సముద్రం ఒడ్డున సముద్రం

అతను ఎక్కడ ఉంటే అక్కడ
నిత్య చలనశీల తరగతి గది

వేల పిడికిళ్లు ఎత్తి
ఎగిసెగిసి పడుతున్న
అరేబియా సముద్రం ఒడ్డున
ఒక మనుసులో మనసు లేక
అలలై పడి లేచిన
మరో మహా గంభీర సముద్రం

సమూహంలో ఒంటరి
ఒంటరితనంలో సమూహం
రోజూ తాజాగా వికసించిన పుష్పం

ఒకడు ప్రేమ కవిత్వం రాస్తాడు
మరొకడు దోమ కవిత్వం రాస్తారు
ఒకడు జోకుడు కవిత్వం రాస్తాడు
ఒకడు అమీబా పాకుడు
ప్రాపకం కవిత్వం రాస్తాడు

మరొకడు పచ్చగా ఉన్న కాడ మేసి
వెచ్చగా ఉన్న రాజ్యం వసారాలో
కూని రాగాలు తీస్తుంటాడు

మరో కవి మంచిని మంచి అనడు
చెడును చెడు అనక
గోడ మీది పిల్లిలా
అతి ప్రమాదకారిగా మారుతాడు

ఏ ఒక్కడూ మనిషికి ధీము ఇచ్చే
కవిత్వం రాయడు
రాజ్యాన్ని కలమెత్తి
ఎంగిలి చెయ్యితో అక్షరాన్ని
అసినీ అని కొట్టడు

ప్రేమించిన నేల నుంచి
డి–లింక్ చేయబడ్డ
బెయిల్ సముద్రుడి
కల్లోల నిశ్శబ్ద గుండె భాషణను
చెవొగ్గి విన్నాను నేను

అతని ఆలోచనాలోచనలతో
నువ్వు ఏకీభవించ వచ్చు
ఏకీభవించక పోవచ్చు గాక
నీ కాళ్ల కింది మట్టి కోసం
నీ నుంచి నీవు
విముక్తి పొందడం కోసం
అక్షరాల తల్లడం మల్లడం
అవుతున్న కవి కదా అతను

ఆయన లోకమొక పెద్ద బాలశిక్ష
ప్రపంచం ఒక సమరశీల హృది
అతను ఎక్కడ ఉంటే అక్కడ
నిత్య చలనశీల తరగతి గది

సముద్రానికి ముసలితనం లేదు
కవి కలానికి వార్ధక్యమూ రాదు

ఎంత మనసు కొట్టుకుంటున్న
ఎంతెంత మనసు గుంజుతున్నా
ఏమి ఫాయిదా ఏమి ఫాయిదా

తండ్రీ! నిన్ను తలంచి
ఎన్ని నిద్ర పట్టని రాత్రుళ్ల
ముళ్ళ మీద పొర్లాడినానో
ఎన్నెన్ని సుదీర్ఘ నెగళ్ల పగళ్ల
వేడి నిట్టూర్పులు శ్వాసించానో

మొరగడమే తప్ప
కరవడం ఎరగని కాపలా కుక్క

గొంతులో ఆగిన కంఠ స్వరాన్ని
ఎంతకూ మండని భాస్వరాన్ని

ఉప్పు నీళ్ల సముద్రం ఒడ్డున
మరో మంచి నీటి సముద్రం
ప్రవాస కవీ! ప్రసవ రవీ!!
లాల్ సలామ్! లాల్ సలామ్

*

 

జూకంటి జగన్నాథం

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • నిజమే అన్నా.. మీలాంటి ఏ కొద్ది మంది కవులో తప్ప వరవర రావు సర్ ను పట్టించుకున్న కవులు చాలా అరుదుగా కనిపిస్తారు. బాధతో చెప్పినా వాస్తవాలు చెప్పారు.
    మీకు హృదయపూర్వక అభినందనలు 💐💐

  • సముద్రానికి సముద్రమే సాటి

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు