విధి విధానాలు ఏమైనా కానీ
నువ్విప్పుడు నిన్ను నువ్వు పోగొట్టుకుంటున్న యుద్ధానివి
నెత్తుటి ముద్దకు అతుక్కుపోయి
కన్నీటి చప్పరింతను పట్టించుకోని
కోరికల నిప్పువి
నిన్నెలా అర్థం చేసుకోమంటావు!?
గీసుకున్న గిరి దాటి బరిలో దిగుతున్న
ధైర్యానివనా
నిలువెల్లా గాయాలే నిన్ను నిలువరిస్తున్నా
ఎదుట ఉన్న మౌనాలపైకి
శబ్దాలను సంధిస్తున్న విల్లువనా
అన్నీ అనుమానాలే
చూపులకు చిక్కని తావులే
లంగరేసినా దొరకని
అననుకూల అంచనాలే….
సహచరీ….
నువ్వెప్పుడూ వెళ్ళే మార్గానికి
ఓడిపోకు
గాలమేదైనా చిక్కుబడి కూలబడకు
అయస్కాంతం
ఊబి
నువ్వు
పోరాడటం ఆపనప్పుడు
నువ్వు నువ్వుగానే నిలబడతావు
అలవాటు లేని రాజకీయం
నీ ఒంటబట్టనప్పుడు
నీలోపలి ఊహలు ముద్దుగారుతూనే వుంటాయి
నువ్వెందుకూ…
దిగిరానక్కరలేదు
నువ్వెక్కడా…..
రేపటి గురించి మరిచిపోనక్కరలేదు
నువ్వెప్పుడూ…
నిన్ను వదిలి నువ్వు పరిగెత్తనక్కరలేదు
నీకోసం
విచ్చుకుంటున్న
కోట్ల చురకత్తుల మెరుపుల మీదుగా
నువ్వూ మెరువు
మెరుపు వేగానికి
అందనంత అందంగా
ఉరుముల ఉప్పెనకు
లొంగనంత నిబ్బరంగా
నువ్వూ నిలువు
నువ్వే నిలువు…..
*








excellent