ఒక్క సరదా సంతకం నా జీవితాన్నే మార్చేసింది….ఆరేళ్ళ తర్వాత
1968వ సంవత్సరం నా జీవితాన్నే మార్చేసింది అనే కన్నా ఆ ఏడు ఒక స్నేహితుడు నా చేత పెట్టించిన చిన్న సంతకం ఆరేళ్ళ తరువాత నా జీవితాన్నే మార్చేసింది అని చెప్పడం అయినది అయినట్టు చెప్పడం అనమాట. అప్పట్లో అది ఎంత చిన్న సంఘటన అంటే….అసలు ఆ సంతకం పెట్టినప్పుడు నేను ఇంకా మాస్టర్స్ డిగ్రీ పూర్తి అవుతున్న రోజుల్లో ఉన్నానో, లేక మాస్టర్స్ డిగ్రీ చేతిలోకి వచ్చాక, పిహెచ్.డి మొదలు పెట్టిన కొత్త రోజులలోనో స్పష్టంగా జ్ఞాపకం లేదు. ఎపుడైతేనేం….జరిగిన విషయం అంతా నిజమే!
అసలు ఏమయింది అంటే…అందరి లాగానే నేనూ మాస్టర్స్ డిగ్రీ కూడా పూర్తి చేశాక “తర్వాత ఏమిటీ ?” అనే ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడం మొదలు పెట్టాను. అప్పుడు నా ముందు ఉన్నవి మూడు, నాలుగు రహదారులు..ఒకటి ఉద్యోగం వెతుక్కోవడం. బొంబాయి ఐఐటి అనగానే మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలానే ఉన్నాయి -కాస్త కష్టపడితే…అందులోనూ ముఖ్యంగా బొంబాయి లో ఎక్కడో అక్కడ ఏదో ఒక ఉద్యోగం వస్తుంది. నాకు మటుకు కేంపస్ జీవితం బావుంది కానీ, బొంబాయి నగరం లో జీవితం అనగానే అది మనకి పడదు అనిపించింది. ఎందుకంటే అంతా హర్రీ బుర్రీ యవ్వారం. ఇల్లు దొరకదు. ఎక్కడో దొరికిన చోట ఫ్లాట్ తీసుకుని రోజూ రైళ్ళలో పడి పోయి బతకడం మన వాళ్ళ కాదు. అనుకోకుండా పూనా లో ఉన్న టాటా రిసెర్చ్ లో ఇంటర్వ్యూ వస్తే, అది నాకు నచ్చింది కానీ వాళ్లకి నేను నచ్చలేదు. రెండోది చాలా మంది లాగా అమెరికా వెళ్ళిపోవడం.
అంటే ఆ రోజుల్లోనే ఐఐటి లో చదువు అవగానే ..అది బి.టెక్ అయినా ఎమ్.టెక్ అయినా…..ఆఖరి సంవత్సరం లోనే అమెరికా విశ్వ విద్యాలయాలకి దరఖాస్తులు పంపించుకుని, ఒకటో, రెండో ఎడ్మిషన్స్ తెచ్చుకుని, ఏది బావుంటే అక్కడికి వెళ్లి పోవడం సాధారణంగా జరిగేదే. నాకు మటుకు అందులో మూడు ఇబ్బందులు వచ్చాయి. అమెరికా వెళ్ళడం ఒక ఆశయం గా మారుతున్న ఆ రోజుల్లో కూడా స్వతహాగా నాకు అమెరికా అంటే అంత ఆసక్తి, మోజు లేకపోవడం మొదటి కారణం. ఇది ఇబ్బంది కాదు కానీ కాకినాట్లో మా ఇంటి ఆర్ధిక పరిస్థితులు నన్ను అమెరికా పంపించేలా లేక పోవడం మరొక కారణం. అంత కంటే ఎక్కువ గా నన్ను ప్రభావితం చేసినది మా తమ్ముడు హనుమంత రావు మరొక ఏడాదిలో ..అంటే 1969 లో కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచే ఎలెక్ట్రానిక్స్ లో పట్టా పుచ్చుకుంటాడు. వాడు మళ్ళీ నా లాగా ఇండియాలో మాస్టర్స్ చెయ్యడం అవీ చేసి సమయం వృధా చేసుకోకుండా డిగ్రీ అవగానే అమెరికా వెళ్లి పోవాలి అనే మా ఇద్దరి కోరిక. పైగా చదువుకోడానికి ఇంకా డాక్టరేట్ అనే పై చదువు ఉంది కదా. అది కూడా పూర్తి చేసి అప్పుడు అసలు జీవితంలో ప్రవేశిద్దాం అనుకున్నాను. ఆ మాటే మా గురువు గారు ప్రొఫెసర్ సుబీర్ కార్ గారికి చెప్పగానే అయన సరే అన్నారు. ఆ విధంగా నేను నెలకి $400 రూపాయల ఉపకార వేతనంతో ఐఐటి లోనే రిసెర్చ్ స్కాలర్ గా చేరిపోయి, హాస్టల్ 1 లోనే కొనసాగాను…మరొక ఏడాది పాటు.
ఈ సందర్భంలో నేను అనుకోనిదీ, నన్ను ఆశ్చర్యపరచినదీ ఏమిటంటే నా ఆప్త మిత్రుడు, సహాధ్యాయీ అయిన మూర్తి మా డిపార్ట్మెంట్ లోనే, మా గురువు గారి దగ్గరే లెక్చరర్ గా చేరాడు. నేను రిసెర్చ్ స్కాలర్ కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడే మూర్తి మా గురువు గారి ఆశీస్సులతో లెక్చరర్ ఉద్యోగానికి అప్ల్లై చేసి, ఎంపిక అయ్యాడుట. చెప్పొద్దూ, మూర్తి కానీ, మా గురువు గారు కానీ మాట వరసకైనా ఆ ఆలోచనలో ఉన్నట్టు నాకు చెప్పక పోవడం నాకు నిజంగానే ఆశ్చర్యం కలిగించింది. దానికి ముఖ్య కారణం బహుశా అప్పటికే మూర్తి పెళ్లి కుదిరి పోవడం అయి ఉండవచ్చును. నాకు ఇప్పుడు సరిగ్గా జ్ఞాపకం లేదు కానీ మూర్తి పెళ్లి శారద తో ఆ రోజుల్లోనే అయింది. దగ్గరి సంబంధమే. ఇద్దరిదీ తెనాలి దగ్గర కొల్లూరు. నేనూ, రావు మూర్తి పెళ్ళికి వెళ్ళ లేక పోయాం. శారద అప్పటి ఐఐటి రోజుల నుంచీ నేనంటే చాలా అభిమానంగా ఉండేది. తర్వాత తర్వాత నా కథలని చాలా ఇష్టంగా చదివేది. బొంబాయిలో ఉన్నప్పుడే వాళ్ళ పెద్ద కూతురు ఉమ పుట్టింది. మా తరం స్నేహితులలో, అందులోనూ మూర్తి కి మొదటి ఆడ పిల్ల కావడంతో నాకు ఉమ అంటే చాలా ఇష్టం. ఆ తరువాత మూర్తి, శారద లకి ఉష అని మరో కూతురు, కుమార్ అని కొడుకు…వీరందరూ ఇప్పుడు అమెరికాలోనే ఉన్నారు. దురదృష్ట వశాత్తూ మూర్తి భార్య, నాకెంతో ఆత్మీయురాలైన శారద గత సంవత్సరం పరమపదించింది.
ఇక నేనూ, మూర్తీ బొంబాయి ఐఐటి లోనే కొనసాగగా, రావు మద్రాసు వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళు వ్యాపారం చేసి, ఆ తరవాత మద్రాసు ఐఐటి లో పిహెచ్.డి పూర్తి చేశాడు. చందూ కూడా రిసెర్చ్ స్కాలర్ గా మా హాస్టల్ లోనే ఉండే వాడు. అలాగే కాకినాడలో నాకు జూనియర్లు అయి, ఒక విధంగా నా స్ఫూర్తి తోనే బొంబాయి ఐఐటి లో చేరిన ఆప్త మిత్రులు చెల్లూరి శివరామ్, తణుకు సుబ్బరాయ శర్మ, ఎమ్.విశ్వేశ్వర రావు, ఇంకా రాంభట్ల సీతారామ్….ఇలా సుమారు పది మంది తెలుగు కుర్రాళ్ళం హాస్టల్ 1 లో ఉండే వాళ్ళం. వీళ్ళందరూ ఒక ఎత్తు అయితే మల్ల వరపు రామ్ కుమార్ ఒక ఎత్తు. దానికి ఒక కారణం ఏమిటంటే అతను అనంత పురం లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసినా, మాలాగా మాస్టర్స్ డిగ్రీ కోసం కాకుండా మా కెమికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ లో సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ గా చేరాడు. అతను విద్యార్ధి కాకపోయినా హాస్టల్ 1 లో రూమ్ ఎలా సంపాదించాడో తెలియదు. అలాగే కందుకూరి నటరాజ్ (రేడియో లో వార్తలు చదివే కందుకూరి సూర్యనారాయణ గారి తమ్ముడు, కాకినాడలో మా ఎదురింట్లో ఉండే ప్రసిద్ద కవి శశాంక బావ మరిది), జి.వి.వి.ఎస్. మూర్తి మెకానికల్ ఇంజనీరింగ్ లోనూ, కాకినాడ పొలి టెక్నిక్ లో చదివిన కె. బ్రహ్మానందం కంప్యూటర్స్ డిపార్ట్మెంట్ లోనూ S.T.A (సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్) గా ఉండే వారు.
తెల్లగా, మరీ సన్నగా, పీలగా పొడుగ్గా ఉండే నెల్లూరి వాడైన ఈ రామ్ కుమార్ చాలా సరదా అయిన వాడు. నాటకాల్లో వేషాలు వేసే వాడు. మా హాస్టల్ 1 తెలుగు ముఠా అందరం కలిసి మెలిసి గొప్ప కులాసాగా ఉండే వాళ్ళం. ఒక రోజు సాయంత్రం కొందరం హాస్టల్ ఎదురుగుండా కొత్తగా పెట్టిన రెస్టారెంట్ లో టీ తాగుతూ కబుర్లు చెప్పు కుంటూ ఉంటే ఈ రామ్ కుమార్ వచ్చాడు. రాగానే ‘గురూ గారూ. మీతో చిన్న పని ఉంది” అన్నాడు. “చెప్పండి. నో ప్రాబ్లెమ్” అన్నాను. “ఏం లేదు. నాకు కంపెనీ ఇవ్వాలి. ఒక్కణ్నీ అయితే బోరు కొడుతుంది కదా” అన్నాడు.
అసలు సంగతి ఏమిటంటే, అంతకు ముందు రోజు బొంబాయి లో ఉన్న అమెరికా కాన్స్ లేట్ వారి ఆఫీసు నుంచి ముగ్గురు దొరలు మా ఐఐటి వచ్చి, అమెరికా ఎంత గొప్ప దేశమో, అక్కడి విశ్వవిద్యాలయాల లో చదువుకుంటే ఎంత బాగు పడతారో, ఆ దేశం లో ఉద్యోగావకాశాలు ఎంత మెరుగ్గా ఉంటాయో వివరించడానికి ఒక సెమినార్ నిర్వహించారు..ట. అది నాకు తెలియదు కానీ రామ్ కుమార్ ఆ సెమినార్ కి వెళ్ళాడు. ఆ సెమినార్ లో ఆ అమెరికా వాళ్ళు చెప్పిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే అప్పటి వరకూ ఉన్న కేవలం 25 డాలర్లు ఉన్న అప్లికేషన్ ఫీజు ని వచ్చే నెల నుంచీ ఏకంగా 100 డాలర్లు చేస్తారు కావున తొందర పడ వలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ రామ్ కుమార్ కి హటాత్తుగా ఫీజు తక్కువ ఉన్నప్పుడే అప్లై చేసి అమెరికా వెళ్ళాలి అనే కోరిక పుట్టింది. అయితే తను ఒక్కడూ ఆ ఆప్లికేషన్ పనులు అన్నీ చేసుకోడానికి బోరు కొడుతుంది కాబట్టి మనం ఇద్దరం సరదాగా కలిసి అప్ప్లై చేద్దాం. అదీ అతని ప్రతిపాదన.
చెప్పొద్దూ, అతని కోరిక వినగానే నాకు నవ్వొచ్చింది. “మరి మనకి పాస్ పోర్ట్ కూడా లేదే. ఎలా గురూ” అనగానే అతను ఎగిరి గంతేసి “నాకూ లేదు. అందుకే ఇద్దరం కలిసి అన్ని పనులూ చేసుకుందాం” అని హుషారు చేశాడు. అమెరికా మాట దేవుడెరుగు సరదాగా పాస్ పోర్ట్ కి అప్లై చేద్దాం అని “సరే” అన్నాను. ఇక అంతే సంగతులు. పాపం రామ్ కుమారే ముందు పాస్ పోర్ట్ కాగితాలు, ఆ తరువాత అమెరికా అప్లికేషన్ కాగితాలు అన్నీ పట్టుకొచ్చి, నా అప్లికేషన్ ఫారాలు కూడా అతనే పూర్తి చేసి కేవలం నా చేత సంతకాలు పెట్టించాడు. మొత్తానికి అమెరికా అప్లికేషన్ ఫీజు 25 డాలర్లు ఉండగానే ..ఆ రోజుల్లో డాలర్ కి 7.5 రూపాయలు..అంటే మా ప్రాణాలకి మొత్తం ఫీజు, ఖర్చులూ 200 రూపాయలకి పైనే… ఖర్చు పెట్టి అమెరికా వీసా కి అప్లికేషన్ పడేశాం రామ్ కుమారూ, నేనూ కలిసి, అతను సీరియస్ గా, నేను సరదాగా. అసలు ఏ వీసాయో, ఏమిటో ఏమీ నాకు తెలీదు. అంత ఆసక్తీ లేదు. ఆ తరువాత మూడు, నాలుగు నెలలకి అమెరికా నుంచే నాకు ఒక ఉత్తరం వచ్చింది. నా జన్మలో నాకు అమెరికా నుంచి అదే మొదటి ఉత్తరం. అదైనా ఒకే ఒక కాగితం. నాకు ఇప్పటికీ నమ్మకం కలగని ఆశ్చర్యం ఏమిటంటే…..ఆ అమెరికా కవర్ ని నేను అప్పుడు ఓపెన్ చెయ్య లేదు. అసలు అందులో ఏముందో చూడ లేదు. ఆ కవర్ ని అలాగే నా రేకు పెట్టెలో పారేశాను. అమెరికా అంటే నాకున్న అనాసక్తత ఆ స్థాయిలో ఉండేది. ఏదో రామ్ కుమార్ కి కంపెనీ కోసం అమెరికా కి దరఖాస్తు పెట్టుకున్నాను కానీ అప్పటికే డాక్టరేట్ కోసం పని మొదలు పెట్టిన నాకు వేరే ఆలోచనలు లేనే లేవు.
ఇక్కడ మరో చిన్న విషయం చెప్పాలి. ఆ అమెరికా దరఖాస్తులో “అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఏ నగరానికి మీరు వెళ్ళ దల్చుకున్నారు?” అని ఒక ప్రశ్న ఉంది. అక్కడ సుమారు పాతిక నగరాల పేర్లు ఇచ్చారు. అంటే అవి అనేక రాష్ట్రాలలో ఉన్న ఇమిగ్రేషన్ ఆఫీసులు ఉన్న నగరాలన మాట. మా అప్లికేషన్ ఆయా నగరాల్లో ఏదో ఒక నగరానికి పంపిస్తారుట. ఈ ప్రశ్నకి నేనూ, రామ్ కుమారూ భలే తర్జన భర్జన పడ్డాం. “అది కాదు గురూ, ప్రతీ వాడూ, న్యూయార్కూ, చికాగో, లాస్ ఏంజెలస్సూ అంటారు కదా. మనం మటుకు అలాంటి చోట్లకి కాక ఏ ఇండియనూ వెళ్ళని చోటికే వెళ్దాం” అన్నాను నేను. సరే అని అన్ని రాష్ట్రాలు, నగరాలు చూపించే అమెరికా చిత్ర పటం …ఒక పెద్ద మేప్…పట్టుకొచ్చాం. నేను కళ్ళు మూసుకుని ఒక చోట వేలు పెట్టాను. వాళ్ళ లిష్టులో ఆ చోటుకి దగ్గరగా ఉన్న నగరం పేరు ఆ అప్లికేషన్ లో వ్రాసి పారేశాం.
ఆ ఊరి పేరు శాన్ ఏంటోనియో….టెక్సస్ రాష్ట్రం. అంత వరకూ ఆ పేరు వినని మేం ఇద్దరం “భలే తమాషాగా ఉంది గురూ, ఈ పేరు” అనుకున్నాం. మరొక విశేషం ఏమిటంటే అసలు నేను ఆ పేరు వ్రాసినట్టు జ్ఞాపకమే లేదు… మరో 6 సంవత్సరాల దాకా. ఎందుకంటే 1974 లో నా డాక్టరేట్ పట్టా చేతి కొచ్చాక “తర్వాత ఏమిటీ?” అనే ప్రశ్న ఉదయించింది. నిజానికి ఏమీ అక్కర లేదు. ఎందుకంటే అప్పటికే నేను హాయిగా లెక్చరర్ ఉద్యోగంలో ఉన్నాను. డాక్టరేట్ అయింది కాబట్టి అసిస్టెంట్ ప్రొఫెసర్ అవుతాను. ఇంకేం కావాలి? అయినా “వాట్ నెక్స్ట్?” అనే ప్రశ్న నాకు నేనే వేసుకోగానే అంతకు ముందు ఆరేళ్ళ క్రితం అమెరికా నుంచి వచ్చిన ఆ ఉత్తరం జ్ఞాపకం వచ్చింది. అప్పుడు చూశాను..ఆ కవర్ U.S. Immigration & Naturalization Service, San Antonio, Tx నుంచి వచ్చింది అని. ఓహో, ఆ నాడు మనం వ్రాసిన పేరు ఇదా అని తెలిసింది.
అప్పుడు కవర్ ఓపెన్ చేసి, అందులో ఏముందో, ఆ తరువాత ఏం చేశానో……రామ్ కుమార్ పెట్టించిన ఆ సంతకాల విలువ, నా జీవితాన్ని అవి మార్చేసిన విశేషం ఏమిటో….. మరి కొన్ని వ్యాసాల తర్వాత.
*
చిట్టెన్ రాజుగోరండీ!
గూగులమ్మ మీ గురించి చెప్పిన కొన్ని మౌలిక విషయాలు ఇక్కడ కట్ అండ్ పేస్ట్ చెయ్యొచ్చో లేదో తెలీకున్నాది. తెలిసో తెలవకో చేస్తున్న నేరానికి తప్పట్టుకోకండి మారాజా!!
” Born in Kakinada, East Godavari, Andhra Pradesh, in 1945, Dr. Chitten Raju received his Engineering degree from Kakinada (Mechanical Engineering) in 1966. He then moved to Indian Institute of Technology (IIT), Bombay, and completed M.Tech and Ph.D degrees (both in Mechanical Engineering) in 1968 and 1974, respectively. During his Ph.D program, he also worked as an Assistant Professor in the department of Mechanical Engineering.
He moved to USA after receiving Ph.D and after a brief post-doctoral work at University of Houston, Texas, he joined as the Lead Engineer at MW Kellogg in Houston. He served as the Vice President & Founder of Tracten USA, Inc., Houston during 1982-85 and since 1985 he has been serving as the President & CEO of Pantex Valve Actuators & Systems, Inc., Houston.
Dr. Chitten Raju is an exceptionally talented and prolific writer. An author, writer and publisher par excellence & Winner of Outstanding Community Service Award. He is the founder of Telugu Association at IIT, Bombay in 1966 and served in the roles of founder, director, coordinator, convener or chair.
Dr. Chitten Raju has also been actively contributing to Indian community at USA since 70s in organizing events, publishing souvenirs and giving lectures on topics of importance to Indian community. During the recent years, he also associated himself with major initiatives of humanitarian causes. He is also the Fund raising coordinator in USA for Vegesna Foundation for poor & handicapped children, Hyderabad. “
హరీ నీ గూగులమ్మ దుంప తెగా!. నేను గత రెండేళ్ళగా సారంగా లో నెలకో వ్యాసం చొప్పున నా జీవితం గురించి వ్రాసుకుంటూ ఇంకా అమెరికా దాకా రానే లేదు కానీ ఈ గూగులమ్మ మటుకు ఐదారు పేరాల్లో మొత్తం అంత వ్రాసి పారేసింది…అయినా అందులో వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా మాట రాయనే లేదు. భలే…
మీ శ్రమకి , అభిమానానికి ధన్యవాదాలు.