సామాజిక జీవనానంద తాండవం

విగా, రచయితగా, వ్యాసకర్తగా, విమర్శకుడిగా, ఉపన్యాసకుడిగా, వ్యాఖ్యాతగా, నటుడిగా బహుముఖాల్లో పాఠకులకు పరిచయమైన సాహితీవేత్త డాక్టర్ కె.జి.వేణు. అనేక పుస్తకాలపై తన సమీక్షావ్యాసాల ద్వారా ఇటీవలి కాలంలో పాఠకులకు దగ్గరయ్యారు. వేణు గారు రాసిన 20 కథలతో తొలి ప్రయత్నంగా ప్రచురించిన కథాసంపుటి ‘‘ఆనందతాండవం’’.

తెలుగువారి సంస్కృతి, సంప్రదాయాలు, సాంసారిక విషయాల్ని మించిన ఇతివృత్తాలు ఉండవని వేణు గారి కథలు మరోసారి నిరూపణకు నిలబడతాయి. ఆధారభూతమైన వ్యక్తి అకాలంగా కన్ను మూసినప్పుడు, కుటుంబంలోని ఎవరో ఒకరు రథసారథిగా నిలబడటం మన కౌటుంబిక వ్యవస్థలోని బలం. బరువులెత్తుకోవలసిన జ్యేష్ఠులు కావాలనే పలాయనవాదం పఠించినప్పుడు – ముఖ్యంగా డిజిటల్ యుగంలో – చిన్నవారైనా కాడిని భుజాన వేసుకోవటం అరుదైన విషయమేమీ కాదు. అండగా నిలబడిన ఆపద్బాంధవుడి బాగోగుల గురించి పట్టించుకోకుండా, రెక్కలొచ్చి ఎగిరిపోవటమూ సరికొత్త అంశమేమీ కాదు. ఇలాంటి సర్వసాధారణ అంశాల్లోని అసాధారణ పార్శ్వాలను వేణు తన కథల్లో సున్నితంగా స్పృశించారు.

‘‘ఆ క్యాలెండరులో తేదీలు లేవు!’’ కథలో భైరవమూర్తి జీవితం కష్టాల కడలి. తండ్రి తాగుబోతు. తల్లి కష్టజీవి. ఇద్దరు చెల్లెళ్లు, ఒక తమ్ముడు. పిల్లలకు బాల్యం తీరకుండానే తల్లిదండ్రులు కన్ను మూశారు. తోబుట్టువుల బతుకుభారం భైరవమూర్తి భుజాలపై పడింది. మోశాడు. రెక్కలు ముక్కలు చేసుకున్నాడు. ఆస్తులు కుదువ పెట్టాడు. పంటిబిగువున సంసారం ఈదాడు. ముగ్గురికీ తెరువు చూపించాడు. ఆనక, వాళ్ల దారి వాళ్లు చూసుకున్నారు. అన్నను అనాథగా వదిలేశారు. ఏదీ ఆశించకుండా దగ్గర కాబోయిన మరదల్ని తన వారికోసం దూరం పెట్టినందుకు కుమిలిపోతూ సమాజానికి దూరంగా ఓ చిన్న గుడిసెలో మగ్గీ మగ్గీ ప్రకృతిలో లీనమైనపోయిన భైరవమూర్తి మనల్ని ప్రశ్నిస్తూనే ఉంటాడు.

‘తల్లిదండ్రుల్ని కొడుకులే చూసుకోవాలి’ అనే భావన కాలం మడుగులో అడుక్కి చేరుతోంది. ఆస్తులు ఆశించి, తప్పనిసరి సేవల్లో తరిస్తున్న నాటకాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. ఆ బాధ్యత స్వీకరించటానికి కూతుళ్లు సంతోషంగా ముందుకొస్తున్నారు. అలాంటి ఔన్నత్య హృదయాలకు ‘‘ఆ బిడ్డ నాకు కావాలి’’ కథలోని సుమతి సిసలైన ప్రతినిధి అయితే, అత్తమామల్ని అక్కున చేర్చుకున్న ‘‘మా తల్లి బంగారం’’ కథలోని సునంద ఓ బ్రాండ్ అంబాసిడర్.

‘ఆ బిడ్డ నాకు కావాలి’లో ఆనంద్ తర్వాత సుమతికి జన్మనిచ్చి, తల్లి మరణిస్తుంది. తండ్రి పావనమూర్తి మరో పెళ్లికి దూరంగా ఉండి, పిల్లలకు దగ్గరవుతాడు. సుమతి బాధ్యత గల పిల్ల. ఆనంద్ అల్లరిచిల్లరగా తిరుగుతూ అతి కష్టం మీద డిగ్రీ పూర్తి చేస్తాడు. సుమతికి పెళ్లవుతుంది. ఆనంద్ వైశాలిని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. పుట్టింటికి వచ్చిన సుమతి తన తండ్రిని వదిన హీనంగా చూస్తున్న విషయం గ్రహించి, తనతో తీసుకెళ్తానంటుంది. వదిన ఒప్పుకోదు. ‘లోకం దృష్టిలో మమ్మల్ని చులకన చేస్తావా?’ అని అభ్యంతరం చెబుతుంది. సుమతి వాదిస్తుంది. ‘ఆయనింకెంతో కాలం ఉండడు. పోగానే, ఆస్తిని నీ పేరిట రాయించుకోవాలన్న కుట్ర నీది’ అని వదిన అభాండాలేస్తుంది. మూగసాక్షిగా ఉన్న పావనమూర్తి ఆస్తి తాలూకు కాగితాలన్నిటినీ కొడుకు, కోడలు మొహాన విసిరికొట్టి కూతురి వెంట వెళ్లిపోతాడు. ‘ఆ బిడ్డ నాకు కావాలి’ అంటూ సుమతి కలవరింతలతో మొదలయ్యే ఈ కథలో ఇంతకీ ఆ బిడ్డ ఎవరు? వైవిధ్యభరితంగా సాగి, అంతే విభిన్నంగా ముగుస్తుంది ఈ కథ.

‘మా తల్లి బంగారం’లో అకౌంటెంటుగా రిటైరైన శంకరనారాయణ, సంగీత విద్వాంసురాలు ముక్తేశ్వరిల కొడుకు మనోహర్. సునందను పెళ్లాడి, ఆమెకు నరకం చూపిస్తాడు. చెన్నైలో మనో వగలాడి వలలో చిక్కి భార్యకు విడాకులిస్తాడు. ఆధునిక కాలంతో సమాంతరంగా ఎదిగిన సునంద ఆ ఎడబాటును తేలిగ్గా తీసుకుంటుంది. బంధం తాలూకు జ్ఞాపకాలను మర్చిపోయి, తల్లిదండ్రులతో కలసి ఉంటూ, లెక్చరర్‌గా కొత్త జీవితం ప్రారంభిస్తుంది. కొద్దికాలం తర్వాత ప్రత్యేకంగా ఇల్లు తీసుకుని, వెళ్లిపోతుంది. అమ్మానాన్నలు అదేమని అడిగితే, తను ఇద్దరు అనాథల్ని దత్తత తీసుకున్నానని చెబుతుంది. ఓరోజు తల్లిదండ్రులు కూతురి ఇంటిని చూద్దామని వెళ్లినప్పుడు, ఆ అనాథలిద్దరూ కనిపిస్తారు. ఎవరా అనాథలు? ఆశ్చర్యానందభూతుల్ని మన ఒళ్లో నింపేసి, కథ ముగించేస్తారు రచయిత.

నిన్నమొన్నటి దాకా తెలుగిళ్లు ఉమ్మడి సంసారాల లోగిళ్లు. మేనత్త, మేనమామ, బాబాయి, పిన్ని, అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్య… ఇట్లా అనేక ఆత్మీయబంధాల మధ్య మన మనసులు బాల్యం నుంచే బలం పుంజుకుంటాయి. అలాంటి అనుభవాల మజిలీలు దాటివచ్చిన వ్యక్తులు ఆధునిక మాయాప్రపంచంలోని పోకడలతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. నలుగురు కలిసి నడవటం, పదిమందితో పండగ జరుపుకోవటం వంటి మధురస్మృతులు మాయమవుతున్నాయి. సమైక్య జీవన సౌందర్యం అదృశ్యమవుతోంది. ఇళ్లల్లోనే ఎడారులు ప్రత్యక్షమవుతున్నాయి. ‘‘మేనత్త తల దువ్వుతోంది’’ కథలో ఈ పరిస్థితులన్నీ మన కళ్లెదుట సాక్షాత్కరిస్తాయి…

ఏ వ్యక్తికైనా మేనత్తతో ఉండే అనుబంధం అపురూపం. సత్యవతికి సుశీలమ్మ కూడా అలాంటి మేనత్తే. సత్యవతికి తమ్ముడంటే మహా ఇష్టం. భర్త అకాల మరణంతో, ఆ ఖాళీని పూడ్చుకోటానికి తమ్ముడింటికి చేరుకుంటుంది. మరదలు, పిల్లలు మంచోళ్లే. కాకపోతే, ఆప్యాయతే ఎండమావి. నగరంలోని ఆ ఇంట్లో వంట చేయటం అరుదు. నలుగురూ కూచొని మాట్లాడుకోవటం అరుదు. కలిసి చర్చించుకోవటం అరుదు. అదో బీడుభూమిలా అనిపించి, అక్కడినుంచి పారిపోయినంత పని చేస్తుంది. ఆ తర్వాత సత్యవతి జీవితం ఏ తీరాలకు చేరింది? ఆమె మనసులో ఏర్పడిన అగాథం చదునయ్యే ప్రపంచపు ఒడిలోకి నడిచిందా? సంబంధబాంధవ్యాల సున్నిత పొరల్ని విప్పుకొంటూ పోయిన కథ ‘మేనత్త తల దువ్వుతోంది’.

కొన్నిసార్లు విధి మన క్షేమం కోరుతుంది. అజ్ఞానంతో అడుసులో కాలు వేయబోతుంటే, అదృశ్య హస్తమేదో మన చిటికెన వేలు పుచ్చుకొని దారి మళ్లిస్తుంది. ‘‘ఆనందతాండవం’’ కథలో శ్రావణికి పెళ్లి కుదురుతుంది. తనేమో రాజేష్‌ను ప్రేమిస్తుంది. ఇంట్లో ఒప్పుకోరు. రాజేష్ ఢీలా పడతాడు. పారిపోయి పెళ్లి చేసుకుందామని ప్రతిపాదిస్తాడు. అతగాడి చిలకపలుకులకు శ్రావణి కరిగిపోయి, అతని వెంట బయల్దేరుతుంది. స్టేషన్లో రైలు కోసం ఎదురు చూస్తుండగా, ఓ నూతన జంట ఎదురవుతుంది. వారిని సాగనంపటానికి వచ్చిన తల్లిదండ్రుల మాటలు శ్రావణి చెవిన పడతాయి. ఆమెలో ఆలోచన రగులుతుంది. మనసు మార్చుకుని, అతని చేతిని వదిలేసి ఇంటిముఖం పడుతుంది. తన కుట్ర ఫలించనందుకు కుప్పకూలిపోతాడు రాజేష్.

*****

సంపుటిలోని మరో మూడు కథలు రచయిత పరిశీలనాశక్తికి నిలువుటద్దాలు. అవసరార్థుల బలహీనతను ఆసరా చేసుకుని, వడ్డీలు గుంజే వ్యాపారుల కర్కశత్వాన్ని ‘‘బల్లిశాస్త్రం’’ గొప్పగా బహిర్గతం చేస్తుంది. ఈ కథలో శ్యామరావు వడ్డీ వ్యాపారి. ఈ తరహా వ్యక్తులు అంత తేలిగ్గా మారరు. వడ్డీల మీద వడ్డీలు వేసి, అవి కట్టలేని వారి ఆస్తుల్ని తమ ఖాతాలో జమ వేసుకుంటారు. సంపాదన యావలో పడి మానవీయ విలువల్ని సుఖప్రదంగా మర్చిపోతారు. అలాంటి జీవితానికే అలవాటు పడిన శ్యామరావు మనసులో చలనం తెస్తుంది ఓ బల్లి. పాదంలోంచి చెక్కలోకి ఓ మేకు దిగటంతో రెండేళ్లుగా ఆ బల్లి కదలకుండా ఉండిపోతుంది. ప్రాణముంది కాబట్టి ఆకలీ ఉంటుంది. దాని ఆకలి గురించి తెలియకపోయినా, శ్యామరావు ఆ చిరుప్రాణి వంకే చూస్తుండగా… మరో బల్లి ఆహారాన్ని తన నోట కరచుకొని తెచ్చి, నిశ్చలనంగా ఉన్న బల్లికి అందించటం చూస్తాడు. ఆ దృశ్యం అతన్ని నిలువెల్లా కుదిపేస్తుంది. తన దగ్గర భద్రంగా దాచుకున్న ప్రామిసరీ నోట్లన్నిటికి నిప్పు పెడతాడు. అసలు ఇలాంటి దృశ్యాన్ని ఊహించటంలోనే రచయిత విజయం దాగి ఉంది.

రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతుంటాయి. పెట్రోలు, ధాన్యం, నిత్యావసర సరుకులు తీసుకెళ్లే లారీలు బోల్తా పడినప్పుడు నిమిషాల వ్యవధిలో జనం పోగవుతారు. ఎవరి చేతికందిన వాటాను వారు అప్పనంగా పుచ్చుకెళ్లిపోతారు. ప్రాణనష్టం జరిగినప్పుడే కాదు, పంటనష్టం కలిగిప్పుడు కూడా బాధితులు తల్లడిల్లిపోతారన్న విషయం గభాల్న మన ఊహకందదు. ఈ అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని వేణు గారు రాసిన మరో మంచి కథ ‘‘చేదు చెరుకులు’’…

తల్లి ఆస్పత్రిలో చావుబతుకుల్లో ఉంది. అతను బస్సులో బయల్దేరాడు. రెండు గ్రామాల మధ్యలో ట్రాఫిక్ జామ్. కిందికి దిగి చూస్తే, చెరుకులు తీసుకెళ్లే లారీ బోల్తా పడి ఉంది. వాహనాల్లోంచి దిగిన పౌరులు కుస్తీ పడుతున్నారు. చేతికందినన్ని చెరుకులు సొంతం చేసుకుంటున్నారు. దూరంగా నుంచొని చూస్తున్న కథానాయకుడు ఆ యుద్ధంలో పాల్గొనలేక, పక్కనున్న పెద్దాయన్ని బతిమాలుకుంటాడు. ఆ పెద్దాయన రెండు చెరుగ్గడలు అందిస్తాడు. మెల్లగా మాటలు కదిపితే, ఆ పెద్దాయన తన కథ చెబుతాడు. ఆ చెరుకులారీ తనదేనని, మార్కెట్టుకు తీసుకెళ్తుండగా పంట నేలపాలైందని వాపోతాడు. ‘‘మరో లారీ తెచ్చుకొనే లోపే, మీరంతా కలిసి నా పంటను మొత్తం దోచుకుపోయారు. చివరకు నా నోట్లో మట్టి కొట్టారు. ఇప్పుడు నేనెలా బ్రతికేది’’ అంటూ కన్నీటి పర్యంతమవుతాడు. కథానాయకుడిలో నేరం చేసిన భావన. చూస్తుండగానే ఆ రైతు ఒక చెరకును విరిచేసి, ఒక ముక్కతో తన కడుపులో బలంగా పొడుచుకుంటాడు. ప్రత్యక్ష సాక్షిగా ఉన్న అతనుగానీ, అక్కడి పౌరులుగానీ స్పందించారా? రైతు ప్రాణాలు దక్కాయా?  అతని తల్లి ఏమైంది? ఈ ప్రశ్నలన్నిటికీ ‘చేదు చెరుకులు’ కథ సమాధానమిస్తుంది. కథ పూర్తయినా ఆ రైతు చెరుకుగడతో మన వెనక వెంబడిస్తూనే ఉంటాడు.

ఒకవైపు పిడికెడు మెతుకులు దొరక్క పేదవాడు తల్లడిల్లిపోతుంటే, మరోవైపు పంచభక్ష్య పరమాన్నాలను అరాయించుకోలేక బలిసినోడు దిగులు పడుతున్నాడు. పోనీ, తన దగ్గర అవసరానికి మించి ఉన్న ఆహారాన్ని పేదోడికి ఉదారంగా దానం చేస్తాడా అంటే ఆ సౌహార్దం కనిపించదు. ఒకవేళ చేయాల్సి వచ్చినా, తన వెర్రిమొర్రి కోరికల్ని తీర్చుకోటానికి ఆ సందర్భాన్ని వేదికగా వాడుకుంటాడు. కడుపు కాలేవాడికీ కడుపు మండుతుంది. కాకపోతే, ఆ మంటల్ని కూడా తనకనుకూలంగా మార్చుకోగల శక్తి అతని బీరువాల అరల్లో నిక్షిప్తమై ఉంటుంది. ఈ పరిస్థితిని ప్రతిభావంతంగా అక్షరబద్ధం చేసిన కథ ‘‘ఇదీ ఈ దేశం’’…

అన్నదమ్ములు బిచ్చగాళ్లు. ఓ రాత్రిపూట కొన్ని పదార్థాలతో కూడిన ఎంగిలి విస్తరి కనిపిస్తుంది. కుక్కలూ పందులూ తిరిగే మురిక్కాల్వ పక్కన దొరికిన ఆ విస్తరిలోని రుచుల్ని ఆస్వాదించటానికి ఇద్దరూ కొట్లాటకు సిద్ధమవుతారు. అదే సమయంలో పక్క వీధిలో నియాన్ లైట్ల వెలుగులో మెరిసిపోతున్న అద్దాలమేడలో ఫణిభూషణం డైనింగ్ టేబుల్ ముందు కూచుంటాడు. మటన్ పలావు, చికెన్ ఫ్రై, ప్రాన్స్ తదితర వంటకాలన్నీ ఎదురుగా ఉన్నా; నాలుగు మెతుకులు తినేసరికి కడుపు నిండిపోయి, ఆపసోపాలు పడుతూ బాల్కనీలోకి వస్తాడు. ఆ వీధిలోకి చేరుకున్న అన్నదమ్ములు మేడ మీదికి మెడలు సారించి, ‘‘ఆకలితో సచ్చిపోతన్నాం బాబూ. ఇంత కూడుంటే పెట్టండి’’ అని అర్థిస్తారు. పైకి రమ్మంటాడు ఫణిభూషణం. మిగిలిందంతా తినమంటాడు. ఇద్దరూ ఆత్రంగా ఆ పాత్రలన్నీ కిందికి దించుకొని, మఠం వేసుక్కూచుంటారు. అప్పుడా బడామనిషి ‘‘మీరిద్దరూ ముష్టియుద్ధం చేసుకోవాలి. గెలిచిన వాడు వీటిని తినొచ్చు. అంతేగాదు, వాడికి మరో ఆరు నెలలపాటు ఇదే భోజనం ఉచితంగా పెడతాను’’ అంటూ ఓ వినోదక్రీడలోకి వాళ్లిద్దరినీ బలవంతంగా తోస్తాడు. ఆ ఇద్దరిలోని ఆకలి అనుబంధాన్ని నమిలేస్తుంది. పొట్టేళ్లలా ఢీకొంటారు. పోట్లగిత్తల్లా కుమ్ముకొంటారు. దుస్తులు చిరిగాయి. బుర్రలు పగిలాయి. రక్తం కారింది. ఇద్దరూ ఫణిభూషణం కాళ్ల దగ్గరకు పాక్కుంటూ వచ్చి, ‘‘బాబూ, మాకియ్యన్నీ వద్దు. పట్టెడు మెతుకులు పెట్టండి చాలు’’ అని బతిమాలుతారు.

దానికి అతగాడు ‘‘స్వాతంత్ర్య దేశంలో సోమరితనాన్ని ప్రోత్సహించటం మహా పాపంరా. మీ ఇద్దరిలో గెలుపెవరిదో నేను నిర్ణయిస్తాను’’ అంటూ కాడల్లా ఉన్న ఆ ఇద్దరినీ పైకిలేపి తలలు మోటిస్తాడు. కొన ఊపిరి వేళ… ఆ ఇద్దరిలోనూ ఆగ్రహం పెల్లుబుకుతుంది. ఒక్కసారిగా తిరగబడతారు. అతన్ని కసిదీరా కుమ్మేసి, ఓ మూలన పడేసి, తాపీగా భోజనానికి కూచుంటారు. అదే సమయంలో అక్కడికొచ్చిన పోలీసు, జరిగిందంతా అర్థం చేసుకుని, వాళ్ల మీద కేసు బనాయిస్తానని చెబుతాడు. ఆ ఇద్దరూ మళ్లీ తిరగబడతారు. పోలీసును అడ్డం పెట్టుకొని, ఫణిభూషణం తన పగను ఎలా తీర్చుకున్నాడో తెలియాలంటే ‘‘ఇదీ ఈ దేశం’’ కథ చదవాల్సిందే. ఈ కథలోని ముగింపు వాక్యం చాలా విలువైనది.

తమ గ్రామాన్ని నాగరిక ప్రపంచం నుంచి విడదీస్తున్నట్లు, అడ్డుగా నిలబడి ఉన్న కొండను తవ్విన ‘‘రాజయ్య దేవుడయ్యాడు’’, ఆస్తిపాస్తుల కన్నా అనుబంధాలే మిన్న అని చాటిన ‘‘మహామంత్రాల పుష్పం’’, ఓ మహిళ వెన్నలాంటి తన హృదయాన్ని అవసరార్థం గయ్యాళితనపు పొర కింద దాచుకున్న ‘‘అవును నేను గయ్యాళినే’’ కథలు దేనికదే భిన్నం.

ప్రక్క, త్రవ్వు, వ్రేళ్లు, క్రొత్త, బ్రతుకు, త్రోసుకుంటూ వంటి పదాలను ‘క్రావడి’ నుంచి విడిపిస్తే వాక్యం మరింత అందంగా ఉంటుంది. ఫుల్‌స్టాపులు, కామాలు కొన్నిచోట్ల గతులు తప్పాయి. ఇన్వర్టెడ్ కామాలు అక్కడక్కడా స్థానచలనం పొందాయి.

మొత్తం మీద కె.జి.వేణు గారి కథలు పాఠకుడిలోని సున్నితపొరల్ని అంతే సున్నితంగా స్పృశిస్తాయి. మానవీయ స్పందనల్లో చైతన్యం కల్గించటానికి ప్రయత్నిస్తాయి. ఈ రచయిత ఊహల్లో ప్రాణం పోసుకునే సహృదయశీలురైన అల్లుళ్లు, అత్తాకోడళ్లు, బంధువులు మనతోనూ స్నేహం చేస్తారు. మానవీయ సంబంధాల పట్ల మనలో ధనాత్మక ఆలోచనల్ని రేకెత్తిస్తారు.

‘‘అందరి కళ్లల్లో జాలి నీరెండలా ఆ సొరంగం నిండా వాలిపోయింది’’, ‘‘ప్రేమకు ఆమె పుట్టిల్లు లాంటిది’’, ‘‘రాత్రి తన నివాసం కోసం పెరట్లోకి… చీకటి తరుముకుంటూ వచ్చింది’’, ‘‘కర్కశం నాగుపాములా బుస కొట్టింది’’ వంటి వాక్యాలు వేణు గారి కథనసౌందర్యాన్ని పట్టిస్తాయి. నవ మల్లెతీగ ప్రచురించిన ఈ కథాసంపుటి ముఖచిత్రం, పేజీ లే-ఔట్‌ల విషయాల్లో కలిమిశ్రీ (9246415150) తీసుకున్న శ్రద్ధ అభినందనీయం.

డాక్టర్ కె.జి.వేణు గారి నుంచి మరిన్ని మంచికథలు ఆశించవచ్చు.

                                    *

ఎమ్వీ రామిరెడ్డి

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు