సాగర్ మే అఫ్సాన సోచ్ !

                
బహుజన కథా కచ్చీరు 2022

    1
సృజన సహజంగా అక్షరాల్లో ఒదగాలి. అలవాటుగానో, అప్రయత్నం గానో అలా అలా వచ్చేయాలి. అదో instinct. రాసాక చూసుకుంటే మనమే రాసామా అనే ఆశ్చర్యం వేయాలి. మనలో ఉండే రచయిత రచన చేసేప్పుడు మనకు తెలియకుండానే వెలుపలికి వచ్చి ‘మనస్పృహ’ను కోల్పోయి సృజనాత్మకలోకం లో విహరించి రాసేదేదో వస్తున్నదేదో రాసేసి తిరిగి ప్రపంచసృహ లోకి వచ్చేయాలి. అసంటి రచనలో ప్రాణం, నిజాయితీ ఉంటాయి. చర్చించిన అంశాల్లో ఇదొకటి. రాయటానికి కూసోని మమేకమై రాస్తూ పోతుంటే ఎప్పటికో అనూహ్యంగా ఆ ధ్యానంలోకి వెళ్ళిపోతాము. ఆ భావాతీతంలో రాసిన వాక్యాలు తరువాత చదువుకుంటే మనమే రాసామా అనే ఆశ్చర్యం వేస్తుంది. సభలో చాలామంది ఈ విషయానికి నిజమే నిజమే అన్నారు.
2
ఈ తరం కథకులు ఎక్కువ మందే కన్పించడం ఈ బహుజన కథా కచ్చీరులో నాకెంతో సంతోషమనిపించిన అంశాల్లో ఒకటి. పది సంవత్సరాలను ఒక తరంగా నేను భావించి అంటున్న మాట. 2020 నుంచి 30 వరకు ప్రస్తుత తరమైతే, 2010 నుంచి 2020 పోయిన తరం, 2000 నుంచి 2010 అంతకు ముందు తరం. నేను అంతకుముందు తరంలో ఓ పాతిక కథలు రాసాను. పోయిన తరం ప్రస్తుత తరంలో ఒక్క కథన్నా రాయలేదు. పుస్తక పఠనంలో అప్ డేట్ లో లేను కాని, స్థూలంగా ఫాలోఅప్ లో మాత్రం ఆలోచిస్తూ – మిత్రులతో మాట్లాడుతూ ఉన్నాను. ఈ మూడు తరాల కథల్ని, కథకుల్ని ప్రస్తుతతరం యువకథకులు ప్రేమగా, గౌరవంగా, విస్తృత అనగాహనతో చూసే దృష్టికోణం నాకు నచ్చింది. వాళ్ళు మంచి కథల్ని రాస్తారు. కథల్ని, మనుషుల్ని ప్రేమించే వారి కథాసృష్టి తప్పక గొప్పగానే ఉంటుంది. ఇదొక నా ఎనాలసిస్.
3
ముచ్చటించిన విషయాల్లో నాకు నచ్చిన మరో అంశం చదవటం. మంచి కథల, రచయితల పేర్లు ఎన్ని చర్చించారో! తెలుగు కథలు, జాతీయ, హిందీ, ఉర్దూ కథలు, అంతర్జాతీయ ఇంగ్లీషు కథలు, ఆఫ్రికన్, నైజీరియన్ మొదలైన పెద్ద లిస్టే వివరంగా మాట్లాడుకోవటం జరిగింది. మరీ ఎక్కువగా చదివినా గందరగోళం అయిపోతారనే అభిప్రాయమూ అనుకున్నాం. మనుషుల్ని, ప్రాపంచిక దృక్పథాన్ని బాగా చదవాలని అంతిమంగా అనుకోవటమూ జరిగింది. యువ కథకులు ప్రపంచాన్ని, సమాజాన్ని, ప్రపంచ కథల్ని లోతుగా స్టడీ చేస్తున్నట్లు వారి మాటల్ని బట్టి తెలుస్తున్నది. సోషల్మీడియా, కెండెల్ లాంటి ఆధునిక టెక్నాలజీని యూత్ చదవటానికి ఉపయోగిస్తుండటం బాగనిపించింది. ఒక్కో మనిషి ఒక్కో పుస్తకం, ఒక నిర్దిష్ట భాష కన్నా ఎక్కువే. ప్రజల్ని సంకలించటం, వారితో మమేకం కావడం గొప్పగా చదవటమే.
4
నలభై మంది కథకులు విజయ్ విహార్, బుద్ధవనం, సాగర్, కృష్ణానది లలో రెండు దినాలు కలిసున్నారు. సభలు, చర్చలు, ప్రసంగాలు… గుమిగూడి మాట్లాడుకోవటం, ఒకరినొకరు పరిశీలించుకోవటం, సామూహికంగా సాగర్ చేపల పులుసు తినటం, చాయ్ లప్పుడు చర్చించుకోవటం, ఏ చెట్టు కిందనో ఓ సీనియర్ నచ్చిన జూనియర్ కు అసలైన ఆర్ట్ ఆఫ్ రైటింగ్ చెప్పటం, సభానంతరంలో సభలోని విషయాల్ని ఒకటి రెండు ముక్కల్లో చెప్పుకోవటం ఇత్యాది క్రియలే అసలైన అవసరమైన జ్ఞానాన్ని, ప్రేరణను, సృజనశక్తిని, ప్రాపంచిక దృక్పథాన్ని కలిగిస్తాయి. అంతమంది అక్షర కళాకారులున్న ప్రాంగణ వాతావరణమే కళాత్మక తరంగాలలో నిండిపోద్ది. అందుకే కచ్చీర్లకు పోవాలి. అవన్నీ నాకు తగిలాయి. బుద్ధవనంలా అక్కడ చేరిన అక్షర మిత్రుల్నించి ప్రకంపనాలు నన్ను స్పర్శించాయి. రాసినా రాయకున్నా అసంటి ఇంటర్ యాక్షన్ బ్లిస్. అసుర, మన్ ప్రీతం లాంటి వారితో గడిపే కథకుడి సంగమమే కవిత్వం. నలభైమందికి సలామ్.. జై భమ్!
5
ప్యార్ సె ప్రీతమ్ లిఖా యాది
మన్ కో పసంద్ ఆయా జవాన్
భరోసా ఆయా బాప్ జైసా
అఫ్సాన నిగార్ జరూర్ బనేగా!
మన్ ప్రీతమ్ కో దిల్ సే బదాయి
ఉస్మానియా యూనివర్సిటీ కా బచ్చా సంతోష్
జల్సాకె మెహెఫిల్ కే ఫన్కారోంకే తస్వీరోంకో
ఇతనా సమగ్ర్ ఉతారా సిర్ఫ్ దేఖ్నేసే పూరా సమజాయేగా!
చీరాల సముద్రం నాకెంతో ఇష్టమైనది. అది శ్రీనివాసమై మా మున్నా కుటీరానికి వచ్చింది. సూర్యాపేట మూసి ఆకాసంలో రెండో రాత్రి కచ్చీరు తాత్వికమై, కవిత్వమై, స్నేహమై వెలిగింది. మనస్సంతా ప్రేమై కడుపు నిండిపోయింది.
మంచి కథా రచయితలు రచయిత్రులైన నవతరం యాకమ్మ, మెర్సీ మార్గరేట్, సంతోష్, రమేష్ కార్తీక్ నాయక్, రామ్ పెరుమాండ్ల, మన్ ప్రీతమ్ మహా కథకులవుతారు. అవ్వాలని దుఆ. జిందాబాద్ బహుజన కథాకచ్చీరు. వర్ధిల్లాలి బహుజన సాహిత్యం!
*

బా రహమతుల్లా

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • బహుజన కథా కచ్చీరు ఒక మంచి అనుభవం.
    సూర్యాపేట లో రెండోరోజు రాత్రి రహంతుల్లా భాయ్ తో ఆ రాత్రి కవిత్వమై వెలిగింది.ఒక జ్ఞాపకం గా మిగిలింది.

  • నేనూ ఇందులో భాగమై ఎన్నో అనుభవాలను ప్రోది చేసుకున్నాను. ఇలాంటి ఒక సమావేశాన్ని నిర్వహించడం ఎంత కష్టంతో కూడుకున్న పనో ప్రత్యక్షంగా చూశాను. మార్జినల్ క్లాసెస్ జీవితాలని కథల్లోకి తీసుకురావలసిన ఆవశ్యకత ఇంతకు ముందుకంటే ఇప్పుడు ఎక్కువగా ఉందన్న ఎరుకని యువకులకి ఈ సమావేశం కల్పించడం అన్నింటికంటే ప్రధానాంశం.

  • అన్న బాగా రాశారు. కాకుంటే ఈ సారి మూ డాన్స్ మిస్ అయ్యాము…

  • భా బ్బాయిసాబ్ చాలా బాగుంది

  • Baa Rahamathulla రాయడమే తక్కువ.. అలాంటిది ఇష్టంగా నాగార్జున సాగర్ లో జరిగిన బహుజన కథా కచ్చీరు 2022 పై ఛోటాసా మీఠాసా రైట్ అప్ రాసాడు.. 💙🌿

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు