సర్వనామ ఫ్యామిలీ

వంద కిలోమీటర్ల వేగంతో వెళ్తోంది మా టాక్సీ ఆ హైవే మీద (ఏదో బాగుంటుందని చెప్పా…ఎంతలో వెళుతోందో ఎవరికి తెలుసు! అన్నీ వెర్రిగా నమ్మడం మానుకోండి మీరు). డ్రైవర్ పక్క సీట్లో నేనూ, వెనక అమ్మా, నాన్నా.

“వాడికేమైందిరా ఉన్నట్టుండి? దరిద్రుడు!” అంది అమ్మ హఠాత్తుగా .

డ్రైవర్ గాభరాగా చూశాడు నా వైపు. ‘నిన్ను కాదులే’ అన్నట్టు తల అడ్డంగా ఊపాన్నేను.

“అయినా దీనికేం మాయ రోగం పుట్టిందో, వీడున్నంత వరకూ బానే ఉంది. అయినా ఇదైన వెంటనే వాళ్ళ వాళ్ళు దాన్ని ఇటునుంచి అటు తీసుకెళ్ళటం కూడా కరెక్ట్ కాదు.” అంది బైటికి చూస్తూ.

రామ్ గోపాల్ వర్మ హార్రర్ మూవీని, మధ్యలో మొదలుపెట్టి చూస్తున్నట్టుంది మా డ్రైవర్ కి. ‘ఎవర్రా మీరంతా?!’ అన్నట్టు పెట్టాడు మొహం అందరి వైపూ చూస్తూ.

“అమ్మా, మనమే వదిలెయ్యాలింక, వాడికి వాళ్ళ సపోర్టూ, దీనికి మనోళ్ళ సపోర్టూ…ఇంక మనమాటెవడు వింటాడు?” అన్నాన్నేను.

“వాళ్లూ వాళ్లూ బానే ఉంటార్రా, మధ్యలో చిన్నదేం చేసిందిరా? దానికి అన్యాయం చేస్తే ఎవడికీ పుట్టగతులుండవ్!”

ఈ గ్రహాంతర భాష తట్టుకోలేక “ఎవరు సార్?” అన్నాడు డ్రైవర్ నా భుజం గోకుతూ. చెప్పక పోతే టెన్షన్ తో పోయేట్టున్నాడు.

“మా వాళ్ళే, ఒకడున్నాడ్లే.” అన్నాను యథాలాపంగా. వాడి మొహం మాడిపోయింది. పాపం చాలా ఆశలు పెట్టుకున్నట్టున్నాడు నా మీద.

“ఒకడు కాదు, ఒక పెద్ద వెధవ అనాలి వాణ్ణి.” అంది అమ్మ గుచ్చుతూ.

“ష్, తప్పు. పక్కనోళ్ళ గురించి అలా మాట్లాడకూడదు మనం.” అన్నారు నాన్న మొదటి సారి మాట్లాడుతూ. ఆయనెందుకో ఈ చిదంబర రహస్యాన్ని విప్ప బోయే మహాత్ముడిలా కనపడ్డాడు మా డ్రైవర్ కి.

“మీరేంటండీ, వాడికి సపోర్టూ? ఎంత మీ వాడి తమ్ముడైతే మాత్రం?!” అంది అమ్మ మొదటి సారి లోపలికి చూస్తూ.

“అవున్నాన్నా, ఫస్ట్ వీడు దానికి లైఫిచ్చాడు పోన్లే అన్నావ్, తర్వాత ఆస్తిదేముందిలే వాళ్ళదే కదా తీస్కోవచ్చు అన్నావ్, ఇప్పుడిద్దరూ కలిసి దీనికి అన్యాయం చేస్తుంటే, సైలెంట్ గా ఉండాలంటున్నావ్, ఏంటి నీ న్యాయం?” అన్నాన్నేను కోపంగా మా డ్రైవర్ వైపు చూస్తూ.

ఆ టాక్సీ ముందున్న అద్దం పగలగొట్టుకుని ముందుకి దూకి తన కారు కింద తనే పడి ఆత్మహత్య చేసుకోవాలన్నంత దీనంగా ఉంది వాడి మొహం. ఈ కష్టాల నుండి నాన్న ఒక్కరే తప్పించగలరని అర్థమైనట్టుంది వాడికి. డ్రైవింగ్ మర్చిపోయి అలానే వెనక్కి తిరిగి ఆయన వైపు చూడటం మొదలుపెట్టాడు.

“వాడు మా వాడి తమ్ముడే కాదు, మా ఆఫీసులో కాబోయే ఇది కూడా. మనం ఇలా అనుకుంటున్నామని వాడికి ఎవడైనా చెప్పాడనుకో, అనవసరంగా నా మీద వాళ్లకి అవీ, ఇవీ చెప్పి ఏవీ రానీకుండా చెయ్యగలడు.”  అన్నారు నాన్న బెదిరిస్తూ.

అంతలో హఠాత్తుగా మా కారుకి సడెన్ బ్రేక్ పడటంతో ఉన్నట్టుండి ముందుకి పడ్డాం అందరం. ఒక్క క్షణం గందరగోళంగా తయారైంది అంతా. నేను తేరుకుని ఏమైనా యాక్సిడెంట్ అయ్యిందేమోనని ముందుకీ, వెనక్కీ చూస్తే, రోడ్డంతా ఖాళీగా ఉంది! పక్కన మా డ్రైవర్ లేడు. వాడి డోర్ బార్లా తెరిచుంది. అటు వైపు చూస్తే, ఆ పక్కనే ఉన్న పొలాల్లో పిచ్చిగా అరుస్తూ, మాకు దూరంగా పారిపోతూ కనపడ్డాడు వాడు!

***

పైన ట్రైలర్ చదివి, మమ్మల్ని శాడిస్టు ఫ్యామిలీ అని డిసైడ్ చేసేశారా? ఛ ఛ కాదు. అంత కన్నా ఎక్కువ – ‘సర్వనామ’ ఫ్యామిలీ. వాడూ, వీడూ, అదీ, ఇదీ… తప్పితే పేరు పెట్టి మాట్లాడలేని ఒట్టి నాలుక లేని ఫ్యామిలీ! మా వంశంలో చాలా మంది వద్దని వదిలేసినా, తప్పని తప్పుకున్నా ఈ సర్వనామ పరంపరని కొనసాగించడానికి మా సర్వశక్తులూ ధారపోస్తున్న ఫ్యామిలీ!

పువ్వు పుట్టగానే పరిమళించడం (ళించకపోవడం) ఎంత సహజమో అంతే సహజంగా ఈ భాష నాకు చిన్నప్పటినుండే పట్టుబడింది. ఓ రెహమాన్ లాగా, ఓ రాహుల్ నరోత్తమ్ లాగా (వాడెవడో మీకు తెలిస్తే నాకూ చెప్పండి)…ఓ విధంగా చైల్డ్ ప్రాడిజీ అనుకోవచ్చు నన్ను.

చిన్నప్పుడు టెన్త్ క్లాస్ లో ఓ సారి  స్కూలు హెడ్మాస్టారు మా నాన్నని అర్జంట్ గా స్కూలుకి రమ్మని పిలిచారు. నాన్న హడావిడిగా వస్తే, నా హిస్టరీ ఆన్సర్ పేపరిచ్చి ఓ సారి చదవమన్నారు. ఈయన పెద్దగా చదవడం మొదలుపెట్టారు,

“ఆ సంవత్సరంలో వాడు వాళ్ళ దేశం నుండి వేల మంది వీళ్లతో యుద్ధానికొస్తే, ఇక్కడున్న వాడు కొన్ని లక్షల వీళ్లని, కొన్ని వేల వాటిని తీసుకొని ఎదుర్కున్నాడు. ఇరువైపులా ఎంతో మంది చనిపోయారు. చివరికి ఆ యుద్ధంలో ఈ రాజే గెలిచినా ఆ రాజుని క్షమించి, కేవలం వాటిని పొడిచి వదిలేశాడు.”

హెడ్మాస్టారు అయోమయంగా చూశాడు నా వైపు.

“చదివాను, అంతా బానే ఉంది కదండీ?” అన్నారు నాన్న ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ.

ఆయన షాకయ్యి తల పట్టుకుని కుర్చీలోకి ఒరిగిపోతూ,

“అదేంటండీ, మీకేం తేడాగా అనిపించలేదా?” అన్నాడు.

“తేడాగా అంటే…” అంటూ నాన్న మళ్లీ ఇంకో సారి పేపర్ వైపు చూసి “ఆ…పట్టేశా…వెధవా! ఈ రాజు, ఆ రాజు ఏంట్రా… అదేనా రాయడం? ఇదేనా నీకు నేర్పింది ఇంట్లో?” అన్నారు నా వైపు కోపంగా చూస్తూ.

“అది, అలా అడగండి…” అన్నాడు మాస్టారు తేలిక పడుతూ.

“’చివరికి వీడే గెలిచినా వాడిని క్షమించి వదిలేశాడు.’ అని రాయాలి.” అన్నారు నాన్న సరిదిద్దుతూ.

ఇంతలో ఏదో దబ్బున కింద పడిన శబ్దం వచ్చింది. ఎదురుగా చూస్తే కుర్చీలో హెడ్మాస్టారు లేరు!

అమ్మ కూడా నన్ను పెళ్లిళ్లకీ, ఫంక్షన్లకీ తిప్పుతూ ఇలాంటి పాఠాలు దగ్గరుండి నేర్పించేది. ఓ ఫంక్షన్లో ఎవరో అమ్మాయిని పేరు పెట్టి పిలిచానని అందరి ముందూ పట్టుకోని తెగ తిట్టి తర్వాత ఇంట్లో ‘అది, ఇది’ అని హండ్రెడ్ టైంస్ ఇంపోసిషన్ రాయించింది. మా చేత ప్రతి న్యూ ఇయర్ కీ మంచి మంచి  గ్రీటింగ్ కార్డులు తయారు చేయించి ఫ్రెండ్స్ అందరికీ ఇప్పించేది. ప్రతి దాంట్లో “టు – నీకు, ఫ్రమ్ – నా నుంచి” అనే రాసే వాళ్లం కాబట్టి ఎవడికివ్వాలన్నా బాగా కన్వీనియెంట్ గా ఉండేది.

వాళ్ళు ఇంతటి ప్రోత్సాహం ఇవ్వడం వల్లే నేను ఈ భాషని నా వారసత్వంగా స్వీకరించి దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని ఇది కట్టుకున్నాను.

అసలీ భాష వల్ల మెంటల్ స్ట్రెస్ సగం తగ్గిపోతుందని పదేళ్ళపాటు నేను చేసిన వేల ప్రయోగాల ద్వారా నిర్ధారించాను. మనం రోజూ మాట్లాడే మాటల్లో పేర్లన్నీ తీసేసి సర్వనామాలు మాత్రమే వాడితే 40% తక్కువ ఎనర్జీ ఖర్చు పెడతామని, దాని తాలూకు క్యాలరీల వాడకం తగ్గిపోయి, ఆ దేశ తలసరి ఆదాయం 50% పెరుగుతుందని నా రీసెర్చ్ లో తేల్చాను.

“అదేంటి బ్రదరూ, నీకు టెన్షన్ తగ్గుతుంది సరే, కానీ పక్కోడికి పెరుగుతుంది కదా ఇలా మాట్లాడితే?” అని అడుగుతున్నారా?

పెరిగితే పెరగనివ్వండి, అది వాళ్ళ ఖర్మ…అయినా వాళ్ళ బాగోగుల గురించి మీకెందుకో అంత ఆరాటం?!

ఇలా మాట్లాడ్డం యాక్చువల్లీ పక్క వాళ్ళ మతి మరుపుని పోగొట్టి, మెంటల్ ఎబిలిటీస్ ని పెంచుతుందని నా గట్టి నమ్మకం. నమ్మరా? మీరు ఏది తేలిగ్గా నమ్మారు గనక! ఓ కథ చెప్పాలి. చిన్నదే, పారిపోకండి. ఐదేళ్ల క్రితం, ఓ పార్టీలో ఒక పెద్దాయన కనపడితే “ఏంటండీ, మీ వాడు ఇంట్లో కన్నా అక్కడే ఎక్కువ కనపడుతున్నాడంట? వాళ్ళు అంటుంటే విన్నాను.” అన్నాను నవ్వుతూ. అప్పటికి ఆయన బుర్ర గోక్కుని వెళ్ళిపోయాడు కానీ, వారం రోజుల తర్వాత వాళ్ళ కొడుకు నుంచి తిడుతూ కాలొచ్చింది “బుద్ధిలేదా నీకు, ఏం చెప్పావ్ మా నాన్నతో? వారం రోజుల్నుంచీ తిండి లేదు, నిద్ర లేదు. అందర్నీ అనుమానిస్తూ, ఏవో పిచ్చి ప్రశ్నలేస్తూ తిరుగుతున్నారు. నీకు దణ్ణం పెడతా, ఆ పేర్లేంటో చెప్పు. ఆయన బతికేలా లేడు.” అన్నాడు కోపంతో ఏడుస్తూ. చూశారుగా, నా మాటలే పజిల్ గా మారి ఆ పెద్దాయన‌ మళ్ళీ జీవితంలో దేన్నీ మర్చిపోకుండా చేశాయి. నేనో రకంగా ఆయనకి డాక్టర్ల చుట్టూ తిప్పే అవసరం తగ్గించా. అట్లుంటది మనతోని, మన మాటలతోని.

ఆ తర్వాత వాళ్ళబ్బాయి నాకో ఎకరం రాసిచ్చాక నా నోటితో ఆ‌ పేర్లు చెప్పడం ఇష్టం లేక, మెల్లగా వాట్సాప్ లో పంపి ఆ పెద్దాయన్ని బతికించాలేండి. ఇంత మాత్రానికే మీరు మరీ నన్నో పరమ దుర్మార్గుడిగా లెక్కెయ్యక్కర్లా!

ఈ భాషతో ఓ పెద్ద అడ్వాంటేజ్ కూడా ఉంది. అందుకో చిన్న ఇన్సిడెంట్ చెప్పాలి. ఓ పెళ్లిలో ఇంతటి అందగాణ్ణి నన్నొదిలేసి లేడీస్ అందరూ ఇంకోణ్ణి పట్టుకొని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ అంటూ పైకెత్తేయడం మొదలుపెట్టారు. వాడూ తెగ సిగ్గుపడి మెలికలు తిరిగి పోతుంటే, మెల్లగా వాణ్ణి పక్కకి తీసుకెళ్లి, “ఏరా, మీ కాలేజ్ లో ఏంటీ గొడవ? మీ వాడు నాకు బాగా క్లోజ్, మొన్న మాటల్లో మెత్తం చెప్పాడ్లే, ఇంతకీ ఈయనకి తెలీదు కదా ఇవన్నీ…” అన్నాను సందేహంగా అటూ ఇటూ చూస్తూ. వాడు గాభరాగా “అన్నా, ప్లీజన్నా, అది నేను కావాలని చెయ్యలేదన్నా, వాడి గర్ల్ ఫ్రెండ్ తో మాట్లాడుతున్నానని వాడే ముందు కొట్టాడన్నా, నేను తర్వాత హాకీ స్టిక్కుతో…ఛ” అని ఏడ్చుకుంటూ బైటికెళ్లిపోయాడు. ఆ తర్వాత లేడీస్ అందరి ఫోకస్ ఎవరి మీద పడుంటుందో మీ పదునైన బుర్రలు ఊహించే ఉంటాయ్.

సరే, ఇన్ని తెలివితేటలేడ్చాక ఇంటర్వ్యూలూ, జాబ్ తెచ్చుకోవడాలూ ఓ లెక్కా? కాలేజ్ అయ్యాక, నా జాబ్ రెస్యూమ్ లో ‘సర్వనామ లాంగ్వేజ్ – టెన్ ఇయర్స్ ఎక్స్ పీరియెన్స్’ అని రాసి అప్లై చేస్తే, ఓ కంపెనీ వాడు ఇదేదో జావా తాత లాంటి లాంగ్వేజేమోనని నెలకి పది లక్షలెక్కువిచ్చి మరీ నన్ను‌ సొంతం చేసుకున్నాడు. ఆ సర్వనామేశ్వరుడి దయ నా మీద ఉన్నంత వరకూ ఇలాంటి టింగరోళ్ళతో నాకు ఢోకా లేదు!

***

ఇలా ఆరు సర్వనామాలూ, సున్నా నామ వాచకాలతో సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి పెద్ద సునామీ తెచ్చింది నా పెళ్లి (‘సు’నామీ ఏంటి నా బొంద, దుర్నామీ అది…మీకు అర్ధమౌతోందా!).

ముందు జరిగిన రెండు మూడు పెళ్లి చూపుళ్లలో, ఆ ఉడ్ బీ పెళ్లి కూతుళ్లతో నేను మనసు విప్పి మాట్లాడడంతో, నా ప్రనౌన్ పవర్ కనిపెట్టి చిన్న పనుందని‌ చెప్పి పక్కనే ఉన్న గోడ దూకి‌ వాళ్ళ వాళ్లని కూడా పట్టించుకోకుండా పారిపోయారు వాళ్ళు. ఈ సారి జరిగే చూపులన్నా సక్సెస్ అవ్వాలంటే నువ్వు అమ్మాయితో అస్సలు మాట్లాడడానికి వీల్లేదని మా వాళ్ళందరూ కర్పూరం నా నాలుక మీద వెలిగించి ఒట్టేయించుకున్నారు. అలా కాదు కానీ, ఇంకో ఆల్టర్నేటివ్‌ చెప్పండంటే, అమ్మాయి ఏమడిగినా “తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయాను.” అని మాత్రం చెప్పమని బలవంతంగా నా నోరు నొక్కేశారు. నేను కాని నన్ను చూసి “పాపం అమాయకుడిలా ఉన్నాడు. చేసుకుంటే పోలా.” అని మా ఆవిడ ఎగిరి గంతేసి వెంటనే మూడు ముళ్లూ వేయించుకుంది. కానీ పెళ్లైన వెంటనే నిజం తెలిసిపోయి తన గొంతు కోసినందుకు వాళ్ళ వాళ్లతో జీవితాంతం తెగతెంపులు కూడా చేసుకుందనుకోండి. అది వేరే విషయం.

మా ఆవిడకి నా అంతటి సర్వనామ జ్ఞానం లేకపోవడంతో మొదట్లో చాలా కష్టాలు పడ్డాం ఇద్దరం. పెళ్లైన కొత్తల్లో చిన్న చిన్న విషయాలని కూడా పట్టుకోలేక పోయేది. “వాడికి డబ్భులివ్వాలి.” అంటే “ఎవడికి?” అనేది. “అది నిన్న ఆర్డరిచ్చాను, వచ్చాక దీంట్లో వెయ్యాలి.” అంటే తెల్ల మొహం పెట్టేది. ఇంతటి గొప్ప స్కిల్ అబ్బాలంటే ఎంతటి టాలెంటెడ్ పీపుల్ కైనా కొంత టైం పడుతుంది నిజమే, కానీ తను దీని మీద ఏ మాత్రం ఇంటరెస్టు చూపించకుండా మాములు మనుషుల్లానే బతికెయ్యాలని చూడటం నాకు బాధగా ఉండేది.

పెళ్లై రెండేళ్లయ్యాక కూడా తనని ఓ సారి ఎక్కడికెళ్ళావని అడిగితే “మన శివాలయం రోడ్డులో ఉండే శ్రీకాంత్ గారి చెల్లి మాలతి కొడుకున్నాడు కదా, చందు గాడు, వాడి పెళ్లి మాటలకి రమ్మంటే సునీతక్కతో కలిసి వెళ్లానండీ!” అని సంబరపడిపోతూ నా వైపు చూస్తే నేనక్కడ లేను. పక్క రూం లోకి పారిపోయి, తలుపు లేసుకోని, చెవులు మూసుకోని నేలమీద కూలబడిపోయాను. ఎంత దారుణం! ఎంత అప్రతిష్ఠ!

మెల్లగా నేర్పిద్దాంలే అనుకోడానికి‌ ఇదే మన్నా ఆషామాషీ విద్యా? జాగ్రత్తగా చూసీ, వినీ, పరిసరాలని పసిగట్టీ నేర్చుకోవాలి. ఆ ప్యాషన్ ఉండాలి మనిషికి. అప్పుడే మనసు లోతుల్లోంచి, న్యాచురల్ గా వాక్యాలు తన్నుకుంటూ బైటికొస్తాయి.

నేను ‘వీడు, అది’ అన్నప్పుడల్లా అది ‘ఎవడు?, ఎవతె?’ అనడుగుతుంటే నాకు ఒళ్లు మండి సమాధానం చెప్పడం మానేశాను. ఎన్నాళ్ళని ఈ టార్చర్? దేనికైనా ఓ లిమిట్ అంటూ ఉంటుంది. మా ఫ్యామిలీ ఆచారాన్ని కాల రాస్తుంటే వింటూ వింటూ ఎన్నాళ్ళని సహించను?

నేను సమాధానాలు చెప్పకపోవడంతో తను ఒక రోజు అలిగింది, మరుసటి రోజు అరిచింది, ఆ తర్వాత అలిసిపోయింది. ఓ సారి మాత్రం “నువ్వు సరిగ్గా మాట్లాడకపోతే నేను అవి మింగేస్తా, దీంతో ముక్కలు ముక్కలు చేస్తా!” అని బెదిరించడం మొదలు‌ పెట్టింది. మెల్ల మెల్లగా నా‌ రూట్లో కొస్తోందని లోపల్లోపల ఆనందంగా ఉన్నా‌ ఏం మింగుతుందో అని హడలిపోయి, తప్పక నా‌ భాష కొంచెం సడలించాను టెంపరరీగా.

ఎవరికైనా‌ జీవితంలో ఓ టర్నింగ్ పాయింటనేది ఉంటుంది. అది మా ఆవిడకెప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తుంటే, ఓ రోజు ఆ గోల్డెన్‌ ఛాన్సే మా ఇంటికొచ్చి కాలింగ్ బెల్ నొక్కింది. నా తమ్ముడు. లోక కళ్యాణం కోసం ఓ వారం రోజులు మా ఇంటికొచ్చిన దేవ దూతలా కనపడ్డాడు వాడు నాకు. వాడితో మాట్లాడాక నా కరువు‌ తీరిపోయింది కానీ మా ఆవిడకి మాత్రం పిచ్చెక్కి మమ్మల్ని తప్పించుకుని తిరిగింది కొన్ని రోజులు. ఓ రోజు ‘సర్వనామ బ్రదర్స్ డే’ ప్రకటించి ఇద్దరం ‘అదేదో ఫరెవర్’ అనే మూవీకి చెక్కేశాం. అంతటితో ఊరుకున్నామా, ఇంటికొచ్చాక మా‌ ఆవిడని కూడా స్టోరీ వినమని పట్టుబట్టి కూర్చొబెట్టాం. చెవిలోకి‌ దూదీ, ఇయర్ ప్లగ్స్ లాంటివి తెచ్చుకుంటానంటే వద్దని భరోసా ఇచ్చి మరీ చెప్పడం మొదలుపెట్టాం.

ఓ ఐదు నిమిషాలు అంతా సవ్యంగా జరిగింది. పెద్దగా ఏడుపులూ, వంటింట్లోంచి గిన్నెలు విసరడాలూ, ఫ్యానుకి చున్నీ కట్టడాలూ అలాంటివేం జరగలేదు! ఆ తర్వాత, మా వాడు కొంచెం ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి, కథ చెప్పడం మానేసి దాని మీద డిస్కషన్ మొదలు పెట్టాడు.

“అన్నాయ్, ఫస్టు వీళ్లిద్దరి‌ దగ్గరికి వాడే వచ్చాడు. మర్యాదగా దాన్ని తెచ్చి నాకప్పగించమన్నాడు. వీళ్ళూ ఓకే అని దాన్ని తేవడానికెళ్తే, మళ్ళీ వాడే, దాన్నీ, దీన్నీ దార్లో కిడ్నాప్ చేశాడు. ఏంటీ అన్యాయం?” అన్నాడు.

“అవున్రా, పోనీ కిడ్నాప్ చేశాడే అనుకో వాళ్లని ఏసెయ్యకుండా ప్రశాంతంగా వాళ్ళ ఊళ్ళో కబుర్లూ, వాడి చరిత్రా అంతా చెప్తూ కూర్చుంటాడేంటి ఎదవ?” అన్నాన్నేను.

మా ఆవిడ మొహంలో రంగులు మారుతున్నాయి. ఇవేవీ వాడు పట్టించుకోవట్లేదు.

“అవన్నీ సరే, వాళ్ళ అమ్మ‌ చూడు అంత పవర్‌ఫుల్ కబుర్లు చెప్పి చివరికి వీళ్ళ చేతిలో ఓడిపోయి, చివరికి వాడి దగ్గరికి, ఆ జోకర్ గాడి దగ్గర కెళ్ళి ప్రొటెక్ట్ చెయ్యమని బతిమిలాడింది. చూసే వాళ్ళు పిచ్చోళ్ళు మరి!”

“వాళ్ళూ, వీళ్ళూ భయంకరంగా కొట్టుకు చచ్చి చివరికి ‘ఏయ్ తూచ్, తూచ్ మనం ఫ్రెండ్స్ గానే ఉందాం’ అంట. సిగ్గు లేని బతుకులు, ఛీ!” అన్నాను నేనూ ఆవేశంగా.

అదంతా వింటున్న మా ఆవిడ హఠాత్తుగా పైకి లేచి ముందున్న టేబుల్ ని అమాంతం ఎత్తి పక్కన పడేసింది. రెండు మూడూ ఫ్లవర్ వేస్ లూ, కాస్ట్లీ పెయింటింగులూ ఎత్తి కింద కొట్టింది. ఇంకా ఆవేశం చల్లారక, మా వాళ్లని పేర్లు పెట్టకుండా సర్వనామాలతో ఆపకుండా అరగంట సేపు తిట్టింది. దాని కోపానికి మేమిద్దరం భయపడి సోఫా వెనక దాక్కున్నా, నాకు దాని కొత్త కొత్త తిట్లు వింటుంటే భలే ముచ్చటేసింది. లేడీస్ కి సాధ్యం కానిదేదీ లేదని మళ్ళీ నిరూపించింది తను. ఆ ఆనందంలో తబ్బిబ్బౌతూ తనకి శాలువా లాంటిదేమైనా కప్పుదామని పైకి లేవబోతుంటే మా వాడు నన్నాపి, సీరియస్ గా మెడ మీద బొటనవేలుతో గీస్తూ హెచ్చరించాడు ‘పోతావ్’ అన్నట్టు!

అప్పటికి నా ఆవేశాన్ని అణుచుకున్నా నాకు క్లియర్ గా తెలిసిపోయింది అదే, అదే మా ఆవిడకి టర్నింగ్ పాయింట్ అని. వెనక్కి‌ తిరిగి‌ చూసుకోలేదు మేమింక జీవితంలో.

***

కాతే నెక్స్ట్ ఇయరే ఇంకో చిక్కొచ్చింది నాకు. మా వాడి నామకరణ ఉత్సవం. అసలా పేరు మార్చేసి ‘సర్వనామకరణ మహోత్సవం’ అంటే అద్భుతంగా ఉంటుంది. సర్సర్లేండి, ఎన్నెన్నో అనుకుంటాం, అన్నీ ఔతాయా ఏంటి?

‘వ’ అనే అక్షరంతో మొదలయ్యేట్టు పేరు పెడితే మా వాడి జాతకం అదిరిపోతుందన్నాడు ఆయన. అది వినగానే‌ ఎగిరి గంతేశాను. మా ఆవిడ చెవిలో “నా దగ్గర కొన్ని మంచి ఐడియాస్ ఉన్నాయ్ అలాంటి పేర్ల కోసం!” అన్నాను‌ నవ్వుతూ.

తను ఆశ్చర్యంగా చూస్తూ “అవునా, ఏంటవీ? వెయిట్, వెయిట్…నేన్చెప్పనా…’వాడూ, వీడూ, వీడితో వాడూ, వీడితో ఎవడూ..’ ఇవేగా?” అంది.

“ఇలా ఎలా?” అని నిలువుగా తలూపాను ఆనంద కన్నీళ్ళు కారుస్తూ.

అది ముందు పళ్ళెం దగ్గర ఏదో తడుముకుంటుంటే “ఏం కావాలే?” అన్నా.

“అదే, ఇందాకిక్కడ కత్తొకటి పెట్టాను, ఎక్కడుందోననీ…” అనీ అటూ ఇటూ వెతకడం మొదలుపెట్టింది.

అప్పుడు నేను ‘వ’ కారాన్ని వదిలెయ్యకపోతే వక్కసారి కాదు వందసార్లు చంపుతుందని భయమేసి సైలెంటైపోయాను.

ఆ తర్వాత తనేదో పేరు చెప్తే, నీ ఇష్టమొచ్చింది పెట్టుకో నాకు మాత్రం జీవితంలో చెప్పొద్దన్నాను!

మా వాడు మాత్రం పెరిగి పెద్దౌతున్నప్పుడు రెబెల్ లా తయారై, నా వారసత్వ భాషని బేఖాతరు చేసేవాడు. ప్రనౌన్స్ లు వాడటం పచ్చి బద్ధకిస్టుల లక్షణమనీ, అసలిది మానవజాతిలో పుట్టిన ఓ దురాచారమనీ నాతో వాదించేవాడు. ‘యువర్ ఎనిమీస్‌ ఆర్ క్లోజర్‌ టు యూ’ అని వాడెవడో అన్నట్టు, వీడో మార్చలేని శత్రువులా తయారయ్యాడు నాకు. ఏం చేస్తాం, మా‌ ఆవిడ జీన్స్ లో స్ట్రాంగ్ వేరియంట్ తో తయారై‌ ఉంటాడు!

ఏ డాడ్ కైనా ఓ‌ డే వస్తుంది, నాకూ వచ్చింది. పోయిన సంవత్సరం వాడు హైస్కూల్లో జాయినయ్యాడు. మొదటి రోజు స్కూలు కెళ్ళొచ్చి ఇంటికొస్తూనే  సరాసరి నా ముందుకొచ్చి నిలబడ్డాడు. నేనూ, మా ఆవిడ అయోమయంగా చూస్తుంటే, హఠాత్తుగా కింద పడి నా కాళ్లకి సాష్టాంగ నమస్కారం చేశాడు వాడు. నేను షాక్ తో, సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యి, “ఏంట్రా?” అంటే,

“ఇన్నాళ్ళూ నీ గొప్పతనం గుర్తించలేక పోయాన్నాన్నా!” అన్నాడు కాళ్లు వదలకుండా.

“దేని‌ గురించీ?” (నాకున్న ఎన్నో టాలెంట్లలో దేని‌ గురించో తెలియాలి‌ కదా?)

“మా హైస్కూలు ప్రిన్సిపాల్ ఇవాళ ఫస్ట్ డే, ఫస్ట్ క్లాస్ లో ప్రనౌన్స్ ల ఇంపార్టెన్స్ గురించీ, ప్రతి ఒక్కళ్ళూ అవి కంపల్సరీగా వాడాల్సిన అవసరం‌ గురించీ చెప్పారు. అంతే కాదు ‘హీ/హిమ్, షీ/హర్, ఇట్/ఇట్స్’… ఇవన్నీ ట్వెంటీ టైమ్స్ పెద్దగా చెప్పించారు కూడా అందరితో.”  అన్నాడు పైకి లేచి కుర్చుంటూ.

“మీది చాలా ముందు‌ చూపండీ!” అంది మా ఆవిడ ఆశ్చర్యపోతూ.

వీళ్ళింతే. పక్కోడు మనల్ని మెచ్చుకునేంతవరకూ పచ్చి మంచి నీళ్ళైనా ఇవ్వని బాపతు.

ఏదైతేనే “ఇంట గెలిచేసావ్, ఇంక రచ్చ గెలిచే టైమైంది.” అని ప్రకృతి సిగ్నల్స్ పంపిస్తోందనిపిస్తోంది.

***

ఈ మధ్య కొన్నాళ్ళగా కొత్త భయం మొదలైంది.‌ మా వాడు ఎప్పుడైనా ప్లేటు ఫిరాయించి ఈ భాష మాట్లాడటం మానేస్తే? ఇది ఇలాగే అంతరించిపోతే? తర్వాత దీన్ని పురాతన కళల్లో కలిపేసి మ్యూజియాల్లోకి తోసేస్తే? నో, నహీ, ఇల్లె! దీన్ని ఇలానే‌ వదిలెయ్యకూడదని డిసైడ్‌ చేసుకున్నా. నా‌ చుట్టుపక్కల సమాజాన్ని మెల్లగా ఇన్‌ఫ్లూయెన్స్‌ చేసి అనుచరుల్ని తయారు చేయడం మొదలుపెట్టా. వీళ్లతో ఫ్యూచర్లో ‘సర్వనామా మెడిటేషన్‌ సెంటర్’ కూడా  మొదలు పెట్టే ప్లానొకటి చేస్తున్నా. చివరికి శేష జీవితాన్ని సర్వనామానందగా పేరు మార్చుకుని బతికేద్దామనుకుంటున్నా.

నేను యోగిగా మారాక నా డ్రెస్సుల స్టైలింగ్ కోసం మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తాలే. లెట్స్ బీ ఇన్‌ టచ్.

అప్పటిదాకా,

సర్వనామజనాః సుఖినో భవన్తు…

*

చిత్రం: బీబీజీ తిలక్ 

పాణిని జన్నాభట్ల

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఇది నేను ఎన్ని సార్లు ఇది చదివి ఇంకెన్ని సార్లు పకపకలాడానో :))

    నాకు ఇది చాలా అదిగా అనిపించింది. అది చెప్పాలనే ఇటొచ్చా.

    అన్నట్టు దీనికి అది “మాది అదే” అని పెట్టుంటే ఇంకా ఇదిగా ఉండేది.

    అన్నట్టు నేనూ ఇలాగే మాట్లాడుతూ వుంటా వాళ్ళకి అదొచ్చి నన్ను కొట్టొచ్చేలా :))

    మీరింకెన్నో ఇలాంటివి రాస్తూ వుండండి…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు