తలుపు తీసిన కార్తీక వాకిట్లో నిలబడ్డ మాధుర్యను చూసి మొదట ఆశ్చర్యపోయి కళ్ళింత చేసింది. క్షణంలో తేరుకుని ఆనందంతో మధూ అని చిన్నగా కేక వేసింది. దా… అంటూ లోపలికి తీస్కెళ్ళింది. మంచినీళ్ళు తాగాక, ”నీ ఫోన్‌కేమయ్యింది కార్తీ ఎన్ని సార్లు చేసినా కనెక్ట్ అవటం లేదు” అంది. ”చిన్నోడు నీళ్ళలో పడేస్తే రిపేర్‌కిచ్చా మధూ చెప్పు ఏంటిలా ఉన్నట్లుండి”? కార్తీక అడిగిన ప్రశ్నకు సోఫాలో ఒక మూల ఒదిగి కూర్చున్న మాధుర్య ఒక్క ఉదుటున లేచి కార్తీకను కౌగలించుకుని వెక్కి వెక్కి ఏడవసాగింది. కార్తీక ఖంగారు పడిపోయింది. మధూ అంటూ మాధుర్యను ఒడిసి పట్టుకుంది. కొద్దిసేపు ఏడ్చాక మాధుర్య నిమ్మళ పడ్డది. ”సరె… ఏం చెప్పబాకులే మొఖం కడుగు… టీ తాగుదువుగానీ కొంచెం సేపట్లో చిన్నా వస్తాడు స్కూలు నుంచి రాత్రి మాట్లాడుకుందాం. సుధీర్ టూర్ ఎల్లాడు లే… లే మధూ” అంటూ మాధుర్యను బలవంతంగా లేపి సింకు దగ్గరికి తీస్కెళ్ళి తను వంటింటి వైపు వెళ్ళింది ఆందోళనను అణుచుకుంటూ…
టీ తాగాక ”పడుకుంటా కార్తీ కొంచెం సేపు తలనొప్పిగా ఉంది అంది” మాధుర్య…
– – –
స్కూల్ నుంచి ఇంటికొచ్చిన చిన్నాకి స్నాక్స్ ఇచ్చి బోర్నవీటా కలిపి ఇచ్చి ఆటకు పంపేసి వంటకు ఉపక్రమించింది కార్తీక. వంట చేస్తున్నంత సేపూ మాధుర్య గురించి ఆలోచిస్తూనే ఉంది. ఏంటలా అయిపోయింది. ఆరేళ్ళ క్రితం డిగ్రీ చేసే రోజుల్లో ఎంత చలాకీగా ఉండేది? దాదాపు నెలకోసారన్నా మాట్లాడేది. ఈ మధ్య సంవత్సరం నించీ తగ్గించింది. ఎప్పుడన్నా ఒక వాట్సాప్ మేసేజీ పంపేది. అది కూడా తను పెడితేనే. ఆ మధ్య ఒక రోజు తను ”లైఫ్ ఈస్ బ్యూటిఫుల్” అన్న కేప్షన్‌తో ఉన్న గుడ్‌మార్నింగ్ మెసేజి వెడితే ”నో ఇట్ ఈస్ అగ్లీ” అని తిరుగు సమాధానం ఇచ్చింది. ”ఏమైంది మధూ” అని తను అడిగితే ”అవును కార్తీ నా జీవితం చాలా అసహ్యంగా ఉంది” అనింది. ”ఏమైంది… మధూ సందీప్ మంచోడే కదా…” అంది. ”పైకలా కనిపిస్తాడు అయినా చీరలూ నగలూ స్వంత ఇల్లూ కారూ షికార్లు ఉంటే జీవితం – మొగుడూ మంచోళ్ళుగా మారిపోతారా ఇంకా” అంటూ ఆగిపోయింది. ఈలోగా సిగ్నల్ కట్ అయిపోయింది. ఏదో అయింది దీని జీవితంలో… బయట పట్టం లేదు అనుకుంది కార్తీక.
– – –
కార్తీక బలవంతాన ఒక రెండు ముద్దలు తిన్నది. ఆటల నించి తిరిగొచ్చిన చిన్నా కూడా తినేసి పడుకున్నాడు. బాల్కనీలో నిర్లిప్తంగా కూర్చుని ఉంది మాధుర్య. బాల్కనీపైకి ఎగిసి పాకిన సన్నజాజి తీగ ఆకాసంలో నక్షత్రాలతో పోటీ పడుతూ పూలను పూసింది. బాల్కనీ అంతా సన్నజాజి పూల సువాసన నిండిపోయింది. వెన్నెల పల్చగా పరుచుకుని ఆ పరిమళాలను తనలో ఇంకించుకున్నట్లే ఉంది. గోడకాన్చి వేసిన మంచంపై కూర్చుంది మాధుర్య.
వెన్నలా చుక్కలు పూవులు… ఒకప్పటి మాధుర్య గ్నాపకాలు. కానీ ఇప్పుడంతా అంత గొప్ప వాతావరణం కూడా ఏ ప్రభావాన్నీ చూపించటం లేదు. మనసంతా మొద్దుబారిపోయింది. పక్కన ఫోను మోగుతూనే ఉంది. అమ్మ చేస్తూనే ఉంది. మధ్య మధ్యలో సందీప్ చేస్తున్నాడు. అత్తా, ఆడబిడ్డ ఒకరి తర్వాత ఒకరు పోటీ పడుతూ చేస్తున్నారు. ఫోన్ సైలెంట్‌లో పెట్టేసింది చిరాగ్గా.
”ఏమైంది మధూ చెప్పు… సందీప్ ఎలా ఉన్నాడు? అక్కడి నించేనా రాక?” కార్తీక బతిమాలాడుతున్న ధోరణిలో అడిగింది. ”కాదు అమ్మా వాళ్ళింటి నించి” అంది మాధుర్య. ”పండక్కి గానీ వచ్చావా ఏంటి?” అంది కార్తీక కాదు… ”కాదు ఊరకే నెలైంది వచ్చి” అంది మాధుర్య. ”ఏమైందో చెప్పు మధూ… ఏమైనా గొడవ పడ్డారా?” అని అడిగింది కార్తీక.
మాధుర్య మౌనంగా ఉండిపోయింది. ఆ చీకటి – వెన్నల చుక్కలు ఆకాశం – సన్నజాజి పూవులూ మాధుర్య నిశ్శబ్దాన్ని బద్దలుకొడితే బాగుండన్నట్లు ఆతృతగా చూసాయి.
”సందీప్ మంచోడనే చెప్పావుగా పెళ్ళైన నెలకి ఫోన్ చేస్తే బాగా చూస్కుంటాడనీ ప్రేమిస్తాడనీ ఇంతలో ఏఁవైందే… పిల్లలు పుట్టటం లేదని గొడవా… ఏవైంది చెప్పు… అమ్మా వాళ్ళింటికొచ్చి నీ అత్తారింటికెందుకు వెళ్ళకుండా ఇక్కడికొచ్చేసావు చెప్పు మధూ నాతో పంచుకో నీ బాధ… కొంచెం ఒత్తిడి తగ్గుతుంది.” కార్తీక… మాధుర్య రెండు చేతులను పట్టుకుని అడిగింది. కళ్ళ నిండుగా ఉన్న కన్నీరు వెచ్చగా బుగ్గల మీదకు జారి కార్తీక చేతుల మీద పడి చిట్లాయి. కార్తీక ”ఏడవబాకు… నాకు చెప్పు…” అంటూ మాధుర్య కన్నీళ్ళు తుడిచింది. ”సందీప్ దగ్గరికి వెళ్ళాలని లేదు. వెళ్ళనింక నిశ్చయించుకున్నా” అంది వణుకుతున్న కంఠంతో మాధుర్య. నిశ్చలంగా వెన్నల్లో చిరుగాలికి తలలూపుతున్న సన్న జాజి పూల గుత్తుల్ని చూస్తూ ”నీకు చెబితే నువ్వు కూడా అమ్మలాగా నాన్నలాగా ఇంతదానికీ మొగుణ్ణి తప్పుబడతావా అంటావేమో… మొగుడి ఆయురారోగ్యాల కోసం నోములు నోచుకునేదానివేగా నువ్వూ మా అమ్మలాగా” అంటూ తలతిప్పి మళ్ళీ సన్నజాజి పూలను చూడసాగింది. ”నోములు నోచుకుంటే మొగుడేం చేసినా ఊరుకుంటాఁవా అయినా నీకు తెలీదా మధూ మా అత్త బాధపడలేక ఏదో మొక్కుబడిగా ఈ నోములు చేయటం అంతానూ… నేను నిన్ను అర్థం చేసుకోను అని ఎందుకనుకున్నావే మూడేళ్ళూ కలిసి చదువుకున్న వాళ్ళం, దుఃఖం, సుఖం పంచుకున్న వాళ్ళం… కాలేజీలో ఎవడు సతాయించినా నాకే చెప్పేదానివి గుర్తుందా… ఎలా బెదిరించే వాళ్ళం వాళ్ళని ప్రిన్సిపాల్‌కి కూడా కంప్లైట్ ఇచ్చేవాళ్ళం గుర్తుందా? ఎంత ధైర్యంగా ఉండేదానివి ఇలా కన్నీళ్ళు కారుస్తూ బేలగా మారిపోయావేంటి మధూ?
”అవును… అవునవును” మాధుర్య ఒక్కసారి ఉలిక్కిపడుతూ అన్నది. ”కానీ… కానీ కార్తీ ఇప్పుడా ధైర్యం లేదు” అంటూ నిర్లిప్తంగా గోడకానుకుంది. ”చూడు నాకు చెప్పు ఏం జరిగిందో… సందీప్‌ని కడిగేద్దాం” అంది కార్తీక కోపంగా.. ”ఎంత కడిగినా పోని మకిలితనం అతనిది” అంది మాధుర్య తలపండిన దానిలాగా…
మాధుర్య దిండు కింద ఉన్న పుస్తకాన్ని తీసి కార్తీక చేతుల్లో పెట్టింది. అదొక డైరీ – ”ఇది చదువు నా బాధంతా ఇందులో రాసాను. నేను నోటితో చెప్పలేను కార్తీ” అంది బాధ భరించలేనట్లు నుదురు కనుబొమ్మలు కుచించుకుపోతుంటే… ”కొడతాడా… కట్నం కోసం వేధిస్తాడా… ఆడాల్లతో సంబంధాలున్నాయా ఏంటి మధూ…” కార్తీక ప్రశ్నల మీద ప్రశ్నలు గుప్పించింది ఆవేశపడిపోతూ… ”ఊహూ… ఇవేవీ చేయడు… నేను చెప్పలేను అన్నా కదా చదువు కార్తీ…” అంటూ బాల్కనీ లోంచి ఇంట్లోకి వెళ్ళిపోయింది నిజాన్ని కార్తీక చేతుల్లో పెట్టేసి.
– – –
అందరూ అడుగుతున్నారు నువ్వు ఎందుకు మొగుడు దగ్గర ఉండనంటున్నావూ. ఏఁవొచ్చిందీ ఒఠ్ఠి ఒళ్ళు తీపరం కాపోతే. అందగాడు బాంకులో ఆఫీసరు డూప్లెక్సు హౌసూ కారూ ఇన్నేసి నగలూ ఊళ్లో పొలాలూ పశువులూ అత్తా మాఁవా… ఆడబిడ్డలు సంక్రాంతి పండగలాంటి సంబరంతో ఉండే ఇల్లూ పోనీ ఎప్పుడూ అత్తారింట్లో ఉంటదా అంటే, ఆల్లు ఊళ్లోనే ఉంటూ అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటారు. మీ మొగుడూ పెళ్ళాలేగా ఉండేదీ. దేనికీ లోటు లేని జీవితం మొన్ననే కదనే నీ పుట్టిన రోజుకు రెండు లక్షలు పోసి మెళ్ళోకి వజ్రాల నెకిలెసు చేసిచ్చిందీ అన్నాయంగా అల్లుడి మీద సాడీలు చెప్పమాక కల్లుపోతాయి అమ్మ లబలబలాడింది కన్నీళ్ళు పెట్టుకుంటూ… నిన్ను సదివించడమే తప్పయ్యింది. మొగుడు అన్ని సమకూర్చడఁవే తప్పనే కాడికెల్లిపోయావు. గమ్మున ఎల్లిపోయి మాట్టాడకుండా కాపురం చేసుకో… అసలు నేను మీ అమ్మనెలా నా కంట్రోలులో పెట్టుకున్నానో అట్టా నీ మొగుడూ పెట్టుకోవాల మొన్నదే చెప్పినాను అల్లుడు ఫోను చేస్తే. ఆయన ఏ తప్పు సెయ్యకుండగా ఎందుకే బాధపెడతావూ నేను వచ్చేప్పటికి నిన్నింట్లో చూసానో… ఇంగస్సలు ఊరుకోను… స్సేయ్ నీ కూతురికి ఏం చెప్పి మొగుడు దగ్గరికి కాపురానికి అంపుతావో నీ ఇష్టం అదింట్లో ఉంటే మటుకు నా చేతిలో నీ పని అయిపోద్ది” అంటూ నాన్న చూపుడు వేలితో అమ్మను బెదిరిస్తాడు. అన్ని ఎంక్వైరీలు చేసాం కదే మధూ ఊళ్లో ఆఫీసులో అందరూ బంగారంలాంటి పిల్లాడు కళ్ళు మూసుకొని పెళ్ళి చెయ్యండి అంటేనే కదా మేఁవు అంత ధైర్యంగా చేసిందీ? కొట్టడు… తిట్టడు… డబ్బూ అడగడు, తాగడు, తిరగడు అన్నీ నువ్వేగా చెప్తున్నావు? మరింకేం చేస్తాడు? నీకే ఇష్టం లేనట్లుంది ఎవరినైనా ప్రేమించావా… చెప్పు… ఆన్ని మర్చిపోలేక మొగుణ్ణి ఇడ్సిపెట్టాలని, నాటకాలాడుతన్నావా… చంపేస్తాను” చేతిలో రిమోటుని మంచం మీదకు విసిరి కొట్టిన అన్నయ్య మోహన్.
”మధూ… ఆల్లకి చెప్పుకోలేనంత బాధేవఁన్నా ఉంటే నాకు చెప్పు నేను మీ అన్నయ్యకీ అమ్మకీ చెఁవుతాను. సామరస్యంగా సందీపన్నయ్యని పిలిపించి మాట్లాడదాము అంతే కానీ ఇట్టా చీటికి మాటికి పుట్టింటికి పారిపోయొచ్చేసి నువ్వుండి పోతావుంటే కాలనీలో… చుట్టాల్లో ఎంత పరువు పోతుందో నీకెట్టా అర్థం అవుతుందీ” వదిన జయ. తనే వాళ్ళను అర్థం చేస్కోవాలి వెళ్ళిపోవాలి.
తనను మాత్రం ఎవరూ… ఎవరూ అర్థం చేస్కోరే…
కొట్టినా.. తిట్టినా… చంపినా మొగుడు ఆయనకే అధికారం ఉంది బరించు… అక్కడే సాఁవు ఇక్కడికి మాత్రం రాబాకు… ఎంత కఠినంగా అంటాడు నాన్న?
కొట్టకపోతే తిట్టకపోతే… వజ్రాల నెక్లెసులూ పట్టు చీరెలూ పెళ్ళాం వంటికి చుట్టపెట్టేస్తే మంచోడా… ఆస్తి ఉంటే అన్నీ బరించాలా…
నిజఁవే… కొట్టడు, తిట్టడు అడక్కుండానే తన పర్సులో డబ్బులు పెడతాడు ప్రతీనెలా… ”లెక్చరరు జాబు సెయ్యి ఇంట్లో ఉండి బోరుకొడ్తుంది” అంటూ తానే కాలేజీలో తన పరపతితో ఉజ్జోఁగఁవూ వేయించాడు. అంతా బాగానే ఉంది కానీ… కానీ…
ఛ…! ఇదంతా తను రాయాలా… తల్చుకోడానికే అసియ్యఁవేస్తోందే ఎట్టా రాయడం కానీ రాయాలి, వీళ్ళు ఎప్పటికైనా చదవాఁలి. అన్నాయ్, వదిన, నాన్న… అప్పటికైనా అర్థం చేస్కొంటారో తేలీదు అమ్మకు కొంచెం చెప్పింది. నోటి మీద నాలుగేళ్ళూ… బుగ్గన బొటనవేలూ గుచ్చేసుకుంటూ పరఁవాశ్చెర్యంగా మొగుడు కాకపోతే ఎవురు చేస్తారే అట్టా? మా మొగుళ్ళు మమ్మల్ని కన్నెతి సూడనే సూడరు అని మొత్తుకునే ఆడాళ్ళున్నారు లోకంలో. నువ్వేంటే మరీ మతి సెడిపోయింది నీకు – ఇందుకా నువ్వు అతగాడి దగ్గర్కి పోనంటున్నది నాన్నారికి తెలిస్తే ఇప్పుడే నిన్ను నీ మొగుడి దగ్గరికి ఒదిలేస్తారు తెలుసా… నాకు చెఁవితే చెప్పావు కానీ ఇంగెవరికీ సెప్పమాక నవ్విపోతారు… మొగుడు ముద్దుగా నడుం మీద సెయ్యేసినా తప్పేంటే నీకూ… చోద్యం కాకపోతే? అమ్మ నించి ఈ మాటలు తప్ప అసలు తన్ని ఎక్కడ అర్థం చేస్కుందనీ… ఆడదై ఉండీ?
ఇంకెవరికి చెబుతుందీ? ఒక్క నడుం మీద మాత్రఁవే చెయ్యేస్తాడా వీళ్ళకేం తెలుసని? పెళ్ళైన నెలరోజులూ బాగానే ఉన్నాడు ఒఠ్ఠి రాత్రిళ్ళు మాత్రం బెడ్రూంలో ముట్టుకునేవాడు. అదీ ఇంట్లో అత్తా, మామా, ఆడబిడ్డలూ ఉన్నారని. ఇంకా వాళ్ళు ఊరెళ్ళిపోయాక మొదలెట్టాడు… ఎప్పుడుబడితే అప్పుడు ఎక్కడబడితే అక్కడ ముట్టుకుంటాడు, ముట్టుకోటమేనా పిసుకుతాడు, గిల్లుతాడు, లాగుతాడు, చరుస్తాడు… ఇంకా… ఛీ… ఛీ…
మొదట్లో మొహమాటం, భయం, సిగ్గు… ఒక రకంగా షాక్… ఇంట్లో ఎక్కడున్నా లివింగ్ రూంలో హాల్లో వంటింట్లో బెడ్‌రూంలో, బాత్రూంలో, ఎలా ఉన్నా… పని చేస్తున్నా… టీవీ చూస్తూ ఉన్నా, తల దువ్వుకుంటున్నా, స్నానం చేసి చీర కట్టుకుంటున్నా వంటింట్లో వంట చేస్తున్నా, అమ్మా నాన్నలతో ఫోన్ మాట్లాడుతున్నా, పిల్లల పాఠాలు రాస్కుంటున్నా… ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా పీరియడ్స్‌లో ఉన్నా… జ్వరం వచ్చినా తనకిష్టఁవా లేదా… ఏదీ పట్టదు… అమ్మా నాన్న వచ్చినా వాళ్లు చూడనప్పుడూ ఇంతే ఏఁవీ చూడడు ఎక్కడంటే అక్కడ చేయేసేస్తాడు. చెవి దగ్గర రహస్యంగా ”ఈ రాత్రికేమన్నా ఉందా లేదా” అంటాడు. గబుక్కుని భుజాల వెనక బాహుమూలల భాగంలో ముక్కు ఒత్తేసి గాఢంగా శ్వాస తీస్కుంటూ కళ్ళు మూస్కుంటూ మైకం ఒచ్చినట్లుగా మొఖం పెడతాడు. ఉన్నట్లుండి నాలుక చూపిస్తాడు. ఛీ… ఒకసారి సినిమా హాల్లో ఒకడు అట్టా చేసాడు. తనెలా కనిపించింది వాడికి అని కుంగిపోయింది. ఇతను కూడా బస్సుల్లో, సినిమా హాల్లో ఆడాల్లతో ఇలాగే చేస్తాడా? ఎంత చీదరించుకుందీ? ఎందుకలా వాడు చేసాడని కుంగిపోయింది? ఇపుడు ఇతగాడూ అలానే చేస్తుంటే…?
ఇంట్లో అటూ ఇటూ తిరుగుతుంటే అతని పక్కనించి వెళుతోంటే ఒక్కసారి పిర్రలమీద చరచడం, పట్టుకొని తోడల మధ్య తట్టడం, గిల్లడం, వేలితో పొడవడం. బెడ్రూంలోంచి బయటకో లోపలికో వస్తుంటే తలుపు చాటు నించి ఒక్కసారి దాడి చేయడం అతన్ని తప్పించుకుంటూ ఇల్లంతా బిక్కుబిక్కుమంటూ బిత్తిరి చూపులు చూస్తూ తను తిరగడం. గుండె ఝల్లుమంటుంది ఇంట్లో నడవాలంటే భయం… ఎక్కడ నించి మీద బడతాడో అని. అచ్చం ఆ డిగ్రీ కాలేజీలో వీధి రౌడీలా. వంటింట్లో వంట చేస్తుంటేనో కూరగాయలు తరుగుతుంటేనో వెనక నుంచి సడి చేయకుండా వచ్చి, వెనక నించి వచ్చి జాకెట్లో చేతులు పెట్టేసి పిండెయ్యడం, రొమ్ములు గుంజడం, నిపిల్స్ లాగడం, గిల్లడం, మరీ ఘోరంగా వెనకనించి చేతులు ముందుకు చీర కిందికి పోనిచ్చి బొడ్లో వేలు పెట్టడం. మరీ కిందికి బార్చి అక్కడ… వేళ్ళతో గుచ్చడం, టీవీ చూస్తుంటే పక్కనే కూర్చుని తన బట్టల్లోకి చేతులు దోపెయ్యడఁవే. ఛీ.. ఛీ.. ఒళ్ళంతా చీదరేత్తెస్తుంటే, అని తను వదులు వదులు అని విదిలించుకోడం… ”ఏం నీ మొగుణ్ణి ఆ మాత్రం సరసమాడే హక్కు లేదా ఎందుకు ఒంటి మీద చెయ్యేస్తే చీదరించుకుంటావు… ఇష్టంగా లేదంటే మరింకేలా చేయను చెప్పు చేస్తా” అంటూ చిటపటలాడతాడు. తనేదో నేరం చేసినట్లు – ఒద్దంటే నిర్ఘాంతపోయి చూస్తాడు. ”నిన్నే చూస్తున్నా మొగుడి సరసాన్ని తప్పు పట్టేదాన్ని నా ఫ్రెండ్స్ ఇంకా ఎక్కువ చేస్తారు. అయినా వాళ్ళ పెళ్ళాలు కిక్కురుమనరు తెలుసా… ఏవఁన్నా తేడా చేస్తే ఇంకేవఁన్నా ఉందీ… కంట్రోల్లో పెడతారు పెళ్ళాలని… నేనింకా నయం నిన్ను ఒక్క దెబ్బన్నా కొట్టకుండా బంగారంగా చూస్కుంటున్నా అనా ఇట్టా చేస్తున్నావు ఛీ ఛీ బతుకు నరకం చేస్తున్నావు. మీ అమ్మతో చెఁవుతాను” అంటాడు.
స్నానం చేస్తుంటే ”మధూ అర్జెంటూ ఫోన్ మీ అమ్మ నుంచి” అని ఖంగారు పెట్టేసి తను తలుపు తెరిస్తే దూరిపోయి అసభ్యంగా చేస్తాడు. ”షవర్ కింద జలకాలాడుతూ చేసే సరసం అద్భుతంగా ఉంటుంది నీకసలు టేస్టే లేదు” అంటూ బలవంతంగా బాత్రూంలోనే సెక్సు చేస్తాడు. తనను లొంగ దీస్కుని విజయం సాధించినట్లు ఫెటిల్లున నవ్వుతాడు. తన ఇష్టంతో ప్రమేయం లేకుండా, ఏడుస్తూ చీదరపడ్తూ మళ్ళీ స్నానం చేస్తుంది. స్నానం చేసాక తనముందే బట్టలు వేస్కోవాలంటాడు. అతని భయానికి ఇంకెన్ని సార్లు స్నానం చేసేప్పుడు అబద్ధాలు చెప్పుతూ తలుపు కొట్టినా తియ్యడం మానేసింది. కాలితో బాత్రూం తలుపుల్ని తంతాడు. ఎక్కడికైనా బయటికెల్లొచ్చాక లేదా, కాలేజీకి వెళ్ళేముందు బట్టలు మార్చుకుంటుంటేనో దూరిపోయి, తలుపేసేసి ఉంటే తెరిచేదాకా బాదేసి చాలా చెత్తగా చేస్తాడు… ఒద్దు నాకిష్టం లేదు ఒదులు ఛీ అన్నా ఒదలడు.
”నాకిష్టం… నా ఇష్టం… నువ్వు నా పెళ్ళానివి నీ మీద, నీ ఒంటిమీద నాకే అధికారం. ఈ ఒళ్ళు నాది నీది కాదు” అని అధికారంగా మాట్లాడతాడు. టెన్షన్‌తో ఆదరా బాదరాగా ఒక నిముషంలో బట్టలు ఎడా పెడా మార్చుకోవడం, స్నానం ఐదు నిమిషాల్లో ముగించుకోడం నేర్చుకొంది.
మాటేసిన చిరుతపులి మెల్లిమెల్లిగా అడుగులేస్తూ ఎలా జింకపిల్ల మీద ఒ్క దుటున దుంకేస్తుందో అట్టా ఈ ఇంట్లో తన కోసం తనెప్పుడు దొరుకుతుందా కాచుకుని ఉంటూ… దొరగ్గానే మీదకు దుంకుతాడు ఛీ ఛీ ఏంటీ పాడు అలవాటు ఇతనికి.
అతని పక్కనించి వెళ్ళటం మానేసింది. అతనుంటే వెళ్ళదు. తన ఛాతీపై అతని చేతులు వేయకుండా తన మోచేతులు అడ్డం పెట్టుకుంటూ నడవడం. బస్సుల్లో నడిచేది అలా తాకాలని చూసే మగాళ్ళని తప్పించుకుంటూ. వంటింట్లో పొయ్యి వైపు తిరిగి నిలబడ్డం మానేసింది. తిరిగి చేసినా వెనక నించి ఎక్కడ దాడి చేస్తాడో అని మాటి మాటికి వెనక్కి తిరిగి చూట్టమే. గదిలోంచి బయటకు వచ్చేముందు, గదిలోకి పోయేముందు తలుపు చాటున మాటేసి ఉన్నాడేమో అని చెక్ చేసుకోడఁమే. రాత్రిళ్ళు నిద్రపోతూ ఉంటే ఒక్కుదుటన మీద పడతాడు. తను కళ్ళు తెరిచే లోపల అతని పని అయిపోతుంది. మెల్లగా వేరే పక్కమీద పడుకోడం మొదలెట్టింది దానికీ గొడవే. నీ పక్కనే పడుకుంటా అంటాడు. ఒఠ్ఠిగా పడుకోడు. తన జాకెట్లో చేతులేసి రొమ్ములు గట్టిగా పట్టుకుని పడుకుంటానంటాడు. ఎంత గుంజి పడేసినా – ఇష్టం లేదన్నా వినడు లేదా చీర పైకి లాగి పడేసి తొడల మధ్య చేతులేసి పడుకుంటానంటాడు. నరకం, నరకం. ఛీ రాస్తుంటేనే మహా అసఁయ్యంగా ఉంది. తన కథను ఎవరైనా ఉన్నదున్నట్లుగా రాసినా… రాసేటప్పుడు వాళ్ళు కూడా ఇంతే చీదరపడతారు కాబోలు.
రాత్రి పూట శృంగారం బెడ్రూంలో చెయ్యడం వేరు దానికి తనెందుకు అభ్యంతరం చెఁవుతుందీ? కానీ వంటింట్లో ముందు రూంలో, హాల్లో, బాత్రూంలో, మొత్తం ఇంట్లో తన ఇష్టం, అయిష్టం, మానసిక సంసిర్థతా ఏఁవీ చూడకుండా అసభ్యంగా చేస్తాడు. రాత్రిపూట అతనితో శృంగారం కూడా వెగటు పుట్టేసింది. మాటు వేసిన పామూలా దాడి చేస్తాడు కాదూ తన మీద? తనకిదో ఆట, తనో బొమ్మ. తన ఒళ్ళు తనది కాదుట అతనిదట ఎప్పుడు కావాలంటే అప్పుడు తను ఎక్కడైనా ఏఁవైనా చేసుకుంటాట్ట.
ఎంత చెప్పినా వినడే తిడుతుంది అరుస్తుంది అతని చేతుల్ని తప్పించుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి తలుపేసుకుంటుంది. లేదా ఇంటి బయటకు వెళ్ళిపోయి గుమ్మంలో కూర్చుంటుంది. అతనొచ్చే టైంకి కాలనీ ఫ్రెండ్స్ ఇళ్ళకో షాపింగ్‌కో వెళ్ళిపోతుంది. ఎంత తప్పించుకున్నా, కడకు ఇంటికి రాక తప్పదు కదా మళ్ళీ అదే దాడి.
”నా ప్రేమ నీకర్థం కాదు… నీతో ఎప్పుడూ టచ్‌లో ఉండాలనుకోడం తప్పా? అంటాడు. టచ్ అంటే ఎలా ఉండాలీ? ప్రేమా… సరసమూ అంటే ఎంత మధురంగా ఉండాలీ… నుదిటి మీదనో బుగ్గల మీదనో, కనుల మీదనో చిరు ముద్దులు పెట్టటం చెవుల దగ్గర గుసగుసలాడ్డం సున్నితంగా సముద్రపు నురగనో, పూలరేకులనో ముట్టుకున్నట్లు తన ముఖాన్ని ముట్టుకోడం అదేం లేదు. పొద్దస్తమానం వేటకుక్కలా తనని తరుముతాడు. తెల్లార్లు అతన్ని తప్పించుకుంటూ ఉంటఁవే తన పని.
తన వల్ల కాదు… రోజు రోజుకీ తను వద్దన్నకొద్దీ ఎక్కువ చేస్తున్నాడు. ఎన్నిసార్లు పుట్టింటికి పారిపోయింది. కాలేజీలో పాఠం చెపుతున్నా ఇవే ఆలోచనలు అతని వెకిలి చేష్టలు – స్పర్శ అతని హావభావాలు గుర్తుకొచ్చి ఇంటికెళ్ళాలని అనిపించేది కాదు. ఎందుకు మేడం ఏడుస్తున్నారని తోటి లెక్చరర్ స్వాతి అడిగేదాకా తెలీని లోన కురిసే ఎడతెగని దుఃఖం… నిద్రలో కూడా ముట్టద్దు… డోన్ట్ టచ్‌మీ… చేతులు తియ్యు… ఒద్దు.. ఒదులు… ఛీ, ఛీ, ఛీ, ఆగక్కడ నో, నో, నో.. ఇవే కలవరింతలు ఇంటికెళ్ళాలన్పించదు. ఇంట్లో ఉండాలన్పించదు.
అతని అడుగుల చప్పుడు వింటే చాలు… పారిపోఁవడఁవే ఉలిక్కి పడ్డఁవే… తనను గట్టిగా గోళ్ళు గుచ్చేలా, నొప్పి పుట్టేలా పట్టుకుని ఆపుతాడు. జడపట్టి గుంజుకుంటాడు. నన్ను తోసేస్తావేం అని అరుస్తాడు. తోసెయ్యక చేతులు వేయించుకుంటుందా? అతను దగ్గరికి వస్తుంటే నాలుగడుగులు వెనక్కి వేస్తూ చేతులు అతని వైపు గురిపెట్టి ఆగక్కడ… ముట్టద్దు అని అని అరిచే స్థితికి వెళ్ళిపోయింది.. ”పిచ్చేఁవిటే నీకు… నీ మొగుణ్ణే నేనూ” అంటాడు కోపంగా రెచ్చిపోతూ. రాస్తుంటేనే ఇంత అసహ్యంగా ఉందా… ఈ డైరీ నాన్న అన్నయ్య అమ్మా చదివితే… అసయ్యించుకుంటారా. లేక అతని ముద్దూ ముచ్చటా అర్థం కాక పిచ్చి వేషాలేస్తున్నది అని కొట్టి పడేస్తారు. ఎవరికి చెప్పుకోవాలి.
ప్రతీ భర్తా ఇలానే చేస్తాడా? ఇది శృంగారంలో భాగం అంటాడు. శృంగారం ఇలానే ఉంటుందా? పెళ్ళాం సమ్మతి లేకుండా ఎక్కడబడితే అక్కడ చేతులు వేసెయ్యడఁవే శృంగారఁవా దీనికి తను ఒప్పుకోవాలా… అదీ సంతోషంగా… వీడికి తను అలా చేస్తే? ఎక్కడబడితే అక్కడ చేతులేస్తే… అతను పేపరు చదువుతున్నప్పుడో, గడ్డం గీసుకుంటున్నప్పుడో, టీవీ చూస్తున్నప్పుడో, ఫోనులో మాట్లాడుతున్నప్పుడో, కంప్యూటర్ పని చేస్తున్నప్పుడో తనూ అలా చేస్తే గిల్లి, పిసికి లాగి వీడి ప్యాంటులో చెయ్యేసి గుంజి తనతో వీడు చేసినట్లు… ఛ… తనట్టా అసయ్యంగా ఎలా చేస్తుందీ? ఒఠ్ఠి వీధి రౌడీలా చేస్తున్నాడు.
ఇతని కేఁవైనా మానసిక జబ్బా? డాక్టరుకు ఇవన్నీ చెబితే ఆడైనా, మగైనా ఆ డాక్టరు కూడా రాసుకోడానికి కూడా ఇబ్బంది పడరూ? తనైనా ఎట్టా చెప్పుద్దీ? ఎలా… ఏం చెయ్యడం… తనకలా బాగోలేదు అసయ్యం పుడ్తుంది అని చెప్పినా నమ్మడేం… పట్టించుకోడేం? అత్తగారొస్తే కొంచెం తగ్గి ఉంటాడు. ఆమ, ”నా కోడలు అత్తయ్యా అని ఎన్ని సార్లు పిల్చుకొంటూందో” అని మురిసిపోతుంది. నా కోడలికి నేనంటే ఎంత ప్రేమో అని. ఎంతో ప్రేమా పుట్టేస్తుంది. కానీ పిల్చినప్పుడల్లా అత్తారలా వచ్చేస్తే తనని రక్షించడానికి వచ్చిన దేవతల్లే అన్పిస్తుంది.
ఈసారి అమ్మా నాన్న తననే చాలా కోపడ్డారు. పెళ్ళై రెండేళ్ళైనా కాలేదు. ఎన్నిసార్లు పుట్టింటికి వచ్చేసావో తెలుస్తోందా నీకు? మొగుడితో గొడవలవటం మూలాన్న కాదు ఇక్కడెవడో ఉన్నాడని అందుకే వస్తున్నావనీ అనుకుంటారు. అతగాడికి లేనిపోని అనువాఁనాలు పుట్టించబాకు. ఎంత ఓపికతో నిన్ను భరిస్తున్నాడని ఆటలాడకు అతగాడితో. పరువుగా బతకనియ్యఁవా మమ్మల్ని? కొడితే చెప్పు, కట్నం కోసం పీడిస్తే చెప్పు వస్తాం, తంతాం కానీ ఇదేంటి మొగుడు సరసఁవాడితే పోనంటుంది. అల్లుణ్ణి మందలించమంటుంది అని… వెంఠనే సందీప్ దగ్గరికి వెళ్ళిపొమ్మంటూ అల్టిమేటం ఇచ్చేసారు.
అందుకే మొగుడి దగ్గరికి పోండా తిన్నగా ఏటైనా ఎల్లిపోవాలి. తననర్థం చేస్కొనే వాళ్ళ దగ్గరికి లేదా వుమెన్స్ హాస్టల్‌కి అదీ లేదు వల్లకాటికి. అంతేకానీ అతగాడి దగ్గరకు వెళ్ళనే వెళ్లదు.
– – –
కార్తీకకు తనేడుస్తున్న సంగతే తెలీదు. డైరీ ముగిసేటప్పటికీ…
మెల్లిగా మాధుర్య పడుకున్న గదిలోకి వెళ్ళింది. మంచంపైన ముడుక్కుని పడుకుంది, నిద్రపోతుంటే ఎంత ప్రశాంతంగా ఉందీ మాధుర్య మొఖం? అహరహరం యుద్ధం చేసాక కూడా అందని విజయంపైన అలిగి అలిసి సొలసి పోయినట్లు పడుకుంది మాధుర్య… దగ్గరికెళ్ళింది కార్తీక.
ఇరవై ఏడేళ్ళ మాధుర్య… ఎంత మంది ప్రేమించారసలు చదువుకునే రోజుల్లో? కిరణ్ అయితే నాలుగేళ్ళు ఎదురు చూసాడు. పూవుల్లో పెట్టి దేవతలా చూస్కుంటానన్నాడు. మాధుర్య కూడా ప్రేమించింది, నిజంగా ప్రేమించింది కిరణ్ణి. కాని పిరికిది ఒదులుకుంది.
మధూ… నన్ను పెళ్ళి చేసుకో అని ఎంతగా అడిగాడనీ మధు కరిగింది లేదు… కులంకాని వాణ్ణి చేస్కుంటే తండ్రి నిలువునా తననీ, తల్లినీ నరికేస్తాడంది. ఆఖరికి మధుకి పెళ్ళైపోతే ఎంతగా ఏడిచాడనీ కిరణ్ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్య చేసుకోబోయాడు. అపురూపంగా అంతగా ప్రేమించిన మనుషులున్నారు మధును.
ఈ సందీప్ దరిద్రుడు దీన్నింత నీచంగా చూస్తున్నాడు. దేహాన్ని మలినపరుస్తున్నాడు, అవమానిస్తున్నాడు, చదువుతుంటే ఎంత రగిలిపోయింది. ఎంతగా అసహ్యం వేసింది, ఎలా భరించిందో ఈ రెండేళ్ళు నయం తన దగ్గరకు రావాలన్న ఆలోచన వచ్చింది.
ఏదో అలికిడైనట్లై ఒక్కసారి కళ్ళు తెరిచింది మాధుర్య. ఎదురుగా కార్తీక చేతిలో డైరీతో… కళ్ళనిండా కన్నీళ్ళతో… మధూ ఎంత నరకం అనుభవించావే అంటూ మాధుర్యను దగ్గరికి తీసుకుని హృదయానికి హత్తుకుంది కార్తీక. కొద్ది సేపయ్యాక మాధుర్య ఎదురుగా పీఠం వేసుకొని కూర్చుంది కార్తీక.
చూడు మధూ… అంటూ గడ్డం పట్టుకొని, నీకు గుర్తుందా… ఒకసారి బస్సులో ఎవడో నిన్ను వెనకనుంచి ఏదో చేస్తే నువ్వు ఏం చేసావు గుర్తు తెచ్చుకో… డిగ్రీ ఫైనల్ ఇయర్‌లో ఆ వీధి రౌడీ… గ్నాపకం ఉందా… కార్తీక… మాధుర్య కళ్ళల్లోకి గుచ్చి గుచ్చి చూస్తూ అడిగింది. రెట్టిస్తూ అడిగింది.
ఆమె గుండెల్లోకి తన ప్రశ్నలను దించేస్తూ పోయింది. ”సందీప్ గురించి రాసింది చదువుతోంటే నాకా వీధి రౌడీనే గ్నాపకం వచ్చాడే… నీకెట్టా గుర్తుకు రాలే” అన్నది అవును ఎందుకు గుర్తుకు రాలా… వాడు ఆ వీధి రౌడీగాడు తనతో అచ్చం సందీప్‌లా లేదు లేదు సందీపే ఆ వీధి రౌడీలా తనప్పుడు మరి ఏం చేసింది వాణ్ణి? అవును ఏం చేసిందేంచేసింది?
ఆ రోజుల్లో ఆ వీధి రౌడీ రోజూ తనని – కాలేజీ ఆడపిల్లలని వెంటాడుతూ, పిచ్చి మాటలు, పాటలు పాడుతూ ఐలవ్యూలు చెపుతూ, బస్సుల్లో ఎక్కేసి లేడీస్ సీట్ల మధ్యలోకి దూరిపోతూ ఆడపిల్లలను ఎక్కడబడితే అక్కడ ముట్టుకుంటూ వాళ్ళు భయపడిపోతూ పక్కలకంటూ ఒదిగి ఒదిగి పోతా ఉంటే… తను ఛాతీని తను మోచేతులతో మగ పిల్లలు తాకకుండా అడ్డుపెట్టుకుంటూ తప్పుకుంటూ ఇలానే ఉండేది కాదూ…
ఒకరోజు ఆ వీధీ రౌడీ జనంలో కిటకిటలాడుతూ ఉన్న బస్సులో తనెనక చేరిపోయి తనను వెనక నించి ఒత్తేస్తూ, చెయ్యి ముందుకెట్టేసి తన కుడి రొమ్మును ఒత్తేసాడు. ఎట్టా కొట్టిందీ వాణ్ణి? ఒళ్ళంతా లావాలా పొంగింది కోపం, తనూ – కార్తీక ఇద్దరం వాణ్ణి నేలమీదకు తోసేసి ఎడాపెడా కాళ్ళతో, చెప్పులతో పుస్తకాలలో టిఫిన్ బాక్సుతో… బస్సాగిపోయింది. వాడు తప్పించుకొని బస్సు దిగే ప్రయత్నం చేస్తుంటే తను వెనక నించి వాడి కాలరు పట్టుకుని ఆపి వాడితో పాటు బస్సు దిగిపోయి శివంగిలా తరిమి తరిమి కొట్టింది. వాడెట్టా ఒదిలించుకున్నాడనీ? తన జాకెట్లో చేతులు పెట్టినవాణ్ణి తను గిర్రున వెనక్కి తిరిగి చూస్తే ఎంత వెటకారంతో నవ్వాయి వాడి కళ్ళు… అదే చెప్పుతో ఎడాపెడా కొడుతుంటే ఎంత భయం వాడి కళ్ళల్లో… ఇంకోసారి వాడిట్టా ఆడపిల్లలను ఏడిపిస్తాడా అని…
వాడు పారిపోయాడు భయంగా వెనక్కి తిరిగి చూస్తా… చూస్తా… అంత ధైర్యం ఎలా వచ్చిందో తనకే తెలీలా… టైము వచ్చింది. అంతే… కాలేజీ అంతా తన ధైర్యం గురించి ఎట్లా చెప్పుకున్నారనీ.. ఇంటికొచ్చి అమ్మకు చెఁవితే… ”మంచి పని చేసావే అమ్మాయీ అట్టానే కొట్టాలి చెప్పుతో ఆడపిల్లలని సతాయించే వాళ్ళని. నిమ్మలంగా చదూకోనివ్వట్లే ఆడపిల్లలని మగెదవలు” అని ముర్శిపోయింది.
నాన్న అన్నయ్య మాత్రం…? ”చెప్పు వాడెక్కడ ఉంటాడు, ఎల్లా ఉంటాడు, ఏఏ దారుల్లో వచ్చిపోతుంటాడు, ఎంత దైర్యం నా చెల్లిని, నా కూతురి మీద చెయ్యేస్తాడా నరికేస్తాఁవు… కోసేస్తాఁవు చెప్పు… చెప్పు” అంటూ పూనకాలు తెచ్చేసుకోలా… నా కూతురితో అంత తప్పుడు పని చేసిన ఆ లండీ కొడుకుని కోసి కారం పెడతామనలా? ఇప్పుడు అదే వెధవ పని తన మొగుడు చేస్తున్నాడంటే.. సంసారఁవూ.. దాంపత్యఁవూ… భార్య భర్తల సరసఁవూ అంటూ రాగాలు తీస్తున్నారు. సందీప్‌ది తప్పుకాదంట తనదే తప్పంట… అతనిది ముద్దూ మురిపెమూ అట… అసలు ఎందుకట్టా మా అమ్మాయిని సతాయిస్తా ఉన్నావు. కాసింత మరియాదగా ఉండమని అల్లుడికి చెప్పాల్సిన అవసరఁవే లేదంట…
”నిన్ను ముట్టుకోటానికి నీ సమ్మతి ఎందుకట. ఒక్కసారి మెళ్ళో తాళిపడ్డాక ఆడది మొగుడి సొత్తైపోద్దట. మొగుడేఁవన్నా చేసేసుకోవచ్చుట. నువ్వేఁవైనా ఆకాశం నించి దిగొచ్చేసిన ఎలిజిబెతు మా రాణివా. ఆమ మొగుడు కూడా ఆమను ముట్టుకునే ముందు ఆ మహారాణి సమ్మతి అడిగి ఉండడు. ఇంక నువ్వెంతంట.”
నిజఁవే… ఆ రోజు బట్టబయలు అంత ధైర్యంగా తనను ముట్టుకున్న తనతో తప్పు చేసిన ఆ వీధి రౌడీని వెంటాడి చితక తన్నింది. ఈ రోజు మరి తన మొగుడు రోజూ చేస్తుంటే… చెప్పెట్టి కొట్టటానికి ఏఁవడ్డమొస్తున్నాయి తనకీ…
మధూ… అంత ధైర్యం ఏఁవై పోయింది చెప్పు ఈ బేలతనం ఏఁవిటో చెప్పు? కార్తీక దీర్ఘాలోచనలో మునిగిపోయిన మాధుర్యను కుదిపేసింది. తనెలా మర్చిపోయిందసలు.
ఆ వీధి రౌడీ మీద తను చేసిన పోరాటాన్ని… ఆ తెగువను? మర్చిపోయిందా లేక సందీప్ తన భర్త అనీ, అతనట్టా చేయటం తప్పు కాదేఁవోననీ తను కూడా పొరపాట్న అనుకుంటూ ఉండిందా?
విభ్రమంగా చూస్తున్న మాధుర్య… ఒక్కసారి ఉలిక్కిపడింది. ”నిజఁవే సుమా… మర్చిపోలే కార్తీ… ఎట్టా మర్చిపోతా? ఆ రోజు వాణట్టా కొట్టా కానీ… సందీప్‌ను కూడా అలా కొట్టాలని చాలాసార్లు అనిపించింది కానీ అమ్మ, నాన్న, అన్నయ్య కొట్టనిచ్చారా నన్ను?” అంది కోపంగా…
ఈ లోపల మాధుర్య ఫోన్ మోగింది ‘అమ్మ’ అని వస్తున్నది ఫోన్ స్క్రీన్ మీద… ఫోన్ ఖంగారు ఖంగారుగా వైబ్రేట్ అవుతోంది. మంచంపైన తుళ్ళిపడుతోంది. కుడి ఎడమలకు కదిలి కదిలిపోతున్నది. బస్సులో వేధిస్తున్న వీధి రౌడీనించి తప్పించుకోటానికి అటూ ఇటూ కదులుతున్న నిస్సహాయ అమ్మాయిలా.
మాధుర్య, కార్తీక వైపు చూసింది… ”ఫోనెత్తి గట్టిగా మాట్లాడు” అంది.
”నేనెక్కడుంటే నీకెందుకు అమ్మా… నీ అల్లుడు నాతో చాలా అసయ్యంగా చేస్తున్నాడు. నేనింక బరించలేనని కొన్ని వందలసార్లు చెప్పా విన్నావా…
నువ్వు పూర్తిగా నన్ను వింటానంటే అర్థం చేస్కుంటానంటేనే నా జాడ చెఁవుతా… నేను సందీప్ దగ్గరికి తిరిగి వెళ్ళను. ఏఁవీ కాదు… ఒంటరిగానైనా బతుకుతా కానీ అతగాడితో కాపురం మాత్రం చెయ్యను” అంటూ మాధుర్య ఫోన్ పెట్టేసింది. కన్నీటి చెమ్మతో చిరుగా నవ్వుతోన్న కార్తీకను ఒక్కసారి కౌగిలించుకుంది.
తర్వాత వారం రోజులు ఫోనులో అమ్మ నాన్నలతో, అన్నా ఒదినలతో వాదులాడుతూనే ఉంది. ”అవును నాకిష్టం లేదని నే చెఁవితే ఆపాలి. ఆ పాడు అలవాటు మానుకోవల్సిందే. నువ్వెంత బెదిరిచ్చినా నా సమాధానం మాత్రం ఇదే. అయినా అతగాడితో కాపురం చెయ్యనని అమ్మతో చెప్పేసా. సందీప్‌కీ అదే చెప్పు. మీరిట్టాగే అతగాడికి ఏం చెప్పుకోకుండగా నన్నే వేధిస్తే మీ ఇద్దరిమీదా, సందీప్ మీదా పోలీసు కంప్లైంటు ఇవ్వటానికైనా వెరవను ఏవనుకున్నారో” అంటూ గట్టిగా, కఠినంగా వాదిస్తూనే ఉంది.
*
|
ప్రతీ భర్తా ఇలానే చేస్తాడా? ఇది శృంగారంలో భాగం అంటాడు. శృంగారం ఇలానే ఉంటుందా?
Geetanjali gaari kathanam kadadaaka chadivinchindi
mugimpu inkaa vaadisthune vundi ani muginchaaru
Mugimpu paathakulake vadilesaaru
థాంక్స్ గిరిప్రసాద్ గారూ
.చాలా మంచి కధ గీతాంజలి గారి గారూ. ఈ దేశంలో ఘోరమేమిటంటే వైవాహక బంధంలో జరిగే ఇలాంటి అత్యాచారులను ఈ దేశ ఉచ్చ న్యాయస్థానమే ఒప్పుకుంటూ తీర్పు ఇచ్చింది.
థాంక్స్ దేవరకొండ గారూ
చాలా బాగా రాసారు
థాంక్స్ రుక్మిణి గారూ