“కవిత్వం నాకు కన్ను మూతపడని జ్వరం” అన్నాడు ప్రముఖ కవి రాధేయ. అంటే అదొక పలవరింత అని. జీవితం లో సంఘర్షణ అనుభవిస్తూనే , దాన్ని జయించాలనే తపన కలిగి ఉండడం అనేది ఒక జీవలక్షణం. కవిత్వం కూడా ఒక కలవరింత,పలవరింత అది అలవాటు పడితే అది ఒక పట్టాన వదలదు. దానికి మందు మళ్ళీ కవిత్వమే. అలాగ కవిత్వానికి పట్టుబడిన ఒక కాబోయే స్కాలర్ ని మన తొలకరిలో చూద్దాం. కవి పేరు బీర.రమేష్.
కుర్రాళ్ళు కలల్లో తేలుతూ ఉంటారు. కొంతమంది కుర్రవాళ్ళు కవిత్వం మాటున ఏవేవో చేస్తూ ఉంటారు. ప్రాసలో రాసి , ఎవరెవరినో మెప్పించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు.అది వయసు ప్రభావం కూడా కావొచ్చు.కేవలం 23 ఏళ్ల వయసులో ఉరికొయ్య ఎక్కిన భగత్సింగ్ ఆనాటికి యువకుడే , కానీ ఆకళ్ళలో కసి ఏదో సాధించాలనే తపన తనని హీరో ని చేసింది. అలాగే మన కళ్ళముందు కూడా
పేదరికమనే ఉలి చేత చెక్కబడిన హీరోలు ఉంటారు కానీ మనం గుర్తించం అందునా సాహిత్యం లో ఉంటే మనకున్న చాలా టెన్షన్స్ లో వాళ్ళని గ్రహింపు లోకి తీసుకోలేం.కానీ వాళ్ళు కూడా నిరంతరం ఇదే సమాజం కోసం శ్రమిస్తూ ఉంటారు. వాళ్ళకి సమసమాజం ని చూడాలనే ఉంటుంది.వాళ్ళు కూడా ప్రపంచాన్ని మార్చాలని చూస్తారు.అలాంటి వాళ్లలో రమేష్ ఒకడు.
నిత్యం ఏదో ఒక చోట స్త్రీ మీద హింస జరుగుతూనేఉంది.ఇంటా బయట, స్నేహితుల్లో,బంధువుల్లో ఎక్కడో ఒకచోట అకృత్యం నమోదవుతూనే ఉంది. వాటిని చూసి చలించిన రమేష్ తనదైన శైలి లో ఒక కవిత రాశాడు. పసి పిల్లలు నుంచి పండు ముదుసలి వరకు వాళ్ళ మీద జరుగుతున్న అత్యాచార ఘటనలు మీద తన నిశితమైన అభిప్రాయాన్ని ఇలా కవిత రూపంలో చెప్పాడు.
ముళ్లకంచెల మధ్య
కలల్లో కూడా అత్యాచార ఘటనలే కలవరపెడతాయి
భయం భయంగానే రోజును మొదలెడతాను
ఎవరు ఏ క్షణాన ఏ మూల నుంచి వచ్చి
ప్రేమిస్తున్నాననో, ప్రేమించకపోతే చంపేస్తానని బెదిరిస్తారోనని
దేహాన్ని నిండుగా కప్పుకున్నా
ఎవరు ఏ దారి మలుపులోనో నిలబడి
అసభ్య చూపులు ఆపకుండా చూస్తారోనని
ఎవరు ఏ రోడ్డు చివరన
యాసిడ్ పేకెట్ పట్టుకుని నించుంటారోనని
ముళ్లకంచెల మధ్య ఆరేసిన చీరలా
జీవితపు గాలికి ఎగురుతూ బెదురుతూ
బతుకుతున్నాను
ఈ దేశపు నేలమీద
విరిగిన ఆడవాళ్ల వెన్నెముకలు
మెలితిరిగిన కాళ్లు చేతులు
ఛిధ్రమైన సుందర ముఖములు
చితాభస్మంగా మారిన శరీరపు లెక్కలు
తల్చుకుంటూ తల్లడిల్లుతూ
ఆ లెక్కల్లో నేనెక్కడ లెక్కవుతానోనని
రోదిస్తూ జీవిస్తున్నాను
అనాగరిక సమాజంలోకి మారుతున్న
నాగరిక సమాజంలో
ఆడదానిగా జన్మించడం పూర్వజన్మ
ఖర్మఫలమని నిందిస్తున్న అజ్ఞాన లోకంలో
అత్యాచారం ఆనవాయితీగా మారిపోయిన
తరుణంలో
ముళ్లకంచెల్లాంటి మృగాల మధ్య
తరువాతి తరం చీరలు చున్నీలు
భయంగా ఎలా బతుకుతాయోనని
భయమేస్తుంది.
★★★★★★★★★★
“ఈ దేశపు నేలమీద
విరిగిన ఆడవాళ్ల వెన్నెముకలు
మెలితిరిగిన కాళ్లు చేతులు
ఛిధ్రమైన సుందర ముఖములు
చితాభస్మంగా మారిన శరీరపు లెక్కలు
తల్చుకుంటూ తల్లడిల్లుతూ
ఆ లెక్కల్లో నేనెక్కడ లెక్కవుతానోనని
రోదిస్తూ జీవిస్తున్నాను”
ఈ కవితా వాక్యాలు మామూలివి కావు. చదివే కొద్దీ కోపాన్ని, మన అసహాయతను, చేతకానితనాన్ని మనకి నిరంతరం గుర్తుచేస్తూ ఉంటాయి. మన నేల మీదే కదా ఇంత ఘోరం జరుగుతున్నది. మనం ఆడ బిడ్డలే కదా హింసలు పడుతున్నది , చేస్తున్నది కూడా మనం పెంచిన పిల్లలే కదా అని గుండె మెలిపడి పోతుంది.
ఈ కవిత మీద వ్యాఖ్యానం రాయడానికి మనకు ధైర్యం చాలదు. ఎందుకంటే మనం కూడ ఎక్కడో పైన చెప్పిన వాటిల్లో ముద్దాయిగా నిలబడతాం. స్త్రీ ఆహార్యం దగ్గరనుంచి వేసుకునే దుస్తుల వరకు మనకి అన్ని ఆంక్షలే. ఏది వేసుకోవాలి ఏది తినాలి ఎలా నడవాలి, ఎలా మాట్లాడాలి అని మనం నిత్యం ఆమెని వేధిస్తూ ఉంటాం.స్త్రీ ని మనం చూసే చూపు మారాలని రమేష్ ఆవేదన.ప్రేమ ని వ్యక్తం చేయడానికి లేదా ప్రేమించడానికి ఆమె అనుమతి కావాలనే సంస్కారం లేని యువత తయారవుతున్న ఈ సమాజం లో రమేష్ తన కవిత లో ఇవన్నీ చూస్తున్న వాడిగా తల్లడిల్లి పోతాడు అతడి వ్యాఖ్యానం చూడండి. నాగరిక సమాజం నుంచి అనాగరికం గా మారుతుంది అన్నాడు. ఇదొక్క గ్రహింపు చాలు కదా అనిపిస్తుంది. నిజమే మనం గృహాల్లో నుంచి గుహల్లోకి వెళ్తున్నాం అని ఒక చోట నరేష్కుమార్ సూఫీ రాస్తాడు ఒక చోట. రమేష్ లో గొప్ప సామాజిక చైతన్యం ఉంది.అతను త్వరలో మంచి కవిగా తనని తాను తయారు చేసుకోగల నేర్పు ఉంది. వస్తువు ఎంపికలో కాస్త జాగ్రత తీసుకోగలిగితే చాలు.అది కూడ ఎలా ఎన్నుకోవాలో తనకి బాగా తెల్సు.
అబ్బిరాజు, లక్ష్మి దంపతులకు పశ్చిమ గోదావరి జిల్లా, పెరవలి మండలం, నడుపల్లి గ్రామం. నిరుపేద దళిత కుటుంబం నుంచి వచ్చాడు రమేష్.
చిన్నప్పటినుంచి కష్టపడడం ఇష్టం గా చేసుకున్నాడు, పెయిటింగ్ పనిలోకి వెళ్లి చదువుకున్నాడు .ఇతరులపై ఆధారపడడం అసలు ఇష్టం లేదు, అసలు తనకి తాను కష్టాపడే తత్వంలోనే అర్ధం అయ్యాను అంటాడు . ఏదైనా సాధించాలనే పట్టుదలతో చదువుకున్నాడు . మహా నెమ్మదైన మనిషి. డిగ్రీ చదివే రోజుల్లో
గురువు గారైన ప్రముఖ కవి కొప్పర్తి రమణమూర్తి గారు తనకి పాఠాలతో పాటు చెప్పిన శ్రీ శ్రీ కవిత్వం అతణ్ణి బాగా ఆకర్షించింది.
“తాజమహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెందరు
ప్రభువెక్కిన పల్లకి కాదోయ్ అది మోసిన బోయీలెవ్వరు.”
ఈ కవిత్వ పంక్తులు రమేష్ ని సుదీర్ఘ ఆలోచనలో పడేసాయి.
సమాజంలో గల తారతమ్యాలను అర్థం చేసుకునేటట్లు చేశాయి. కాబట్టే ఇతని కలం కూడా సామాజికమైన కవిత్వాన్ని రాస్తుంది.
డిగ్రీ నుండే సాహిత్యం పట్ల అభిమానంతో చిన్న చిన్న కవితలు రాయడం మొదలు పెట్టాడు . ఆంధ్రవిశ్వవిద్యాలయం లో ఎం. ఎ. తెలుగులో ప్రవేశించాక అక్కడ తెలుగు విభాగంలో మంచి విద్వత్తు కలిగిన ప్రొఫెసర్లు చెప్పిన పాఠాలు అతని ఆలోచనా జ్ఞానాన్ని విస్తరించుకోవడానికి సహకరించాయి. ముఖ్యంగా ఆంధ్రవిశ్వవిద్యాలయంలో గల కృష్ణ లైబ్రరీ రమేష్ ఆకలి తీర్చింది.
ఎం. ఎ. పూర్తవగానే యు. జి. సి. వారు నిర్వహించే జాతీయ అర్హత పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు .ఎం.ఫిల్.పూర్తి చేసి ప్రస్తుతం ఆంధ్రవిశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధక విద్యార్థిగా కొనసాగుతున్నాడు .తను రాసిన కవితలు కవి సంగమం, విహంగ పత్రిక, ఫేస్బుక్ ల్లో ప్రచురించబడ్డాయి. ఇంకా చాలా పత్రికల్లో త్వరలో కనబడతాడు.
రమేష్ సమాజాన్ని చదువుకున్నాడు. అందులోని సంక్లిష్టతను అధిగమించడానికి, ఆలోచన నెగడు రగిలించాడు. అది కవిత్వమై మండుతుంది.చివరికి అతను కవిత్వం రాయడంలో విజయం సాధించాడు. కొత్త కుర్రాళ్ళ ఆలోచనల్ని చదివి వాళ్ళతో మనం కూడా గొంతు కలిపి మాట్లాడితే రమేష్ లాంటి యువ స్కాలర్స్ నుంచి మనం మంచి ఆలోచనా పటిమ గల మనుషుల్ని , అంతే భావ ప్రకటనా సాహిత్యాన్ని ఆశించడం తప్పేమీ కాదు– మీరు రమేష్ తో మాట్లాడండి, 96762 66485
*
మంచి పరిచయం
ముళ్లకంచెల మధ్య ఆరేసిన చీరలా
జీవితపు గాలికి ఎగురుతూ బెదురుతూ
బతుకుతున్నాను… వస్తువు యొక్క సాంద్రతను ఈ కవితా వాక్యాల్లో చూడొచ్చు. మంచి కవి తయారీలో వున్నాడు. స్థిరమైన ఆలోచనతో కదిలే మనిషిని పరిచయం చేసారు అనిల్ సర్. ధన్యవాదాలు 🙏
ఈ తరం కవులకు స్ఫూర్తి దాయకమైన వ్యాసం.