గల్ఫ్ దేశాలలో శీతాకాలాలు చాలా చల్లగా ఉంటాయి. సైబీరియా ఎడారి గుండా వీచే చలి కాలపు షామల్ గాలులు ఈ ఎడారి ప్రాంతాన్ని చల్లబరుస్తాయి. నవంబర్ నుండి మార్చి చివరి వరకు పగలు వెచ్చని చలెండ ,రాత్రిళ్ళు గజ గజ వణికించే చలి, రోజంతా సన్నని చలి గాలులు వీస్తూ వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఈ శీతాకాలాలల్లో గల్ఫ్ దేశాలు, సంక్రాంతి పండుగ కి జాతరకెక్కిన గోదారి జిల్లాల్లా సందడి , సందడిగా ఉంటాయి.
రెండేళ్ల క్రితం సరిత కూడా అలాంటి ఒక శీతాకాలంలోనే కువైట్ కి వచ్చింది.బయలుదేరేటపుడు పెద్దకౌంటు గారి బామ్మర్ది చెబుతూనే ఉన్నాడు, చలి ఎక్కువగా ఉంటది, మంచి సలికోట్లు ఒకటో రెండో పెట్టుకోమని. గల్ఫ్ అంటేనే ఎండ, ఎడారి ప్రాంతం అక్కడ చలేంటని తేలికగా తీసుకుంది సరిత. కొడుకును వదిలేసి పరాయి దేశం వెళ్తున్నాననే బాధలో జీవితమే చీకటి కూపంలా అనిపించింది, ఇంకా చలేంటి, ఎండేంటి అనుకుని ఒక పల్చని శాలువా కప్పుకుని వచ్చింది. ఎయిర్పోర్ట్ నుంచి బయటకు రాగానే ఊహించని ఆ చలికి శరీరం వణికిపోయినా, మనసు మాత్రం కొడుకు నుంచి దూరమైన మొదటి క్షణంలోనే గడ్డకట్టిపోయింది.
సరిత కువైట్ లో రెండేళ్లుగా ఒక అరబ్(బాబా) ఇంట్లో హౌస్ మెయిడ్ గా పని చేస్తుంది. గల్ఫ్ దేశాలలో ప్రతి ఇంట్లో హౌస్ మైడ్స్ ఉంటారు. వీళ్ళని అరబిక్ లో కద్దామా అని అంటారు. వీళ్ళకి పని చేసే ఇంట్లోనే ఒక చిన్న రూమ్ లేదా మిగతా హౌస్ మైడ్స్ తో కలిపి ఒక షేరింగ్ రూమ్ ఇస్తారు. ఈ కద్దామాలు వాళ్ళు పని చేసే ఇళ్ళకి ఆల్ఇన్ వన్ , ఆల్ రౌండర్స్ . ఆ ఇళ్లల్లో వంట చేయడం , బట్టలు ఉతకడం, ఇల్లు శుభ్రం చేయడం, ఆ ఇంట్లో పిల్లలని చూసుకోవడం ఇలా అన్ని పనులు చేస్తూ ఉంటారు.
సరిత పనిచేసే ఇంట్లో మొత్తం ఆరుగురు ఉంటారు. బాబా, బాబా పెళ్ళాం(మేడం), వాళ్ళ ముగ్గురు పిల్లలు. పెద్ద కూతురికి పద్నాలుగేళ్ళు , ఒక మూడేళ్ళ బాబు , ఒక సంవత్సరం పాప .
అలారం మోగి ,మోగి స్నూజ్ అయింది…
డిసెంబర్ నెల,రూమ్ అంతా చల్లగా ఉంది. వెచ్చగా దుప్పటికప్పుకుని మాంచి నిద్రలో ఉంది సరిత . ఐదు నిమిషాల తర్వాత మళ్ళి అలారం మోగింది.
ఠక్కున లేచి కూర్చొని ఫోన్ లో టైమ్ చూసింది సరిత .సమయం -నాలుగు దాటి పది నిమిషాలు.
“వామ్మో, ఫజర్ నమాజ్ కి(తెల్లవారుజామున చేసే ఇస్లామిక్ ప్రార్థన) అరగంటే ఉంది. బాబా లేచే ఉంటారు. ఏంటో ఈ మొద్దు నిద్ర నాకు, ఈ మధ్య అసలు టైంకి మెలుకువే రావట్లేదు .” అనుకుంటూ గభాల్న మంచం దిగింది.
“అమ్మా ! ” అని ఒక చిన్న అరుపు, మళ్ళీ మంచం మీది కూలబడింది.మోకాలి చిప్ప కలుక్కుమనింది, కొన్ని రోజులుగా కుడి కాలి మోకాలు బాగా నొప్పిపెడుతుంది.
“పది రోజులుగా చెబుతున్నా, కాలు నొప్పి అని, అస్సలు పట్టించుకోవట్లేదు మేడమ్ ” కళ్ళల్లో నీళ్ళు సుడులు తిరిగాయి.పక్కన ఉన్న టేబుల్ మీద శాస్త్రి బాం అందుకుని రాసుకుంది.
“ఎన్ని రోజులని ఈ శాస్త్రి బామ్ రాసుకుంటూ కూర్చునేది ,ఈ రోజు ఎలాగైనా బాబా కి చెప్పి, హాస్పిటల్ కి పోవాలి.” అనుకుంటూ మెల్లగా లేచి బాత్రూమ్ వైపు కుంటుకుంటూ నడిచింది.
కాలకృత్యాలు తీర్చుకుని , యూనిఫామ్ వేసుకుని , కిచెన్ వైపు బయలుదేరింది.
“నాని గాడికి ఈ రోజే స్కూల్లో డాన్స్ ప్రోగ్రాం. వీడియో తీసి పంపించమని చెప్పా . పంపుతాడో లేదో వాళ్ళ నాన్న” అనుకుంటూ కిచెన్ లైట్ వేసింది.
కిచెన్ కౌంటర్ మొత్తం చిందరవందరగా ఉంది. కవర్లు, ఫుడ్ బాక్సులు, షింకు నిండా అంట్లు కనిపించాయి. మనస్సు చివుక్కుమంది.
“ఈ మాయదారి సలికాలం నా ప్రాణాలు తీస్తోంది. వీళ్లూ రాత్రంతా ఆరు బయట ఖైమాల్లో(గుడారం) చలి మంటేసుకుని కూర్చోవడం , పుడ్డు ఆర్డర్ పెట్టుకుని తినడం, రోజు ఇదేపని.” అనుకుంటూ స్టౌ ఆన్ చేసి పాలు వేడి చేసుకుని కాఫి కలుపుకుని , కప్పుతో హాల్ లోకి నడిచింది.
బాబా సోఫాలో కూర్చొని ఉన్నాడు. పైనుంచి కింద దాకా తెల్ల పైజామా(తొబ్), ఛాతి వరకు తెల్లని గడ్డం, ఒక చేత్తో దానిని నిమురుతూ , మరో చేతిలో తస్బి(జపమాల) పట్టుకుని దుఆ చేసుకుంటున్నాడు. ప్రతి రోజు ఫజర్ నమాజ్ కి వెళ్లేముందు కాఫీ తాగడం బాబా అలవాటు.
వెళ్లి కాఫీ కప్పుతో ముందు నుంచుంది . టేబుల్ మీద పెట్టమని కళ్లతో చెప్పాడు. కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టి అక్కడే నిలబడింది. ఏంటి అన్నట్లు సైగ చేసాడు.
“బాబా, పది రోజులుగా కుడి కాలు ఒకటే నొప్పి, మేడం కి చాలా సార్లు చెప్పాను . హాస్పిటల్ కి పోవాలి బాబా, పని చేసుకోలేకపోతున్నాను.” భయం భయంగా అరబ్బీ లో చెప్పింది.
తలెత్తి సరిత వైపు చూసి, కుడి చెయ్యితో మీసాల మీద నుండి కింది దాక గడ్డాన్ని సదురుకుంటూ మెల్లగా తలాడించాడు.
“బాబా తలాడించాడు అంటే పని అయిపోయినట్లే.” హమ్మయ్య అనుకుంటూ కిచెన్ లోకి పోయి పనిలో పడింది.ఆ ఇంట్లో తనకి దొరికే ఆ మాత్రం గౌరవానికి కారణం బాబానే. అందుకే బాబా అంటే ఆప్యాయత,గౌరవం సరితకి .
సరితకు ఈ మధ్య కుడి కాలి మోకాలు బాగా ఇబ్బంది పెడుతోంది. ఎక్కువసేపు నిలబడే ఉండటం , ఇల్లంతా అటు ఇటు తిరగడం, పిల్లల వెనుక పరిగెత్తడం వలన కాళ్ళు, నడుము బాగా నొప్పి పెట్టేవి. అలా నొప్పికి కిచెన్ కౌంటర్ దగ్గర బరువంతా కుడి వైపు వేసి నిలబడి పని చేసుకునేది. అలా చేయ్యడం వల్ల మెల్లగా కుడి కాలు మోకాలు చిప్ప అరిగిపోయి,నొప్పి మొదలయింది .నడుస్తుంటే వెయ్యి సూదులు ఒక్కసారి గుచ్ఛుతున్నట్లు అనిపిస్తుంది . చాలా సార్లు మేడం కి చెప్పింది , పట్టించుకునేది కాదు, ఒక పనడాల్ (డోలో 650) ఇచ్చి సరి పెట్టేది. అందుకే ఇవాళ ధైర్యం చేసి బాబా కి చెప్పింది . చెప్పిందే గాని, ముందు జరగబోయేది ఊహించుకోలేకపోయింది.
ఇంట్లో పనంతా అయిపోయేసరికి మధ్యాహ్నం మూడు అయింది.
“ఈ మనిషి కి ఫోన్ చేద్దాం,అసలు స్కూల్ కి వెళ్ళాడో లేదో ” అనుకుంటూ IMO లో ఫోన్ కలిపింది. నాలుగు, ఐదు సార్లు రింగైంది . ఫోన్ మాత్రం ఎత్తట్లేదు. కాసేపాగాక మళ్ళి చేసింది,ఈ సారి ఎత్తాడు.
“ ఆ,ఎక్కడా?.స్కూల్ కి వెళ్ళావా ?” అని అడిగింది.
“హా వెల్లలేదు” మాట మడత పడుతుంది. మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది.
“తాగుతున్నావా?” అని అడిగింది.
అటునుంచి జవాబు లేదు, ఫోన్ పక్కన పడేసినట్లు ఉన్నాడు. నవ్వులు , అరుపులు, మాటలు వినపడుతున్నాయి.
“ఒరేయ్, బీరు కూలింగ్ తగ్గిందిరా,స్టఫ్ కూడా అయిపోయింది.”
ఫోన్ కట్ చేసి మంచం మీద పడింది.సరితకు మనస్సంత మెలిపెట్టినట్లు ఉంది, రెండేళ్లుగా కొడుకుని, కుటుంబాన్ని వదిలేసి ఇంత దూరం వచ్చి, పడుతున్న కష్టం బూడిదలో పోసిన పన్నీరు అవుతున్నట్లు అనిపిస్తుంది.
ఇంతలో మేడం నుంచి ఫోన్, వెంటనే కిచెన్ రూమ్ కి పరిగెత్తింది. మేడం , కిచెన్ ఏరియాలో కోపంతో అటు ఇటు తిరుగుతుంది, మొహం అంత ఎర్రగా కందిపోయి ఉంది. అది చూసి సరిత గుండె జారిపోయినట్లు అనిపించింది. సరితని చూసినవెంటనే మేడం అగ్గి మీద గుగ్గిలం అయింది.
“ నీకు ఎంత ధైర్యం, బాబాతో ఎందుకు మాట్లాడావ్ , ఎం చెప్పావ్ ?” అని గట్టిగా అడిగింది అరబ్బీ లో …
“నేనేం చెప్పలేదు మేడం ! కాలు నొప్పిగా ఉంది , హాస్పిటల్ కి పోవాలి అని అడిగాను, అంతే” అని బదులిచ్చింది సరిత.
“ యా హైవాన్(పశువా) , నాకు చెప్పకుండా బాబా దగ్గరకి ఎందుకు పోయావ్” కోపంతో అరుస్తు , అరబ్బీ లో తిడుతుంది, సరిత తల వంచుకు నిలబడివుంది. ఇంట్లో ఉన్న పెద్దమ్మాయి ఆ అరుపులకి వచ్చి కిచెన్ డోర్ కి ఆనుకుని నిలబడి, టిక్ టాక్ స్క్రోల్ చేస్తూ, చూస్తుంది.
అలా కాసేపు ఆ కోపాగ్నికి మరో సారి మౌనంగా దహనమై పోయింది సరిత.
“ఇవాళ వంట చేయకు, మాల్ కి వెళ్తున్నాం , ఆరింటికల్లా రెడీగా ఉండు.” కాసేపటి తరువాత అదే కోపంతో ఆర్డర్ వేసింది మేడం.
సాయంత్రం ఆరింటికల్లా పిల్లలని రెడీ చేసి, వాళ్ళకి కావాల్సిన పాల డబ్బాలు, డైపర్లు వగైరా అన్ని బ్యాగుల్లో సర్దుకుని రెడీ అయింది.
పిల్లలకు స్నానం చేయించి, బట్టలు తొడిగి, తలదువ్వి , గోరు ముద్దలు తినిపించి రెడీ చేసే ప్రతీసారి సరితకు తన కొడుకు గుర్తొచ్చి గుండె బరువయ్యేది. తన కొడుకుకి చేయాల్సిన ఈ పనులన్నీ ఎవరో బయట వాళ్ళ పిల్లలకు చేసే గతి పెట్టినందుకు, పట్టించినందుకు ఎవరిని నిందించాలో తెలియక, కన్నీళ్ళ వర్షాన్ని వరదై పలికించేది.
మాల్ కి వెళ్లిన ప్రతీ సారి సరితకు నరకమే, మాల్లో మేడం వాళ్ళ ఫామిలీ ముందు నడుస్తూ ఉంటే , సరిత వెనక కొంచెం దూరంలో చంటి పిల్లాడిని ఎత్తుకుని , బాగ్ తగిలించుకుని వాళ్ళ వెనకే నడుస్తూ ఉండాలి .వాళ్ళు ఏ షాప్ లోకి వెళితే అక్కడకి వెళ్ళాలి, లోపలికి మాత్రం వెళ్ళకూడదు. పిల్లలతో బయట ఎదురుచూస్తూ,వాళ్ళని ఆడిస్తూ, లాలిస్తూ, పాలు పట్టిస్తూ, వాళ్ళు చేసే మారాలు , బెదిరింపులు , చీదరింపులు భరిస్తూ ఉండాలి.
ఆరోజు కూడా సరితకు అదే పరిస్థితి. రెండు మూడు గంటల నుండి మాల్ లో తిరుగుతూనే ఉంది. మధ్యాహ్నం మేడం గారు కోప్పడటం, వంట కూడా చెయ్యొద్దని చెప్పటంతో సరిగా ఏమి తినలేదు. దానితో సరితకు చెమట్లు పట్టి కళ్ళు తిరుగుతున్నాయి. నిస్సత్తువ ఆవరించింది. శరీరం నిండా నీరసం. మరో పక్క భరించలేని మోకాలు నొప్పి. ఆ నొప్పి ఆమె ప్రతి కదలికను ఆపేస్తున్నట్టు అనిపించింది. తాను వేసే ప్రతి అడుగు, గడుస్తున్న ప్రతి సెకను తనను ఎవరో రంపంతో కోస్తున్నట్లు ఉంది.
కాసేపు ఎలాగోలా ఓపిక పడితే మేడం వాళ్ళు ఫుడ్ కోర్టుకి పోతారు, ఎప్పుడూ లాగే తనకి కూడా ఏదోకటి తినడానికి ఇప్పిస్తారు అనుకుంటూ నడుస్తోంది. అనుకున్నట్లే మరో పది నిమిషాల్లో అందరూ ఫుడ్ కోర్టు కి చేరుకున్నారు. పిల్లలని మేడంకి అప్పగించి రెండు టేబుల్స్ వదిలి మూడో టేబుల్ మీద ఒంటరిగా కూర్చుంది సరిత.
మేడం అందరికీ ఎం ఎం కావాలో తెలుసుకుని వెళ్లి తిస్కొచ్చింది. అందరూ కలిసి తినడం మొదలెట్టారు. సరిత తనని పిలుస్తారని ఎదురు చూస్తోంది , పది నిమిషాలు అయ్యాయి. అయినా పిలవలేదు. మేడం పెద్దమ్మాయి అడ్డంగా తల ఊపుతూ మేడమ్ తో ఏదో మాట్లాడుతుంది.
సరితకి అర్థమయింది, మేడం ఇంకా కోపంగానే ఉందని, పొద్దున్న బాబాతో మాట్లాడినందుకు మేడం విధిస్తున్న శిక్ష అని. సరితకి అమ్మ గుర్తొచ్చింది, అమ్మ ఎన్నితిట్టినా, కొట్టినా కడుపు మాత్రం మాడ్చేది కాదు. సరిత అలా కూర్చొని ఆలోచనల్లోకి వెళ్లిపోయింది.
సరితది తూర్పుగోదావరి జిల్లా, రాజోలు దగ్గర , కేసినపల్లి అనే చిన్న పల్లెటూరు .
సరితకు ఇరవై మూడేళ్లు ఉంటాయి, పెళ్ళై ఐదేళ్లు అవుతుంది. పెద్ద పెద్ద కళ్ళు, గుండ్రని ముఖం, వాలుజడతో చూడముచ్చటగా ఉండేది.
చిన్నప్పుడు మురారి సినిమా చూసి, ఆ సినిమాలో జరిగే పెళ్లిలా తన పెళ్లి కూడా జరగాలని కలలు కనేది సరిత. పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో కూతురి పెళ్లంటే – అమ్మ , నాన్న వదిలించుకునే భారమని, నాన్న నడవాల్సిన అప్పుల కుంపటని, వియ్యమందుకున్న కుటుంబానికి కట్న, కానుకలతో కట్టు బానిసగా పంపడమని , మొగుడు గీసిన గిరిలో జీవితాంతం తాను ఆడాల్సిన ఆట మాత్రమే అని ఒక పూటలో జరిగిన తన పెళ్లిలో తెలుసుకుంది సరిత.
జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నా సరిత మాత్రం ఎప్పుడు నవ్వుతూ ప్రశాంతంగా పారుతున్న గొదారిలా ఉండేది. ఉన్నంతలో సంతోషంగా ఉండేది. సరితకు ఒక నాలుగేళ్ల కొడుకు , ఎవరి మీదా ఆధారపడకుండా తానే కూలి, నాలి చేసుకుంటూ పోషించుకుంటూ ఉండేది.
సరిత మొగుడు నాయుడి గారి రైస్ మిల్లులో గుత్త కూలీల మేస్త్రి , మనిషి మంచోడే… కానీ జేబులో డబ్బున్నంతసేపే. డబ్బులేనప్పుడు ఎందుకో … భయం, అసహనం, కోపం అన్నీ కలగలిసినట్టు,ఎప్పుడూ ఎవరో వెంబడిస్తున్నట్టు ఉండేవాడు. చేతిలో నాలుగు పచ్చ నోట్లు పడితే నా అంత మోగొడు ఈ గోదారి జిల్లాల్లోనే లేడన్నట్లు ఉంటాడు.ఆ నాలుగు నోట్లు ఖర్చైపోయాక మాత్రం… వానలో తడిసి, పొయ్యి వెంట కూర్చునే పిల్లిలా దిగులుగా ఉండేవాడు. కూలి డబ్బంతా పేకాటకి, తాగుడికి తగలెట్టేవాడు.ఎప్పుడో అమావాస్యపున్నానికి ఆట కొట్టి ,అట్నుంచటే సారా కొట్టుకుపోయి ,ఫుల్లుగా తాగి, ఏ నడి రాత్రో వచ్చేవాడు. వచ్చేటప్పుడు మాత్రం పిల్లోడి కోసం ,సరిత కోసం మర్చిపోకుండా ఫ్రైడ్ రైస్ తెచ్చేవాడు. చాలా సార్లు దార్లో పడేసుకునేవాడు లేదా ఏ వీధి కుక్కో లాక్కెళ్లేది.
ఈ పేకాటకి, తాగుడికి మెల్లగా కూలి డబ్బుతో పాటు తన మానాన్ని కూడా తగలేయడం మొదలెట్టాడు. ఊర్లో దొరికినచోటల్లా అప్పులు. ఆ అప్పులకి,వడ్డీలకి మెల్లగా సరిత పెద్దమనిషైనపుడు అమ్మ మురిపెంగా చేయించిన చెవి కమ్మలు,పెళ్లైనప్పుడు మేడలో మొగుడు కట్టిన తాళి బొట్టు, ఒకటేంటి ఇంట్లో ఉన్న ఇత్తడి బిందెలతో సహా అన్ని పోయాయి .మొగుడు ఆడే జీవిత జూదంలో మొదటగా ఒడిపోయేది ఎప్పుడూ భార్యే…
రెండేళ్ల క్రితం, ఒక రాత్రి,కొడుకు పడుకున్నాకా …
“ మనకి ఎంత అప్పుందో తెల్సామ్మి? ” అడిగాడు మొగుడు
“ అబ్బో .. అదేదో.. ఎంత ఆస్తూందో? అన్నట్లు భలేగా అడుగుతున్నావు గా . సిగ్గు లేదు” అని కసిరింది సరిత.
“అలాక్కాదమ్మి , మన కిరానా కొట్టు పెద్ద కౌంటు గారు , ఇంకెన్ని రోజులు ఇలా రోజు వడ్డీలు కట్టుకుంటూ ఉంటావు ,ఎక్కడో చోట ఒకటే పెద్ద అప్పు చేసి ఈ చిల్లరబాకీలన్నీ తీర్చేసుకోరాదు అంటున్నాడు.”
“ఆ ఆయనకేమి , వంద చెబుతాడు. నీ మోగానికి ఈ ఊళ్ళో కాదు కదా రాజోలు పోయిన దమ్మిడీ అప్పిచ్చేవాడు లేడు”
“ లేదమ్మీ , పెద్ద కౌంటు గారే ఇస్తానంటున్నాడు , లెక్క కూడా తీసాం, మూడు లచ్చలు తేలింది.”
“వాయమ్మో, మూడు లచ్చలా ? ఎప్పుడు చేసావ్ అంత అప్పు, ఎందుకు? ఎప్పుడన్నా ఒక్క రూపాయన్న నాకోసం, పిల్లోడి కోసం తెచ్చావా? మూడు లచ్చలైందంటా , మూడు లచ్చలు .” బొంగురుపోతున్నగొంతుతో , కోపాన్ని ఆపుకుంటూ అడుగుతుంది సరిత .
“అట్లా అనుమాకమ్మి , పెద్ద కౌంటు గారే అప్పు ఇస్తా అంటున్నాడు ,వడ్డీ లేకుండా ” అన్నాడు .
“అయినా, పెద్ద కౌంటుగారు ఊరికే ఎందుకిస్తాడు, ఎదో తిరకాసు పెట్టేవుంటాడు. ముందు అదేందో కనుక్కో . డబ్బులిస్తానంటే చాలు నికు ఒంటి మీద గుడ్డ ఆగదు ” అని మళ్లీ కసిరింది.
“తిరకాసేమి లెదమ్మి, నీకు తెలుసుగా కౌంటు గారి బామ్మర్ది ,ఇక్కడ నుండి జనాలను కొయిటా (కువైట్) పనికి పంపిస్తా ఉంటాడు. మూడేళ్లు అగ్రిమెంట్ రాసి కొయిటా పోయి, అక్కడ పనిచేస్తే ఆ మూడేళ్లకుగాను మన ఈ మూడు లక్షల అప్పు మాఫీ చేస్కుంటా అంటున్నాడు. మన కష్టాలన్నీ తీరిపోతాయమ్మి”
“మూడేళ్లా? …మనం కడుతున్న ఈ రోజు వడ్డీలు ఎం ఉండవా?”
“ఎం ఉండవమ్మి, మనం సరే అంటే కౌంటు గారే మనకున్న అప్పులన్నీ తీర్చేస్తా అంటున్నాడు, వడ్డీతో కలిపి.”
“ఏమోబ్బా , నీ ఇట్టం . మూడేళ్లు అంటున్నావు, అప్పులన్నీ తీరిపోతాయి అంటున్నావు .నువ్వే ఆలోచన చెయ్యి, నేను ఇక్కడ పిల్లోడి సంగతి చూసుకుంటా మరి, ఎట్టాగోలా..”
మొగుడు మౌనంగా ఉన్నాడు..
“కట్టంగానే ఉంటది , కాదనను , మరేమిచేసెది ? నువ్వు చేతులారా చేసుకున్నదేగా , ఆ పేకాట , తాగుడు వదిలెయ్యి అని కాళ్ళు పట్టుకుని బతిమాలా, విన్నావా? వింటే ఈ కష్టాలుండేవా? సరేలే అయ్యిందేదో ఐంది, ధైర్యంగ పోయిరా బావా , నేనున్నాగా ఇక్కడ, ” అని ఓదారుస్తూ చెప్పింది సరిత..
“ అదికాదమ్మి , నేను కాదంటా పోయేది ” అన్నాడు
“మరి ? ”
“నువ్వంటా అమ్మి”.
“నేనా ??” సరిత కళ్ళనిండా నీళ్లు …
“ఆడమనిషికి అక్కడ గిరాకీ ఎక్కువ అంటా , ఇంట్లో పని మనిషి లాగా , నువ్వు మూడేళ్లు ఒక ఇంట్లో పని చెయ్యాలంటా” అలా చెప్పుకుంటూ పోతున్నాడు మొగుడు…
సరిత పక్కనే నిద్రపోతున్న కొడుకుని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టి, గట్టిగా కౌగలించుకొని కళ్ళు మూసుకుంది. కనీళ్ళు ఉబికి తన బుగ్గలపై నుంచి జారి, దిండును తడుపుతున్నాయి.
అలా మొగుడి చేతకానితనానికి,చేసిన అప్పులు తీర్చడానికి తన కొడుకుని అమ్మమ్మ దగ్గర వదిలేసి , ఇలా ఈ దేశం కానీ దేశం లో , నానా అవస్థలు పడుతోంది సరిత .
ఇంతలో మేడం పెద్దమ్మాయి తన వైపు రావడం గమనించింది సరిత. వచ్చి రాగానే తినడానికి ఒక షవర్మ , ఫ్రెంచ్ ఫ్రైస్ , కూల్ డ్రింక్ ఇస్తూ … “బాబా చెప్పారు. రేపు ఉదయం అపాయింట్మెంట్ తీసుకున్నాను , డ్రైవర్ హాస్పిటల్ కి తీసుకెళ్తాడు , ఏడవకు ..నువ్వు నవ్వుతుంటే బాగుంటావ్.” అని తన బురఖా వెనక దాగి ఉన్న చిన్న చిన్న కళ్ళతో నవ్వి వెళ్ళిపోయింది…
సరిత ఫోన్ మోగింది, వాట్సాప్ లో ఎదో మెసేజి . నాని గాడి స్కూల్ నుంచి వీడియో. సరిత కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ వీడియో ఓపెన్ చేసింది.
నాని గాడు డాన్స్ ఆడుతున్నాడు – సరిత పెదాలపై చిరునవ్వు.
షామల్ గాలులు = గల్ఫ్ ఎడారుల్లో వీచే గాలులు.
*
Sanjay, this is absolutely brilliant. Raw, emotional, and so real. The pain of Sarita’s life, her silent strength, and the way you brought the story to life — it truly moved me.
“మొగుడు ఆడే జీవిత జూదంలో మొదటగా ఒడిపోయేది ఎప్పుడూ భార్యే” – this line sums up the entire story so powerfully. Hats off to your writing.
Hats off once again — this was genuinely moving and thought-provoking.
Adbuthamga undi ,
Chadavagane kallu chemarchayi,
Idi Saritha Jeevitha katha okate kadu ilanti kathalu India lo chalane untay , kuti kosam koti thippalu padtunna chala mandi ilane valla jeevithalu gaduputunnaru .
Manchi kathanu ma munduku tiskochina Sanjay Khan ki danyavadalu
Yet another real and relatable story… But this time it’s a female POV.. it amazes me how apt it is.. this story is a reality of many women.. who are living only for thier kids.. Mr.Sanjay thank you for sharing your ‘gift of writing’ with us ..thank you for giving us సరిత.. who shines through the darkness . 💫
పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కుటుంబంలో కూతురి పెళ్లంటే – అమ్మ , నాన్న వదిలించుకునే భారమని, నాన్న నడవాల్సిన అప్పుల కుంపటని, వియ్యమందుకున్న కుటుంబానికి కట్న, కానుకలతో కట్టు బానిసగా పంపడమని , మొగుడు గీసిన గిరిలో జీవితాంతం తాను ఆడాల్సిన ఆట మాత్రమే అని ఒక పూటలో జరిగిన తన పెళ్లిలో తెలుసుకుంది సరిత.
These lines describe a girl’s marriage so well… Hats of to you Sanjay..👌👏