“బిందూ, గేటు దగ్గరెవరో నిలబడ్డారు. ఒక రెండు రూపాయలు ఇచ్చి పంపించు” అని అమ్మ చెప్పిన మాటలు వినగానే తలకున్న హెడ్‌సెట్ తీసి ల్యాప్‌టాప్ పక్కన పెట్టి గుమ్మం దాకా వెళ్ళి బయటి గేటు వైపు చూసింది బిందు.
అయితే గేటు దగ్గరున్న మనిషిని చూడగానే బిచ్చమెత్తుకునే వ్యక్తిలా కనపడలేదు. గేటు దాకా వెళ్ళింది. అప్పుడా మనిషి “ఆకలిగా ఉందమ్మా, ఈ వీధిలో చాలా ఇళ్ళే ఉన్నాయి. కానీ ఎవరింట్లో పడితే వాళ్ళింట్లో తినను. నిన్ను చూస్తుంటే అడగాలనిపిస్తోంది. ఇంతకీ మీరేమిట్లు?” అనడిగాడు.
తను బయటికి వెళ్ళిన విషయానికీ, అక్కడ వింటున్న మాటలకీ సంబంధం లేకపోవటంతో ఏమీ అర్థం కాక మెల్లగా తమ కులం పేరు చెప్పింది బిందు. అప్పుడా మనిషి “ఓహ్, మేం కూడా మీ వాళ్ళమే. కొంచెం అన్నముంటే పెట్టమ్మా” అన్నాడు. అన్నం అడిగిన మనిషిని వెళ్ళిపొమ్మంటే బాగోదని ఇష్టం లేకపోయినా సరే అని గేటు తీసి తినడానికి అన్నం పెట్టింది. లోపలికెళ్ళి తన ల్యాప్‌టాప్ ముందు కూర్చుని పనిలో పడిపోయింది బిందు.
బిందు ఒక పెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తుంది. హైదరాబాదులో ఉంటూ అప్పుడప్పుడూ ఇంటికొచ్చి వెళ్తూ స్వేఛ్ఛగా, తనకి నచ్చిన విధంగా బ్రతికే అమ్మాయి. అలా ఒకసారి ఉగాది పండుగకని వారం ముందు నుండే వర్క్ ఫ్రమ్ హోమ్ పెట్టుకుని ఇంటికొచ్చేసింది. సరిగ్గా బిందు ఇంటికి రాగానే లాక్‌డౌన్ మొదలవడంతో ఇంటినుండే పని చేసుకుంటోంది.
లాక్‌డౌన్ మొదట్లో ఇంటినుండే పని చేసుకోవటం, అమ్మానాన్నా పక్కనే ఉండటం బానే అనిపించినా రోజురోజుకీ పెరిగిపోతున్న పని వల్ల మనశ్సాంతి దూరమవుతూ వస్తోంది. అయితే ఇది చాలదన్నట్టు లాక్‌డౌన్ అయిపోగానే మొదలయిన పెళ్ళిళ్ళు ఆగకుండా జరుగుతూనే ఉండటంతో తనకి తెలిసిన అమ్మాయిల్లో సగం మందికి పెళ్ళిళ్ళయ్యాయి. వాటిలో సగం పెళ్ళిళ్ళకి తను వెళ్ళొచ్చింది కూడా. అలా జరుగుతున్న పెళ్ళిళ్ళ వలనో మరి లేకపోతే తక్కువ ఖర్చులో అయిపోతుంది అన్న ఆలోచనతోనో ఒక రెండు, మూడు సంవత్సరాల తర్వాత మొదలవుతుంది అనుకున్న పెళ్ళిగోల బిందు వాళ్ళింట్లో ఈ సంవత్సరమే మొదలయింది.
ఒక వైపు పని ఒత్తిడి, మరో వైపు పెళ్ళి గురించి అమ్మానాన్నల మాటలు రెండూ భరిస్తూ ఆఫీసుకెప్పుడు పిలుస్తారా అనే ఆలోచనలోనే గడుస్తున్నాయి రోజులు. ఆ రోజింకా ఆ గోల మొదలుకాకపోవటంతో ప్రశాంతంగా పనిచేసుకుంటోంది. కానీ తను పిలిచి అన్నం పెట్టిన మనిషి వల్ల తనకి కొత్త ఇబ్బంది కలుగుతుందని తనూహించలేదు.
*****
ఆ వచ్చిన మనిషి ఒక పెళ్ళిళ్ళ పేరయ్య. అన్నం తిన్నాక వెళ్తూ వెళ్తూ “మీరూ మా వాళ్ళే అని తెలిసింది అమ్మాయి చెప్తే. నా దగ్గర మంచి మంచి సంబంధాలున్నాయి. మీరు చూపిమ్మంటే చూపిస్తాను” అనగానే బిందు వాళ్ళమ్మ సరేనంది.
అంతలోనే బిందు వాళ్ళ నాన్న కూడా వచ్చారు. ఇద్దరూ కలిసి ఫోటోలు చూసారు. ఫోటోలు చూసేటప్పుడు పెద్దగా ఆసక్తి కలగకపోయినా జీతం, ఆస్తి వివరాలు తెలుసుకున్నాక ‘అవన్నీ మంచి సంబంధాలే’ అనిపించాయి. ఆ మంచి సంబంధాల్లో నుంచి ఒక సంబంధాన్ని ఎంచుకున్నారు. అక్కడి నుండి సరిగ్గా ఒక ఇరవై అడుగుల దూరంలో తన గదిలో “యామ్ ఐ ఆడిబుల్? కెన్ యూ సీ మై స్క్రీన్?” అంటూ తన పని తాను చేసుకుంటోంది బిందు.
ఇటుపక్క తన జీవితానికి సంబంధించిన అతిపెద్ద నిర్ణయం చాలా సులువుగా, అంకెలని బట్టి తీసుకోబడుతూ ఉంది. ఆ మంచి సంబంధం వాళ్ళకి చూపించటానికని బిందు ఫోటో దాని వెనకాలే పేరు, పుట్టినరోజు, రంగు, కుటుంబ వివరాలు రాసుకుని తీసుకెళ్ళాడు ఆ పేరయ్య.
“చెప్పాల్సిన అవసరం ఏముంది?” అనుకున్నారేమో బిందుకి ఈ విషయం గురించి చెప్పలేదు.
*****
ఆ రోజు సాయంత్రం పని చేసుకుంటూ ఉండగా ఆఫీసులో బిందుతో పాటు పని చేసే అమ్మాయి మేఘన నుండి ఫోనొచ్చింది. మేఘన, బిందు కంటే జూనియర్. అక్కా అని పిలుస్తుంది బిందుని.
మేఘన “హలో అక్కా, కొంచెం మాట్లాడాలి” అంటూ కంగారుగా అడిగింది. అది గమనించిన బిందు మామూలుగా కాకుండా కొంచెం దగ్గరి వాళ్ళతో మాట్లాడే స్వరంతో “చెప్పురా, ఏంటీ ఇవాళ్టి పని అయిపోయిందా అప్పుడే?” అనడిగింది.
“లేదక్కా. కాసేపట్లో అయిపోతుంది. నేను నీతో కొంచెం మాట్లాడాలి”
“హా, చెప్పు. వింటున్నా”
“నాకొక రెండు వారాలు లీవ్ కావాలక్కా. మేనేజర్‌ని అడగటానికి ముందు నీకొకసారి చెబుదామని…”
“రెండు వారాలెందుకురా? కాలేజీ ఫ్రెండ్స్‌తో కలిసి ట్రిప్ కేమైనా ప్లాన్ చేసావా ఏంటి?”
“లేదక్కా, ట్రిప్‌కి వెళ్ళే పరిస్థితి లేదులే”
“మరి?”
“పెళ్ళక్కా…”
“ఏంట్రా నువ్ చెప్పేది?”
“అవునక్కా. ఈ లాక్‌డౌన్ వల్ల ఇంట్లో ఉంటూ పని చేసుకుంటున్నానా, అలా పెళ్ళిగోల ఎక్కువైంది. సంబంధాలు వస్తూనే ఉన్నాయి. ఇంక ఎవరో బాగా డబ్బున్న వాళ్ళు కట్నం లేకుండా చేస్కుంటామనేసరికి ఓకే చెప్పారు. నిశ్చితార్థం కూడా అయిపోయింది. తొందర తొందరగానే”
“ఉద్యోగంలో చేరి రెండు సంవత్సరాలైనా కాలేదు. అంత తొందర దేనికంటా?”
“అదే అడిగితే పెళ్ళాయ్యాక పిల్లలు పుట్టేదాకా జాబ్ చెయ్యొచ్చన్నారు. ఆ పర్మిషన్ వచ్చినందుకు నేను అదృష్టవంతురాలినంట”
“మరి ఇష్టం లేదని చెప్పలేదా?”
“చెప్పి చూసానక్కా. లాభం లేదు. నాకింక ఓపిక కూడా లేదు”
ఆఫీసులో మేఘన వరుణ్ అనే అబ్బాయిని లవ్ చేస్తోందని బిందుకి తెలుసు. ఇప్పుడా అబ్బాయి పరిస్థితి ఏంటో అసలు అని గుర్తొచ్చింది. కానీ మేఘనని అడగటం మంచిది కాదని “సరే జాగ్రత్త మరి. లీవ్ గురించి మేనేజర్‌కి నేను చెప్తానులే” అని చెప్పి కొంత ధైర్యం చెప్పి ఫోన్ పెట్టేసింది.
‘అందరి కథలూ ఇంతే’ అనుకుని పనిలో పడిపోయింది. కానీ మేఘన చెప్పిన మాటలే గుర్తొస్తుండటంతో పని మీద మనసు పెట్టలేక ల్యాప్‌టాప్ దగ్గరి నుంచి లేచి కిచెన్‌లోకి వెళ్ళి కాఫీ చేసుకునొచ్చి హాల్లో కూర్చొని తాగుతోంది.
వాళ్ళమ్మానాన్నలిద్దరూ ఒకరి మొహాలొకరు చూసుకుంటూ కళ్ళతో సైగలు చేసుకుంటుంటే సగం విషయం అర్థమయింది. అప్పటికి వాళ్ళలా చూస్కున్న ప్రతిసారీ ఒక పెళ్ళి సంబంధం గురించి వినపడేది. రాబోయే తుఫాను గురించి ముందే పసిగట్టిన బిందు వాళ్ళ కళ్ళ వైపు చూడకుండా లేచి కాఫీ కప్పుతో తన గదిలోకెళ్ళిపోయింది.
వెళ్ళగానే లోపలినుండే “అమ్మా నాకు రాత్రి దాకా మీటింగ్స్ ఉన్నాయి. డిస్టర్బ్ చేయకండి” అని చెప్పేసి మళ్ళీ తన పని మొదలు పెట్టింది.
రాత్రి దాకా అయితే ఏ ఇబ్బందీ రాలేదు. కానీ పనంతా అయిపోయాక రాత్రి భోజనం చేసేటప్పుడు మొదలయ్యింది. తుఫాను రాక బిందు పసిగట్టినా దాని గురించి ఏమీ చేయలేని పరిస్థితి. రెండు ముద్దలు తినిందేమో అంతే.
“ఈరోజొచ్చినాయన పెళ్ళిళ్ళ పేరయ్యంట” అని అమ్మంటే “మంచి సంబంధం చూపించాడు” అని నాన్నన్నాడు.
“మంచి సంబంధం. బోల్డెంత జీతం”, “కట్నం కూడా అవసరం లేదంట” అలా ఒక్కొక్కరు ఒక్కో వాక్యాన్ని తమ తమ వంతుగా చెప్తున్నారు.
వాళ్ళకి సమాధానమివ్వకుండా తినేసి వెళ్దామనుకుంది. కానీ ‘బోల్డెంత జీతం’ అనే చోట వాళ్ళకి అడ్డుకట్ట వేయొచ్చు అనిపించింది బిందుకి. అందుకే “బోల్డెంత అంటే ఎంతంటా?” అనడిగింది.
“లక్షా యాభైవేలంట. కట్టింగులు పోనూ లక్షా పదివేలు అంటే మాటలా!” వాళ్ళమ్మ సమాధానం.
“ఏ కంపెనీ?” అని అడగ్గానే ఒక పెద్ద యం.యన్.సీ పేరు చెప్పారు.
ఆ ‘పెద్ద కంపెనీ’లో ఆ బోల్డెంత జీతం వచ్చే స్థితికి రావాలంటే ఎన్ని సంవత్సరాలు పనిచేయాలో బిందుకి తెలుసు. ఒక నిమిషం పాటు ఏవో లెక్కలు వేసుకుని “అతనికి ఎంత తక్కువనుకున్నా ముప్పయి రెండేళ్ళకి తక్కువుండవు. మరి నాకు ఇరవై మూడు పూర్తై ఇరవై నాలుగు నడుస్తున్నాయి. ఇంక మీరే ఆలోచించండి” అంది పెరుగు వేసుకుంటూ.
వయసు గురించి చెప్పగానే వెనక్కి తగ్గుతారని బలంగా అనుకుందేమో తర్వాత వాళ్ళు చెప్పే మాటకి కళ్ళు పెద్దవి చేసింది.
“వయసుదేముంది? ఎనిమిది సంవత్సరాలే కదా తేడా. పెద్దగా సమస్య కాదులే” అనేసారు చాలా మామూలుగా.
పెరుగులోకి కలుపుకోవడానికి కొన్ని నీళ్ళు కంచంలోకి పోస్తున్న బిందు చెయ్యి గ్లాసెడు నీళ్ళనీ వొంపింది. లేచి మాట్లాడకుండా తన గది వైపు వెళ్ళింది.
“రేపే నిన్ను చూస్కోవడానికి వస్తారంట. ఆఫీసుకి సెలవు పెట్టు” అన్నారు బిందు వాళ్ళ నాన్న.
పట్టించుకోకుండా లోపలికెళ్ళిపోయింది బిందు.
*****
తర్వాతి రోజు ఉదయం నిద్రలేచేసరికి ఇంట్లో కొంచెం హడావిడి పెరిగింది. చుట్టాల్లో ఎవరింట్లో పెళ్ళిచూపులు జరిగినా కనపడే ఒకావిడ ఆరోజు ఆ ఇంట్లో ఉంది. ఆ నచ్చని హడావిడిని చూస్తూ కూర్చుంది బిందు.
రాత్రి వినీ విననట్టు ఉండిపోయినా పొద్దున సెలవు పెట్టేవరకు వదిలిపెట్టలేదు. రోజూ స్నానం చేసి లాగిన్ అయి పని చేసే సమయానికి, స్నానం చేసి చీర కట్టుకుని, పూలు పెట్టుకుని ఉంది. మధ్య మధ్యలో “కొంచెం నవ్వుతూ ఉండమ్మా…” అనే సలహాలు.
“తన చుట్టూ జరుగుతున్నదంతా తన కోసమే. కానీ తనకు ఇష్టం లేదు. అలాంటప్పుడు దానితో అవసరమే లేదు. పోనీ తనేమైనా పెళ్ళే చేసుకోనందా? ఒక రెండేళ్ళు ఆగమంది. అంతే. అయినా ఏంటో ఈ అర్థం లేని హడావిడి” ఇలాంటి ఆలోచనలు ఒకదాని తర్వాత ఇంకొకటి.
అంతలో అబ్బాయి వాళ్ళొచ్చారు. ముందు రోజొచ్చిన పేరయ్య కూడా. ఊహించని విధంగా బిందు వాళ్ళ చుట్టాల మనిషి ఒకరు వాళ్ళతో వచ్చారు. తర్వాత చెప్పారు “వీళ్ళు వాళ్ళకి చుట్టాలని”.
“అయితే దూరపు సంబంధమేమీ కాదన్నమాట” అన్నారెవరో. గొంతుతో పోల్చుకోలేకపోయింది ఎవరన్నారో. పోనీ చూద్దామంటే అప్పటికే తల దించుకుని ఉంది.
ఏవేవో మాట్లాడుతున్నారు. అంతలో అబ్బాయి వాళ్ళ నాన్న “అమ్మాయికి జీతమెంతొస్తుందో?” అనడిగాడు.
“ముప్పై ఐదు వేలు” అన్నారు ఇటువైపు నుంచి ఒకరు.
“ఓహ్, మా వాడికి లక్షన్నర దాకా వస్తుంది. అమ్మాయి కష్టపడాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లోనే ఉండొచ్చు” అన్నాడు ఆయన.
“తనని చూడ్డానికొచ్చి ఇంకా అరగంటైనా కాలేదు. అప్పుడే తన భవిష్యత్తు గురించీ, తను పద్దెనిమిదేళ్ళు చదివి తెచ్చుకున్న ఉద్యోగం గురించీ నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అదీ తనని ఒక్కమాట కూడా అడగకుండా…” అనుకుందో మరేమో అప్పటికప్పుడే బిందు ముఖం ఎరుపెక్కింది.
కానీ అక్కడున్నవాళ్ళకది ‘సిగ్గు’ పడుతున్నట్టు అనిపించింది. అలా తన కోపం సిగ్గులా అర్థమైంది. అంతలో అబ్బాయి వాళ్ళమ్మ “మాకు కట్నమేమీ అక్కర్లేదు. పెళ్ళి ఖర్చులు కూడా మావే” అంది. అంతలో ఆ పేరయ్య “అయితే ఇంకేముంది సంబంధం ఖాయమైనట్టే” అన్నాడు.
“ఎవరి పెళ్ళి, ఎవర్నడిగి, ఎవరికి ఇష్టమని, ఎవరు ఖాయం చేస్తున్నారు? ముందు కులం పేరడిగి, తర్వాత భోజనమడిగినప్పుడే తిట్టి పంపించి ఉంటే బావుండేది” అనుకుంటూ ఆరోజు సెలవు పెట్టడం వల్ల తర్వాతి రోజు చేయాల్సిన పని రెండింతలు అవటం గురించి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంది.
అబ్బాయి వాళ్ళమ్మ, బిందు వాళ్ళమ్మ వైపు చూస్తూ “బంగారు గాజులు తెచ్చాను. ఈ రోజే అమ్మాయికి తొడిగించి వెళ్ళిపోతాం. మా అమ్మాయి అన్నట్టు ఉంటుంది. ఇప్పట్నుండే” అంది చాలా మామూలుగా.
బిందుకి వెంటనే బస్టాండ్‌లో బస్సు ఆగీ ఆగగానే కర్చీఫ్‌లు సీట్ల మీద వేసి “ఇది మా సీటు” అనడం గుర్తొచ్చింది.
బిందు వాళ్ళమ్మ సరేనన్నట్టు తలూపటంతో బిందు చేయి తీసుకుని గాజులు తొడగబోయిందామె.
కానీ గాజులు తొడిగేముందు బిందు ముఖం వైపు చూసింది. గాజులు వేయకుండానే లేచి వెళ్ళి సోఫాలో కూర్చుందామె. ‘సిగ్గు కాదు కోపమని తెలిసిందేమో’ బహుశా.
“అన్ని విషయాలు ఒక మంచి రోజున మాట్లాడుకుందాం” అని చెప్పేసి బయల్దేరారు అబ్బాయి వాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోగానే తన కోపాన్నంతా అమ్మానాన్నలమీద చూపించాలనుకుంది. కానీ లాభం లేదని ఆగిపోయింది.
తర్వాతి రోజు లాగిన్ అయి మెయిల్ ఓపెన్ చేసి చూడగానే ‘వర్క్ ఫ్రమ్ ఆఫీస్’ అనే మెయిల్ చూసి ముందురోజు జరిగిందంతా మరిచిపోయింది. బిందు ముఖం మీదికి చిరునవ్వొచ్చింది, వెలుగొచ్చింది. ఏదో గెలిచేసా అన్నంత గర్వమొచ్చింది.
రెండ్రోజుల్లో అన్నీ సర్దుకుంది. అమ్మానాన్నలకి విషయం చెప్పింది. వాళ్ళు చెప్తున్న మాటలకి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టింది. హైదరాబాద్ బస్సెక్కి వెళ్ళిపోయింది.
మళ్ళీ ఎన్ని రోజులకి ఇంటికొస్తుందో తెలియదు. కానీ అక్కడున్నన్ని రోజులు ప్రశాంతంగా ఉంటుంది.
*
Add comment