రోజుకు ఒక్కసారి తిని, మూడుసార్లు స్నానం చేయాలన్న శివుడి ఆజ్ఞను నంది తలకిందులుగా అర్థం చేసుకుని మూడుసార్లు తిని ఒకసారి స్నానం చేయమని శివుడి తరుఫున చాటింపు వేసిందట. దేవయ్యకు మండి జనాలకు మూడు పూటలా సరిపడే తిండి పండించే బాధ్యత అప్పట్నుంచి దున్నపోతు జాతి మీదకు నెట్టేశాడని పెద్దవాళ్లు ఓ పుక్కిఃట పురాణం వినిపిస్తుంటారు. మనిషి తన తిండియావకి వేరెవరినో బాధ్యులను చేయడం- పలాయనవాదమంటే ఇదే!
స్వార్థం లేకుండా జీవి మనుగడ సాగించలేదు. నిజమే కానీ, మనిషిది మితి మీరిన స్వార్థం. దోపిడీ అనడం సబబు. అవసరానికి మించి గుంజుకునే ఆ ఆబ పొరుగు ప్రాణికి ప్రాణాంతకమవుతుంది. ఉన్నవాడు పక్కనున్నవాడి దగ్గర ఉన్నదాన్నీ వడలాగేసుకోవడం వల్లనే ‘లేనివాడు’ ఒకడు తయారవుతున్నది! ఈ లేనితనాన్ని పూర్వజన్మ దుష్కర్మకు ఫలితంగా ముడిపెట్టడం మరో దుర్బుద్ధి. బాధితులు ఎదురు తిరగకుండా చేసే పాలకుల తిరకాసు మంత్రం!
ఆశించిన అదనపు కట్నం రాబట్టలేక పెళ్లి పీటల మీద నుంచి వరుడు తాళి కట్టకుండా లేచిపోతే, అదే ముహూర్తానికి మరో యువకుడు అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేసిన సంఘటన.. ఒక అభ్యుదయ పత్రికలో ‘యువకుడి ఆదర్శం’ పేరిట వస్తే, మరో ఆధ్యాత్మిక పత్ర్రికలో ‘ముహూర్త బలం’ శీర్షిక కింద కనిపిస్తుంది. చూసే సంఘటన అర్థమయే తీరు దృక్పథాల ఆధారంగా ఉంటుంది ఎప్పుడూ ఎక్కడైనా.
లంచం గురించిన స్పందనామన సమాజంలో ఒకే తీరులో ఉండకపోవడం అందుకే ఆశ్చర్యం కలిగించదు. ఒక బాధితుడికి ‘దుర్మార్గం’ అనిపించిన ఈ దురాచారం మరో లౌక్యుడికి పనులు అడ్డదారిలో సులభంగా చేసిపెట్టే తంత్రంగా సంతోషాన్నిస్తుంది. డబ్బు తీసుకున్నా పనులు చేసి పెట్టే ఉద్యోగులకు సంఘంలో మంచి గుర్తింపు ఉండడం మన సమాజిక విలువల వైరుథ్యాలకు ఒక దర్పణం. ఈ తరహా సమాజాన్ని గురించి చర్ఛించే రచయిత మీద ‘ఏ ఇజమూ ఉండకూడదు.. నిజముంటే చాలు’ అంటూ ఆంక్షలు రుద్దడం ఎంత వరకు సబబు?
‘అసలు రాయడమెందుకు?’ అన్నదే స్పష్టమైన సమాధానానికి అందని మౌలిక ప్రశ్న ఇప్పటికి చాలా మందికి. తమ కోసం తాము రాసుకుంటాం అంటారు కొందరు రచయితలు. వట్టిదే! తమ కోసం మాత్రమే అయితే రాయడమెందుకు.. నోట్లో నోట్లో అనుకుంటే సరిపోదా? తమ ఆలోచనలతో ఎదుటి వారి దృష్టిని ఎట్లాగైనా ఆకర్షించాలన్న అర్జ్ ఉండ బట్టే ఎన్ని కష్టాలకైనా ఓర్చి, కొంత ఖర్చయినా సరే భరించి మరీ రాతకు పూనుకునేది రచయిత! ‘ఇజాలేవీ లేవు .. వట్టి నిజాలు మాత్రమే రాస్తాను’ అని బుకాయిస్తాడు మరో రచయిత. వట్టి నిజాలూ (రియలిజం) ఒక ఇజమే! ఇజం అంటే మాట, నడత, నైజం వగైరాలన్నీ కలగలసిన మనిషి మానసిక లక్షణం! ఆ ఇజం వినా నిజాన్నే కాదు.. అబద్ధాన్ని కూడా ఎవరం పసిగట్టలేం. ఇజాలు వద్దన్నా ఉంటాయి.. తప్పదు.. వెలుగుకు నీడ తోడులా!
మెదడులా మోకాలు పని చేయదు. మోకాలును చూసి అన్నకోశం పనితీరు మార్చుకోదు. శరీరంలోని ప్రతీ అవయవానికి ప్రాణం పట్ల ఒక్కో రకం అవగాహన ఉంటుంది. ఏ అవగాహన గొప్పది, ఏది తక్కువది అన్న వాదులాటకు దిగి అవయవాలన్నీ పనులు మానేస్తే శాల్తీ మొత్తానికే గల్లంతయ్యే ప్రమాదం కద్దు. దృక్పథాల విభేదాలు మనిషి ఆకలి తీర్చదు. నోటి నుంచి పురీషనాళం దాకా చిన్నా పెద్దా అన్ని శరీరభాగాలు కొట్టుకుంటూనో కోసుకుంటూనో వేటి పనులు అవి ఒక సమన్వయంతో చేసుకుపోతేనే అంగిట్లో పడ్డ మెతుకు జీర్ణమై ఆకలి తీరేది. రకరకాల దృక్పథాలు ఉన్నా సమాజం నడక ఎలాగో సాగుతున్నదంటే ఇదిగో ఇలాంటి తప్పనిసరి సమన్వయం ఉండక తప్పని పరిస్థితుల వల్లనే! సమాజం ఏదో ఒక తీరులో నడుస్తున్నది కాబట్టి అర్థిక వ్యత్యాసాలున్న వర్గాల మధ్య ఒక అవగాహన కుదిరిందనుకోవడానికి లేదు. ఘర్షణ వైఖరులు ఉన్నప్పటికీ సమాజం నడవక తప్పదు.. మనిషి సంఘజీవి కనక.
వ్యక్తిగత ఆస్తి ఒక హక్కుగా ఉన్నంత వరకు ఆర్థికపరమైన ఎక్కువ తక్కువలు.. వాటి మధ్య సంఘర్షణలు ఉండక తప్పవు. రామాయణ భారతాల గొడవంతా ఆస్తి వంటి అధికారాల పంపకాలతో మొదలయిందే కదా! రాముడి కాలంలో రాజ్యాధికారం పెద్దకొడుకు ఏ లిటిగేషన్సుకు తావు లేకుండా వచ్చేది కాబట్టే 14 ఏళ్లు వనవాసం వెళ్లి వచ్చిన తరువాత కూడా భరతుడు అన్నకు అధికారం పువ్వుల్లో పెట్టి ఇచ్చాడు. రాముడు రాజధానిలో లేనప్పుడు కూడా అతగాని పాదుకలు సింహాసనం మీద కూర్చుని స్వామి అధికారాన్ని కాపాడాడు. భారతకాలానికి వచ్చేసరికి అన్నదమ్ముల మధ్య ఆ సఖ్యత తగ్గింది.
కురుపాండవులిద్దరికీ పెద్దా చిన్నాతో సంబంధంతో లేకుండా రాజ్యం మీద పెత్తనం చెలాయించాలన్న కుతే కురుక్షేత్ర యుద్ధానికి కారణమయింది. ఆస్తులు, అధికారాల మీద హక్కుల సమస్య ఎక్కడ తలెత్తుతుందో, ఎక్కడ సవ్యంగా సంపద పంపకాలు సాగే వ్యవస్థ కొరవడుతుందో అక్కడ ఘర్షణ వాతావరణం తప్పక నెలకొంటుంది. లౌకిక లోక చక్రభ్రమణానికి ఆర్థిక సూత్రం మాత్రమే ఇరుసు అని 18వ శతాబ్దిలో కార్ల్ మార్క్స్ సూత్రీకరణ చెయ్యడానికి సహస్రాబ్దాల ముందే లోకంలో ఈ ఘర్షణ వాతావరణం ఆరంభమయింది. ఈ చిక్కుముడి మొత్తం తమకు అవగాహన అయిన మేరకు సాటివాళ్లకూ విడమర్చి చెప్పడం కొందరికి ఆనందం కలిగిస్తుంది. స్వీయాభిరుచులను తోటివారితో కలబోసుకోవడంలో ఆనందం అనుభవించేవాళ్ళు అందుకే రచనలకు పూనుకునేది. వాళ్ల మీద సమాజం ప్రభావం ఉండవద్దన్నా ఉండి తీరుతుంది.
‘రాసిన రామాయణమే ఎందుకు రాస్తున్నార’ని అడిగితే ‘తిన్న అన్నమే ఎందుకు తింటున్నామో.. అందుకు’ అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గడుసుగా. ఆ కవి కొంటె స్పందనలోనే రచయితల రాతలకు సంబంధించిన సందేహాలకు సమాధానం దొరికిపోతుంది. రామాయణంలో కనిపించేలాంటి సంస్కృతి ఆ పెద్దాయనకు మహా ఇష్టం. ఈ ఇరవైఒకటో శతాబ్దంలో కూడా సమాజం అట్లాగే ఉండాలని ఆయనలాంటి వారి గాఢవాంఛ. ఆ వాంఛ పట్ల ఉండే ఇష్టం(ఇజం) వ్యక్తపరచడానికే రామాయణాన్ని ప్రధానాంశంగా ఎన్నుకున్నాడా మహానుభావుడు. తన కోసంగా రాసుకుంటున్నానని చెప్పినప్పటికి ఏ రచయితయినా సమాజాన్ని మాత్రమే కడుపులో పెట్టుకుని రాస్తాడనడానికి ఇంతకు మించిన ఉదాహరణ మరొకటి లేదు.
పుక్కిట పురాణమైనా సరే.. సామాజిక స్పృహతోనే రాయాలి.. తప్పదు. సామాజిక స్పృహ కేవలం ఒక్క కమ్యూనిష్ట్ రచయితల గోలగా అల్లరి పెట్టడంలో ఉన్న కుట్రంతా మార్క్సిజమ్ పట్ల ఆయా వ్యక్తులకుండే ఏవగింపు.
ప్రాచీన సాహిత్యం కూడా తన కాలం నాటి సమాజం మీది స్పృహతో రాయబడిన రాతలే. పరిసరాలను పట్టించుకోకుండా రాయగలిగే శక్తి రచయితకు ఉండదు. ఉండుంటే అద్భుతమైన లోకాలను రచయితలు ప్రపంచం ముందు నిలబెట్టుండరూ.. ఇవాళ ఇంతలా లోకం భ్రష్టు పట్టిపోకుండా!
సమాజం తనని పట్టించుకోవాలని తపనపడ్డట్లే .. రచయితా సమాజాన్ని పట్టించుకోవాలి. పట్టించుకోడం అంటే పతితుల, భ్రష్టుల, బాధాసర్పద్రష్టుల కష్టాలను చూసి కడివెడు కన్నీళ్లు కార్చేసెయ్యడం కాదు. ఆ కష్టాలకి, కన్నీళ్లకు మూలాలేమిటో తన అవగాహన మేరకు అర్థ చేసుకునే ప్రయత్నం చెయ్యడం, పరిష్కారాలకై అన్వేషించడం. ఆ ప్రోసెస్ లో ఉన్న రచయిత ఆ క్రమాన్ని అక్షర రూపంలో ఎప్పటికప్పుడు సమాజంతో పంచుకోకుండా ఉండలేడు.. ఎవరు ఎన్ని నిషేధాలు విధించినా అదుపులోనికి ఉండనిది రచయితలోని ఆ ‘అర్జ్’.
ఆడమనిషికి మగకూలీ కన్నా తక్కువ చెల్లింపులు ఉండే ఈ దేశపు చట్టాల డొల్లతనాన్ని అమాయకురాలైన కూలీపిల్ల ఒకానొక మినీకథలో ఎండగడుతుంది. తాను ప్రయాణం చేసే బస్ కండక్టర్ మగాళ్లతో సమానంగా టికెట్ డబ్బులు డిమాండ్ చేసినప్పుడు ‘పని కాడ చూపించే తేడా ఖర్చుల కాడ ఎందుకు చూపించవో?’ అంటూ సంపాదనలోని అసమానత్వాన్ని, ఖర్చుల్లోని సమానత్వాన్ని ఎత్తి చూపించి ఎద్దేవాచేస్తుంది. ఈ తరహా వైరుధ్యాలే సంఘంలో సంఘర్షణలకు దారితీసేది. ‘పరస్పరం సంఘర్షించిన శక్తులలో చరిత్ర పుట్టెను’ అని శ్రీ శ్రీ అన్నది ఈ వైవిధ్యాల పుట్టలను ఆయా రచయితలు ఎప్పటికప్పుడు వివిధ సాహిత్య ప్రక్రియల్లో నమోదు చేసిన రాతలను మనసులో పెట్టుకొనే.
మనుషుల మధ్య సమానత్వం సాధ్యం కాదన్న దృక్పథం గుడిపాటి చలానికి ఉంది. ‘జంతువులను తమతో సమానంగా ప్రేమించండి ముందు’ అని మనిషిని మందలిస్తాడో సందర్భంలో చలం. సాటి మనిషిని, సాటి స్త్రీని.. జాతి, మత, కుల, వర్ణ వివక్షల ప్రమేయం లేకుండా తమతో సమానంగా అంగీకరించలేని మనిషి జంతువులను ఆదరిస్తాడా?! ఇంట్లో బొచ్చు కుక్కలను పెంచుకునే జంతుప్రేమికుడికి కూడా జంతువుల పట్ల వివక్ష ఉంటుంది. తను పెంచే కుక్కకి బిస్కట్ ముక్క విదిల్చి .. వీధికుక్క మీదకు నిష్కారణంగా రాయి బెడ్డ విసిరే నీచబుద్ధి. మనిషికి అది లేకపోతేనే అదో అద్భుతం!
సంస్కారపరంగా సామాజిక స్పృహ ఉన్నంత మాత్రాన అభ్యుదయ రచనలు చేసే చేవ ఏ రఛయితకూ దానంతట అదిగా పట్టుపడదు. చైతన్యంతో శక్తివంతమైన రచనలు చేయాలని ఉంటే మానవ వికాస చరిత్ర క్రమాన్ని శాస్త్రీయంగా అధ్యయనం చేసే వడుపు పట్టుపట్టైనా సరే రచయిత ముందుకు సాధించాల్సుంది.
మనిషికి ఆహారం అవసరమా అన్న చర్చ అర్థరహితం అప్పుడూ.. ఇప్పుడూ.. ఎప్పుడు కూడా. ఆడపిల్లకు చదువు అవసరమా అన్న ప్రశ్న అట్లా కాదు. ఇప్పుడు ఈ ఇరవై ఒకటో శతాబ్దంలో అర్థరహితం అనిపించినా, కొన్ని శతాబ్దాల కిందట స్త్రీకి విద్య మీదనే కాదు.. జీవించే హక్కు మీద కూడా సొంత అధికారం ఉండేది కాదు. ‘న స్త్రీ స్వాతంత్ర్య మర్హతి’ అన్న మనువు అదుపాజ్ఞల సూత్రాల నుంచి సామాజిక విలువలలో సద్గుణాత్మకమైన మార్పులు రావడానికి ఎన్నో పోరాటాలు అవసరమయాయి. ‘గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్’ అనే మూఢత్వాన్నుంచి ‘మంచి గతమున కొంచెమేనోయ్’ అని తెలివి తెచ్చుకోవడానికి తెలుగు సమాజానికి దాదాపు తొమ్మిది శతాబ్దాల సమయం పట్టింది! ఎప్పటికప్పుడు అభ్యుదయ రచయితలు ముడి నిజాలను మాత్రమే నమ్ముకుని రాయకుండా, భావికాలంలో రావాల్సిన మెరుగైన మార్పులను దృష్టిలో ఉంచుకుని సంఘ సంస్కరణ బుద్ధితో సాహిత్యం సృష్టించబట్టే మానవ వికాస ప్రస్థానంలో మేలు దారులు ఏర్పడటానికి అవకాశం కలుగుతో వస్తోంది.
అన్నీ వేదాల్లో ఉన్నాయని సంతృప్తి చెందడం, భగవద్గీతను నిత్యం పారాయణం చెయ్యడం, రామాయణాన్ని పదే పదే రామకోటిలా రాసుకుంటూ కూర్చోడం లాంటి చేష్టల ద్వారా సాహిత్యానికి ప్రత్యక్షంగా చేకూరే మేలు సున్నా. అట్లాగని ఆ ప్రాచీన వాజ్ఞయమంతా వట్టి తాలూ-తప్పా అని తీర్మానించుకోవడమూ తప్పే. పురాతన భారతీయ సంస్కృతీ సంప్రదాయాల స్థితిగతులను ఆధునిక చరిత్రకారుడు డి. డి. కోశాంబి తరహాలో అధ్యయనం చేసుకునేందుకు అద్భుతంగా పనికొచ్చే అక్షర పరికరాలు!
పరశురామావతారాన్నే ఉదాహరణగ తీసుకోండి. బ్రాహ్మణుడై ఉండీ వేదవిద్యల అభ్యాసంతో సంతృప్తి చెందకుండా శస్త్రాస్త్ర విద్యలు అవుపోసన పట్టి 21 సార్లు భూప్రదిక్షణం చేసి మరీ క్షత్రియులందరినీ ఊచకోత కోసినట్లు ఓ కథ బహుళ ప్రచారంలో ఉంది. ఎంత అతార్కికంగా ఆలోచించేవాడికైనా ఈ కథలోని అంశాలన్నీ వట్టి అభూత కల్పనలు అని తట్టక మానవు. కథను యధాతధంగా విశ్వసిస్తే ఆ తరహా సాహిత్యం వల్ల కలిగే ప్రయోజనం సున్నా. కథ నేపథ్యాన్ని శాస్త్రీయంగా విశ్లేషించుకొనే ప్రయత్నం చేస్తే ఆయా కాలాల సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిస్థితులను గురించి కొంత సమాచారం వాటి నుంచి రాబట్టుకోవచ్చు. డాక్టర్ కోశాంబి దారిలోనే ఈ కథ లోతుల్లోకి పోగలిగితే, బ్రాహ్మణులకు, క్షత్రియులకు మధ్య తలెత్తిన భూవివాదాలే పరశురాముడి వీరంగాలకు ప్రధాన కారణమయి ఉండవచ్చని ఓ తీర్మానానికి రావచ్చు.
వ్యవసాయం ప్రధాన వృత్తిగా అభివృద్ధి చెందే నాటికి బ్రాహ్మణ, క్షత్రియులు కూడా ఉన్నతవర్గాలవారుగా పెత్తనాలు చెలాయించే స్థితిలో ఉన్నారు ఆ నాటి సమాజంలో. పంటలు పండిన ఫలితంగా ఏర్పడిన మిగులు ఉత్పత్తులు పంచుకునే విషయంలో ఏర్పడ్డ మనస్పర్థలే ఈ కథ పుట్టుకకు కారణమయి ఉంటాయని డాక్టర్ కోశాంబి భావించారు.
రాముడిని దేవుడిగా కాకుండా కథలో ఒక పాత్రగా భావించి పరిశీలించ గలిగితే నాడు చలామణీలో ఉండే సామాజిక విలువలకు రామాయణం ఒక డాక్యుమెంటరీ ప్రూఫ్ అయే అవకాశం ఉంది. అతీత శక్తులను పక్కన పెట్టేసి పరిశీలించే పాటి శాస్త్రీయ అవగాహన పెంచుకుంటే పురాణేతిహాసాదుల నుంచి కూడా అపూర్వమైన సమాచారం అంతో ఇంతో తైపార పట్టవచ్చు. వాటి ప్రయోజనాన్ని అంత వరకు మాత్రమే పరిమితం చేసుకునే ఇంగితం అలవర్చుకోవడమే నేటి రచయిత ప్రాచీన సాహిత్యాన్ని అధ్యయనం చేసే శాస్త్రీయ విధానం.
*
Add comment