మేము వారణాసిలో బయలుదేరే సరికే ఉదయం పది దాటింది. వారణాశి నుంచి ప్రయాగరాజ్( అలహాబాద్ ) కి 125 కిలోమీటర్లు మాత్రమే. మహా అయితే మూడు గంటల ప్రయాణం. మధ్యాహ్నం ఒంటిగంటకి చేరుకున్నా సాయంత్రానికల్లా సంగమ స్నానం అయిపోతుంది. సాయంత్రమంతా మేళాలో అఖాడాలన్నీ తిరగాలి. మర్నాడు ఉదయం బయలుదేరి వారణాసి ఎయిర్పోర్ట్ కి ఆపై విశాఖపట్నం …
మేము రిజర్వు చేసుకున్న ‘అద్వాంత కుంభ క్యాంపు ‘ ఇంకో కిలోమీటరు దూరంలో ఉందనగా ట్రాఫిక్ జాం లో ఇరుక్కున్నాం. టైం మధ్యాహ్నం రెండయ్యింది. ఎప్పటికీ ట్రాఫిక్ కదలకపోవడంతో కిందకి దిగి కొంచెం దూరం నడుచుకుని వెళ్ళాను. కార్లు అడ్డదిడ్డంగా వస్తుండటం వల్ల అరకిలోమీటరు దూరం ట్రాఫిక్ ఆగిపోయింది. మధ్యలోనుంచి వచ్చే కారుల్ని కొంచెం కంట్రోల్ చేస్తే ఐదు నిమిషాల్లో ట్రాఫిక్ క్లియర్ అయిపోతుంది. పోలీసులు చూస్తూ కూర్చున్నారు కానీ ఏమీ చేయడం లేదు. పాపం ప్రయాణీకులే సర్దుకుని పోతున్నారు. ఎలాగోలా బయటపడి పార్కింగ్ ఏరియా కి వచ్చేసరికి ఇంకో గంట పట్టింది. ఆశ్చర్యంగా అక్కడో టోల్ గేట్ పెట్టారు.ఎవరికో కాంట్రాక్ట్ కి ఇచ్చినట్లున్నారు. అక్కడో అరగంట. కొన్ని వేల కార్లు వచ్చే ప్రదేశంలో టోల్ గేట్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది. మన గోదావరి పుష్కరాల్లో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని హైవే లో ఉన్న టోల్ గేట్లనే తీసేసారు. ఇంత పెద్ద మేళా కి సరిపడా ప్రణాళిక లేకపోవడం విచిత్రంగా అనిపించింది.
మొత్తానికి మా క్యాంపుని వెదుక్కుంటూ వెళ్ళేసరికి సాయంత్రం అయిపోయింది. మేము కావాలనే ఎక్కువ రద్దీ లేని రోజును ఎన్నుకున్నాం. నాగసాధువులు షాహి స్నానాలు చేసే మౌని అమావాస్య , వసంత పంచమి లాంటివి కాకుండా ఒక నాన్-స్నాన్-డే నాడు అంత రద్దీ ఉండదని అనుకున్నాం. అయితే మాలాంటి తెలివైన వాళ్ళు ఎక్కువవడం వల్లో, పోలీసుల అత్యుత్సాహం మరియూ ప్రణాళిక లేమి వల్లో తెలియదు కానీ మా క్యాంపు నుంచి కుంభమేళా కి వెళ్లే దారులన్నీ ట్రాఫిక్ రిస్ట్రిక్షన్స్ పెట్టేసారు.
నది ఒడ్డునే కొన్ని వేల టెంట్స్ వేసి టెంట్ సిటీ అని పేరు పెట్టారు . డీలక్స్, లగ్జరీ , ఆర్డినరీ , తాజ్ లాంటి ఐదు నక్షత్రాల హోటల్స్ వాళ్ళు , నాలుగు నక్షత్రాల రిసార్ట్ ల వాళ్ళు … రకరకాల టెంట్స్ … మా టెంట్ కి ఒక వసారా , దానిలో కుర్చీలు , అటాచడ్ బాత్రూమ్ , హాట్ వాటర్ , లగ్జరీ బెడ్స్, ఏభై అడుగుల దూరంలో గంగా నది… గంగా , యమునా సంగమ ప్రదేశం నుంచి ఒక కిలోమీటరు దిగువన ఒడ్డునే ఉంది మా క్యాంపు.
మేము మొత్తం ముగ్గురు మిత్రులం. నేనూ , ఫణీ వారణాసి వరకూ ముందురోజు ఫ్లైట్ లో వచ్చి అక్కడో రాత్రి గడిపి , అక్కడినుంచి కార్ లో వస్తే , ఇంకో మిత్రుడు వైజాగ్ నుంచి నేరుగా ఈ రోజు తెల్లవారు ఝాముకల్లా ప్రయాగరాజ్ వచ్చి తెల్లారేసరికల్లా సంగమ స్నానం కానిచ్చేశాడు.
సాయంత్రానికల్లా ఇదీ మా ముగ్గురి పరిస్థితి …
నాకు కుంభ స్నానం మీద పెద్ద ఆసక్తి లేదు. ఆసక్తి అంతా నాగసాధువుల మీదే !
ఒకడికి సంగమ స్నానం మీద ఆసక్తి , భక్తీ ఉంది గానీ ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ వల్ల సంగమ స్థానానికి ఎప్పటికి వెళ్ళగలమో తెలియని భయం కూడా ఉంది. పైగా మా క్యాంపు పక్కనే ఒక ఘాట్ ఉంది. గంగా యమునా సంగమం అయిపోయిన తర్వాత వచ్చే నీళ్లే కాబట్టి పుణ్యం సమస్య లేదు.
ఇంకొకడు అప్పటికే సంగమస్నానం కానిచ్చి బట్టతలపై ‘జై శ్రీరాం’ అనికూడా రాయించుకున్నాడు.
క్యాంపు వాడిచ్చిన గైడ్ ని తీసుకుని వాడి డొక్కు కారులో అఖాడాలు చూడడానికి వెళ్దామని నిర్ణయించుకున్నాం. మాతోపాటు మా క్యాంపు లోనే ఉంటున్న ఒక ప్రొఫెసర్ కూడా బయలుదేరింది. ఇంచుమించు మా వయసే ఉంటుందేమో ! బయో టెక్నాలజీ లో ప్రొఫెసర్ అట. మా గైడ్ మా గోదారోళ్ళు ‘ గోదారి ‘ అనే పదాన్ని ఎన్ని రకాలుగా వాడతారో దానికి పదిరెట్లు ‘ సీతారాం ‘ అని వాడుతున్నాడు. ట్రాఫిక్ లో పోలీసులు ఆపేస్తే ‘ఓ సీతారాం ‘ ! రోడ్లు ఖాళీగా ఉంటే ‘జై సీతారాం ‘!! పార్కింగ్ దొరికితే ‘హే సీతారాం ‘!!! దొరక్క పోతే వట్టి ‘ సీతారాం ‘.
ఇది మహా కుంభమేళా ! అంటే 144 సంవత్సరాలికి ఒకసారి వస్తుందట !! అసలు కుంభమేళా ఎలా ప్రారంభమైందో ఎవరికీ తెలియదు. ఎనిమిదవ శతాబ్దంలో శంకరాచార్యుల వారు ప్రారంభించారని ,వేరు వేరు అఖాడాల్లోని సాధువులు ఈ మేళా సందర్భంగా ఇక్కడికి వచ్చి మత సంబంధమైన చర్చల్లో పాల్గొనడం , పుణ్య స్నానాలు చేయడం , నదుల్ని పూజించడం వంటివి చేసేవారని ఒక నమ్మకం. దేవదానవుల క్షీరసాగర మథనంలో పుట్టిన అమృతాన్ని అందరికీ పంచే సమయంలో నాలుగు చోట్ల ( నాసిక్, ప్రయాగ , హరిద్వార్ ,ఉజ్జయిని) అది ఒలికిందని అందువల్లే ఆ ప్రదేశాల్లో కుంభమేళా జరుగుతుందనీ ఒక కథ. వేల సంవత్సరాల నుంచి హిందువుల ప్రకృతి ఆరాధనలో భాగంగా నదులకి పుష్కరాలు జరిగినట్లు ఆధారాలు ఉన్నా 19 వ శతాబ్దం వరకూ కుంభమేళా జరిగినట్లు ఎటువంటి దాఖలాలు లేవనేది ఒక వాదన. అయితే ప్రజాస్వామ్యంలో మెజారిటీ ఏది చెబితే అదే నిజం కావున ఇది మహా కుంభమేళా అని , 144 సంవత్సరాలకు ఒకసారి వస్తుందనీ నమ్మడమే మనకి మిగిలిన భవిషత్తు చరిత్ర.
ట్రాఫిక్ కష్టములెట్లున్నను మూడు కిలోమీటర్ల దూరంలోని మేళా కి గంటన్నరలో చేరాం. ఒక్కో అఖాడా తిరిగే కొద్దీ నాకు కుంభమేళా పై ఒక అవగాహన కలిగింది. శంకరాచార్యులు ఏ ఉద్దేశ్యంతో పెట్టారో తెలియదు కానీ ఇప్పుడది వేరు వేరు అఖాడాల, ఆశ్రమాల ట్రేడ్ ఫెయిర్! ట్రేడ్ ఫెయిర్ లో కంపెనీలు ప్రొడక్ట్స్ ని ప్రదర్శించినట్లు ఇక్కడ మోక్షమార్గాల ప్రదర్శన జరుగుతోంది !
నా ఆసక్తి అంతా నాగసాధువుల పైనే. ‘పారడైస్ ‘ అని కుష్వంత్ సింగ్ రాసిన కథ ఒకటుంది. తన తల్లి ప్రియుడే తన మీద చేయి వేయబోతే, తన దేశంలోని మెటీరియలిస్టిక్ ప్లెజర్స్ తో విసిగిపోయిన ఒక విదేశీయురాలు శాంతి కోసం రిషీకేశ్ లోని ఒక ఆశ్రమంలో చేరుతుంది. ఆశ్రమంలోని ఒక యువతితో స్వలింగ సంపర్కం , బజారులో కలిసిన ఒక నాగ సాధువు వంద రూపాయలు తీసుకుని తన జననాంగాన్ని పట్టుకోవడానికి అనుమతివ్వడం వంటివి చూసి మళ్లీ తన దేశానికి ప్రయాణమవుతుంది. నాగ అనే పదం సంస్కృతం లోని నగ్న నుంచి వచ్చిందట. సాంసారిక బంధాల నుండి విముక్తి కి సంకేతంగా నాగ సాధువులు బట్టలు ధరించరు. తన పాత జీవితానికి అంత్య క్రియలు జరుపుకుని , కుటుంబ బంధాలని వదులుకుని , అఖాడ ( సన్యాసుల మఠం) నియమాలకు అనుగుణంగా జీవిస్తారు. మొఘల్ ల కాలంలో హిందూ దేవాలయాలను ,యాత్రా స్థలాలను కాపాడటానికి ఆయుధాలతో పోరాడేవారట.
మా గైడ్ ఒక్కో అఖాడా తిప్పుతూ వాళ్ల జీవితం గురించి చెబుతున్నాడు. ‘జునా ‘ అఖాడ … నిరంజన్ అఖాడ,కిన్నెర అఖాడా … కొన్ని సిక్కు అఖాడాలు కూడా ఉన్నాయి. ఒక్కో అఖాడాకి ఇంచుమించు అరెకరం స్థలం కేటాయించారు. ఆ స్థలంలో పది పదిహేను టెంట్స్. ఒక్కో టెంట్ లో ఒకటి నుంచి పదిమంది వరకూ సాధువులు. చిన్న కట్టెల మంట చుట్టూ చేరి చిలుం నిండా గంజాయి దట్టించి కబుర్లు చెప్పుకుంటున్నారు. నేను నా కెమెరాని ఎక్కుపెట్టినప్పుడు కొంతమంది పోజులు కూడా ఇవ్వడం మొదలెట్టారు.
వంటినిండా బూడిద రాసుకుని కొన్ని వేల రుద్రాక్షలు ధరించిన బాబా … పదేళ్ల నుంచి తన ఎడమ చేతిని ఎత్తి పట్టుకుని దింపకుండా ఉంచిన బాబా… జీవితమంతా కూర్చునే ఉండేవాడు ఒకడు… ఐ ఐ టి లో చదివి బాబా గా మారిన ఐ ఐ టి బాబా… ఇంచుల లెక్కన గోళ్ళు పెంచుకున్న బాబా… రక రకాల బాబాలు. బహుశా వెరైటీ కోసం అలాంటి వేషాలు వేస్తున్నారేమో! ఏ గుర్తింపుని కోల్పోవడానికి బట్టలు వదిలేసారో అదే గుర్తింపు కోసం విచిత్రమైన ప్రదర్శనలు మొదలెట్టారు ! ప్రపంచ వాసనలను త్యజించడం బట్టల్ని వదిలినంత సులభంకాదేమో !
మేము చూస్తుండగానే ఒక సాధువు తన జననాంగాన్ని చేతితో ఎగరేస్తూ బయటికి పరుగెత్తుకుని వచ్చాడు. ఇద్దరు విదేశీ మహిళలు అతనితో ఫోటో దిగడానికి ఉత్సాహం చూపడమే దానికి కారణం. ఆ మహిళల భుజాలపై చేయి వేసి ఫోటోలకి పోజు ఇస్తూ చుట్టూ మూగిన వారికి వినోదాన్ని పంచాడు.ఇంకో నగ్న సాధువు తన దగ్గరికి వచ్చిన వారి గాగుల్స్ ధరించి వారి తలపై కొడుతూ ఆశీర్వదించడం గమనించాను. మాతో వచ్చిన ప్రొఫెసర్ ప్రతీ టెంట్ లోనూ నగ్న సాధువుల కాళ్లపై పడుతోంది. “కావలిస్తే వారితో కలిసి గంజాయి కొట్టొచ్చు” గంజాయి తాగుతున్న సాధువులని చూపిస్తూ చెప్పాడు మా గైడ్. నాలుక లాగినా ఎంతమందితో వాళ్ళు గంజాయి లాగించి ఉంటారో తలుచుకుని ఆగిపోయాను.
అఖాడాలని చూడటానికి వచ్చినవాళ్లంతా ( నాలాంటి వాళ్ళు తప్పితే ) నాగ సాధువులకు నమస్కరించుకుంటూ దక్షిణలు సమర్పిస్తున్నారు. “సీతారాం ! ఒక్కొక్కరికి రోజుకి లక్ష వరకూ ఆదాయం వస్తుంది. వీళ్ళు కుంభమేళా అయ్యేసరికి ఫార్చ్యూనర్ కార్లలో వెళ్తారు “ చెప్పాడు మా గైడ్.అక్కడినుంచి మమ్మల్ని ఆడవారి ప్రత్యేక అఖాడాకి తీసుకెళ్లాడు. ట్రాన్స్జెండర్ లు , మహిళా సాధువులకు ప్రత్యేకంగా కేటాయించిన ప్రదేశంపేరు కిన్నెర అఖాడ. వాళ్ళు నగ్నంగా లేరు కానీ డబ్బు సంపాదనలో మాత్రం చాలా ముందున్నారు. అన్ని అఖాడాల కంటే ఇక్కడే రద్దీ ఎక్కువగా ఉంది.
ఇహానికీ , పరానికీ మధ్య ఊగులాడుతున్న ఆ సాధువులని చూసి త్రిశంకు స్వర్గం అంటే అర్థమైంది. ఇటు ప్రపంచంతో ఈక్విలిబ్రియం కుదరక , అటు ప్రపంచాన్ని విడిచిపెట్టలేక జీవించడమే త్రిశంకు స్వర్గం అంటే. బ్రతికి ఉండగానే అంత్యక్రియలు జరుపుకున్నంత మాత్రాన ప్రపంచం నిన్ను వదలదు. అహాన్ని వదులుకోకపోవడమే మనిషికి ఒక ఐడెంటిటీ ని ఇస్తుంది. అది పోనంతవరకూ బంధాలనుంచి విముక్తి అనేది ఒక భ్రమ. అసలు అహాన్ని ఎందుకు వదులుకోవాలి ? అందరూ అహం నుంచి విముక్తి పొందితే జీవితంలో రక్తి లేదు ! ఐడెంటిటీ ని కోల్పోవడానికి చేసే ప్రయత్నం కూడా ఒక ఐడెంటిటీ క్రైసిస్ గా మారిందా ! ప్రకృతి నుంచి దూరంగా జరిగేకొద్దీ దానిపై వాంఛ మరింత పెరుగుతుంది. ఇది ఒక రకంగా సొంతూరిపై ప్రేమ లాంటిదేనేమో! నీకు దూరమైనది సొంతూరిలో కూడా ఇక దక్కదు … నీవున్నది సొంత ఊరు కాదు… ఊగి ఊగి చావడమే మనిషి జీవితం !
వీలైతే మర్నాడు ఉదయమే సంగమ స్థానానికి వెళ్లి స్నానం చేద్దామని , లేకుంటే మా క్యాంపు పక్కనే ఉన్న ఘాట్ లో చేద్దామని నిర్ణయించుకున్నాం. బాగా అలసిపోయి ఉన్నామేమో ఎప్పుడు నిద్రపోయామో తెలియలేదు. మర్నాడు ఐదింటికల్లా లేచాము. సంగమ ఘాట్ మహా అయితే నాలుగు కిలోమీటర్లు. అయితే ట్రాఫిక్ లో ఇరుక్కుంటే మధ్యాహ్నం ఫ్లైట్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువ. ముగ్గురం మా క్యాంపు కి ఆనుకుని ఉన్న ఘాట్ కి బయలుదేరాం. నాకు కుంభ స్నానం మీద పెద్ద ఆసక్తి లేదు. యథావిధిగా కెమెరా పట్టుకుని బయలుదేరాను. ఘాట్ లో మేము ముగ్గురమే … అరగంట వరకూ ఎవరూ రాలేదు. మా ఘాట్ లో నీళ్లు స్వచ్ఛంగా ఉండటం గమనించాను. సూర్యోదయం గంగకి రంగులద్దుతోంది. కార్తీక మాసం స్నానాలకు అమ్మమ్మ తో కలిసి గోదారికి వెళ్ళడం గుర్తొచ్చింది. బట్టలన్నీ వదిలి నదిలోకి దూకనా ! మరి చలి !!
అసలు కుంభమేళా లో స్నానం చేయడానికి ఇన్ని కోట్ల మంది ఎందుకు వస్తున్నారు ? పుణ్యం కోసమా ? నలుగురితో బాటు నారాయణానా ? కేవలం ఏమి జరుగుతుందో చూద్దామనే ఆసక్తా?
ప్రశ్న నమ్మకానికి వ్యతిరేక పదం. మానవుని వేదనలకి మూలం. వేదన అంటే అర్థం జ్ఞానమూ, బాధా కూడా ! ఆలోచనల వరద గోదారి చుట్టుముట్టింది. నాతో వచ్చిన మిత్రుడు అన్నాడు. “ గంగలో మునిగిన తర్వాత మనసు తేలిక పడింది “. బహుశా ఇంతదూరం వచ్చి మునగకుండానే వెళ్లిపోతాననే భయం అతన్ని వెంటాడింది. అందుకే అంత రిలీఫ్. నా ప్రశ్న నన్ను గంగలో మునగనివ్వదు. ఈ వేదన నుంచి నాకు విడుదల లేదు. అసంపూర్ణ మైన జ్ఞానం నుంచి నాకు ఊరట రాదు. ప్రభూ ! నాకీ ప్రశ్నల నుంచి విముక్తి ప్రసాదించు. ఏ వాసనలు లేని ప్రపంచంలో నన్ను ప్రసవించు!
*****
“ అదేంట్రా ! ఇంతకీ నీకేం కావాలి ? జ్ఞానమా? దానినుంచి విముక్తా? అసలు నువ్వు ఆ నాగ సాధువులని తిట్టావా ? పొగిడావా ? ఒకపక్క నమ్మకం లేదంటూనే నమ్మకం కావాలని కోరుకోవడం ఏమిటి ? అంతా గోదారి చేసావు కదరా !”
“ అంటే మరి … మనిషి … ప్రకృతి … దూరం … దానికోసం లాంగింగ్ …” ఏదో చెప్పబోయాను.
“ నీ గోదారి …” విసుక్కుంటూ అన్నాడు.
*
మీ అనుభవాలు చాలా బాగున్నాయి శ్రీధర్ గారు. దాదాపుగా కుంభమేళా ని చూపించేశారు.
బాగుంది
కుంభమేళాలో తిరిగినట్టే వుంది
చాలా బాగా రాశారు..
వివరంగా రాసారు. బాగుంది.
ఏ గుర్తింపుని కోల్పోవడానికి బట్టలు వదిలేసారో అదే గుర్తింపు కోసం విచిత్రమైన ప్రదర్శనలు మొదలెట్టారు ! ప్రపంచ వాసనలను త్యజించడం బట్టల్ని వదిలినంత సులభంకాదేమో !
చాలా బాగా రాశారు. నగ్న సాధువుల అకృత్యాలు, అవినీతి సైతం రాయాల్సింది. వారు పోస్ట్ కుంభ మేళా ఏం చేస్తారో తెలుసుకుంటే తెలిసేది