(కృష్ణ పక్షపు మసక వెన్నెల్లో, సముద్రపు ఒడ్డున, తన ఒడిలో నిద్రిస్తున్న పసివాడితో, చిన్న పడవలో ఖండాతర ప్రయాణానికి సిద్ధమైన ఓ సిరియా తండ్రి, క్షేమంగా ఒడ్డుకు చేర్చమని భగవంతుడిని వేడుకొనే… ఆర్తి ఇది.
సముద్రాన్ని దాటే ప్రయత్నంలో మునిగిపోయి, లేదా ఆచూకీ తెలియని 4,176 మంది సిరియనులు, ఇరాకీలు, సోమాలీల… ఆవేదన ఇది.
ఆప్తులను కోల్పోయి, ఆనవాళ్లు మిగలని సొంతూరు వదిలి, మెడిటరేనియన్ సముద్రం దాటి యూరప్ చేరాలన్న ఆశతో, ప్రాణాలను ఫణంగా పెట్టే వేలాదిమంది అభాగ్యుల… అక్రోశం ఇది. ఈ రచయిత ప్రఖ్యాతి గాంచిన ఇతర రచనలు – (“The Kite Runner”, “A Thousand Splendid Suns”, “And the Mountains Echoed”)
సముద్ర ప్రార్ధన
-ఖలీద్ హుస్సేనీ
ప్రియమైన మార్వన్!
నా చిన్నతనంలో, మండువేసవిలో
హమ్స్ బస్తీ పొలిమేరలో
నీ వయస్సులో, తోటల్లో
ఆటలతో అలసి నీ చిన్నాన్న, నేను కలిసి
మిద్దెమీద పరచిన కంబళ్లపై నిద్రపోయే మమ్మల్ని
ఆలివ్ చెట్లను చుట్టివచ్చే చల్లగాలులు
మీ నానమ్మ పెంచే గొర్రెల అరుపులు
వంటింటి పాత్రలు పొయ్యిమీదకెక్కే ధ్వనులు
నారింజ రంగులో వెలిగిపోయే వేకువ
మమ్మల్ని సరికొత్త రోజుకు సిద్ధం చేసేవి
నీ బుడిబుడి అడుగుల వయస్సులో
తాతయ్య, నానమ్మ ఇంటికి వెళ్ళాం, గుర్తుందా?
అమ్మ చేయి పట్టుకువేలాడుతూ
అడవిపూల పరిమళం నిండిన చల్లటి గాలిలో
పచ్చని పచ్చికని తీరిగ్గా నెమరువేసే ఆవులని
చూస్తోన్ననీవు…
నాకింకా కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉంది
నువ్వు కొంచెం పెద్దవాడివయి ఉంటే,
పొలంలో ఇల్లు, పొగ చూరిన వంటింటి గోడలు,
చిన్నాన్నతో కలిసి వేల ఆనకట్టలు కట్టిన
ఇంటి వెనక పారే వాగు …
అన్నీ నీకు గుర్తుండేవి కదా!
మన ముసల్మానుల కోసం ఓ మసీదు
పొరుగు కిరస్తానుల కోసం చర్చి
ఎంతకూ తెగని బేరాలతో నిండిన
బట్టల, బంగారు దుకాణాలు
తాజా కూరలతో బజార్లు
కళ కళలాడుతుండేది హమ్స్ పాత బస్తీ
జనం గుమిగూడిన సందులు
కమ్మని వేపుడు సువాసనలతో గుమ్మెత్తే చౌరస్తాలు
అమ్మతో కలిసి గడియార స్థంభం వీధిని చుట్టి వచ్చిన జ్ఞాపకం
నీ తోడుంటే ఎంత బాగుండేది !
ఆ తీయని జీవితం, ఆ అందమైన కాలం
కరిగిపోయిన కలయింది, కనిపించని దృశ్యమైంది
ముందుగా, ఓ చిన్ననిరసనగా మొదలయిన పోరాటం
అణచివేసే ప్రయత్నంగా మిగిలిపోయిన యుద్ధం
బాంబులను కురిపించిన నింగి
నిర్జీవులతో నిండిన అవని
ఆకలి చూపులు… ఊరంటే, ఇవీ మిగిలిన ఆనవాళ్లు నీకు
బాంబులను మోసిన పెట్టె
నీళ్ల గాబుగా మారిన వైనం
ఎండిన రక్తపు చారికలతో
నిండిన గోడలు ఎప్పటికి చెరగని జ్ఞాపకం నీకు
కూలిపోయిన ఇళ్ల మధ్య
విరిగిపోయిన దూలాల్లో
ఇరుక్కున్న తల్లులు, చెల్లెళ్ళు, సావాసగాళ్లు
ఎన్నటికీ మానని భయానక గాయాలు నీకు
పసిబిడ్డల ఏడుపులు
ఆందోళనతో అక్కున పొదువుకొనే తల్లులు
కృష్ణ పక్షపు వెన్నెలలు
వణుకు పుట్టించే చల్ల గాలులు
అర్ధం కాని భాషలు
ఆఫ్గన్లు, సోమాలీలు, ఇరాకీలు, ఇరిటేరియన్లు, సిరియన్లు…
ఈ సముద్రపొడ్దున,, ఇప్పుడిక్కడే, అమ్మ
మనతోనే ఉన్నట్లనిపిస్తోంది మార్వన్ !
ఆశ నిరాశల మధ్య కొట్టు మిట్టాడుతూ
ఎప్పుడు తెల్లవారవుతుందాని ఎదురుచూపులతో
అస్ధిత్వం కోసం, ఓ చిన్నఆసరా కోసం, మనమందరం…
మనం ఎవ్వరికీ అక్కర్లేదని
మన ఉనికి ఏ ఒక్కరికీ పట్టదని
మన భుజం మరెవ్వరూ తట్టరని
అర్ధం అవుతూనేఉంది
కానీ అలల మీదగా తేలివచ్చే మీ అమ్మ సుతి మెత్తని గొంతు నాతో అంటోంది –
“నీ గురించి లేశ మాత్రం తెలిసినా సరే, రెండు చేతులతో ఆహ్వానిస్తారని”-
ఈ కృష్ణ పక్షపు వెలుతురు
నీ కంటి రెప్పల నీడలు
అమాయకంగా, బేలగా నిద్రిస్తున్న నీవు
“నా చేయి పట్టుకో కన్నా! భయం దరిచేరదని చెప్పాలని ఉంది”-
ఈ పదాలు ఎంత పేలవం
కేవలం తండ్రి పలికే గిమ్మిక్కులు
నీ నమ్మకం నన్ను తూట్లు పొడుస్తోంది నాన్నా!
తీరం కానని అనంత జలం
సముద్రపు అఖాత లోతులు
నా అల్పత్వాన్ని ఎత్తి చూపుతుంటే
నిన్నెలా రక్షించుకోవాలోనని భయమేస్తోంది చిన్నా!
అలల ఆటుపోట్ల తాకిడి
ఎత్తి కుదేస్తున్నఈ చిన్న పడవను
ఒడ్డుకు చేర్చే బాధ్యత నీదే ప్రభువా!
నీ రక్షణే నా పరమావధి
నా చిన్ని తండ్రి మార్వన్ !
ఆ దేవదేవుని వేడుకోవడం తప్ప ఏం చేయగలను!
నా ఘోషను సముద్రానికి తెలియచేయి భగవంతుడా!
ఇన్ షాఅల్లా !
*
తప్పకుండా చదవాల్సిన పుస్తకం.
డాన్ విలియమ్స్ గీసిన అద్భుతమైన బొమ్మలు. సముద్రంలో మునిగి చనిపోయిన మూడేళ్ళ అలాన్ కుర్దీ మరణం కదిలిస్తుంది.
సిరియన్ల నుంచి రోహింగ్యాల దాకా కాందిశీకుల వ్యధార్త పయనానికి పదచిత్రాల అశ్రునయనాలు…
అవునండి, తప్పక చదవాల్సిన పుస్తకం. థాంక్యూ మీ స్పందనకు .
good one
Thank you
ఎంత అన్యాయం కదా – మనిషికి మనిషే చేసిందే కదా ఇది! 🙁
కేవలం మనిషి మాత్రమే చేయగలడనుకుంటాను, భూమ్మీద నివసించే మరే ఇతర ప్రాణికోటి తమ జాతిని ఇలా నాశనం చేసుకోవు కదా !
థాంక్యూ లలిత గారు.
ఇంద్రాణి,
మంచి అనువాదం, కళ్లకు కట్టినట్టు ఉంది. Keep it up
—Narsim
Thank you Narsim.
Keep continuing my friend, expecting many more!
Thank you Bindu !
Mee Kalam nundi inkaa ilanti manchi manchivi raavalani asistoo
deavudaa deaniki tandria inta …narameadhamu– evvarikoasamu ee masinchi–