1
చాలా వరకు మనం మన సమయాన్ని ఏవో లక్ష్యాలు సృష్టించుకుని వాటి కోసం పని చేస్తూ, చదువుతూ, రాస్తూ, సినిమాలు చూస్తూ వాస్తవ దూరంగా ఒకే రీతిలో గడిపేస్తాం. అక్కడ జీవితానందం లేదు. మనం చేసే పనులన్నీ, మంచివి, చెడ్డవి, గొప్పవి, అన్నీ – జీవితం నుండి పలాయనం కోసం చేస్తున్నవే. ముతక జీవితపు వాస్తవికత, అంతులేని విసుగుదల నుండి పారిపోవడానికి మనం కళల్ని , కవిత్వాన్ని, సంగీతాన్ని సృష్టించుకున్నాం. ఇంకా ఎన్నో గొప్ప వ్యాపకాల్ని సృష్టించుకున్నాం. సుదీర్ఘంగా తాత్సారం చేసే జీవితపు జడత్వం నుండి పారిపోవడానికి ఎన్నో అందమైన విషయాల్ని సృష్టించుకున్నాం. కానీ అక్కడ మనకి ఆనందం దొరకలేదు. ఎందుకంటే మనం మన ఊహల నుండి ఆనందాన్ని సృష్టించుకోవడం సాధ్యం కాదు, ఎంత ప్రయత్నించినా.
జీవితోత్సవం ఎక్కడ ఉందో మనం ఎప్పుడూ వెతుక్కుంటూ వెళ్లలేదు. సంతోషం కోసం మనం ఎప్పుడూ ఏ సాహసమూ చెయ్యలేదు. ఏ భారాలు పెట్టుకోకుండా జీవితాన్ని తేలిగ్గా జీవించే ఆనంద సమూహాల ప్రబల స్వేచ్ఛా విస్ఫోటనా శక్తిలో భాగంగా మనం ఎప్పుడూ లేము. పర్వతారోహకుల సమూహాలతోను, పరివ్రాజకుల సమూహాలతోను మనం అత్యంత అరుదుగా ప్రయాణం చేస్తాము. మానవ సంబంధాల్లో మాత్రమే లభించే జీవితపరమార్థాన్ని, సంతోషాన్ని మనం సృష్టించుకున్న నమూనాల్లో వెతుకుతాము.
మనం కొద్దిగా మన రోజువారీ అలవాట్ల నుండి కాస్త బయటకు వచ్చి ఈ సువిశాల ప్రపంచంలో రవ్వంత సాహసం చేస్తే ఎటువంటి ఆనందంలో మనం భాగం కావచ్చునో నేను మీకు తెలియచేస్తాను.
ఈ విశ్వం ఆనందంతో నృత్యం చేస్తోంది. కానీ మనం ఎందుకు అనేక భారాలతో కుంగిపోయి ఉన్నాము?
ఆనందాన్ని శ్వాసగా జీవించే వారి భారరహిత హృదయాల స్వేచ్ఛాప్రకంపనలు నా హృదయాన్ని తాకాయి.
జపనీయ చక్రవర్తి తైషో కాలంలో ఇసాము యోషి, జీవితపు నిష్పలతను గూర్చిన ప్రగాఢమైన నిర్వేదంతో రాసిన Gondola no Uta(Song of the Gondola) అనే ఈ శక్తివంతమైన గీతాన్ని ‘ఇకిరు’ చిత్రంలో అకిరా కురుసవా ఉపయోగించుకున్నాడు.

life is brief
fall in love, maidens
before the crimson bloom
fades from your lips
before the tides of passion
cool within you,
for there is no such thing
as tomorrow, after all
life is brief
fall in love, maidens
before his hands
take up his boat
before the flush of
his cheeks fades
for there is not a person
who comes hither
life is brief
fall in love, maidens
before the boat drifts away
on the waves
before the hand resting on your shoulder
becomes frail
for there is no reach here
for the sight of others
life is brief
fall in love, maidens
before the raven tresses
begin to fade
before the flames in your hearts
flicker and die
for today, once passed,
is never to come again
మీరు నిస్సారమైన, సౌకర్యమైన లేదా అసౌకర్యమైన ఒక రొటీన్ లో చిక్కుకుపోయినప్పుడు ఈ పాటను వినండి. ఇంటికి తాళం వేసి బ్యాక్ ప్యాక్ వీపుకు తగిలించుకొని వెంటనే యాత్రకు బయలుదేరుతారు.
మన రోజువారీ ముతక జీవితం ఒక ఊబి లాంటిది. దాని నుండి ఈ గీతాన్ని పాడుకుంటూ బయటకు వచ్చేయండి, కనీసం సంవత్సరంలో కొన్ని నెలలైనా.
2
“నన్ను ప్రేమించే వారంతా నన్ను బంధించి ఉంచుతారు. నువ్వు మాత్రమే నన్ను స్వేచ్ఛగా ఉండనిస్తావు” అని వాపోతూ భగవంతునికి విన్నవించుకుంటాడు ఠాగోర్. అవును, అలవాటు పడిన మన జీవితం మనల్ని బంధించి ఉంచుతుంది. ఆ శృంఖలాల్ని మనమే తెంచుకోవాలి. లేదంటే alchemist నవలలోని దుకాణం యజమానిలా జీవితమంతా మక్కాని దర్శించకుండానే గడిచిపోతుంది.
తెలియని సమూహాల్లో మనకు ఉండే స్వేచ్ఛను మీరు ఎప్పుడైనా అనుభూతి చెందారా? మన వివరాలు వారికి తెలియవు, వారి వివరాలు మనకు తెలియవు. మన గతం వారికి తెలియదు, వారి గతం మనకు తెలియదు. అయినా అప్పటికప్పుడు ఒక బంధం ఏర్పడుతుంది. అది విశ్వజనీయమైన బంధం. అది అందరి మధ్య అంతర్లీనంగా ఉండే ఏకత్వానికి సంబంధించిన బంధం. సృష్టిలోని సకల జీవరాసులని కలిపి కుట్టి ఉంచిన దారం అది.
నిజానికి లోకంలో అపరిచితులు ఎవరూ లేరు. స్వచ్ఛంగా నువ్వు హృదయంలో నుంచి ఎవరిని చూసైనా, ఒక్క చిరునవ్వు నవ్వగలిగితే చాలు.
అపరిచితుల సమూహాల్లో కలిసిపోవడం, మూకుమ్మడి ఆనందోత్సాహాలని సందోహంతో పంచుకోవడం ఎంత గొప్పగా ఉంటుంది!
3
ఆరోజు మధ్యాహ్నం హోటల్ కి చేరుకుని మూడు గంటల నుండి రాత్రి 12 గంటల వరకు నిద్రపోయాను. ఎందుకంటే ముందు రోజు రాత్రంతా విమానాలు మారుతూ నిద్ర లేకుండా గడిపాను.
రాత్రి 12 గంటలకి మెలుకువ వచ్చి ఆకలి అనిపించి పండ్లు కొనుక్కుందామని హోటల్ నుండి బయటకు వచ్చాను. బ్యాంకాక్ లోని ఆకాశ హర్మ్యాల నడుమ చీకటి వీధులు ఉంటాయి. హోటల్స్ నుండి ఎక్కడికి వెళ్లాలన్నా ఈ చీకటి వీధుల గుండా నడుచుకుని వెళ్లాల్సి ఉంటుంది, సాధారణంగా.
నేను అలా నడుస్తూ వెళ్తుండగా నా వెనక నుండి రష్యన్ యువకులు కొందరు గన్స్ పట్టుకుని పరిగెడుతూ నన్ను దాటుకుని ముందుకు వెళ్లారు. వీధి చివరన కూడా గన్స్ పట్టుకున్న ఒక గుంపు ఉంది. ఆ గుంపుని తప్పించుకోవడానికి నేను కుడివైపునున్న సందులోకి వెళ్లాను. అక్కడ కూడా భారీ గన్స్ పట్టుకున్న మరొక గుంపు ఉంది. వారి పక్కనుంచి సద్దు చేయకుండా నడుచుకుని వెళ్తున్నాను. ఆ గుంపులోని ఒక అమ్మాయి నన్ను గమనించింది. నా వైపు తిరిగి గన్ ఎక్కు పెట్టింది. నేను పారిపోవడం మొదలు పెట్టాను. ఆ అమ్మాయి గన్ పట్టుకుని నన్ను వెంబడించింది. నేను వేగం పెంచాను. ఆ అమ్మాయి కూడా వేగం పెంచింది. నేను మరింత వేగం పెంచడంతో అమ్మాయి ఆగిపోయింది. “హమ్మయ్య” అనుకున్నాను.
ప్రధాన రహదారి కూడలిలో కొన్ని గుంపులు భారీ గన్స్ పట్టుకొని ఉన్నాయి. వారి నుంచి తప్పించుకుని ఎలా ముందుకెళ్లాలో నాకు తెలియలేదు. ఇందాకటి వెనకనున్న, నన్ను వెంబడించిన అమ్మాయి ఉన్న గుంపు, మెయిన్ రోడ్డు నుండి ఒక గుంపు నా వైపు దూసుకొస్తున్నారు. వీళ్ళకి దొరికిపోయాను అనుకున్నాను.
అయితే కుడివైపున గంజాయితో కలిపి వంటకాలు తయారు చేసే ఒక కొరియన్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లోకి పారిపోయాను. ఆ రెండు గుంపులూ రెస్టారెంట్ బయట నిలబడి నా కోసం ఎదురుచూస్తున్నాయి. ఆ గుంపులో చాలామంది యువతులు, యువకులు ఉన్నారు. వారంతా రంగురంగుల హెయిర్ డై లు వేసుకుని ఉన్నారు.
ఇంతలో షాప్ లోని Waitress “ఏం తీసుకుంటారు?” అని అడిగింది. ఆ అమ్మాయికి 19 ఏళ్ళు ఉంటాయి.
“Any vegetarian recipe without marijuana” అన్నాను.
ఆ పిల్ల ఫక్కున నవ్వింది. ఇప్పుడు భారతదేశంలోని అతి మారుమూల పల్లెటూర్లలో సైతం కొరియన్ ధారావాహికల్ని అతిగా చూసి కొరియన్ అబ్బాయిల్ని, కొరియన్ అమ్మాయిల్ని పెళ్లి చేసుకుందామని కలలుకంటున్న టీనేజర్స్ కోరుకునే కొరియన్ చర్మపు మెరుపు ఆమె బుగ్గలపై తళుక్కుమంది.
అంతకు ముందు వారం తను అల్లారుముద్దుగా పెంచుకుంటున్న కుక్కపిల్ల నా దగ్గరికి వచ్చేసినప్పుడు ముఖమంతా నిండిన మొటిమలతో, నల్లని వర్ణంతో, ఒక అందమైన జిప్సీ పిల్ల నన్ను చూసి నవ్వినప్పుడు పద్మంలా విరిసిన ఆమె ముఖంలోని మెరుపు ఈ కొరియన్ అమ్మాయి మెరుపుకు తక్కువేమీ కాదు. దానిని సైంటిఫిక్ గానూ, సౌందర్య శాస్త్ర నియమాలను అనుసరించీ నేను నిరూపించలేను.
మెరుపు అనేది ఆత్మలోంచి వస్తుందని నాకు అనిపిస్తుంది.
“గాలి నాడి తుఫానును సూచిస్తోంది
పొలంలోని మచ్చల ఆవు అంబా అని అరిచింది
ఆమె నన్ను చూసి ఉంటే ఆ విషయం ఆమెకు మాత్రమే తెలుసు
ఆమె నల్ల కలువ…” అంటు ఠాగూర్ రాసిన కవిత గుర్తుకు వచ్చింది.
సౌందర్యం నిజంగా రంగులోనూ, కొలతలలోనూ ఉంటుందా? పెద్ద ముక్కున్న శ్రీదేవి ఎందుకంత అందగత్తెగా పేరుపొందింది. పాస్టిక్ సర్జరీతో ముక్కు సరి చేసుకున్నాక ఆ అందమంతా పోయిందని నా చిన్నప్పుడు అందరూ చెప్పుకునేవారు. అసలు అందం అంటే ఏమిటి? అది ఏ విధంగా ప్రకటించబడుతుంది? Symmetry కి సంబంధం లేకుండా అందం లోకంలో ఉనికిలోకి రావడం నాకు కనిపిస్తుంది.
నాకు కావలసిన recipe ని ఇవ్వలేకపోతున్నందుకు జీవితం అంతమైపోయినంత అపరాధనాభావంతో ముందుకు వంగి క్షమాపణలు చెప్పింది, ఆ కొరియన్ అమ్మాయి.
కొన్ని నవ్వుల్ని మనం మర్చిపోలేము. అలాగే కొన్ని ముఖాల్ని కూడా. ఆరోజు ఉదయం ఎయిర్ పోర్ట్ నుండి హోటల్ కి బస్సులో వస్తుండగా ఒక ఇరవై ఏళ్ళ చైనా అమ్మాయి బస్ ఎక్కడం చూశాను. ఆమె ముఖంలో అంతులేని మిస్టరీ ఉంది. అది కేవలం సౌందర్యం. పర్వతాలను చూసినప్పుడు ఎలా మన మనసు శూన్యమవుతుందో అలా చెయ్యగల మనోనాశక సౌందర్యం ఆమెది. దేవతలు రహస్యంగా మన మధ్య న జీవిస్తారు అని అంటారు కదా! అలాగే అనిపించింది ఆమెని చూస్తే. మనసు అర్థం చేసుకోలేని సౌందర్యంతో నిండి ఉంది ఆమె వదనం. ఒక నిగూఢ రహస్య మార్మిక శక్తి ఏదో ఆమెలో ఉంది.
ఫ్రెంచ్ నటి Mylène Jampanoï ముఖంలోనూ, చైనా దేశపు మహానటి గాంగ్ లీ ముఖంలోనూ, అదీ వారు యువావస్థలో ఉన్నప్పుడు మాత్రమే, కొంత వరకూ ఆ మిస్టరీని చూడవచ్చు. కానీ ఈ స్థాయిలో నేను ఎవరి వదనంలోనూ చూడలేదు.
ఎన్నో క్లిష్టమైన విధానాలతో, ఖచ్చితత్వంతో, జాగ్రత్తగా ఎంపిక చేయబడిన నేపాల్ లోని సజీవ దేవత ‘కుమారి దేవి’ ముఖంలో కూడా అటువంటి మిస్టరీని నేను చూడలేదు.
నేను అలా చూస్తూ ఉండగానే ఆ అమ్మాయి బస్ దిగి థాయిలాండ్ లోని అతిపెద్ద మార్కెట్ అయిన చటుచక్ మార్కెట్లోకి వెళ్ళిపోయి అదృశ్యం అయిపోయింది. ఆమె అదృశ్యమైనపోయినా అక్కడ అసంఖ్యాకమైన జనాల నడుమ ఆమె ఆరా ఒక నీడలా ఇంకా ఉన్నట్టు అనిపించింది.
ఆమె ముఖంలోని God’s mystery ని చూడడం కోసమే నేను సముద్రాలు దాటి వచ్చి ఈ నిర్ధిష్ట క్షణంలో ఈ బస్సులో ప్రయాణించడం జరిగింది అనిపించింది. అది నిజం కావచ్చు కూడా. జీవితంలో ఏమాత్రం గుర్తించని సాదాసీదా విషయాలు అత్యంత విలువైనవి అయి ఉంటాయి. కానీ మన మనసు సున్నితంగా లేకపోతే అవి చూరు నుండి కారే వర్షపు నీటిలా మన ఆత్మని స్పృశించకుండా జారి అదృశ్యమయిపోతాయి.
సరే మళ్లీ వర్తమానంలోకి వద్దాం. రెస్టారెంట్ బయట గుంపు నా గురించి చూసి చూసి వెళ్ళిపోయింది. నేను బయటకు వచ్చి ఒక చీకటి మూల కూర్చుని బైక్ టాక్సీ బుక్ చేసుకున్నాను.
“ఈ ట్రాఫిక్ జామ్ దాటుకొని నేను మిమ్మల్ని చేరుకోగలనో లేదో!” అని మెసేజ్ పెట్టాడు రైడర్.
రాత్రి 12 గంటలకు ట్రాఫిక్ జామ్ ఏంటి అని అనుకోవచ్చు మీరు. రోడ్ల నిండా గన్స్ పట్టుకొని ట్రక్స్ మీద అసంఖ్యాకంగా గుంపులు వెళుతున్నాయి.
బైక్ టాక్సీ కోసం అరగంట చూసి ట్రాఫిక్ జామ్ వల్ల రోడ్డు మీద ఆగిపోయిన వాహనాల నడుమ నుండి వడివడిగా నడుచుకుంటూ వెళుతున్నాను. నా వెనుక నుండి భారీ గన్స్ పట్టుకొని దృఢకాయులైన అమెరికన్ యువకులు వాహనాల నడుమ యుద్ధంలో మాదిరి పరిగెత్తుకుంటూ పోతున్నారు.
ఎలాగో కొన్ని అరటి పళ్ళు కొనుక్కొని గుంపుల్ని తప్పించుకుంటూ నక్కినక్కి వెనక్కి వస్తుండగా గుండు చేయించుకొని, గెడ్డం పెంచుకున్న ఒక అమెరికన్ యువకుడు నా మీద ఫైరింగ్ ఓపెన్ చేశాడు.
మీకు అసలు విషయం చెప్పలేదు. అవన్నీ వాటర్ గన్స్. కానీ చాలా శక్తివంతమైనవి. ఈపాటికి మీరు ఊహించే ఉంటారు.
నేను 3 రోజులు బ్యాంకాక్ లో ఆగింది ఏప్రిల్ మాసంలో వచ్చే Songkran festival కోసం. ఇది థాయిలాండ్ నూతన సంవత్సర పండుగ. వాటర్ ఫెస్టివల్ అని కూడా అంటారు. మన కృష్ణాష్టమి సంరంభం వారి అతిశయమైన spirit దగ్గర ఎందుకూ సరిపోదు.
ఈ songkran water festival లో ప్రపంచంలోనే అత్యంత భారీ నీటి యుద్ధాలు జరుగుతాయి. ఆ యుద్ధంలో పాల్గొనడానికి అమెరికా, యూరప్, రష్యా, చైనా, కొరియా, జపాన్ లాంటి దేశాల నుండి యువతీ యువకులు భారీగా తరలివస్తారు. మూడు రోజులు పాటు ఒక మహా ఉత్సవం జరుగుతుంది.
వారంతా సంతోషంగా జీవించడం తెలిసినవారు. ఆ 3 రోజులూ ప్రజలంతా రోడ్లపైకి వచ్చి నృత్యం చేస్తారు. అపరిచితుల్ని వాటర్ గన్స్ తో తడిపి ముద్దయేలా చేస్తారు. మన ముఖాలకు తెల్లని పిండి రాస్తారు. ఏ వీధి ఏ సందులో ఏ మూలకి వెళ్ళినా మనల్ని నిలువెల్లా తడిపేస్తారు. నవ్వుతూ కేకలు వేస్తారు. కేరింతలు కొడతారు. ట్రక్కుల్లో డీజే పెట్టి యువత నృత్యం చేస్తారు. సాటి మనుషుల పట్ల ఎంతో ప్రేమను, అభిమానాన్ని చూపిస్తారు. అటువంటి ఆనందోత్సవాన్ని నేను ఎన్నడూ చూడలేదు. ఉత్తర భారత దేశంలో హోలీ పండుగ కొంతవరకు ఆ vibe ని తీసుకురాగలదు. కానీ ఈ స్థాయిలో అసాధ్యం.
అందుకే థాయిలాండ్ నూతన సంవత్సరం కలసి వచ్చేలా ఆగ్నేయ ఆసియా దేశాల పర్యటన ప్లాన్ చేసుకున్నాను. ఉత్సవాల మూడు దినాలూ బ్యాంకాక్ లో గడిపాను. Rio de Janeiro లోని ప్రపంచంలోనే అతిపెద్ద Carnival, నేపాల్ లోని హోళీ ఉత్సవాలు ఇటువంటి గొప్ప spirit తో నిండి ఉంటాయి. అటువంటి మహోత్సవాలను దర్శించి తీరాలని చెబుతాను.
మార్గమధ్యంలో థాయిలాండ్ దేశంలో ఆగినందున వారి happy spirit ని చూడగలిగాను. అందులో భాగం కాగలిగాను. నా జీవితంలో ప్రాప్తించిన గొప్ప సంతోషాల్లో ఇది ఒకటి అనిపించింది.
సుమారు రాత్రి 2 గంటలకి తడిసి ముద్దయి హోటల్ కి వచ్చాను. అరటి పళ్ళు తిని. మరుసటి రోజు 12 వరకూ నిద్రపోయాను. లేచి బాల్కనీలోకి వెళ్లి కూర్చున్నాను. వెనుక నుండి నా మీద నీరు పడింది. ఎదుటి బ్లాకులోని 10 వ అంతస్తు నుండి ఇద్దరు యువతీయువకులు గన్స్ తో నా మీదకు నీరు కొట్టారు. వారిని నవ్వుతూ పలకరించాను. వారీ ఉత్సవంలో పాల్గొనడానికి మలేషియా నుంచి వచ్చారు.
ఎప్పటిలానే, నాది సౌత్ ఇండియా అని చెప్పగానే నా మాతృభాష తమిళమా అని అడిగారు. తెలుగు అని చెప్పగానే తెల్లముఖం వేశారు. చెన్నై, ముంబై, ఢిల్లీలలో గతంలో తాము పర్యటన చేశామని చెప్పారు.
సాయంత్రం వారితో కలిసి యుద్ధానికి రమ్మని కోరారు. అలాగేనని వారికి ప్రమాణం చేశాను.
4
సాయంత్రం బయలుదేరే వేళకి వారి హోటల్ రూమ్ నుండి ఆ మలేషియా జంట నన్ను “hello! are you there?” అంటూ పిలిచారు.
మేము ముగ్గురం మెయిన్ రోడ్ లోకి వెళ్ళగానే ఒక జాజ్ బ్యాండ్ ఉన్న ట్రక్ కనిపించింది. దానిపైకి వాళ్ళు ఎక్కడంతో నేనూ వారితో కలిసి ఎక్కాను. అన్ని వైపుల నుండి వాహనాల నుంచి పెద్ద పెద్ద పీపాలకు పైపులు కనెక్ట్ చేసి మా మీద నీరు కొడుతూ ఉన్నారు. మేము కొన్ని నిమిషాల్లోనే పూర్తిగా తడిసిపోయాము.
కొంత దూరం వెళ్ళాక ఆ ట్రక్ దిగి అందరి పైనా నీళ్లు కొట్టుకుంటూ మెయిన్ రోడ్డు మీద నడిచాం. ఇంతలో యువతీయువకులు కేరింతలు కొడుతున్న ఒక ట్రక్కులోకి మమ్మల్ని ఎక్కమని, తమతో రమ్మని, వారు మమ్మల్ని ఆహ్వానించారు. ఆ ట్రక్ బయలుదేరింది. రోడ్డు మీద ఎవరినీ తడపకుండా వాళ్ళు వదలట్లేదు. నాకు వాళ్ళు ఒక గన్ ఇచ్చారు. నేనూ వారితో కలిసి రోడ్డు మీది వారిని, వాహనాల్లోని వారినీ తడపడం మొదలు పెట్టాను. అలాగే రోడ్డు మీది వారు నన్ను తడుపుతున్నారు. అర్ధరాత్రి వరకు అలా ఉత్సాహంగా తిరిగాము.
ఒకచోట దిగిపోయాం. అక్కడ ఒక ట్రక్ లోని రాక్ బ్యాండ్ వెనుకనే యువతీ యువకులు నృత్యం చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నారు. మలేషియా జంట వారితో కలిసిపోయి నృత్యం చెయ్యడం మొదలుపెట్టారు. నేనయితే నృత్యం చేసేంత సాహసం చెయ్యలేకపోయాను. అలా తిరిగి తిరిగి తెల్లవారుజామున హోటల్ కి చేరుకున్నాం.
5
మరుసటి రోజు “hello! are you there?” అనే పిలుపుతో మెలకువ వచ్చింది. బాల్కనీలోకి వెళ్ళగానే మలేసియా జంట చేతులు ఊపుతూ “We are leaving” అంటూ వీడ్కోలు చెప్పారు.
బయటకు వెళ్లి భోజనం చేసి వచ్చి బాగా జలుబు చేయడంతో ముసుగుతన్ని ఆ రోజంతా నిద్రపోయాను. ఇది ముందుగా ఊహించిందే. జలుబు వస్తే ఏమైంది? కాస్త చిరుజ్వరం వస్తేనేమి? గొప్ప జీవితోత్సవంలో పాలుపంచుకున్నాను. రోజువారి ముతక జీవితానికి పూర్తి భిన్నంగా గొప్ప ఉత్సుకతతో రెండు దినాలు జీవించాను.
జీవితాన్ని enrich చేసే ఎన్నో జ్ఞాపకాలని నాతో తెచ్చుకున్నాను. పూర్తి కొత్త ప్రపంచంలో, కొత్త నాగరికతలో, కొత్త ప్రజల నడుమ వారంతా చిరపరిచితులన్నట్లు మసలుకొన్నాను.
ఎవరినైనా పలకరించడానికి సైతం మొహమాటపడే నాకు ఇన్ని vibrant experiences ని ప్రకృతి ఇవ్వడం ఆశ్చర్యాల్లోకల్లా ఆశ్చర్యం.
“Lord, Thou hast given this monk a large family.” అనే పరమహంస యోగానంద గారి వాక్యం Autobiography of a Yogi పుస్తకంలోనిది గుర్తుకువచ్చింది.
అంతిమంగా ఈ వ్యాసంలో నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే తేలికయిన వస్త్రాలతో ఎక్కువ బరువు లేని ఒక బ్యాక్ ప్యాక్ వీపుకు తగిలించుకొని అప్పటికప్పుడు ఎక్కడికి వెళ్లాలనిపిస్తే అక్కడికి వెళ్ళిపోతూ యాత్ర కొనసాగించండి. ఆ విధంగా ప్రత్యక్షంగా మీరు జీవితంతో connect అవ్వగలరు. ప్రజలతో మమేకం కాగలరు. అనూహ్యమైన ఘటనలు మీకోసం ఎదురు చూస్తూ ఉంటాయి.
అందుకే ప్రయత్నించి ఇంటిలో ఆరు నెలలు, యాత్రలో ఆరు నెలలు ఉండమని చెబుతాను.
“Travel and tell no one.
Live a true love story and tell no one.
Live happily and tell no one.
People ruin beautiful things.”
అని Kahlil Gibran చెప్పినప్పటికీ ఆయన మాటలు వినకండి. మీ అనుభవాలకు విలువనిచ్చే రసహృదయులతో వాటిని మనసు విప్పి పంచుకోండి. పంచుకోవడంలోని ఆనందాన్నీ అనుభవించండి.
ఈ విశ్వం అంతులేని ఆశ్చర్యాలతో , రహస్యాలతో నిండి ఉంటుంది. అది మర్చిపోకండి.
*
Add comment