తుందెందుకు?
ఆ దిగులు చీకటిని దిమ్మరించుకుని
నిస్తేజపు బండలా కనబడుతుందెందుకు?
టచ్ మీ నాట్ ఆకుల్లాగా
ఇళ్లన్నీ గోడలూ తలుపులూ ముడుచుకుని
అప్పటివరకూ చీమల్లా కదిలిన మనుషులు
నగరమంతా తిరిగి అంటించుకున్న పరాయితనాన్ని
ఓ చిక్కటి వెలివేతగా వీధిలోకి వదిలినందుకు
వికారపు ముఖంతో నిరసిస్తుందా అది?
సాయంత్రమంటే
ఇటు నుంచి అటు తిరిగేప్పుడు
భూమికి కలిగే చిన్నపాటి నిద్రాభంగమే
తెలుసు కానీ
మరెందుకో కిచెన్ మెష్ కి అంటిన దుమ్ములో
ఆ తుమ్మ చెట్టు మొద్దు నలుపులో
ఆమె వెళ్లిపోయిన రోజు చలిగాలి పదునులో
అది ప్రాణంతో కదులుతున్నట్టు ఈ భ్రమ!
వేళ్ళకు చిక్కని లేత నల్లటి పొరలా
Cosmos అంతా అంటుకున్నట్టు
మెదడు వెనకాల ఓ పల్చటి అవిశ్రాంతత
You are just looking at things too closely
సిగరెట్టు ఊదుతూ అందామె ఆ రాత్రి
బీటలు తీసిన కిటికీ అద్దంలోంచి
లోపలికి నీటిలా కారుతున్న వెన్నెల రాత్రిలో
ఆమె మాటలు తేలిపోయాయి
లేదా నేను బరువెక్కడానికి ఇన్నేళ్లు పట్టిందో
ఆమె వదిలెళ్లిపోయిన ash tray ఇంకా అక్కడే ఉంది
అందులో ash వేసినట్టే
బూడిద రంగులో ఉండే సాయంత్రపు మసక చీకటినీ
పొసేద్దాం అని ఎన్ని సార్లు ప్రయత్నించలేదు?
అదంత సులువా?
మొదటి ప్రాణి కన్ను తెరిచినప్పటి ఏడుపు
ఇప్పుడు నాకు గుక్క తిరుగుతుంది
ఎక్కడెక్కడి రైన్ ఫారెస్టుల్లోని మట్టి జిగురంతా
క్షణానికీ క్షణానికీ మధ్య వచ్చి చేరుతుంది
మనుషులు చెప్పుకునే వీడుకోలు
గాలికి కరిగిపోవు కాబోలు
పైపైన పల్చటి పగటి మీగడ కొంచెం కరిగాక
పక్షుల్లా గుంపులు గుంపులుగా విహరిస్తాయవి
May be she is right
I am looking too closely?
నిజమే
Darkness is just the absence of light కదా
ఇంత కహానీ ఎందుకు మరి దాని మీద?
అలా అనుకోవడం సులువేనా?
To feel or not to feel
That is the question
వద్దు వద్దు అనుకుంటూనే
కిటికీ తలుపులు తీసి వర్షపు చుక్కల్ని
ఏరి
వేరుశెనగలు ఒలిచ్చినట్టు ఒక్కో చినుకునీ
ఒలిచి
చిత్తడి గతం, చలి జ్ఞాపకాలు, తడి నైరాశ్యం
మళ్లీ చేతులకంటించుకుంటాను
ఎప్పటి తడికో అంటుకుని ఇప్పటికీ రాలని కలల్ని
వాటితో పాటే కడిగేసుకుంటాను
రోడ్డు పక్క బడ్డీ కొట్టు టైలర్ వేసుకున్న
రంగు వెలిసిన చొక్కాగళ్ళ కిటికీ లోంచి
మధ్యతరగతి అస్పష్ట చిత్రాన్ని
ఎవరు చూడమన్నారు నన్ను?
ఆడపిల్లలు జడలల్లినట్టు
ప్రపంచాన్ని పాయలుగా విడదీసి
తాతయ్య నల్లగొడుక్కి పడ్డ చిల్లుల్నీ,
అలవాటు పడ్డ కొద్దీ కరిగిపోయే యవ్వనపు మోజుల్నీ
ఎందుకు ముడేస్తున్నాను?
లాభం లేదు. ఎక్కడినుంచైనా కాస్త వెలుగు తుంచుకురావాలి.
కానీ ఎలా?
To not feel, అసలు సాధ్యమేనా?
బయటే వదిలేసి మర్చిపోయేందుకు
సాయంత్రం తలుపు కొట్టి రాదు కదా
దూరపు సూన్యం నల్లటి ఆవిరి వదిలితే
దళసరి స్థబ్దతై ఇంటి చుట్టూ
కాస్త కంటి చుట్టూ పరుచుకుంటుంది
టైం అండ్ స్పేస్ గ్రాఫులో గీతల మీదుగా కారి
ఆలోచనల మీద లేతగా కురుస్తుంది
ఇంకా
సాయంత్రాలు ఒంటరిగా ఎప్పుడూ రావు
అవన్నీ చేయీ చేయీ కలిపి నుంచొని
కాలపు గొలుసుని తయారు చేస్తాయి
ఇవ్వాల్టి సంధ్య చెవిలో నిన్న గుసగుసలాడుతుంది. తన చెవిలోనూ ఇలాగే చెప్పబడ్డ
వేల ఏళ్ళ ముగింపుల్ని
కధలుగా చెబుతుంది
పగటి బీటల్లోకి చీకటి పాకిన మిట్టమధ్యాహ్నం
అతని మగత నిద్ర మీద కొండంత బరువునీ
మేల్కొన్నాక కమ్ముకునే existential angst నీ
తేలికపాటి కాలపు కెరటాలకి
మాలిక్యూల్ మాలిక్యూల్ గా రాలిపోయిన
ఓ అందమైన వాల్ ఆర్ట్ నీ
ఆమె బిజీ మైండ్ లో
ప్రస్తావనకీ ఆలోచనకీ జ్ఞాపకానికీ
ఒక్కసారైనా నోచుకోక
ఆకు చివరి నీటిబొట్టులా
Conscious నుండి unconscious లోకి
శబ్దం లేకుండా జారిపోయిన
అతని ప్రేమలేఖనీ
Redemption లేని కథల చివర్లో
రోడ్డు చివరి sunset లేత పసుపునీ
భావాలు మాత్రమే మిగిల్చి
సూన్యంలోకి ఇంకిపోయిన మాటల అవశేషాలనీ
ఇవాళ్టిలోకి బ్రౌన్ రంగు ధారగా పోస్తుంది
హాస్పిటల్లో అమ్మ బెడ్ పక్క స్టూల్ మీంచి కనబడ్డ
ఒకానొక పచ్చ కిటికీ అద్దాల సాయంత్రం
ఇంకా గుర్తుంది
వివరం లేని silhouette పక్షులు ఆ కరెంటు తీగలపై సమయాన్ని గూటికి పంపేసి
తీరిగ్గా కూర్చున్నాయప్పుడు
కిటికీలోంచి కటువుగా తోసుకొచ్చిన సాయంత్రపు నీడ
అమ్మ చేతి మీది నరాల చుట్టూ చేరింది
సెలైన్ సూది పక్కగా బ్యాండేజ్ మీద
జీవితకాలపు పరీక్షలకు సంతకంలా
చిన్న రక్తపు మరక
నాకు తెలీకుండా ముడతలు పడ్డ చర్మం
సంవత్సరాల ఎడబాటు మేఘంలా పెరిగి
ఒక్కసారే కురుస్తుంది ఎప్పుడూ
ఒక్కోసారి
సాయంత్రాలు రాత్రిలోకి కూడా లాగబడతాయి
ముగిస్తే ఇక సమాధి చేద్దామనుకున్న వాటితో వీడుకోలనే అనంతంగా కొనసాగిస్తాయి
అంచు నుంచి సూన్యంలోకి పడే freefall లో కూడా
చలి చీకటి చుక్కలు నుదుటి మీద కురుస్తాయి
ఏమరపాటులో ఉన్న తేలిక క్షణాల్లోకి
చిన్నప్పటి ఓ మత్తైన వెచ్చదనాన్ని
భరించలేని స్పష్టతతో ఊది
మళ్లీ లాగేసుకుంటాయి
చివరి చినుకుల పట పట కి నేల బొర్రులు పడ్డ
నల్లటి చెట్టు బెరళ్ల సాయంత్రం
వీధి మలుపులో ఆగిపోయి మట్టికోట్టుకుపోయిన
కాగితపు పడవల చల్లటి తడి సాయంత్రం
చెరువులో వంకర్లు పోయే వీధి దీపాల
నిశ్శబ్ద నిర్లిప్త సాయంత్రం
దూరపు ప్రపంచ రణగొణ ధ్వనులు
వేగం తగ్గి ఇక దొర్లలేక ఎక్కడో ఆగిపోయిన
మారుమూల పల్లెటూరి సాయంత్రం
లారీల చప్పుడు అన్ని దిక్కులకీ చెదిరే
నేషనల్ హైవే విశాల సాయంత్రం
హాస్పిటల్ ప్రహారీ గోడ మీద ప్లంబింగ్ మరకల
ముదురు ఆకుపచ్చ సాయంత్రం
ఇన్ని సాయంత్రాలు ఒక దాని వెనుక ఒకటి తాకే
నిర్మానుష్య సముద్ర తీరం ఇవాళ్టి సాయంత్రం
ఇదిగో ఇప్పుడే స్ట్రీట్ లైట్స్ వెలిగాయి
బూడిద రంగు melancholy లోకి ఇప్పుడు
పసుపు రంగు antidote పోయబడుతుంది
రోడ్డు మీద అలసిన తిరుగుప్రయాణాలు
చెర్రీ ఎరుపుల తళుకులు పూసుకున్నాయి
May be it’s not that bad
బహుశా నేనే సాయంత్రంతో సంధి చేసుకోవాలేమో
పెరట్లో మెల్లగా పొడి మట్టి వదిలించుకుంటున్న
అలో వెరా మొక్కల కుండీల నుంచీ
రంగు రంగుల అగ్గిపెట్టె ఇళ్ల వ్యూ నిఫిల్టర్ చేస్తున్న
నా రంగు వేయని బాల్కనీ మెష్ లొంచీ
నిశ్శబ్దంగా ప్రసరించే యుగయుగాల సాయంత్రాలనీ
కంటికి కనబడని సన్నటి తరంగాలనీ
చర్మంలోంచి చొచ్చుకుపోనివ్వాలేమో
నరాల్ని వైలిన్ తీగల్లా మీటగా వచ్చే
విషాదపు సింఫనీకి కూడా
ప్రసారమయ్యే ఓ సమయం కావాలి మరి
అందుకు నాలాంటి సాయంత్రపు మనుషులు ఉండాలి
Hemlock ని అందుకున్న సోక్రటీస్లం మేము
ఇదే మా వీలునామా
పొగ మంచు ఉదయాలు మీరు ఉంచుకోండి
పువ్వుల్నీ వెన్నెల్నీ ఫర్వాలేదు తీసేసుకోండి
We will do the dirty work
కాలపు గోడలమీద పిచ్చి పాదుల్ని
వంకర టింకర అక్షరాలతో కత్తిరించి ఇక్కడ పోస్తాం
కావాలంటే కొన్ని ఏరుకోండి
లేదంటే ఎండి రాలిపోనివ్వండి
ఫర్వాలేదు
సాయంత్రం తనలో వీటిని కూడా కలుపుకుంటుంది
*
చిత్రం: రాజశేఖర్ చంద్రం
అవును కదా.. సాయంత్రాలు ఎప్పుడూ ఒంటరిగా రావు, ఇలా ఒక మంచి కవితను పట్టుకొస్తాయి. 😊
చాలా బావుంది స్వరూప్.
ఆ నల్లటి చెట్ల పై పండిన ఏకాంతం బరువెక్కి
వాక్యాలు గుండెను బరువు ఎక్కిస్తున్నాయి
Superb sir